సుజననీయం : మాతృభాషా? పితృభాషా?

-- తల్లాప్రగడ


తే.గీ.// తెలుగు పద్యాన తెలిసిన తెలుగు ఏది?

వ్యావహారిక భాషను వాడరేల?

తెలుగు వాళ్ళకు ఏలనీ తెగులు వచ్చె!

రభస చేతురు యూరకే, రామచంద్ర!

చాలా ఏళ్ళ క్రితం మాట, నేను ఇంజినీరింగ్ చదువుకునే రొజుల్లో ఒక స్నేహితుడుండేవాడు. వాడు తెలుగు, కన్నడ బాషలు రెండిటినీ కలిపి అనర్గళంగా మాట్లాడేవాడు. అందరికీ వీడి మాతృభాష అసలేమైయుంటుందబ్బా అనిపించే విధంగా ఉండేది. దానికి వాడు, మేము బళ్ళారి వాళ్ళము. మా అమ్మది తెలుగు, మా నాన్నది కన్నడ. అందుకని నా మాతృభాష తెలుగు, పితృభాష కన్నడ అనేవాడు. కానీ నాభాష మాత్రం కన్నడ అనే చెపుతాను అనేవాడు. మీ అమ్మగారి భాష తెలుగుకదా, అంటే నీ మాతృభాష తెలుగవ్వాలికదా అంటే, నేను ఏ భాష ఎక్కువగా మాట్లాడుతానో అదే నా మాతృభాష; మా అమ్మ ఏమి మాట్లాడుతుంది అని కాదు అనేవాడు. అంతేకాదు తెలుగు కన్నడలు కలిపి మాట్లాడుతున్నాను, బళ్ళారిలో అందరికీ అదే అర్థం అవుతుంది, అక్కడ దానినే కన్నడ భాష అని అంటారు కూడా అనేవాడు.

భాషా దురభిమానులు ఏమనుకుంటేనేమి, అదే కన్నడ భాషగా అక్కడ చలామణి అవుతోందిట. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, అందరికీ అర్థం అయ్యేదే భాష! మనోభావాలను పరులకు అర్థం అయ్యేలా చెప్పేదే భాష! అందరూ మాట్లాడేదే భాష! అది ఎవ్వడి సొత్తు కాదు. దానికి ఆంక్షలు విధించి, తెలుగు ఇలాగేమాట్లాడాలి అంటే-- తెలుగులో మాట్లాడాలంటే, నీకు లైసెన్స్ ఉందా అనో, లేదా నాకు పన్ను కట్టావా అనో, అని అనడం లాంటిది. గ్రాంధిక భాషలో ఎన్నో గొప్పలున్నాయి, అలంకారాలున్నాయి, వ్యాకరణ నియమాలున్నాయి. అంత మాత్రాన, వాడుక భాషని తెలుగు కాదనడం సంస్కారం కాదు. తెలుగుయొక్క మాతృభాష సంస్కృతం కాబట్టి, సంస్కృత పదాలని మాత్రమే వాడొచ్చు, ఆంగ్ల పదాలనీ, వాడకూడదు అనడం, కొందరి అర్థరహిత ఆంక్షలు మాత్రమే. ఇలాంటి సంకుచిత భావాలే మన పూర్వీకులకే ఉండి ఉంటే, సంస్కృత పదాలు కూడా తెలుగులోకి వచ్చేవే కావు. అచ్చతెలుగు పదాలే కావాలని సంస్కృతాన్ని వదిలేసేవారు. నిజానికి అప్పట్లో ఆంగ్లప్రాచుర్యత ఉండి ఉంటే వారు సంస్కృతంతో పాటూ అంగ్ల పదాలని కూడా గ్రహించి ప్రయోగించేవారేమో. అన్ని భాషలూ ఎప్పుడో అప్పుడు ఇతర భాషలతో సంకరం చెందవలసిందే. గ్రామ్యాన్ని కూడా విలీనం చేసుకుని ముందికు సాగవలసిందే. అయినా భాషాభివృద్ధిగమనాన్ని ఎవరూ ఆపలేరు. అదొక నిరంతర ప్రవాహం. దాని గతిని ఏ నిరంకుశ పండితోత్తముడైనా ఆపలేడు. అందరూ దానితో కలిసి విలీనం కావలసిందే!

కొందరు పండితులు సైతం సంస్కృత పదభరితమైనదే పద్యమని, గ్రామ్యం పద్యాలలో వాడటం నిషిద్ధం అని, వాడుకభాషలో పద్యాలు చెప్పకూడదు అని చేసే వ్యాఖ్యలను చూస్తే పద్య ప్రామాణాలు పెరుగుతున్నట్లనిపించినా, అవి జనరంజకంగా రూపుదిద్దుకోవడంలేదని తెలుస్తుంది. ఉదాహరణకి "అవసరం" అన్న మాట వ్యావహారికము కానీ తెలుగు కాదు అని అనడం, "అవసరము" అన్నమాట మాత్రమే తెలుగు అనీ, అలాగే పద్యాలలో వాడాలి అని వాదించేవారికి చెప్పడం, చెవిటివాడి ముందు శంఖం ఊదటమే అవుతుంది. వారి పాండిత్యప్రకర్షలెలా ఉన్నా, వారి తంతు భాషాభివృద్ధిగమనాన్ని గుర్తించడలో వారి అశక్యతనీ, వారి పరివర్తనలో ఆవశ్యకతనీ తెలుపుతుంది.

శ్రీనాధుడంతటివాడికే తెలుగులో పద్యాలు చెప్పటం రాదని, "డుమువుల కవి" అని అప్పటివారు హేళనచేసేవారని చరిత్ర చెబుతోంది. నన్నయ్య వాడిన భాషకీ, నేడు మనం వాడే భాషకీ ఎంతో తేడావుంది. కాలంతో పాటూ మనం, మనతోపాటూ మన భాష కూడా మారాలి. కానీ నన్నయ్య ఇట్లా చెప్పలేదని అక్కడే ఆగిపోకూడదు. సమకాలీన భాషాభ్యుదయాన్ని గుర్తించి దానితో కలసి కదంతొక్కాలి. గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర, లాంటి అభ్యుదయకవులకు తెలుగులో పద్యం చెప్పడం రాదనేవారు కొందరు మనకు కనపడినా, అది ఏమాత్రం సమంజసంకాదు. కాలంతో పాటూ తెలుగు కూడా మారాలి, అలాగే పద్యభాషనూ, అలాగే వ్యాకరణాన్ని కూడా కాలానుగుణంగా మార్పులుచేసుకుంటూ, నలుగురికీ అందుబాటులోకి తేవాలి. కొత్త ప్రక్రియలకు, పదప్రయోగాలకూ ప్రోత్సాహం ఇవ్వాలి. లేకపోతే, పద్యప్రాచుర్యం తగ్గి పద్యం కొందరి పెత్తందారులకు మాత్రమే దాస్యంచేస్తూ మిగిలే ప్రమాదం ఉంది.

భాషాభివృద్ధికి చేతనైనంత తోడ్పడాలికానీ, అవరోధాలు నిర్మించకూడదు. వ్యావహారిక ప్రయోగాలను అన్నమయ్య తన కీర్తనలలో సైతం వాడినట్లు, మనం నేటి వ్యావహారికాన్ని మన పద్యాలలో కూడా వాడగలగాలి. కొత్త మాటలను సృష్టించుకోవాలి. సామాన్యంగా ఈ సృష్టి గ్రామ్యంలోనూ (లేక, మాండలీకాలలోనూ) జరుగుతుందని, మన వేమూరిగారు తన వీరతాళ్లలో అనేకమార్లు చెప్పారు. ఆలాంటి గ్రామ్యాన్ని విస్మరించకూడదు; మన దగ్గర పర్యాయపద సంపద సరిపోనప్పుడు, వేరే భాషనుండి (అదే భాషైనా కావొచ్చు, సంస్కృతమే కానక్కరలేదు) అరువు తెచ్చుకోవడం కూడా తప్పుకాదు. సరికొత్త ప్రభంధ యుగాన్ని సృష్టించి ఆవాహనచేయాలి. నిజానికి అలాచేస్తేనే మనం నిజంగా భాషాభివృద్ధికి దోహదం చేసినవారలమవుతాము.

*** **** ***

మొన్న ఆగస్టు 25వ తారీఖునాడు హైదరాబాదులోని లుంబినీ పార్కు, మరియు గోకుల్ చాట్‌లలో జరిగిన బాంబు దాడులు పేట్రేగి పోతున్న మతోన్మాదానికి దర్పణం పట్టాయి. ఎవరిష్టం వచ్చినట్లు వారు విశ్లేషణ చెప్పుకోవడానికి, మతం కూడా ఎవరి సొత్తుకాదు. అందరి మంచి కోరేదే మతం, సర్వమానవ సామరస్య సౌభ్రాత్వుత్వ భావాలను పెంపొందించేదే మతం, మానవుని భగవంతునితో కలిపేదే మతం. మతోన్మాదంలో మతోపదేశాలనుంచి తప్పుడు అర్థాలనుతీసి, అనర్థాలను సృష్టించడాన్ని చూసుంటే, ఏ మత ప్రవక్తా ఈ విధానాలను ఒప్పుకొనివుండడు. ఈ రోజు ఇలా అవుతుందని తెలిస్తే, ఈ సంకుచితభావాలనూ, అడ్డుగోడలనూ విసర్జించమని ఎప్పుడో గర్జించి ఉండేవాడు.

ఒళ్ళు గగ్గుర్పొడిచే ఈ ఉగ్రవాదాన్ని ఏ మతం ప్రొత్సాహించలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉన్మాదమేఎ ఉద్యమంగా, భీభత్సమే తమ భవిష్యత్తుగా భావించేవారి, సంకుచిత భావాలను అందరూ తిరస్కరించే మౌళిక లౌకిక మెళికువలెరిగెడి రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాము. మతం కూడా ప్రజలను ఒక సన్మార్గ పద్దతిలో నడిపింప చేసే వ్యవస్థగానీ, సన్మార్గ వినాశనకారి కాకూడదు. ఉగ్రవాద కబంద హస్తాలకు గురికాబడి ప్రాణాలుకోల్పోయినవారికీ, క్షతగాత్రులైన వారందరికీ సుజనరంజని తన సంతాపాన్ని ప్రకటిస్తోంది.

మీ

తల్లాప్రగడ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.