కబుర్లు - సత్యమేవ జయతే

అమెరికాలమ్–38

పేరులో ఏముంది!

- సత్యం మందపాటి

నేను కొన్నేళ్ళక్రితం వ్రాసిన ఎన్నారై కబుర్లలో ‘పేరులోనే వుంది!’ అనే ఒక వ్యాసం వ్రాసాను. దానిలో ముఖ్యంగా అమెరికా వచ్చాక మన భారతీయుల పేర్లు ఎలా మారుతున్నాయా అని సరదాగావ్రాసాను.

ఒక ఉదాహరణ ఏమిటంటే దానిలో హారీ గాంటీ అనే అతనితో, ఇండియా నించీ చుట్టం చూపుగా అప్పుడే వచ్చిన అతని మామయ్య అంటాడు, ‘చక్కగా గంటి హరిప్రసాదరావని మీ అమ్మా నాన్నా పేరు పెడితే మధ్యలో ఎవడ్రా ఈ హారీ గాంటీ, కార్లో పాంటీ లాగా! అమెరికాలో మనవాళ్ళు పేర్లు చిన్నవి చేసుకోవటం చూసాను కానీ, ఇలా అద్దాన్నంగా మార్చుకుంటారనుకోలేదు. మీరూ మీ తలతిక్క పేర్లూనూ..’

ఆయన తలతిక్క పేర్లు అనటానికి ఇంకొక కారణం కూడా వుంది. ఇండియాలో మనం ఇంటి పేరు ముందు చెప్పి, తర్వాత పేరు చెబుతాం. పప్పు సుబ్బారావు అని. అమెరికాలో ముందు పేరు చెప్పి తర్వాత ఇంటి పేరు (లాస్ట్ నేం) చెబుతాం, సుబ్బారావు పప్పు అని.

ఇప్పుడు ఈ వ్యాసంలో అవేమీ మళ్ళీ చెప్పటం లేదు. దాదాపు గత పది పన్నెండేళ్లుగా మన పిల్లల పేర్లలో చాల మార్పులు వచ్చాయి. ఆ విషయాలు మీతో పంచుకుందామనే ఈ వ్యాసం.

ఈమధ్య ఒకాయన, చిన్నవాడే, ఏదో పుట్టినరోజు పార్టీలో తన రెండేళ్ళ కొడుకుని చూపించాడు. ముద్దుగా, అందంగా వున్నాడు పిల్లవాడు. ‘మీ అబ్బాయికి పేరేం పెట్టారు’ అని అడిగాను.

‘సంభోగ్’ అన్నాడు.నాకేం చెప్పాలో అర్ధంకాలేదు. పక్కనున్న సుందరాన్ని చూసాను. ఆయనా నావేపు వింతగా చూస్తున్నాడు. తర్వాత మేమిద్దరమే వున్నప్పుడు సుందరం నాతో అన్నాడు, ‘మరీ ఎక్స్ రేటెడ్ పేరు పెట్టాడే!’ అని.

అలాగే మాకు బాగా తెలిసిన ఒక అతను, వాళ్ళ మూడు నెలల పాపకి అవాంఛిత అని పేరు పెట్టాడు.

నేను వుండబట్టలేక అతన్ని అడిగాను, ‘ఆ పేరుకి అర్ధం తెలుసా బాబూ’ అని.

అతను నవ్వి, ‘నేను తెలుగు చదువుకోలేదు సార్. అంతా ఇంగ్లీష్ మీడియంలోనే. మా ఫ్రెండ్ చెప్పాడు ఈ పేరు బాగుంటుందని. అసలు ముందు వాంఛిత అని పెడదామనుకున్నాం. మా పాప పేరు అ అనే అక్షరంతో మొదలు పెడితే బాగుంటుందని మా ఆవిడ అంటే, అవాంఛిత అనే పేరు పెట్టేసాం’ అన్నాడు.

అని మళ్ళీ అతనే అన్నాడు, ‘మీకు తెలుసా దానికి అర్ధం’ అని.

నేను చిరునవ్వుతో అన్నాను, ‘వాంఛ అంటే కోరిక. వాంఛిత అంటే కోరబడినది. అవాంఛిత అంటే ఎవరికీ అఖ్కర్లేనిది’ అన్నాను.

‘అంటే ఇంగ్లీషులో అన్వాంటెడ్ అనా?’ అని అతను ఆలోచనలో పడ్డాడు.

తర్వాత నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. మన టెల్గూ టీవీ కార్యక్రమాలు, సినిమాలు తెలుగు భాషని ఖూనీ చేయటం మొదలుపెట్టాక ఒత్తులన్నీ కొండెక్కాయి. అంటే వాంఛిత అనే పేరుని వంచిత అని పలికినా ఆశ్చర్యపడనఖ్కర్లేదు. మా సుందరం కూడా అలాటిదే ఒక పేరు చెప్పాడు. ఆ పసిపాప పేరు కృత్రిమ. పాపకి ఆ పేరు పెట్టిన మహాతల్లికి చెప్పాడుట, ఆ పేరుకి అర్ధం ఏమిటో. ఆవిడ నవ్వి వూరుకుందిట.

మేము కేరళలో వున్నప్పుడు వినేవాళ్ళం, కురూప్ అనే ఒక పేరు.

నేనీ మధ్య విన్న పేర్లలో నాకు ఏమాత్రం నచ్చనిది ‘ష్రాద్ద’. ఆ కుర్రాడిది హైద్రాబాద్ కనుక, శ బదులు ష (ష్యాం, షెంకర్ల లాగా) అంటున్నాడేమో ఈ పాదుషా అనుకున్నాను. స, శ అనే అక్షరాలను ష అని పలికేవాళ్ళని నేను పాదుషాలంటాను. అలా అయితే అది శ్రద్ధ అయుండాలి అనుకున్నాను. కానీ మొదటి అక్షరానికి దీర్ఘం వుందిట. అంటే శ్రాద్ధ అవాలి. చాల తప్పు పేరు అది. అందుకే ఇక ఏమీ అనలేదు.

ఇంకా కొన్ని పేర్లు విన్నాను కాంక్ష, సన, వాంతిక, వృషభ్ (ఒరే ఎద్దూ, ఇటురారా అని పిలుస్తారేమో),

గ్రీష్మ, వృషణ్, సంచరిత, నిషా ..

‘నీకెందుకయ్యా.. ఏ పేరు పెడితేనేం.. వాళ్ళ పిల్లలు. వాళ్ళ ఇష్టం!’

ఈ వాక్యం వ్రాస్తుంటే ఒక విషయం గుర్తుకొస్తున్నది. నేను ఇరవై ఏళ్ల క్రితం మొదటిసారిగా మీసం తీసివేసినప్పుడు, శ్రీమతి అన్నది, ‘నిన్ను పెళ్లి చేసుకున్నదే నీ మీసం చూసే! మీసం తీసేస్తే బాగాలేదు’ అని. అప్పుడు ‘నా మీసం. నా ఇష్టం’ అన్నాన్నేను.మరి ఇదీ ఇంతే కదా!

అవును, వాళ్ళ పిల్లలకి వాళ్ళేం పేరు పెడిత ే నాకెందుకు. కానీ నేనో గొప్ప ఎనలిస్టునని నేను పనిచేసే హైటెక్ సాంకేతికరంగంలో పేరొచ్చి ఏడ్చింది కనక,అవసరమైనా కాకపోయినా ఎనలిస్టు టోపీ పెట్టుకుంటాను. ఇది రాస్తున్నప్పుడు కూడా ఆ టోపీ నా నెత్తినే వుంది. అందుకే పేర్ల మీద ఈ పరిశీలన! మరేం చేయను? మా గుంటూరు పక్కనే మంగళగిరి అనే వూరుంది. ఆవూళ్ళో నరసింహస్వామి గుడి వుంది. అందుకని ఆ చుట్టుపక్కల పుట్టినవాళ్ళల్లో చాలామంది పేర్లు నరసింహారావులే. వట్టి నరసింహారావులు కాదు. వెంకటలక్ష్మీనరసింహారావులు. అందుకే మీరు గుంటూరులో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, డాక్టర్ల, లాయర్ల బోర్డులు చూస్తే నేను చెప్పేది అర్ధమయిపోతుంది. ఎవిఎల్ నరసింహారావు, బివిల్ నరసింహారావు, సివిఎల్ నరసింహారావు, డివిఎల్ నరసింహారావు.. ఇలా ఎందఱో నరసింహారావులు. అందరికీ వందనాలు!


నేను కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు, బజారులో వెడుతుంటే ‘ఒరే సత్తెన్నారాయణా!’ అని పెద్దగా పిలిచేవారెవరో. నాతో సహా మొత్తం రెండొందల మంది సత్తెన్నారాయణలు, ‘ఆయ్!’ అంటూ వెనక్కితిరిగే వాళ్ళం. అలాగే వైజాగులో అప్పారావులు. స్థల పురాణాలనుబట్టి యాదగిరి, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, కనకదుర్గ, అలివేలు, సింహాచలం, శ్రీశైలం.. ఇలా ఎన్నో పేర్లు.

మన పేర్లలో ఎక్కువగా దేవుడి/దేవతల పేర్లు వుంటాయి. మారోజుల్లో అవి తప్పించుకోవటం కష్టం.

అమెరికన్ పేర్లలో కూడా, ముఖ్యంగా మగ పేర్లల్లో, దేవుడి పేర్లు ఎక్కువ. జాన్, జోసెఫ్ (జో), మాత్యూ (మాట్), డేవిడ్, రిచర్డ్ (రిక్), డానియల్(డాన్) మొదలైనవన్నీ బైబిల్ పురాణ కథలలోని పాత్రలే! మారోజుల్లో ఐతే, ముఖ్యంగా పసిపాపలకి పేరు పెట్టేటప్పుడు, ప్రజాస్వామ్యం చాల బలంగా వుండేది. సత్యనారాయణ అని పేరు పెట్టాలనుకుంటారు. కులాన్ని బట్టి చివర రెడ్డి, చౌదరి, శాస్త్రి, శెట్టి, నాయుడూ.... ఏదీ లేకపోతే రావు, మూర్తి.

‘ఒరే! మన ఇంటి ఇష్ట దైవం వేంకటేశ్వరుడు. పేరుకి ముందు వెంకట తగిలించు’ అంటాడు తాతయ్య.

‘వట్టి వెంకట ఏమిటి, మీ తాతయ్యపేరు పెట్టకపోతే ఎలా?’ అంటుంది బామ్మగారు.

సరే వీరయ్యగారి పేరు కలిపి వీర వెంకట. ఇంకా మామయ్యలు, అత్తయ్యలు, పాలేరు, పనిమనిషి, ఆ దారినే పోతున్న దానయ్య... ఇలా అందరూ ఆ పేరుకి కొంచెం కొంచెం కలిపి, కుంచెడు చేసేవాళ్ళు.

మా ఆస్టిన్లో ఇర్షాద్ అని నాకు ఒక మంచి స్నేహితుడున్నాడు. అతను తెలుగులో కథలు వ్రాస్తాడు, కామెడీ చేస్తాడు. అతను ఎప్పుడూ వేసే జోకు ఒకటి వుంది.

ఎవరో అందమైన అమ్మాయి వచ్చి, ‘నీ పేరు ఏమిటి’ అని అడుగుతుంది జేమ్స్ బాండు సినిమాల్లో. అతను ‘నాపేరు బాండ్... జేమ్స్ బాండ్!’ అంటాడు. అదే మన తెలుగువాళ్ళు అయితే ఇలా వుంటుందిట!

నీ పేరేమిటంటే, ‘మూర్తి... నారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి, వెంకట సత్యనారాయణమూర్తి. వీర వెంకట సత్యనారాయణమూర్తి... మందపాటి వీర వెంకట సత్యనారాయణమూర్తి!’ అని అంటామని మా ఇర్షాద్ అంటాడు! (ఇది జోకు మాత్రమే.. నా పేరు నిజంగా అంత పొడుగులేదు మాష్టారూ!)

మేము అమెరికా వచ్చిన కొత్తల్లో, ఇక్కడ అమెరికన్ మిత్రులతో మాట్లాడేటప్పుడు చెబుతుండేవాడిని, ఇండియన్ పేర్లకి చాలావాటికి అర్ధాలు వుంటాయని. ఉదాహరణకి సత్యం అంటే నిజం అనీ, సంతోష్ అంటే ఆనందంగా వుండేవాడనీ, విజయ్ అంటే గెలిచిన మనిషి అనీ, నిర్మల అంటే స్వచ్చంగా వుండే అమ్మాయి అనీ.. ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పేవాడిని.

జఫ్ అన్నాడు ‘అంటే ఇక్కడ లోకల్ ఇండియన్స్ (మనం రెడ్ ఇండియన్స్ అంటాం) పేర్లలాగా అన్నమాట’, అని.అవును, జఫ్ చెప్పింది నిజమే. లోకల్ ఇండియన్స్ పేర్లు-వాళ్ళ భాషల్లో పేర్లు కాదు, వాటికి తెలుగు అనువాదాలు, కొన్ని తమాషాగా వుంటాయి. నేను విన్న కొన్ని పేర్లఅర్ధాలు:ఒంటరిగా వుండేవాడు, పెద్దగా అరిచేవాడు, శబ్దం వచ్చేటట్టు నడిచేవాడు, అదృష్టవంతురాలు, నవ్వే పువ్వు, పాటలు పాడే రాబందు, యుద్ధవీరుడు... కొన్ని పేర్లకి అర్ధాలు, మన పేర్లకి అర్దాలలాగానే వుంటాయి. ఆ అర్ధాల్ని మన పేర్లలోకి మార్చి చూస్తే, మన పేర్లు చాల కనిపిస్తాయి. నీళ్ళల్లో పుట్టిన అమ్మాయి (జలజ), నిజమే చెబుతాడు (సత్యం), సూర్యుడు (రవి, సూరి), కలలు కనే అమ్మాయి (స్వప్న)... ఇలా ఎన్నో వున్నాయి..

ఇక మళ్ళీ మన పేర్లకి వస్తే, విశ్వనాథ్పాత సినిమా సీతామహాలక్ష్మిలో, వంకాయల సత్యనారాయణ అంటాడు, ‘విష్వత్సేనుడు అనటం వస్తే, రాముడు అనేది సులభంగా వస్తుంది’ అని.

ఈనాటి ఇంగ్లీషు మీడియం తెలుగు కుర్రాళ్ళల్లో ఎంతమందికి విష్వత్సేనుడు అని పలకటం వస్తుందా అని నా అనుమానం. వస్తే ఆనందమే! మా తరం పేర్లలో లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వర్రావు, సుబ్బారావు, అప్పారావు, కోటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, రామారావు, సరస్వతి, పార్వతి, మహాలక్ష్మి, అనసూయ, తాయారు, రాజేశ్వరి లాటి పేర్లు ఎక్కువగా వుండేవి.

తరువాత తరంలో ఆనంద్, సంతోష్, అజయ్, విజయ్, సంజయ్, అనిత, అపర్ణ, స్మిత, సుమలాటి పేర్లు బాగా వినిపించేవి. దాని తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న పేర్లు చూస్తున్నాం. మూడు తరాల్లోనే ఇంత తేడా!అయినా తీయదనమున్న పేర్లు ఎప్పుడైనా వుంటాయి మరి! ఈ విషయం అలోచిస్తున్నప్పుడే,వాళ్ళ అమ్మాయి ప్రసవానికని,మాకు ఇండియాలోనే తెలిసిన ఒకాయన (భారత్ అందాం),ఒకావిడ (భారతి అందాం) అమెరికా వచ్చి, మమ్మల్ని వాళ్ళింటికి మధ్యాహ్నం కాఫీకి రమ్మన్నారు.

వారి అమ్మాయి ఇప్పుడు నిండు గర్భిణి. ఇంకో ఇరవై రోజుల్లో ప్రసవం అవుతుందన్నారుట. ఆ అమ్మాయి పేరు సువర్ణ. పేరుకి తగ్గట్టు మంచి శరీరచ్చాయతో నవ్వు ముఖంతో చక్కగా వుంది. ఆ అమ్మాయి భర్త పేరు సూరజ్.తీక్షణంగా చూస్తుంటాడు! మేము వెళ్ళేటప్పటికే అక్కడ ఇంకో రెండు జంటలు వున్నారు.

అందరూ గత రెండు మూడేళ్లలో పెళ్ళయిన వాళ్ళే. ఒకబ్బాయి పేరు రాహుల్, అతని భార్య మేఘల. రెండో అబ్బాయి పేరు రోషన్, అతని భార్య పేరు సరళ. ఆ ఇద్దరు దంపతులకీ ఇంకా పిల్లలు లేరు. మా పరిచయాలు పూర్తవుతుండగానే, సుందర్, ప్రమీల కూడా వచ్చారు. ఎవరికీ బోరు కొట్టకుండా, పెద్దవాళ్ళ కోసం మమ్మల్నీ, సుందర్ వాళ్ళనీ, పిల్లల కోసం మిగతా ఇద్దరు యువజంటల్నీ పిలిచారన్నమాట.

ఉల్లిపాయ పకోడీలు తెచ్చి మధ్యలో వున్న బల్ల మీద పెట్టారు.

‘అమెరికాలో పుట్టగానే పేరు పెట్టేయాలి కదా. మీ బేబీకి పేరు ఏమనుకున్నారు?” అడిగాడు సుందర్.

‘అబ్బాయో అమ్మాయో తెలియకుండా పేరేం పెడతారు. వీళ్ళేమో చివరిదాకా సస్పెన్స్ వుండాలని, బేబీ ఆడో మగో తెలుసుకోకూడదు అనుకున్నారు’ అన్నాడు భారత్.

‘అందుకనే ఒక మగ పేరు, ఒక ఆడ పేరు రెడీ చేసి పెట్టుకుందాం’ అన్నాడు రాహుల్.

‘అందుకే రాహుల్నీ, రోషన్నీ పిలిచింది. ఇవాళే డిసైడ్ చేయాలి’ అన్నాడు సూరజ్.

‘మీరేనా డిసైడ్ చేసేది.. మేం చెప్పొద్దూ..’ అంది సరళ.

రాహుల్ ‘మీరూ చెప్పండి సరలా! మా మేకల అప్పుడే రెండు మూడు పేర్లు అనుకుంది’ అన్నాడు.

సుందర్ నావేపు అదోలా చూసాడు. ఇలాటి ‘ళ’ బాధితులంటే అతనికి కడుపులో తిప్పుతుందని చాల సార్లు చెప్పాడు. పెళ్లి బదులు పెల్లి, కళ్ళు బదులు కల్లు, మళ్ళిబదులు మల్లి అంటుంటే అతను భరించలేడు.

నేను ఏ ఒత్తుని ఏమాత్రం ఎలా గట్టెక్కించినా భరించలేను. మరి సరళ సరలగా మిగిలింది, మేఘల మేకతోలు కప్పుకుంది. అందుకే సుందర్ నావేపు అలా చూసాడు.

రోషన్ తన చేతిలో వున్న స్మార్ట్ ఫోను మీద అటూ ఇటూ వేళ్ళు కదిపేసి, ‘బేబీ సెంటర్ డాట్ కాంలో మీ అమ్మాయికి ఒక మంచి పేరు దొరికింది. దీని ట్రెండ్ చూస్తే 2010 నించీ 2013 దాకా రేంక్ నాలుగు వందల పైన వుంది.. ఇప్పుడు కొంచెం తగ్గింది. షాంగ్వి. అంటే గుజరాతీలో ఒక సంఘానికి పెద్ద అని అర్ధం’ అన్నాడు.

అప్పుడు అర్ధమయింది అతను అంటున్నది అది ఒక సంస్కృత పదం. సాంఘ్వి. అంటే సంఘానికి పెద్ద. మళ్ళీ ఒత్తులు పట్టాలు తప్పాయి. పాదుషా వచ్చేసాడు. సుందర్ నా వేపే చూస్తున్నాడు.

నా ముఖం చూడగానే మా శ్రీమతి తన కళ్ళతో అప్పుడే టకటకా నాకు చెప్పేసింది, ‘నువ్వు నోరు మూసుకుని కూర్చో. నిన్ను పకోడీలు తినటానికే పిలిచారు. పేర్ల గురించి చెప్పమని కాదు’ అని.

మా శ్రీమతి కూచిపూడి నాట్యం నేర్చుకుని వుంటే, ఎన్నో భావాలకే కాక, సంభాషణలకీ అభినయంతో కొత్తగా భాష్యం చెప్పివుండేది. ఏం చేస్తాం. అలా జరగలేదు. అందుకే ఇంకో రెండు పకోడీలు చేతిలోకి తీసుకుని నెమ్మదిగా తింటూ కూర్చున్నాను.

సువర్ణ నవ్వుతూ అంది ‘మా అమ్మాయికి అంత కష్టమైన పేరు వద్దు.. సింపులుగా చూడు’ అంది.

రాహుల్ అన్నాడు, ‘మన ఇండియన్ పేర్లకి ఒక సైటు వుంది. అది ఎన్నారైఒఎల్ డాట్ కాం. దాన్లో ఐతే, ఆడ పేర్లు, మగ పేర్లు, హిందూ పేర్లు, ముస్లిం పేర్లు.. ఇలా ఎన్నో వుంటాయి..’ అంటూనే తన సెల్ ఫోన్లో చూస్తూ, ‘ఇవిగో. ఎన్ని పేర్లు కావాలంటే అన్ని, ఏ అక్షరంతో కావాలంటే ఆ అక్షరంతో వున్నాయ్’ అన్నాడు.

సూరజ్ అన్నాడు, ‘వాటి ట్రెండ్ కావాలి మాకు. ఎక్కువమంది పెట్టే పేర్లు మాకు అస్సలు వద్దు. పేరు కొత్తగా, ఎవరూ ఇంతకుముందు పెట్టనిది కావాలి’

‘మమ్రాజ్ అని పెడతావా.. Lord of affection, తమిస్రహ అంటే చీకటిని పారదోలేవాడు. పోనీ షరషిజ్ ఎలావుంది? షరషిజ్ అంటే లోటస్..’ ఇంకా చెబుతున్నాడు రాహుల్.

అప్పుడు నాకు అర్ధమయింది ఇంగ్లీషు మీడియంలో చదివిన పాదుషాలకి షరషిజ్ అయితే, తెలుగు తెలిసిన వాళ్లకి అది సరసిజ్.. సరసిజం అంటే తామరపువ్వు.

నేనేదో అనబోతుంటే, మళ్ళీ శ్రీమతి కూచిపూడి అభినయం. ఇంకో పకోడీ ముక్క నోట్లో వేసుకుని, నోరు మూసుకుని నములుతూ కూర్చున్నాను.

మేఘల అంది ‘మీ దగ్గర విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ వున్నాయా. వాటిలో కొత్త పేర్లు ఎన్నో దొరుకుతాయి. మా తమ్ముడి కొడుకుకి వాటిలో చూసే వృషోదర్ అని పేరు పెట్టారు’ ఇలా ఎన్నో పేర్లు అందరి నోళ్లల్లో నలుగుతుంటే, నేను ఉల్లిపాయ పకోడీలు కసిగా నముల్తున్నాను.

భారతిగారు అన్నారు, ‘మీరు రచయిత కదా! మీరు చెప్పండి’ అని.

నాకు పర్మిషన్ వచ్చింది కనుక, శ్రీమతి వేపు కన్నెత్తి చూడకుండా అన్నాను. ‘పేరు రెండు మూడు అక్షరాలతో సులభంగా వుంటే బాగుంటుంది. ల, స, ర, మ లాటి అక్షరాలు పలుకుతుంటే తీయగా వుంటాయి. అదీకాక పెద్ద పెద్ద సమాసాలతో పేరు పెడితే, ఒత్తులని వదిలేసిన ఈరోజుల్లో, ఆ పేర్లని ఖూనీ చేస్తారు. అందుకే ఎంత సరళంగా వుంటే అంత బాగుంటుంది’ అంటుండగానే, శ్రీమతి అభినయం చేసింది, ‘చెప్పింది చాల్లే’ అని.

సువర్ణ కళ్ళు మెరిసాయి. ‘అయితే.. మీరు చెబుతుంటే అనిపించింది.. మా అమ్మాయి పేరు లాస్య. ఎలా వుంది’ అంది.

సువర్ణ వేపు ఆప్యాయంగా చూసాను. మృదుమధురమైన పేరు.

రాహుల్ వెంటనే అన్నాడు, ‘ఏయ్.. అది చాల పాత పేరు.. ఏం బాగుంది.. ఉండు. ఆ పేరుకి రేటింగ్ ఎలా వుందో, ట్రెండ్ ఎలా వుందో చూద్దాం..’ అంటూ సెల్ ఫోన్ మీద వేళ్ళు టకటకలాడిస్తున్నాడు.

బయటికి వస్తూ కారెక్కుతున్నప్పుడు, సుందర్ నాతో నెమ్మదిగా అన్నాడు, ‘ఈ రాహుల్ అనే అబ్బాయి, బహుశా రాహుకాలంలో పుట్టి వుంటాడు. అందుకే అతను అలా....’

‘అవును. రాహుకాలంలో పుట్టిన వాళ్ళకే ఆ పేరు పెడతారుట! మా అమ్మమ్మ చెప్పేది. మొన్న ఇండియా ఎన్నికల్లో కూడా చూసాం కదా.. పాపం రాహుల్....’ అంటూ కారెక్కాను.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)