కవితా స్రవంతి
పక్షుల ఊరేగింపు - కాశ్మీరీ కవిత
- గులాం నబీ ఆతష్
- తెలుగు అనువాదం: శ్రీమతి మహెజబీన్ బేగ్

భయవిహ్వాల పక్షులన్నీ ఒకచోట చేరి
తమ బందు మిత్రుల్ని పిలిచాయి
ఆ పిలుపు దిగంతాలు దాటింది
హరముఖి పర్వతశ్రేణుల్ని దాటి,
నీల్ నాగ్ జలక్షేత్రం దాకా మారుమోగింది

అనేక జాతులు, అనేక రంగుల పక్షులు
ఒకచోట చేరాయి
పండగ కోలాహలం అలుముకుంది
అవి మాట్లాడుకున్నాయి
బ్రతుకు భయం గురించి చర్చించుకున్నాయి
పక్షుల మహాఊరేగింపు మోదలైంది
ఒక విశాల పర్వతమైదానం దగ్గర ఆగి,
చర్చల పరంపర కొనసాగింది

మైనా అంది
చరిత్ర పక్షులదోవ పట్టింది,
సమయం మళ్ళీ వ్యూహం మార్చుకుంది
పీర్ పింజాలే పర్వత శ్రేనికి విఘాతం కలిగింది
అక్కడ అశాంతి నెలకొంది
కొందరిచేతుల్లో పర్వత మైదానాలు విద్వంసానికి గురౌతున్నాయి
సత్ సర్ జలాశయం ఆక్రమనకు గురైంది
అప్పుడు ఎప్పుడో ‘రేషీ‘ అనే అతను ఈ జలాశయాన్ని
కాపాడాడు, అది తల్చుకుని వాళ్ళు ఆ దుర్మార్గులు విషపు నవ్వులు నవ్వుకుంటున్నారు
జలం నది ఎండిపోతుంది
డాల్ సరస్సు కుంచించుకుపోయింది
లాలేదెల్ లో వసంతం కనుమరుగైంది
ఉల్లర్ సరస్సు అమానుష చేతుల్లో ధ్వంసమయింది
జలక్షేత్రాలన్ని అడుగంటిపోయాయి
మాకు ఉండడానికి ఆవాసాలు లేవు
మాగూడు కట్టుకోడానికి చోటేలేదు
మేం ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి అంటూ మైనా ప్రశ్నించింది

అప్పుడు బుల్ బుల్ పిట్ట అంది
వాళ్ళూ చెట్లు కొట్టేశారు
అడవిని ధ్వంసం చేసారు
ఆకుపచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చి వాళ్ళు తమ ఇళ్ళు కట్టుకున్నారు
వనాల మీద, తోటల మీద, ఆకుపచ్చని పొలాల మీద వాళ్ళు విషం వెదజల్లారు
గాలికూడా విషబరితమైంది
చిన్న పురుగుకూడా జీవించలేని పరిస్థితి
మరి మేం ఏం తినాలి? ఎలా బ్రతకాలి?
గూడు కట్టుకుందాం అంటే చెట్లు లేవు,
మేం ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? అంటూ
బుల్ బుల్ పిట్ట తన బాధ చెప్పింది

తర్వాత పిచ్చుక తన బాధ వినమంది
బాంబులు పేల్చినప్పుడు ఆ శబ్ధానికి
నేను వనికిపోతాను, ప్రళయం వచ్చిందిని
భయపడిపోతాను. ఆ పొగ నా ఊపిరిని కమ్మేసింది నా పుష్పావరణం చెల్లా చెదిరైంది
రుషి, పీర్లు నడయాడిన పవిత్ర భూమి అపవిత్ర నిలయమైంది
మేం ఎక్కడికి వెల్లాలి? ఏం చేయాలి?
ఎలా బ్రతకాలి? మాగూడు ఎక్కడ కట్టుకోవాలి?
అంటూ తన బాధ చెప్పుకుంది పిచ్చుక.

మరో రాజపక్షి నిల్చొని ఇలా అంది
మన పూర్వికుల భూమి ఇదే
ఇక్కడ దేవతలు కొలువున్నారు
వాళ్ళు మనల్ని కాపాడుతారు
మనం వంచనకు గురికాము
రేపటిమీద ఆశతో మనం ఇక్కడే ఉందాం
దేవాలయాలు, దర్గా సందర్శిద్దాం
చరారీ వృష కూడ వెళ్దాం
కొండ మీది దేవతను కూడా దర్శించుకుందాం
మళ్ళీ ఇక్కడ వసంతం వస్తుంది
మేఘాలు గర్జిస్తాయి
జలాశయాలు నిండుతాయి
పూలు వికసిస్తాయి
అప్పుడు రుతువులతో పాటు
మేము లయగా పాటలు పాడుదాం.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)