కవితా స్రవంతి
యుగాద్యనాది
- డా.ఐ.జానకి

ఆది అంతములు లేనీ జగతి
పుట్టిన్దెప్పుడు గిట్టేదెప్పుడు

నవనవలాడే నందనవనమున తేలియాడే లతాకుసుమాలు
కోయిలపాటల కొత్త వెలుగులు పచ్చపచ్చని కొత్త చిగురులు
పరుగులు తీసే జింక కూనలు చిలుకల పలుకుల తెనేజల్లులు
వెంట పెట్టుకొని వడివడిగా
ఆది అంతములు లేనీ జగతి
పుట్టిన్దెప్పుడు గిట్టేదెప్పుడు

కలలు కనే కన్నె కోరికల వరద గోదారి ఉప్పొంగగా
జీవన సహచరుని తలంపులు పలుదెసలా తలపించగా
పల్లవిగా వినిపించగా
గగన సీమల విహరించే ఆశలు ఇలకోనల అడిఆశలేనని
హెచ్చరించగా పచ్చపచ్చని వేపపూతలే తెచ్చి ఇచ్చిన
ఆది అంతములు లేనీ జగతి
పుట్టిన్దెప్పుడు గిట్టేదెప్పుడు

స్వాతిచినుకులకు తడిసి తరించిన ధర్తీమాత నేటి పరిస్థితి
ఉక్కు ఫాక్టరీ గొట్టపు బల్లెం ప్రగతి పేరుతో చొచ్చుకు పోతూ
గగన సీమలకు చిల్లులు పెడుతూ విష వాయువులే వెదజల్లగా
సుందర తరమగు అంబర వీధులు తునాతునకలయి చేసే ఆక్రందనలు
వేదనాభరిత విలాప గర్జనలు రుధిరాశృవులై నేల రాలగా
కలుషవాసనలు నలుదెసలా ధూళిధూసరిత ప్రకృతి మాత
వృక్షో రక్షతి రక్షితః వృక్షోభక్షతి భక్షితః అని వినిపిస్తూ
ఆది అంతములు లేనీ జగతి
పుట్టిన్దెప్పుడు గిట్టేదెప్పుడు

కాలమను సర్పము చుట్ట చుట్టగా మహా లయములో లయి న్చగా
జీవిత సత్యం తెలుసుకోమని జీవన యానం కష్ట తరమని
వేపపూవులా చేదుచేదని చేదునాపగా మావి పులుపుని
చెలిమి చెక్కెరను కలుపుకోమని వలపుమధురిమను నిలుపుకోమని
ఉగాదులెన్నో జరుపుకోమనే
ఆది అంతములు లేనీ జగతి
పుట్టిన్దెప్పుడు గిట్టేదెప్పుడు

వృక్షసంపదే సత్య సంపదని సస్య ప్రాణమే మనుష్య ప్రాణమని
ఒక్క మనిషికి ఒక్క చెట్టని నాటిన నాడే వేపతినమని
ఎంచి బిడ్డగా పెంచుకోమని ప్రకృతి పెట్టిన ఒట్టు ఇదేనని
ఆచరించితే మోదమిచ్చునని జగతి పచ్చగా వెలిగిపోవునని
తియ్య తియ్యని మాట ఇదేనని ఇంతకుమించిన వాక్కు లేదని
తెలియజేయగా మానవాళికిని
ఆది అంతములు లేనీ జగతి
పుట్టిన్దెప్పుడు గిట్టేదెప్పుడు


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)