కథా భారతి - అనగనగా ఓ కథ
గాజులు
- కశింకోట ప్రభాకరదేవ్

కొట్టువాడు యిచ్చిన గాజుల పొట్లాన్ని జాగ్రత్తగా పేంటుజేబులో పెట్టుకుని, షాపునుండి బైటపడ్డాడు రామారావు.

సాయంకాలం కావడం వలన వచ్చేపోయే జనంతో బజారు రద్దీగావుంది. రోడ్డు పక్కన పేవ్‍మెంటు మీద నడవసాగాడు రామారావు.

అతని మనసు యిప్పుడు ఒకవైపు ఆనందంతోను, యింకోవైపు ఏదో కోల్పోయినట్లు దిగులుతోను నిండివుంది. అందుకుగల ప్రధాన కారణం పార్వతి. రాత్రి పడుకోబోయే ముందు "రేపు మన పెళ్ళి అయి పాతిక సంవత్సరాలు నిండుతాయి." అంది. అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచిపోయాయా అని ఆశ్యర్యం కలిగింది.

పార్వతిలాంటి భార్య దొరకడం అదృష్టం. అందుకనే కాబోలు, పాతిక సంవత్సరాలు యిట్టే గడిచిపోయినా, తనకు తెలిసిరాలేదు.’ గొణుక్కున్నాడు రామారావు.

భార్యను ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు పెళ్ళయి యిన్ని సంవత్సరాలయినా పార్వతి తనను ఏమీ కోరలేదు. తను కూడా "ఏం కావాలి?" అని అడగలేదు. వచ్చిన జీతం యింటి ఖర్చులకు సరిపోవడమే కష్టమవుతుంది అటువంటప్పుడు భార్యకు ఏంకావాలో ఎలా ఆడగగలడు చేతకాని తనం తన నోరు నొక్కేసింది... ఎన్నోసార్లు.

కాని, నిన్నరాత్రి అనాలోచితంగా, తన చేతగానితనాన్ని మరచిపోయి "ఎంకావాలో కోరుకో " అన్నాడు. పార్వతి నవ్వింది.

"మీలాంటి భర్త లభించాక ఏ ఆడదన్నా ఏం కోరుకుంటుంది?" అంది. ఆ మాటలు వెక్కిరింపో, పొగడ్తో అర్థం కాలేదు.

పార్వతిని మరింతగా గుండెలకు హత్తుకుని, ముంగురుల్ని సవరిస్తూ___ "అదికాదు పారూ : మనకు వివాహం జరిగి యిన్ని సంవత్సరాలయ్యాయా? నువ్వు ఎప్పుడన్నా నన్ను ఏదైనా కోరేవా? ప్లీజ్ -- ఏదైనా కోరుకో. లేకపోతే నాకు బాధగా వుంటుంది." అన్నాడు తన బలవంతం వలన పార్వతి కోరుకుంది.

ఎన్నాళ్ళ నుంచి ఆ కోరికను తన గుండెలో భద్రంగా దాచుకుందో! తన వత్తిడివలన ఆ కోరికను బైటపెట్టింది.

"నాకు... ఒక జత బంగారు గాజులు కావాలండీ" అంది. తను మరేం ఆలోచించకుండా సరే నన్నాడు.

ఉదయం నిద్రనుంచి లేచాక, రాత్రి పార్వతి కోరిక, తన వాగ్దానం గుర్తుకురాగానే గుండెనెవరో పిండినట్లయింది. రాత్రి తనెంత అవివేకంగా ప్రవర్తించాడో అర్ధం అయింది. నిద్రపోతున్న పార్వతి మనసులోని కోరికను తనే బలవంతాన తట్టిలేపాడు. ఆ కోరికను తీర్చక తప్పదు.

పాతిక సంవత్సరాలు తన కష్ట సుఖాల్ని పంచుకున్న భార్య కోరికను, ఈనాడు వివాహ రజతోత్సవ సమయంలో తీర్చడం తన విధి. కాని, ఎలా? వెయ్యి రూపాయలుంటేగాని బంగారు గాజుల జత రాదు. నెలాఖరు రోజులు, పాతిక రూపాయలకన్నా తన దగ్గర ఎక్కువలేవు.

ఆఫీసులో పనిచేస్తున్నాడన్నమాటే గాని, మనసంతా గాజుల గురించే తీవ్రంగా ఆలోచిస్తుంది. సాయంకాలం ఆఫీసు విడిచిపెట్టే సమయానికి ఒక నిర్ణయానికి వచ్చాడు రామారావు.

ఆ నిర్ణయ ఫలితమే ఈ గాజులు... జేబులోని గాజుల్ని జాగ్రత్తగా అదిమి పట్టుకుని యింటివైపు నడుస్తున్నాడు రామారావు. అతని మనసు ఆలోచనలు ఈ గాజుల్ని కొనడానికి ఎంత బాధ పడ్డాడో, తలచుకుంటేనే భయం వేస్తుంది. గుమ్మంలో తన రాకకు ఎదురుచూస్తూ నిలుచుంది పార్వతి. పార్వతిని అలా గుమ్మంలో చూసేసరికి పాత రోజులు గుర్తుకు వచ్చాయి రామారావుకి. పెళ్ళయిన కొత్తలో తన రాకకోసం ఎదురుచూస్తూ అలా నిలుచుండేది. ఆ తరువాత ఆ అలవాటు తప్పింది. మళ్ళీ, యిన్నాల్టికి.

పార్వతి భర్తను చూసి చిన్నగా నవ్వి యింట్లోకి దారితీసింది. రామారావు కూడా నవ్వక తప్పలేదు.

ఇంట్లోకి వస్తూనే "పిల్లలంతా ఎక్కడ?" అడిగాడు.

"పెద్దవాడు యిప్పుడే లైబ్రరీకని చెప్పి వెళ్ళాడు. ఉమ యింకా కాలేజీ నుండి రాలేదు." చెప్పింది పార్వతి.

వంట యింట్లోకి వెళ్ళి స్టీలు ప్లేటులో రెండు స్వీట్లు, ఉప్మా సర్ది, రామారావుకి యిచ్చింది రామారావు ప్లేటును అందుకొని, పక్కనున్న బల్లమీద వుంచాడు.

"పారూ : రాత్రి నువ్వడిగింది జ్ఞాపకం వుందా?" భార్య కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు.

"బంగారుగాజులు కదూ! పోనిస్తూరూ. మనకి అంత డబ్బు ఎక్కడిది? వూరికే. మీరు బలవంతం చేస్తే అలా అడిగాను," అంది ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ.

"పారూ : నీ కోరిక తీర్చలేని అసమర్దుడిని కదూ?" కళ్ళల్లో రామారావుకు నీరు తిరిగింది.

"ఛ. అలా ఎవరన్నారు?" భర్త మాటలకు నొచ్చుకుంటూ అంది.

రామారావు భారంగా నిట్టూర్చాడు.

"ఇవిగో, నువ్వడిగిన గాజులు." జేబులోంచి పొట్లాన్ని తీసి భార్యకిచ్చాడు.

పార్వతి ఆశ్చర్యంగా భర్తను చూసి గబగబా పొట్లం విప్పింది పచ్చగా, మెరుస్తూ గాజులు : తన కళ్ళను తనే నమ్మలేకపోయింది.

"ఏమండీ? ఇంత డబ్బు ఎక్కడిది?" ఆశ్చర్యం నుండి తేరుకున్న తరువాత, భర్తను అనుమానంగా చూస్తూ ప్రశ్నించింది.

జవాబు చెప్పలేదు రామారావు. దోషిలా తల వంచుకున్నాడు.

లంచం పుచ్చుకున్నారా?" భయం భయంగా అడిగింది, భర్త స్వభావం బాగా తెలిసివున్నా.

"ఇంకా, అంతకు తెగించలేదు పారూ:" అన్నాడు బాధగా. తన మాటల వలన భర్త మనసు గాయపడిందని గ్రహించింది పార్వతి. ప్రేమగా భర్త తల నిమురుతూ "మీ సంగతి నాకు తెలుసండి. ఈ గాజులు చూసేసరికి మతిపోయి, అలా అడిగాను" అంది పార్వతి.

"గాజులు బాగున్నాయా?" అడిగాడు రామారావు, ప్లేటును దగ్గరకు తీసుకుని,

"చాలా బాగున్నాయండీ ఇంతకీ, ఈ గాజులకి.... డబ్బెక్కడిది?"

పార్వతి ప్రశ్న రామారావుకు గోరు చుట్టుమీద రోకలిపోటులా తగిలింది.

"అప్పు చేశాను పారూ:" మెల్లగా జవాబిచ్చాడు.

"ఇంత డబ్బు ఎందుకు అప్పు చేశారండి:" అంది పార్వతి గాజుల్ని అపేక్షగా చూస్తూ.

"ఇప్పుడా గొడవంతా ఎందుకు పారూ: ఈ రోజు మన వివాహ రజతోత్సవ దినం. సంతోషంగా వుండాలి. త్వరగా నువు తయారవు. సినిమాకి వెళ్దాం" అన్నాడు.

"అలాగేనండీ. ఇంతకీ, ఈ గాజుల్ని ఎంతకు కొన్నారు?" గాజులు పరీక్షగా చూస్తూ అడిగింది.

"పారూ : ప్లీజ్ .... ముందు నువ్వు ముస్తాబవు," విసుగా మొహంపెట్టాడు రామారావు.

* * *

రాత్రి పది గంటలయింది.

పిల్లలందరూ ముందు గదిలో నిద్రపోయారు. వంటయిల్లు సర్ది, భర్త గదిలోకి వచ్చింది పార్వతి.

మంచం మీద పడుకుని వున్న రామారావు తలతిప్పి పార్వతివైపు చూశాడు. తడిచేతుల్ని చీర చెంగుతో తుడుచుకుంటూ వచ్చి రామారావు పడుకున్న మంచంమీద కూర్చుంది.

"పారూ : ఒక నిజం చెబుతాను. కోపం తెచ్చుకోవు కదూ?" సంశయంగా అడిగాడు.

"నిజం చెబితే కోపం ఎందుకండీ?" అంది.

రామారావుకు నిజం చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఒకవైపు అర్థాంగికి నిజం చెప్పకుండా మోసం చెయ్యడం తప్పు అని మనసు హెచ్చరిస్తుంది.

జారిపోతున్న దైర్యాన్ని జాగ్రత్తగా కూడదీసుకున్నాడు.

"పారూ : నిన్ను... మోసం చేశాననుకో, అప్పుడు నన్ను అసహ్యించుకోవు కదూ?" గొంతు వణికింది.

"ఛ. అవేం మాటలండీ. మీరు నన్ను మోసం చెయ్యడమేమిటి?" అమాయకంగా భర్తను చూస్తూ అంది.

"అవునూ పారూ : నిన్ను మోసం చేశాను. నువ్వు బంగారు గాజులు తెమ్మని అడిగితే, ఆ గాజుల్ని కొనే స్తోమత లేక గోల్డు కవరింగ్ గాజులు తీసుకువచ్చాను. ఆ గాజుల్ని బంగారు గాజులని చెప్పి నీకు యిచ్చాను. నన్ను క్షమిస్తావు గదూ?" దుఃఖం వలన రామారావుకు గొంతు బొంగురు పోయింది.

"అదేమిటండీ... ఈ మాత్రం దానికే బాధపడాలా? నాకు మొదటే తెలుసు మీరు తెచ్చినవి గోల్డు కవరింగు గాజులని" అంది.

రామారావుకు పార్వతి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.

"ముందే తెలుసా? ఎలా??"

"మీరు తెచ్చిన గాజులు చాలా తేలిగ్గా వున్నాయండి. అంతేకాదు, మన ఎదురింటి పిన్నిగారికి చూపిస్తే యివేం బంగారు గాజులు : గోల్డు కవరింగువి," అంది ఆవిడకు యిటువంటి విషయాలు బాగా తెలుసు" అంది.

బాధగా పార్వతిని చూశాడు.

"మరి, నన్ను వెంటనే ఆడగలేదేం?" ప్రశ్నించాడు. తనవలన పక్కింటావిడ దగ్గర పార్వతికి తలవంపు జరిగిందనే విషయం రామారావుకు భరించశక్యం గాకుండా వుంది.

"అడగాలనే అనుకున్నాను కాని, మీరు బాధపడతారని అడగలేదు."

"నువ్వు భార్యగా దొరకటం నా అదృష్టం పారూ: నీకు.... నీకు మోసం చేశాను. వట్టి యిడియట్‍ని చేతగాని వాడ్ని..." పిచ్చిగా జుత్తు పీక్కున్నాడు - రామారావు! పార్వతి అతన్ని వారిస్తూ.

"అలా మాట్లకండి. అసలు నాదే పొరపాటు అంత పెద్ద కోరిక కోరకుండా వుండవల్సింది నన్ను క్షమించండి" అంది

"నీ మంచితనంతో నన్నింకా పిచ్చి వాడ్ని చెయ్యకు పారూ : ప్లీజ్" అసహనంగా అన్నాడు. పార్వతిని గుండెకు హత్తుకుని ముద్దులవర్షం కురిపించాడు.

.... నేనదృష్టవంతుడ్ని... మరోసారి మనసులో అనుకున్నాడు రామారావు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)