పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు సెప్టెంబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. పద్యంలో యతిప్రాసల నియమాల సులువుగా అవగాహన అవ్వడానికి పాఠకుల సౌకర్యార్థం ఈ లంకెని నొక్కండి..

ఈ మాసం సమస్య

"ఆ.వె.// చేరదీసినోడె చేతకానివెధవ"

క్రితమాసం సమస్య :
"ఆ.వె. :// వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను"

మొదటి పూరణ - డా: ఐ.యస్. ప్రసాద్, హైదరాబాద్

ఆ.వె.// వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను
పక్కనున్న కరములొక్కటౌను
తెరచి ఉన్న కన్నులరమోడ్పులయ్యేను
గురుని చెంత చేరి శిరము వంచ!

రెండవ పూరణ -శ్రీనివాస్ బెంగళూరు,

ఆ.వె.// వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను
కార్యసాధనమున కలసి మెలసి
పిడికిలై బిగియగ పెనుశక్తి పుట్టేను
ఐకమత్యమున్న అడ్డుకలదె?

మూడవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే

ఆ.వె.// అబల కాదు ఆమె సబలని తెలియక
చొఱవచేసెనొకడు వెఱపులేక
వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను
ఛెళ్ళుమనెను చెంప, కళ్ళు తిరిగె !

మరొక పూరణ- పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే

ఆ.వె.// కరము తోన చేయు కంగ్ఫు కరాటెలో
ఆరితేరెనతడు జోరుగాను
వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను
వేళ్ళు పిడికిలయ్యె, రాళ్ళు పగిలె

నాల్గవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే,

ఆకలేసినపుడు నాకు ముద్ద కలుప,
కడుపులోనిమంట కరువు తీర,
వేరువేరుగున్నవేళ్లన్ని కలిసేను,
డొక్కబాధ తెలియు రెక్కకొకటె!

ఐదవ పూరణ - మాజేటి సుమలత,

ఆ.వె.// మతములన్ని కలసి మానవత్వంబయ్యె
జాతులేలయనుచు జనులు పల్క
వేరువేరు గున్న వెళ్ళన్ని కలిసేను
నాదు ధరన వెలుగు నవ్య కాంతి
రావణుని బంటు వయితివి రామచంద్ర!!

ఆరవ పూరణ ఎం.వి.సి. రావు.

మతములెన్ని వున్న మానవులొక్కటె
కులము లెన్ని వున్న కోర్మి వలయు
వేరు వేరు గున్న వెళ్ళన్ని కలిసేను
శక్యమున్న నాదె సౌక్యమబ్బు


ఏడవ పూరణ-- తుమ్మల శిరీష్ కుమార్

చెదరిబెదరిపోయి చెట్లకొమ్మలదిరె
వాయుదేవుగూడి వాన రాగ
వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను
కోతపడిన ధరను కోరి బ్రోవ !అలనాటి ఆణిముత్యాలు :

శ్రీ కృష్ణదేవరాయుల ప్రసిధ్ధ గ్రంధం, "ఆముక్తమాల్యద" నుండి గ్రహించిన పద్యం: శ్రీ విలుపుత్తూరనే పట్టణ అందాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణదేవరాయలు అందించిన పద్య చిత్రం.

లలితోద్యాన పరంపరా పిక శుకాలాప ప్రతిధ్వానము

ల్వలభీ నీఅహరిన్మణీ పికశుక స్వాన భ్రమం బూన్ప మి

న్నులతో రాయు సువర్ణ సౌధముల నెందుం జూడ జెన్నొంది శ్రీ

విలుబుత్తూరు సెంగుబండ్య నగరోర్వీ రత్న సీమంతమై.

ప్రతిపదార్థం:

పండ్యనగర=మధురానగరము (దేశరాజధానిగాగల)
ఉర్వి=దేశమునకు
రత్న సీమంతమై=రత్నాల పాపట బొట్టై
శ్రీవిలుబుత్తూరు=ఆ పేరుగల పట్టణము
(ఒట్టి విలుపుత్తూరు కాదు.శ్రీ విలుపుత్తూరనే వాడుక.సంస్కృతంలో దీన్నే ధన్విపురమన్నారు;
పద్యంలో ఇది ప్రధాన వాక్యం.మిగిలిన పద్యమంతా దీన్ని సమర్థించేది)
లలిత=మృదువైన
ఉద్యాన పరంపరా=తోటల వరుసలయందున్న
పిక=కోకిలలు
శుక=చిలుకలు
ఆలాప=కూతలయొక్క
ప్రతిధ్వానముల్=రతిధ్వనులు
వలభీ=ఇంటివసార ముందు చూరులలో ఉన్న లేదా గృహముయొక్క పై భాగమందున్న
నీల=ఇంద్రనీలములయొక్క
హరిత్+మణి=పచ్చల చేత(అందం కోసం మలచబడి అలంకరించ బడ్డ)
పికశుక=కోకిలలు,చ్లుకల యొక్క
స్వాన=ధ్వనులున్న
భ్రమన్=భ్రాంతి
పూన్పన్=కలిగించగా
మిన్నులతో రాయు=ఆకాశమంటే
సువర్ణ సౌధములన్=బంగారు మేడలతో
ఎందున్ చూడన్=ఎల్లెడలా(ప్రతిదానిలా0
చెన్నొంది=అందగించి
చెలంగున్=ప్రకాశిస్తుంది

తాత్పర్యము: మదురా నగరమె రాజధానిగా గల పాడ్యదేశమున్న భూదేవికి రత్నాల పాపిట బొట్టుగా, శ్రీవిలుప్త్తూరన్న పట్టణమున్నది. ఆనగరం చుట్టూ అందమైన ఉద్యానవనాలున్నాయి.అందులో ఉన్న కోకిలలు, చిలుకలు, పాడుతూ ఉంటే అవి నగరంలోని ఇండ్ల చూరుల్లో అలంకారార్థం అమర్చిన ఇంద్రనీలములు, పచ్చలతో చేసిన పికశుకాలు పాడితే ప్రతిధ్వనులు లాగా ఉన్నాయి. ఈ భ్రాంతి ప్రజలకు కల్పిస్తున్నది.అసలు పాడుతున్నది ఉద్యానవనాలలో పక్షులు కాని నగరవీధులలో పోతున్న ప్రజలకు ఈ కృత్రిమ శుకపికాలు పాడుతుంటే ఉద్యానవనాలు ప్రతిద్వనిస్తున్నట్లు భ్రాంతి కలుగుతున్నది. ఆనగరంలో మిక్కిలి ఉన్నతమైన బంగారు మేడలున్నాయి.ఇందు చేత ఆ నగరం పాండ్యదేశానికి పాపట బొట్టుగా ఉన్నది.