శీర్షికలు - సంగీతరంజని
శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి చరిత్ర - వారి దివ్యపరతత్వ కీర్తనామృతము
- యఱ్ఱమిల్లి సరోజిని జోగారావు

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి తలిదండ్రులు- పార్వతమ్మ, మోక్షసోమసుందర అవధాని. ఈ పుణ్య దంపతులకు చాలా రోజులు సంతానప్రాప్తి కలుగలేదు. వీరు - ''రామకృష్ణ శివా'' రాధకులు. ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. వారి ఆరాధన ఫలించి భగవంతుడు పుత్రరత్నమును ప్రసాదించారు. ఆ పుత్రరత్నమునకు ''శివరామకృష్ణ'' అని నామకరణం చేశారు.

''శివరామకృష్ణ'' దినదిన ప్రవర్థమానుడై అంతర్ముఖ వృత్తిలో ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు. చిన్నప్పుడే సకల శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేసి, పర, తాత్విక, రహస్యాలన్నీ అవగాహన జేసికొని ఎంతో వైరాగ్యముగా, విరాగియై, సన్యాసాశ్రమము భగవత్‌ ప్రాప్తికి సులభసాధ్యమని, బ్రహ్మచర్యనిష్ఠతో, పరతత్వసాధన సాధ్యమనీ విచారించేవాడు.

తల్లిదండ్రులు ఇతని ప్రవర్తన గమనించి, వివాహము చేయుటకు నిశ్చయించి, ఇతను వారించినా, వివాహము చేశారు. అప్పుడు వీరి వయసు 17 సంవత్సరములు. ఆ బాలిక వ్యక్తురాలైనది. అపుడు వైభవంగా జరుపుతున్న కార్యక్రమమునకు తల్లిదండ్రులు శివరామకృష్ణను తీసుకువెళ్ళారు.

ఆ రోజు, శివరామకృష్ణకు ''బాగా ఆకలిగా ఉంది, భోజనం పెడ్తారా?'' వంట ఇంట్లోకి రావచ్చా? అని అడగగా, పిల్లనిచ్చిన తల్లి ''రావొద్దు, కొద్దిసేపు ఆగు, భోంచేద్దువుగాని'' అన్నదట. ఆ మాటతో ఇతని మనసు మారిపోయి, తీవ్ర వైరాగ్యముతో ఇల్లువదలి బహుదూర తీరాలకు వెళ్ళెను. ఆ ఒక్కమాట వారిలో మార్పు తెచ్చి ఇల్లు విడిచారు.
తీవ్ర వైరాగ్యంతో సత్యాన్వేషణకై పరిభ్రమిస్తూ, భిక్షకు వెళ్ళి, తన దోసిటితోనే భుజించి, మనోమందిరంలో, పరమాత్మను ప్రతిష్టించి, పూజించి శివ మానసిక పూజ'' అనే మానసిక పూజను కీర్తనలో రచించారు. ఈ కీర్తనలో మానసిక పూజ వివరించారు.

కామకోటి పీఠశంకరాచార్యులు, ''ప్రథమ శివేంద్ర సరస్వతి స్వాములవారి శిష్యుడై సేవించెను. వీరిని చూడగానే - స్వామి ''సదాశివా'' అని పిలిచారుట. వారి వద్ద శిష్యరికం చేస్తూ ఎందరో పండితులను ఓడించి వ్యాసభగవానుని బ్రహ్మ సూత్రములకు, పతంజలి మహర్షి యొక్క సూత్రములకు భాస్యము రచించారు. జ్ఞాని ఆంతరంగిక అనుభూతి తెలుపు ''ఆత్మ విలాసము'' అను 65 శ్లోకముల గ్రంథము రచించారు. తమ రచనలన్నీ గురు పాదాలకు అంకితం చేశారు.

వీరి జీవితం ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్క కీర్తన ''పరమహంసగురు'' అని గురు నామాన్ని చివరపెట్టి రచించారు. ఇటువంటి మహనీయుల చరిత్ర చదివితేనే చాలు పుణ్యము లభించును. వీరి జీవిత సంఘటన వివరిస్తూ వీరు రచించిన కీర్తనలు వ్రాశాను. వీరి తల్లిదండ్రులు తిరుచునాపల్లి సమీపమున, కావేరీ నదీతీరాన, నేరూరు అనే గ్రామములో స్థిరపడిరి. ఇచట శివాలయము, బిల్వ వృక్షము, ప్రకృతి శోభతో ఉండును.

తీవ్ర వైరాగ్యముతో, గురు సన్నిధానమున అనేక పండితులతో వాదించి ఓడించగా, వారంతా ఈర్ష్యతో వీరిపై లేనిపోని ఫిర్యాదులు చెప్పగా ''మౌనాన్ని'' పాటించమన్న గురు ఆదేశంతో మౌనము పాటించెను.

గురువువద్ద అనుమతితో ''వివస్త్రయై, పసిబిడ్డవలె'' యాత్ర సాగించారు. అపుడు ఈ కీర్తన రచించారు.

పల్లవి: బ్రహ్మైవాహాకిం సద్గురు కృపయా బ్రహ్మేవహ ||
చరణము: బ్రహ్మైవాహం కిలగురుకృపయా
చిన్మయబోధానందఘనంతత్‌
శ్రుత్వం, తైకనిరూపితమతులం
సత్యసుఖంబుధి సమరస మనఘమ్‌ ||

ఇలా మొత్తం నాలుగు చరణాలు రచించారు. వీరు కీర్తనలన్నీ సంస్కృతంలోనే రచించారు.

భావము: నేనే బ్రహ్మమును, సద్గురు కృపచే నేనే బ్రహ్మమునై ఉన్నాను. ఇలా నాలుగు చరణములలో బోధించారు.
పల్లవి: పూర్ణ బాధాహం - సదానంద ! పూర్ణభాజుహం
అనుపల్లవి: వర్ణాశ్రమాచార కర్మాతి దూరోహమ్‌ ! స్వర్గమదఖిలవి కారగోహమ్‌ ||పూర్ణ||
చరణము: ప్రత్యగాత్మాహం ప్రవితత సత్యఘనోహం
శ్రుత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహాం
నిత్యోహమభయోహమద్వితీయోహం !!

ఇలా ఐదు చరణాలు రచించారు. ఒకసారి కావేరీ నదీతీరంలో సమాధిస్థితిలో ఉండగా పెద్దవర్షం, వరద వచ్చి ప్రజలు లేచిరండి అని ఎంత చెప్పినా సమాధి స్థితిలోనే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఒక నెల తర్వాత రైతు ఇసుక తవ్వి బండికెత్తుతుంటే పాఱకు రక్తపుచారలు కనిపించగా మెల్లగా తవ్వి ఇసుకను తొలగించగా శ్రీ స్వామివారు పున్ణదర్శనమొసగి నవ్వుతూ తన స్థితిని పై కీర్తనలో రచించారు.

భావము : నేను జ్ఞాన స్వరూపుడను. బ్రహ్మమును నేనే అనే భావముతో రచించి, నడుస్తూ వెళ్ళిపోయారట.

వీరిని- అవధూత, పరమహంస అని తెలియక అజ్ఞానులు పిచ్చివాడని ఎగతాళి చేసేవారు. పిల్లలు రాళ్ళేసి కొట్టేవారు. ఒకనాడు కావేరీ తీరంలో సమాధి నుండి మేర్తాలం జలపాతం నుండి తిరునల్వేలికి వస్తుంటే ఒక కట్టెల కొట్టువాడు ''ఓ కొయ్యబమ్మ, ఈ కట్టెల మోపు మోయమన్నాడు. అలాగే మౌనంతో మోసారు. ఈ మహౄయోగిని, ఎగతాళి చేసినందుకు ఆ కట్టెలమోపు అగ్నికి ఆహుతయ్యింది.

ఒక చాకలివాని నాలుకపై తన అమృతహస్తంతో అక్షరాలు వ్రాస్తే చాకలి వేదమంత్రాలు ఉచ్చరించెను అపుడు వీరిని నిందించిన బ్రాహ్మణునికి జ్ఞానోదయమై జ్ఞానబోధ చేయమని ప్రార్థించాడు.

కీర్తన: చింతానాస్తికిలాతేషాం ||చింతానాస్తికల||
చరణములు: శమదమకరుణా సంపూర్ణానాం
సాధుసమాగమ సంకీర్ణానాం ||చింత||
: కాలత్రయ జితకందర్పనా ! ఖండిత సర్వేంద్రియాదర్పణాం ||చింత||
: పరమహంస గురుపద చిత్తానాం బ్రహ్మానందామృత మత్తానాం ||చింత||
భావం: చింతయే లేదు వారికి, ఇంద్రియములు అరికట్టినవారికి మనసును నిగ్రహించిన వారికి దయార్ద్ర హృదయములకు, మహాత్ముల సంశయము బడసినవారికి, చింతయేలేదు, ఇలా బోధించారు.

ఒక ముస్లీం కత్తితో స్వామివారి చేయి నరికాడు. కానీ వారికి దేహ స్పృహ లేదు. ఎవరో చెపితే, రెండో చేత్తో ఆ చేయిని తాకారుట. అది మామూలుగా వచ్చిందట.

పాము కాటుకు గురైన ఒక పెళ్ళికూతురికి ప్రాణదానం చేశారుట. ఇలా మహిమాన్వితులు, ఎన్నో మహిమలు చేశారుట.

సదాశివ బ్రహ్మేంద్రస్వామివారి దివ్య కీర్తనలు
1. పల్లవి: స్మరవారం వారం చేత | స్మరనందకుమారం
చరణం: ఘోషకు చీరల యో ఘృతచోరం ! గోకుల బృందావన సంచారమ్‌ ||స్మర||
వేణురవామృతపానకిశోరమ్‌ ! సృష్టి స్థితిలయహేతు విహారమ్‌ ||స్మర||
పరమహంస హృత్పంజరకీరం పటు తరధేనుక బక సంహారమ్‌ ||స్మర||
భావం: చిత్తమా! నందకిశోరుని, గోపికల గృహములలో పాలు, వెన్న దొంగిలించుకుని, గోకుల, బృందావన విహారీ, వేణు సుధారసపానము నిత్యముగ్రోలువాని, సృష్టిస్థితిలయాదులు నడుపువాని, మహాత్ముల పరమహంసల హృదయ పంజరములందు చిలుకయై చరించువాని, ధేనుకాసుర, బకాసుర రాక్షసుల దునిమినవాని, నందకిశోరుని స్మరింపుము.

2. పల్లవి: నహిరేనహి శంకాకాచిత్‌ ||నహిరే||
చరణము: అజమక్షర మద్వైతమనంతం
ధ్యాయంతిబ్రహ్మపరంచరితం ||నహిరే||
యేత్యజంతిబహుతరపరితాపం
యేభజంతి సచ్చిత్సుఖసరూపం ||నహిరే||
పరమహంసగురుభణితంగీతం
యేపఠన్తినగమార్థ సమేతం ||నహిరే||
భావం: సచ్చిదానంద రూప పరమాత్మను, సంసార పరితాపము త్యజించి భజించువారికి సందేహము, సంశయము లేదు.

3. పల్లవి: మానససంచరరే బ్రహ్మణిమానస సంచారరే!!
చరణం: మదశిఖిపింఛాలంకృతచికురే మహనీయ కపోల విజిత ముకురే ||మానస||
శ్రీరమణీ కుచదుర్గవిహారే సేవక జనమందిర మందారే
పరమహంసముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే ||మానస||
భావం: శిఖిపించమౌళిని, భక్తుల కల్పవృక్షము, పరమహంసలీల దివ్యప్రకాశమై వెలుగువాని, వేణువు మధుర నాదము పలికించు శ్రీకృష్ణ పరబ్రహ్మములలో సదా రమించు - ఓ మనసా!

4. పల్లవి: పిబరేరామరసమ్‌ రసనేపిభరే రామరసమ్‌ ||
చరణం: దూరీకృత పాతక సంసర్గమ్‌ ! పూరిత నావిధ ఫలవర్గమ్‌.
జననమరణ భయశోకవిదూరమ్‌ ! సకల శాస్త్ర నిగమాగమసారమ్‌ !!
పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పవిత్రీకృత పోషణమ్‌ !!
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతమ్‌ !!
భావం: స్వరపాపహరం, జనన మరణ భయశోక సర్వజగత్‌ పాలిని, పవిత్రనామమైన అమృతమును, పానము చేయుము. శుక, శౌనక, కౌశికులు గానము చేయు పరిశుద్ధ పరమహంసలు గానము చేయు రామనామామృత పానము చేయుము - ఓ మనసా!

5. పల్లవి : క్రీడతివనమాలీ గోష్ఠే క్రీడతి వనమాలీ !!
చరణం : ప్రహ్లాద పరాశర పరిపాలే ! పవనాత్మజ జాంబవదనుకూలే ||క్రీడ||
పద్మాకుచ పరిరంభణశాలీ! పటుతర శాసిత మాలిసంమాలీ ||క్రీడ||
పరమహంస వర కుసుమసుమాలీ ! ప్రణవప యోరుహగర్భకపాలీ ||క్రీడ||
భావం: వనమాల ధరించువాడు, ప్రహ్లాద పరాశరులను పరిపాలించువాడు, హనుమంత, జాంబవంతులను బ్రోచువాడు, లక్ష్మీదేవిని కౌగిలించినవాడు, మాలి, సుమాలి, అను రాక్షసులను దునిమినవాడు, ప్రణవ పద్మమున ఆసీనుడైనవాడు, తన మెడలో హారములో - దారమున పూసలవలె పరమహంసలు ఏకమై నిలిచి యున్నారో అట్టి శ్రీకృష్ణుడు, గోకులమున వనమాలియై క్రీడించుచున్నాడు. వీరు రచించిన ప్రతి కీర్తన, జనన మరణ భయాశోకవిదూరమైన ధ్యాన శ్లోకములు.

6. పల్లవి: చేత్ణ శ్రీరామం చిన్తయ జీమూత శ్యామం ||చేత||
చరణం: అంగీకృత తుంబుర సంగీతం ! హనుమ మద్గవ యగవాక్ష సమేతం ||చేత||
భావం: ఓ చిత్తమా! మేఘ శరీరి శ్రీరాముని చింతింపుము. తుంబుర సంగీతమును ఆమోదించువానిని, హనుమ, గవయ, గవాక్షులతో కూడినవాని, నవరత్నములు శిరోజములో పొదగబడినవానిని, లేతతుల సీహారము ధరించిన వానిని, పరమహంసల హృదయ వెలుగును, చరణధూళిచే మునిపత్ని జపవిమోచనము చేసిన వానిని, శ్రీరాముని చింతింపుము, ధ్యానింపుము.

కొన్ని కీర్తనలు, భావము క్లుప్తముగా వ్రాశాను. అనేక కీర్తనలు రచించిన పరమహంస అవధూత సమాధి స్థితిడగుటకు, 'నేరూరు''కు చేరి, తన భక్తులకు ఆత్మబోధ జేసి - ''తాను సమాధి నొందిన తరువాత, భూస్థాపితం చేసి అచటి బిల్వమొక్కను, నాటి కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగమును తెస్తాడని, దానిని అచట ప్రతిష్టించి రోజూ పూజించండి'' అని చెప్పి కళ్ళు మూశారు. భక్తులందరు శోకముతో ''మాకు బ్రహ్మమును చేరే మార్గము బోధించమన్నారు.'' అపుడు బలవంతాన కళ్ళు తెరచి ఈ కీర్తన వ్రాశారు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)