మనబడి
ఒక తెలుగు వాలెడిక్టోరియన్ తో ముఖాముఖి


డల్లాస్ ఏరియాలోని కొపెల్ హైస్కూల్ లో 2016 కి గాను 780 మంది పిల్లలలో మొదటి ర్యాంక్ సంపాదించిన మన తెలుగు అమ్మాయి పూజ మారెళ్ళ. క్రింది సంభాషణ కొంత తెలుగులోను, కొంత ఆంగ్లంలోను జరిగినా, మన పత్రిక కోసం, పూర్తిగా తెలుగులోకి తర్జుమా చెయ్యడం జరిగింది.

పత్రికా విలేఖరి: పూజ, నీ గురించి మా పాఠకులకు చెబుతావా?

పూజ మారెళ్ళ: నా పేరు పూజ. నా తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, పురుషోత్తం మారెళ్ళ. అమ్మ, నాన్నలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్థులు. నేను న్యూ జెర్సీలో పుట్టి, ఒకటో ఏడు నుంచి కొపెల్ లో ఉంటున్నాను. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. చెల్లి పేరు ప్రియ, ఏడో తరగతి చదువుతోంది. తమ్ముడు విష్ణు నాలుగో తరగతిలో ఉన్నాడు.

ప. వి.: తెలుగుతో నీకున్న అనుబంధం ఎలాంటిది, తెలుగు వారికి నువ్వు ఇప్పడివరకు అందించిన సేవలు ఏమిటి?

పూజ: సిలికానాంధ్ర వారి మనబడిలో చేరి నాలుగేళ్ళపాటు బాలకర్రి గారి దగ్గర తెలుగు రాయటం, చదవటం నేర్చుకున్నాను. డల్లాస్ ఏరియానుంచి మొదటి బ్యాచ్ లో ఉత్తీర్ణురాలినయ్యాను. తరువాత ఒక సంవత్సరం బాల గురువుగా వాలంటీర్ చేశాను. చెల్లికీ, తమ్ముడికీ అప్పుడప్పుడూ ఇంటిపనిలో సహాయం చేస్తుంటాను. డల్లాస్ లో జరిగిన తానా, నాట్స్ కన్వెన్షన్స్ ఇనాగరల్ బ్యాలే లకి కూచిపూడి డాన్స్ చేశాను. చాలా టాంటెక్స్ ఈవెంట్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్) లో డాన్సులు, పాటలు వంటి వాటిలో పాల్గొన్నాను. ఇంకా నాట్స్ కన్వెన్షన్ పత్రికకి ఒక తెలుగు గేయం కూడ రాశాను.

ప. వి.: అయితే నీకు కూచిపూడి లాంటి కళలలో కూడ ప్రవేశం ఉందా?

పూజ: ఆరేళ్ళ వయసునించి కూచిపూడి నేర్చుకుంటున్నాను. కళ్యాణి ఆవుల గారు నా గురువు గారు. ఒక నాలుగేళ్ళపాటు విశాల అవధానం, జానకి శ్రీనివాసన్ గార్ల దగ్గర సంగీతం కూడ నేర్చుకున్నాను కాని సమయం సరిపోక కొన్ని ఆక్టివిటీస్ మానేయాల్సివచ్చింది. సంగీతం అయితే పెద్దయ్యాక కూడ నేర్చుకోవచ్చని, డాన్స్ ఉంచి సంగీతం పోస్ట్ పోన్ చేశాను.

ప. వి.: మరి భారతీయ కళలు కాక పాశ్చాత్య కళలు కూడ నేర్చుకున్నావా?

పూజ: ఒక నాలుగేళ్ళపాటు పియానో, వయోలిన్, ఒక సంవత్సరం పాటు మిడిల్ స్కూల్ బ్యాండ్ లో ఫ్లూట్ కూడ వాయించాను కానీ, ఇందాక చెప్పినట్టు హై స్కూల్ కొచ్చేసరికి చాల ఫోకస్డ్ గా కొన్ని మాత్రమే చెయ్యగలం. అందుకనే ఇవన్నీ మానేయాల్సి వచ్చింది.

ప. వి.: హై స్కూల్ లో చదువు కాక, ఇంకా దేనికి సమయం కావలసి వచ్చేది?

పూజ: స్వచ్ఛంద సంస్థలకి సేవలందించడానికి, ఇంకా స్కూల్ లోని క్లబ్స్ కోసం చాల సమయం కేటాయించాల్సి వచ్చేది.

ప. వి.: నువ్వు ఏయే సంస్థలకి, క్లబ్స్ కి నీ సమయం కేటాయించేదానివి?

పూజ: నేను కొపెల్ సిటీ వారి "కీప్ కొపెల్ బ్యూటిఫుల్" సంస్థకి యూత్ బోర్డ్ మెంబర్ గా మూడేళ్ళు పని చేశాను. స్కాటిష్ రైట్ హాస్పిటల్ లో, బెయిలర్ హాస్పిటల్ లో వేసవి కాలంలో పని చేసేదాన్ని. అక్షయ పాత్ర యూత్ చాప్టెర్ కి ట్రెషరర్ గా ఉన్నాను. స్కూల్ లో స్పానిష్ క్లబ్ కి ప్రెసిడెంట్ గా, చెస్ క్లబ్ కి ట్రెజరర్ గా కూడ ఉన్నాను. ఇవి కాక, ఇంకొన్ని క్లబ్స్ కి మెంబర్ని. ఈ ఆక్టివిటీస్ తో పాటు వేసవి కాలంలో రీసర్చికి కూడ కొంత సమయం పోయేది.

ప. వి.: ఎక్కడ రీసర్చి? ఎందులో?

పూజ: ఒక వేసవి కాలం యూ టీ డీ లో నానో ఎక్స్ ప్లోరర్ గా “కార్బన్ నానోట్యూబ్ ఫైబర్" ల మీద రీసర్చి చేశాను. ఇంకో వేసవి కాలం టెక్సాస్ టెక్ యూనివర్సిటీ లో వెల్చ్ సమ్మర్ స్కాలర్ గా "పెప్టైడ్ సింథెసిస్" మీద రీసర్చి చేశాను.

ప. వి.: చాల బావుంది. ఐతే మా చిన్నారి పాఠకులకి స్ఫూర్తినివ్వడం కోసం నీ SAT, ACT లాంటి స్కోర్లు కూడ చెప్తావా?

పూజ: నాకు SAT లో 2360/2400 వచ్చింది. ACT లో 36/36 వచ్చింది. ఇప్పటివరకు తీసుకున్న 8 ఏపీ ఎక్సాంస్ అన్నింటిలో 5/5 వచ్చాయి (కంప్యూటర్ సైన్స్, ఫజిక్స్ లతో సహా). నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ ఫైనలిస్ట్ ని అయ్యాను. ప్రెసిడెన్షియల్ స్కాలర్ గా కూడ నామినేట్ అయ్యాను.

ప. వి.: హై స్కూల్ లో ఏపీ, ఐబీ అని రెండు ఉంటాయి కదా, వాటిలో నువ్వు ఏది చేశావు? ఏది చెయ్యమని మన చిన్నారులకు సలహా ఇస్తావు?

పూజ: కొపెల్ హై స్కూల్ లో ఏపీ, ఐబీ రెండూ ఉన్నాయి, రెంటిలో ఏది చేసినా ఫర్వాలేదు. తొమ్మిదో తరగతిలోనే ఏపీ మొదలవుతంది. కానీ ఐబీ మాత్రం పదకొండో తరగతిలో మొదలవుతుంది. నేను పదో తరగతికల్లా ఆరు ఏపీ కోర్సులు చేసేశాను. ఏపీ కంటిన్యూ చేస్తే నాకు చెయ్యడానికి కోర్సులు మిగిలేవికావు. అందుకని నా కేస్ లో ఐబీ పనికి వచ్చింది. "బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్" అన్నట్టు నేను మొత్తం తొమ్మిది ఏపీ కోర్సులతోను, ఒక ఐబీ డిప్లొమా తోనూ గ్రాడ్యు ఏట్ అవగలుగుతున్నాను.

ప.వి.: నువ్వు ఏయే కాలేజీలకి అప్లై చేశావు? ఎక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నావు?

పూజ: నేను ముఖ్యంగా "BS/MD" ప్రోగ్రాంస్ కి అప్లై చేశాను. ఒక అరడజను అడ్మిషన్స్ వచ్చాయి. వాటిలో UT-PACT కి వెళదామని నిశ్చయించుకున్నాను. UT-PACT ఒక ఆక్సెలరేటెడ్ కంబైండ్ మెడికల్ ప్రోగ్రాం (3 ఏళ్ళు UTD లో, 4 ఏళ్ళు UT Southwestern లో). ఏడేళ్ళల్లో డాక్టర్ అయిపోవచ్చు. పైగా, మొదటి మూడేళ్ళు ఫుల్ రైడ్ వస్తుంది, చేతినించి పైసా కూడ కట్టఖ్ఖర్లేదు. తర్వాత నాలుగేళ్ళు టాప్ టియర్ మెడికల్ స్కూల్ కి గ్యారంటీడ్ అడ్మిషన్. ఇందులో అడ్మిషన్ ఐవీ లీగ్స్ కన్నా కాంపిటీటివ్ గా ఉంటుంది. డాక్టరు కావాలనుకునేవాళ్ళకిది బంగారంతో సమానం అని నా ఉద్దేశ్యం.

ప. వి.: తీరిక సమయాల్లో నువ్వు ఏం చేస్తుంటావు?

పూజ: స్నేహితులతో గడపటం, వీడియో గేములు ఆడుకోవటం, చెల్లి, తమ్ముళ్ళతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం.

ప. వి.: నీ గురించిగానీ, మీ ఫ్యామిలీ గురించిగానీ, ఇంకా ఏదైనా విషయంగానీ, విశేషంగానీ చెప్పదల్చుకున్నావా?

పూజ: మా అమ్మ, నాన్న, తమ్ముడు, "ఇట్ హాపెన్స్" అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ లో ఆక్ట్ చేశారు. యూ ట్యూబ్ లో ఉంటుంది, కావాలంటే మీ పాఠకులు చూడచ్చు, ఒక గంట సినిమా.

ప. వి.: చివరగా, భావి హై స్కూల్ విద్యార్థులకు నువ్విచ్చే సలహా ఏమిటి?

పూజ: నా చిన్నప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ చదివినా, లేక మా అమ్మా నాన్నలు చెప్పగా విన్నా, భయం వేసేది. నేనూ ఇవన్నీ చెయ్యాలా, ఎంత కష్టపడాలో అని అనుకునేదాన్ని. కానీ, ఇవన్నీ ఒకటొకటిగా చేస్తూ పోవడమే. నేను ఒకప్పుడు పెడెస్టల్ మీద పెట్టి చూసిన వాళ్ళు చేసినవి దాదాపు అన్నీ, నేను కూడ సాధించుకొస్తుంటే ఆనందం వేసేది, ఉత్సాహం కూడ వచ్చేది. ఒక చైనీస్ సామెత గుర్తొస్తోంది, "ఎంత పెద్ద ప్రయాణం అయినా మొదలయ్యేది ఒక అడుగు తోనే" అని. అలా ఒక దాంతో మొదలుపెట్టి ఒక్కొక్క పనీ చేస్తూ పోవడమే. ఆ చేసేపనికి ఎంత న్యాయం చెయ్యగలిగితే అంత మంచిది.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)