వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?!

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే. తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము. ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను.

ఈ నెల చెన్నై నుండి కిరణ్ కుమార్ చావా, వాషింగ్టన్, డి. సి. నుండి ప్రసాద్ చరసాల చెరొక వీరపోగు గెలుచుకున్నారు. వీరిద్దరూ ముందుముందు వీరతాళ్ళు గణించుకోగలరని నా అంచనా.

Hardware/Software/Program: ఈ మూడు మాటలని కలిపి ఒకేసారి పరిశీలిద్దాం. ఈ మూడింటికి తెలుగు మాటలు ఇంతవరకు చెప్పక పోవటానికి కారణం ఉంది. నేను 1968 లో, సైన్సు తెలుగులో రాయటం మొదలు పెట్టినప్పుడు, మొట్టమొదట ఎదురైన సమస్య - ఈ మూడు మాటలకీ తెలుగు ఏమిటా అన్న విషయమే! ఇప్పటివరకు ఇవి కొరుకుబడలేదంటే ఇవెంత కష్టమో మీరే ఆలోచించుకొండి.

నేను పి. హెచ్. డి. థీసిస్ రాస్తూన్న రోజులలోనే కలనయంత్రాల వాడుక విద్యాలయాల్లో పెరగటం మొదలయింది. ఆ రోజులలోనే తెలుగులో ‘కంప్యూటర్లు’ అనే పేరుతో ఒక పుస్తకం రాసి, దానిని ‘తెలుగు భాషా పత్రిక’ లో రెండేళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించేను. అప్పుడు hardware, software, program మొదలైన వాటికి తెలుగు మాటలు వెతుక్కుంటూ స్పెయిన్ నుండి వచ్చిన మిగెల్ ని, “ఒరేయ్ మిగెల్లూ, మీ భాషలో hardware ని ఏమంటారురా?” అని అడిగేను.

వాడు నా కంటె ఘనుడు. అడిగినదానికి సమాధానం చెప్పకుండా, “ఫెర్రాతెరియా” అంటే hardware store అన్నాడు. అనేసి ఊరుకోకుండా, “ ‘ఫెర్రా’ అంటే ‘ఇనుము’, ‘తెరియా’ అంటే ‘దొరికే చోటు’ ” అని అర్ధం చెప్పేడు.

“అలాగయితే ‘కేఫిటేరియా’ అంటే కాఫీ దొరికే చోటు” అని మనస్సులో అనుకుని, “అలాంటప్పుడు ‘తెరియా’ అన్న తోక తగిలిస్తే ‘దొరికే చోటు’ అనే అర్ధం ఎల్లప్పుడూ స్పురిస్తుందా?” అని అడిగేను. “అలా కాదు, కొన్ని మాటల తోకలో ‘తెరియా’ వస్తుంది, కొన్ని మాటల తోకలో ‘ఇయా’ మాత్రమే వస్తుంది అని చెప్పి, ఉదాహరణకి పశువుల దొడ్డిని ‘బకెరియా’ అంటారు అన్నాడు. ఇంత కథనం జరిగింది కాని hardware అంటే ఏమిటో చెప్పలేక పోయాడు. ఈ వ్యాసం రాస్తూన్నప్పుడు, ఈ సందేహం తీర్చుకుందుకి స్పేనిష్-ఇంగ్లీష్ నిఘంటువుని సంప్రదించేను. స్పేనిష్ లో hardware ని కూడా ‘ఫెర్రతెరియా’ అనే అంటారు ట – ఆ నిఘంటువు ప్రకారం. అంటే స్పేనిష్ భాషలో ‘ఫెర్రతెరియా’ అంటే ఇత్తడి సామాను కొట్టు అయినా అవొచ్చు, కంప్యూటర్ అయినా కావచ్చు. ఈ బాధ పడలేక స్పేనిష్‌లో hardware ని హార్డ్వేర్ అనే అంటున్నారు – ఇటీవలి కాలంలో.

మనకి హిందీలో కూడ ఇలాంటి మాటలు ఉన్నాయి. ‘దవాఖానా’ అంటే మందుల కొట్టు. ‘దవా’ అంటే మందు, ‘ఖానా’ అంటే ‘దొరికే చోటు’. మీరు ‘జింఖానా’ అన్న మాట వినే ఉంటారు. పెద్ద పెద్ద ఊళ్ళల్లో ‘జింఖానా క్లబ్బు’ లు ఉంటాయి. ఈ జింఖానా కి దవాఖానా కి ఏమైనా బాదరాయణ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కాని, ఈ జింఖానా అన్న మాట ఇంగ్లీషులోని gymnasium ని హిందీలోని ‘ఖానా’ ని సంధించగా వచ్చిందని నా అనుమానం. ఇదే ధోరణిలో ‘యంత్రము’, ‘తంత్రము’ అన్న మాటలని తీసుకుని hardware ని ‘యంతర్‌ఖానా’ అనో, ‘జంతర్‌ఖానా’ అనో అని, దానికి తోడుగా software ని ‘తంతర్‌ఖానా’ అని అనొచ్చు. “ఇవి తెలుగు మాటలు కావే” అని మీకు సందేహం రావచ్చు. నిజమే. ఇంగ్లీషు మాటలకన్న ఈ మాటలు కొంచెం దేశవాళీగా లేవూ?

హిందీలో ‘పూజా సామగ్రి’ వంటి మాటలు ఉన్నాయి. సామాను, సరుకు, సామగ్రి, సరంజామా, ఇవన్నీ ware అన్న శబ్దానికి బదులు వాడొచ్చు. ఇదే ధోరణిలో ఆలోచించి వాషింగ్టన్, డి. సి. నుండి ప్రసాద్ చరసాల, ‘యంత్ర సామాను, తంత్ర సామాను’ అన్న రెండు మాటలు ప్రతిపాదించేరు. నన్నడిగితే వీటిని కొంచెం సవరించి యంత్రమాను, తంత్రమాను అంటాను. (ఈ ధోరణిని నియంత్రించకుండా ఊరుకుంటే Microsoft కాస్తా సూక్ష్మతంత్రం, Peoplesoft ప్రజాతంత్రం అవుతాయి కదా! )

మిగిలిన భాషల వాళ్ళు ఏమిటి చేస్తున్నారో అని కుతూహలం పుట్టింది. రష్యా భాషలో hardware ని ‘అపరాత్ స్రెద్‌స్త్వా’ అంటారు. ‘అపరాత్’ అంటే apparatus, లేదా తెలుగులో పనిముట్టు లేదా సంస్కృతంలో ‘సాధనం. ‘స్రెద్‌స్త్వా’ అంటే ‘ప్రత్యేకమైన’, ‘విశిష్ట’ అని అర్ధం. కనుక ఈ దారి వెంబడి వెళితే hardware ని ‘విశిష్ట సాధనం’ అనొచ్చు. software ని రష్యా భాషలో ‘ప్రోగ్రాంనోయ్ ఒబెస్‌పెచేని’ అంటారు. నా దృష్టిలో – ఈ సందర్భంలో - రష్యా వాళ్ళ కంటె మనమే మెరుగు అనిపిస్తోంది!

Software ని చాల భాషలలో ‘ప్రోగ్రాం’ అనే అంటారు. నేను చేసిన చిరు పరిశోధనని బట్టి hardware, software అనే మాటలు తర్జుమాకి లొంగకుండా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నాయి. కారణం ఏమిటంటే ఈ రెండు మాటలూ – ఈ రెండు మాటలే కాదు, వీటికి operating system ని కూడ కలపొచ్చు – వర్ణనాత్మకమైన మాటలు కావు. అర్ధవంతమైన మాటలని ఒక భాష లోంచి మరొక భాష లోకి తర్జుమా చెయ్యొచ్చు కాని, అర్ధం, పర్ధం లేని మాటలని తర్జుమా చెయ్యటం ఎలా? ‘అర్ధం, చలి, తల్పం’ అన్న మాటలని మీరు మరొక భాష లోకి అనువదించగలరు, కాని ‘పర్ధం, గిలి, గిల్పం’ ఇంగ్లీషులోకి అనువదించండి చూద్దాం!

ఈ విషయం ఇంతలా ఇబ్బంది పెడుతూ ఉంటే కొంచెం వేదాంత ధోరణిలో ఆలోచించటం మొదలు పెట్టేను. కంటికి కనిపించేది, స్థిరంగా ఉండేది hardware. కంటికి కనిపించనిది, hardware కి ఒక వ్యక్తిత్వం ఇచ్చేది software. ఈ ధోరణిలో ఆలోచిస్తే ‘బోదె’ అన్న మాట hardware తోనూ, ‘మేధ’ అన్నది software తోనూ సరితూగవచ్చు. ఈ రెండు మాటలకి కొంచెం ప్రాస కూడా కుదిరినట్లుంది. లేదా, ఈ జంటలని పరిశీలించండి: స్థూలకాయం, సూక్ష్మకాయం; దేహం, దేహి; మూర్తం, అమూర్తం.

Software కి తెలుగు మాట వెతికేటప్పుడే, program, code, routine అనే మాటలు కూడ రకరకాల సందర్భాలలో వాడతారు కనుక వాటిని కూడ ఏమంటారో ఆలోచించటం మంచిది. Program ని ‘ప్రోగ్రాము’, ‘కార్యక్రమము’, ‘కార్యసరళి, ‘కార్యవాహిక’, ‘కార్యసూచిక’ (లేదా ‘కాసూక’) అంటూ చాలా ఊహలు అందిస్తూ, “application ని ‘అనువర్తన’ అని నోకియా వాడు వాడి తెలుగు ఫోనులో పెట్టేసినాడు. నాకు నచ్చింది” అంటూ చెన్నై నుండి కిరణ్ కుమార్ చావా ఈ సందర్భంలో చాలా సూచనలు చేసేరు. ఇప్పుడు application program అనువర్తిత కాసూక అవుతుంది. ఎలా ఉందంటారు? ఇవన్నీ సబబైన ఆలోచనలే. నేను 1968 లో రాసిన పుస్తకంలో program ని ‘క్రమణిక’ అని పిలచేను. దీనికి కూడ కారణం ఉంది. Cultural program లో program నీ, computer program లో program ని ఒకే మాటతో అనువదించాలని నిబంధన ఏదీ లేదుగా. నిజానికి ‘కార్యక్రమం’ అనే మాటకి ఒక నిర్ధిష్టమైన అర్ధం ఉంది కనుక, ‘కార్య’ శబ్దం లేకుండా కొత్త మాట తయారు చెయ్యాలనే ఉద్దేశ్యంతో ‘ఒక క్రమబద్ధమైన’ అనే అర్ధం స్పురించే విధంగా ‘క్రమణిక’ అని వాడేను.

చూసారా, ఎన్ని మాటలు కూడబెట్టేమో! కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. వీటిల్లో ఏది బాగా నప్పుతుంది అన్న ప్రశ్న పుట్టక మానదు. దీనికి సమాధానం కావాలంటే మనమంతా ఓపికగా కూర్చుని కలనయంత్రాల గురించి సమగ్రమైన వ్యాసాలు రాయాలి. ఆ వ్యాసాలలో సాధ్యమైనంత వరకు తెలుగు మాటలని వాడి, మనం ఇక్కడ ప్రతిపాదిస్తూన్న మాటలు రకరకాల సందర్భాలలో ఎలా నప్పుతాయో ప్రయోగించి చూడాలి. గట్టు మీద కూర్చుని మెట్ట వేదాంతం చెబుతూ ఉన్నంత సేపూ ఈత రాదు; కాలు తడపాలి, కుత్తుక బంటి నీటిలో ములగాలి. అప్పుడు కాని మన ప్రతిపాదనలలోని సత్తా బయట పడదు. అందుకనే మాటలకి పొడి పొడిగా అర్ధాలు ఇచ్చేసి ఊరుకోకుండా నేను చేట భారతంలా ఈ వ్యాసాలు రాస్తున్నాను – రాసి చూపెట్టాలనే కోరికతో.

Amino Acid ఎమైనో (లేదా ఎమీనో) ఏసిడ్ లో రెండు భాగాలు ఉన్నాయి. ఎమైన్ భాగం, ఏసిడ్ భాగం. ఏసిడ్ ని తెలుగులో ఆమ్లం అంటారు. (ఆమలకం అంటే ఉసిరికాయ.) పోతే, ఈ ‘ఎమైన్’ అన్న మాట ‘అమ్మోనియా’ లోంచి వచ్చింది. అమ్మోనియా అనేది ఒక ఘాటైన విష వాయువు. నవాసారాన్ని, సున్నాన్ని కలిపితే ఈ వాయువు పుడుతుంది. ఉదకాన్ని పుట్టించేది ఉదజని (hydrogen). ఆమ్లాన్ని పుట్టించేది ఆమ్లజని (oxygen). ఇదే విధంగా చాల వాయువులకి ఇంగ్లీషులో -gen అనే తోక, తెలుగులో ‘-జని’ అనే తోక తగిలించటం సంప్రదాయమైపోయింది. ఈ తర్కం ప్రకారం నవాసారాన్ని పుట్టించేది - నవజని! కనుక ammonia కి తెలుగు పేరు నవజని. ఈ ammonia బణువు (molecule) లో కొన్ని అణువు (atom) లని తొలగిస్తే మిగిలేది ammonia radical. దీనిని తెలుగులో ‘నవాంశ’ (నవజని లోని ఒక అంశ) అందాం. (జ్యోతిష శాస్త్రంలో వచ్చే నవాంశ వేరు.) ఈ ammonia radical కి ఒక acid తోక తగిలిస్తే వచ్చేదే amino acid. కనుక ‘నవ’ కి ‘ఆమ్లం’ తోక తగిలిస్తే ‘నవామ్లం’ వచ్చింది. ఇదే amino acid కి నేను పెట్టిన తెలుగు పేరు! ఈ amino acid లు జీవరసాయనశాస్త్రం (biochemistry) లో కొత్తగా కనుక్కోబడ్డ ఆమ్లాలు. ‘నవ’ అంటే సంస్కృతంలో ‘కొత్త’ కనుక ‘నవామ్లాలు’ కొత్త ఆమ్లాలు అనే అర్ధం కూడా వస్తోంది. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే నేను రాసిన ‘జీవరహశ్యం’ అనే పుస్తకం చదవండి.

Formic acid చీమలు కుట్టినప్పుడు చుర్రుమని మంట పుడుతుంది. దీనికి కారణం? చీమ మన శరీరంలోకి ఒక మోతాదు formic acid ని ఎక్కిస్తుంది. లేటిన్ భాషలో formica అంటే చీమ కనుక చీమ శరీరంలో ఉండే ఈ ఆమ్లానికి formic acid అని పేరు పెట్టేరు. చీమలు పుల్లగా ఉంటాయి కనుక దీనిని తెలుగులో చీమామ్లం అనొచ్చు. కాని, తెలుగు మరీ నాటుగా, దేశవాళీ భాషలా, బైతు భాషలా ఉందనుకుని తెలుగు మాట్లాట్టం మానేస్తున్నారు మనవాళ్ళు. వాళ్ళ సౌకర్యార్ధం దీనికి సంస్కృతంలో పేరు పెడదాం. తెలుగు కానంత సేపూ మనవాళ్ళకి అభ్యంతరం ఉండదు కనుక, సంస్కృతంలో చీమని ‘పిపీలికం’ అంటారు కనుక (ఉ. పిపీలికాది బ్రహ్మ పర్యంతం) ఈ ఆమ్లానికి ‘పిపీలికామ్లం’ అని పేరు పెడదాం. ఇంతవరకు వచ్చిన తరువాత మరొక్క మెట్టు ఎక్కి, formaldehyde కి ‘పిపీలికాలంతం’ అన్న పేరు ఎలా వచ్చిందో మరొక సందర్భంలో చెబుతాను.

Wax Papers “అయ్యా మైనపు కాగితం అన్న పేరు ఉండగా మీరు మరీ బరితెగించి పోతున్నారు” అని మీరు అంటారని నాకు తెలుసు. అనండి! చదివేవాడికి రాసేవాడు లోకువ! నీళ్ళు దగ్గరకి చేరకుండా ఉండటానికి ఆహారపదార్ధాలని చుట్టబెట్టటానికి వాడే కాగితాలు మైనం తోనే తయారు కానక్కరలేదు కదా. నేను ఒకానొక సందర్భంలో వీటిని ‘పద్మ పత్రాలు’ అన్నాను. (‘తామరాకులు’ అని ఎందుకు అనలేదో మీకు తెలుసు!) సౌలభ్యం కొరకు అమెరికా వాడు ఇంగ్లీషు స్పెల్లింగులు మార్చేయలేదూ! స్పెల్లింగులే కాదు, ఇంగ్లండులో మాట్లాడే ఇంగ్లీషు మాటలు కొన్ని ఒదిలేసి అదే భావాన్ని సూచించటానికి కొత్త మాటలు, కొత్త ఉచ్చారణలు కనిపెట్టలేదూ! అలాగే అనుకొండి.

మిగిలిపోయిన మాటలకి మరికొన్ని జోడించి కొత్త జాబితా ఇస్తున్నాను. మీరు కూడా ఈ మాటలతో సరితూగే తెలుగు మాటల గురించి ఆలోచించండి.

  • public (public domain, public sector, etc.)
  • private
  • matrix
  • trigonometry
  • sine, cosine, tangent (in trigonometry)
  • infectious
  • contageous
  • invention
  • discovery
  • solo performance
మీ ఊహలు veerataallu at siliconandhra dot org కి పంపండి. మీ ఊహలు veerataallu@siliconandhra.org కి పంపండి.

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.