ధారావాహికలు
రామ నామ రుచి
- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం

(గత సంచిక తరువాయి)

తే.గీ. వలసి నప్పుడు వచ్చి నా వద్ద నుండి
గొనుము మొగమాట పడకుండ కోర్కిదీర,
ఆ రఘుకుల వార్థి సుధాంశు నాజ్ఞ యిద్ది
దీని పాటించ నిన్ను ప్రార్థింతు’ ననుచు.

తే.గీ. అట్లె పూజారి వచ్చి నిన్నడిగి నపుడు
ధనముకై వెనుకాడక తనుపు మయ్య,
కూడ నీవేగి ఆతండు కోరి నన్ని
మంచి సరుకులు సంతలో నెంచి యిచ్చి.

కం. నీ ఖర్చులకై అసదృశ
మౌ ఖద్యోత ద్యుతిగల అశ్మంబుల వై
శాఖ క్షపాకర హిమ మ
యూఖ మనోజ్ఞముల కొన్ని యొప్పుగ నిత్తున్".

తే.గీ. నేను చెప్పిన వన్నియు నిరతి భక్తు
డర్చకునితోడ చెప్పంగ నాలకించి
దైవ సంకల్పమిది యని తలచి నంబి
వెచ్చముల తెచ్చుకొనుచుండె మెచ్చి మదిని.

కం. దేవుని సేవలు చేయుచు,
వే విధి భక్తుల తనుపుచు ప్రీతిని వారల్
జీవనములు సాగించిరి
శ్రీవైకుంఠపురవాస జిజ్ఞాసువులై."

తే.గీ. అనుచు జరిగిన విషయంబు నాంజనేయు
డటుల వివరించి, తిరిగి నా కిటుల పల్కె,
"దోషియా అర్చకుడు లేక దొంగ యగునొ!
చెప్పు యోజించి నిస్వార్థ చిత్తమునను.

తే.గీ. దోషిగాదని నమ్మిన దూఱ బోకు
మెవరి వద్దైన ఇకనుంచి యెన్నడైన;
అట్లె, నేను కనబడి మాట్లాడి నట్లు
తెలియనీయకు మెవరికి తెగటు పడుచు.

తే.గీ. పుండ్రమందున వజ్రాలు పోయినట్లు,
తస్కరుడు నంబి యని నీవు తలచినట్లు,
తెలియ నతడు సతియు వ్రీడ తలలు పగుల
గొట్టుకొందురు గాన వాకట్టు కొనుము"

తే.గీ. ఆంజనేయుని పలుకుల నమిత భక్తి
సంభ్రమాశ్చర్య సంయుత స్వాంతమునను
వినుచు నే సుంత చింతించు వేళయందు,
ఉన్నపాటున నభ్రంబు హుంకరించె.

తే.గీ. మొలిచి శంపాలతలు నింగి వెలుగుజేసె,
పెద్ద శబ్దంబుతో భువి దద్దరిల్లె,
మిన్ను మన్నును ఏకమై మిక్కుటముగ
కుండపోతగ వర్షంబు కురియ దొడగె.

తే.గీ. కండ్లు పూర్తిగా చీకట్లు క్రమ్ము కొనియె,
చెవులు మార్ర్మోగి గీపెట్టి చిల్లువడియె -
హడలి పోయి కొన్ని క్షణములైన పిదప
కండ్లు నులుమి కొంచెము చూడగలిగినాడ.

తే.గీ. ద్వార మందున నుండిన స్వామి లేడు,
మించు విభ్రాంతి నన్నావహించి, కనుల
నమ్మజాలక ముందుకు నడువబోయి
తూలి పడిపోతి స్పృహ కోలుపోయి.

ఉ. ఎన్నగ నెన్నిగంట లిటు లీ విధి నుంటినొగాని, నా హితుం
డన్నుననున్న నన్ను తన అంకతలానను జేర్చి నీళ్ళతో
క్రన్నన నా ముఖంబు తగ క్షాళన చేసి విశిష్ట సేవలన్
పన్నుచు నన్ను మేల్కొలిపి పారము ముట్టిన అత్తరంబుతో.

కం. నను కూర్చుండగ జేయుచు,
తనువును పొడిగుడ్డతోడ తడియారంగా
ననువుగ నొత్తుచు, జలమున్
కొనకొని త్రాగించి పల్కె కుతుకముతోడన్.

మ. "హెతుడా! నీకిపుడేమి సంభవిలె! నిన్నీరీతి నే కాంచగా
కతమేమయ్య! వివాహ కార్యములలో గాసిల్లి నే నుండుటన్
గత రాత్రంతయు విస్మరించితిని నిన్ కానంగ, ఈ ప్రొద్దునన్
వెత తోడం దిశలన్నిటన్ వెదకితిన్ వేమాఱు కంగారుగా.

ఉ. ఎందులకయ్య స్నేహితుడ! ఈ విధి నిక్కడ సోలినావు, నీ
చందము చూడగా నిశిని జాగరమున్నటు దోచె నాకు, నీ
డెందము డబ్బు డబ్బనుచు డిండిమ మట్టుల మ్రోగుచుండె, ని
ష్యందిత ఘర్మ సంయుత విషాద భయంకర మయ్యె వక్త్రమున్.

తే.గీ. అడరి ఎవరైన శోధింప నర్ధరాత్రి
గర్భగుడి కడప కడగి కడచిరేని
విశ్వరూపంబు చూపించి భీతిగొల్పు
మారుతాత్మజు డనుమాట మఱి ప్రసిద్ది.

కం. నీ మొగ మీక్షించిన ని
న్నా మారుతి భయము గొల్పెనని మది తోచెన్ -
ఏమిటికై నిశయందున
నేమఱి యిటు సొచ్చినాడ వీ గుడియందున్."

చం. అనుచును నన్ను మెల్లగ వయస్యు డుపాయము తోడ లేపి, చే
తిని నడుమందు బాసటగ తీర్పడ నిల్చుచు, వంటశాలకున్
కొని చని చేర్చి యొక్కెడను కూర్చొన బెట్టుచు, బల్మి నాలు గి
డ్డెనులు తినంగ జేసి, మఱి ’టీ’ నొక గ్లాసెడు త్రాగ జేయగన్.

తే.గీ. కొన్ని నిముషాలలో నాకు కొంత స్వస్థ
త గలుగ నది జూచి అతడు తనిసి పలికె,
"వింతగానుండె గాదె నేడింత ప్రొద్దు
పోయిననుగాని పూజారి మోము కనము.

తే.గీ. నిగమ ఘోషయు వినరాదు నియత విధిని,
తెల్లవారక పూర్వమే దేవళంబు
శుభ్ర మొనరించు నిల్లాలు చోద్యముగను
నేడు కనిపించ దేలకో! కీడు తోచె!

తే.గీ. ఇపుడు పదిగంటలును దాటె; నింత వరకు
గుడిని స్పృహదప్పి పడియున్న గూడ నిన్ను
పూజరియు గాని ఆతని పొలతి గాని
కానకుండుట కేమియో కారణమ్ము!"

తే.గీ. అనుచు నాతండు తిరిగి నన్నంత నిశిత
ముగను శీలించి పల్కె నే మొగము ముడువ,
"రాత్రి గుడిలోన రామపుండ్రమున ఱాలు
లెక్కపెట్టితి వనుకొందు నిక్కముగను.

తే.గీ. తెలుపుమయ్య నీ శోధనా ఫలితములను,
పుండ్రమున కొన్ని వజ్రాలు పోయినట్లు,
అర్చకుడె వాటి దొంగిలెనని చతురత
నూహచేసితె సాక్ష్యాల పోహణించి.

తే.గీ. తిలక మందుండి వజ్రాలు వెలికితీసి,
ఒక్కటొక్కటిగను నాత డొరుల కమ్మి
తనువు పోషించు కొనుచుండె ననుచు నీవు
మాత్రమే గ్రహించితినని ఆత్రపడకు.

కం. ఎన్నో ఏండ్లుగ నిచ్చట
నిన్నట్టి జనులను కొంద ఱొప్పగు నూహన్
చిన్నగ తలచెద రీ ఆ
పన్నుడు బ్రదుకగ పథకము పన్నె నటంచున్.

ఉ. ఐనను వార లెవ్వరు మహాత్ముడు పూజరి దొంగయంచు సుం
తైన తలంచలేదు, కమలాక్షునిసేవ కనర్హుడంచు కో
పాన బహిష్కరింపరు, ప్రభాకరతేజుని అర్చకాగ్రణిన్
జ్ఞానిగనే గ్రహించుకొని సంశ్రయమిచ్చిరి, సత్కరించిరిన్.

ఉ. చుట్టపు చూపుగా నిటకు శోభనమున్ కనవచ్చి నాడ వీ
పట్టున మిత్ర బాంధవ సభాజన మందున ప్రొద్దుపుచ్చకీ
లొట్టల నేరి శోధనలలో తల మున్కయి వీని దొంగగా
పట్టుకొనంగ జూచుట విపత్తు తెగించి క్రయించుటే కదా!

తే.గీ. కొన్ని అపవాదు లెదలోనె క్రుంగవలయు,
వాని తెగుదాక తెంపుట హానికరము,
తిండిలేనట్టి దళితుల నెండగట్టి
కలిమిగలవారి జత నీవు కట్టవలదు.

కం. న్యాయము, సత్యము, దైవము
ధ్యేయ మగునె తిండిలేని ఎద్దడియందున్,
పోయెడు ప్రాణము నిలుపు ను
పాయము కావలెను - పుణ్య పాపము లేలా!"

మ. అని నా మిత్రుడు పల్కుచుండగను "అయ్యా! రండు, వేవేగ రం
డ"ని తా నార్చుచు నొక్క సేవకుడు హాహాకార సంక్లేశుడై
తనువుం దూగగ వచ్చి స్నేహితుని చెంతని నిల్చి వాపోవ నే
నును మిత్రుండును పర్వు పెట్టితి మనూనానేక చింతారతిన్.

తే.గీ. సేవకుని వెంట పర్విడి దేవళంబు
వెనుక గోపురము దరిని వేదిపైన
గాంచితిమి తీవ్రతాపంబు క్రమ్ముకొనగ,
దిమ్మగొల్పు భయానక దృశ్యమొకటి.

తే.గీ. రక్తపు మడుగులోన అర్చకుడు సతియు
తలలు బ్రద్దలై పడియుండి రలసినట్లు
చావులోననుగూడ విచారదూరు
లగుచు నిద్దరు నొక్కటై అత్తుకొనుచు.

తే.గీ. వారి మూగుచు నొకగుంపు తేరి చూచె,
కొంద ఱా దృశ్యమును గాంచి కొందలింప,
కొంద ఱనుపమ దిగ్ర్భాంతి కుందిపోవ
వెలదు లేడ్వంగ బోరున భీతితోడ.

ఉ. మాటలు నోటరాక మది మల్లడి నొందగ, నేను మిత్రుడున్
కూటువ జేరి గాసిలుచు గుప్పున జొచ్చుచు లోనికేగుచున్
దీటుగ నంబిదంపతుల దేహములన్ పరికించి చూచి ఈ
పాటున కేమి కారణమొ వావిరి నారయ బూను నంతలో

కం. అక్కడి సేవకు డొక్కడు
వెక్కుచు నిట్లనియె: "నేను వీరలు గిడిపై
కెక్కగ చూచితి - చక్కగ
నక్కడి ప్రతిమలకు రంగు లలముచునుండన్.

తే.గీ. ఏటి కొకసారి గోపురమెక్కి వీరు,
విక్కిపోయిన ప్రతిమల బిగియజేసి,
రంగు తగ్గిన చోట్లను రంగు పూసి
వత్తు రదియు రామునికి సేవయని తలచి.

తే.గీ. అటులనే నేడు పూజారి అతివ తోడ
గోపురమునెక్కి బొమ్మల నేపు మీఱి
శుభ్రపరచుట నే మున్ను చూచినాడ
నగుట పెద్దగా పాటింప నైతి దీని.

తే.గీ. అంతలో నీలిమేఘము లబ్బురముగ
నున్నపాటున దట్టమై మిన్నుపైన
మెఱుము లుఱుములతో మిఱుమిట్లు కొలిపి
కుండపోతగ వర్షంబు కురియ దొడగె.

తే.గీ. అర్చకుండంత కాల్జారి అత్తరమున
భామ హస్తంబు చేపట్టి, ఆమె తోడ
కూడి దొర్లుకొనుచు క్రింద కూలిపడెను -
భీతితో నేను వీక్షింప విస్తుపోయి."

తే.గీ. అపుడు గుంపులోవేరొక్క డనియె నిట్లు,
కాదు కాదట్లు పడియుండ లేదు వారు,
నేనుగూడను పూజారి, వాని నెలత
గోపురము నెక్క చూచితి గోప్యముగను.

తే.గీ. అచట బొమ్మలకు పసుపు నలమి, కుంకు
మాక్షతలతోడ పూజించి అంతలోన,
అర్చకుడు భార్య హస్తంబు నందుకొనుచు
క్రింద కుఱికె కోరి - తలలు వ్రీలిపోవ."

తే.గీ. వీరి మాటలు వినగ బేజారు పడుచు
గుంపులోన కలకలము పెంపుమీఱె,
సతుల హాహారవముల విషాద మొలసి
మెండుగా నార్తనాదమై మిన్ను ముట్టె.

కం. క్రింద పడిన పూజారిని,
ఇందిన వాని కులభామ నీ విధి గనగా
నెందుల కుటులయ్యె ననుచు
కుందితి శోకావమాన కోపము లొలయన్.

తే.గీ. చెలిమికాడంతలోన నా కెలను జేరి,
మీఱు తీక్ష్ణ దృక్కులతోడ మిటకరించి,
పతితులైన పూజారి దంపతుల గతికి
నేనె కారణ మైనట్లు నిక్కిచూచె.

తే.గీ. నాకు తల గిఱ్ఱున తిరిగి నలుగుడయ్యె,
కడుపులో దేవినట్లై వికార మొదవె,
ఏమి చేయంగ పాల్పోక ఎడద కలగె,
ఓపిక నశించి ఒక మూల కొరగిపోతి.

తే.గీ. అంతలో నేస్త మొక్కింత శాంతి నొంది,
ఓర్పుతోడ జనుల సుంత యూరడించి,
చాకచక్యాన గుంపును సరిగ తీర్చి,
దరికి రాకుండ వారల దవ్వుపఱచి.

కం. సేవకు నొక్కని పల్లెకు
వేవేగను పంపె గ్రామ పెద్దల కొఱకై,
ఆ వెనుక రక్షకభట
స్థావరముకు నటులె పంపె ధావకు నొకనిన్.

కం. ఆ విధి పరిస్థితి నదుపు
గావించిన, చేయ నేమి కలదని నేనా
కోవెలలో మఱి యుండక
పోవుటయే మెలటంచు ముకుళిత మతినై.

 

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)