కబుర్లు - సత్యమేవ జయతే
ఏది చరిత్ర!
- సత్యం మందపాటి

ఇంకొక వెబ్ పత్రికలో నేను వ్రాస్తున్న ‘విహార యాత్రా స్పెషల్’ అనే శీర్షికలో, పోయిన నెల జైపూర్ మీద ఒక వ్యాసం వ్రాద్దామని, మాన్ సింగ్ దగ్గర నించీ జైసింగ్ దాకా చరిత్ర క్లుప్తంగా వ్రాస్తుంటే, అసలు చరిత్ర అనేది ఎంతవరకు నిజం? చరిత్ర వ్రాస్తున్న వారి స్వంత అభిప్రాయాలు ఆ చరిత్రని ఎంతగా మారుస్తాయి మొదలైన ప్రశ్నలు ఉదయించాయి. దానితో కొంత పరిశోధన కూడా చేసి, నాకు తెలిసిన ప్రపంచ చరిత్ర మీద నా భావాలు ఈ వ్యాసంలో వ్రాస్తున్నాను.

నాకు మొదటినించీ భారతదేశ చరిత్రా, మిగతా దేశాల చరిత్రా, ఆయాదేశాల సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) గురించి చదవటం, తెలుసుకోవటం సరదా అని ఇంతకుముందే చెప్పాను. కాకపొతే ఆ చరిత్ర వ్రాసిన వారి ఆలోచనలను బట్టి రకరకాలుగా వుంటుంది. ఉదాహరణకి భారతదేశ స్వతంత్ర పోరాటం గురించి పాకిస్తాన్ చరిత్రకారులు వ్రాసిన దానికీ, మనవాళ్ళు వ్రాసినదానికీ ఎంతో తేడా వుంటుంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ, నెహ్రూ, మహమ్మద్ ఆలీ జిన్నాలాటి స్వాతంత్రయోదుల గురించి చెప్పేటప్పుడు ఆ చరిత్ర ఎంతో భిన్నంగా వుండే అవకాశం వుంది. అంతేకాదు సౌదీ అరేబియాలో పుట్టి, భారతదేశ స్వాతంత్ర సమరంలో పోరాడిన భారత దేశభక్తుడు మౌలానా అబ్దుల్ కలాం అజాద్ గురించి, రెండు పక్కలా వివిధ అభిప్రాయాలు వున్నాయి.

అలాగే కొన్ని పుస్తకాల ఆధారంగా మహాత్మా గాంధీ మీద తీసిన సినిమాలు, భారత సెన్సారు వారి అభిప్రాయాలకి అనుగుణంగా కొన్ని మార్పులు చెందాయి. రిచర్డ్ అట్టిన్బరో తీసిన గాంధీ సినిమా భారత ప్రభుత్వానికి నచ్చి, చిన్న చిన్న మార్పులతో విడుదలయింది. బ్రిటిష్ ఇండియాని తమ సంకెళ్ళ నించీ విడిపించిన స్వాతంత్ర పోరాటాన్ని, ఒక బ్రిటష్ దర్శకుడు ఎంత నిజాయితీగా తీస్తాడు అనే అనుమానాన్ని పూర్తిగా వమ్ము చేసి, ప్రతి సంఘటనకీ చాల ప్రాముఖ్యం ఇచ్చి, ఆ సినిమాని నిష్పక్షపాతంగా ఎంతో గొప్పగా తీశాడాయన.

కానీ అంతే గొప్పగా అదే నిజాయితీతో తీసిన ఇంకొక సినిమా ‘నైన్ అవర్స్ టు రామ’ భారత ప్రభుత్వం బారిన పడి, ఇండియాలో బహిష్కరించబడింది. అంతేకాదు స్టాన్లీ ఓల్పర్ట్ వ్రాసిన ‘నైన్ అవర్స్ టు రామ’ పుస్తకం కూడా భారతదేశంలో బహిష్కరించారు.

దానికి కారణం, ఆర్ ఎస్ ఎస్ సంస్థకు చెందిన నాధూరాం గాడ్సే కథ అది. మహాత్ముడిని హత్య చేసే ముందర తొమ్మిది గంటలలో జరిగిన గాడ్సే జీవిత సంఘటనలను, చారిత్రిక ఆధారాలతో ఎంతో నిజాయితీగా వ్రాసిన పుస్తకం, తీసిన సినిమా. అది నిషేధించటానికి కారణాలు శ్రీప్రభుత్వం వారికే తెలియాలి.

అదృష్టవశాత్తూ నేను అమెరికా రాగానే, నేను కొనుక్కున్న మొదటి పుస్తకం అదే. చూసిన ఇండియన్ సినిమా కూడా అదే! గాడ్సే ఎంతో ప్రేమించిన మహాత్మా గాంధీని చంపే ముందర అనుభవించిన మనోవేదన, ఆ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఆ సినిమాలో.

అంటే ఇక్కడ ప్రభుత్వానికి నచ్చని చరిత్ర, చరిత్ర కాదన్నమాట! ఇలాటి నేపధ్యంలోనే జైపూర్ మహారాజుల గురించీ చదివాను. మూడేళ్ళ క్రితం జైపూర్ వెళ్లేముందు, కొంచెం ఎక్కువగానే చదివి, ఈ మహారాజులు ఎలాటివారో, వారి నిజ స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను.

జైపూర్ గురించి తెలుసుకునే ముందు ఈ చరిత్రని అక్బర్ జీవితంతో ప్రారంభిద్దాం. అక్బర్ భారత దేశాన్ని ఉద్ధరించటానికి రాలేదు. మొగలాయీల దోపిడీలో పెద్ద భాగస్వామి ఇతడు. వారి సామ్రాజ్య విస్తరణకి, ఎంతో కృషి చేసి భారతదేశంలో కొంత భాగాన్ని, తన కాళ్ళ క్రింద పెట్టుకున్న పెద్దమనిషి. జోదాబాయిని పెళ్లి చేసుకున్నది, హిందూమతానికి దగ్గరయి, తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవటానికి. ఈనాటి మన సినిమాల్లో చూపిస్తున్నట్టు ప్రేమతో కాదు. పరమత సహనంతో అసలే కాదు. అలాగే సంస్కృత భూయిష్టమైన హిందీ భాషలో, ఎన్నో పర్షియన్ మాటలు తీసుకువచ్చి, సంస్కృతాన్ని ఏమాత్రం లేకుండా చేసిన తురక భాషా ప్రియుడు. ఇప్పుడు ఇండియాలో రోడ్డు మీద మాట్లాడే జనవారీ హిందీలో, మీకు వినపడేవి ఎన్నో పర్షియన్ పదాలే! మహాభారత్, రామాయణ్ లాటి సీరియల్స్ చూస్తేనే, ఎవరో పండితులు మాట్లాడేది వింటేనే, మనకి హిందీలో సంస్కృతం మళ్ళీ వినిపిస్తుంది. ప్రేమ్ అనే మాట పోయి, మొహబ్బత్, ఇష్క్ వచ్చేశాయి. కష్ట్ పోయి ముష్కిల్ వచ్చేసింది. అలాటివే ఎన్నో.. ఎన్నెన్నో.. అలాటి అక్బర్ మహారాజు ఇంకా ఏం చేశాడో చూద్దాం.

రాజపుత్ మహారాజు మాన్ సింగ్ (మొదటి మాన్ సింగ్) గురించి మొదలుపెడదాం. అతను అంబర్ రాజ్యానికి రాజు. మొగలాయీలకి తొత్తుగా మారి, వాళ్ళ కాళ్ళు వత్తటం మొదలుపెట్టాడు. దానితో అక్బర్ సంతోషించి, ఇంకాసేపు తన కాళ్ళు వత్తించుకుని, అతన్ని తన సభలో నవరత్నాలలో ఒకడిగా గుర్తించాడు. అంతేకాదు, అంతటి రాజుగారినీ కాళ్ళ క్రింద తొక్కిపెట్టి, తనకి సైనికాధికారిగా చేసుకున్నాడు. మాన్ సింగుకి జోదాబాయి అత్త అవుతుంది.

మాన్ సింగుని రాణా ప్రతాపసింగ్ దగ్గరకి రాయబారం పంపించి ఆ రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలని చూశాడు అక్బర్.

‘నేను యుద్ధం చేసి చావటానికయినా సిద్ధమే కానీ, నా దేశాన్ని ఆక్రమించి, విస్తరించాలనుకుంటున్న ఈ మొగలాయీలకి తొత్తుగా మాత్రం మారను’ అన్నాడు రాణా ప్రతాప్ సింగ్.

అలాగే చివరి శ్వాస వదిలేవరకూ, పోరాడి యుద్దంలో చనిపోయాడు రాణా ప్రతాప్ సింగ్.

అందులో అతని మరణానికి ప్రధాన పాత్ర వహించింది మాన్ సింగ్.

కానీ రాజస్థాన్ చరిత్ర మాన్ సింగుని, ఒక మహానీయుడిగా చిత్రిస్తుంది.

మాన్ సింగ్ తర్వాత, జగత్ సింగ్, మహా సింగ్, జై సింగ్ 1, తర్వాత కొంత కాలానికి జైసింగ్ 2.. ఇలాటి రాజపుత్ తొత్తుల కాలచక్రం ఇక్కడ తిరుగుతుంటే, అక్కడ అక్బర్ తర్వాత షాజహాన్, ఔరంగజేబ్.. అలా నడిచింది మొగలాయీల దురాక్రమణ.

మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ ఏడుసార్లు మొగలాయీల మీదకు దండయాత్రకు వచ్చినా, తమ బలగాల సహాయం మొగలాయీలకి పూర్తిగా ఇచ్చి, శివాజీని ఏడుసార్లూ ఓడించిన ఘనత కూడా ఈ తొత్తు రాజులదే! కానీ చరిత్రలో జైపూర్ రాజులంతా హీరోలే.. విలన్లు కాదు.

ఇలాటివి చదివిన తర్వాత తెలుసుకునే నిజాలు కొన్ని చాల ఆశ్చర్యంగా వుంటాయి. ఉదాహరణకి అలెక్జాండర్ ది గ్రేట్.. గ్రేట్ కానే కాదు. వాళ్ళ నాన్న కింగ్ ఫిలిప్ గోప్పదనంతో పైకి వచ్చిన రాజు. మేసడోనియా రాజు ఫిలిప్ ముందుగా గ్రీకుదేశాలని ఆక్రమించాడు. తర్వాత ఎంతో శక్తివంతమైన పర్షియా దేశాన్ని ఆక్రమించాలన్న అతని కోరిక నెరవేరక ముందే హత్య చేయబడ్డాడు. దానితో ఇరవై సంవత్సరాలకే రాజయాడు అలెక్జాండర్. మూడుసార్లు పర్షియా మీద దండెత్తి చావుదెబ్బలు తిన్న యుద్ధ పిపాసి. చివరికి నాలుగవసారి పర్షియా మీద గెలిచాడు. తర్వాత చెప్పుకోదగ్గది ఈజిప్ట్ మీద యుద్ధం చేసి గెలవటం. తర్వాత చిన్న చిన్న యుద్ధాలే చేసాడు కానీ, చెప్పుకోదగ్గవి ఏవీ లేవు. చివరికి అతని సైన్యమే, మంచి యుద్దవీరుడికి ఎప్పుడు యుద్ధం ఆపాలో తెలుస్తుందనీ, అతనికి అది కూడా తెలియదనీ చెప్పి, ఇక యుద్ధం చేయమని మొండికేసి వెనుతిరిగింది. అదీ అలెక్జాండర్ ది గ్రేట్ గొప్పదనం. గ్రీకువీరుడి యుద్ధ పిపాస! అలాగే కొలంబస్ ఒక సముద్రపు దొంగ. అతను అమెరికాని కనుక్కోక ముందే, అమెరికా లక్షణంగా ఈనాటి మా ఇంటి ముందరా, వెనకా వుండనే వుంది. సుబ్బారావుగారింటికి బయల్దేరి, అప్పారావుగారింటికి వెళ్లి, అదే సుబ్బారావుగారి ఇల్లు అనుకున్న వెర్రి మాలోకం కొలంబస్. ఇండియా వెళ్లి, అక్కడి నించీ సిల్కు, బంగారం, రత్నాలు, మిరియాలు తెస్తానని స్పానిష్ మహారాణిని వూరించి, ఆవిడ దగ్గర ప్రయాణ ఖర్చులు కొట్టేసి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టకుండా పడమటి దేశాలకు వచ్చిన, దిక్కూ దివాణం తెలియని మనిషి. మొదటిసారి బహామా ద్వీపాలకి వచ్చి అదే ఇండియా అన్నాడు. రెండోసారి వెనిజువేలా వచ్చి అదే ఇండియా అన్నాడు. మూడోసారి మధ్య అమెరికా వచ్చి అదే ఇండియా అన్నాడు. వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. అందుకే ఇక్కడ ఆ రోజులనించీ వున్న స్థానిక ప్రజలని ఇండియన్స్ అంటారు. కొలంబస్ మాత్రం అమెరికాని ‘కనుక్కున్న’ గొప్పవాడిగా మా అమెరికా దేశ చరిత్ర చెబుతున్నది. సంవత్సరంలో ఒక రోజు ‘కొలంబస్ డే’ అనే పేరుతో సెలవు కూడా వుంది.

ఇజ్రాయిల్, వెస్ట్ బాంక్ సరిహద్దుల్లో కొన్ని దశాబ్దాలుగా యుద్ధం జరుగుతున్నది. మరి ఇజ్రాయిల్ వాళ్ళు వ్రాసే చరిత్రలో ఇజ్రాయిల్ వాళ్ళు దేశభక్తులు, పాలస్తీను వాళ్ళు ఉగ్రవాదులు. అదే చరిత్ర పాలస్తీను వారు వ్రాస్తే, పాలస్తీను వాళ్ళు దేశభక్తులు, ఇజ్రాయిల్ వాళ్ళు ఉగ్రవాదులు.

అంతదాకా ఎందుకు, మన పెరటిలోనే, తెలుగుదేశంలోనే అలాటిది వుంది.

ప్రపంచమంతా ముందుకు పోతుంటే, కులాల పోరాటాలు, దురభిమానాలూ, సంకుచిత బుద్దులూ ఈనాడు వున్నంతగా తెలుగువాళ్ళల్లో ఏనాడూ లేవు.

యాభై ఏళ్ల తరువాత, ఈ చరిత్రని ఎటునించీ చూస్తాం? ఏది నిజమని నమ్ముతాం?

ఈనాటి వార్తలే, రేపటి చరిత్ర. ఒక్కొక్కపార్టీకి ఒకటో రెండో చెంచా పత్రికలు. ఒకటో రెండో చెంచా టీవీ ఛానళ్ళు. మరి ఏది ఎవరి గురించి చెప్పేది నిజం? ఒక వంద ఏళ్ల తర్వాత ఏది చరిత్రగా ఆనాటి చరిత్రకారులు లెఖ్క వేస్తారు?
ఇది ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలోనూ వుంది. దేశ ప్రగతిని, ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని, ఒకే ఒక అబద్ధంతో సర్వనాశనం చేసి, అధోగతిలోకి తీసుకు వెళ్లారు జార్జ్ బుష్, డిక్ చేనీ. వాళ్లకి హారతి పడతారు ఒక వర్గం వారు. ఒక నల్లవాడిని అధ్యక్షుడిగా చూడలేని వారు, ఆయన పాతాళానికి వెడుతున్న దేశాన్ని మళ్ళీ దారి మళ్లించి, ఎంతో ముందుకు నడిపించటం, దేశ ఆర్ధిక ప్రగతే చూపిస్తున్నది. ఇందాక చెప్పిన వర్గం వారు, చెబుతున్న వార్తలు, వ్రాస్తున్న చరిత్ర, ఆయన ఒక ఉగ్రవాది అనీ, కమ్యూనిష్ట్ అనీ, మళ్ళీ ఇరాక్ మీదా, ఇరాన్ మీదా యుద్దానికి పోవటం చేతకాని పిరికిపంద అనీ, ముస్లిం దేశాలతో చేతులు కలుపుతున్న దేశద్రోహి అనీ చిత్రిస్తున్నాయి. మరి ఇంకో వంద సంవత్సరాల తర్వాత చరిత్ర ఏమని చెబుతుందో! ఆనాటి ప్రజలు ఏది నిజమని నమ్మాలో...
కాకమ్మ కథలనీ, పుక్కిటి పురాణాల్నీ కూడా చరిత్రగా సమర్ధిస్తారు కొంతమంది మత పిచ్చివాళ్ళు. ఫలానా దేవుడి పాదాల ముద్రలు మావూళ్ళో వున్నాయి అని కొందరు నమ్మి అక్కడ ఒక గుడి కడితే, ఇదే చోట ఫలానా మత ప్రవక్తని చంపేశారు అని ఇంకొకరు అంటారు. ఆ మత ప్రవక్త తెల్లవాడని తెల్లవాళ్ళు అంటే, నల్లవాడని నల్లవాళ్ళు అంటారు.
నాకు ఇలాటి విషయాల గురించి చదువుతుంటే, కొంచెం ఆవేదనగా కూడా వుంటుంది.

మనకి ఈనాడు తెలిసిన చరిత్రలో ఏది ఎంతవరకూ నిజం? ఏది కల్పన?

ఇంకో వంద సంవత్సరాల తర్వాత మన చరిత్ర చదివేవారికి, నిజంగా జరిగిన విషయాలను మనం ఎంతవరకు అందిస్తున్నాం?

అలాటప్పుడు నాకు శ్రీశ్రీగారి కవిత గుర్తుకివస్తుంది.

“ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?

నరజాతి సమస్తం, పరపీడన పరాయణత్వం!

నరజాతి చరిత్ర సమస్తం. పరస్పరాహరణోద్యోగం!

చల్లారిన సంసారాలూ, మరణించిన జన సందోహం, అసహయుల హాహాకారం, చరిత్రలో మూలుగుతున్నవి.

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?”



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)