రాతివనం - 9వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

మరో వైపు రామ్మూర్తి అనే ఒక ప్రతిభావంతుడైన శ్రీచరిత కాలేజ్ లెక్చరర్ సునందా కాలేజిలో జేరాడని శ్రీచరిత ఓనరు ఇంటికి పిలిచి బెదిరిస్తాడు. అయినా రామ్మూర్తి లొంగడు. ఇలా ఉండగా సుందరం అనే లెక్చరర్ ఇంటింటికీ తిరుగుతూ తాను పనిచేసే కాలేజికి ప్రచారం చేస్తుంటాడు. శ్రీచరిత, సునంద కాలేజీల మధ్య పేరు గొప్పల కోసం అంతర్యుద్ధం మొదలౌతుంది. సునంద మెడికల్ కోచింగ్, ఎంట్రన్స్ లలో పైచేయిగా ఉంటే, శ్రీచరిత ఇంజనీరింగ్ ఫీల్డులో ఆధిక్యత సంపాదించాలని చూస్తుంది. అందుగ్గాను, మామూలు కాలేజీలో చదివి స్వంత కష్టం మీద ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో మొదటి ర్యాంకు పొందిన పేద విద్యార్థిని శ్రీచరితలో కోచింగ్ తీసుకున్నట్టు ప్రకటించమని ఈశ్వరరావు కోరుతాడు. అందుగ్గాను, ఆ విద్యార్థి ఇంజనీరింగ్ చదవటానికయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇస్తాడు. అందుకు ఆశపడి ఆ పేద కుటూంబం ఒప్పుకుంటుంది.

క్షితిజ అంత ఉదాసీనంగా ఉండటం హిమవర్ష ఎప్పుడూ చూళ్ళేదు. సునంద కాలేజిలో చేరాకనే హిమవర్షకు క్షితిజతో పరిచయమైంది. పదో తరగతి పరీక్షల్లో ఐదువందలతొంభై మార్కులు తెచ్చుకున్న క్షితిజంటే క్లాసులో అందరికీ ఇష్టమే. ఎప్పుడూ నవ్వుతూ ఉండే క్షితిజన్నా, ఆమె అందమైన నవ్వన్నా హిమవర్షకు మరీ ఇష్టం. ఇద్దరూ ఒకే బెంచిలో పక్కపక్కన కూచోవటంతో ఆ సాన్నిహిత్యం మరింత పెరిగింది.

ఆరోజు ఉదయం నుండే క్షితిజ అదోలా ఉంది. "ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే "బాగానే ఉంది" అంటూ పొడిగా సమాధానం చెప్పిందే తప్ప, ఎప్పట్లా గలగలామాట్లాడలేదు. "యింట్లో ఎవరైనా ఏమైనా అన్నారా" అని అడిగితే తల అడ్డంగా ఊపింది. ఆ క్షణంలో ఆమె కళ్ళలో నీళ్లు చిప్పిల్లటం చూసి హిమవర్ష కంగారు పడింది. పాఠాలని చాలా శ్రద్ధగా వినే క్షితిజ ఫిజిక్స్ లెక్చరర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది.

లంచ్ అవర్ వరకూ ఉగ్గబట్టుకున్న హిమవర్ష "అసలేమైందే. టెన్ షన్ తో చచ్చిపోతున్నాను తెలుసా ... ఏం జరిగిందో చెప్పు" అంటూ నిలదీసింది.

"మా యింటికి ఫోన్ చేసి ఎవడో సతాయిస్తున్నాడే" అని క్షితిజ చెప్పంగానే పెద్దగా నవ్వింది హిమవర్ష.

"జరక్కూడనిదేదో జరిగుంటుందని కంగారు పడి చచ్చానే. ఇంత చిన్న విషయానికా నన్ను బెంబేలెత్తించావు. నీ అనుభవంలో ఇలా జరగటం మొదటిసారేమోగానీ, మన వయసులో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే సాధారణ సమస్య అది. ఈజీగా తీసుకోవడమే .... మీ యింట్లో ఫోన్ కి కాలర్ ఐడి ఉందికదా. మరోసారి ఆ నెంబర్ నుంచి ఫోనొస్తే రిసీవ్ చేసుకోకు. సింపుల్"

సమాధానం చెప్పేలోపల క్షితిజ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. "ఫోన్ అమ్మ తీసిందే. మొదట ఎవరో అమ్మాయి మాట్లాడిందిట. నా స్నేహితురాలని చెప్పిందట. నేను ఫోన్ అందుకుని హలో అనగానే మగతను మాట్లాడాడు. 'నువు చాలా అందంగా ఉంటావు. నెల్రోజుల్నించి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. నిన్ను కిడ్నాప్ చేసి రేప్ చేస్తాను .... తొందర్లోనే... రెడిగా ఉండు" అని ఫోన్ చేసాడు. నాకు భయంతో చెమటలు పోశాయి. అమ్మ కంగారు పడ్తుందని చెప్పలేదు. కొద్దిసేపాగి అమ్మ లేకుండా చూసి ఆ నెంబరుకు ఫోన్ చేసాను. అది దిల్ సుక్ నగర్ లోని యస్టీడి బూత్ నుంచి వచ్చింది."

హిమవర్ష తేలిగ్గా కొట్టి పారేస్తూ అంది "రకరకాల వేధింపులు తప్పవు ఆడపిల్లగా పుట్టినందుకు. కొంత మంది మగపిల్లలు మన నెంబర్ ఏదో విధంగా కనుక్కుని తమ సెల్ కి మనం మిస్సెడ్ కాల్ ఇచ్చామని సతాయిస్తారు. మరికొంత మంది ఆకతాయులు ఆడపిల్ల ఫోన్ దగ్గిర ఉందని తెలియగానే అసభ్యమైన మాటలు మాట్లాడి వాళ్ల వికృత మనస్తత్వాన్ని బైట పెట్టుకుంటారు. వీడు కూడా జులాయి వెధవలా ఉన్నాడు. పట్టించుకోకు"

రాత్రంతా నిద్రలేకుండా మధనపడి నేనూ అదే అనుకున్నానే. కానీ ఉదయం కాలేజీకి బయల్దేరేముందు మరలా ఫోన్ వచ్చింది. నేనే రిసీవ్ చేసుకున్నా. 'నువ్వు సీరియస్ గా తీస్కోవడంలేదు కదా. అదే భ్రమలో ఉండు. ఆల్రడీ ఓ గ్యాంగుకి చెప్పి పెట్టాను. పాతికవేలడిగారు. నిన్ను అనుభవించడంకోసం యాభైవేలు ఖర్చయినా ఫర్లేదన్నాను. ఈ రోజో, రేపో, ఎల్లుండో ... నిన్ను ఎత్తుకు రావటం ఖాయం. గదిలో బంధించి నా కోరిక తీర్చుకోవటం ఖాయం" అన్నాడు వాడు. కాలేజికి వస్తుంటే ఎవర్ని చూసినా భయమే .... ఎత్తుకెళ్ళటానికి వస్తున్నారేమోనని."

"అమ్మకూ నాన్నకూ చెప్పటం మంచిదేమోనే" దీర్ఘంగా ఆలోచించి చెప్పింది హిమవర్ష.

"వాళ్ళూ భయపడి కాలేజీ మానిపిస్తారేమోనని దిగులేస్తోందే"

"అదీ నిజమే. ఆ అవకాశం లేకపోలేదు. అసలే మరో పదిహేను రోజుల్లో పరీక్షలున్నాయి. వీటిల్లో వచ్చే మార్కుల ఆధారంగానే మరలా సెక్షన్ లు మారుస్తారు. నీ మీద మన కాలేజి వాళ్ళకు చాలా హోప్సున్నాయి. యంసెట్లో మొదటి మూడు ర్యాంకులలో ఒకటి ఖాయమని అనుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కాలేజీ మానేయటం జరిగితే చాలా నష్టపోతావు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు?"

"మా అమ్మానాన్న కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళ సలహా తీసుకోవడమే మంచిదనిపిస్తోంది. వందన వాళ్ళ మమ్మీ పోలీసు కానిస్టేబుల్ కదా. సాయంత్రం వెళ్ళి సలహా అడుగుదామా?"

" వందన నీకు ప్రతిదాంట్లోనూ పోటీ కదే. హెల్ప్ చేస్తుందంటావా?"

"ఎందుకు చేయదు? చదువులో పోటీ ఉండాలి. తప్పులేదు. స్పర్థయా వర్థతే విద్యా, అంటారు తెలుసా. వందనక్కూడా టెంత్ లో ఐదువందల ఎనభై మార్కులొచ్చాయి. తెలివిగలది. ర్యాంకులకోసం పోటీ పడినా ఇది పర్సనల్ విషయం కదా. అడిగి చూద్దాం. వాళ్లమ్మ ఇచ్చే సలహాని బట్టి మా యింట్లో చెప్పాలో వద్దో, మరేం చేయాలో నిర్ణయించవచ్చు" అంది.

యిద్దరూ వందన దగ్గిరకెళ్ళి వాళ్ళమ్మ గురించి వాకబు చేశారు.

"మన కాలేజీ వదిలే టైంకి మమ్మీ యింట్లోనే ఉంటుంది. నాతోపాటూ వచ్చేయండి" అంది.

సాయంత్రం కాలేజీ వదిలాక వందన వాళ్ళింటికి వెళ్ళారు హిమవర్ష, క్షితిజ.

"ఓ... క్షితిజ అంటే నువ్వేనా... మా అమ్మాయి ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం క్లాస్ లో ఫస్ట్ నువ్వేనటగా" అంది వందన వాళ్ళమ్మ.

"వందన తక్కువేమీ కాదాంటీ. మధ్యమధ్య తనుకూడా ఫస్ట్ వస్తూ ఉంటుంది".

"ఐనా నీతో పోటీ పడటం కష్టమని చెప్పిందిలే. మీ అమ్మానాన్న బాగా చదువుకున్నవాళ్ళటగా"

"ఔనానాంటీ. నాన్న, అమ్మ ఇద్దరూ డాక్టర్లే"

"నీలాంటి పిల్లకుకాక ఇంటర్ ఫేలైన తల్లితండ్రులకు పుట్టిన మా అమ్మాయిలాంటివాళ్ళకు ఫస్టెలావస్తుంది చెప్పు"

క్షితిజకు ఆ సంభాషణ రుచించలేదు. తనే మాట మారుస్తూ "నాకో చిన్న సమస్య వచ్చింది ఆంటీ. మీ సలహా కోసం వచ్చాను" అంటూ విషయం చెప్పింది.

"నీకెవరిమీదైనా అనుమానంగా ఉందా?" అని అడిగిందావిడ.

"లేదాంటీ"

"ప్రేమ వ్యవహారాలేమైనా ఉన్నాయా?"

ఆ మాటలకు దెబ్బ తిన్నట్లు చూసింది క్షితిజ. "నా చదువు తప్ప మరేమీ పట్టించుకోను" అంది రోషంగా.

"అహా. నా ఉద్దేశం వన్ సైడెడ్ లవ్ అయి ఉండవచ్చని. లేకపోతే మీ యింటినెంబర్ వాడికెలా తెలుస్తుంది?"

హిమవర్ష కల్పించుకుని చెప్పింది. "క్షితిజ వాళ్ళ అమ్మానాన్న పేరున్న డాక్టర్లు. వాళ్ళ యింటి నెంబర్ తెల్సుకోవటం పెద్ద విషయమేమీ కాదు. టెలిఫోన్ డైరెక్టరీ తిరగేస్తే చాలు".

" వాడు వాడిన మాటల్ని బట్టి ఆలోచిస్తే వాడేదో ప్రొఫెషనల్ లా అనిపిస్తున్నాడు. నువ్వు నీ జాగ్రత్తలో ఉండటం మంచిది. అసలే రోజులు బాగులేవు" అంది వందన వాళ్ల మమ్మీ.

ఒక పోలీసు ఉద్యోగి అయి ఉండి అలా అనేసరికి క్షితిజకు మరింత భయమేసింది.

"పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మంచిదేమో" అంది హిమవర్ష.

"వద్దు. దాని వల్ల నష్టమే ఎక్కువ. పదిమందికీ విషయం తెలిస్తే మన పరువు పోతుంది. వాడికి తెలిసాక మరింత రెచ్చిపోవచ్చు. పోలీసులైనా నీకు ఇరవైనాలుగు గంటలూ రక్షణ కల్పించలేరుగా" అందావిడ.

వాళ్ళింటినుంచి బైట పడ్డాక "మనం ఇక్కడికొచ్చి తప్పు చేసామేమోననిపిస్తోంది" అంది హిమవర్ష.

"ఆమె చెప్పిందీ కరెక్టేగా. పోలీసులు మనకు రక్షణ కల్పించడానికి మనమేమీ వి ఐ పిలము కాదుగా"

"అలాగని చెప్పకుండా ఉంటే అదో అలుసుగా తీసుకుని రఔడీ వెధవలు పేట్రేగిపోరా? పదిమందికీ తెలిస్తే మన పరువు ఎందుకు పోతుంది?

"వాడెవడో ఫోన్ చేసి ఏడిపిస్తుంటే అది మన తప్పులా మాట్లాడుతుందేమిటి? నా కస్సలు నచ్చలేదు. జెలస్ లా ఉంది""

"పోలీస్ ఆవిడ కదా. కొద్దిగా మాట కరుకని వదిలేద్దాం. నువ్వు చెప్పు. ఏం చేస్తే బావుంటుంది?"

"మరోసారి అలాంటి ఫోనొస్తే మీ నాన్నగారికి చెప్పు. ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళనుంచి దాచకూడదు".

"నాకూ అదే కరెక్టనిపిస్తోంది. ప్లీజ్. మా యింటిదాకా తోడు రావా?"

"అది నువ్వు ప్రత్యేకంగా అడగాలా? మీనాన్న వచ్చేవరకు నీకు తోడుగా ఉంటాను" అంది హిమవర్ష.

రాత్రి ఎనిమిదింటికి వాళ్ళ నాన్న వచ్చాక విషయమతా వివరంగా చెప్పింది క్షితిజ.

మరలా ఫోన్ మోగింది. క్షితిజ హలో అనగానే అటునుంచి వికటంగా నవ్వు వినిపించింది. "పోలీసులకు చెప్దామని ప్లాన్ వేస్తున్నావేమో ... నాలుగు సార్లు జైలుకెళ్ళిన వాణ్ణి. నాకేం భయం లేదు. ఇప్పటివరకూ నిన్ను రేప్ చేసి వదిలేద్దామనుకున్నా. నువ్వు పోలీసులకు చెప్పావనుకో .... నిన్ను మర్డర్ కూడా చేస్తాను. నీ దిక్కున్న చోట చెప్పుకో" అన్నాడు.

క్షితిజ నుంచి ఫోన్ లాక్కుని " ఎవడ్రా నువ్వు బాస్టర్డ్. నా కూతురి జోలికొస్తే నీ అంతు చూస్తాను" అన్నాడు క్షితిజవాళ్ళ నాన్న.

వాడు బెదిరిపోలేదు. చాలా కూల్ గా "ఓ.. డాక్టర్ గారా .... నీ కూతుర్ని వదిలేదే లేదు. నేను కోరుకున్న ఏ ఆడపిల్లనీ అనుభవించకుండా వదల్లేదు. చాతనైతే కాపాడుకో" అని ఫొన్ పెట్టేసాడు.

ఆ నెంబర్ కి మరలా ఫోన్ చేస్తే రామకోఠిలోని టెలిఫోన్ బూత్ నుంచని తెలిసింది. "ఓ నిమిషం క్రితం ఎవరు చేశారో చెప్పగలవా" అని అడిగితే "గుర్తుపెట్టుకోలేదు సార్. వయసు ముప్పయ్ వరకు ఉండొచ్చు. చాలా మంది వస్తుంటారుగా. ఎంతమందినని పరిశీలిస్తాం ... అసలెందుకు పరిశీలిస్తాం" అన్నాడతను.

తన కూతురు గురుంచి పరాయి వ్యక్తి అసహ్యంగా మాట్లాడినందుకు డాక్టర్ రక్తం లావాలా ఉడికిపోయింది. వెంటనే బయల్దేరి దగ్గిర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాసిచ్చాడు. దాంతో పాటు తనకు స్నేహితుడైన ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు.

బెదిరింపు ఫోన్ లు మాత్రం ఆగలేదు. ఒకట్రెండు రోజులు వాళ్ల నాన్నే దగ్గరుండి కాలేజీకి పిల్చుకెళ్ళి మరలా పిల్చుకొచ్చాడు. దాని వల్ల హాస్పిటల్ పని దెబ్బతింటోంది. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ప్రోగ్రెస్ అడిగితే ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్పారు.

అసలు ఫోన్ లు రోజుకొక ప్రాంతం నుంచి ఎలా వస్తున్నాయో అతనికి అర్థం కాలెదు. మాట్లాడే మగవాళ్ళ గొంతు కూడా వేర్వేరుగా ఉంటోంది. ఒక్కడే రకరకాలుగా గొంతు మార్చి మాట్లాడుతున్నాడా లేక ఒక గ్యాంగ్ లోని వ్యక్తులే వంతులవారీ మాట్లాడుతున్నారా అనే విషయం తెలియటం లేదు. క్షితిజ కాలేజీకెళ్ళటం మానేసింది. "నా కూతురికి ర్యాంక్ రాకున్నా మానే. తను క్షేమంగా ఉంటే చాలు" అనుకున్నారు.

బర్కత్ పూరా చౌరస్తానుంచి మరలా ఫోన్ వచ్చింది. క్షితిజనే రిసీవ్ చేసుకోమన్నాడు వాళ్ల నాన్న. ఫోన్ పెట్టేయకుండా వాడి గురించి తెలిసిపోయినట్లు మాటలు కంటిన్యూచేయమన్నాడు. తన సెల్ ఫోన్ లో కాచిగూడ స్టేషన్ లో పని చేస్తున్న తన మిత్రుడు సర్కిల్ ఇన్ స్పెక్టర్కి సమాచారం అందించాడు.

అరగంటలో ఫోనొచ్చింది. 'వాణ్ణి పట్టుకున్నాం. కాచిగూడ స్టేషన్ కి రమ్మని.

వాడు కనిపించగానే చంపేయాలన్న కసి. తన కూతుర్నీ తన కుటుంబాన్ని పది రోజులు నానా హింస పెట్టిన వాణ్ణి వదలకూడదన్న కోపం...

డాక్టర్ పోలీస్ స్టేషన్ చేరుకునేటప్పటికి వాణ్ణి కానిస్టేబుల్స్ లాఠీలతో చావగొడ్తున్నారు.

"వీడు పాత క్రిమినలా" డాక్టర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ని అడిగాడు.

"వీడి బొంద. మామూలు రౌడీ కూడా కాదు. ఎవరో డబ్బులిచ్చి అలా చేయమన్నారని చెప్తున్నాడు. వాళ్ళెవరో మాత్రం చెప్పటం లేదు. మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారుగా. తొందర్లోనే నోరు విప్పుతాడు" పోలీస్ నవ్వు నవ్వి చెప్పాడు.

పదినిమిషాల తర్వాత కానిస్టెబులొకతను వచ్చి సర్కిల్ ఎదురుగా నిలబడ్డాడు.

"చెప్పాడా?"

"చెప్పాడు సార్"

"ఎవరట?"

కానిస్టేబుల్ కనకరత్నం అంటున్నాడు సార్"

"అదెవరు?"

"లేడీ కానిస్టేబుల్ అట సార్. మలక్ పేటలో ఉంటుందట"

"స్టేట్ మెంట్ రికార్డ్ చేయి. ఏ పోలీస్ స్టేషన్ లో పని చేస్తోందో కనుక్కో. వాళ్ళ సర్కిల్ తో మాట్లాడతాను"

డాక్టర్ కి ఏమీ అర్థం కావటం లేదు. "ఈ కనకరత్నం అనే పేరు మొదటిసారి వింటున్నా. నా మీదో నా కూతురిమీదో ఆవిడకు పగ ఉండే అవకాశమే లేదు" అన్నాడు సర్కిల్ తో. మరో అరగంటకు కానిస్టేబుల్ కనకరత్నాన్ని స్టేషన్ కు పిల్చుకొచ్చాడు. అక్కడ దెబ్బలు తింటున్న వ్యక్తిని చూడగానే ఆమె ఖంగు తింది.

"ఈ వ్యక్తినెపుడైనా చూసావా" డాక్టర్ని చూపిస్తూ అడిగాడు సర్కిల్.

"లేదు" అంది కనకరత్నం.

"నువ్వు బెదిరించింది ఈయన కూతుర్నే" అనగానే బావురుమంది.

"నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలని, క్షితిజ మానసికంగా బలహీనపడి చదువులో వెనకబడిపోవాలనే దురుద్ధేశంతో చేసాను సార్. నా కూతురిమీది మమకారం నా చేత ఇలా చేయించింది సార్" అంది.

డాక్టర్ కేం మాట్లాడాలో అర్థం కాలేదు. మార్కుల కోసం ర్యాంకుల కోసం క్రిమినల్స్ లా ఆలోచించే తల్లితండ్రులుంటారనే విషయమే అతని వూహకు అందటం లేదు. అతను సర్కిల్ కి థాంక్స్ చెప్పి బైటికొచ్చాక ఈ విషయం అందరికీ తెలియటం అవసరమనిపించి టీవీ 9 వాళ్లకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

యింటి దగ్గిర క్షితిజ, వాళ్ళమ్మతో పాటు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది హిమవర్ష. ఫోన్ లు చేసి బెదిరించిన వ్యక్తి దొరికాడని క్షితిజ చెప్పగానే ఆఘమేఘాలమేద వచ్చి వాలింది హిమవర్ష. డాక్టర్ రాగానే ఏమి చెప్పకుండా "టీవీ 9 పెట్టండి" అన్నాడు.

స్క్రీన్ మీద కనకరత్నం కనిపించింది. "మన వందన వాళ్ల అమ్మ కదూ" అంది హిమవర్ష. క్షితిజకేమీ అర్థం కాలేదు. ఆమె కానిస్టేబుల్ కదా. అపరాధిలా అలా నిలబడిందేమిటి?

"నా కూతురికోసం ఈ ఘాతుకానికి ఒడికట్టాను" అంటొంది టీవీ వాళ్ళతో కనకరత్నం. విషయం అర్థమయ్యాక హిమవర్షకూ, క్షితిజకూ నోట మాట రాలేదు. తన కూతురికి ర్యాంక్ రావటం కోసం మరో ఆడ పిల్ల జీవితం తో సాటి ఆడదై ఉండి ఎలా ఆడుకోగలిగిందీ అనే విషయం ఎవ్వరికీ మింగుడు పడటం లెదు.

పిల్లల మార్కులూ ర్యాంకులూ తల్లితండ్రులకు కూడా ఒత్తిడిని పెంచుతున్నాయని తెలుసు కాని, ఆ వత్తిడి విపరీతంగా పెరిగి మానసిక రుగ్మతలా మారి, వాళ్ళ చేత హింసాత్మక చర్యలు కూడా చేయిస్తోందంటే యంసెట్ ర్యాంకుల పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో అర్థమై హిమవర్షకు భయమనిపించింది.

**** **** ****

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.