ఎందుకిలా?

-- తమిరిశ జానకివినిపిస్తున్నాయి కేకలు

అలజడి నిండిన అరుపులు

నేనెక్కడున్నాను?

నిద్రలోనా? మగతలోనా?

మగత కమ్మిన మత్తులోనా?

కలలుకనే నిద్రలోనా?

ఎవరివాకేకలు?

ఎందుకా అరుపులు?

మసిబారిన మనసులతో

గతితప్పిన మనుషుల కేకలు

నువ్వానేనా అంటూ

కాలుదువ్వి కళ్ళెర్రజేసే ఈ మనుషులకి

ఒకరంటే ఒకరికి పడకుండాపోయాకా

అరుపులు కాక

ఆత్మీయత వొస్తుందా అసలు?

పశుపక్ష్యాదులు నయంకదా

మాటలఈటెలు లేవు వాటికి

చెట్టూచేమా నయంకదా

కుతంత్రమన్నది ఎరుగవవి

వివేకం విచక్షణా జ్ఞానం

పొందిన మనిషి మాత్రమెందుకు

నైతిక విలువల్ని చిరిగిన

వలువలల్లే విడిచి పారేసి

మనుగడ సాగించాలని చూస్తున్నాడు?