కథా భారతి - అనగనగా ఓ కథ

పరిమళించిన నిర్గంధ కుసుమం

- ఇచ్ఛాపురపు జగన్నాథరావు

ఆఫీసు నుంచి బయటపడి రోడ్డు మీదికి మరలగానే వెంకట్రావు ఒకసారి స్వేచ్చగా తన చుట్టూ చూసి చేతులు దులుపుకున్నాడు. ఉదయాన్నుంచి తాను రాసిన కాగితాలు, తిన్న చీవాట్లూ, చేసిన పొరపాట్లు లెక్కకు మించిపోయినాయి. అయితే అనుదినమూ జరిగే విషయాలు అట్టే బాధ పెట్టవు. నిత్యం చచ్చేవాడికి ఏడిచేవాడెవడూ?.

అలాగే అనుకుంటూ ఉంటాడు వెంకట్రావు ప్రతీరోజూ.

"ఏం వెంకట్రావ్?"

ఎవరో తనని పిలుస్తునారు. గిరుక్కున వెనక్కి తిరిగాడు. దూరాన తన పూర్వ మిత్రుడు ఆచారి తనని పిలుస్తూ తనవైపే నడచి వస్తున్నాడు. తానూ, వాడూ పూర్వం గడిపిన చక్కటి రోజులూ, వాడి చేష్టలు, తనకనేకవిధాల వాడు చేసిన ఉపకారాలు జ్ఞతికి వచ్చాయి వెంకట్రావుకి.

"ఎప్పుడొచ్చావురా?"

"ఇప్పుడే బస్సు దిగాను"

"ఆంతా కులాసాగా?"

"అ..."

వెంకట్రావుకి మంచి రోజులు కరువు. డబ్బు కరువు. స్నేహితులు కరువు- ఇప్పుడు మాటలూ కరువయ్యాయి.

"హెల్తు ఆఫీసులో పని మీద వచ్చాను"

"అహా.."

ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.

కాఫీ హోటలు దగ్గరకి వస్తున్న కొద్దీ వెంకట్రావు గుండెల్లో దడ ఎక్కువ కాసాగింది. ఆవేళ ఒకటో తారీఖు. జీతం అందుకుని తెచ్చుకుంటున్నాడు వెంకట్రావు. ఆచారికి కాఫీ ఇచ్చుకోవాలి. వాడి చేత డబ్బులు ఇప్పిస్తే ఏం బాగుంటుంది?. ఈ ఆలోచనల మధ్య రానేవచ్చింది కాఫీహోటలు. ఆచారిఇ ఏమీ ప్రయత్నం లేకుండానే హోటల్లోకి దారి తీసాడు. వెంకట్రావు గుండెలు చేతుల్లో పెట్టుకుని వెనక నడిచాడు.

ఇద్దరూ వెళ్ళి ఓ మూల కూర్చొన్నారు. సర్వర్ వచ్చి "ఏం కావాలి సార్" అన్నాడు.

"రెండు స్వీట్..."

ఆచారి నిస్సందేహంగా ఆర్డరు చేసేసరికి గతుక్కుమన్నాడు వెంకట్రావు. రెండు ఆర్లు పన్నెండణాలు...

"ఒకటే తీసుకురా..." అన్నాడు ఎంత తగ్గినా మంచిదేనని.

"అదేమిటిరా?. కాశీలో వదిలిపెట్టి వచ్చావేంటీ?.."

"ఆహా.. స్వీటెందుకని"

అర్వరు తెల్లబోయి చూసి, వెళ్ళి రెండు స్వీట్లు తెచ్చాడు. వెంకట్రావు కాలుతున్న ఇనుములాగ నోట్లో పెట్టుకున్నాడు స్వీటుని. స్వీట్ ఆరణాలు, హాట్ ఓ పావలా, కాఫీ -- వెధవది... పెషలు హోటలు--- ఎనిమిదణాలు. రెండూంపావలా... వెంకట్రావు తన జేబులోని డబ్బువేపు చూసుకున్నాడు. అందులో ఒక్క రూపాయి తగ్గితే రుక్మిణమ్మ చేసే రాద్ధాంతమూ, గోలా చెవిలో మారుమ్రోగ సాగాయి,

పోనీ ఆచారిని బిల్లు పే చెయ్యనిస్తే?..

"ఛా" అనుకున్నాడు వెంకట్రావు. తనకెన్నిసార్లు ఇచ్చుకోలేదు కాఫీ?. తను ఎలా లేదన్నా ఆచారి చేస్తున్న అయ్యవారి ఉద్యోగం కన్నా ఎక్కువ ఉద్యోగమే చేస్తున్నాడు.

బూంది.. కాఫీ.. సర్వరు ఇచ్చిన బిల్లూ తీసుకున్నాడు వెంకట్రావు. ఇంతసేపూ ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలీదు. ఏ క్షణం కోసం తాను భయంగా ఎదురుచూసాడు. ఆచారి బిల్లు తీసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు.

వెంకట్రావు బిల్లు ఇచ్చుకుని బయటకి నడిచాడు -- సంతోషంతోనూ, విచారంతోనూ...వెనకాలే ఆచారి వస్తూ రెండు కిళ్ళీలు కొని, ఒకటి వెంకట్రావుకిచ్చాడు.

"మరి నే వెళ్తానూ" అన్నాడు ఆచారి.

వెంకట్రావుకి తన పరువు ప్రతిష్టలు త్రాసులో ఉన్నట్లు కనిపించాయి. కొంచెం ఆలోచించకుండా "రాత్రికి ఇంటికి వచ్చేయ్" అన్నాడు.

"చెప్పలేన్రా, మూడొంతులు వస్తాన్లే"

ఆచారి అటువైపు నడిచాడు. వెంకట్రావు ఇంటివైపు నడిచాడు.
****

గుమ్మం ఎక్కి, తలుపు తోసుకుని వెంకట్రావు గదిలోకి వెళ్ళాడు. చొక్కా తీసి కొయ్యపాగాకి తగిలించాడు.
రుక్మిణమ్మ వచ్చి " ఏం ఆలస్యం ఐంది?." అన్నది.

"చిన్న పని ఉండి ఆలస్యం అయిందిలే--" అన్నాడువెంకట్రావు.

అతని జేబు తడుముతున్న రుక్మిణమ్మ ఒకసారి డబ్బంతా లెక్కచూసి, తెల్లబోయి "డబ్బు తక్కువుందేం?" అంది.

"ఆ.. కొంచెం తక్కువుంటుందిలే" అన్నాడు వెంకట్రావు.

"ఏం?" అన్నది రుక్మిణి చర్రున.

"కొంచెం ఖర్చుచేసాను" దోషిగా, దీనంగా అన్నాడు వెంకట్రావు.

"ఎందుకనీ?. అడుగుతున్నాను"

"స్నేహితుడొచ్చాడులేవే"

అనేశాడు వెంకట్రావు. మరి చేసేది లేక!. రుక్మిణి దగ్గర ఈ ఆటలు సాగవు.

"ఇలా తగలేస్తారని తెలిసే నేను గోల పెడుతూంటాను. హయ్యో?. ఎంత దూబరా?. ఎవడో వస్తే మూడు రూపాయల ఖర్చా?"

"రెండుంపావలాయే"

"అదంటే అంతే. అయినా మగాళ్ళకి బుద్ది ఉండకపోతే ఇంతే"నన్నది రుక్మిణి.

అంతటితో ఆపతివ్రత శాంతించినందుకు చాలా సంతోషించాడు వెంకట్రావు. కానీ, తరువాత విషయం ఇంకా అతన్ని భయపెడుతూనే ఉంది.

నెమ్మదిగా, "రాత్రికి వాడిని భోజనానికి రమ్మన్నాను." అన్నాడు వెంకట్రావు - అల్లంటుకుంటున్నట్లు.

"ఎవరినీ?" అంది రుక్మిణి కోపంగా చూస్తూ.

"నా స్నేహితుడ్నే"

"ఎందుకూ?"

"భోజనానికి"

"ఇక్కడ సేవ చేసేందుకో మనిషుందని, అడ్డమైన వాళ్ళనీ , నా పీకలమీదకి తెచ్చి ఎక్కిస్తే ఏనేమీ చెయ్యలేను" అంది రుక్మిణి.

"అదికాదే--వాడు నాకు చాలా.."

"వీల్లేదంటే వీల్లేదు" రూలింగు ఇచ్చేసింది రుక్మిణి.

వెంకట్రావుకి కోపం రాదు. వచ్చినా లాభం లేదనే విషయం అతనికి తెలుసు. అతడు రుక్మిణిని బతిమాలసాగాడు.

ఇంకెప్పుడూ ఎవర్నీ ముందరగా తన అనుమతి తీసుకోకుండా భోజనానికి పిలవనని వెంకట్రావుదగ్గర మాట తీసుకుని, రాత్రి మిత్రుడిని పిలిచినందుకు క్షమించింది రుక్మిణమ్మ.

వీధి అరుగుమీద కూర్చొని మామూలు ప్రకారం వచ్చేపోయేవాళ్ళని చూస్తున్నాడు వెంకట్రావు. సాయంత్రాలు అతడు బయటకి తిరిగేందుకు రూల్సు అంగీకరించవు.

ఎవడో పిచ్చివాడల్లే ఉన్నాడు. వీధంతా ధూళిచేస్తూ వస్తున్నాడు. ఓ క్షణం వినోదంగా వాడివైపు చూశాడు వెంకట్రావు. కాని, వాడు దారినిపోతోన్న ప్రతీవాడి చెయ్యీ పట్టుకుని ఏదో అరుస్తూన్నాడు. తరువాత వాడిని వదిలి ఇంకో చెయ్యి. తరువాత ఇంకోటి..

కొంచెం దగ్గిరికి వచ్చాడు పిచ్చివాడు. ఒకడి చెయ్యి పట్టుకుని, ‘నువ్వు పుట్టినందువల్ల ఏం ఉపకారం జరిగింది’? అని గట్టిగా అడిగాడు. చెయ్యి స్వంతదారు తెల్లబోయి చూస్తుంటే వికటంగా ఒక అట్టహాసం చేసి వాణ్ణి వదిలి మరో చెయ్యి తీసుకున్నాడు.

వెంకట్రావు కొంచెం భయపడ్డాడు వాడు తన జోలికి వస్తాడని.

లేవబోయాడు. కాని పిచ్చివాడు గభీమని వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. ‘నువ్వు పుట్టినందువల్ల లోకానికి ఏం ఉపకారం జరిగింది?’ అని అరిచాడు.

వెంకట్రావు ఇంతసేపూ పిచ్చివాడికి భయపడ్డాడు కాని, ఏదో శాంతితో వెలుగుతూన్న వాడి కళ్ళని చూశాక, అతని ప్రశ్న వెయ్యి రెట్ల బలంతో భయపెట్టసాగింది.

చచ్చిపో - నీ వల్ల ఎవ్వరికీ ఉపకారం జరిగి ఉండకపోతే నువ్వెందుకూ? చచ్చిపో పిచ్చివాడు నవ్వాడు. వెంకట్రావు చెవుల్లో ఆ మాటలు తిరిగి తిరిగి బలంగా మారుమ్రోగుతున్నాయి. పిచ్చివాడు వెళ్ళిపోతున్నాడు.

వెంకట్రావ్ కూర్చున్న చోటునుంచి లేవలేకపోయాడు. తాను ఎవరికుపకారం చేశాడు? అయితే ఎందుకు బ్రతికిఉండాలి?

అన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నాడు వెంకట్రావు. ఎనిమిదయింది. ఆచారి జాడలేదు. అప్పుడే రుక్మిణికి కోపం రాసాగింది. వేగంగా ఆచారి వస్తే బాగుండుననుకున్నాడు.

ఎనిమిదిన్నర, తొమ్మిది ఆచారి రాలేదు.

ఈ మాత్రం దానికి నన్ను చంపేరు. స్నేహితుడు వస్తానని ఎందుకు చెప్పాడు?

రుక్మిణి నోటికి హద్దులు లేవు. ఇష్టం వచ్చినట్టు మొగుణ్ణీ, వాడి మిత్రుణ్ణీ తిట్టి తరువాత భోజనం చేసింది. కోపంలో వెంకట్రావుకి అన్నం పెట్టడం మరిచిపోయింది.
* * *

వీధి అరుగుమీద పడుకున్న వెంకట్రావు అర్ధరాత్రివేళ లేచాడు. వెన్నెల విరివిగా కాస్తోంది.

ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతనికి సాయంత్రం నించీ జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది. ఆ పిచ్చివాడి మాటలన్నీ జ్ఞాపకం వచ్చాయి.

నువ్వు పుట్టడం వల్ల లోకానికి ఏం ఉపకారం జరిగింది?

ఏం జరిగింది? తాను చిన్నప్పుడు వారాలు చేసుకుని చదివి స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. తరువాత గుమాస్తాగా చేరాడు. నాటినుంచి నేటివరకూ అదే ఉద్యోగం. వచ్చిన కాగితానికల్లా నెంబరు వెయ్యడం, అది ఎవరికి చెందాలో వాళ్ళకి పంపడం. వెళ్ళాల్సిన కాగితాలకి పోస్టేజి సరిగ్గా అతికించి చిరునామా జాగ్రత్తగా వ్రాసిపంపడం.

ఇందులో ఏం ఉపకారం జరిగింది? ఏమీలేదు. పోనీ గృహస్థుడుగానైనా తానెవరికైనా ఉపకారం చేశాడా? అంతకన్నా లేదు. ఈ గయ్యాళి భార్యతో ఎవ్వరికీ ఒ పూట అన్నం పెట్టడానికైనా తనకి స్వతంత్రం లేదు.
అయితే?
తాను చచ్చిపోవాలి. తనవల్ల ప్రయోజనం లేదు లోకానికి. పిచ్చివాడు చెప్పాడు. తను చచ్చిపోవాలి. వాడు పిచ్చివాడు కాదు మహాజ్ఞాని.

ఒక్కసారి మరణం ద్వారా తాను పొందబోయే సుఖాలు వెంకట్రావు కళ్ళకి కనబడసాగాయి. తప్పు కాగితాలు పంపినందుకు తనను గుమాస్తాలు తిట్టరు. అర్ధమృతుడిగా ఈ జీవితం గడపనక్కరలేదు. బాధ వదిలిపోతుంది.


వెంకట్రావు లేచాడు. ఎలా చచ్చిపోవాలనే సమస్య అతనికి ముఖ్యమైనది కాదు. ఊరుబయట నుయ్యి ఉంది. చావుల నుయ్యి తొందరగా నడవసాగాడు. ఈ కష్టాలకీ, ఈ జీవితానికీ, ఈ నాటితో స్వస్తి. నడిచాడు. నుయ్యి కనిపిస్తోంది వెన్నెట్లో. తనకోసమే అది అక్కడ ఉన్నట్లు కనిపిస్తోంది.

చిరునవ్వు నవ్వుదామనుకున్నాడు వెంకట్రావు. నవ్వలేకపోయాడు. కాళ్ళు కొంచెం నెమ్మదిగా అడుగువెయ్యడం ప్రారంభించాయ్.

హఠాత్తుగా ఆ ప్రశాంతతని చీల్చుకుంటూ ఓ వికటాట్టహాసం వినిపించింది. వెంకట్రావు అడుగు తీసి అడుగు పెట్టబోయాడు...భూత ప్రేత పిశాచ...

ఎవరూ కాదు. పిచ్చివాడు ఆ నూతి పక్కనించి నడిచివచ్చి వెంకట్రావు చెయ్యి పట్టుకుని, ఎందుకొచ్చావ్? అన్నాడు.
చచ్చిపోడానికి..

ఏం.."

నిశ్చింతగా చెప్పాడు వెంకట్రావు నేను ఎవరికీ ఉపకారం చెయ్యలేదు అని.


ఈసారి తేలిగ్గా నవ్వాడు పిచ్చివాడు. మూర్ఖులు....మూర్ఖుడివి.. అని అరిచాడు.

వెంకట్రావ్ తెల్లబోయాడు.

"నువ్వు చావద్దు ..పో" అన్నాడు. వెంకట్రావుకి కొండంత ధైర్యం వచ్చింది.

"కాదు నువ్వే చెప్పావు చావమని. నేను చచ్చిపోతాను" అన్నాడు.

"లేదు..నువ్వు చాలా ఉపకారం చేశావు. నీవల్ల ప్రపంచానికి గొప్ప ప్రమాదం తప్పించబడింది " అన్నాడు పిచ్చివాడు.

వెంకట్రావు తెల్లబోయాదు.

"నావల్లనా? ఉపకారమా?" అన్నాడు.

"ఆ నీ భార్య గయ్యాళి కదూ.. "

"ఔను మహా గయ్యాళి.."

"వెర్రివాడా! ఆమెని పెళ్ళాడి ఓ మనిషిని రక్షించావు. ఆ బాధలన్నీ వాడికి బదులు అనుభవిస్తున్నావ్. ఇంతకన్నా ఉపకారం ఏముంది? పో" అన్నాడు పిచ్చివాడు.

వెంకట్రావు ఇక ముందడుగు వెయ్యలేకపోయాడు. వెనుదిరిగి వేగంగా నడవసాగాడు. తరువాత పరిగెట్టసాగాడు. ఉపకారం చేశాడు. తనవల్ల లోకానికి ప్రయోజనం ఉంది. పరుగు..వేగం..మహావేగం.

మర్నాడు ఉదయం వెంకట్రావుకి పెద్ద జ్వరం వచ్చింది. అలా జబ్బు పడ్డందుకు రుక్మిణి అతణ్ణి చెడతిట్టి పోసింది.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)