బతుకమ్మ శతకము
- జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

 

 ఆనంద వాక్యం

ప్రకృతిని ప్రజలతో మమేకం చేసే 'అమ్మ తల్లి' మన బతుకమ్మ. మన బతుకమ్మని పూజిస్తూ, స్తుతిస్తూ వర్ణిస్తూ అర్చిస్తూ శ్రీ జొన్నవిత్తుల గారు అల్లిన అందమైన శత(క) పద్యాల సుమహారం ఇది.
అందమైన పూలతో ఆకృతిని సంతరించుకునే మన బతుకమ్మకి, తన భావాలని అక్షరరూపంలో ఏర్చి కూర్చి, భక్తి ప్రపత్తులతో కొలుస్తున్నారు జొన్నవిత్తుల. తెలుగుసాహిత్యంలో ఇది తొలి ప్రయత్నం. ఈ ప్రయత్న ప్రయోజనానికి ఎల్లలు లేవు.

ప్రపంచంలో ప్రతి పండుగ ఒక ప్రాంతంలో ప్రారంభమవుతుంది. పండుగ ప్రాశస్త్యం తెలిసినకొద్దీ, ఆ పండుగకి ప్రజలలో ప్రాచుర్యం పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు, ఆ పండుగ- భాష, ప్రాంతీయతలకు అతీతంగా, అందరూ అనందంగా జరుపుకునే స్థితికి చేరుకుంటుంది. ఒక సామాజిక ప్రయోజనం నెరవేరుతుంది.

బతుకమ్మ శతకం అదే లక్ష్యాన్ని సాధించబోతోంది. తరతరాలుగా తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటున్న పండుగా అధిదేవత అయిన బతుకమ్మ వైశిష్ట్యాన్ని సామాన్యులకి అర్థమయ్యే రీతిలో అపూర్వంగా వర్ణించారు శ్రీ జొన్నవిత్తుల.

ఈ శతకం చదివిన తరువాత ఇంత చక్కని పండుగని అన్ని ప్రాంతాలలో, ప్రాంతాలేమిటి అన్ని దేేశాలలో ఉన్న మన తెలుగువారు అనందంగా జరుపుకోవటానికి ముందుకు వస్తారు.
బతుకమ్మని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సాహిత్యంతో సాంస్కృతిక ప్రాచుర్యానికి నాంది పలకబోతోంది ఈ బతుకమ్మ శతకం.

గత కొద్ది సంవత్సరాలుగా, సిలికానాంధ్ర ఆడపడుచులు బతుకమ్మపండుగ ఆనందంగా జరుపుకుంటున్నారు. అక్కడ పుట్టి పెరుగుతున్న రేపటితరం పిల్లలకి ఈ పండుగ గురించి తెలియచెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, శ్రీ జొన్నవిత్తుల రచించిన బతుకమ్మ శతకము ప్రచురించే అవకాశం సిలికానాంధ్రకి దక్కటం ఆ సరస్వతీదేవి వరం.

గత దశాబ్దకాలంగా తెలుగుసాహితీ, సాంస్కృతిక సంప్రదాయ స్పూర్తితో దినదిన ప్రవర్థమానమవుత్ను జగమంత తెలుగుకుటుంబం సిలికానాంధ్ర. సిలికానాంధ్ర ప్రచురణల విభాగం ప్రారంభం  శ్రీ జొన్నవిత్తుల వారి 'బతుకమ్మ శతకం' తో జరగబోతోంది.

ఇది సిలికానాంధ్రకి దక్కిన మహద్భాగ్యంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో తెలుగుసాహితీ సముద్రంలో మరిన్ని అణిముత్యాలని వెదికి మీ అందరికీ అందించాలని మా అకాంక్ష. సదా మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ, తెలుగుభాషా పరివ్యాప్తికి సమిష్టిగా కృషి చేయడానికి అహ్వానిస్తూ....

భవదీయుడు

కూచిభొట్ల అనంద్‌
వ్యవస్థాపక అధ్యక్షులు
సిలికానాంధ్ర

 
     

1. 

క|| ఓంకారము వలెనే యిల
వంకరటింకరగ ప్రాకి పలుపూతీవెల్‌
అంకెలకందని పువ్వులు
అంకితమొసగెను గయికొనుమా బతుకమ్మా!

 
 
   

                                                                                24.10.2010 అర్థరాత్రి 12.36 ని||

 
తా. ఓ బతుకమ్మా! ఓంకారస్వరూపిణివైన నిన్ను తమ పూలతో పూజించాలని భావించి పూలతీగలూ, దోస మొదలైన పాదులు ఓంకారం లాగా నేలమీదా, పందిళ్ళపైనా పాకుతూ ఎన్నెన్నో పూలు నీకు సమర్పిస్తున్నాయి. ఆ పువ్వులు అంకితంఅందుకొని అలంకరించుకోవమ్మా!

2

క|| యాదగిరిగుట్ట ఎత్తున
మోదంబగు పూలబుట్ట మోయుచు భక్తిన్‌
నీ దరినే కురిపించెద
శ్రీధరి, గొనుమమ్మ ముదముచే బతుకమ్మా!
 
   

2.10.2010 రాత్రి 10.14 ని||

 

తా. మహాలక్ష్మీ స్వరూపిణివైన ఓ బతుకమ్మా! నీపైన భక్తితో యాదగిరిగుట్ట అంత ఎత్తువున్న పూలబుట్టని మోసికొచ్చి నీకు పుష్పాలతోఅర్చన చేస్తాను. ఆనందంగా అందుకోవమ్మా!
 

 

3

 

ఆ జోగులాంబ నీవని
రాజిత రసమూర్తి బాసరమ్మవటంచున్‌
శ్రీజయలక్ష్మి వటంచును
పూజించెదనమ్మ నిన్ను భువి బతుకమ్మా!

 
   

2.10.2010 రాత్రి 10.02 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! నువ్వు అష్టాదశపీఠాలలో ఒకటైన అలంపురం జోగులాంబవనీ, బాసర సరస్వతివనీ, విజయాన్ని కలిగించే లక్ష్మీదేవివని భావించి పూజిస్తాను. ముగ్గురమ్మల మూర్తివై నన్ను ఆశీర్వదించు.  
       

4.

క|| క్రిందకు దిగి సూర్యుండే
మందారసుమమ్మువోలె మారెను నీకై
అందాలొలుకగ సిగలో
అందుకొని అలంకరింపుమా బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 11.22 ని||

 

తా. ఉదయసూర్యుడు నీపై భక్తితో ఎర్రమందారంగా మారి కిందకు దిగి తనను తాను నీకు సమర్పణ చేసు కుంటున్నాడు. ఇక అందంగా ఆ అరుణసూర్య మందారాన్ని సిగలో అలంకరించుకో తల్లీ.

 
       

5.

క|| మృత్యుంజయమంత్రార్థము
ప్రత్యక్షము జేయు దోసపాదున పువ్వై
సత్యస్వరూపిణివనుచు
నిత్యము సేవింతునమ్మ నిను బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 11.06 ని||

 
తా. మృత్యుంజయమంత్రంలోని అర్థానికి ఉదాహరణగా నిలిచే దోసపాదుకి పూచిన పువ్వువై, మృత్యుంజయేశ్వరి వైన నిన్ను సత్యస్వరూపిణిగా భావించి నిత్యమూ పూజిస్తాను. ఆశీర్వదించు తల్లీ.  
       

6.

క||  భావములు బంతిపూవులు
జీవితమే పూలతోట, సిరిమారాణీ!
ఈ వైభవమిక నీదే
దేవీ! కృపచూపి గొనుమిదే బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 10.51 ని||

 
తా. నీ భక్తివల్ల నాకు కలిగే భావాలన్నీ బంతిపూలే. నా బ్రతుకే అన్నిరకాలపూలు పూచే పూలతోట. శ్రీమహాలక్ష్మివైన ఓ బతుకమ్మా! ఈ భావవైభవం అంతా నీకు అంకితం చేస్తున్నా. దయతో స్వీకరించి ఆశీర్వదించు.  
       

7

క||  కనకాంబరములు, కలువలు
కనకంబే ఈర్ష్యచెందగల గన్నేరుల్‌
పెనుచేమంతులు, బంతులు
ఘనపదబంధమ్ములయ్యె, కను బతుకమ్మా!
 
   

4.10.2010 ఉ. 9.56 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! కనకాంబరాలు, కలువలూ, బంగారమే అసూయపడేలా ధగధగా మెరిసే సువర్ణగన్నేరులు, పెద ్దపెద్ద చేమంతిపూలు, బంతిపూలు, నిన్ను చేరుకోవాలని పదబంధాలుగా మారి ఈ నా శతక రచనలోకి వచ్చి చేరాయి. దయతో వాటిని స్వీకరించు.  
       

8.

క|| పొంగెత్తిన భావంబుల
రంగుల రసవత్పదముల రాజిలు కవితల్‌
తంగేడుపూలగుత్తులె
సింగారము చేసికొనవె, సిరి బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 8.08 ని||

 
తా. ఓ బతుకమ్మా! నాలో పొంగులెత్తే ఈ భక్తిభావాలు రంగురంగుల రసరమ్య పదాలు, ప్రకాశవంతమైన కవితలూ - అన్నీ తంగేడుపూలగుత్తుల వంటివి. వీటిని అందుకొని నీ సిగలో సింగారించుకో తల్లీ.  

9

.క||  సిరిపదములవలె చేరెను
చిరు చిరు చిరు బీరపూలు, చిరునగవులతో
శిరమున దాల్చవె జననీ
మరిమరి కరుణను నెరపుచు మా బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 9.21 ని||

 
తా. లక్ష్మీప్రదమూ, మంగళప్రదములైన పదములతో చిన్న చిన్న బీరపువ్వులవంటి భావాలు (నీకు ఇష్టమని) రచించాను. చిరునవ్వుతోవాటిని అందుకొని నీ శిరసున ధరించి, కరుణించి ఆశీర్వదించు తల్లీ!  
       

10.

 క|| మదియే తెల్లని దారము
పదములె విరబూయు నందివర్థనముల్‌, నే
ముదమున మాలను కూర్చితి
అది నీకిచ్చితి, ధరింపుమా బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 10.36 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! నా మనసు తెల్లని, సన్ననిదారం. నా కవిత్వంలో పదాలే నందివర్థనాలు. నా మనస్సనే సన్నని, తెల్లనిదారంతో ఈ శతకాన్ని నందివర్థనాలమాలగా కట్టి నీకు సమర్పించాను. స్వీకరించి దీవించు తల్లీ.  

11.

క||

కుసుమోత్సవ మంజూషా!
అసదృశమసృణ ప్రకాశ! హరిపీయూషా!
రసభావరాగఘోషా!
బీసరుహ సహవాస యోషనే, బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 10.20 ని||
 

 

తా. పళ్ళెంలో, బుట్టలో పూలపండుగలు చేసుకొనే బతుకమ్మా! మిసమిసల మృదువైన కాంతిగల తల్లీ! విష్ణుమూర్తికే అమృతమధురస్వరూపిణివైన మహాలక్ష్మీ! రసవత్తరభావాలను మధురరాగాలతో వ్యక్తం చేసే నాద రూపిణీ! తామరపూలతో సహవాసం చేసే జననీ, అనుగ్రహించు.

12

 

క|| సంపంగివాగు దాపున
చంపకవనమున విరిసిన శతపుష్పములన్
సొంపుగ ఇంపుగ ఒసగెద
పెంపుగ దీవించి పంపవే, బతుకమ్మా!
 
 
 

 

3.10.2010 ఉ. 10.27 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! సంపంగివాగు పక్కనున్న సంపెంగతోటలో విరిసిన వందల సంపెంగపూలతో సొంపుగ మాలకట్టి, నీకు పూలహారంతో సమర్పిస్తాను. అందుకొని నన్ను అనుగ్రహించు తల్లీ!

13

క||

చిలుకలగుట్టకు చెలులగు
ఎలకోయిల పాలపిట్టలేకశ్రుతిలో
తెలగాణ పదము పాడగ
విలువలు మార్మోగె దిశల, విను బతుకమ్మా!
 
 
   

3.10.2010 ఉ. 10.32 ని||

 
తా. చిలకలగుట్టకు స్నేహితులైన కోయిలా, పాలపిట్టా ఒకే శ్రుతిలో దిక్కులుమారుమ్రోగేలా తెలంగాణా వైభవాన్ని పాటగా పాడుతున్నాయి. వినవమ్మా బతుకమ్మా!
 

14

 

పువ్వుల రంగమ్మవె, చిరు
నవ్వుల రంగమ్మవె, ప్రకృతి నాదమ్మువె, నన్
త్రవ్వగ దొరికిన రవ్వవె
ఇవ్వసుధన్ వెలుగజేయవే బతుకమ్మా!

 
   

3.10.2010 ఉ. 10.32 ని||

 
తా. ఓ బతుమ్మా! నువూ పూలరంగమ్మవి. చిరునవ్వుల నాత్యరంగానివి. ప్రకృతిలో ఓంకారనాదానివి. నిన్ను నేను తలచి, తరచి నాలోకి త్రవ్వగా దొరికిన వజ్రానివి. (ఆత్మ దీప్తివి) లోకంలో నేను నీ వైభవాన్ని చాటుతూ వర్ధిల్లేలా అనుగ్రహించు తల్లీ.
 

15

క|| శ్రీమంతముగా మార్చితి
నా మదినే పుష్పగిరిగ, నవసుమరాజ్ఞీ!
నీ మహిమను ప్రకటింపుచు
రా, మరి మేలొసగ సత్వరమె బతుకమ్మా!
 
   

4.10.2010 ఉ. 11.59 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! నీకు పువ్వులంటే ఇష్టమని నా మనస్సునే ఒక పుష్పగిరిగా (కొండంత పూలగుట్టగా) మార్చాను. ఓ పూలరాణీ! వెంటనే నువ్వు నా మనసుని అధిరోహించి, నాకు మేలు చేకూర్చి నీ మహిమను చాటవమ్మా!  
       

16

క|| తీరుగ భవానిభక్తులు
పారాయణ చేసి లలిత పరవశులైరో,
నూరువరహాల పూలో,
భైరవి! నేనేమని తెలుపనె బతుకమ్మా!
 
   

4.12.2010 మ. 3.43 ని||

 

తా. భైరవీ స్వరూపిణివైన బతుకమ్మా! ఎర్రని దీక్షావస్త్రాలతో భవానీభక్తులు ఒకచోట గుంపుగా కూర్చుని లలితాసహస్రనామం పారాయణ చేసినట్టుగా,ఆ నూరువరహాలపూలగుత్తులను చూస్తుంటే నా కనిపిస్తోంది. నాకు కలిగిన ఈ దివ్యానుభూతిని ఎలా వివరించను తల్లీ!

 
       

17.

 క|| అద్దరి సూర్యుని చూడక
ప్రొద్దుతిరుగుడు కుసుమాలు ముదమున నీదౌ
ముద్దులమోమును గను, ము
ప్పొద్దులు వానిని దయగనుమో బతుకమ్మా!
 
   

4.12.2010 మ. 3.57 ని||

 
తా. సూర్యచంద్రులనే నేత్రాలుగా కలిగిన ఓ జగజ్జననీ! ఆ ప్రొద్దు తిరుగుడు పూలు సూర్యునివైపు తిరగకుండా నీ ముద్దులమోమునే చూస్తూ నిశ్చలభక్తితో నీవైపే తిరిగి నిన్నే ధ్యానిస్తున్నాయి. వాటిని దయతో అనుగ్రహించు తల్లీ!  
       

18.

క|| రాధామనోహరాలు
బోధారాధిత సుగంధపూర్ణములై, నీ
సాధన రేబవలు సలిపి
ద్వైధీభావన వదిలెనవని బతుకమ్మా!
 
   

7.12.2010 మ. 1.01 ని||

 
.తా.  ''రాధామనోహరం'' పూలు రాగాద్వేషాలు వదిలి పెద్దల బోధను ఆచరిస్తూ, పగలూ రాత్రీ కూడా తమ సంపూర్ణసుగంధం నీపై చిందించి నిన్ను ఆరాధిస్తున్నాయి. నాకూ ఆ స్థితిని ప్రసాదించు తల్లీ!  
       

19

 క|| నాలో సత్త్వరజస్సుల
చాలనములు నవ్యపారిజాతసుమములు కాన్‌
హేలగ సిగలో దాల్చవె
త్రైలింగేశ్వరసతి నిరతము బతుకమ్మా!
 
   

7.12.2010 మ. 12.58 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! నాలోని రజోగుణం ఎర్రనైన పారిజాతపుష్పం కాడవలె, సత్త్వగుణం తెల్లనైన పారిజాతపుష్పం వలె బైటకి వ్యక్తం అవుతున్నాయి. ఓ పరమేశ్వరరాణీ! పారిజాతపువ్వులు ధరించినట్టు నాలోని ఈ సత్త్వరజోగుణ ప్రభావకవితాసుమాలు నీ సిగలో ధరించి ధన్యుణ్ణి చెయ్యి.  
       

 20.

 క|| ఏనుగు నిను పూజింపగ
తానుగ తెచ్చినదె ఎఱ్ఱతామర పూవుల్‌
శ్రీనుత కీర్తుల గొనుచును
ఆనందముగా ధరింపుమా బతుకమ్మా!
 
   

4.10.2010 మ. 1.54 ని||

 
తా. నిన్ను పూజించాలని ఏనుగు చెరువులో నుంచి ఎఱ్ఱతామర పువ్వును తెచ్చి, పల్లె పడుచులు చేసిన బతుకమ్మపై వుంచింది. ఆ ఎర్రతామరను ఆనందంగా ధరించవమ్మా, బతుకమ్మా!  
       

21

 క|| విరిసిన గులాబిపువ్వై
స్థిరభక్తిని, ప్రేమచూపి, చేమోడ్చుచు, నీ
దరి నిలిచె తెలంగాణము
సిరి కురియవె సకలము తెలిసిన బతుకమ్మా!
 
   

22.10.2010 ఉ|| 9.50 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! ఈ తెలంగాణాప్రాంతం అంతా సంపూర్ణంగా విరిసినగులాబీపువ్వై నీపైన స్థిరమైన భక్తితో, ప్రేమతో, నీ ఎదుట నిలిచి నీకు నమస్కరిస్తోంది. ఈ తెలంగాణజనుల మనసెరిగిన తల్లీ, వారి కోర్కెలు తీర్చి సిరిసంపదలు కలిగించు.  
       

22.

 క|| స్మితకమలము నుతిసేయగ
శతవిధముల శంకుపూలు శంఖములూదన్‌
ద్యుతి హారతినిడ మల్లియ
కృతి, మాలతిపాడెను వినవే బతుకమ్మా!
 
   

17.10.2010 రాత్రి 8.23 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! విరిసిన నగుమోముతో ఎర్రతామరపువ్వు నిన్ను వినుతించగా, వందలవిధాలుగా శంకుపూలు నీ జయశంఖములూదగా,తెల్లని మల్లెపువ్వు నీకు హారతినీయగా, మాలతీకుసుమం నీకు మంగళహారతి పాడింది. ఆ పూలు భక్తితో చేసే పూజలు అందుకోవమ్మా.  
       

23

క||  సిద్ధించిన జెండాలై
ప్రొద్దుతిరుగుడు విరులు నలుమూలల ఎగిరెన్‌
అద్దరి గోగులపూవులు
అద్దములైనవె ఇక అరయన్‌ బతుకమ్మా!
 
   

17,10,2010 రాత్రి 8.02 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! యోగసాధనలో సిద్ధిని పొంది నీ విజయపతాకాల వలె ప్రొద్దుతిరుగుడుపూలు నలుదిశలా ఎగురుతున్నాయి. వాటికి ప్రక్కనే గోగుపూలు నువ్వు మోము చూసుకోవడానికి అద్దాలుగా మారాయి.  
       

24.

క|| జడగంటలు గన్నేరులు,
జడబిళ్ళౌ జామపువ్వు, జగములు పొగడన్‌
జడయెల్ల మొగలిపూవౌ
పడడా హరి, పదముల దరి, భళి బతుకమ్మా!
 
   

17.10.2010 రాత్రి 10,23 ని||

 
తా. శ్రీమహాలక్ష్మివైన ఓ బతుకమ్మా! ఈ సువర్ణగన్నేరుపూలే నీకు జడగంటలు. జామపువ్వే జడబిళ్ళ. జడఅంతా మొగలిపూవు. ఏమి అందం అమ్మా నీది. ఇక నీ అందానికీ, ఆ పూలజడ చందానికి విష్ణుమూర్తి పాదాక్రాంతుడు కాడా మరి!  
       

25.

 క||  గుప్పుమను పారిజాతము
చెప్పెడి నీ కథలలోని చిత్రసుగంధం
బెప్పటికప్పుడు క్రొత్తగ
ఒప్పారునె ఇప్పుడమిని ఓ బతుకమ్మా!
 
   

16.11.2010 ఉ. 7.04 ని|| - చికాగో అమరేంద్రగారింట్లో

 
తా. గుప్పుమని సువాసనలు వెదజల్లే పారిజాతపువ్వు చెప్పే నీ చిత్ర విచిత్రమైన కథలలోని భావసుగంధం ఎప్పటికప్పుడు మా మనసులని పరిశుద్ధిచేసి నిత్యనూతనమైన భక్తిచైతన్యాన్ని కలిగిస్తుంది తల్లీ.  
       

26.

 క|| ఉడుతలు బుడిబుడి పూవులు
కడుభక్తిని తెచ్చి నీకు కానుకలిడగా
పడిపడి పువ్వుల పుప్పొడి
నడివీధులు సొగసులీనె నా బతుకమ్మా!
 
   

16.11.2010 అర్థరాత్రి 1.22 ని|| - చికాగో అమరేంద్రగారింట్లో

 
తా. ఉడుతలు నీపైన భక్తితో చిన్నచిన్న పూవులు తీసుకుని వచ్చి సమర్పిస్తుంటే, అవి పూలు తెస్తున్నప్పుడు ఆ పూలలోని పుప్పొడి రాలి వీధులన్నీ నీ ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దినట్టున్నాయి తల్లీ.  
       

27

క|| సంచితము సమర్పించెను
కాంచవె ప్రణమిల్లు దేవకాంచనసుమమున్‌
మంచిని తలదాల్చెదనని
ఉంచవె సిగలోన దీనినో బతుకమ్మా!
 
   

16.11.2010 ఉ. 10 గం|| - చికాగో అమరేంద్రగారింట్లో

 
తా. దేవకాంచనపుష్పం నిర్మలమైన భక్తితో తననుతాను సర్వసమర్పణ చేసుకొని నీకు నమస్కరిస్తోంది. అటు చూడవమ్మా! నిర్మలహృదయుల భక్తిని, మంచితనాన్ని తలదాలుస్తానని లోకానికి చాటుతూ ఆ దేవకాంచనసుమాన్ని నీ సిగలో ధరించు తల్లీ!  
       

28.

 క|| సవ్యంబుగ వికసింపక
దివ్యంబుగ ఆరుపూలు దేహమునందే
అవ్యక్తంబుగనున్నవి
భవ్యవికాసమునొసగు కృపన్‌ బతుకమ్మా!
 
   

18.11.2010 రాత్రి 12.27 ని|| - డెట్రాయిట్‌ సాయిగారింట్లో

 
తా. అమ్మా బతుకమ్మా! దివ్యమైన ఆరుపువ్వులు నా దేహంలోనే సరిగ్గా వికసించక, అసలు నాలో వున్నాయని కూడా తెలియక, లోపలే వుండిపోయాయి. దయతో వాటిని అనుగ్రహించి వికసింపచెయ్యి. ఆ ఆరుపూలు అంకితం తీసుకో తల్లీ!  
       

29.

 క|| వెన్నెముక, సహస్రారము,
పొన్నసుమంబై విరియుచు పూజార్థంబై
ఉన్నవె, యోగేశ్వరివై
నన్నున్‌, నిన్నున్‌, కలుపుము నా బతుకమ్మా!
 
   

 3.10.2010 ఉ. 8.40 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! యోగమార్గంలో నన్ను నీకు సమర్పణ చేసుకొనే సాధనలో నా వెన్నెముక పొన్నపూవు కాడలాగా, నా సహస్రారం పొన్న పువ్వుగా వికసించి నీ పూజకై సిద్ధంగా నిలిచివుంది. యోగయోగీశ్వరీ! కరుణించి నాలో నిన్ను నిలుపుకొని, నీలో కలిసి పోయేలా అనుగ్రహించు.  
       

30.

 క|| మకరందము, మృదుగంధము
ఒక పిసరంతైన లేక ఉడికెడి పూలన్‌
రకరకముల తలదాల్తువె
అకళంకప్రేమకు నెలవై బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 8.40 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! నువ్వెంత దయామయివి. కొన్ని పూలు మకరందమూ, సుగంధమూ తమలో లేవని ఎంతో బాధపడుతుంటే, వాటిని కరుణతో స్వీకరించి సిగలో ధరిస్తావు. ఎంతటి ప్రేమహృదయం తల్లీ నీది.  
       

31

క|| రొమ్మువిరుచుకొని నిలబడు
దమ్ముగల వీరసుతుల తలపించెడి పల్‌
గుమ్మడిపూవుల కైతలు
అమ్మా అందించితి గొనుమా బతుకమ్మా!
 
   

3.10.2010 ఉ. 8.15 ని||

 
తా. యుద్ధానికి సిద్ధమై రొమ్ముకి కవచం తొడుక్కొని ఠీవిగా నిలబడిన వీరతెలంగాణాసైనికుని తలపిస్తున్న గుమ్మడిపూవుల వంటి పద్యకవితలు నీకు సమర్పిస్తున్నాను. అందుకొని ఆశీర్వదించు తల్లీ!  
       

32.

 క||  కాకరపూలకు దక్కిన
ప్రాకటమౌ కీర్తి తనకు రాలేదనుచున్‌
శోకించె అరటి పువ్వే
శ్రీకరి ఆ ఫలములు గొను, సిరి బతుకమ్మా!
 
   

16.10.2010 రాత్రి 7.20 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! చేదుగా వుండే కాకరపాదుకి పూచిన కాకరపూలు కూడా నీ సిగలో అలంకరించుకుంటున్నావు. ఆ కాకరపూలకి దక్కిన కీర్తి, తీయనిఫలాలు అందించే తనకు దక్కడంలేదని అరటిపువ్వు బాధపడుతోంది. కనుక దయతో ఆ అరటిపళ్ళను నైవేద్యంగా అయినా స్వీకరించు. ఆ పళ్ళు నీ భక్తులు కళ్ళకద్దుకొని తింటుంటే అరటిపువ్వు జన్మధన్యమౌతుంది.  
       

33.

 క|| మాపుచు రోగక్రిములను
మాపును రేపును జనులకు మందుగ నిలువన్‌
వేపకు వరమొసగితివే
నీ పూలు ప్రసాదమగుననియు బతుకమ్మా!
 
   

21.10.2010 ఉ. 8.25 ని||

 
తా. వేపచెట్టు అంటురోగాలు రాకుండా, హానిచేసే క్రిములు లేకుండా చేసి, జనులకి ఔషధంగా పయోగపడుతోందని, చేదుగా వుండే ఆ వేపపువ్వును ఉగాది ప్రసాదంగా జనులందరూ స్వీకరించే వరం ఇచ్చి అనుగ్రహించా వుగదా! మా పరోపకారతత్త్వానికి తగినట్లుగా మహోన్నతమైన వరాలూ, ఉన్నతస్థానాలూ అడగకుండానే ఇస్తావు కదా తల్లీ!  
       

34.

క|| కొబ్బరితరువులు, పూలన్‌
నిబ్బరమగు భక్తితోడ నీపై జల్లన్‌
మబ్బులు గొడుగులు పట్టెన్‌
కబ్బము పెల్లుబికినదె ఇకన్‌ బతుకమ్మా!
 
   

21.10.2010 రాత్రి 11.06 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! పల్లెపడుచులు నిన్ను తలపైన వుంచుకొని నిమజ్జనానికి వెడుతుంటే, దారిలో కొబ్బరిచెట్లు భక్తితో నీపైన తమ పూలు చల్లుతున్నాయి. మబ్బులు ఎండ తగలకుండా నీకు గొడుగులు పడుతున్నాయి. ఈ దృశ్యం చూసి హృదయం ఉప్పొంగి శతకపద్యాలు పెల్లుబికి వస్తున్నాయి.

 
       

35

క|| వేల నిఘంటువుల పదము
లే, లీలగ పూలయినవె ఈ కవితలలో
మాలను కట్టి ఒసంగితి
బాలా! పూలజడకు సరిపడు బతుకమ్మా!
 
   

4.10.2010 ఉ. 9.44

 
తా. అమ్మా బతుకమ్మా! నీపైన శతకం రాస్తున్నానని తెలిసి నిఘంటువులలో ఉన్న వేలాదిపదాలు పూలుగా మారి నా పద్యాలలో చేరిపోయాయి. భావసుగంధం గల అందమైన ఆ పూవులన్నీ మాలకట్టి సమర్పిస్తున్నా. అందుకో. బాలాస్వరూపిణివైన నీకు పూలజడగా సరిపోతాయి, ఈ కవితాసుమాలు. ఈ శతకాన్ని స్వీకరించి పూలజడగా అలంకరించుకో తల్లీ!  
       

36.

క|| అల తిరుమలనాథునికిన్‌
కల చోటనె జరుగు పూలకారుల సేవల్‌
చెలువుగ జరుగునె నీకును
తెలగాణంబంత, తలచితే బతుకమ్మా!
 
   

4.10.2010 ఉ. 8.11 ని||

 

తా. ఆ తిరుమల వేంకటేశ్వరస్వామికి పూలంగిసేవ, తోమాలసేవ మొదలైనవి తను వున్న చోటే జరుగుతాయి. నీకు మాత్రం తెలంగాణా అంతా, ఊరూరా, ఇంటింటా జరుగుతాయి. ఆయనదర్శనం ఎంతో కష్టపడి వెడితేనే గానీ దొరకదు. నీ దర్శనం మాత్రం మేం వున్న చోటే దొరుకుతుంది.

 
       

37.

 క|| నా వాక్సుధలకు వశమై
దేవేంద్రుని కల్పతరువు దిగివచ్చి సుధీ
భావసుమమ్ములు కురియుచు
దేవీ, నినుచేరుకొన్నదే బతుకమ్మా!
 
   

4.10.2010 మ. 2.11 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! నీ దయవల్ల నాకు కలిగిన అమృతమధురవాక్కులకు వశమై, దేవేంద్రుని కల్పవృక్షం స్వర్గంనుంచి దిగివచ్చి, ఈ శతకపద్యాలలో పదాలుగా ఎన్నో కుసుమాలు కురిపించి, తన పువ్వులు నిన్ను చేరుకొనేలా సరిక్రొత్త భక్తిమార్గాన్ని ఎంచుకొని నిన్ను చేరుకొన్నది.

 
       

 38.

 క||  రాశీభూతసుమాకృతి!
ఆశయసిద్ధిప్రదాత్రి! ఆశీః ప్రకృతీ!
కాశీపతివామాకృతి!
శ్రీశబ్దామృతరసవతి! సిరి బతుకమ్మా!
 
   

4.10.2010 ఉ. 8.54 ని'||

 
తా. బతుకమ్మా! నువ్వు లోకంలోని రంగురంగుల పూలరాశివి. ఆశయసిద్ధిని కలిగించే దానివి. ఎల్లప్పుడూ చల్లనిదీవెనలిచ్చే దానివి. పరమశివునికి సగభాగమైన పార్వతివి. మహాలక్ష్మివి. శబ్దరూపిణివి,రసరూపిణివైన సరస్వతివి.  
       

39

క|| కృష్ణాతీరనివాసిని!
తృష్ణావిదళిని ! ప్రసూనదివ్యరసాంగీ!
విష్ణుతులసిమాలాధరి!
వైష్ణవశివభక్తజననివౌ బతుకమ్మా!
 
   

4.10.2010 ఉ|| 9.20 ని||

 

తా. కృష్ణాతీరంలో నివసించే జోగులాంబా! ఆశాపాశాన్ని అంతం చేసే తల్లీ! దివ్యపుష్పముల వలె మృదువైన స్వభావము, శరీరముగల జననీ! విష్ణుతులసిమాలను ధరించే మహాలక్ష్మీ! విష్ణుభక్తులకు, శివభక్తులకు పూజనీయురాలవైన తల్లీ! బతుకమ్మ్లా! మమ్మల్ని అనుగ్రహించు.

 
       

40.

 క|| పాదులు తీగలు తరువులు
మోదముతో మంత్రపుష్పమును పఠియించెన్‌
నీ దరి తుమ్మెద బ్రహ్మై
వేదపనస చదివెను, వినవే బతుకమ్మా!
 
   

17.10.2010 రాత్రి 8.02 ని||

 
తా. పూలపాదులూ, పూలచెట్లు అన్నీ ఆనందంతో పుష్పించి నీకు మంత్రపుష్పం చదువుతున్నాయి. బ్రహ్మదేవుడు తుమ్మెదై నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వేదపనసలు చదువుతున్నాడు. వినవమ్మా బతుకమ్మా!  
       

41.

క|| విరులను మించుచు దవనము
మరువమ్మును మాచిపత్రి మౌనుల భంగిన్‌
పరిమళములతో నిరతము
మరిమరి నీ మహిమ చాటె మహి బతుకమ్మా!
 
   

18.10.2010 ఉ. 6.36 ని|| డెట్రాయిట్‌ సాయిగారింట్లో

 
తా. అమ్మా బతుకమ్మా! సువాసనలు వెదజల్లే దవనం, మరువం, మాచిపత్రి నిరాడంబరంగా మౌనులవలె తమ సుగంధంతోనే నిన్ను అర్చిస్తూ నీ మహిమని కొనియాడుతున్నాయి. ఆ తత్త్వాన్ని నాకు దృఢంగా కలిగించు తల్ల్లీ!  
       

42.

క|| పొగడ విరులు పొగడి ఎగసె
సగమ ధనిస సనిధ మగస స్వరపరిమళముల్‌
మగనిసగమ! నిగమపదమ!
నగలుగనవి సిగను తురుము నగి, బతుకమ్మా!
 
   

7.12.2010 సా. 6.32 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! పొగడపూలు నిన్ను పొగడిపొగడి స్వరపరిమళాలను హిందోళరాగాలాపనతో వెదజల్లుతున్నాయి. వేదస్వరూపిణివి, పరమేశ్వర రాణివి అయిన ఓ తల్లీ! నవ్వులొలుకుతూ ఆ పొగడపూలదండలని ఆభరణాలవలె, నీ సిగలోన ధరించు.

 
       

43

క|| గుడిసె పయికి ఎగబ్రాకుచు
నడికొప్పున బీర, సొరయు నవ్వుచు విరియన్‌
గుడిసెయె నీ గుడియై
ఎడదన్‌ పులకింపజేయునే బతుకమ్మా!
 
   

3.10.2010 రాత్రి 8,23 ని||

 

తా. ఓ బతుకమ్మా! పేదవారి గుడిసెలపైకి బీర, సొర, మొదలైన పాదులు పాకి నడికొప్పున పూలుపూసి కళకళలాడుతూ కనిపిస్తుంటే, ఆ గుడిసే నీ గుడిలాగా అనిపిస్తూ నా హృదయం పులకిస్తోంది. నీ దర్శనభాగ్యాన్ని ఇలాగే అంతటా కలిగించు తల్లీ!

 
       

44.

క|| బంగారుపూలతోడ, తె
లంగాణపు వనితలెల్ల లలితానామాల్‌
పొంగుచు చదువుచు పూజిం
పంగాన్‌, పలుసిరులొసగు కృపన్‌ బతుకమ్మా!
 
   

17.10.2010 మ. 1.16 ని|| - విజయదశమి

 

తా. అమ్మా బతుకమ్మా! తెలంగాణామహిళలందరూ ఇంటింటా నిన్ను లలితాసహస్రనామాలతో, బంగారుపూలతో పూజించేలాగా వారి ఇళ్ళల్లో సకలసంపదలూ కురిపించు తల్లీ!

 
       

45.

 క|| కాశీరత్నసుమంబులె
ధీశబ్దామృతకవితలు, దేవీ నీకై
కౌశలమొప్పగ నిల్పిత
కాశీరత్నాంబవనుచు, కను బతుకమ్మా!
 
   

21.2.2010 మ|| 12.46 ని||

 

తా. కాశీరత్నంపూలవంటి మృదుమధురగంభీరపదములతో నేర్పుగా కవితలల్లి, కాశీ అన్నపూర్ణవైన నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించి దీవించవమ్మా బతుకమ్మా!

 
       

46.

 క|| సందెలకు రంగులొసగుచు
గంధమ్ములు చింది చంద్రకాంతసుమమ్ముల్‌
స్పందనముల వందనముల
పొందినవే నీదుపాదములు బతుకమ్మా!
 
   

27.12.2010 చెన్నై, మణిశర్మ గారింట్లో మ. 1.45 ని||లకు

 

తా. అమ్మా బతుకమ్మా! సాయంసంధ్యలకు రకరకముల రంగులు అందిస్తూ, సుగంధాన్ని విరజిమ్ముతూ, చంద్రకాంతపుష్పాలు నీ భక్తిభావాలలో స్పందిస్తూ, ఆరాధిస్తూ నీ పాదాలను ఆశ్రయిస్తున్నాయి.

 
       

47

  గోరింటచెట్టునీడన
పేరంటము చేసి పాలపిట్టలు, చిలుకల్‌
గోరింకలు, కోకిలములు
నోరార నుతించెనిను, వినుము బతుకమ్మా!
 
   

4.10.2010 మ|| 1.45 ని||లకు

 

తా. అమ్మా బతుకమ్మా! నీ పూజలు మనుషులే కాదు. పక్షులు కూడా నిన్ను భక్తితో పూజిస్తున్నాయి. అటు చూడు. గోరింట చెట్టునీడన పాలపిట్టలు, చిలుకలు, కోకిలలు, గోరింకలు, బతుకమ్మపేరంటం చేసి నోరారా కిలకిలారావాలతో కీర్తిస్తున్నాయి నిన్ను. వినవమ్మా విను!

 
       

48.

 క|| శ్రీరమవౌ నినుదలచుచు
ఊరూరన్‌ గల చెరువులు ఉత్సాహముతో
నీరజముల స్వాగతముల
నీ రాకకు వేచి చూచెనే బతుకమ్మా!
 
   

4.10.2010 మ. 1.45 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! శ్రీ మహాలక్ష్మివైన నిన్ను తలుచుకొంటూ ఊరూరా గల చెరువులన్నీ ఉత్సాహంతో నీ (నిమజ్జనం) రాక కోసం ఎర్రతామర పూలతో స్వాగతం ఇస్తూ వేచివున్నాయి. అక్కడకు చేరాక, అక్కడ నుండే మా అందరినీ అనుగ్రహించు!

 
       

49.

 క|| ప్రేమను కురియుచు చేయవె
శ్రీమంతముగాను పల్లెసీమలనికపై
గ్రామములే తామరలై
నీమముగా ఎదల నిలుపు నిను బతుకమ్మా!
 
   

18.11.2010 ఉ. 11.45 ని||, డెట్రాయిట్‌ సాయిగారింట్లో

 

తా. అమ్మా బతుకమ్మా! ఈ తెలంగాణా పల్లెసీమలపై నీ ప్రేమని కురిపించి, సిరిసంపదలతో వర్థిల్లేలా అనుగ్రహించు. అప్పుడిక ఈ తెలంగాణా గ్రామాలన్నీ నీ నివాసస్థానమైన తామరపూలవలె నిన్ను నిలుపుకొని వైభవంతో ప్రకాశిస్తాయి.

 
       

50.

క|| శంకరి అలంకరణకై
కుంకుమపూల్‌ కునుకు మానుకొని వేచినవే!
పంకజములు రాత్రి విరిసె,
మంకెనపూలటులె నిలిచె మరి, బతుకమ్మా!
 
   

22.10.2010 ఉ. 9.00 ని||

 

తా. ఓ శంకరగృహిణీ బతుకమ్మా! నిన్ను అలంకరించాలనే భక్తిభావంతో కుంకుమపూలు రాత్రి అంతా నిద్రలేకుండా వేచివున్నాయి. తామరపూలు రాత్రే వికసించాయి నీ కోసం. మంకెనపూలు కూడా నీకోసం రాత్రిపూటే విరిసి అలాగే వేచివున్నాయి. వాటిని కరుణించు.

 
       

51

క||  పెద్ద ఉసిరికాయ తరిగి
ఒద్దికగా పప్పుతీసి, ఊరించుచు ము
ప్పొద్దుల్‌ పూతేనియలో,
సద్దుల్‌ పెట్టెదనె నీకు సరి బతుకమ్మా!
 
   

15.11.2010 సా. 6.06 ని|| - చికాగో అమరేంద్ర గారింట్లో

 

తా. అమ్మా బతుకమ్మా! పెద్ద ఉసిరికాయలు తరిగి, జాగ్రత్తగా వాటిల్లోని పప్పులు తీసి, పూలతేనెలో బాగా ఊరబెట్టి నీకు సద్దులు సమర్పిస్తాను. స్వీకరించి దీవించు తల్లీ!

 
       

52.

క||  ప్రతి ఒకరును నూరేండ్లును
బ్రతుకగ వలె, బ్రతికి పరుల బ్రతికించవలెన్‌
బ్రతుకున పరమార్థమిదియె
ప్రతి ఒకరికి హితముగ తెలుపవె బతుకమ్మా!
 
   

4.10.2010 రాత్రి 11.59 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! మనిషిగా పుట్టిన ప్రతి ఒకరూ నూరేళ్ళూ బ్రతకాలి. ఇతరులకు సహాయసహకారాలు అందించి వారు ఆనందంగా బ్రతికేలా చూడాలి. నీ దయవల్ల నాకు అర్థం అయిన జీవితపరమార్థం ఇదే. ప్రతిఒకరికీ ఈ విషయం మనసులో నాటుకొని, ఆచరించేలా అనుగ్రహించు.  
       

53.

 క||  మంచికవినాదరించిన
పంచును సద్భావములు ప్రపంచమ్మునకున్‌
సంచితము కావలెగద పో
షించగ సత్కవిని ఒకని, సిరి బతుకమ్మా!
 
   

4.10.2010 మ. 3.41 ని||

 

తా. మంచికవిని ఆదరిస్తే మహోన్నతభావాలతో కవిత్వం వ్రాసి ప్రపంచానికి అందిస్తాడు. అయినా ఒక సత్కవీశ్వరుణ్ణి పోషించడానికి పూర్వపుణ్యం కూడా ఉండాలి కదా! కేవలం ధనం వుంటే సరిపోదు కదమ్మా, బతుకమ్మా!

 
       

54.

 క||  శుష్కము సంస్కృతమనుచునె
ముష్కరులిట సంస్కృతపదములె వాడుచు,పెన్‌
దుష్కృతులన్‌ రచియింతురె
నిష్కృతిలేదమ్మ, చావనీ, బతుకమ్మా!
 
   

4.10.2010 మ. 3.00 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! ఈ కాలంలో సంస్కృతం దేవభాష కాదు మృతభాషనీ, దానివల్ల ప్రయోజనం లేదనీ కొందరు చవటలూ, మూర్ఖులూ వితండవాదం చేస్తూ సంస్కృతపదాలూ, చిన్నచిన్న సమాసాలూ వాడుతూ విపరీతధోరణిలో చవకబారు సాహిత్య గ్రంథాలు వ్రాస్తున్నారు. ఆ భాషని ద్వేషిస్తూ, దూషిస్తూ దాని ప్రభావానికి లోనవుతున్నారు. వీరికి కనువిప్పు కలిగించు, కరుణించు. లేదా ఈ జన్మకి అలాగే అజ్ఞానంతో చావనీ!

 
       

55

క|  ప్రతి అంశము స్పష్టముగా
అతులిత మృదుమధురముగ, మహాద్భుతముగ, ఆ
శ్రుతివలె ప్రకటించు మతిని
ధృతినిడి, పలికించవె జననీ బతుకమ్మా!
 
   

5.10.2010 ఉ. 10.56 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! నేను ఏది మాట్లాడినా, ఉపన్యసించినా, వ్రాసినా, చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా సులభంగా, మధురంగా, మహాద్భుతంగా వేదఋక్కులవంటి భావాలతో శక్తిమంతంగా ప్రకటించే బుద్ధివైభవాన్ని, ధైర్యాన్నీ ప్రసాదించి, పలికించు తల్లీ!

 
       

56.

 క|| గణపతి ఉత్సవములలో
మనలో ఒకరయి, సమతల మధురాకృతులౌ
ఘన'ముస్లిం' సోదరులకు
మనసారగ వందనములు మరి, బతుకమ్మా!
 
   

5.10.2010 రాత్రి 12.30 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా, వైభవంగా జరిపి నిమజ్జనం చేసే సమయంలో, మధురమైన మంచిమనస్సుతో, స్నేహభావంతో ప్రసాదాలు పంచుతూ, ఊరేగింపులో పాల్గొంటూ, ప్రజలకూ, భక్తులకు సహాయసౌకర్యాలు అందించే సమతా హృదయులైన ముస్లింసోదరులకు మనసారా అభివందనములు తెలియజేస్తున్నాను.

 
       

57.

క|| విద్యోద్యోగములు వదిలి
ఉద్యమమున అమరులైన ఉత్తములకు, నా
పద్యముతో జోహారులె
సద్యోగార్థప్రదాత్రి! సరి బతుకమ్మా!
 
   

4.10.2010 రాత్రి 11.47 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! అన్యాయాలను ఎదిరించే ఉద్యమాలలో చేరి, తమ చదువులను, ఉద్యోగాలను వదలి, పోరాడి అమరులైన ఉత్తములకు నా పద్యంతో జోహారులు తెలియజేస్తున్నాను. వారికి ఉత్తమగతులు కలిగించు. వారి సదాశయాలు సిద్ధింపచెయ్యి. వారి కుటుంబాలకు తగిన ఆర్థికసహాయం అందించు తల్లీ!

 
       

58.

క|| కాకతిరుద్రమకాలపు
శ్రీకరమౌ సంస్కృతి కడు చిత్రముగా, పెన్‌
చీకటిముసిరనదయ్యెను
మా కర్మమొ! కాలమహిమొ! మరి బతుకమ్మా!
 
   

2.10.2010 సా|| 5.31 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! కాకతి రుద్రమదేవినాటి శ్రీకరమైన భాషా, సంస్కృతి ఈనాడు చీకట్లు ముసురుకొన్నది. ఇది మా కర్మో? కాలమహిమో? నీ దివ్యశక్తిప్రభావంతో మళ్ళీ ఈ నేల మహోన్నతభాషాశిల్పకళా సంస్కృతులతో వెలిగేలా అనుగ్రహించు!

 
       

59

క|| శాంతము కావలెనా? కడు
ధ్వాంతము కావలెన? తగని పంతమున విషా
దాంతము కావలెనా? ఈ
ప్రాంతము, చేయుమిక సంస్కరణ, బతుకమ్మా!
 
   

5.10.2010 ఉ. 9.30 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! ఈ తెలంగాణాప్రాంతం కొన్ని వందల సంవత్సరాలుగా అన్యాయానికీ, అశాంతికీ గురౌతోంది. ఇంకా ఇప్పుడు కూడా అలాగే అణచివేతలతో చీకట్లు ముసురుకొని విషాదాంతమై కొనసాగాలా? నువ్వే తగిన సంస్కరణ చెయ్యి తల్లీ!

 
       

60.

 క|| గుడికి, మసీదుకు, చర్చికి
కడుభక్తిని పోయివచ్చుగద పావురముల్‌
మిడిమిడి జ్ఞానపు జనులకు
గొడవలు కొట్లాటలెందుకో బతుకమ్మా!
 
   

5.10.2010 ఉ. 8.43 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! పావురాలు గుడిగోపురం మీద వాలుతాయి. అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి. మసీదుమీద, చర్చిలమీద కూడా గూళ్ళు కట్టుకుంటాయి. అన్నిమతాల వారి ప్రార్థనలూ వింటాయి. మూడు ప్రార్థనామందిరాలకీ వెళుతూ వస్తూ వుంటాయి. గుడిపావురాలు, చర్చిపావురాలు, మసీదుపావురాలు ఆని వర్గాలుగా ఏర్పడి కొట్టుకోవడం లేదు కదా! మరి మిడిమిడి జ్ఞానం కల యీ మనుషులు దేవుడి పేరుతో, మతాలపేరుతో గొడవలూ, కొట్లాటలూ చేస్తూ వుంటారెందుకమ్మా!

 
       

61.

క|| రాలమ్ము వారు నేతల?
పాలమ్మెడివారు, ఆస్తిపరులా? ధరలో
పూలమ్మువారు పేదల?
పూలమ్మా విప్పవె చిక్కుముడి, బతుకమ్మా!
 
   

5.10.2010 ఉ. 10.16 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! నాకో సందేహం. గ్రానేటురాళ్ళు, ఇటుక, నాపరాళ్ళు అమ్మేవారు పెద్ద నాయకులౌతున్నారు. పాలు అమ్మేవారు కూడా కొంత పాడి, ఇల్లు కలిగి ఆస్తిపరులుగానే వున్నారు. మరి పూలమ్మేవారు మాత్రం నిరుపేదలుగానే వుండిపోతున్నారు. ఈ చిక్కుముడి కాస్త విప్పి చెప్పవమ్మా, పూలమ్మా!

 
       

62.

క|| జాలిని విడనాడి కబే
ళాలకు తరలించి గోవుల వధించగ నీ
నేలన్‌, పూవుల కులుకుచు
ఏలా చూచెదవె? ఆపవే! బతుకమ్మా!
 
   

5.10.2010 ఉ. 6.33 ని||

 
తా. ఏమమ్మా బతుకమ్మా! ఏ మాత్రం జాలిలేకుండా రోజూ వేలవేల గోమాతలని కబేళాలకు తరలిస్తూ వధిస్తుంటే, నువ్వు మాత్రం ఈ భూమ్మీదే పూలలో కులుకుతూ కూర్చుని చూస్తున్నావా? చాలు. ఆపవమ్మా ఆ గోవధని!  

63

క|| చిన్న అపరాధములకున్‌
తన్నులు తిని జైళ్ళకేగి దౌర్భాగ్యులుగా
ఖిన్నులుగా జీవించెడి
చిన్నల విడిపించుము కృపచే, బతుకమ్మా!
 
   

5.10.2010 తెల్లవారుఝాము 5.53 ని||

 

తా. చిన్న చిన్న తప్పులూ, నేరాలు చేసి, దెబ్బలు తిని జైళ్ళలో మగ్గుతూ, బాధలు పడుతూ జీవితాల్ని దుర్భరంగా గడిపే చిన్న వారిని (పలుకుబడి, డబ్బూలేనివారిని) ఆ జైళ్ళనుండి విడిపించి మంచిగా బ్రతికేలా అనుగ్రహించు తల్లీ!

 
       

64.

క|| త్రాగుడుతో ఆదాయము
బాగుగ వచ్చును, ప్రభుత్వపాలన సులువౌ
త్రాగుడును నిషేధించిన
సాగదిక ప్రభుత్వమె, తెలుసా? బతుకమ్మా!
 
   

5.10.2010 రాత్రి 12.21 ని||

 

తా. నీకీ విషయం తెలుసా బతుకమ్మా! ప్రజలు బాగా తాగుబోతులైతేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందిట. ఆ డబ్బుతో పరిపాలన తేలికౌతుందిట. మద్యపాననిషేధం చేస్తే ప్రభుత్వం సాగదుట. నీ బిడ్డలు తాగుబోతులు కాకుండా చూడలేవా తల్లీ?

 
       

65.

 క|| రుబ్బును పనిచేయించుచు
పబ్బములన్‌ గడుపుకొనుచు, పనియైన తుదిన్‌
డబ్బులు ఎగద్రొబ్బు దొరల
గబ్బును వదిలించవె, తెలివిగా బతుకమ్మా!
 
   

5.10.2010 ఉ. 9.12 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! మానవత్వం లేకుండా యంత్రాల్లా పనిచేయించుకొని, వారి పని అయిన తర్వాత ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా ఎగవేసే దొరలపీడ తెలివిగా నువ్వే వదిలించు తల్లీ!  
       

66.

క|| ఈ నేతలు ఆ నేతలు
చేనేతను అగ్గిబుగ్గి చేసిరె, యికపై
బానల సిరిజల్లులతో
చేనేతకు ప్రాణమొసగు సిరి బతుకమ్మా!
 
   

2.10.2010 ఉ. 11.04 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! ఈ నాయకులో? ఆ నాయకులో? ఎవరైతేనేం. చేనేతకళాకార్మికుల బ్రతుకులలో చిచ్చుపెట్టారు. నువ్వైనా బంగారు కాసులబిందెలని వంచి, ఆ కనకధారలతో చేనేతకి ప్రాణం పొయ్యి తల్లీ!  
       

67

క|| నేతల దౌర్భాగ్యముచే
నేతకళాకారులిపుడు నిర్భాగ్యులుగా
ఈ తావున వెతలొందిరె
మాతా చేయూతనీవె, మా బతుకమ్మా!
 
   

2.10.2010 ఉ. 11.18 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! మా నాయకుల భావదారిద్య్రం వల్ల మా నేత కళాకారులందరు నిరుపేదలుగా మారి బాధలు పడుతున్నారు. మహాలక్ష్మీ స్వరూపిణివైన నువ్వే మా నేతకళాకారులకిక చేయూతనివ్వాలి తల్లీ!

 
       

68.

 క||  పీతాంబరములు గూర్తుము
ప్రీతిగ నీ పతి ధరింప ప్రియమగు రీతిన్‌
మాతా శ్రీకరి వేగమ
ఊతముగా చేయినిమ్మ ఓ బతుకమ్మా!
 
   

2.10.2010 ఉ. 10.59 ని||

 
తా. శ్రీమహాలక్ష్మివైన ఓ బతుకమ్మా! నీ భర్త అయిన విష్ణుమూర్తికీ, నీకు భక్తితో పీతాంబరాలు సమర్పించుకుంటాము. నీ శ్రీకరముతో మా నేత కళాకారులని దీవించు తల్ల్లీ!  

69

 క|| మాదగు పాదును తడుపక,
మా దప్పిక తీర్చకుండ, మా దారుల తాన్‌
పాదము నిలుపక పరుగిడు
గోదావరి, అడుగుమెందుకో, బతుకమ్మా!
 
   

2.10.2010 మ. 12.16 ని||

 

తా. ఈ గోదావరి వరస మాకేమీ అర్థం కావడంలేదు బతుకమ్మా! మా తెలంగాణాలో ఒక్కపాదును కూడా తడపకుండా, మా దాహం తీర్చకుండా, మా నేలపై నుంచే ఒక్కనిమిషం కూడా ఆగకుండా పరిగెత్తుకుపోతుంది. ఇలా ఎందుకు చేస్తోందో నిలదీసి అడగవమ్మా!

 

70.

క|| గౌరివి నీవని కొలువగ
తా రోసము చెంది గంగ, దక్కక మాకున్‌
దూరముగా జరిగి జరిగి
ఘోరముగా పోయెనె, అదిగో బతుకమ్మా!
 
   

2.10.2010 మ. 12.25 ని||

 

 తా. అమ్మా బతుకమ్మా! మేం నిన్ను గౌరమ్మవని పాటలుపాడుతూ భక్తితో పూజిస్తుంటే, గంగ అయిన గోదావరి నీపైన అసూయతో నీ మూలంగా మాకు దక్కకుండా దూరదూరంగా జరిగి మాకు ఘోరమైన అన్యాయం చేసిపోతోంది. అదిగో అటు చూడు. నీకే తెలుస్తుంది.

 
       

71

క|| ఇక్కడ అరగజము తడుప
దక్కడనో ఏడుపాయలై ప్రవహించున్‌
అక్కా అడగవె న్యాయము
టక్కరి గోదారిని అకటా, బతుకమ్మా!
 
   

2.1-0.2010 మ. 1.32 ని||

 
తా. ఏమిటమ్మా ఈ గోదావరి టక్కరితనం? మా తెలంగాణాలో అరగజం నేల కూడా తడపదు. కానీ అక్కడ కోనసీమలో ఏడుపాయలై (సప్తగోదావరులు) ప్రవహిస్తూ ఆ ప్రాంతపు పొలాలన్నీ పండించి, అక్కడివారి దాహం తీరుస్తుంది. మేం ఏం పాపం చేశామని ఈ పక్షపాతం? ఎందుకిలా మాకు అన్యాయం చేస్తోందో నిలదీసి అడుగు.  
       

72.

 క|| మేమన్యాయంబైతిమి
ఈ మాటకు సాక్ష్యమిచ్చునిచ్చటి చెరువుల్‌
భూముల్‌, బొందలగడ్డలు
మీ, మా, మోముల్‌ నిజము సుమీ బతుకమ్మా!
 
   

2.10.2010 సా. 5.46 ని||

 

తా. మేం అన్యాయం అయినామనడానికి సాక్ష్యాలు ఇక్కడ మీరు ఆక్రమించిన చెరువులు, భూములు, స్మశానాలు, మీ దొంగముఖాలూ, బాధతో, కోపంతో వున్న మా ముఖాలే సాక్ష్యాలు.

 
       

73.

 క|| తామేలుచు తెలగాణము
తామే మేలును గొనుచును, తాబేళ్ళగుచున్‌
మా మేలును చేయునపుడు
కాముకులై దోచుకొనిరి కద, బతుకమ్మా!
 
   

2.10.2010 సా. 5.56 ని||

 

తా. ఓ బతుకమ్మా! మా తెలంగాణా ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా స్థానికులు కాకుండా ఇతరులు తామే పరిపాలిస్తూ, తమ మేలే తాము చూసుకొంటూ, మాకు ఏదైనా మేలు చేసేప్పుడు తాబేళ్ళులాగా నిదానంగా వుండే విధానాలతోనూ, కనిపించకుండా ముడుచుకుపోతూ పదవీకాముకులై, మా ధనమాన ప్రాణాలను హరిస్తూ దోచుకున్నారు. ఇకనైనా ఈ పీడ మాకు వదిలించు తల్లీ!

 
       

74.

 క|| ఎదగలది తెలంగాణము
ఎదగగలది ఒదగగలది ఎవ్వరినైనన్‌
ఎదిరించగలది తలపడి
తుదివిజయము దాక తెగువతో, బతుకమ్మా!
 
   

2.10.2010 రాత్రి 8.12 ని||

 
తా. ఓ బతుకమ్మా! ఈ తెలంగాణా గొప్పహృదయం కలది. గొప్పఅభివృద్ధిని సాధించగలది. మంచివారికీ, ఉత్తమసంస్కారులకీ ఒదగగలది. ఎవ్వరినైనా సాహసించి 'ఢీ' అని ఎదిరించగలది. పోరాడి చివరికి విజయం సాధించగలది.  
       

75

క|| నెత్తురులో పోరాటపు
సత్తువగల నీ కొమరుల సారా, నీరా
మత్తున మునుగుచు, నేతల
తొత్తులుగా ఉంచబోకు, తుది బతుకమ్మా!
 
   

2.10.2010 మ. 2.11 ని||

 

తా. ఈ తెలంగాణాప్రాంతపు యువకులనెత్తురులో అన్యాయంపైన తిరగబడిపోరాడే సత్తా వుంది. అటువంటి నీ కుమారులు చెడు అలవాట్లకు లోనై సారా, నీరా మొదలైన మత్తుపదార్థాల మాయలో పడి, శక్తిని కోల్పోయి స్వార్థనాయకులకు తొత్తులుగా పనిచేసేలా చెయ్యకు. వారిని ధీరులుగా, ఆరోగ్యవంతులుగా జీవించేలా అనుగ్రహించు తల్లీ!

 
       

76

క||

ఆ వైపో ఈ వైపో
ఏ వైపో ఉండకుండ, ఈ శతకంబున్‌
నా వైపునుండి వ్రాసితి
దీవింపవె గొని యిక జగతిన్‌ బతుకమ్మా!

 
   

3.10.2010 ఉ. 6.33 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! నేను సీమాంధ్ర ప్రజలవైపునో, తెలంగాణాప్రజల వైపునో వుండకుండా భక్తుడిగా, కవిగా నా వైపు నుండి ఈ శతకాన్ని వ్రాశాను. నన్ను దీవించి, ఈ శతకాన్ని అంకితం తీసుకో!

 
       

77.

 క||

 జేనెడు జాగానిచ్చిన
తేనియ పుట్టలను పెట్టు తెలివిగ, కదుపన్‌
మేనెల్ల కుట్టి తరుమును
ఈ నాటిది కాదు, తెలిసెనే బతుకమ్మా!

 
   

5.10.2010 మ. 2.17 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! మామిడిచెట్టుకొమ్మ మీదకి ఎక్కడెక్కడినుండో కొన్ని వేల తేనెటీగలు వచ్చి, జేనెడు జాగాలో తేనెపట్టు పెడతాయి. వెళ్ళమని కొమ్మ కదిపితే, ఒళ్ళంతా కుట్టిపెడతాయి. మేం కష్టపడి తేనెపట్టు పెట్టుకున్నామంటాయి. ఈ గొడవ ఈనాటిది కాదు. ప్రకృతిలో చాలా సహజం అనిపిస్తోంది. నువ్వే తగిన న్యాయం చెయ్యి తల్లీ!

 
       

78.

క||

నిష్పత్తుల తేడాతో
దుష్పరిణామములటునిటు దుర్భరమయ్యెన్‌
బాష్పాక్షిగ మారెను భువి
పుష్పాంబా! ధర్మము నిలుపుము, బతుకమ్మా!

 
   

5.10.2010 మ. 2.40 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! కాస్త అటూ ఇటూగా ఆ వైపునా, ఈ వైపునా కూడా పరిణామాలు తీవ్రమైనాయి. ఈ దారుణం చూస్తూ నేలతల్లి కన్నీరు పెడుతోంది. ఓ పూలతల్లీ! ధర్మాన్ని నిలబెట్టు, ధర్మానికి విజయాన్ని కలిగించు !

 
       

79.

 క||

బాసన్నది హృదయంబౌ
యాసలు కనుముక్కు మోములంగాంగంబుల్‌
బాసకు భాషణ ప్రాణము
బాసరసతి! కాదనుట సబబా, బతుకమ్మా!

 
   

4.10.2010 ఉ. 8.41 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! భాషనేది ఒక జాతికి హృదయం. ఆ భాషలోని యాసలు కన్ను, ముక్కు మొదలైన ఇతర అవయవాలు. ఏ భాషకైనా అందరూ మాట్లాడటమే దాని ప్రాణం. బాసర సరస్వతిపైన ఓ బతుకమ్మా! ఇలా కాదని ఎవరైనా అంటే అది సరియైన పద్ధతేనా? నువ్వే చెప్పు, కాదని.

 
       

80.

క||

ఎవరేలిన నాకేమగు
ఎవరెటుపోయినను లాభమేదియు లేదే
వివరంబిట్టిదె కానీ
కవిగా బాధ్యతయు కలదుగా, బతుకమ్మా!

 
    3.10.2010 మ. 2.08 ని||  

తా. అమ్మా! నిజానికి ఈ నేలని ఎవరు పరిపాలిస్తే నాకేమిటి? ఎవరెవరితో కలిసిపోయినా, విడిపోయినా నాకు లాభం కానీ నష్టం కానీ లేదు. వ్యక్తిగతంగా నాకు నష్టం లేదు కానీ, కవిగా సమాజానికి ధర్మం చెప్పవలసిన బాధ్యత వుంది. కనుక ఈ శతకంలో, ఈ సమయంలో జరుగుతున్న రాష్ట్రవిభజనప్రస్థావనపైన కూడా నా అభిప్రాయం చెబుతున్నాను.

 
       

81.

క||

విడిపోయిన విడిపోదము
విడివిడిగా ఉన్నకూడ, విడదీయనివీ
ఎడదను తడి, తెలుగునుడియె
పుడమిని మనలనెపుడు, కలుపున్‌ బతుకమ్మా!

 
   

3.10.2010 తెల్లవారు ఝాము 5.57 ని||

 
తా. విడిపోతే విడిపోదాం. మనం విడివిడిగా వున్నా కూడా మనలని విడదీయలేనివి మన హృదయాల్లో వుండే బంధం, తెలుగుభాష. ఇవి ఈ నేలపైన మనల్ని ఎప్పుడూ కలిపే వుంచుతాయి.  
       

82.

 క||

ప్రాంతీయబేధవాదము
శాంతముగా చర్చలందు సపరిష్కృతమై
సంతసమొందెడి తీర్పును
వింతగ ప్రకటింపజేయవే బతుకమ్మా!

 
   

2.10.2010 మ. 2.22 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! ఈ ప్రాంతీయభేదవాదం చర్చల్లో శాంతంగా పరిష్కరింపబడి అందరికీ ఆమోదయోగ్యమై, సుఖసంతోషాలను కలిగించే విధంగా అద్భుతమైన, ధర్మబద్ధమైన తీర్పు ప్రకటించేలాగా అనుగ్రహించు తల్లీ!  
       

83

క||

 సంపద దోపిడి చేయుచు
పంపిణియే చేయకున్న ఫలితములెపుడున్‌
కొంపలు ముంచును, వారల
దుంపలు తెంపును, నిజమిదె తుది బతుకమ్మా!

 
   

17.10.2010 మ. 12.25 ని|| - విజయదశమి

 

తా. తెలివిగలవారు స్వార్థంతో సంపదని దోపిడీ చేస్తూ, కొంతయినా జనానికీ, కష్టపడేవారికీ పంచకపోతే దాని ఫలితం చివరికి వారి కొంపలు ముంచేలా చేస్తుంది. ప్రజల్లో అసూయలు, ఆగ్రహాల రూపంలోనూ, (దైవపరంగానూ) వాళ్ళ దుంపతెంపాలనే ఆలోచనలతో ఉద్యమాలూ మొదలౌతాయి. ఇది నిజంకదా బతుకమ్మా!

 
       

84.

 క||

పరహితమే మోక్షపథóము
మరణించియు బ్రతుకగల్గు మార్గంబిదియే
ధరనింతకంటె ధర్మము
పరమాత్మకు తెలియదె, తెలుపన్‌ బతుకమ్మా!

 
   

5.10.2010 అర్థరాత్రి 1.01 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! ఇతరులకు మేలుచేయడమే ముక్తికి మార్గం. మనిషి చనిపోయినా బ్రతికే సాధనం ఇదే. ఈ భూమిపైన ఇంతకంటే గొప్ప ధర్మాన్ని భగవంతుడు కూడా చెప్పలేడు. ఆయనకీ తెలియదు.  
       

85.

క||

బితుకు బితుకు మనిపించని
బ్రతుకువు, ముక్తికి అతుకువు, పరమాద్భుతమౌ
హితమతివి, జీవన భృతివి,
కృతివి, ధృతివి, ద్యుతివి, సుగతివే బతుకమ్మా

 
   

5.10.2010 ఉ. 8.07 ని||

 

తా. ఓ బతుకమ్మా! భయం భయంగా కాకుండా ధైర్యంగా సాగే బ్రతుకువి. ముక్తిని కలిగించేదానివి. పరమాద్భుతమైన మేలు చేకూర్చేదానివి. మా జీవనానికి కావలసినవన్నీ ప్రసాదించేదానివి. కావ్యస్వరూపిణివి. ధైర్యాన్ని కలిగించే దానివి. ప్రకాశస్వరూపిణివి. మంచిదారివీ నువ్వే తల్లీ!

 
       

86.

క||

ఆరుగురు దోచుకొందురె
ఘోరముగా రేయిపవలు, గోప్యముగా నన్‌
వారల తరిమెడి సాహస
వీరునిగా తీర్చిదిద్దవే బతుకమ్మా!

 
   

4.10.2010 ఉ. 6.42 ని||

 
తా. అమ్మా! బతుకమ్మా! ఈ నేలనీ, ఇక్కడి సహజవనరులనీ ఎవరో పరాయివారు దోచుకుంటుంటే ఎదిరించే ధైర్యమూ, సాహసమూ ఇవ్వడమే కాదు. నాకే తెలియకుండా నాలోనే పొంచి వుండి, చాలా రహస్యంగా నా సుగుణాలని హరించే ఆరుగురు దోపిడీదారులని (అరిషడ్వర్గాలని) ఎప్పటికప్పుడు కనిపెట్టి నాలో నుండి వారిని తరిమి వేసే సాహసయోగవీరునిగా నన్ను తీర్చిదిద్దుతల్లీ!  
       

87

 క||

ముగ్గురు, ఎవరికి వారే
తగ్గరు, తలయొగ్గరు, పరతత్త్వంబునకున్‌
దగ్గరకు చేరి కావవె
మొగ్గను వికసింపజేసి భువి బతుకమ్మా!

 
   

4.10.2010 ఉ. 6.54 ని||

 

తా. బతుకమ్మ తల్లీ! నాకు మరో ముగ్గురు గొప్పస్నేహితులు వున్నారు. (సత్త్వరజస్తమస్సులు) నేను ఎవరితో కలుద్దామన్నా కలవనీయరు. నేనే గొప్పవాణ్ణనే భావం నాకు బాగా కలిగించి, నన్ను ఎవరితోనూ కలవనీయడం లేదు. చివరికి నీతో కూడా! వాళ్ళ ప్రభావానికి లోనై నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. చిన్నిమొగ్గలాంటి నా తత్త్వాన్ని సంపూర్ణంగా వికసింపచేసి, నన్ను మంచిదారిలో నడిపించు తల్లీ!

 
       

88.

 క||

ఈ లోకములన్నింటిని
ఏలుచు తెలగాణజనుల ఇలవేలుపువై
మేలొనరింపగ నిలిచిన
శ్రీలలితగ తలతు నిన్ను సిరి బతుకమ్మా!

 
    3.10.2010 సా. 5.37 ని||  

తా. ఓ బతుకమ్మా! నువ్వు ఈ లోకాలన్నీ ఏలుతూ తెలంగాణా జనాల ఇలవేలుపువై, జగతిజనులను అనుగ్రహించే శ్రీ లలితా త్రిపురసుందరిగా భావించి పూజిస్తాను. నన్ను అనుగ్రహించు.

 
       

89.

క||

నీ యానందాకృతియును
నీ యందము, స్వచ్ఛతయును, నిత్యము కనినన్‌
మా యమ్మగ తోచెదవే
ఓ యమ్మా దీవెనలిడుమో బతుకమ్మా!

 
   

11.10.2010 రాత్రి 7.57 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! పూలతల్లీ! నీ నవ్వుల పువ్వుల ఆనందస్వరూపంతో, నీ స్వచ్ఛతతో, నీ అందంతో ఎప్పుడూ మా అమ్మలాగే అనిపిస్తావు. నన్ను మా అమ్మలాగే దీవించవమ్మా, బతుకమ్మా!  
       

90.

  క||

బతుకమ్మలున్న ఇంటను
సతతము సుఖశాంతులుండు, సంపదలుండున్‌
శతవత్సరములు బ్రతికెడు
హితమౌ ఆరోగ్యముండునే బతుకమ్మా!

 
   

4.10.2010 మ. 3.54 ని||

 
తా. బతుకమ్మలను పూజించే ఇళ్ళల్లో ఎప్పుడూ సుఖశాంతు లుంటాయి. సిరిసంపదలుంటాయి. దృఢమైన ఆరోగ్యంతో, వందసంవత్సరాలు బ్రతికే దీర్ఘాయువుని నువ్వు ప్రసాదిస్తావు తల్లీ.  
       

91.

 క||

ప్రసరింపుచు నీ కరుణన్‌
అసమానంబైన యట్టి ఆరాధనలో
రసదర్శనమొసగితివే
ఋషిజీవనమొసగి నడుపుమిక బతుకమ్మా!

 
   

3.10.2010 రాత్రి 11.03 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! అపారమైన నీ రుణని ప్రసరించి నా కవితా రాధనలో రసరూపిణివైన నీ దర్శనం కలిగించావు. ఇకపైన ఋషి జీవనాన్ని ప్రసాదించి దివ్యమార్గంలో నడిపించు.  
       

92.

 క||

బతుకమ్మకు భక్తుడనై
బతుకమ్మ దయాప్రసార పరిపూర్ణుడనై
బతుకమ్మ శతకమల్లీ
లతనై నిన్నల్లుక వదలన్‌, బతుకమ్మా!

 
    19.11.2010 ఉ. 11.12 ని|| డెట్రాయిట్‌ సాయిగారింట్లో  
తా. ఓ బతుకమ్మా! నేను నీ భక్తుడనై, నీ కరుణను సంపూర్ణంగా పొందిన కవినై, ఈ బతుకమ్మశతకమనే మల్లెతీగనై నీ పాదాలకు అల్లుకుని వదలకుండా అలాగే నిన్నారాధించేలా అనుగ్రహించు తల్లీ.  
       

93.

 క||

వాగ్జ్యోతిన్‌ వెలిగింపుము
ప్రాగ్జ్యేష్ఠుల్‌, నవ్యకవులు, ప్రాజ్ఞులు మెచ్చన్‌
దృగ్జ్యోత్స్నామృతరసమయి
ఋగ్జ్యా! వాత్సల్యశీల! ఇల బతుకమ్మా!

 
   

24.12.2010 ఉ. 8.59 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! వేదమాతా! వాత్సల్యగుణం కల తల్లీ! చూపులలో వెన్నెలవంటి చల్లదనం. స్వచ్ఛతగల అమృతరసస్వరూపిణీ! పూర్వకవులు, మహాపండితులు, ఆధునిక కవులు, ప్రాజ్ఞులు అందరూ మెచ్చే విధంగా నా వాక్కు అనే జ్యోతిని వెలిగించు. దివ్యకాంతులు వెదజల్లే వాక్కులను ప్రసాదించు తల్లీ!  
       

94.

క||

ఈ భాషకు, ఈ జాతికి
ఈ భూమికి, శుభములొసగి హితమును ప్రగతిన్‌
వైభవమును కలిగించవె
శ్రీ భారతి పార్వతివయి, సిరి బతుకమ్మా!

 
   

4.10.2010 మ. 4.14 ని||

 
తా. ఓ బతుకమ్మా! నువ్వు మహాలక్ష్మివై, సరస్వతీదేవివై, పార్వతీదేవివై ఈ తెలంగాణా నేలకీ, ఈ భాషకీ, శుభాన్నీ, అభివృద్ధినీ, వైభవాన్నీ కలిగించు.  
       

 95.

 క||

ప్రైజింగ్‌ యూ హానెస్టీ ్ల
థౌజండ్సాఫ్‌ గుడ్‌ఫ్లవర్సు, దైర్‌ వర్‌షిప్‌ యీజ్‌
రీజన్‌లెస్‌, బ్లూజమ్‌నెస్‌,
హౌ జనరస్‌, ప్లీజ్‌ గివు దెము ఆల్‌ బతుకమ్మా!

 
   

 18.11.2010 మ. 12.04 ని|| - డెట్రాయిట్‌ సాయిగారింట్లో

 
తా. అమ్మా బతుకమ్మా! వేలరకాల పూలు నిన్ను ఎంతో ఉన్నతభక్తిభావంతో కీర్తిస్తున్నాయి. వాటి భక్తికి మరే కారణమూ, కోరికా లేదు. తమకు ఇంత సుగంధభరితమైన, మధురమైన, సౌందర్యవంతమైన జన్మనిచ్చావనే కృతజ్ఞతతో, మనోవికాసంతో నీకు సర్వసమర్పణ చేసుకుంటున్నాయి. ఎంతటి సంస్కారం! దయచేసి ఆ పూలన్నింటినీ దగ్గరకు చేర్చుకొని అనుగ్రహించు తల్లీ.  
       

96.

క||

రూపవతి! అమృతవర్షిణి!
శ్రీ పావని! చారుకేశి! శృంగారిణి! ఆ
లాపి! శివరంజని! జయ
శ్రీ! పూర్ణలతిక! సుగాత్రి! శ్రీః! బతుకమ్మా!

 
   

4.12.2010 సా|| 5.08 ని||

 
తా. రాగస్వరూపిణివైన ఓ బతుకమ్మా! నువ్వు చక్కని రూపం గల దానవు. భక్తులపై అమృతాన్ని కురిపించేదానవు. పరమపావనమైన మహాలక్ష్మివి. అందమైనకురులు గలదానవు. అలంకారప్రియవు. మధురమైన రాగాలాపన చేసే సరస్వతివి. పరమశివుని రంజింప చేసే పార్వతివి. విజయలక్ష్మీస్వరూపిణివి. సంపూర్ణముగా తీగసాగి చైతన్యముతో వికసించిన పూలతీగవు. (కుండలినీ చైతన్యలతవు) పువ్వువంటి సుకుమారసుందర దేహముగలదానవు. శ్రీలక్ష్మివి...  
       

97.

 క||

మాపగ, మా గనిని దగా
మా పని మా దరిని సరిగ, మాదని పసగా
దాపగ దాగనిదని దా!
మా పాపగ, మా మని, గని మరి బతుకమ్మా!

 
   

20.12.2010 ఉ. 11.50 ని|| - డెట్రాయిట్‌ సాయిగారింట్లో

 

మాపగ - మాపగా (లేకుండా చేయగా)
మా గనిని - మా సింగరేణి గనిలో...
దగా - జరిగే మోసాన్ని...
మా పని మా దరిని- మా ప్రాంతంలోని గనిలో మాకు రావలసిన ఉద్యోగం
సరిగ - నిజానికి
మాదని - మాకే రావాలని
పసగా - తప్పనిసరిగా...
దాపగ - ఆ విషయం ఎంతగా దాచాలనుకున్నా
దాగనిది+అని- దాగనిదని
మా పాపగ - మమ్మల్ని కాపాడే బాలాత్రిపురసుందరివైన బతుకమ్మగా
మా మనిన్‌ + కని - మా మనిగని = మా మనుగడని చూసి
మరి దా - ఇక మాకు న్యాయం చేసేందుకు పూనుకొనిరా తల్లీ!

తా. మా తెలంగాణాప్రాంతంలో, సింగరేణిగనిలో ఉద్యోగాల విషయంలో మాకు జరిగే మోసాన్ని మాపగా, మా ప్రాంతంలోవున్న గనిలో పని మాకే తప్పని సరిగా రావాలని, ఆ విషయం ఎంతగా దాచాలన్నా దాగదనీ, మా బాధలు చూసి మమ్మల్ని కాపాడే బాలా త్రిపురసుందరిగా మాకు న్యాయం చేసేందుకు పూనుకొని రావమ్మా బతుకమ్మా!

 
       

98.

 క||

గణపతిచతుర్థి పండుగ
జనులందరు చేసినట్లు, జగమెల్ల ఇకన్‌
ఘనముగ నీ పూజ సలిపి
మనుగడ సాగించుగాక మహి, బతుకమ్మా!

 
   

3.10.2010 ఉ. 9.26 ని||

 

తా. వినాయకచవితి పండుగ ఊరూరా, వీధివీధిలో, ఇంటింటా జనమంతా ఎలా జరుపుకుంటారో అలాగే లోకంలో జనులందరూ నీ పూజచేసి వారివారి కోరికలు సిద్ధింపచేసుకోవాలని నా కోరిక. జనులందరికీ నీ మహిమ, నీ తత్వ్తం, శక్తి, తెలియచేసి వారిని కరుణించు తల్లీ!

 
       

99.

క||

మృదువుగ సంభాషించుట,
పదిమందికి మంచినెంచి పంచుట, ఎపుడున్‌
మదిలో తెలుపును నిలుపుట,
ఇది తెలియుట, నిన్నెరుగుట ఇల బతుకమ్మా!

 
   

3.10.2010 రాత్రి 8.36 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! మృదువుగా, హృదయపూర్వకంగా మాట్లాడడం. పదిమందికీ మంచిచేయడం. ఎప్పుడూ మనస్సును నిర్మలంగా, స్వచ్ఛంగా వుంచుకోవడం. ఈ సాధనే నీ ఆరాధన. ఇది తెలియడమే నీ అనుగ్రహాన్ని పొందటంగా భావిస్తాను.  
       

 100.

క||

పుట్టుక ధన్యంబైనది
పుట్టించిన తల్లితండ్రి పుణ్యంబిదియే
వట్టిది నా తెలివన్నది
ఒట్టమ్మా పూలకొమ్మ, ఓ బతుకమ్మా!

 
   

5.10.2010 మ. 2.20 ని||

 

తా. అమ్మా బతుకమ్మా! నీపై భక్తికుదిరి, ఈ శతకం వ్రాసినందుకు భక్తకవిగా నా పుట్టుక ధన్యమైంది. ఈ పుణ్యం అంతా నాకు జన్మనిచ్చిన నిర్మలహృదయులైన నా తల్లిదండ్రులదే. నా తెలివితేటలు, ప్రతిభ అనేవి వట్టిమాట. ఒట్టుతల్లీ, నేను ఏది నమ్ముతున్నానో అదే చెబుతున్నాను.

 
       

101.

 క||

జయమును శుభములనొసగెడి
ప్రియశకునము తెలుపు పాలపిట్టై, శ్రుతితో
లయతో పాడెద కృతినే
జయమంగళగీతిగ వరుసన్‌ బతుకమ్మా!

 
   

3.10.2010 మ. 1.54 ని||

 
తా. ఓ బతుకమ్మా! విజయాలు, శుభాలు కలుగుతాయని మంచిశకునం తెలియచేసే పాలపిట్టనై, చక్కని శ్రుతితో, లయతో నీ జయమంగళ గీతంగా ఈ శతకాన్ని పాడుతాను. నన్ను ఆశీర్వదించి అనుగ్రహించు.  
       

102.

క||

పుట్టితిని విజయవాడను,
పొట్టకొరకు అచటినుండి పోయితి చెన్నై,
అట్టులె వచ్చితి ఇచటకు
నెట్టెదవొ? ధరించెదవొ? మణిన్‌ బతుకమ్మా!

 
    5.10.2010 ఉ. 11.22 ని||  
తా. అమ్మా బతుకమ్మా! నేను పుట్టింది విజయవాడలో. బ్రతుకుతెరువుకోసం అక్కడ నుండి చెన్నైకి వెళ్ళాను. 14 ఏళ్ళు అక్కడ వుండి ఈ భాగ్య నగరానికి వచ్చాను. 13 ఏళ్ళుగా ఇక్కడే వుంటున్నాను. ఇక్కడే వుంచుతావో, ఇంకెక్కడికైనా వెళ్ళమంటావో, నా విలువ తెలిసి నన్ను ఆభరణంగా ధరిస్తావో? నేను రత్నంలాంటి వాణ్ణి. నీ ఇష్టం తల్లీ!  
       

103.

 క||

గట్టిగ జేకొట్టుచు, నీ
జట్టున చేరితిని కవిగ, సాధకునిగ, నీ
దట్టించిన దయచే, తుది
మెట్టెక్కించవె యిల, మిలమిల, బతుకమ్మా!

 
   

5.10.2010 మ. 12.04 ని||

 
తా. అమ్మా బతుకమ్మా! నేనొక భక్తునిగా, కవిగా నీ జట్టులో చేరి నీకు జేజేలు పలుకుతున్నాను. నీ అంతులేని దయతో నన్ను అత్యున్నత విజయశిఖరాన్ని చేరే విధంగా, చివరిమెట్టుదాకా నువ్వే నడిపించు. అక్కడ కూడా నిన్ను ఆరాధిస్తూ వర్థిల్లేలా అనుగ్రహించు.  
       

104.

క||

ఎందరికైనను తావిడు
సుందరపుష్పక విమానశోభాకృతియై
వందనములనందుకొనుచు
పొందుత, తెలగాణము శుభములు బతుకమ్మా!

 
   

5.10.2010 సా|| 5.33 ని|| (టేకాఫ్‌లో) స్ప్రైస్‌జెట్‌ చెన్నైకి

 
తా. ఎంతమంది ఎక్కినా ఇంకా ఎందరికో చోటునిచ్చే పుష్పకవిమానం లాగా, ఎన్నిప్రాంతాలనుండి ఎందరు వచ్చినా అందరికీ వృత్తి వ్యాపారాలు, విద్య, వైద్యం మొదలైనవన్నీ అందించే విషయంలో ఈ తెలంగాణా ఎంతో ప్రగతిని సాధిస్తూ, ఆశ్రయం కల్పిస్తూ, సకల శుభాలూ పొందేలా అనుగ్రహించు తల్లీ!  
       

105.

 క||

తెలగాణపు సిరిలక్ష్మీ!
జలవనరుల సస్యలక్ష్మీ! జాగృతిలక్ష్మీ!
పలుకుల విద్యాలక్ష్మీ!
కలుముల వరలక్ష్మి! దయనుగను, బతుకమ్మా!

 
    5.10.2010 సా|| 5.54 ని|| - ఆకాశవీధిలో  

తా. తెలంగాణా సిరులలక్ష్మీ! జనవనరుల పొలముల ధాన్యలక్ష్మీ! చీకటిలో, చిక్కులలో పడకుండా జ్ఞానమొసగి వెన్నంటి మేల్కొలిపే చైతన్యలక్ష్మీ! వివేకాన్ని కలిగించే విద్యాలక్ష్మీ! సిరిసంపదలు వరాలుగా ఇచ్చే వరలక్ష్మీ! దయతో నన్ను అన్నివిధాలుగా అనుగ్రహించు.

 
       

106.

క||

హితహైమాద్రి కుమారీ!
ప్రతిభాసౌందర్యలహరి! వైభవగౌరీ!
సితగంగాధరనారీ!
శతకమునన్‌ విజయభేరి! జై బతుకమ్మా!

 
   

5.10.2010 సా. 6.20 ని|| - ఆకాశవీధిలో

 
తా. లోకానికి శ్రేయస్సుని కలిగించే హిమవంతుని కుమార్తెవైన పార్వతీ దేవీ! ప్రతిభాసౌందర్యప్రవాహరూపిణీ! వైభవరూపిణివైన గౌరీదేవీ! స్వచ్ఛమైన గంగను శిరస్సున ధరించిన పరమేశ్వరుని రాణీ! ఈ శతకానికి ఎప్పుడూ దశదిశలావిజయభేరి మ్రోగేలా చేసే విద్యాకవనవిజయసరస్వతీ! ఓ బతుకమ్మా నీకు జేజేలు!  
       

107.

 క||

 జై జై జై తెలగాణా!
జై జైై జై ఉత్తరాంధ్ర! జై జై కోస్తా!
జై జై రాయలసీమా!
జై జై ఒకరికొకరు, జై బతుకమ్మా!

 
   

5.10.2010 సా. 5.59 ని|| - ఆకాశవీధిలో

 
తా. తెలంగాణాకు జేజేలు. ఉత్తరాంధ్రకు జేజేలు. కోస్తాకు జేజేలు. రాయలసీమకు జేజేలు. తెలుగునేలలోని ఒకరి సుఖసంతోషాలకి మరొకరు సహకరించేలా చేసే ఓ బతుకమ్మా నీకు జేజేలు.  
       

108.

క||

మంగళమౌ తెలగాణకు
మంగళమౌ తెలుగుభాష మధురాకృతికిన్‌
మంగళమౌ సీమాంధ్రకు
మంగళమౌ నీ ఘనతకు మహి బతుకమ్మా!

 
   

2.10.2010 సా. 6.28 ని||

 

తా. తెలంగాణకు జయమంగళము. అమృతమధురమైన తెలుగుభాషకు జయమంగళము. సీమాంధ్రకు శుభమంగళము. తెలుగువారికందరికీ నిత్యజయమంగళము. ఓ బతుకమ్మా నీ మహిమకు నిత్యశుభమంగళము.

 
:: శుభం ::  

బతుకమ్మా మా బతుకమ్మా

పల్లవి: బతుకమ్మా మా బతుకమ్మా

నీ కనికరమే మా బతుకమ్మా

వేయిశుభాలతో లక్షజయాలతో

కోటివరాలు ఈవమ్మా!

తరతరాలకీ ఈ జనాలకీ!

నీ మహిమలు తెలుపమ్మా!


1 చరణం: సిల్కల్‌ గుట్ట కాడి సిలకముఖి పూలతోటి

సింగారింతుమే బతుకమ్మా!

సంపంగివాగున తెల్లాకల్వలతొ

సోకుల్‌ సేతుమే బతుకమ్మా!

రామప్పసెరువున తామరపూలతో

పూజల్‌ సేతుమే బతుకమ్మా!

మంజీరగట్టున మల్లెల్‌ తెచ్చి నీకు

మాలల్‌ వేతుమే బతుకమ్మా!

2 చరణం: తెలంగానమే తేరుగమారి, నిను

ఊరేగించునే బతుకమ్మా!

నింగీనుంచి ఇరుసంజల్‌ నీ పయిన

రంగుల్‌ జల్లునే బతుకమ్మా!

ఆటాపాటలతో హారాతిచ్చి నీకు

సద్దుల్‌ బెట్టెదమె బతుకమ్మా!

సాటీలేని నీ ప్రేమా, కరుణలే

సాటూకొందుమే బతుకమ్మా!


3 చరణం: అడవీలోని సెట్టుసెట్టూ నీకనీ

విరగబూసెనే బతుకమ్మా!

బీర, కాకరా, తంగేడుపువ్వులే

సేరే నీ పదము బతుకమ్మా!

సేరే సెరువుకీ, సేనుకి, రైతుకి

మేలూ సేయవే బతుకమ్మా!

పిల్లా పాపలని, ఎల్లా వేళలా

సల్లగ సూడవే బతుకమ్మా!

మమ్ము సల్లగ సూడవే బతుకమ్మా!


30.9.2010 రాత్రి 9.45 ని||లకు

 
- జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.  
 

ప్రతులకు : అన్ని పుస్తక కేంద్రాలలో
వెల రూ.50/-

 

Back to main page