తెలుగు తేజో మూర్తులు : మహాద్భుత ఔషద పురోగామి - డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

కణాత్మక జీవశాస్త్రం, కణ రసాయన శాస్త్రం, ఔషధ శాస్త్రం, మాలిక్యులార్ ఎండ్రోక్రినాలజీ, పోషక అహార శాస్త్ర రంగాలలో తన దైన ఓ ముద్ర వేసినవాడు, అనేక అంటు వ్యాధులను రూపుమాపే ఔషధాలను తన మేధస్సు, నిరంతర పరిశ్రమ, అఖండ కృషి తో సాధించి ఈ లోకానికి అందించి ఎన్నో కోట్ల మనుషులకు అనేక వ్యాధుల నుండి ముక్తి ఒసగినవాడు, ప్రాణాపాయ జబ్బులకు ఔషధాలు కనిపెట్టిన మహాద్భుత మేధావి, కణ రసాయణ శాస్త్రవేత్త, ఆంధ్రుడు, తెలుగు బిడ్డ, యెల్లాప్రగడ సుబ్బారావు గారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సుబ్బారావు గారు పసిఫిక్ రింలో యుద్ధం చేస్తున్న అమెరికా సైనికులకు కాలే జ్వరం, బోదకాలు వంటి రోగాల నుండి రక్షణార్ధం ఓ పరియోజన చేపట్టి ఔషదాలను రూపొందించారు. ఈయన కనిపెట్టిన అద్భుత ఔషదం "హెట్రాజన్" ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచంలో బోదకాలు (పుట్టకాలు) వ్యాధి రూపుమాపడానికి వినియోగించింది.

బాల్యం, చదువు, ఎదుర్కున్న అడ్డంకులు

జనవరి 12, 1895లో ఆంధ్ర ప్రదేశ్ లోని, గోదావరి జిల్లా భీమవరంలో అతి సాధారణమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు యెల్లాప్రగడ సుబ్బారావు గారు. పదో తరగతి పరీక్షలో మూడో సారి సఫలీకృతం అయ్యేరు. ఇంటర్మీడియట్ మద్రాసులో చదివేరు. మిత్రులు, కస్తూరి సూర్యనారాయణ మూర్తి గారి ఆర్ధిక సహాయంతో ప్రెశిడెన్సీ కాలేజి లో ఎల్. ఎం. ఎస్. చదివేరు. ఆయుర్వేదంలో నైపుణ్యం సంపాదించారు.

బ్రిటీష్ వారికి విరుద్ధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, ఖాది సర్జికల్ గ్లోవ్స్ వేసుకున్నందుకు గాను డాక్టర్ ఎం సి బ్రాడ్‌ఫీల్డ్ అసంతృప్తికి గురై, (ఎం బి బి ఎస్ - డాక్టర్) పట్టా బదులు ఎల్ ఎం ఎస్ పట్టా అందుకో వలసి వచ్చింది. మద్రాసులో వైద్య వృత్తిలో ప్రవేశం రాక పోవడంతో డాక్టర్ లక్ష్మీపతి ఆయుర్వేద కళాశాలలో శరీర నిర్మాణ శాస్త్రం (ఎనాటమీ) అధ్యాపకుడిగా చేరారు. ఈ తరుణంలో ఆయుర్వేదం పట్ల సమ్మోహనులై, ఆయుర్వేద ఔషధాలలో ఉండే మహత్‌శక్తులను అవగాహన చేసుకుని అధునాతన పద్ధతులలో పరిశోధన చేయడం ప్రారంభించారు.

జీవితపు మలుపు....

అమెరికా నుంచి రాక్‌ఫెల్లర్ కోవిదత్వం ఆధారంగా సందర్శన కోసం వచ్చిన ఓ డాక్టర్‌తో పరిచయం, సుబ్బారావు గారి మనస్సును ప్రభావితం చేసింది. సత్యలింగ నాయకర్, మావగార్ల ఆర్ధిక సహాయంతో అమెరికాకు పయనమై అక్టోబర్ 26, 1923 లో బాస్టన్ నగరం చేరారు. ఇక బ్రతుకు తెరువు పోరాటం మొదలైయ్యింది.

డాక్టర్ స్ట్రాంగ్ అనే ఓ ఔదార్య మూర్తి పుణ్యమా అని కొంత ఊరట కలిగింది. చిన్నా చితకా పనులు చేసి జూన్ 1924 లో, హార్వర్డ్ స్కూల్ నుంచి "ట్రాపికల్ మెడిసిన్" లో పట్టా సాదించారు. తరువాత హార్వర్డ్ కణ రసాయణ శాస్త్ర విభాగంలో చేరారు. ఈ విభాగానికి అప్పుడు క్రయస్ ఫిస్కె సంచాలకుడిగా ఉండేవారు.

తన నిరంతర పరిశోదనతో సుబ్బారావు గారు మానవ శరీరంలోని ద్రవణం, కణజాలలో ఉండే భాస్వరాన్ని (ఫాస్ఫరస్) కొలిచే అంచనా పద్ధతి (ఎస్టిమేషన్ మెథడ్)ని కనిపెట్టేరు. ఇది 1930 నుండి, కణ రసాయణ శాస్త్రం (బయోకెమిస్ట్రీ) పాఠ్యాంశాలలో, బోధనా పద్ధతిలో భాగమైపోయింది. ఇదే తరుణంలో ఆయన హార్వర్డ్ నుంచి డాక్టరేట్ (పీహెచ్. డి.) సాధించారు.

సుబ్బారావు గారు కనిపెట్టిన మందులతో, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల జీవితాలు అంతరించి పోకండా నిలిచాయి.

యే మంత్ర తంత్రాలు లేవు. కేవలం అమిత ఆసక్తి, కృషి, ఎకాగ్రచిత్తంతో పాటు, మనసా, వాచా, కర్మణా ఈ శాస్త్రంలోనే మునిగితేలేరు సుబ్బారావు గారు.

సన్నదులు (పేటెంట్లు) చేయించి ఉంటే ఈయన కలియుగ కుబేరులో ఒకరుగా చలామణి అయి ఉండేవారు. కాని వారికి పని మీద ధ్యాసే కాని సిరి మీద లేదు, ఏనాడు.

సుబ్బారావు "టెట్రా-సైకిలీన్" కి ఋణమున్నాం. టెట్రా-సైకిలీన్" మందు సుబ్బారావు గారే కనిపెట్టేరన్న విషయం తెలుసుకుని భారతావని పులకరించింది. ప్రభుత్వం ఈయన శత వార్షికం గుర్తుగా తపాలా బిళ్ళను విలువడించింది.

సుబ్బా రావు గారి అధ్బుత ఔషధాలు....

ఈయన కనిపెట్టిన "టెట్రా-సైకిలీన్" భయంకరమైన "ప్లేగ్" వ్యాధిని నివారిస్తుంది. 1948 నుండి కొన్ని లక్షల ప్రాణాలను కాపాడింది. 1994 లో భారతదేశంలో గుజరాత్ (సూరత్), మహారాష్ట్ర ఇత్యాది రాష్ట్రాలను ఆవరించిన ప్లేగ్ వ్యాధి నివారించి లక్షల ప్రాణాలను కాపాడింది యెల్లప్రగడ గారి మందే.

అందరికి తెలిసిన పెన్సిలిన్ "గ్రాం పొజిటివ్" బ్యాక్టీరియా నుండి మాత్రమే సంరక్షిస్తుంది. "స్ట్రెప్టోమైసిన్" "గ్రాం నెగటివ్" బ్యాక్టీరియా నుండి సమ్రక్షిస్తుంది. సుబ్బారావు గారి "ఔరియోమైసిన్", "టెట్రా-సైకిలీన్" తో కలిపితే ఈ రెండు వ్యాధులను నివారిస్తుంది. ఎలాంటి అధ్బుత ఔషద సృష్టి చేసారు సుబ్బారావు గారు.

మూడో సంతతి "టెట్రా-సైకిలీన్" - "డొక్సీ సైక్లీన్" (అమెరికా ఎఫ్ డీ ఏ అమోదం పొందింది) ద్వారా మలేరియా మహమ్మారి నుంచి రక్షిస్తుంది. సుబ్బారావు గారి "ఫోలిక్ ఆమ్లం (యాసిడ్)" ఎన్నో తిండి పదార్ధాలు, మందులలో మిశ్రమంగా వాడుతున్నారు.

ఈయన రూపొందించిన మందుతో " లుకేమియా" వ్యాధిని కూడా నయంచేయవచ్చు. అంతే కాదు ఫోలిక్ ఆమ్లం, "హొమోసిస్టైన్" పరిమాణాన్ని నియంత్రిస్తుంది (ఇది అమెరికన్లలో అధికంగా కనిపిస్తుంది). తద్వారా హృదయ రోగాలు (కరోనరీ ఆర్టరీ, ఇసమిక్ హృదయ రుగ్మతలు) నియంత్రించేందుకు ఉపయోగ పడుతుంది.

సుబ్బారావు గారి ఇంకొక మానస పుత్రి - "ఎమినో-పెట్రిన్". ఫోలిక్ కణం (మొలిక్యూల్) ఉన్న ఈ మందు, "కేమో-తెరపీ" క్యాన్సర్ వ్యాధినివారణలో ఉపయోగిస్తున్నారు. "ఎమినో-పెట్రిన్" కి స్వల్ప మార్పు చేస్తే లభ్య మయ్యే "మెతోట్రెక్షేట్" క్యాన్సర్ వ్యాధి నివారణకేకాక, కీళ్ళ జబ్బు ("ఆర్థ్రిటిస్"), "సోరియాసిస్" వ్యాధి చికిత్సలకు కూడా వాడు తున్నారు.

సుబ్బారావు గారు వెలువడించిన మరొక అద్భుతం - (డై ఇథైల్ కార్బమజైన్) కణం (మొలిక్యూల్). ఇది ఫైలేరియా వ్యాధిని నివారిస్తుంది. సుబ్బారావు గారి "హెట్రజాన్" మనుషులకు ఎలిఫెంటాసిస్ (బోదకాలు; పుట్టకాలు) వ్యాధి రాకుండా పరిరక్షిస్తుంది.

అనేక సంవత్సరాలు హార్వార్డ్ లో పనిచేసి, లెడరల్ ప్రయోగశాల (లేబరేటరీస్), ప్రయోగ సంచాలకుడిగా వ్యవహరిస్తూ, 1948 లో తన యాబై మూడవ యేట స్వర్గస్తులయ్యేరు.

యెల్లాప్రగడ సుబ్బారావు గారి గొప్పతన్నాని స్లాఘిస్తూ నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ హిచ్చింగ్స్ ఇలా వ్యాఖ్యానించారు: "సుబ్బారావు కనిపెట్టిన న్యుక్లియోటైడ్స్ విషయం ఫిస్కె ఊర్వలేని తనంతో బయట పడనీయలదు. ఇవి తరువాత వేరే వాళ్ళు కనుగొన్నారు." (ఎస్ పి కె గుప్తా, 1999) యెల్లాప్రగడ గారికి తీరని అన్యాయమే జరిగింది అన్న సానుభూతి తప్ప, ఇక యేమి చేయలేము.

సుబ్బారావు గారికి జీవితంలో గుర్తింపు ఎలాగూ రాలేదు. ఫ్రిస్కే ఓర్వలేని తనం వల్ల ఆయన చేసిన పని, కృషి, ఫలితాలను తొక్కివేయడంతో అప్పట్లో సరైన గుర్తింపు రాలేదు. కనీసం ఇప్పుడైనా ఆయన మానవాళికి చేసిన మంచి పనులను స్ఫురించుకోవడం, రానున్న తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలబెట్టడం, ఆదర్శ మూర్తిగా గౌరవించడం చేస్తే, అదే పదివేలు.

సుబ్బారావు గారి మీద వెలువడిన పుస్తకాలు

సుబ్బారావు గారు యెన్నో అద్భుత ఔషధాలు సృష్టించేరే కాని, ఏ పుస్తకాలు రచించలేదు. సుబ్బారావు గారు మానవాళి అందిచిన విశేష సంపదని ఈ మధ్యే గుర్తించడం మొదలు పెట్టి ప్రచురిస్తున్నారు. మంచిదే! ఈ మధ్య వెలువడిన కొన్ని ప్రచురణలు:

 • ఇన్ క్వెస్ట్ ఆఫ్ పనాసియా, సక్సెస్ ఎండ్ ఫైల్యూర్స్ ఆఫ్ యెల్లాప్రగడ సుబ్బారావ్, ఎస్ పి కె గుప్తా
 • యెల్లాప్రగడ సుబ్బారావు జీవిత పరిచయం, అనువాదకులు: ఆర్ వి రావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురణ
 • కన్నడ భాషలో - సతమనద విజ్ఞాని డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావ్, అనువాధం హెచ్ డి చంద్రప్ప గౌడా
 • యెల్లాప్రగడ సుబ్బారావ్, ఎ లైఫ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ పనాసియా స్క్రిప్ట్, రాజి నరసింహన్
 • హిందీ భాషలో - సర్వ్ రోగ్ నివారిణీ కీ ఖోజ్ మే - డాక్టర్ సుబ్బా రావ్ కీ అమర్ కహానీ, వినోద్ కుమార్ మిశ్ర

యెల్లాప్రగడ గౌరవార్ధం ....

హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ ప్రాగణంలో సుబ్బారావు గారి గౌరవార్ధం ఒక కేంద్రాన్ని నెలకొల్పేరు. అమెరికన్ సైనమిడ్ సంస్థ సుబ్బారావ్ గ్రంధాలయం స్థాపించింది. ఆయన స్మృత్యర్ధం ఓ ఔషదానికి "సుబ్బారావ్-మైసిస్ స్ప్లెండెన్స్" అని పేరు పెట్టింది. నాల్గవ క్లినికల్ న్యూట్రిషన్ ప్రపంచ కాంగ్రెస్సు లో సుబ్బారావ్ జ్ఞాపక అవార్డులు విశిష్ట పరిశోధకులకు ఇచ్చేరు.

మానవాళికి అందించిన కొన్ని మహాద్భుత ఔషదాలు, సాధనాలు

 • ఫోలిక్ ఆమ్లం
 • ఏంటి-ఫోలిక్ ఆమ్లం
 • ఏ టి పి - ఎనర్జీ ఫర్ లైఫ్
 • కణాలలో భాస్వరం అంచనా పద్ధతి
 • ఫైలేరియాసిస్ నివారణ
 • టెట్రా-సైకిలీన్
 • మెతోట్రెక్షేట్, ఔరియోమైసిన్, హెట్రజాన్
 • ఫాస్ఫో క్రియాటిన్ కనుగొనడం
 • డై ఇథైల్ కార్బమజైన్ కణం (మొలిక్యూల్)
 • డాక్సీ సైక్లీన్ - ఇది మూడో సంతతి టెట్రా-సైకిలీన్

సుబ్బారావు గారు తన జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకుని, అఖండ దీక్షతో దాన్ని సాధించి ప్రపంచంలోని కోట్ల మందికి భయంకర రోగాలు, రుగ్మతల నుండి ఉపశమనం కలిగించారు. నిస్సందేహంగా ఆయన ధన్య జీవే. ధటీజ్ సుబ్బారావ్!....