సిలికానాంధ్ర కుటుంబము

అప్రతిహతంగా తెలుగు పద్యధారా సమ్మోహనం

సిలికానాంధ్ర ఆరవ వార్షికోత్సవ సందర్భంగా అష్టోత్తరశత పద్యాలతో 'శతక ధారా పద్య సమ్మోహనం' అధ్భుతంగా జరిగింది. సుమారు 800మంది తెలుగు సాహితీ అభిమానులు పాల్గొన్న ఈ సంబరం ఆగష్టు 4న పాలో ఆల్టోలో వైభవంగా జరిగింది.

ఇంతకు ముందెన్నడూ జరగని రీతిలో, సిలికానాంధ్ర శ్రీకారం చుట్టిన ఈ నూతన ప్రక్రియలో 54మంది పృచ్చకులు పాల్గొన్నారు. నాలుగు అంశాలలో (సమస్య, వర్ణణ, దత్తపది, న్యస్తాక్షరి) వారు అడిగిన జటిలమైన సమస్యలకు పంచసహస్రావధాని శ్రీ మేడసాని మోహంగారు అవలీలగా ' శార్దూల ' వృత్తంలో ఆశుపద్యాలను విరచించారు. 'ప్రవాసాంధ్ర జీవితం'లోని వివిధ ఘట్టాలను మూలంగా చేసుకొని నడిచిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా నడిచింది.

కూచిభొట్ల ఆనంద్ నాయకత్వలో, తల్లాప్రగడ రావు సహకారంతో, ఉపద్రష్ట సత్యం గారి అధ్యక్షతన ఈ నూతన సాహితీ ప్రక్రియ మనోజ్ఞంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా మోహన్ గారికి 'సిలికానాంధ్ర అవధాన భారతి ' అన్న బిరుదునిచ్చి సత్కారం చేసింది. కార్యక్రమం చివరగా చవులూరించే భోజనం ఆహుతులకు అందచేయబడింది.

నాయకత్వపు అడుగుజాడల్లో చిన్నారి:

ఈ మధ్యనే సిలికానాంధ్రాలో సభ్యుడైన నరాల దేవేందర్ గారు సిలికానాంధ్ర అభివృద్ధికై ఎంతగానో కృషి చేస్తున్నారు. వారి కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న రచన్ People to People's World Leadership Forum ప్రోగ్రాం కి ఎన్నికైనాడు. వారం రోజులపాటు Washington D.C.లో జరగబోయే ఈ కార్యక్రమంలో రచన్ అక్కడ ప్రభుత్వ సముదాయాలను సందర్శిస్తాడు. అమెరికా చరిత్ర విశేషాలను తెలుసుకుంటాడు. అలాగే నాయకులతో సంభాషిస్తాడు. ఈ ప్రోగ్రాం లో ఎన్నిక చేసిన ఉపాధ్యాయురాలుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రచన్ తనకు ఎంతో ఆసక్తికరంగా ఉందన్నాడు.

పుత్రోత్సాహం:

సిలికానాంధ్ర అంతర్జాల మాసపత్రిక 'సుజనరంజని 'లో శీర్షిక నిర్వాహకులైన పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం, పసుమర్తి పద్మబిందులకు జూన్ 27న కుమారుడు జన్మించాడు. అబ్బాయికి 'సాయి సూర్య ప్రతీక్' అని నామకరణం చేసారు.

గృహప్రవేశం:

సిలికానాంధ్ర క్రియాశీలక సభ్యులు, శ్రేయోభిలాషులైన మల్లాది దంపతులు (మల్లాది రఘు, శ్యామల) యూనియన్ సిటీలోని వారి నూతన గృహప్రవేశ సందర్భంగా సిలికానాంధ్ర సభ్యులను, బంధుమిత్రులను ఆగష్టు 11న ఆహ్వానించి విందు చేశారు. అప్పటికప్పుడే వండి వడ్డించిన నోరూరించే వంటకాలను అతిథులు ఎంతగానో ఆనందించారు. అలాగే ఆగష్టు 5న వారి ఇంటిలో పంచసహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు అల్లసాని పెద్దన రచించిన 'మనుచరిత్ర ' ప్రబంధంపై ప్రవచనం చేసారు.