పర"దేశి" కతలు: జీతేరహో హైద్రాబాద్!

-- తాటిపాముల మృత్యుంజయుడు

ఈ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఉల్లాసం పొంగిపొరలుతుంతే ఆఫీసులో కూర్చుని చకచకా పనులన్ని పూర్తి చెయ్యటం మొదలెట్టాను. అబ్బ, ఈ నెల ఇంత సునాయాసంగా గడుస్తుందనుకోలేదు. ఎక్కువగా జుట్టు పీక్కోకుండానే, తిప్పలు పడకుండానే 'పరదేశి కత 'కు ప్లాట్ దొరుకుతుందనుకోలేదు. అంతా, ఇంతా ప్లాట్ కాదు, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు, అది మరీ నేతి బుట్టలో పడ్డట్టు, అంత మంచి పాయింట్ దొరికింది. అది చదివిన వారందరు, పొట్టా చెక్కలయ్యేటట్టు నవ్వుకొని, ఆయాసంతో నా దగ్గరికొచ్చి, 'ఈ నెల మీ కథ మరీ బాగుంది. నవ్వలేక చచ్చాంపో. మీరు విసిరిన వ్యంగ్యోక్తులు చురకత్తుల్లా ఉన్నాయి....' అని తప్పకుండా పొగుడుతారు. అప్పుడు, ఆంధ్రసాహిత్యంలో 'నేనూ ఓ హాస్య రచయిత 'గా నిలబడతాను.

అలా కలలు కంటుంటే అయిదు గంటలైంది. ఆఫీసులో ఒక్కొక్కరూ తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళుతుంటే, ఏకాంతం దొరుకుతున్న నేను కథ రాయాటానికి పూనుకొన్నాను. కలం, కాగితం అందుకొని బరబరా గీకేస్తుంటే.... సారీ... లాప్ టాప్ కీబోర్డుపై టపటప టైపు చేస్తుంటే ఇంటికెళ్ళబోతున్న సుందర్రావు నా దగ్గరికొచ్చాడు 'ఏంటీ! ఏదో బుల్లెట్ ట్రేయిన్లా టైపు చేస్తున్నారు ' అంటూ.

ఉత్సాహంతో ఉన్న నేను అసలు విషయం చెప్పాను. అంతా విన్న సుందర్రావు, 'వెరీగుడ్, అయితే నేను తప్పకుందా చదువుతాను ' అంటాడేమో అనుకొంటే, నిర్లిప్తంగా 'ఓకే' అంటూ ఎలివేటర్ దిక్కు అడుగులేసాడు.

'ఏంటో ఈ మనిషి, మరీ మూడీ అండ్ సెన్సిటివ్ ఫెలో' అనుకుంటూ రాయటం... మళ్ళీ సారీ... కీబోర్డు టపటపలాడించడం మొదలేట్టాను.

అంతలోనే తిరిగొచ్చిన సుందర్రావును చూసి 'ఏమైనా మరిచావా?' అని అడిగాను. 'అదేం లేదు. ఏమనుకోకుంటే ఓ రెండు మాటలు మాట్లాడాలి ' అన్నాడు. 'సరే' అంటూ టైపు చెయ్యడం ఆపేసాను నేను.

'నువ్వు ప్రతి నెల తప్పనిసరిగా నీ కథ హాస్యంగా, వ్యంగ్యంగా ఉండేటట్టు శ్రద్ధ తీసుకొని రాస్తాన్నావు. చాలా సంతోషం. కాని పోయిన వారమే హైద్రాబాదులో రెండు చోట్ల తీవ్రవాదులు బాంబులు పెట్టారు. ఈ నెల నీ కథ ఆ దురదృష్ట సంఘటనల గురించి రాస్తే సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. సరే, రేపు కలుద్దాం.' అంటూ వెళ్ళిపోయాడు.

హైద్రాబాదు లుంబినీ పార్కులో, గోకుల్ ఛాట్ హౌస్ లో బాంబులు పేలి చాలామంది అమాయకులు చనిపోయిన వార్తలు విని సున్నితమనస్కుడైన సుందర్రావు కలత చెందాడు. అప్పటినుండి రోజూ ఆ విషయం గురించి ఏదో ఒక విధంగా బాధను వెలిబుచ్చుతూనే ఉన్నాడు.

సుందర్రావు అన్న మాటల గురించి ఆలోచించటం మొదలెట్టాను. నిజమే! నెలనెలా ఒక వైవిధ్యమైన టాపిక్ తీసుకొని రాయాలనే తపన తప్పించి, హైద్రాబాదులో జరిగిన మారణహోమం గురించి పూర్తిగా మరిచిపోయాను. 'దటీజ్ నాట్ ఫేయిర్ ఆన్ మై పార్ట్'.

రాస్తున్న కథను మధ్యలోనే వదిలేసాను. ఈ మధ్యలో కొద్దిగా రచనావ్యాసంగం మొదలెట్టిన నేను రచయితగా ఈ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచిస్తుంటే మనవాళ్ళకు జరిగిన దారుణం తల్చుకొని కడుపు తరుక్కుపోయింది. అదే ఊపుతో ఈ కింది కవిత రాసాను.

పిరికిపందలు!చల్లగా వీచే సాయంత్రపు గాలుల్లో

విషవాయువు నింపిన కపటులు మీరు

జిలుగులొలికే లేజర్ కాంతుల్లో

కాళరాత్రిని చిమ్మిన కౄరులు మీరు

ముఖాన నవ్వులు పులుముకొని పక్కనే వుంటే

మిత్రులనుకున్నాం గాని

పక్కలో బల్లాలనుకోలేదు

వెన్నంటినడుస్తూ ఉంటే సహచరులనుకున్నాం గాని

వెన్నుపోటు పొడుస్తారనుకోలేదు

అతిథులను చంపి తినే 'వాతాపి ' రాక్షసులు మీరవుతే

'వాతాపి జీర్ణం' అనగల అగస్త్య మహర్షులం మేము

అవగుణాలతో కుంచించుకుపోయిన మరుగుజ్జులు మీరైతే

అభివృద్ధితో అంబరాన్ని తాకుతున్న విద్యాధికులం మేము

అద్దం ముందు నిలబడి ఒక్కసారి మీ ప్రతిబింబాల్ని చూసుకోండి

పొగచూరిన ముఖాలతో, సొట్టముక్కులతో

లొట్ట పోయిన కన్నులతో వికృతమైన రూపం మీది

భారతావని ప్రజలందరం గాడ్రించి ఉమ్మేస్తే

ఆ వెల్లువలో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయే

పెంటబొందల మీద పుట్టుకొచ్చే పుట్టగొడుగుల్లారా,

మరోసారి మాదిక్కు కన్నేత్తి చూసారో, ఖబడ్దార్!కవిత రాయటం ముగించి 'హాట్సాఫ్ టు సుందర్రావు!' అని మనసులో అనుకొన్నాను. తృప్తిచెందిన మనస్సుతో లాప్ టాప్ మూసేసి ఇంటికి బయలు దేరాను.

(హైద్రాబాదు బాంబుల విస్ఫోటనంలో మరణించిన సోదరీసొదరులకు ఈ కథ అంకితం.)