నటరంజని (నాటకం): హులిక్కిపడదామా

-- జి.ఎస్.లక్ష్మి

ఈమధ్యన టీవీల్లొ ప్రేక్షకులు పాల్గొనే కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. వాటిమీద సరదాగా అల్లిన కల్పనే ఈరచన. దీనిని ఎవరినీ ఉద్దేశించి రాసినదికాదు. సరదాగా కాసెపు నవ్వుకుందుకు చేసిన చిన్ని ప్రయత్నం. స్టేజిని రెందు భాగాలుగా చెయ్యాలి.ఒకవైపు యాంకర్ ప్రోగ్రాం చేస్తుంటె మరోవైపు టివి స్టేషనుకి ఫొను చెసినావిడ మాట్లాడుతుండాలి.ఆవిడ పేరు జగదాంబ. ఒక చేతిలో టివి రిమోటు మరోచేతిలో మొబైల్ ఫోన్ ని పట్టుకునుండాలి. సందర్భాన్నిబట్టి రెండూ చేతులు మారుస్తూ ఉండాలి. ఇడ్డరూ ప్రేక్షుకులకు కనపడుతొండాలి. అందువల్ల ఒకరు మాట్లాడినదానికి మరొకరి ప్రతిస్పందన, ప్రెక్షకులకి బాగాకనిపిస్తుంది. తెరతీసెముందు మ్యూజిక్ వినిపిస్తుంది. వెనకనించి ప్రకటన వినిపిస్తుంది.

ఘోరదర్శిని కేంద్రం...బాదరాబాదు ప్రసారాలు ప్రారంభం...

మ్యూజిక్ వినిపిస్తుండగానె తెరలేస్తుంది. వెనకాల తెరకి దేవతావస్త్రాల షోరూం అని బేనర్ మీదరాసుంటుంది. అతిగా అలంకరించుకుని సన్నగా రివటలాఉన్న ఓ అమ్మాయి ముఖానికి మందంగా పౌడరు పూసుకుని కళ్ళకి మస్కారా ఎక్కువగా పెట్టుకుని మైకుముందు నిలబడిఉంటుంది. ఆమె నుదుటిమీదబొట్టు నాగుపాములా మెలితిరిగిఉంటుంది. జుట్టు విరబోసుకునిఉంటుంది. అస్తస్తమానం కళ్ళమీదపడ్డజుట్టుని ఎడంచెత్తో వెనక్కి తొసుకుంటు మళ్ళీ అదే చేతివేళ్ళతో ముఖం మీదకి లాక్కుంటూంటుంది. ప్రసారాలు ప్రకటిస్తున్నంతసేపూ మధ్యమధ్యలో పళ్ళికిలిస్తూ హా అని అరుస్తూ ముద్దుగా, గారంగా మాట్లాడుతూఉంటుంది.

యాంకర్-- నమస్కారం.ఎప్పుడా...ఎప్పుడా.. అని మీరు రాత్రంతా నిద్రపోకుండా మా ప్రోగ్రాం కోసం చూస్తున్నారుకదూ... నాకుతెలుసండీ... అదిగో మీ కళ్ళ్ల్లొ ఆ ఆనందం నాకు కనపడుతోందండీ .(వేలితో ప్రెక్షకులవైపు చూపించాలి)

మరింకెందుకు ఆలస్యం.. ప్రోగ్రాం మొదలుపెడదామా.. మన ప్రోగ్రాంపెరెవిటీ ...అదిగో, అదిగో అందరూ చెప్పేస్తున్నారు....కరక్ట్. 'హుళిక్కిపడదామా'. మరి మనం ఈ హుళిక్కిపడదాం ప్రోగ్రాం మొదలుపెడదామా...మరి మొదలుపెట్టేముందు ఒక చిన్న భ్రేక్...

యాంకర్ నెమ్మదిగా పక్కకి తప్పుకుంటుంటె సైడువింగులోంచి మరో అమ్మాయి గుండ్రంగా తిరుగుతూ వస్తుంది. విచారంగా నెమ్మదిగా తలెత్తుతుంది. 'నేను నల్లగా ఉన్నాను, నన్నెవరు పెళ్ళి చేసుకుంటారు..ఎవరు చేసుకుంటారు.' అంటూ చేతులు రెండూ పైకెత్తి అరుస్తుంటుంది.'ఎవరు పెళ్ళి చేసుకుంటారూ మరోవైపుతిరిగి 'ఎవరు చేసుకుంటారు..' పక్కనుంచి ఒక పౌడరుడబ్బా ఎగిరొచ్చి ఆమె దగ్గర పడుతుంది. ఆడబ్బా చేతిలోకి తీసుకుని, చేతిలో చాలాపౌదరు వేసుకుని గబగబా ముఖానికి పులిమేసుకుంతుంది.

.పక్కన కర్టెనులోంచి ఒక మొగ గొంతుక ఇలా వినిపిస్తుంది..

'సుందరి నీవంటి దివ్యస్వరూపము ఎందెందు వెదకిన లెదుకదా, నీ అందచందాలింక నావెకదా..అహ సుందరి.. ఒహొ సుందరి.. ' 'ఓసుకుమారీ, నాసౌందర్యదేవతా ఇన్నాళ్ళకి కనిపించావా.. రా నారధం ఎక్కు..నిన్ను మాఊరు తీసికెళ్ళి పెళ్ళిచేసుకుంటాను.

వెంటనే ఆ అమ్మాయి సంతోషంతో ఎగురుతూ 'హా రాజకుమారా..వస్తున్నా..వస్తున్నా.'అంటూ 'అందరికీ నారాజకుమారుడిలాంటి మొగుదు దొరకాలంటె ఈబూడిదకంపెనీపౌడర్నే వాడండి’ అంటూ పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మొదటి యాంకర్ వస్తుంది.యాంకర్--మన హుళ్ళిక్కిపడదాం ప్రోగ్రాంకి స్వాగతం.. సుస్వాగతం.. మనం ప్రోగ్రాం మొదలుపెట్టబ్యేముందు మనం ఎప్పుడూ చెప్పుకునె ముద్దమాట ఒకటి చెప్పుకుందాం.. ముద్దమాట అని ఎందుకన్నానంటే, ఎప్పటినుంచో అందరూ చెప్పుకొస్తున్నమాట కనక, అందరి నోళ్ళలో నానినాని ముద్ద అయిపోయిందికనక ముద్ద మాట అంటున్నాం. అదేవిటంటె.. 'రోజూ పొద్దున్నె లేవండీ అనీ. చూసేరా మన పెద్దవాళ్ళు ఎంతమంచిమాట చెప్పేరో.. పొద్దున్నలేస్తేకదా మనం 'హులిక్కిపడదాం' చూసి బోల్డుప్రైజులు గెల్చుకోవచ్చు...అందుకే పెద్దవాళ్ళ మాట వినాలంటారు.. ఆఆఆ!!!... ఇప్పుడు నేను ఒక నంబర్ కాల్ చేస్తాను..

చేతితో నంబర్ లు నొక్కినట్టు నటించాలి. 'హలో..హలో..'ఇదేవిటీ ఎవరూతియ్యటంలేదు.. మళ్ళీ చేస్తాను.. హలో.. ఎవరండీ... నేనండీ.. 'హులిక్కిపడదాం' నుంచి బ్రహ్మకుసుమాన్ని.... హలో... హులిక్కిపడ్డారా... ఏవండీ.. మిమ్మల్నే..హహహహ్.. హులిక్కిపడ్డారా...

స్టేజికి పక్కభాగంలోవున్నావిడ మొబైలు ఫోను తీసి మాట్లాడుతుండాలి..(ఆవిడ పేరు జగదాంబ.)

'హలో... హలో.' అని ఫోను లో చెపుతూ, పక్కకితిరిగి, 'ఓ వెంకమ్మొదినా,, ఇదిగో రవణక్కయ్యా.. ఏవేవ్ మంగతాయారూ, అందరూ రండే, నాకు హులిక్కిపడదాంనుంచి ఫోను వచ్చిందే' అని గట్టిగా పిలుస్తుంటుంది. మళ్ళీ కూలబడిపోయి, 'అయ్యో, కరంటుపోయిందే' అనుకుంటుంది.యాంకర్-- హలో.. హులిక్కిపడ్డారా.. హలో హలో..

జగదంబ--ఆయ్,, ఉలిక్కిపడ్డామండి..ఆయ్.. నాకు సంతోషంతో మాట్లు రావట్లేదండి బ్రహ్మంగారూ.. ఆయ్

యాంకర్-- అయ్యో నాపేరు బ్రహ్మంకాదండీ.. బ్రహ్మకుసుమాన్ని.. మీరు మీ టీవీ వాల్యూం ని కాస్త తగ్గిస్తారా..

జగదంబ-- అదేనండి బ్రహ్మకుసుమంగారూ, మీరు చాలాఅందంగా ఉంటారండీ..

యాంకర్--(సిగ్గుపడుతూ) చాలా థ్యాంక్స్ అండీ.

జగదంబ--మీయాంకరింగ్ చాలా బాగుంటుందండీ

యాంకర్--(గర్వంగా) థ్యాంక్స్ అండీ.

జగదంబ--మిమ్మల్ని చూస్తుంటె మా అమ్మాయిని చూస్తున్నట్టె ఉంటుందండీ..

యాంకర్--(ఇకిలిస్తూ, నెమ్మదిగా) బతికించారు. .మా అత్తగారిలా ఉంటారన లేదు. (పైకి) ఇంతకీ మీపేరు ఏంటండీ..

జగదంబ--నాపేరు జగదాంబండీ..(గట్టిగా) జగదంబండీ.

యాంకర్-- ఆహా. ఎంత మంచి పేరండీ. ఇంత మంచి పేరు మీకు ఎవరు పెట్టారండీ..

జగదంబ-- మా పక్కింటి వాల్లండీ... ఆఆయ్..

యాంకర్---ఆహా అందరికి పేర్లు వాళ్ళ అమ్మా, నాన్న పెడతారు.. కాని మన జగదంబగారికి పేరు వాళ్ళ పక్కింటివాళ్ళు పెట్టేరుట.. ఆహా! మీరు చాలా గొప్పవారండీ.. అమ్మా! జగదంబగారూ, ఇప్పుడు మన హులిక్కిపడదాం కార్యక్రమంలో ఒక చిన్న భ్రేక్ తీసుకుందామా... ఇప్పుడు ఒక చిన్న భ్రేక్..

యాంకర్ నెమ్మదిగా పక్కకి వెల్లిపోతుంది. పక్కనుంచి గుండ్రంగా తిరుగుతూ మరో అమ్మాయి వస్తుంది..

అమ్మాయి-- నేను చేసిన వంట మా ఆయనకి నచ్చటంలేదు.. మా ఆయనకి నచ్చే వంట నేను చేయడం ఎలా.. ఎవరైనా చెప్పగలరా.. ఎలా.. ఎలా.. ఎలా..చేతులు రెండూ పైకెత్తి అన్నివైపులా తిరుగుతూ అరుస్తుంటుంది. ఢాం అని శబ్దం .--సైడ్ వింగ్ లోంచి కొన్ని కరపత్రాలు ఎగిరొచ్చి పడతాయి. ఒకటి తీసి గట్టిగా ఇలా చదువుతుంది-అందిమీద.. 'మీరు చెసిన వంట మీ ఆయన మెచ్చటంలేదా.. అయితే తీసుకురండి ఆయనని నిలవ సరుకుల నూరు నక్షత్రాల హోటల్--మీవంట-- మాఇంటకు..’ పక్కనుంచి గట్టిగా నిలవసరుకుల నూరు నక్షత్రాలహోటల్ మీవంట.. మాఇంట అని రెండు మూడు సార్లు గట్టిగ వినిపించాలి.

ఆ.. ఆ .. అమ్మాయి పరవసించిపొతూ డాన్సు చేస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ యాంకర్ వస్తుంది స్టేజిమీదకి..యాంకర్--హులిక్కిపడదామా ప్రోగ్రాం కి తిరిగి స్వాగతం.. .. సుస్వాగతం.. హలో జగదంబగారూ.. ఉన్నారా..

జగదంబ-- ఆఆయ్.. ఉన్నానండి.. (ఇకిలిస్తూ) మాకు ఇప్పుడే కరంటు వచ్చిందండి.. మీరు కట్టుకున్న చీర చానాబాగుందండీ.. ఎక్కడ కొన్నారేంటండి..

యాంకర్ స్టేజి మధ్యకి వచ్చి, చీరకొంగు బాగా విప్పి, డిజైను చూపిస్తూ తిప్పుకుంటూ తిరగాలి.

యాంకర్-- ఈ చీరేనా.. హీహీ.. .. దేవతావస్త్రాల షోరూం వాళ్లదండీ.. వాళ్ల మైన్ బ్రేంచ్ అబిడ్స్ లో ఉంది. బ్రాంచీలు చీకటిపల్లీ, దిల్కుష్నగర్లలొ ఉన్నాయి. మీరు ఎక్కడుంటారంటండీ..

జగదంబ-- ఆఆయ్.. మెం బీంవరంలొ ఉంటావండి..

యాంకర్--ఆఆహా, అలాగా.. అయితే మీరు తప్పకుండా బాదరాబాదు వచి దేవతావస్త్రాల షోరూంకి తప్పకుండావెళ్లండి. ఇప్పుడు మన హులిక్కిపడదాం ప్రోగ్రాం లొ ఒక చిన్న భ్రేక్..యాంకర్ పక్కకి వెళ్ళి పోతుంది. సైడ్వింగ్లోంచి గుండ్రంగా తిరుగుతూ మరో అమ్మాయి వస్తుంది. తల విరబోసుకుని విచారంగా ఉంటుంది. జుట్టుని బాగా చేతులతో విడదీసి చూసుకుని బాధ పడూతూంటుంది. 'అందరూ నాజుట్టుచూసి నవ్వుతున్నారు. ఓదేవా.. నాకొక మంచి హైర్ స్టయిల్ చూపించలేవా..'పక్కనుంచి ఢాం అని శబ్దం ఒక సీసా వచ్చి ఆమె కాళ్ళ ముందుపడుతుంది. ఆమె అది తీసి చదువుకుంటుంటే పక్కనుంచి ఇలా వినపడుతుంది. 'బాలికా, బాధపడకు. ఈ నూనె నీ తలకి రాసుకో. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అద్భుతమైన కొంగ్రొత్త కేశాలంకరణ నీకు ప్రాప్తిస్తుంది.అమ్మాయి-- అంతె ఇది రాసుకుంటె నాజుట్టు నల్లగా, వత్తుగా వస్తుందా తల్లీ..

పక్కనుంచి-- పిచ్చిదానా.. ఒత్తుగారాదు సరికదా.. ఉన్నజుట్టుకూడా ఊడిపోతుంది. దానితొ ప్రపంచం మొత్తంమీదే సరికొత్త కేశాలంకరణతో 'గుండుసుందరీగా పేరుగాంచుతావు.

అమ్మాయి-- హా. నిజమాతల్లీ.. ఎంత దయగల తల్లివి. ఇప్పుడే దీనినివాడి గుండుసుందరి గా పేరు తెచ్చుకుంటాను. గంతులేస్తూ సైడ్ వింగ్ లోకి వెల్లిపోతుంది.

యాంకర్ తిరిగి ప్రవేశిస్తుంది.యాంకర్-- హులికిపడదామా ప్రోగ్రాంకి స్వాగతం.. సుస్వాగతం.. జగదంబగారూ, ఇవాళ మన ప్రోగ్రాం కి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారండీ. మరి ఎవర్నొ ఒకర్ని సెలక్టు చేసుకొండి..

జగదంబ-- ఆ. ఆయ్.. ఎవరున్నారండీ ఫుటోల్లో..

యాంకర్-- అందరూ చాలాపెద్దవాళ్లండీ.. నేను వాళ్ల పేర్లు చెప్తుంటాను.. మీరు సెలక్టు చేసుకోండి.. ఓ.కే..... దుశ్శాసనుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, శూర్ఫణఖ, తాటకీ..

జగదంబ-- ఆ ఆయ్.. నాకు తాటకి కావాలండి..

యాంకర్-- (ఉలిక్కిపడినట్టు నటించాలి) హాహాహా ... మీరు నన్ను హులిక్కిపడేట్టు చేసేరాండీ.. సరే తాటకిగారు! మీకోసం ఏంగిఫ్టు తెచ్చేరో చూద్దాం.. చూసేముందు జగదంబగారూ, ఉన్నారా..

జగదంబ-- ఆ ఆయ్.. ఉన్నానండి.

యాంకర్--మరి ఇవాళ మీరు మా ప్రెక్షకులకొక టిప్పు చెప్తారా..

జగదంబ-- ఆ ఆయ్.. అవేవీ నాకేవీ రావండీ

యాంకర్-- అలాగంటె ఎలాగండీ.. సరె నేనే అడుగుతాను.. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండీ.

జగదంబ-- ఆ ఆయ్.. నేనూ, మా ఆయనాండీ..

యాంకర్-- మీ వారెం చేస్తూంటారూ..

జగదంబ-- వంట చేస్తూంటారండీ.

యాంకర్-- అంటె మీకు హోటల్, మెస్సు లాంటి దేమైనా ఉందా..

జగదంబ-- అబ్బే.. లేదండీ..

యాంకర్—అంటె మీరు మీవారిమీద జోకు వేస్తున్నారుకదా..

జగదంబ-- అబ్బె, జోకుకాదండీ, నిజమే.. రోజూ రెండుపూట్లా మాఇంట్లో మావారే వంట చేస్తూంటారండీ.. అందుకనే నాకు తిపూలు ఏవీ తెలీవండీ.

యాంకర్--(సర్దుకుంటూ)-ఒకే..ఒకే. మరి మీవారు వంట చేస్తుంటే మీరెం చేస్తుంటారండీ

జగదంబ--ఆయ్, టీవీ చూస్తుంటానండీ.

యాంకర్--అంటె మీ హాబీ టీవీ చూడ్డమాండీ..

జగదంబ-- హాబీ కాదండీ.. నాపనే అదండీ.. మా ఆయనెమో వంట చేస్తా ఉంటాడండీ.. నేనేమో టీవీ చూస్తా ఉంటానండీ ఆయ్..

యాంకర్--(నెమ్మదిగా, తనలో) అయ్యబాబోయ్.. ఇదేదో నట్టు కేసులాగే ఉంది.. (పైకి)

ఓకే.. ఓకేనండీ జగదంబగారూ, మీరు తాటకిని కోరుకున్నారుకుదా..

జగదంబ-- ఆయ్, అవునండి..

యాంకర్-- మరి మీ గిఫ్టు ఏమిటంటే.. ఏమిటంటే.. అమ్మా.. ఆశ, దోశ, అప్పడం, వడ.. అంతలా చెపుతాననుకున్నారా.. ఎంతాశ.. ఇదిగో.. ఈ భ్రెకు తర్వాత చెప్తా..

నెమ్మదిగా పక్కకి వెల్లిపోతుంది..పక్కనించి గుండ్రంగా తిరుగుతూ ఒక అమ్మాయి వస్తుంది. ఏడుపు గొంతుతో చేతులు రెండూ పైకెత్తి 'దేవా దీనబాంధవా, నువ్వె దిక్కయ్యా. మా ఆయన నానుండి దూరంగా వెళ్ళి పోతున్నాడు. అదేమని అడిగితె నీ బట్టలు మురికిగా ఉన్నాయంటున్నాడు. నాకు చావు తప్ప మరో దారి లేదు. ఓ భూదేవీ, నువ్వు రెండుగా చీలి నన్ను నీలో కలుపుకోమ్మా..’

ఢామ్మని శబ్దం.. పక్కనించి ఒక సబ్బుముక్క ఎగిరివచి పడుతుంది. పక్కనించి మాటలు వినిపిస్తాయి..

'బాలికా, బాధపడకు.. ఈసబ్బుతో నీ బట్టలు మీ ఆయన చేత ఉతికించుకో. అతను మళ్ళీ ఈ సబ్బుని వదిలిపోడు.'

ఆ అమ్మాయి సబ్బందుకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, 'మీరజాల గలడా.. న యానతి.. నా పతి..'అంటూ డాన్సు చేసుకుంటూ సైడువింగు లోకి వెళ్ళి పోతుంది. యాంకర్ మళ్ళీ వస్తుంది.యాంకర్-- హులిక్కిపడదామా ప్రోగ్రాంకి స్వాగతం.. సుస్వాగతం.. చూస్తున్నారుకదా.. మన అంబ.. జగదంబగారు తాటకిని కోరుకున్నారు. అమ్మా జగదంబగారూ, తాటకి మీకేం గిఫ్ట్ తెచ్చిందో చూద్దామా..

జగదంబ-- ఆయ్.. చూద్దావండి..

యాంకర్--(తాపీగా చదువుతుండాలి) ఒకటీ,

జగదంబ--ఆయ్..

యాంకర్--రెండూ..

జగదంబ--ఆయ్..

యాంకర్--మూడూ..

జగదంబ-- (ఆత్రంగా)ఆ...ఆ.. ఆయ్

యాంకర్-- హలో జగదంబగారూ... హలో, హలో.. అరె లైను కట్ అయిపోయిందే..

జగదంబ-- హలో... హలో..

యాంకర్--హలో జగదంబగారూ, సారీఅండీ.. లైను కట్ అయిపోయిందండీ. మరెం ఫరవాలేదందీ.. మీరు మళ్ళీ రిజిస్టరు చేసుకోండి.. నేను కాల్చేస్తాను.

జగదంబ--(గట్టిగా) ఏంటీ.. లైను కట్ అయిపోయిందా.. ఇప్పటికే నీకు ఫోను చేసినందుకు నాకు మూడొందలయింది. గిఫ్టు ఇదిగో ఇస్తాను.. అదిగో ఇస్తాను అని ఆఖరికి లైను కట్ చేస్తావా.. తిప్పుకుంటూ చీర చూపించుకుని నువ్వు.. నాలుగు భ్రేకులిచ్చావు.. గిఫ్టు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతావా..

యాంకర్--(వినిపించుపోనట్టు నటిస్తూ) ఇంతటితో ఈ హులిక్కిపడదాం ప్రోగ్రాం ముగిస్తున్నాం. మళ్ళీ రేపు ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం..

(అంటూ వెళ్ళి పోతుంది)

జగదంబ-- ఎలా వెళ్ళి పోతోందో.. ఇన్ని కబుర్లూ చెప్పి ఆఖరికి గిఫ్టు ఇవ్వకుండానే వెళ్ళి పోతోంది. చెప్తా, నీపని చెప్తా.. మళ్ళి రేపొస్తావుగా.. చెప్తా..

అంటూ టీవీ వైపు చూసి మెటికలు విరుస్తూండగా తెర పడుతుంది.