ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

విభీషణుడి హితబోధ
అప్పుడు విభీషణుడు వాళ్ళందరినీ వారించి, సద్దుమణగజేసి, రావణాసురుడి ముందు వినమ్రంగా చేతులు జోడించి 'అన్నా! సామ దాన భేద దండోపాయాలు యుద్ధవ్యూహాలు కదా! మనం ముందే దండోపాయం ప్రయోగించటం సబబా? నీవు యుద్ధతంత్రం చక్కగా తెలిసినవాడివి కదా! శత్రువు బలహీనుడై ఉంటే దండోపాయం చెల్లుతుంది. మహాభయంకర మైన సముద్రాన్ని హనుమంతుడు లంఘించి వచ్చాడే? వాళ్ళను దుర్బలులని ఎట్లా అంటాము? అదీకాక ఖరుడే కదా రాముడిపై దండెత్తాడు. అందువల్ల రాముడికి ఖరదూషణాదుల వధ అనివార్యమైంది. ఒకవేళ రాముడు మనకు పగవాడనుకుంటే అప్పుడే మనం ఆయనమీదికి యుద్ధానికి పోవలసి ఉంది కదా? నీవేమో ఆయన భార్యను అపహరించుకొని వచ్చావు. పరదారను చెరపట్టడం ధర్మమా? సీతను అపహరించుకొని రాకపోతే మనకు రాముడితో శత్రుత్వమే ఉండేది కాదు. అందువల్ల ఇప్పుడు రాముడితో మనం యుద్ధానికి తలపడకూడదు. ఆయన భార్యను ఆయనకు ఇచ్చివేసి సామరస్యం పాటించటం మంచిది. లేకపోతే లంకాపట్టణం సర్వనాశనమవుతుంది. నీవు నాకు అన్నవు కాబట్టి నీకు ఎటువంటి కష్టమూ రాకూడదని నిన్ను వేడుకుంటున్నాను. యుద్ధానికి తలపడడం కంటే సీతను ఆయనకు సమర్పించడం మంచిది అని నా విన్నపం'' అన్నాడు విఈషణుడు.

రావణుడు అప్పుడు రాక్షసులందరినీ పంపించివేసి తాను అంత్ణపురంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు ఉదయం విభీషణుడు అన్నమీది మమకారంతో రావణాంత్ణపురంలోకి వెళ్ళాడు. విభీషణుడు సాత్త్వికుడు. సర్వాత్మనా రావణుడి మేలునే ఆయన ఆశిస్తున్నాడు. అన్నకు జయం పలికి ఆదరంతో రావణుడి కిట్లా బోధించాడు విభీషణుడు 'అన్నా! ఇప్పుడు లంకలో అన్నిచోట్లా దుర్నిమిత్తాలు, దుశ్శకునాలే కనపడుతున్నాయి. మన కళ్ళముందే లంక తగలబడిపోయింది. మరింత నాశనాన్ని కోరి తెచ్చుకోక ముందే సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించడం మంచిది' అన్నాడు. అప్పుడు రావణుడి సమక్షంలో అతని ఆంతరంగికమంత్రులు మాత్రమే ఉన్నారు. రావణుడు సంశయగ్రస్తుడైనాడు. రథం ఎక్కి సభాభవనానికి పోయినాడు. సభలో ఉన్నవారు ఆయనకు సమస్తరాజోపచారాలు నిర్వహించారు. అక్క డొక ఉత్తమాసనంమీద రావణుడు ఆసీనుడైనాడు. కొందరు రాక్షసనాయకులను వెంటనే హాజరుపర్చాలని భటులను పంపించాడు. క్షణాలమీద వాళ్ళంతా వచ్చి రావణుడి పాదాలకు నమస్కారం చేశారు. వాళ్ళంతా తమ తమ అర్ఘాసనాలపై ఆసీనులైన తర్వాత వాళ్ళతో మంత్రాలోచన కుపక్రమించాడు రావణాసురుడు.

'జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ఒక్క కుంభకర్ణుడికి మాత్రమే తెలియవు. అమితపరాక్రముడైన నా తమ్ముడు ఆరు నెలలు నిద్రలో ఉంటాడు కాబట్టి ఈ విషయాలు వాడికి తెలియవు. ఇప్పు డితడు కూడా మన సమక్షంలో ఉన్నాడు. సీతను నేను కామించాను. అయితే స్వయంగా నిర్ణయించుకొనటానికి ఒక సంవత్సరం వ్యవధి ఇచ్చాను. వానరులు సముద్రాన్ని దాటగలరో, దాటలేరో నేను ఊహించలేకపోతున్నాను. ఒక్క హనుమంతుడు మాత్రం దాటి వచ్చాడు. రామలక్ష్మణులకూ సుగ్రీవుడికీ సీత లంకలో ఉండటం తెలిసిపోయింది. నాకైతే సీతను ఎంతమాత్రమూ వదులుకోవాలని లేదు. రామలక్ష్మణులు సముద్రం దాటి లంకలో ప్రవేశించలేరనే నా అభిప్రాయం. ఒకవేళ వాళ్ళు వచ్చినా నేను వాళ్ళను జయించడం తథ్యం అనుకుంటున్నాను. మీరేమంటారు?'' అని రాక్షసుల ఆలోచన లేమిటో అడిగాడు రావణుడు.

అప్పుడు కుంభకర్ణుడు 'అన్నా! నీవు చేసిన పనిని ఏమాత్రం సమర్థించను నేను. నీవు తప్పు చేశావనే అంటాను. సీతాపహరణానికి ముందే మా ఆలోచన అడిగి ఉండవలసింది. అయినా అయిపోయిన పనికి వగచి ఏం ప్రయోజనం! నీవు నా అన్నవు కాబట్టి నిన్ను కాపాడటం నా ధర్మం. నీ శత్రువులు ఇంద్రసూర్యులైనా, అగ్నివాయువులే అయినా మన ముందు ఎందుకూ కొరగారు. నేను నా అతిభయంకరమైన, 'పట్టస' మనే ఆయుధాన్ని తీసుకుంటే దేవేంద్రుడు కూడా పారిపోతాడు. రాముడు నామీద బాణప్రయోగం చేస్తే రెండో బాణం వేసే లోపుననే రాముణ్ణి హతమారుస్తాను. తరువాత వానరులందరినీ నమిలి మింగుతాను. సీతాదేవి నీకు దక్కుతుంది' అని ధీమాగా చెప్పాడు.

కుంభకర్ణుడు చెప్పింది ఇంపుగానే తోచినా రావణుడికి తన తమ్ముడే తనను తప్పుపట్టడం, తాను చేసింది దుష్టకార్యం అనడం ఏమాత్రం నచ్చలేదు. ఇది కనిపెట్టి మహాపార్శ్వుడు రావణుణ్ణి సంప్రీతుణ్ణి చేయటానికి ఎంతగానో పొగిడాడు. 'నీకన్నా నిరంకుశుడు ముల్లోకాలలోనే లేడు. కోడిపెట్టెను పుంజు ఆక్రమించుకున్నట్లుగా నీవు సంరంభిస్తే నిన్ను అడ్డుకోగల సామర్థ్యం ఎవరికైనా ఉంటుందా? నీవేమి తటపటాయించవద్దు. సీతను వదిలి పెట్టవద్దు. ఒకవేళ రాముడు ప్రతీకారానికి పూనుకుంటాడనుకో ఆ రాముడికి దేవేంద్రుడే తోడు వచ్చినా, కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ మా వెంట ఉంటే, మేము రాముణ్ణి హతమారుస్తాం. యుద్ధభీరువులు సామదానభేదా లంటారు. కాని దండోపాయమే సర్వశ్రేష్ఠం. నీకు ఇసుమంతైనా సందేహం వద్దు' అని రావణుణ్ణి రెచ్చగొట్టాడు.

రావణుడు మహాపార్శ్వుడి మాటలకు ఎంతగానో పొంగిపోయినాడు. మదవిహ్వలుడైనాడు. ''అయితే మహాపార్శ్వుడా! ఇందులో ఒక సమస్య ఉంది. అది చాలా రహస్యం. ఒకసారి నేను ఆకాశమార్గంలో వెళుతూ ఉంటే పుంజికస్థల అనే పరమాద్భుత సౌందర్యవతి అయిన అప్సరస నా కంటపడ్డది. అగ్నిజ్వాలలాగా వెలిగిపోతున్నది. నే నెక్కడ చూస్తానో అని మబ్బుల్లో తక్కుతూ తారుతూ నన్ను తప్పించుకోవాలని చూసింది. అయితే నేను ఒడిసిపట్టి దానితో రమించాను. ఆ పుంజికస్థల గోడుగోడున ఏడుస్తూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తన దురవస్థ చెప్పుకొని కుమిలి ఏడ్చింది. అప్పుడు బ్రహ్మ, 'నేను ఎవరినైనా బలాత్కారం చేసి రమిస్తే నా తల నూరువక్కలైపోతుం'దని నాకు శాపమిచ్చాడు, అదీ నా వెరపు. సీతను బలాత్కరించడానికి వీల్లేదు'' అని వాపోయాడు రావణుడు. 'నేను సముద్రమంత ఉద్ధతుణ్ణి. వాయువంత బలోద్రిక్తుణ్ణి. పర్వతగుహలో ఉన్న సింహాన్ని రెచ్చగొడుతున్నట్లు ఈ రాముడు నన్ను రెచ్చగొడుతున్నాడు. నా కీ రాముడూ, ఈ వానరసైన్యం, లెక్కలోకి వస్తారా? ' అని ఆటోపంగా తల ఎగరవేశాడు రావణుడు.

రావణుడికి మళ్లీ విభీషణుడి హితబోధ
కుంభకర్ణుడి ప్రతాపాలూ, రావణుడి బిభీషికలూ విన్న విభీషణుడు మరొకసారి హితవు చెప్పడానికుపక్రమించాడు రావణుడికి. 'సీతాదేవి అనే మహాసర్పాన్ని కోరి కోరి నీ మెడకు చుట్టుకోవద్దు. రామలక్ష్మణులు లంకలో ప్రవేశించటానికి ముందే ఆమెను రాముడికి అప్పగించు. నిన్ను నీవు పొగడుకున్నందువల్ల ఏం ప్రయోజనం! పిడుగులాంటి రామబాణాలు భయంకరమైనవి' అని విభీషణుడు చెపుతుండగా ప్రహస్తుడు కల్పించుకొని- 'విభీషణా! మాకు దేవదానవులవల్ల, యక్షగంధర్వమహోరగులవల్లా భయం లేదే; కేవలం మనుష్యమాత్రుడు మమ్మల్ని ఏం చేయగలడు? ' అని విర్రవీగుతూ అన్నాడు. అప్పుడు విభీషణుడు సౌమ్యగంభీరంగా కుంభకర్ణుణ్ణి, ప్రహస్తుణ్ణి ఉద్దేశించి మీ అంచనాలు అన్నీ తప్పు, వ్యర్థం అని చెప్పాడు. ఈ తర్జనభర్జనలకు కుపితుడై ఇంద్రజిత్తు 'తండ్రీ! నీ తమ్ముడు విభీషణుడు ఒట్టి భీరువులాగా ప్రవర్తిస్తున్నాడు. పులస్త్యవంశంలో పుట్టినవాడెవడూ ఇటువంటి అప్రయోజకపు మాటలు పలకకూడదు. ఈ విభీషణు డొక్కడే మన వంశంలో తప్పపుట్టాడు. నేను ఇంద్రుణ్ణి బంధించి లంకలో చెరసాలలో ఉంచిన విషయం నీ తమ్ముడికి తెలియదా? నేను ఐరావతాన్ని నేలకూల్చి దాని దంతాలు ఊడగొట్టాను. దేవతలంతా నన్ను చూసి దిక్కుదిక్కులకు పారిపోయినారు,' అని అహంకారంతో అధిక్షేపించాడు విభీషణుణ్ణి.

విభీషణుడు కూడా అందుకు సమాధానంగా 'నీది తొందరపాటు స్వభావం. అణకువ ఏమాత్రం లేదు నీదగ్గర. లంకకు నీ వల్ల ఘోరవినాశం జరగబోతున్నది' అని ఇంద్రజిత్తుకు తగిన సమాధానం చెప్పి సీతను శ్రీరాముడికి అప్పగించడం మంచిదని మళ్ళీ రావణుడికి నొక్కి చెప్పాడు. 'అప్పుడు మనం నిర్భయంగా, సుఖంగా ఉండగలం' అన్నాడు. విభీషణుడు చెప్పిన హితవు రావణుడికి ఏమాత్రం రుచించలేదు. 'నీవు తమ్ముడివైపోయినావు కాబట్టి బతికిపోయినావు. నీవు నాకు ఉపకారం చేస్తున్నట్లు నటిస్తూ అపకారం తలపెట్టావు!' అని పరిపరివిధాల తమ్ముణ్ణి నిందించాడు రావణుడు.

రావణుడు విభీషణుణ్ణి నిందించగా, విభీషణుడు రావణుణ్ణి వీడటం
ఇట్లా విభీషణుణ్ణి రావణుడు చీదరించుకోగానే విభీషణుడు 'నీవు నాకు జ్యేష్ఠుడివి, తండ్రివంటివాడివి కాబట్టి నేను నీతో పరుషంగా మాట్లాడకూడదు. నీమేలు కోసమే నేనింతగా మొరపెడుతున్నాను-

సులభ్ణా పురుషా రాజన్‌ సతతం ప్రియవాదిన్ణ,
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ్ణ.
బద్ధం కాలస్య పాశేన సర్వభూతాపహారిణా,
న నశ్యంత ముపేక్షేయం ప్రదీప్తం శరణం యథా.
శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే,
కాలాభిపన్న్ణా సీదంతి యథా వాలుకసేతవ్ణ.
(యుద్ధ. 16.21, 22, 24)

రాజా! లోకంలో ప్రియంగా మాట్లాడుతూ పొగడ్తలతో ఎదుటివారిని ఉబ్బిపోయేట్లు చేసే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ కనపడతారు. కాని అప్రియం (వినటానికి ఇష్టంగా లేకపోయినా) మేలు చేసే మాట చెప్పేవారూ, వినేవారూ కూడా దుర్లభం. మండిపోతున్న ఇంటిని చూస్తూ ఉపేక్షించలేనట్లు, నాచేత నైన మేలు నీకు చేద్దామనుకున్నాను. కాలం ముంచుకొచ్చిన వాళ్ళు మహా ప్రవాహా వేగానికి ఇసుకతో నిర్మించిన ఆనకట్టలాగా కొట్టుకొని పోతారు. నేనేమైనా అవినయంగా మాట్లాడితే నన్ను మన్నించు. నేను నీతో ఇక ఉండలేను. నీవు క్షేమంగా ఉండటమే నా అభిమతం' అంటూ నలుగురు మంత్రులను తన వెంటబెట్టుకొని విభీషణుడు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళిపోయినాడు.

విభీషణుడు శ్రీరాముణ్ణి శరణు కోరటం
ఆకాశంలో గొప్ప తేజస్సుతో వస్తున్న విభీషణుణ్ణీ, ఆయన అనుచరులనూ ఈవలి ఒడ్డున ఉన్న వానరులు చూసి
వాళ్ళు శత్రువులేమో అనుకొని వాళ్ళను చంపివేస్తాం అని సుగ్రీవుడి ఆదేశాన్ని కోరుకున్నారు. ఇట్లా వానరులు గుసగుసలు పోతుండగా విభీషణుడు స్వరం పెద్దది చేసి తాను శ్రీరాముణ్ణి శరణు వేడకోవటానికీ, ఆయనను ఆశ్రయించటానికీ వస్తున్నాననీ, తమ్ముడిగా తాను రావణుడికి హితువు బోధించినా అతడు నిరాకరిస్తున్నాడనీ, రావణుడు జటాయువును చంపి, సీతాదేవిని అపహరించుకొనివచ్చి, రాక్షసుల కాపలాలో లంకలో ఉంచాడనీ చెపుతూ శ్రీరాముడి సమక్షనాకి చేరుకున్నాడు. సుగ్రీవుడు వెంటనే శ్రీరాముడి కీ సంగతి తెలియజేస్తూనే ఇతడు మాయావీ, కపటీ, గూఢచర్యం నెరపటానికి వచ్చినవాడూ, రావణుడి అనుమతితో వాడికి మేలు చేయడానికి వచ్చినవాడూ అయి ఉండకూడదా? అనే సందేహం లేవనెత్తాడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)