కథా భారతి - అనగనగా ఓ కథ
కన్నీళ్ళొలికాయి
- చందు సోంబాబు

రెండు రోజులనుండి తెరిపివ్వకుండా వర్షం కురుస్తూనే ఉంది. తుఫానులోకి దింపుతుందేమో అనుమానంగా ఉంది. రోడ్లన్నీ నీళ్లమయంగా ఉంది. ఊపిరి లేని చెట్లు - నించునేందుకు శక్తి లేని వయసొచ్చినవీ, రానివీ కూడా- చాలామటుకు నేల కూలాయి. మురికివాడల్లోని పాకల కప్పులు పోయాయి. మట్టిగోడలు కరిగిపోయాయి.

పాత పెంకుటింట్లో విరిగి పోవడానికి సిద్ధంగా ఉన్న ఈజీచెయిర్లో కూర్చున్నారు రంగనాథం గారు.

ఆయన మనసు మనసులో లేదు. ఉదయమనగా వర్షంలో బయటి కెళ్లవద్దని ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్లాడు సత్యం. ఇప్పుడు చీకటి పడుతూంది. వర్షం చేత వీథి దీపాలు కూడా వెలగడం మానుకొన్నాయి.

రంగనాథంగారి భార్య జానకమ్మ లాంతరు వెలిగించి దాన్ని తీసుకుని భర్త దగ్గరి కొచ్చింది. జానకమ్మని చూసీ చూడనట్లుగానే ఊరుకున్నా రాయన. జానకమ్మ ఆయన కాళ్ల దగ్గర కూర్చుంది.

''ఏమే, ఈ వర్షం తగ్గుతుందంటావా అసలు?'' అడిగారు.

జానకమ్మ నవ్వి, ''నన్నడిగితే నేనేం చెపుతాను. ఏ కాలం దారి ఆ కాలానిది. అయినా కురవక కురవక వర్షం కురుస్తుంటే తగ్గదా అనడుగుతా రేమండి?'' అంది.

''వర్షం అవసరమే కానీ, ఇలా రోజుల తరబడి కురిస్తే మనుషు లేమయిపోవాలే? చూడు, ఎన్ని ఇళ్లు కూలిపోయాయో! దానికి తగ్గట్టు ఈ దిక్కు మాలిన గాలి!''

''ఈ కబుర్ల కేమొచ్చె గానీ, వాడి సంగ తేమన్నా ఆలోచించారా - పొద్దున్ననగా వెళ్లాడు. వర్షంలో ఎక్కడికి పోయాడో ఏమో, పాపం!''

రంగనాథంగారు నిట్టూర్చారు.

'తనేం చేయగలడు?' అనుకున్నారు.

ఆయన రిటైరయిన లెక్కల మాస్టారు. అరిథ్‌మేటిక్‌, ఆల్‌జీబ్రా లెక్కల్ని క్షణమాత్రంలో సాల్వు చేయగలరు. కానీ, జీవితంలో ఆయన కట్టిన లెక్కలు చాలా తప్పొచ్చినాయి. జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్న మనిషి. ఆయన కొంచెం గుండె నిబ్బరం గల మనిషి కావడం చేత చూసేందుకు మాత్రం తను పడే కష్టాన్నిగానీ, నిష్ఠూరాన్నికానీ బయటికి తెలియనివ్వరు. నాలుగేళ్ల క్రితం కూతురు భర్త సరిగా చూడ్డంలేదని, దేన్నో ఉంచుకొన్నాడనీ బాధకొద్దీ కిరసనాయిలు పోసుకొని నిప్పంటించుకుని పోయింది. రంగనాథం గారు అంత బాధని కూడా ఎప్పుడూ బయటికి చూపలేదు. దాని వ్రాత అని సరిపెట్టుకొన్నట్లుగా నటించారు. జానకమ్మ కూతురి చావుతో దిగులుపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని, నలభై అయిదేళ్ల మనిషి అరవైలో పడిన దానిలా తయారైంది.

కొడుకు సత్యాన్ని అతి కష్టంపైన బి.ఎ. చదివించారు.

రంగనాథానికి తెలుసు - తన కొడుక్కి కలెక్టరు కాగల అర్హతలున్నాయని. కానీ, అర్హతని చూసి ఉద్యోగాలిచ్చేదెవరు? సిఫారసు కావాలి. సాధారణంగా అర్హతలు లేనివాడికి డబ్బు, పరపతి ఉంటాయి. ఈ రెండు అర్హతలూ ఉన్న పనికిరాని మనిషి ముందు అర్హత అనేది ఎందుకూ పనికిరాని వర్షంలో తడిసిన కాగితం లాంటిది.

తను పేదవాడు బ్రతుకుతెరువే కష్టమైపోయి ఒక్కరోజు పస్తు కూడా పడుకొనే జీవితం ఆ పెంకుటింటిది. కూతురు పోయింది. కొడుకు నొక దారి చెయ్యలేని ముసలితనం, అసమర్థత మరో పక్క.

తన చేతుల్లో చదువుకొన్నవాళ్లు చాలా పెద్దవాళ్లయ్యారు. కానీ, ఎవర్నని పట్టుకొనేది, ఎలా అడిగేది? అది ఈ వయసులో ఆయన వల్ల అయ్యే పని కాదు.

రంగనాథంగారి కళ్లలో నీరు పొంగింది.

పాఠాలు చెప్పుతూ ప్రతి కుర్రాడూ వృద్ధిలోకి రావాలని దీవించిన చేతులు తనవి. తన ఒక్కగా నొక్క కొడుకు ప్రతిరోజూ తినీ తినకా ఉదయం అనగా పోయి, విసిగి వేసారిపోయి తోటకూర కాడలా వేలాడిపోతూ తిరిగొస్తూంటే ఏమీ చేయలేక పోతున్నారు.

తలుపు చప్పుడైతే జానకమ్మే లేచింది. సత్యం రాలేదు. వర్షానికి వెరచిన ఇద్దరు ముగ్గురు మనుషులు అరుగుపైన కూర్చుని ఉన్నారు. గాలి జోరు అధికంగా ఉంది. వర్షం కూడా కొద్దిగా పెరిగింది.

జానకమ్మ తలుపుల్ని చేరగిలవేసి తిరిగి వచ్చి భర్త దగ్గర కూర్చుంది.

''వర్షంచేత ప్రైవేటు కుర్రాళ్లు కూడా రాలేదు'' అన్నారు.

జానకమ్మ నవ్వింది.

ఆవిడ నవ్వితే నిశ్చలంగా పారే గంగానది ఉలిక్కిపడ్డట్టుగా ఉంటుంది.

''ఎందుకే ఆ నవ్వు?''

జానకమ్మ అన్నది :

''ఓ పక్క జనం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని ఉంటే, పసి వెధవలు లెక్కలు చెప్పించుకోవడానికి రాలేదంటా రేమిటి మరీ చాదస్తంగా?''

తలుపు తోసుకొని గొడుగు మూస్తూ లోపలికి వచ్చాడు సత్యం. మూసిన గొడుగు నించి నీరు జారుతూంది.

అతను గొడుగుని ఆసరాగా తీసుకెళ్లిన్నాటికీ వర్షం ఎటుపడితే అటు కొట్టడం చేత పూర్తిగా తడిసిపోయాడు.

గొడుగుని గోడవారగా పెట్టి తల్లినీ, తండ్రినీ చూసీ చూడనట్టుగా లోపలికెళ్లి బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకున్నాడు. తువాలుతో తల తుడుచుకొంటూ అక్కడి కొచ్చాడు.

జానకమ్మ లేచి నించుంటూ అన్నది: ''పద, భోజనం చేద్దువుగానీ.''

''నాన్నగారు...'' నసిగాడు.

''నాన్నగారి కీ రోజు శనివారం. నువ్వు పద'' అన్న దావిడ.

సత్యం మరేం మాట్లాడలేదు.

తల్లితోపాటు వంట గదిలోకి నడిచాడు. రంగనాథంగారు కొడుకు చెప్పింది వినడమే గానీ, తనకుగా తాను ఏమీ అడగరు. ముసలితనం చేత తనేం అన్నా చాదస్తంగా అనిపించవచ్చు. వాడు బాధపడే అవకాశం ఉంది. అసలే వాడికి ఆత్మాభిమానం జాస్తి.

రంగనాథంగారు ఆలోచనలతోనే నిద్రలోకి లొంగిపోయారు.

తెల్లారింది. వర్షం కొంత తెరిపి ఇచ్చింది. గాలి మాత్రం రివ్వు రివ్వుమని వీస్తూనే ఉంది! వర్షపు నీరు రోడ్డు పైన గోతుల్లో నిలవ కాగా మిగిలిన నీరు సడై కాలవల్లో గమ్యం కోసం ప్రవహిస్తూంది. సత్యం స్నానం చేసి లోపలికొస్తూనే తండ్రిని చూశాడు. పంచెతో లోపలి కెళ్లబోతున్నా రాయన. అస్థిపంజరంలా ఉన్న తండ్రిని చూసేసరికి అతని మనస్సు తల్లడిల్లిపోయింది. తన కించుమించు పాతిక సంవత్సరాలు వచ్చాయి. మరో రెండు మూడు నెలలు పోతే ఇరవై ఆరొస్తాయి. తండ్రికేసి మరోసారి చూశాడు. చర్మం ముడతలుపడి, ఎముకల బొమ్మకి చుట్టినట్లుగా నీరసంగా పీలగా కనపడి అతననుకొన్నాడు: 'ఆ మనిషి రక్తం తనకోసం ధారపోశాడు' అలాంటి తల్లినీ, తండ్రినీ పోషించుకోవలసిందిపోయి, ఇంకా తను వాళ్లపైనే ఆధారపడ్డం ఊహించుకోలేకపోయాడు.

నాలుగు రోజులుగా అతని కసలు పేపరు చదివే తీరికగానీ, చూడాలన్న ఆసక్తిగానీ లేకపోయింది. నిరుత్సాహం, అంతే! పక్కింటి రామారావు నడిగి పేపర్లు తెచ్చుకొని చూస్తూ కూర్చున్నాడు.

జానకమ్మ కాఫీ కలిపిస్తే తాగి, ''హైదరాబాదులో ఏదో ఉద్యోగం ఉందట. రమ్మని మా ఫ్రెండొకతను రాశాడమ్మా'' అని చెప్పాడు.

''సంతోషం, బాబూ!'' అందావిడ.

అంతకుమించి ఆవిడ కేమీ ఇలాంటి విషాఅయల్లో పెద్దగా తెలియదు.

అంతలో రంగనాథం గారు వచ్చి ఆ సంభాషణ విన్నారు.

''ఏమిటే వాడు అంటూన్నది?'' అడిగారు.

''హైదరాబాదులో ఉద్యోగం ఉందట-'' జానకమ్మ.

''చాలా కాలంగా వింటూన్న సంగతే కదే! ప్రతిదానికీ ఎగబడ్డమేగానీ ఉద్యోగం ఇచ్చి చచ్చేదెవరే? అసలు జీవితంలో వాడికి ఉద్యోగం దొరుకుతుందో లేదో!''

ఆయన మాటల్లో బాధ, నిరాశ ధ్వనించాయి. సత్యం అది గమనించి, ''నిరాశపడి ఊరుకుంటే ఎలా, నాన్నా! ఏదో ప్రయత్నం కూడా ఉండాలికద, నాన్నా?'' అన్నాడు.

రంగనాథంగారు మాట్లాడలేదు. జానకమ్మ లోపలి కెళ్లిపోయింది.

''నాకెందుకో నమ్మకంగా ఉంది, నాన్నా. ఓసారి వెళ్లి రావాలనుంది!'' ఆ మాటలు ఎలాగో అనగలిగాడు. సత్యానికీ, రంగనాథంగారికీ- ఇద్దరికీ తెలుసు అది అంత సులువైన విషయం కాదని, కనీసం ఓ పచ్చ కాగితం ఉంటేకానీ వెళ్లడం కుదరదని.

రంగనాథం గారు చిరుగులు పట్టిన బనియనుని తన అస్థిపంజరానికి తొడుగుతూ, ''అలాగే, బాబూ! తప్పకుండా చూద్దాం!'' అన్నారు.

తనకి ఉన్నది వాడొక్కడే. తన అరవై ఏళ్ల జీవితంలో సాధించిందీ, బ్రతికిందీ కేవలం వా డొక్కడికోసమే. ఏ రోజునా వాడి మాటని ఆయన కాదనలేదు. అలాంటిది ఈ రోజున కాదనగలరా? అదీ తనకి స్తోమతు లేకపోబట్టి లేదనచ్చు. కానీ, అనలేరు. తనలో మిగిలి ఉన్న ఆఖరి రక్తపు చుక్క కూడా వాడికోసం కరిగించడానికి ఎప్పుడూ సిద్ధమే.

సత్యం తండ్రి మాటలు విన్నాడు. ఆయన రక్తం పిండుకొని తాగుతున్న కసాయివాడిగా జమట్టుకొన్నాడు తనని తాను. రెండు రోజులు గడిచాయి. వర్షం లేకపోయినా ప్రకృతి మాత్రం ఈదురు గాలితోనూ, మబ్బులతోనూ విసుగ్గానే ఉంది.

సత్యం ఆ రోజు హైదరాబాదుకి బయలుదేరాడు. రంగనాథం చాలావిధాల ప్రయత్నించీ కొడుకు అవసరాన్ని ఈసారి తీర్చలేకపోయాడు. సత్యం చదువుకొన్న రోజుల్లో ఆటల్లోనూ, చర్చా వేదికల్లోనూ గెలుచుకొన్న మెడల్సు, కప్పులు అన్నీ అమేస్తే ఓ నలభై రూపాయల వరకూ వచ్చాయి. మరో ఏభై రూపాయలు ఓ స్నేహితుడిని అడిగి ప్రయానానికి స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు.

బయలుదేరే ముందు చెప్పాడు సత్యం:

''ఉద్యోగం వస్తే చేరిపోతాను. లేకపోతే వెంటనే వచ్చేస్తాను. అమ్మా, మీరు జాగ్రత్త!'' కొడుకు పెట్టెతో సహా రిక్షా ఎక్కుతూ ఉంటే జానకమ్మకీ, రంగనాథం గారికీ కూడా కళ్లలో నీరు సుడులు తిరిగింది. రిక్షా కదిలి వెళ్లిపోయింది.
ఏడుస్తున్న జానకమ్మని ఓదార్చారు రంగనాథంగారు.

''ఏడవకే, జానకీ, ఏడవకు. పిల్లలు వయసొచ్చే వరకేనే తల్లితండ్రుల దగ్గర ఉండేది. మగపిల్లాడు ఉద్యోగాల పేరిట దేశాలు పట్టి పోకా, ఆడపిల్ల కట్టుకొన్న మగాడితోనూ వెళ్లకా తప్పదే. అదేమిటి, నువ్వేడిస్తే నాకూ ఏడుపొస్తుంది. ఏం చేస్తాం? పేదవాడు ప్రేమని కన్నీళ్లతోనే వ్యక్తం చేయగలిగేది. దానికి విలువ అనేది ఎక్కడిదే, బాబూ! వాడెక్కడో ఓ చోట సుఖంగా బ్రతికితే అంతే చాలుఔ''

జానకమ్మ కన్నీళ్లతో లోపలికి నడుస్తూంటే కూడా నీరసంగా అనుసరించారు రంగనాథంగారు.

వారం రోజుల తరవాత కొడుకు దగ్గరి నుంచి రంగనాథం గారికి ఉత్తరం వచ్చింది, తనకి ఉద్యోగం దొరికినట్టు, జీతం నెలకి రెండు వందల ఏభై అనీ వ్రాశాడు. అందుచేత ఓ గది అద్దెకు తీసుకుని ఉండదలచినట్టుగానూ వ్రాశాడు.

ఆ ఉత్తరం చదువుకొన్న రంగనాథంగారికి ఆనందంతో కళ్లు తడి అయినాయి. భార్యని పిలిచి, ''చూశావుటె, నా బాబుకి ఉద్యోగం దొరికిందటే. నా బాబు ప్రయోజకు డవుతాడని నా కెప్పుడూ తెలుసు. ఆ దేవుడికి మాత్రం విశ్వాసం లేకుండా ఎలా పోతుంది? స్వార్థరహితంగా పసివాళ్ల భవిష్యత్తుని తీర్చి దిద్దేనే! అలాంటిది నా కొడుకుని చల్లగా దేవుడు చూడడటే!'' అన్నాడు.

జానకమ్మ కూడా సంతోషంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆ పూట ప్రైవేటు చెప్పించుకొనే పిల్లలకి చాకలెట్లు పంచి పెట్టారాయన. చుట్టుపక్కలవారందరికీ తన కొడుకు ప్రయోజకుడయ్యాడని చెప్పుకొని మురిసిపోయారు.

సత్యం దగ్గరినుంచి మొదటి నెల వంద రూపాయలు మని ఆర్డరు అందుకొని ఉప్పొంగిపోయారు ముసలి దంపతులిద్దరూ.

రంగనాథం గారి కొడుకు ప్రయోజకుడయ్యాడని విన్నవారు ఇంకా ఆలస్యం ఎందుకు, పెళ్లి చేసేస్తే సరిపోతుందన్నారు. హోటలు కూడా ఎంతకాలమని అన్నారు.

చాలామంది రంగనాథం గారిని ఇక హైదరాబాదు వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ, మహానగరంలో వాడికొచ్చే జీతంలో సంసారం గడవదని తెలుసు. వెధవది ఇంటి అద్దె వంద ఇచ్చుకోవాలి. ఉన్న ఊళ్లో పాతదే అయినా, చెప్పుకొనేందుకు ఒక పెంకుటిల్లు ఉంది. కొన్ని ప్రైవేట్లు చెప్పుకొంటున్నారు. ఇది శ్రేయస్కరం అని చిరునవ్వుతో సరిపెట్టుకొన్నాడు.

సత్యం దగ్గర నుంచి తను చేస్తున్న ఉద్యోగం గురించి, నగర జీవితం గురించి కనీసం వారానికొక ఉత్తరమైనా వచ్చేది. ఆ ఉత్తరాన్ని పది పదిహేను సార్లు చదువుకొంటేగానీ వారికి తృప్తిగా ఉండేది కాదు.

సత్యానికి ఓ సంబంధం వచ్చింది. అది జానకమ్మతోపాటు ముసలాయనకీ బాగా నచ్చింది. పిల్ల అందమైంది. చదువుకొన్నది. రంగనాథంగారి వృత్తి ఉపాధ్యాయవృత్తి. అందుచేత చదువుకొన్న చదువు సార్థకం కావాలన్న సిద్ధాంతం వారిది. మగ కావచ్చు, ఆడ కావచ్చు. అందుచేత ఏదో మెల్లిఆ ఆ పిల్లకీ ఓ చిన్న ఉద్యోగం చూస్తే కొడుకూ, కోడలూ సుఖపడిపోతారని అభిప్రాయపడ్డారు. సంబంధాన్ని ఇంచుమించుగా ఖాయం చేసుకొని, కొడుక్కి ఆ విషయం వ్రాశారు.

సత్యం దగ్గరి నుంచి దానికి చాలా పెద్ద ఉత్తరం వచ్చింది.

''నాన్నగారికి,

''మీ ఉత్తరం చదివాను. చాలా ఆలోచించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాఉ. కోపగించుకో క్షమిస్తారని ఆశిస్తాను.
అవును, నాన్నా! నా కప్పుడే ఏం వయసు ముంచుకొచ్చిందని పెళ్లి కావాలి? పైగా, నేను చేస్తున్న ఉద్యోగంవల్ల ఒక సంసారాన్ని లాగగల విశ్వాసం నాలో ఇంకా కలగలేదు. త్వరలో నాకు ప్రమోషన్‌ వస్తుంది. అది రాగానే మీ ప్రతిపాదన గురించి ఆలోచిద్దాం. అంతవరకు దయచేసి పెళ్లి గురించిన ఆలోచను మానుకోవడం మంచిది. మిమ్మల్ని నిరాశ పరుస్తున్నానని తెలుసు. క్షమించమని అడిగే సాహసం నాకు లేకపోయినా, మనసారా క్షమించమని వేడుకొంటున్నాను.

ఇట్లు,
సత్యం.

రంగనాథంగారది చదివి నిట్టూర్చారు.

ఆత్మాభిమానం గల కొడుకు వాడు. జీవితాన్ని గురించి లెక్కల్లో తను ఎప్పుడూ కరెక్టు కాదు. అందుకే వాడు జాగ్రత్త పడుతున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. రంగనాథం గారికి కొడుకుని చూడాలన్న తపన రోజు రోజుకీ ఎక్కువై పోతూంది. నెలలు గడుస్తున్నాయి. దరిదాపు సంవత్సరం అయింది. మధ్యకాలంలో ఒక్కసారైనా వచ్చిన పాపాన పోలేదు. పదిహేను రోజులుగా వాడి దగ్గరి నుంచి ఉత్తరం రాలేదు. భయం పట్టుకొంది. ఒకవేళ వాడికి ఏమైనా జబ్బుగానీ చేసిందా అనీ! అదీకాక ఈ మధ్య చౌదరి గారి కొడుకు గురించి రంగనాథం గారు విన్నారు. డాక్టర్‌ గిరీ చేస్తూ కులాంతర వివాహం చేసుకున్నాడట. నగరంలో ఉద్యోగాలంటేనే భయం. వెధవ ప్రేమలు అనుకొన్నారు. కానీ, అంతలోనే ఆయన అనుకొన్నారు - తన కొడుకు అలాంటివాడు కాదు. తను స్వయంగా చూసిన సంబంధమే వాడు వద్దన్నాడు. అలాంటిది స్వయంగా వాడెందుకు తొండరపడతాడు? తన కొడుకు అలాంటి వాడు కాదు. అలాంటి ఆలోచన మనసులోకి వచ్చినందుకే చాలా బాధ కలిగింది.

మరో వారం తిరిగింది. ఉత్తరం లేదు. కారణం తెలియదు. రంగనాథం గారికి మనసు మనసులో లేకుండా పోతూంది.

రాత్రి నుండి వర్షం. చూరుల్లోంచి కూడా వర్షం పడుతూంది. బయట ప్రళయం తాలూకు రణగొణ ధ్వని. రంగనాథం గారి కేవో పీడ కలలు రావడంతో అసలు ఆ రాత్రి నిద్రే కరువైంది.

ఇక తనవల్ల కాదు. తను వెళ్లి ఒక్కసారి కొడుకును కంటితో చూసుకొంటే కానీ మనసుకి శాంతి ఉండదు. తెల్లవారినా వర్షం తగ్గలేదు. తగ్గేలా లేదు. ఆ రోజే ఆయన ప్రయాణమయ్యాడు. జానకమ్మకీ ఆయనతో పాటుగా వెళ్లాలనీ, కొడుకుని కంటితో చూసుకోవాలనీ లేకపోలేదు. కానీ, వెళ్లడానికి పరిస్థితి అనుకూలించింది కాదు.

భార్య మనసులోని ఆరాటాన్ని గ్రహించి ఆయన- ''నాకు తెలుసే నీ మనసులోని కోరికేమిటో. వీలు ఉంటే అబ్బాయిని తీసుకొస్తాను, బాధపడకు'' అన్నారు గొడుగు ఓ చేత్తో పట్టుకొని, సంచీతో సహా బయటికి నడుస్తూ.
వర్షంలో రిక్షా ముందుకి కదిలి వెళుతూంటే, కన్నీళ్ల మధ్య రిక్షా కనచూపు మరుగయ్యే వరకు అక్కడే నించుంది జానకమ్మ.

రైల్లో కూర్చోవడానికి సీటు లేదు. నించోడానికి కూడా వీల్లేకుండా ఉంది. తలుపు పక్కనే ఒక సంసారం కూర్చుని ఉంది. ఆ పక్కనే చిన్న చోటు కల్పించుకుని కూలబడ్డాడు. ముసలాయన ఆయన. ఎవరు దానికి కాదనలేకపోయారు. దారి అడుగునా ఆలోచనల్లోనే గడిచిపోయింది ఆయనకి.

నాంపల్లి స్టేషనులో రైలు ఆగేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది. రంగనాథంగారికి అదే మొదటిసారి ఈ మహానగరం రావటం. బిక్కుబిక్కు మంటూ జనంలోంచి బయటికొచ్చాడు. కొడుకు ఉండే గది ఎంతదూరం ఉంటుందో కూడా ఆయనకి తెలియదు. టాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షావాళ్లు, రిక్షావాళ్లు చుట్టుముట్టారు. వాళ్లు మాట్లాడే భాష అర్థం కాక వాళ్లని తప్పించుకుని బయటికొచ్చారు.

నలుగు రైదుగురు టాక్సీ వాళ్లు ఎదురుగా వచ్చినా ఆయన వేష భాషలు టాక్సీ ఎక్కేవాడిలా అగుపించక పోవడంతో వాళ్లు ఆయన్ని పట్టించుకోలేదు. బితుకు బితుకుమంటూ ముందుకు నడుస్తున్నాడు. అంతలో- ''మాస్టారూ!'' అన్న పిలుపు వెనక నించి వినబపడి తిరిగి చూశారు. నల్లటి కారుని ఆనుకుని నిలబడ్డ ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చాడు. వచ్చినవాడు- ''నేనండీ...'' అన్నాడు.

''క్షమించు, బాబూ! నేను నీ చిన్నతనంలో పాఠాలు చెప్పి ఉండవచ్చు. ఈ సూటులో ఉన్న నిన్ను నా మసక చూపు గుర్తించలేకపోతోంది!''

''నేను జగన్నాథాన్నండిఔ''

''అంటే కంట్రాక్టరు శ్రీనివాసరావు గా రబ్బాయి కదూ?''

''అవునండీ'' అన్నాడు.

''చాలా పెద్దవాడి వయ్యావు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్నావా, బాబూ?'' అడిగారు.

''అవునండి. ఒక ప్రైవేటు కంపెనీలో పర్చేజ్‌ ఆఫీసర్‌గా చేస్తున్నాను., ఈ కారు కూడా కంపెనీదే. బంగళా కూడా వాళ్లే ఇచ్చారు. ఇదికాక నెలకి పన్నెండు వందలు జీతం'' అంటూ తన అదృష్టాన్ని మాస్టారి ముందు రంగుల చిత్రం గీశాడు జగన్నాథం.

ఎప్పుడూ అత్తెసరు మార్కులు దాటని జగన్నాథం జీవిత వర్ణచిత్రం కంటే ఎప్పుడూ నూటికి నూరు మార్కులు తగ్గని తన కొడుకు జీవితం అందంగా ఉంటుందని ఆయన అంచనా. కానీ, తెలివైన తన కొడుకు చాక్‌రంగులు పూసిన బొమ్మలాగా, తెలివి లేని జగన్నాథం జీవితం ప్రకాశించే ఆయిల్‌ పెయింటింగ్‌లా తన కళ్ల ముందు అగుపించేసరికి రంగనాథంగారు పేలవంగా నవ్వారు.

ఈ వ్యవస్థ చేతిలో సామాన్యమైన మనిషికి వ్యక్తిత్వం లేదని ఆ వయసులో కానీ ఆయనకి అవగాహన కాలేదు.
''ఎందాకా వెళ్లాలి మీరు?'' జగన్నాథం అడిగాడు.

''లింగంపల్లి!'' చెప్పారు.

''నా కారెక్కండి డ్రాప్‌ చేస్తాను. ఇంతకీ ఎవరున్నా రక్కడ?''

''మా వాడే!''

''అంటే, సత్యమా?''

''అవును.''

''ఈ ఊళ్లో ఉంటూ నన్నింత వరకూ కలవలేదే! ఇంతకీ ఏం చేస్తున్నాడు?''

''గుమాస్తాపనే, బాబూ.''

''ఐ సీ!'' అన్నాడు జగన్నాథం.

ఆ మాట విన్న రంగనాథం గారికి ఆయన గుండె పదునైన చాకుతో రెండుగా కోసినట్టయింది. సత్యానికీ, తనకీ మధ్య చాలా అంతరం ఉందన్న ధ్వని ఆ ''ఐ సీ'' లో వినపడిం దాయనకి. కారు ఆపి దిగేద్దాం అనిపించింది.

''నా కొడుకు క్లాసులో ఎప్పుడూ ఫస్టే. నువ్వెప్పుడూ ఆఖరి వాడివే. నీకీ వేళ వచ్చిన అర్హత నీ వెనక ఉన్న డబ్బు, నీ తండ్రి కున్న అధికారం ఇచ్చాయి. నా కొడుకు ఏ అర్హతలో ఉన్నా అది వాడు స్వయంగా సంపాదించుకొంది. వాడు వ్యక్తిత్వం గల మనిషి'' అందామనుకున్నారు.

''ఇదే లింగంపల్లి, మాస్టారూ!'' అన్నమాటతో-

''ఇల్లు నాకు తెలియదు. నేను దిగి వెతుక్కుంటాను, నువ్విక వెళ్లు!'' అని కారు దిగారు, కారు వెళ్లిపోయింది.
నడుస్తున్నారు రంగనాథంగారు.

బర్కత్‌పురా చౌరస్తా దగ్గర ఒక రిక్షా ఉంది.

ఆ రిక్షా కుర్రాణ్ణి అడిగితే సరి అనుకున్నా రాయన.

కారణం- కారు లెక్కే తాహతు తన కొడుక్కి లేదు. మహా అయితే రిక్షాలు ఎక్కుతాడు. అందుచేత వాడికి తెలిస ఉండవచ్చు అనుకొంటూ రిక్షా దగ్గరగా నడిచి, ''బాబూ!'' అని పిలిచాడు.

''ఎక్కడికి పోవాలి, సార్‌?'' రిక్షావాడు తల ఎత్తాడు.

రంగనాథం ఉలిక్కి పడ్డారు.

కళ్లలో నీరు గిర్రున తిరిగింది.

చిక్కిపోయి, కళ్లలో ఊపిరి పెట్టుకొని, మాసిన చొక్కా, ఒక కాలు పైకి మడిచిన పాంటుతో నించున్న రిక్షావాడు రంగనాథం గారిని చూసి తల దించుకొన్నాడు.

''ఇదా, బాబూ, నువ్వు చదివిన చదువు నీ కిప్పించిన ఉద్యోగం!'' ఉద్వేగాన్ని అణుచుకోలేక బావురుమన్నారు రంగనాథం గారు.

''ఇంటికి వెళదాం పదండి, నాన్నగారూ!'' అన్నాడుసత్యం భయం భయంగా.

''వద్దురా, బాబూ!

నే నింకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. జీవితంలో నేను కులాసాగా నవ్విన క్షణాళ్ని చేతివేళ్ల పైన లెక్కపెట్టి చెప్పగలను. కన్నీరేగాని మరేం తెలియని నా కళ్లు ఈ నిజాన్ని మాత్రం భరించలేవు.

నన్నెక్కడికీ రమ్మని అడక్కు. వచ్చిన దారినే వెళ్లిపోతాను. దయచేసి నన్ను రైలెక్కించరా!'' అంటూ తడబడుతూన్న అడుగులతో రంగనాథంగారు గబగబా నడవసాగారు.

సత్యం దిగులు చెందిన మనస్సుతో ఆయన్ని అనుసరించాడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)