శీర్షికలు - సంగీత రంజని
శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన
- శ్రీమతి ఎమ్‌.వి.కమలారమణి


దాదాపు 350-400 సంవత్సరముల క్రితం, ఈ తెలుగు నేల మీద, మన మధ్య నడయాడిన మహనీయ వాగ్గేయకారుడు 'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి.

రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావనను మనము రెండు విధాలుగా చెప్పుకోవచ్చు.

1. సీతమ్మవారిని నామ ప్రధానంగా గల రచనలు.
2. సీతమ్మవారిని ఉద్దేశించి రచించిన కీర్తనలు.

నామ ప్రధానంగా యనిన సీతాపతి యని, సీతానాయకయని, సీతాసమేతయని, సీతారమణ యని, సీతాహృదయ విహౄరయని, సీతారామస్వామి మొదలయిన పదాల రచన. ఇంకా, నినుబోనిచ్యెదనా సీతారామా! జైజై సీతారాం! భద్రాచలమందు సీతతో మెరయుచున్న రాముడు! యను వాక్యరచన.

''రావణ సంహారంలో సీతను పాలించిన'' అని 'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము' అని ఇంకా ఒక విశేషమైన కీర్తన అనియు 'ఆశపుట్టెనే శ్రీరాములతో ఆహా!' అన్న కీర్తనలో-

- జానకి పెండ్లి ఆడినప్పుడు నెత్తి బియ్యం నేను తెచ్చివుందునే...
- సీతమ్మకు హరికి ఆకులు నేను ముడిచి ఇచ్చి ఉందునే...
- కనక మృగమును... అయ్యో! అమ్మకు నేను తెచ్చియుందును గద...
- రావణుడు సీతమ్మను చెరబట్టగ, నేను ధైర్యము చెప్పియుందునే..
- అమ్మ జాడ నేను తెచ్చి యుందునే...

అని పలుచోట్ల సీతమ్మవారి ప్రస్తావన నామమాత్రంగా ఉన్న రచనలు ఎన్నెన్నో అయితే... మరొక వైపు సీతమ్మవారిని
ఉద్దేశించి ఆలపించిన కీర్తనలు కొన్ని కనిపిస్తాయి.

సీతమ్మను తల్లిగా ఎంచిన రామదాసు ఒక తనయుడుగా, ఆ తల్లితో ఒక విశేషమైన స్వేచ్ఛ కనబరుస్తూ రచించిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. మనందరి జీవితాల్లో తల్లికి ఒక విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఒక సంసారంలో తండ్రికి ప్రత్యేక తలమానికమైన స్థానం ఉన్నప్పటికీ, పిల్లలు కొన్ని విషయాలు తల్లి దగ్గర చెప్పినంత స్వేచ్ఛగా తండ్రి దగ్గర చెప్పలేకపోవచ్చు. అటువంటి సమయాల్లో తల్లిపిల్లకు- తండ్రికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి పనులు చక్కబెట్టటం మనందరికీ విదితమే.

ఇటువంటి పరిస్థితి బయట అధికారులతోను మనకు సంభవించవచ్చు. మనకు ఒక పని కావలసివచ్చి, ఆ అధికారి శ్రవణము, కీర్తనము, అర్చనము వంటి నవవిధ మార్గాలకు లొంగనప్పుడు మన పని కానప్పుడు ఆఖరి ఆయుధంగా ఆ అధికారి యొక్క భార్యను ఆశ్రయించటం జరుగుతుంది.

ఆ తల్లి అయ్యగారితో తగిన సమయం చూచి ఆ బంటు గూర్చి చెప్పటం, తద్వారా మనకా పని విజయవంతంగా జరగటము మనకు అనుభవమే.

ఈ ధోరణిలోనే రామదాసు కొన్ని కీర్తనలను ఆలపించినట్లు కనిపిస్తుంది. భక్త రామదాసు సుమారు 180-190 కీర్తనలు రచించిరని, అందులో సుమారు 64 కీర్తనలు బందీఖానాలో ఆలపించినవని తెలుస్తోంది. సీతమ్మవారిని ఉద్దేశించి రామదాసు రచించిన కీర్తనలు ఈ 64 లోనివే.

కీర్తన-1 ; సౌరాష్ట్ర రాగం, మిశ్రచాపు తాళం
కరుణ జూడవే ఓయమ్మ
కాకుత్స రాముని కొమ్మ !!
శరణంటి నను గావవమ్మ
జనక తనయ సీతమ్మ !

ఇలా సీతమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా భావించి, కళ్యాణియని, కలకంఠియని, భద్రాద్రివాసుని కొమ్మయని, భద్రాద్రి శ్రీరామదాసునికి అమ్మ యని సంబోధించి, 'నీ మహిమల నెన్నగ నా తరమా తల్లి, నిన్ను శరణంటిని. నను గావుము' అని వేడుచున్నాడు.

కీర్తన-2, అసావేరి రాగం, త్రిపుటతాళం
రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ !!
కటకటా వినడేమి సేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మము లెటు నుండునో కద
ధర్మమే నీ కుండునమ్మ !!

కీర్తన - 3, సావేరి రాగం, చాపుతాళం
అమ్మ నను బ్రోవవే రాఘురాముని కొమ్మ నన్ను గావవే!
దశరధాత్మజుడెంతో దయశీలి యనుకొంటి
ధర్మహీనుడే ఓ యమ్మ
దాసజనులకు దాత యితడట
వాసిగ భద్రగిరీశుడు రామదాసునేల రాదట
రవికులాంబుధిసోముడట !!

'అయ్యో నే నెంత వేడినను ఆ కఠిన చిత్తుని మనసు కరుగుట లేదు. సీతమ్మా! ఎందుకో రామచంద్రులు నాపై చలము - ఆలస్యము చేసినారు - నీవైనా చెప్పవమ్మా.'

'ఆ భద్రగిరీశుడు, రామదాసు నేలరాడట... (నింద) రవికులాంబుధి సోముడుట... (స్తుతి)' రెండు కనిపిస్తున్నాయి. ఈ కీర్తనలో కన్నతల్లి! నీవైన నా పాట్లు తెలుసుకొని వేగమే - అమ్మా నను బ్రోవవే!!

కీర్తన-4, శహన రాగం, ఆదితాళం
ఎంత పిలిచినా పలకని శ్రీరాముణ్ణి కాసేపు ప్రక్కన పెట్టి సీతమ్మను తనను రక్షించమని వేడుతున్నాడు ఈ కీర్తనలో. అమ్మా! నీవు శ్రీరామచంద్రుని ప్రబోధించి నన్ను రక్షించుటకు ఆ అన్నదమ్ములను పైకముతో పంపు'మని తల్లితో మనవి చేసుకొనుచున్నాడు.

జనక తనయ నాదు మనవి గైకొని జగ జ్జనకునితో దెల్పవే ఓ జనని !!

ఇది ఏక ధాతువుగా రచింపబడియున్నది. ఇందు 'పండ్రేండేండ్లు, పగలు-రేయి మిమ్ములను వేడిన గాని కన్నుల జూడరు గద! నాకు కన్నీరు లేని దినము లేదు. కన్నతండ్రులింత కరుణమాలి ఉందురా! అదిగో వస్తారని ఇదిగో వస్తారని నా ఎదురు చూపులే మిగిలినాయి! ఈ బందీఖానాలోని హింస యిక నేను భరించలేను. ప్రాణములు వదిలి మిమ్ము చేరుకొంటాను! తల్లీ! రేపు నన్ను వీరు బ్రతుకనియ్యరు. ఆలస్యము సేయక, వెంటనే ఆ రామలక్ష్మణులను అర్థము - పైకముతో పంపు తల్లీ

'అమ్మా! సీతమ్మతల్లీ! దీనపోషకుడని, దాసరక్షకుడని, నీ మగనికి పెద్ద బిరుదు. చూడబోతే అదంతా వట్టిదేనని అనిపిస్తోంది.'

కీర్తన-5, కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం.

'ఆయనకు కరుణ పుట్టేలా నీవే ఎప్పుడో ఏకాంతవేళ నా నాధుని ప్రోద్బలం చేసి, ఈ దీనుని రుణించమని చెప్పు తల్లీ!' అన్న భావన ఒకింత శృంగార రసమును జోడించి రచించారు.

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి!
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతుర జననీ జానకమ్మ!!
ప్రక్కన చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ !!
ఏకాంత రంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేక శయ్య నున్న వేళ !!
అద్రిజ వినతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొనువేళ నెలతరో బోధించి !!

అంతట ఆ సీతమ్మతల్లి కటాక్షించి, 'నాధా! నా మనవి విని, మన దాసుణ్ణి ఆ చెర నుండి విడిపించమని కోరిన వెంటనే రామలక్ష్మణులు మారువేషాలలో రామదాసు తానీషాకు చెల్లించవలసిన పైకము పుచ్చుకుని, ఆ నవాబుకు ఇచ్చి మన రామదాసుని విముక్తుణ్ణి చేసారు. ఆ సీతమ్మతల్లి సిఫారసు అంత పని చేసిందన్నమాట! పై పేర్కొన్నవి సీతమ్మవారిని ఉద్దేశించి రామదాసు రచించిన కొన్ని కీర్తనలు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)