SiliconAndhra Blog

Excellent Response for 'Mana Badi'

సిలికానాంధ్ర పంపిన మన బడి ఈ-ఉత్తరమునకు వచ్చిన స్పందన అద్భుతం. వివిధ ప్రాంతాల నుండి అనేక మంది వారి పిల్లలను మన బడిలొ చేర్చుటకు ముందుకు వస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియనప్పటికి అక్షరాభ్యాసంలొ పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు.

సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం రోజున సాంప్రదాయబద్ధంగ పలక, బలపములతో తెలుగు అక్షరాలు రాయించడంతొ మన బడి ప్రారంభమవుతుంది. ఆతరువాత నుండి ప్రతి శని, ఆది వారాలలొ ఒక రోజు తెలుగు నేర్పించడం మొదలవుతుంది. శాన్ హోసె, కుపర్టినొ, సన్నివేల్, ఫ్రీమాంట్, డబ్లిన్, మౌంటెన్ హౌస్ ప్రాంతాలలొ ఇప్పటివరకు తెలుగు నేర్పుటకు నిర్ణయించడం అయినది. మరిన్ని వివరాలు త్వరలొ తెలియచేయబడతాయి. మీకు తెలిసిన అందరిని తెలుగు నేర్చుకొనుటకు ప్రోత్సహించండి.!

ఒక సిలికానాంధ్ర అభిమాని స్పందన!

మన  బడి ఒక దైవ కార్యం. దానికి చేతనైన సహకారం అందించడం ప్రతి తెలుగువాడి కనీస కర్తవ్యం. ఇందులో పాలుపంచుకోవడం నాకు మహదానందం. స్కూలు, పాఠశాల అనకుండా బడి అని పిలుస్తున్నారు. ఆ పేరులొనే నాకు కోటి రాగాలు వినిపించాయి.

ఒక్క తరం కింద చెప్పలేనంత బీదరికం. సుజనరంజనిలో `మన వాళ్ళూ, `నాన్నకి జేజేలూ కధల నిండా ఈ కటిక బీదరికం, జీవన పోరాటం కనబడుతుంది. మన తల్లితండ్రులూ, వారి పూర్వీకులూ సరస్వతిని నమ్ముకున్నారు. తినడానికి లేకపోయినా పిల్లలని చదివించారు. గుట్టుచప్పుడు కాకుండా సంసారాన్ని నెట్టుకొచ్చారు. ఆ చదువులతో ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు వీరవిహారం చేస్తున్నారు. ఆర్ధికంగా మునపటి కంటే ఎదిగాం.
కాని, ఈ చదువులు సంస్కారాన్ని ఇవ్వలేదు. మొగుడూ, పెళ్ళం ఇద్దరూ పీ.ఎచ్.డీ లే. కాని, పట్టుమని పదిరోజులు కాపరం చెయ్యలేకపోతున్నారు. క్షణాల మీద విడిపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. చదివిన చదువుల ప్రభావం. వేమన తెలియదు. విదురుడు తెలియదు.

ధర్మం అనే మాట వాడుకలోంచి ఎగిరి పోయింది. ఒక్క ముప్పై ఏళ్ళ క్రితం అది మహా శక్తివంతమైన మాట. తరచు ఆడవారు, మగవారు ఏదో రూపంలో `ధర్మం' అనే మాటని వాడేవారు. ఆఖరికి పిచ్చాపాటీ మాటల్లో కూడా దొర్లేది. వెనకటి తరాలలో కనబడే  ఓపిక, ఒద్దిక, సౌమ్యత, మనో సౌందర్యం కావాలి మనకి. ఇంగ్లీషు చదువులలో మనస్సుని వికసింపచేసే శక్తి లేదు. అది వేమన పద్యంలో వుంది. సుమతీ శతకంలో వుంది. విదుర నీతిలో వుంది.

మనకున్న క్రియాశక్తినీ, ఆర్ధికశక్తినీ ఉపయోగించి ఇప్పుడు మన భాషనీ, కళళనీ మనం రక్షించుకోవాలి. మన  బడి ద్వారా వేమన పద్యాలు, సుమతీ శతకం బతుకుతాయి. అవి నేర్చుకున్న మన పిల్లల్లో సంస్కారం ప్రవేశించి తీరుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళై ప్రకాశిస్తారు. భాశిస్తారు. అదే మన బడికి రాబడి.
అంతర్జాలం ద్వారా దీన్ని మీరు ప్రపంచం అంతా అందుబాటులోకి తీసుకురావాలి. అందరూ చూసి తరించాలి. అప్పుడో విచిత్రం జరుగుతుంది. అనకాపల్లిలో పెరుగుతున్నవాడు నాకు మా తెలుగు మాష్టారు సరిగ్గా చెప్పడంలేదు. సిలికానాంధ్ర మన బడిలో చేరతాను. వాళ్ళ తెలుగు స్వచ్చంగా, తియ్యగా వుంటుంది అంటాడు.

మీరు చాలామంది నిపుణలని ఈ పనిమీద పెట్టినట్టున్నారు. మంచిది. దీన్ని బట్టి చూస్తే మీరు ఈ విషయమై ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తున్నారేమో అనిపించింది. క్షణం తీరుబడిగా వుండేట్టు లేరు మీరు! మీరు మిగిలినవి సాధించినట్లుగానే ఇది కూడా సాధించుకువస్తారు. అది తధ్యం!

ఇప్పటి దాకా  సిలికానాంధ్ర చేసినవాటికీ దీనికీ తేడా వుంది. సిలికానాంధ్ర చేస్తూన్న ఈ పనీ, దాని ఫలితం తెలుగు భాష జీవించి వున్నంత కాలం మిగిలి పోతుంది. ముందు తరాలు కీర్తిస్తాయి. `ఆంధ్ర కాహళి ఒక సీడీ, రాయబారం భారం ఒకసారి దింపుకుంటే అయ్యిందా? సిలికానాంధ్ర స్థాయి పెంచుదాం. వేదమంత్రాలలాగ, బుద్ధుడి శాంతి గీతాలలాగ భాష చిరస్థాయిగా నిలిపే మార్గాలు వెదుకుదాం' అని రాసాను ఒక చోట. అయ్యా! ఏం చెప్పను. మనసు మూగపోతోంది. కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. చేసి చూపిస్తున్నారు!

-సిలికానాంధ్ర అభిమాని
 

Warning: mysql_query() [function.mysql-query]: Unable to save result set in /home/silicon/public_html/sablog/bmc/inc/core/db_mysql.php on line 104

Warning: mysql_num_rows(): supplied argument is not a valid MySQL result resource in /home/silicon/public_html/sablog/bmc/inc/core/db_mysql.php on line 104