కథా భారతి
విదేశంలో వేణుగానం
- పి. కె. జయలక్ష్మి, M. A. ,Ph. D. ,

సోఫియా విశ్వవిద్యాలయం, సోఫియా, బల్గేరియా

“వావ్! రియల్లీ యూ ఆర్ సో లక్కీ యార్! కంగ్రాట్స్ ఇంతకీ ఎప్పుడు బైలుదేరేది?” ప్రిన్సిపాల్ రూమ్ లోంచి చేతిలో కాగితం తో బైటకి వస్తున్న వేణు ని అప్పటికే వార్త తెలుసుకున్న కొలీగ్స్ అభినందనలతో ముంచెత్తేశారు.

“ఎంత మంచి అవకాశం. అందరికీ రమ్మంటే వస్తుందా? నీ తెలివితేటలకి, క్రియేటివిటీకి సరయిన గుర్తింపంటే ఇదే.. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని కాస్త గుర్తు పెట్టుకో వేణూ”! సందడి చేశాడు సీనియర్ లెక్చరర్ ముకుందరావ్.

“ఇంతకీ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో? వివరాలు కనుక్కున్నవా?” ఆరా తీశారు తెలుగు మేడమ్ వసంత. “ఇంతకీ ఫేమిలీ తోనేనా వెళ్ళడం?” నవ్వుతూ అడిగింది మాథ్స్ లెక్చరర్ మణిమాల.

“ ఏదీ, ఇప్పుడేగా తెలిసింది. ఇంకా తనకి చెప్పందే?” నవ్వుతూ జవాబిస్తున్న వేణు ని సమర్ధిస్తూ “ఎంతా? నాలుగు నెల్లే కదా? ఇట్టే గడిచిపోతాయి” నవ్వాడు బోటనీ హెడ్ నీలకంఠం.

“యూరోప్ అంతా చూస్కుని రండి వేణూ గారూ ..ఆల్ ద బెస్ట్” అంటూ బెల్ మోగడంతో క్లాసులకి వెళ్లిపోయారంతా..

“కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం లో భాగంగా మన ప్రభుత్వం నిన్ను యూరోప్ లో పేరున్న విశ్వవిద్యాలయం లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పంపడం నిజంగా గర్వించదగ్గ విషయం.. వేణూ! అన్నట్టు భారత విద్యా విభాగం లో ఎక్కువ శాతం ఆడపిల్లలేనట. ఇందాకే నెట్ లో చూసా ఇక్కడ మెన్స్ కాలేజ్ లో బోర్ అయిపోయిన నీకు .. పండగే పండగ. రొట్టె విరిగి నేతి లో పడ్డం అంటే ఇదే మరి. నిన్ను చూసి ఎట్రాక్ట్ అయిపోయి ఎంత మంది నీ వెనకాల ఇండియా వచ్చేస్తారో?” కన్ను గీటుతూ నవ్వుతున్న మధుని చూస్తూ “ ఏంటి ?నాలుగు నెల్లకే ? మళ్ళీ వీళ్ళ మధ్య కి రావాల్సిందే, పద కేంటీన్ కి వెళ్దాం.” నవ్వుకుంటూ ఇద్దరూ బైటికి నడిచారు.

ఇంటికి వెళ్ళాక శశి కి చెప్తే “ హార్టీ కాంగ్రాట్స్ స్వీట్ హార్ట్! నేనూ నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. మూడు నెల్ల పాటు అహ్మదాబాద్ హెడ్ ఆఫీస్ లో పోస్ట్ చేశారు నన్ను. తర్వాత మేనేజర్‌గా ప్రమోషన్. పోనీ లే ఇద్దరం మంచి కాజ్ మీద వేర్వేరు ప్లేసులకి వెళ్తున్నాం. వైబర్ ఉండగా చెంత, వై చింత? రోజూ మాట్లాడుకోవచ్చు ఎంచక్కా”. . అంటూ ఆలింగనం చేస్కున్నారు “ఐ మిస్ యూ డియర్” అనుకుంటూ! వేణు కి యూరోప్ అద్భుతంగా అన్పించింది. పూర్తిగా కొత్త వాతావరణం-హిమపాతం, చలి, దానికి తగినట్టు ఆహార విహారాలు, యువత వివాహ రహిత సహజీవనం, వగైరా వగైరా! క్లాస్ ఉన్నప్పుడు వెళ్తే సరిపోతుంది యూనివర్సిటీ కి. వారానికి నాలుగు రోజులే క్లాస్ . మిగిలిన టైమ్ లో చుట్టుపక్కల ప్రదేశాలు, ఉద్యానవనాలు, చర్చ్ లు చూడ్డమే కాలక్షేపం. స్టూడెంట్లు ప్రొఫెసర్లని పేరుపెట్టి పిలవడం విడ్డూరంగా అన్పించింది వేణూ కి. “వేణూజీ” అంటూ ఎంతో అభిమానంగా తమ సాంప్రదాయిక వంటకాలని రుచి చూపించే కొలీగ్స్, విద్యార్ధుల సాంగత్యం లో ఇండియా వదిలి వచ్చానన్న బెంగ దూరమయింది. రోజూ శశి తోను, ఫ్రెండ్స్ తోనూ వైబర్ లో కబుర్లు ఉండనే ఉన్నాయి.

యూనివర్సిటీ హాస్టల్ సౌకర్యంగా ఉండటంతో చెయ్యి కాల్చుకునే బాధ తప్పింది. కావలిసినవి తినడం, తిరగడం, టైమ్ దొరికితే హాస్టల్ ఎదురుగా ఉన్న పార్క్ లో కూచుని అందరినీ గమనించడం ఇదే దినచర్య వేణుకి. మధ్యాహ్నం మూడు గంటలయ్యేసరికి, వృద్ధులు, యువతి యువకులు, ప్రామ్స్ ల్లో పసిపిల్లల్ని తీస్కోని తల్లిదండ్రులు పార్క్ కి వస్తారు. చిన్నపిల్లలు పావురాలతో కల్సి ఆడడం, సైకిల్ తొక్కడం, బంతాటలు, కేరింతలు..సందడి సందడి. ఒక పక్క పెద్దవాళ్ళు వైన్ తాగుతూ, చిప్స్ తింటూ, సిగరెట్లు ఊదేస్తూ బిజీ , మరో పక్క యువత చుంబనాలు, ఆలింగనాలతో తమదైన లోకం లో బిజీ. ఇక్కడంతా స్వేచ్చా జీవనం. కొందరు వేణుని చూసి ఇండియన్ అని గుర్తుపట్టి నమస్తే అని పలకరించడం, మరి కొందరు చిరునవ్వులు చిందిస్తూ అభివాదం చేయడం చేస్తూ ఉంటారు. భాషా సమస్య కారణంగా వేణుకి ఎవరితోనూ సంభాషించే అవకాశం లేదు.. అక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు. వేణుకి యూరోపియన్ భాష రాదు.

ఒకరోజు ఎప్పటిలాగే పార్క్ కి వెళ్ళిన వేణుకి ఇరవయ్యేళ్ళ యువతి ఎవరితోనో ఆంగ్లం లో మాట్లాడుతూ కన్పించింది. ఆ అమ్మాయి ని అంతకు ముందు ఎప్పుడూ ఈ పార్క్ లో చూడ లేదు. అందంగా ఉండటమే కాకుండా ఆంగ్ల పరిజ్ఞానం కూడా ఉండటం తో ఆమె చాలా ఇంటరెస్టింగ్ గా అన్పించింది వేణు కి. ఎలాగైనా పరిచయం పెంచుకుంటే బాగుండు అనుకుంటూ ఆ అమ్మాయి వైపే తదేకంగా చూస్తున్నా ఎంతకీ వేణు వైపు చూడదే! మంచి కనుముక్కు తీరు తో పాటు చక్కని శరీర సౌష్టవం. పై నించి కింది దాకా నలుపు రంగు డ్రెస్సు, బూట్లు. ఈ అమ్మాయి పింక్ చీర కట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా.. ఈ లోగా పిల్లలు విసిరిన బంతి ఆమె భుజాన్ని తాకి ఊహల్లో తేలిపోతున్న వేణు కాళ్ళ దగ్గర పడింది. అప్పుడు చూసింది వేణు వైపు అలవోకగా. అవకాశాన్ని వదులుకోకుండా చిన్నగా నవ్విన వేణు వైపు ఆశ్చర్యంగా చూసి ఒక్క నిమిషం ఆలోచించి తానూ నవ్వింది. కాసేపటికి టైమ్ చూస్కుంటూ తను మాట్లాడుతున్న పెద్దావిడకి బై చెప్పి ముద్దు పెట్టుకుని మళ్ళీ వేణు వైపు చూసి సన్నగా నవ్వుతూ చెయ్యూపి వెళ్లిపోయింది.

కాసేపాగి వేణు ఆ పెద్దావిడ దగ్గరకెళ్లి తనని పరిచయం చేస్కోని ఆ యువతి వివరాలు అడిగితే “ఆ పిల్ల పేరు రాదోస్తీనా. ఇక్కడికి దగ్గర్లోనే వాళ్ళిల్లు. హోటల్లో పని చేస్తూ డిగ్రీ చదువుకుంటోంది, వాళ్ళ అమ్మ, నేను స్నేహితులం. అప్పుడప్పుడూ ఇలా పార్క్ లో కల్సి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటుంది” అని నవ్వుతూ చెప్పిందామె.

ఎందుకో తెలియదు గాని ఆ అమ్మాయి తన కి చాలా కావలిసిన మనిషిలా అన్పించింది వేణు కి మొదటి చూపు లోనే. మళ్ళీ ఎప్పుడు చూస్తానో? అనుకుంటూండగానే నాల్రోజులు పోయాక మళ్ళీ పార్క్ లో కన్పించింది రాదోస్తీనా. చాలా సంతోషమేసింది వేణుకి. ఈసారి తానే వచ్చి చేతులు జోడించి నమస్తే అంటూ తన పేరు, వివరాలు చెప్పి పరిచయం చేస్కుంది. వేణు గురించి కూడా అడిగి తెలుసుకుంది..తనకి ఇండియా అంటే చాలా ఇష్టమని, నాలుగేళ్ల క్రితం తన భరతనాట్య గురువు తో తమిళనాడు వచ్చానని, అప్పటి నించి ఇష్టం ఎక్కువైపోయిందని చెప్పింది. వినాయకుడు, శివుడు తన ఆరాధ్య దైవాలని, శాస్త్రీయ సంగీతం, యోగాభ్యాసం, పూజ పునస్కారాలంటే మక్కువ ఎక్కువ అని మెళ్ళో రుద్రాక్ష మాలని చూపిస్తూ చెప్పింది రాదో. మిగిలిన యూరోపియన్స్ కి భిన్నంగా తానూ శాకాహారినని, ధూమపానం గిట్టదని కూడా చెప్పేసరికి వేణుకి చాలా ఆశ్చర్యమేసింది. మళ్ళీ మర్నాడు కలుద్దామని సెలవు తీసుకున్నారిద్దరూ.

సాయంత్రం ఆరవ్వగానే కిటికీలోంచి రాదో రావడం చూసి తను కూడా పార్క్ కి వెళ్ళడం వేణు కి అలవాటుగా మారింది. ఇద్దరూ కాఫీలు తాగుతూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజు వేణు ఆమెని “ అవునూ, ఇక్కడ అంతా పదహారు, పదిహేడేళ్లకే రిలేషన్ షిప్ లోకి వెళ్తారు కదా? మరి నీకు బోయ్ ఫ్రెండ్ లేరా? అని అడిగేసరికి “ లేడు.. బోయ్ ఫ్రెండ్ తో కల్సి ఉండడం, తర్వాత ఏదో గొడవలతో విడిపోవడం ఎందుకో ఇష్టం లేదు. అయినా నాకు నచ్చిన వాడు ఇంత వరకు దొరకలేదు.” అంది వేణు కళ్లలోకి చూస్తూ. మనసంతా ఏదో లా అయిపోయింది వేణుకి. హమ్మయ్య, బోయ్ ఫ్రెండ్ లేకపోవడం ఎంత మంచిదయిందో? ఉంటే తనతో ఇలా సమయం గడిపేదా? తను చాలా లక్కీ. అనిపించడమే కాదు రూమ్ కి వెళ్ళీవెళ్ళగానే ఫోన్ చేసి బెస్ట్ ఫ్రెండ్ మధు తో ఈ సంగతులన్నీ షేర్ చేసుకునే వరకు తోచలేదు వేణుకి.

ఒకరోజు మధు దగ్గర్నించి ఫోన్. “హలో వేణూ.. ఏంటి ఈ మధ్య చాలా బిజీ అనుకుంటా తమరు. రాదో మేడమ్ తో విహారాలా? ముందే చెప్పాగా..నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టే అని. నాకు చాలా కుళ్లుగా ఉంది నీ సల్లాపాలు వింటుంటే”.

”అబ్బా అంతేమీ లేదులే గాని , ఏదో టైమ్ పాస్. నీకో సంగతి తెల్సా తనకి బోయ్ ఫ్రెండ్ లేడట. అందుకే నాతో స్పెండ్ చేస్తోంది. అంతే కాదు మన పద్ధతులన్నా, కట్టుబాట్లన్నా చాలా ఇష్టమట.”

“ఇంకేం. వదలకు.ఆల్ ద బెస్ట్” అని ఒకటే నవ్వులు.

అవతలి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అతిగా జోక్యం చేసుకోక పోవడం, ఆరాలడగకపోవడం రాదో సుగుణాలు.. తన ముందే వేణు సెల్లో శశి తో మాట్లాడుతున్నా అడిగేది కాదు ఎవరని. వేణు కూడా తన కుటుంబ విషయాలు ఎప్పుడూ ఆమె దగ్గర ప్రస్తావించలేదు. ఇద్దరూ కలిసి చాలా చోట్లకి వెళ్ళేవారు. అందరూ ఆశ్చర్యంగా చూసేవారు ఈ జంటని. బైట ఎక్కడికి వెళ్ళినా యూరోపియన్ భాష లోనే మాట్లాడాలి, వేణుకి ఇంగ్లీష్ లోనూ, అవతలి వాళ్ళకి యూరోపియన్ లోనూ వివరిస్తూ రాదో దుబాసీ పనిచేసేది. నాకు తెలుగు నేర్పరూ అనడిగింది ఒకసారి. తెలుగు మాటల్ని యూరోపియన్ లిపి లో వ్రాసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న రాదో ని చూస్తే ముచ్చటేసేది వేణుకి. రెన్నెల్లకే చాలా దగ్గరయ్యారిద్దరూ.

ఒక రోజు మాటల్లో “భలే తెల్లగా ఉంటారు కదా మీరంతా! మా దేశస్తులకి పిచ్చి మీ రంగంటే” వేణు మాటలకి నవ్వుతూ “ రంగుదేముంది. మాకేం గొప్పగా అన్పించదు. నిజానికి నాకు మీ రంగు చాలా నచ్చుతుంది. సహజంగా అన్పిస్తారు. అలాగే జుట్టు కూడా. మాది ఎర్ర జుట్టు. భారతీయులే అందంగా ఉంటారు నా దృష్టిలో ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతీయులు నిజమైన అందగాళ్ళు” అంది కాస్త సిగ్గు పడుతూ.

“అబ్బో,.విషయం చాలా దూరం వచ్చింది. పర్లేదే అన్పించింది వేణుకి మనసులో. శశికి ఇవన్నీ చెప్తే రియాక్షన్ ఎలా ఉంటుందో? అని కూడా అన్పించింది.

కాలం ఎవరికోసం ఆగదు. యూనివర్సిటీ లో వేణు ప్రాజెక్ట్ పూర్తికావొస్తోంది. ఇంకో పదిహేను రోజుల్లో వెనక్కి వెళ్లిపోవాలి. చెరగని చిరునవ్వు, చక్కని బోధన, మంచి సంస్కారాల కారణంగా డిపార్ట్ మెంట్ లో అంతా వేణుకి అభిమానులయిపోయారు. పైగా తను ఇండియన్ కావడం మరో ప్లస్ పాయింట్. అందరికీ బాధగా ఉంది.. వేణు ప్రయాణం తలచుకొని. మళ్ళీ ఇంకెప్పుడూ కలవం కదా అని తమ ఇళ్ళకి కొందరు, హోటళ్ళకి కొందరు పార్టీ అంటూ ఆహ్వానిస్తున్నారు. పదిరోజుల్నించి ఈ బిజీ లో పడిపోయి రాదో ని కలవడం కుదరట్లేదు. తన ప్రయాణం సంగతి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో అనిపించింది వేణుకి.

ఈ లోగాతానే ఫోన్ చేసింది. “కాసేపట్లో పార్క్ కి వస్తా.. మిమ్మల్ని మా ఇంటికి తీసుకు వెళ్తాను. మీకు చాలా ఇష్టమైనది కానీ మీరు ఊహించనిది నేను మిమ్మల్ని అడగబోతున్నాను. అది ఒక మధుర స్మృతిగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. దాంతోపాటు మీకో సర్ప్రైజ్ కూడా, వెయిట్ అండ్ సీ “ అని పెట్టేసింది. ఆశ్చర్యపోవడం వేణు వంతయ్యింది. మనసులో తనేమాలోచిస్తున్నదీ కనిపెట్టేసిందన్నమాట రాదో.. మొత్తానికి అసాధ్యురాలే! ఇండియన్ అమ్మాయిలకి ఇంత తెగింపు, గడుసుతనం ఎక్కడివి? ఎలాగూ వెళ్లిపోతున్నా కదా అడిగేస్తా. తన మనసులో ఎప్పటినించో ఉన్న కోరిక ఇవాళ తీరే అవకాశం దానంతట అదే వెతుక్కుంటూ వస్తోంది.. వేణు కి చాలా సంతోషంగా ఉంది.

దూరంగా రాదో పక్కనెవరితోనో మాట్లాడుతూ వస్తూ కన్పించింది. దగ్గరకి వచ్చి చెయ్యి కలుపుతూ “హాయ్. నాకివాళే తెలిసింది యూనివర్సిటీలో. వెళ్లిపోతున్నారట కదా త్వరలో. నాకు చెప్పాలనిపించలేదు కదా?” సన్నని కన్నీటి తెర. దగ్గరకి తీస్కోని ఓదార్చాలనిపించింది వేణుకి. కానీ ఈ లోగా “నేనొకటి అడుగుతానన్నాను కదా, దానికి ముందు సర్ ప్రైజ్ .. ఉండండి చూపిస్తా” అంటూ “ఏయ్ సంజయ్ ఇలా రా” అని పిలవడంతో చెట్టు పక్కనించి ఒక యువకుడు ముందుకి వచ్చి నమస్కరించాడు. “ఇతను మీ సౌత్ ఇండియన్. నాలుగేళ్ల బట్టి ఇక్కడ ఆనందమఠ్ లో యోగా గురువు. సంజయ్! ”. అని పరిచయం చేసి తిరిగి వేణు తో “సంజయ్ ని చూశాక, పరిచయం పెరిగాక ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. మీరొచ్చిన టైమ్ లోనే మా ప్రేమ మొగ్గ తొడిగింది. మీ స్నేహం వల్ల భారతీయ సంస్కృతి ని బాగా అర్ధం చేసుకున్నాను. సంజయ్ కూడా వీలయినంత ఎక్కువ టైమ్ మీతో గడపమని చెప్పేవాడు.. త్వరలో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు మీ భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలంటే చాలా గౌరవం. ఎప్పటికయినా ఇండియన్ని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని ఇండియా లో స్థిరపడాలి అనుకునే దాన్ని. నా లక్ష్యం నెరవేరుతోంది.” అంది నవ్వుతూ.

నోట మాట రాలేదు వేణు కి. “ఇక పోతే మిమ్మల్ని ఏదో అడుగుతానన్నాను ..గుర్తుందా? నన్ను చీరలో చూడాలని మీ కోరిక. అది నాకు తెలుసు. కానీ కట్టుకోవడం రాదు. నాకు కట్టుకోవడం నేర్పించాలి . ఇదిగో సంజయ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చీర. నేను చీర కట్టుకొని సంజయ్ వాళ్ళింటికి వెళ్లాలనుకుంటున్నా. మా అత్తగారింట్లో అంతా నన్ను మెచ్చుకునేలా తెలుగు తో పాటు సంస్కృతి, నైతిక విలువలు నేర్పినందుకు కృతజ్ఞతలు. మీ పరిచయం మరపురాని మధుర స్మృతి.” ప్రొఫసర్ వేణు మాధవి చేతిని ముద్దుపెట్టుకుంటూ ఆర్ధ్రంగా అంది రాదోస్తీనా.

ఇంతలో ఫోన్ ట్రింగ్ మంది. అవతల్నించి మధు “హాయ్ డియర్ వేణు మాధవీ! ఎప్పుడు భారతావనికి వచ్చెదరు? రాదో మాయలో పడి నీ ఇష్ట సఖి మధులత ని మరచితివా ..? త్వరగా ఏతెంచుము. ఇచ్చట నీ పతిదేవుడు శశికాంతుడు, మన కళాశాలవారు తమరి ఆగమనాభిలాషులై కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించుచుంటిరి”. అల్లరిగా నవ్వుతోంది.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)