కవిత్వంలో వ్యకిత్వ వికాసం - 6

వరూధినీప్రవరుల ఘట్టం

-- ద్వా. నా. శాస్త్రి

శ్రీనాధుడి వ్యక్తిత్వాన్ని తెలుసుకొన్నాం. మరణానికి జంకనివాడనీ - ఆత్మస్థైర్యంకలవాడనీ గ్రహించాం.దీనికి పెద్దన స్వభావం పూర్తిగా భిన్నం. శ్రీనాధుడి ముందు పెద్దన నిలవలేడనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు మరణించగానే పెద్దన దిగాలుపడ్డాడు. నిర్వేదంలో పడ్డాడు. అందుకే ఇలా అంటాడు -

"ఆంధ్రకవితా పితామహ అల్లసానిపెద్దన కవీంద్ర

అనినన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక

బ్రతికియున్నాడు జీవచ్చవంబునగుచు"- ఇదీ పెద్దన వ్యక్తిత్వం.జీవచ్చవంలా ఉన్నానని వాపోతున్నాడు.అంతే తప్ప శ్రీనాధుడిలా పరిస్థితులని ఎదుర్కొనే గుండె నిబ్బరం కనిపించదు.

ఇటువంటి అల్లసాని పెద్దన "మనుచరిత్ర" అనే ప్రబంధం రాశాడని తెలిసిందే. మనుచరిత్ర అంటే వరూధినీ ప్రవరుల వృత్తాంతమే - అన్నంతగా ప్రాచుర్యం పొందింది. మనుచరిత్ర చదివావా అంటే వరూధినీ వృత్తాంతం చదివావా? అనే అర్థం! వరూధినీప్రవరుల ఘట్టం శౄంగారమయం అనీ, వరూధినీ వలపుల రసవత్తర సన్నివేశమనీ భావిస్తారు.అంతేనా? ఆ వృత్తాంతంలో ఇంకేమీ లేదా? వరూధినీ ప్రవరుల కథలో గల అర్థయుక్తి లేదా గూఢోక్తి ఏమిటి? మానవాళి నేర్చుకొనేదేమిటి?

ప్రవరుడు మానవుడు. పెళ్ళి చేసుకుని బుద్ధిగా గృహస్థు జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకనాడు ఇంటికి వచ్చిన సిద్ధుడువల్ల తీర్థయాత్రలు చెయ్యాలన్న కోరిక పుట్టింది.ఆ సిద్దుడు ఇచ్చిన పాదలేపనం పూసుకొని హిమాలయాలకు వెళ్ళాడు.కాసేపు చూసి ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నాడు. కానీ పాదలేపనం కరిగిపోవటంవల్ల వెళ్ళలేకపోయాడు.అప్పుడు ప్రవరుడు పలికిన మాటలు మనం పరిశీలించాలి.మానవస్వభావాన్ని గ్రహించాలి.

"క్రొవ్వియేరాదగునే"?

అనుకున్నాడు.ముందు ఆలోచన లేకపోతే ఇలాగే వుంటుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే! "గతజల సేతు బంధనం" అనేదీ వర్తిస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవుడు ఏం చేస్తాడు - దైవాన్ని, విధిని తిట్టి పోస్తాడు. ప్రవరుడూ అలాగే తిట్టిపోశాడు. ఎవర్ని? దైవాన్ని. ఎలా? - ఇలా - "దైవంబ, కినుకనిట్లు పాఱవైచితె మిన్నులు పడ్డచోట"? -

ఓ దైవమా ! ఆకాశం భూమి మీద పడినట్లు కోపంతో నన్ను ఇక్కడికి విసిరి వేశావా? అని దైవాన్ని నిందిస్తున్నాడు.తప్పు చేసింది తను.తన తప్పును సమర్థించుకొనే మార్గం ఇది. దైవానికి కోపమట! అన్నీ సవ్యంగా కొనసాగితే మన ప్రతిభే! కాకపోతే దైవం తప్పు!ఇదీ మన మనస్తత్వం.అందుకే ప్రతిదానికీ దైవం మీదనే ఆధారపడటం, దైవమే కారణం అనటం మన బలహీనత అనాలి. మన అనాలోచిత చర్యలకి ఇతరుల్ని నిందించటం అసమంజసం కదా!

వరూధిని అప్సరాంగన.ప్రవరుడి సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైంది.వలచింది.పొందుకోరుకుంది.అప్సరస స్త్రీ అయిన వరూధినికి - సుర, గరుడ, కిన్నెర....వంటి దేవజాతుల వారికంటే ప్రవరుడే అందంగా వున్నాడట! ఇదే మనసు విచిత్రం! ఒక్కొక్కసారి ఒకరు ఎందుకు బాగా నచ్చుతారో, ఎందుకు నచ్చరో చెప్పలేం.

వరూధిని వాక్చాతుర్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.ఎవరైనా తన భావజాలానికి అనుగుణంగా, తన మనసుకి అనుకూలంగానే వాదిస్తారు.ఆ వాదన తర్కసహితంగానే కనిపిస్తుంది.అప్పుడు వక్రభాష్యాలూ తప్పవు.దొంగ కూడా తన దొంగతనాన్ని సమర్థించుకుంటూ మంచి అంశాలే చెప్తాడు.

వరూధిని తనమాటలతో ప్రవరుణ్ణి లోబరచుకోవాలని విశ్వప్రయత్నం చేసింది.ముందు తన స్థాయిని తెలిపింది. ఆ తర్వాత "ఆనందోబ్రహ్మ" అనేదానికి తన పంధాలో అర్థం చెప్పి ఒప్పింపజూచింది. అదీ సాధ్యం కాలేదు.చివరికి - గట్టిగా కౌగిలించుకొంది.ఆ స్పర్శతోనైనా దిగి వస్తాడనుకుంది.అయినా ఫలించలేదు.అప్పుడు స్త్రీకి సహజమైన ఎత్తుగడ ఏమిటి? ఏడవటం! ఆ ఏడుపుకి మగాడు కరిగిపోతాడు. అదీ చేసింది అయినా చలించలేదు.

పెద్దన ఈ సన్నివేశంలో "వ్యక్తి వికాసా"నికి సంబధించిన రెండు అంశాలు చెప్పాడు. మానవ మానసిక బలహీనతల్ని తెలిపి తద్వారా వాటిని అధిగమించాలన్నదే పెద్దన సందేశం. "ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగ" - ఇదీ పెద్దన లోకజ్ఞత! ఒంటరిగా వున్న అందమైన కన్యను చూస్తే చాలు - మగాడు ఏదో వంక పెట్టుకొని పలకరిస్తాడు.ఇది మనకి అనుభవంలోని విషయమే. అందుకే స్త్రీ ఏకాంతంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరొక లోకోక్తి చూడండి -

"వనిత తనంతతా వలచి వచ్చిన చుల్కన కాదె యేరికిన్" అందుకే కాసింత బెట్టు చూపాలి.బయట పడకూడదు.అంటే గుంభనంగా వుండాలి.అదను చూసి వలపు సంగతి బయటపెట్టాలి.ఇది అమ్మాయికే కాదు - అబ్బాయికీ వర్తిస్తుంది గదా! మనం వెంటపడితే తక్కువైపోతాం."అటునుంచి నరుక్కురా" అన్నట్టు వాళ్ళు మన వెంట పడేలా ప్రవర్తంచాలి.ఇదీ దీని ద్వారా పెద్దన చెప్పే శృంగారపాఠం!

"కలంచునే సతుల మాయల్ ధీరచిత్తంబులన్" అంటాడు పెద్దన. సుస్థిరమైన మనస్సున్నప్పుడు స్త్రీల మాయమాటలు పని చేయవు.చంచలమైన మనస్సువల్ల ఆపదలు సంభవిస్తాయి. మనసు మనపై స్వారీ చేయకూడదు.మనం మనసుపై స్వారీ చెయ్యాలి. మనసు పగ్గాలు మన చేతిలో వుండాలని హితవు!

మానవుడికి ఇంద్రియనిగ్రహం చాలా అవసరం.మానవ సమాజానికి కట్టుబాట్లు వున్నాయి.ముఖ్యంగా భారతదేశంలో ఒక సక్రమవ్యవస్థ వుంది. దానికి అనుగుణంగానే మలచుకోవాలి.కానీ - మనసు వుందే - ఇది ఒక్కొక్కసారి మనచేత పాడుపనులు చేయిస్తుంది.ముఖ్యంగా స్త్రీ (శృంగారం) విషయంలో! అందుకే

" ఎంతనేర్చినా ఎంత జూచినా

ఎంతవారలైనా కాంతదాసులే" అన్నాడు త్యాగయ్య.

పరాశరముని, విశ్వామిత్రుడు, ఇంద్రుడు మొదలైన వారెందరో స్త్రీలకి - సుందరాంగులకి లొంగిపోయారు. ఇదీ మానవ నైజం! దాని నుంచి బైటపడి - జితేంద్రియుడు - అనిపించుకొన్నవాడే ఉత్తముడవుతాడు.

సరే, ప్రవరుడు ససేమిరా ఒప్పుకోలేదు.వరూధిని మాయలో పడలేదు.జితేంద్రియుడయ్యాడు.అదే మరొకడైతే తప్పకుండా వరూధినికి బానిస అయ్యేవాడే.ప్రవరుడు ఎందుకంత నిగ్రహంతో వ్యవహరించాడు? అని ప్రశ్నించుకొంటే పెద్దనే చెప్పాడు - "అనుకూలవతియైన భార్య" వుందని! అసలు "పాయింట్" ఇక్కడే వుంది.భార్య అనుకూలంగా లేకపోతే మనసు వక్రమార్గం పడుతుంది.సంసారంలో భార్య పాత్రకి ప్రాముఖ్యం వుందన్న అంశాన్ని పెద్దన గుర్తుచేశాడు.

ఇంతకీ పెద్దన ఈ వరూధినీప్రవరుల వృత్తాంతం ద్వారా మనకి ఇచ్చిన సందేశం ఏమిటి? అంటే ఒకే ఒక్క సమాధానం - ఇంద్రియ నిగ్రహం. స్త్రీ వ్యామోహం అనర్థదాయకం. అయితే దీనికంటే సూక్షాంశాలు ఈ ఇతివృత్తంలో ఉన్నాయి. వాటిని మనం గమనించాలి.

ఏ దేశపు వాళ్ళకైనా, ఏ మతానికి చెందిన వారికైనా కలిగే సందేహం ఒక్కటే - స్వర్గం, నరకం వున్నాయా? పరలోకంవుందా? ఖుదా వుందా? - అని. నమ్మకం మీద ఆధారపడిన ఆంశం ఇది.నమ్మితే ఏమీ చెప్పలేం.కానీ అటూ ఇటూ ఊగే డోలాయమానస్థితిలో గలవారే ఎక్కువ.వరూధినీప్రవరుల ఘట్టానికి సంబధించిన గుణపాఠం ఒక్కటే ----- స్వర్గలోకంలో సుఖాలున్నాయనుకుని, మనం స్వర్గానికి వెళ్తాము అనుకొని - ఈ భూలోకంలో ఇంద్రియనిగ్రహంతో బుద్ధిగా వుండాలా? లేక స్వర్గమూ లేదూ - నరకమూ లేదు. "ఎంజాయ్" చెయ్యటమే ముఖ్యమా? ఎపుడో సుఖపడతామనుకొని ఇప్పుడు నిగ్రహంతో మనసును బాధ పెట్టాలా? లేక - స్వర్గం, నరకం అనేవి ఉన్నాయోలేవో? ఎవడు చూశాడు? అందుబాటులోవున్న ఆనందమే ముఖ్యం అనుకోవాలా? ఇదీ మన సమస్య? దీనిని పెద్దన ఈ కథ ద్వారా మనల్ని పరీక్ష పెట్టాడు. "To be or not to be, that's the question" అన్నట్టుగా మనబుద్ధికే వదిలేశాడు పెద్దన! అందుబాటులో వుంది కదా అని ఆనందించటమా? ఇది టెంపరరీ ఆనందం - టెంపరవర్రీ ఆనందం! అని నిగ్రహించుకోవడమా? - ఇవీ సకల మానవాళికి ఎదురైన ప్రశ్నలు!

ప్రవరుడు వంటివారు తయారయితే ఈ దేశం బాగుపడుతుంది. "సెక్స్" ఒక్కటే జీవిత పరమావధి కాదు - కారాదు. ఒక్కసారి లొంగిపోయావా - ఇక పతనావస్థ తప్పదు(విశ్వామిత్రుడి లాగా)- అని బోధిస్తుంది. ఈ వృత్తాంతం ద్వారా మనం చెప్పవలసింది ఇదీ! వరూధినీ శృంగారం కాదు.......!!!!