బ్రతుకు చిత్రం

-- అయోల రేణుక

.

'అక్కా! బావ పిలుస్తున్నాడూ ఆయాసపడుతూ మెట్లెక్కి వచ్చి చెప్పింది స్వప్న పిన్ని కూతురు రవళి.

"వస్తాను నువ్వెళ్ళు" అంటూ మళ్ళీ ఆలోచనలో పడిపోతింది. ఎంత మరచిపోడమనుకున్నా, స్నేహితురాలు చేసిన అవమానాన్ని తట్టుకోలేక పోతోంది....మొదట్నుంచీ ఆర్ట్ అంతే చాలా అభిమానం పెంచుకుంది. ఎవరు ఆర్ట్గేలరీ ఏర్పాటు చేసినా వెళ్ళటం, స్థోమతకి తగిన పెయింటింగ్ కొనడం, వేసిన వాళ్ళనిప్రశంశించడంలో తృప్తి పొందేది. రమేష్ కూడా ఖరీదైన హాబీని ఏనాడూ వ్యతిరేకించలేదు.

"అక్కా! వస్తున్నావా!" అంటూ ఇంకా అక్కడే నిలబడ్డ రవళినిచూసి లోపం, బాధ ఇంకా తగ్గక పోయినా, తను వస్తేగాని కదలదని అర్థం అయింది. "పద" అంటూ డాబా మెట్లు దిగింది స్వప్న.

"ఇంకా అదే తలచుకొని బాధపడుతున్నావా..." రమేష్ భుజం మీద చెయ్యివేసి అభిమానంగా అడిగేసరికి ఆపుకోలేక ఏడ్చేసింది.

"ఏమిటిది స్వప్నా! చిన్న పిల్లలాగ...అయినా అందరి స్వభావాలు ఒక్కలాగ ఉండవు.చిన్ననాటి అభిప్రాయాలు వేరు, ఎదిగాక వచ్చే ఆలోచనలు వేరు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటాను..."

"అది కాదు రమేష్! కళని కూడా ఇంత వ్యాపార ధోరణిలో చూడాలా?"

"తప్పదు స్వప్నా! నలుగురి దృష్టిని ఆకర్షించాలంటే కళని వ్యాపారంగా మార్చుకోవాలి, అయితే అందరూ అలా చేస్తారని కాదు, కొంతమంది వాటికే ప్రాముఖ్యత ఇస్తారు, నీవు చూపించే అభిమానం, ఆప్యాయత కన్నా ఆస్తి అంతస్తు సమాజంలో పలుకుబడి ఉన్న ఆవిడ నీ స్నేహితురాలి 'పెయింటింగులు ' కొంటున్నప్పుడు వాటికి,ఆదరణకన్నా ప్రచారం ఎక్కువ లభిస్తున్నప్పుడు ఎవరు మాత్రం కాదనుకుంటారు....నీ అభిమానం కన్నా దాని విలువ పది రెట్లు, ఇంక ఇక్కడితో ఈ విషయాన్ని మరచిపో....నేను నిన్ను ఇంకో చోటికి తీసుకువెళతాను....ముందు ముఖం కడుక్కొని రా..."

"నేను రాను" అంది స్వప్న

"చూడు అందరూ నీ స్నేహితురాలిలా ఉండరు.అయినా ఆవిడకోసం నీలో దాగిఉన్న ఒక మంచి ప్రోత్సాహకురాలిని నాశనం చేసుకోకు...కళని ఆదరించేవారే కరువైన ఈ సమజంలో అడపాదడపా కనిపించే నీలాంటి వాళ్ళ ప్రశంశలు, అభిమానం కళాకారులకి చాలా అవసరం"

"నన్ను అనవసరంగా పొగుడుతున్నావు"

"పొగడటం కాదు స్వప్నా! ఇది నిజం....మనస్ఫూర్తిగా నచ్చిన దానిని నచ్చింది అని చెప్పడం, ఈ స్వార్థ ప్రపంచంలో చాలా అరుదు. ఒక పొగడ్త, ఒక మంచిమాట అంటే వాళ్ళు తన కన్నా ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో, ఎదిగి పోతారో అన్న ఈర్ష్య వాళ్ళని పొగడనివ్వదు....సరేగాని ముందు నువ్వు తయారయి రావాలి..."

ఇంకా బతిమాలించుకోవడం ఇష్టం లేక "పద" అంటూ చెప్పులేసుకుంది....

"ఇలాగే....అయినా నువ్వు చాలా అందంగా ఉన్నావు" అన్నాడు చిలిపిగా చూస్తూ.

ఫక్కుమని నవ్వేసింది.అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితురాలు ఢిల్లీనుంచి వచ్చి ఆర్ట్‌గేలరీలో తన చిత్రకళాప్రదర్శన ఇస్తోందని తెలిస్సి పొంగిపోయింది. ఇంటికి పిలిచి అన్ని విధాల ఆదరించి సహాయం చేసింది.ఆమెతో పాటు ఎండలో తిరిగి, అదంతా తనకోసం అన్నట్లు శ్రమించింది.ఎంతగానో నచ్చిన 'చిన్నికృష్ణుడు రావి ఆకుమీద ఆటలాడుకుంటూ నవ్వుతున్నా తాంజూర్ పెయింటిగ్‌ని చాలా ఇష్టపడింది....అది కొనుక్కోవాలని ముచ్చటపడింది.దాన్ని డబ్బులు ఇచ్చి తీసుకుంటునప్పుడు....అదే పెయింటింగ్ ఇంకొక ఆవిడ సమాజంలో పలుకుబడి, డబ్బు, అధికారం చూపిస్తూ అదే కావాలని అడిగింది....."ఇది మా స్వప్న కొనుక్కుంది, ఇవ్వను" అంటుంది అనుకుంది

"ఇంత ఖరీదైనది నీకెందుకు, నీకు వేరేది చూపిస్తానుగా" అనేసరికి గుండె మండిపోయింది....అయినా ఏదో పంతంతో అది ఇవ్వకుండా ఇంటికి తెచ్చుకుంది...తెచ్చిన దగ్గరనుంచి స్నేహితురాలి మాటలే గుర్తుకొస్తున్నాయి గాని....అందులో ఉన్న అద్భుతమైన కళానైపుణ్యం కంటికి కనిపించలేదు.

బైక్ ఆగగానే ఒక్కసారిగా ఆలోచనలనుంచి తేరుకుంది. "పద" అంటూ లోపలికి తీసుకువెళుతుంటే అప్పుడు గమనించింది, అది ఒక అనాధ బాలల ఆశ్రమం అని....వాళ్ళు చాలా ఆదరంగా సంతోషంగా ఆహ్వానించారు.

ఆరోజు అక్క్కడ ఉన్న కొంతమంది పిల్లలు వేసిన చిత్రాలన్నింటిని ప్రదర్శిస్తున్నారు.పది పదిహేనేళ్ళ లోపల పిల్లలు....వాళ్ళగుండెల్లోంచి వచ్చిన చిత్రాలవి, పెన్సిల్‌తో తెల్లటి పేపర్ మీద వేసిన స్కెచప్ అవి....పెన్సిల్తో వేసిన స్ట్రోక్స్ చిత్రంలో ప్రతి కదలికని చూపిస్తున్నాయి.అన్నింటిలోకి ఆరేళ్ళ అబ్బాయి గీసిన చిత్రం చాలా ఆకట్టుకుంది.అది చేతిలోకి తీసుకుంది స్వప్న...సగం ఆకుపచ్చదనం, సగం ఎండిపోయిన చెట్టు అది....దాని కొమ్మకి వేసిన ఊయలలో, ఆ ఊయల కూడా పాత చీర, అందులోనుంచి ఆడుకుంటూనే పసివాడు...తలంతా బయటకి పెట్టి, చెట్టు వైపు చూస్తూ కేరింతలు కొదుతున్నాడు....ఆ దృశ్యాన్ని అధ్భుతంగా గీశాడు. పాతబడిన చీర, సగం పచ్చి, సగం ఎండిన చెట్టు, అందులో పసివాడి ముఖం దానిలో నవ్వు కేరింతలు.....పెన్సిల్‌తొ ప్రతీ కదలికని అద్భుతంగా మలిచాడు..చూస్తూ పవశించిపోయింది.

ఆ చిత్రం గీసిన అబ్బాయి ముఖంలో ఆతృత, ఏమంటుందో అన్న ఆందోళన.... ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది, "ఎంత బాగా వేశావు....నిజంగా నాకు చాలా నచ్చింది" అంది స్వప్న.

"నిజంగానా మడం....మా తమ్ముడ్ని ఊయలలో వేసి అమ్మ ఊపుతూ ఉండది కూలీ పనికి వెళ్ళినప్పుడు. ఆ పనికోసం వెళుతున్న ట్రాక్టర్ గోదావరిలో మునిగిపోయింది...నెను అప్పుడు సినిమాకి పోయాను.అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ గోదాట్లోపడి చనిపోయారు...." వాడి కళ్ళలో త్డి, హృదయం కదిలిపోయింది, అందుకే ఆ బతుకు చిత్రం ఇంత సహజంగా వచ్చింది....

అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం, చేతిలో వంద రూపాయల నోట్లు. అవి భవిషత్తు పునాదుల్లా, ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలిపాడు ఆ చిన్నపాటి సహాయానికి.

ఆనందం పట్టలేక వాళ్ళందరి మధ్యలో రమేష్‌ని కౌగలించుకొని "థ్యాంక్స్" అంది పరవశంగా.....

ఇంటికొచ్చాక స్నేహితురాలి తాంజూర్ పెయిటింగ్ తీసి పక్కన పెట్టింది, ఆ పిల్లవాడు గీసిన బతుకు చిత్రాన్ని గోడకి తగిలించింది.కిందపెట్టిన తాంజూర్ చిత్రాన్ని తీశాడు రమేష్. "స్వప్న నువ్వు కూడా నీ స్నేహితురాలిలా చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు.ఇది కళ, నిన్ను బాధ పెట్టింది - అవమానించింది నీ స్నేహితురాలు కాని ఈ చిత్రం కాదుగా, ఈ ఊయలలో ఉన్నది బతుకు చిత్రం, తాంజూర్ చిత్రంలో ఉన్నది చిన్ని కృష్ణుడు....ఇద్దరూ పసివాళ్ళే, పెన్సిల్‌తో గీసినా, బంగారు రేకులతో అద్దినా ఈ ఇద్దరి పసివాళ్ళ నవ్వులు చూడు నీకు తేడా కనిపిస్తోందా? వాళ్ళలో స్వార్థమే లేదు, వెన్నెలంత స్వచ్చత.వెన్న్నెలకి స్వార్థం ఉందా? అది పూరిగుడిసె మీద, పాలరాతి మహల్ మీద, ఒకేలా తన అందాలని చల్లదనాన్ని జాలువారుస్తుంది....ఇదీ అంతే పసివాళ్ళ చిరునవ్వులకి ఖరీదు కట్టకు"

"సారీ రమేష్ నేను ఏదో భ్రమలో పడిపోయాను...." ఆ హాలులో ఇద్దరి పసివాళ్ళ చిత్రాలు, వాళ్ళ నవ్వులతో నిస్వార్థమైన ఆనందం వెల్లివిరిసింది.

అయోల రేణుక సాహితీ పరిచయంఆంధ్రబూమి దినపత్రికలో ఇరవైకి పైగా వ్యాసాలు ప్రచురించబడ్డాయి.

కవితలు: 2004, 2006లలో రంజని కుందుర్తి అవార్డు పొందడం నడుస్తున్న చరిత్ర మాస పత్రికలో 2005లో ఉగాది పోటీలో ఉత్తమ కవితగా బహుమతి, అనేక సంకలనాలలో ప్రచురించబడ్డాయి.

మొదటి కవితా సంపుతి "పడవలో చిన్న దీపం"

నేటి నిజం, ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి, నవ్య భూమిక, నడుస్తున్న చరిత్ర మొదలగు మాస, వార పత్రికలలో ప్రచురించబడ్డాయి.

కథలు: ఆంధ్రప్రభ, భూమిక, స్త్రీవాద పత్రిక, చినుకు, నడుస్తున్న చరిత్ర, జాగృతి మొదలగు పత్రికలలో రెండవ, సాధారణ బహుమతులు.

అప్పాజోస్యుల ఫౌండషన్ ద్వారా "పల్లెకి పోదాం" కథకి బహుమతి.

"బ్రతుకు చిత్రం" కథకు విశ్లేషణ

బాల్య స్నేహితురాలు స్నేహానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా వ్యాపారధౌఎరణితో మాట్లాడటం చాలా బాధ కలిగిస్తుంది స్వప్నకి. ఈ రోజుల్లో ప్రతీదీ డబ్బుతోనే ముడిపడి ఉంది.పలుకుబడి, డబ్బు, అధికారం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో స్నేహబంధాలు తలవొంచుకొని మూగవైపోతున్నాయి. 'సృష్టిలో తీయనిది స్నేహమే' అన్నారు. ఆ మాట ఈ నాగరిక ప్రపంచంలో ఎంతవరకూ నిలుస్తోందన్నదే ప్రశ్న."ఎక్కడైనా బావ కానీ వంగ తోటలో కాదన్నట్టు" ఎవరి అవసరాలు వారివి, ఎవరి సంపాదనలు వారివి అయిపోతున్న ఈ రోజుల్లో స్వప్న స్నేహితురాలు పలుకుబడి కలవారి కోసం తన స్నేహాన్ని కొంచెం పక్కకి పెట్టి మాట్లాడటం ఆశ్చర్యపాడల్సిన విషయం కాదనే అనుకోవాలి. స్నేహానికి ప్రాణమిచ్చే స్వప్న లాంటి వారు బాధపడటమూ అంతే సహజం.కానీ స్వప్న తన స్నేహితురాలికి కీర్తి రావాలని ఆశించినదైఅతె కోరుకున్నదైఅతె కోపానికీ స్వార్థానికీ చోటివ్వకుండా మంచి మనసుతో ఆమెని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేది.ఇక్కడ అలా జరగలేదు.అంటే స్నేహానికి విలువ తనుకూడా ఇవ్వలేదన్న మాటేగా? ఆమె భర్త రమేష్ చివరిలో చెప్పిన మాటలు ఎవరికైనా అనుసరణీయమే.ఇతివృత్తం బాగానే ఉందు కానీ రచయిత్రి తన రచనలో రచనా తీరు, శైలి పట్ల ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందనిపిస్తోంది.

- తమిరిశ జానకి