కథా భారతి - అనగనగా ఓ కథ
ఓ మనిషి ప్రయాణం
- వి. రాజారామ్ మోహనరావు

మనిషి...పుట్టుక...బలహీనత వీటి పరస్పర సంబందాల్ని ఆలోచిస్తూ బలరాం మరింత బలహీనంగా తయారయ్యాడు. బలరాం గిరించి ఆ వీధిలో ప్రత్యేకంగా ఎవరూ ఏమి చెప్పుకోరు. చెప్పుకోవలసిందేమీ లేదు కూడా. ముప్పై ఏళ్ళు దాటిన మనిషని ఎవరూ అనుకోరు. వయస్సుని అతని విషయంలో అంచనా కూడా వేయలేరు. బలహీనతకి, ఎముకలలో ఓ ఆకారం కూర్చి, ఓ పల్చటి పొర కప్పినట్టుంటాడు.

రోజూలాగే నిద్ర లేచాడు బలరాం, కిటికిలోంచి వచ్చె వెలుగుకి. గదికి ఉన్న ఆ ఒక్క కిటికీ అంటే బలరాంకి చాలా ఇష్టం. అతని సుషుప్తికి, జాగ్రదావస్తకి సరిహద్దు ఆ కిటికీ...

కళ్ళు తెరగానే అల్మారులో పచ్చడబ్బా.. ఈ రోజు ఇంకొంచెం మెరుస్తూ కనబడింది. ఈ మధ్య ప్రతి ఉదయం బలరాంకి అలా అనిపిస్తూనే ఉంది. సాయంత్రానికి మాములుగానే ఉంచిన రోజు తోచునట్టు...

ఆ డబ్బాని చూస్తూ నవ్వాడు. రోజు రోజుకి బలరాం మనసులో బరువు పెరుగుతోంది. అది సంతోషమో, విచారమో... తెలియని బరువు.

చింకి చాపమీంచి లేవకుండా ’ఇది ఆనందమే...’ అనుకుంటాడు. లేచింతర్వాత సందేహం మామూలే.

కాలు తిన్నగా సాగలేదు. చలికి చర్మం బిగుసుకుని, పుండుమీద గట్టిన గూడు నొప్పి...చిరాగ్గా కాలులాగడంవల్ల పుండు రేగింది. రసి...చీము...నెత్తురు...

’ఇక ఇది తగ్గదు..’

సూదులు గుచ్చినట్టు పుండుసలువు. నమ్మదిగా లేచాడు. దొడ్లో అక్కడో చితుకు... అక్కడో చితుకు... వో కొబ్బరి మట్ట...మరో తాటాకు...కుంటుతూనే ఏరిమంట... ఎండ బాగా వేడెక్కే వరకూ అదే కార్యక్రమం బలరాంకి...కాలు సలుపుకి సవనగా ఉంటుంది.

ఆ ఎర్రటి మంటల్లో ..దూరంగా ఏవాటివో నీలిమంటలు... చిటపట చప్పులు కళ్ళముందు కదుల్తాయి బలరాంకి. అదో వోదార్పు... స్మృతుల అవలోకన...

’నేను కాబట్టె తల్లి చితి కాల్చుంటే గొప్పపని చేసినవాడిలా మురిసి పోయాను.’ మంటలోని తాటాకు కదుపుతూ అనుకున్నాడు.

మంట వేడి... కళ్ళలో నీరు తిరిగింది. నెమ్మదిగా లేచి మళ్ళి గదిలోకి. మామూలే... చూరుమీద అక్కడక్కడ చెదరిన పెంకులు ... ఒక్కటే కిటికీ ...అలమారు ... ఒక్కటే డబ్బా...

ఆ డబ్బాలో అలా లోపల పెడుతు గట్టిగా పకాపకా, సినిమాలో వికృతవిజయం సాధించిన వాడిలా నవ్వాలనిపించింది బలరాంకి ఆ రోజు...కాని మామూలుగాకూడా నవ్వలేక పోయాడు.

ముప్పై ఏళ్ళ జివితంలో బలరాం ఏ ఒకటి రెండుసార్లు ఆశ్చర్యం తప్ప ఆనందం కలుగలేదు. బలరాం జీవితం సినిమాతో పొసిగే జివితం కాదు.

నెమ్మదిగా చింకిచాప చుడుతుంటే, మూల చిరుగులబొంత కనిపించింది.

’అమ్మది...’ బలారాం మనసు అనుకుంటుందా బొంతనెప్పుడు చూసినా.

’ఇలాగే ఆ చాపపక్కనే బొంత వేసుకుని పడుకునేది’ గుర్తు తెచ్చుకున్నాడు బలరాం.

తల్లి ని తలుచుకున్నప్పుడల్లా స్మశానం ... మంటలే గుర్తొస్తాయి బలరాంకి...

రోజూ పెట్టె రెండు ముద్దల అన్నం... వేసే చింకిగుడ్డ ... ఆ ఆప్యాయపు చూపులు... ఆగది నాలుగుమూలలా ఉన్నట్టెనుంటాయి. బలరాంకి. కాని అవి బలరాంని చేరుకోవడంలేదు.ఎర్రటి మంటల్లో కాలి పోతున్నాయి. తల్లి తలపులకి, బలరాంని మధ్య ఎర్రటిమంట లడ్డు. అప్పుడప్పుడు వాటిని దాటుతుంటాడు బలరాం అప్పుడే తల్లి మాటల్ని మననం చేసుకోగలడు.

’నలుగురి తర్వాత మిగిలిన వెర్రి బాబువి... అసలే అంతంతమాత్రం మనిషివి. పట్టుమని పదడుగు లేయలేవు. కడుపు నిండా తిండేనా పెట్టలేకపోతున్నాను. నామూలాన్నే నువ్విలా అయ్యావు. ముందెలా బతుకుతావో వెట్టి బాబువి.’

ఆముందు బతుకంటే అర్దం తెలియలేదు బలారాంకి ఆనాడు. అంతదూరం ఆలోచించె చైతన్యం లేదు. తల్లి అస్తమానం అన్నం...అన్నం అంటే ఆలోచించేవాడు. అన్నం కొంచెమే ఎందుకు దొరుకుతుందా అని...

తల్లి నడిగితె...’అదేనా వాళ్ళ దయేకదు బాబు... నావయస్సెంత... నేనుచేసేపనెంత?’ అంది.

బలరాంకికూడా నిజమే అనిపించింది... సుదర్శనంగారు నిజంగా మరి ధర్మాత్ముడే తల్లి ఏపనిచేయలేదని తెలుసు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నందుకుగాను పొమ్మనలేక, పేరుకి రెండుగదులు ఊడ్పించుకుంటూ... మిగిలిందో... మిగిల్చిందో... రెండు కరుళ్లు అన్నంపెడుతున్నారంటే... దొడ్లో ఇంట్లో తలదాల్చుకొనిస్తూరంటే, తల్లిమీద అభిమానమే...

***

గడచిన రొజుకి గడవబోయే రోజుకి పెద్ద తేడా కనిపించేదికాదు బలరాంకి దైనందిన కార్యక్రమంలో...

దోడ్లో తిరగడం... పెంకిలవేపు చూడటం... రాలిన చింతకాయలు తినడం... రోజుల్లో ఎక్కువసేపు కిటికిదగ్గర కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూడటం...

ఎన్నో ఆలొచనలొచ్చేవి... కిటికీలోంచి చూస్తూ ఎన్నొకలలూ... కాని ఎది స్థిరంగా నిలిచి తన సంపూర్ణ స్వరూపాన్ని చూప లేదు...

ఈనాడు జీవితమంతా గుర్తు తెచ్చుకుంటే... అక్కడోరోజు ...అక్కడోరోజు... వేళ్ళమీద లెఖ్కపెట్ట గలిగినన్ని మాత్రం గుర్తొస్తాయి బలరాంకి...

తల్లి కొత్తచొక్క తొడిగినరోజు... కొత్తదనం అంటే ఏమితో తెలిసిన మురిపెం... సుదర్శనంగారి దగ్గర నాలుగక్షరాలు నేర్చుకుంటున్న కొత్తలో సరదా...

కిటికీలోంచి చూస్తూంటే ... వెడుతూ వెడుతూ ఆగిపోయింది. మాసిన చిరుగుల చీర... ఎత్తయిన గుండెల్ని పూర్తిగా కప్పలేని జీవితం... అడుక్కునేది ... బలరాంని రెండుక్షణాలు అలా చూస్తూ నవ్వింది.

అది అందం నవ్విన నవ్వుకాదు. స్త్రీత్వంలోని జాలి... లాలన నవ్విన నవ్వది... అడతనం నవ్విన నవ్వది... ఆరీజు కిటికీలోంచి ఎన్నోరంగులు, ఇదివరకు కాపడని ఎన్నెన్నో కనిపించాయి బలరాంకి... సూటిగా సాగి గబుక్కుని విరిగిపోయే బలరాం ఊహలు ఆరోజు కొద్దిగా మలుపు తిరిగిందేమో...

***

రోజుకి రోజుకి తేడాకనిపించని బలరాంకి ఆరోజు పెద్ద తేడాకనిపించింది.

ఆలోచనో... బాధో.. ఏమిటో తెలియని స్థితి...

ఆ క్షణాన తెలిసిం దొక్కటే బలరాంకి తల్లి చచ్చిపోయిందని... అందరిలాగే తన తల్లి పోతుందనే ఆలోచనెప్పూడూ లేదు బలరాంకి...

సుదర్శనంగారు భుజం తట్టేవరకు ఏమీ తెలియలేదు. ఆయన్ని చూడగానే గుండెల్లో ... నిశ్శబ్దంలో ... ఏడుపు ఒక్కసారిగా పగిలింది...

’ఊరుకో బలరాం... ఏదోనాడు అందరం అంతే ... ఇంకా నయం మూలపడలేదు. కాలు చెయ్యి వంగకుండా దాటిపోయింది. మూలపడితే మందు మాకు చూడగలిగే వాడివా చెప్పు. ముందు జరగాల్సిందేమిటో చూడు.’

’ముందుజరగాల్సిందంటే ...’ సుదర్శనంగారు చెప్పేవరకు తోచలేదు బలరాంకి...

జీవి రూపు ఏర్పరచుకున్న క్షణంనుంచి ఆ రూపం నశించేవరకూ ముడిపడిన అవసరం... డబ్బు...

ఆనాడు అభిమానం ఆడ్డు రాలేదు. వివరించలేని ఆస్థితిలో... ఆనాడు అలా అంతమందిని ఎలా అర్ధించ గలిగానో అనుకుంటాడు బలరాం...

’మా వాళ్ళ తద్దినాలే పెట్టలేక చస్తుంటే... ఊళ్ళో వాళ్ళ గొడవొకటి...’ ఓ ఇంటావిడ పావలాఇస్తూ అన్నమాట.

’అడుక్కోవడంలో అనేక రకాలు ...’ ఇంకో ఇంటావిడ చీదరింపు .

’మనిషి బతగ్గానే సరా... జీవితం ఏమిటి ఎందుకు అనే ఇంగితం ఉండఖర్లా ... అంతగతి లేకపోతే లాక్కు పోతారుగా...’ ఇంకో ఇంటాయన...

వాళ్ళందలో కలిసి ముద్దగా ముఖం మీద విరిసిన అసహ్యం బాధ కలిగించలెదానాడు.

తల్లికి అంత్యక్రియలు చేయలేక పోతానేమో అన్నబాధ ఎక్కువైంది బలరాంకి...

ఆఖరి కెలాగైతేనేం... ఆ చితిమంటల్ని చూడ గలిగాడు. గర్వంగా...ఏడ్చాడు...

అందుకనే తల్లి గుర్తొచ్చినప్పుడల్లా అడ్డొస్తాయి, ఆ మంటలు ఆలోచనకి ... ఆనా డనుకుంది ... తర్వాత బలపడింది,,, ఈ పచ్చడబ్బా రూపు..

ముందెల బతుకుతనో వెర్రిబాబుని తన కన్నతల్లి మాటలకి ’మాములుగానె’ లేదు అనాలపించింది బలరాంకి. ఆ మాటే నిజమైంది. తల్లి ఊడ్చే రెండు గదులు ఊడుస్తూన్నాడు... అదే గమనం ... అదె జీవనం...

***

బలరాం పోయాడన్న వార్త అందరూ చాలా సహజంగానే విన్నారు. ఒక్క సుదర్శనం గారు తప్ప. వీలున్నవాళ్ళు చూటానికి వచ్చారు.

’అయ్యోపాపం’ అన్నారు,

నిశ్చలంగా పడున్న బలరాంని చూస్తూ తనికి ఈ తద్దినం తప్పదనుకున్నారు సుదర్శనంగారు.

మరి ఎందుకో తెలియదు కాని నాలుగు వేపులా కలయజూసారు. అలమారులో పచ్చ డబ్బా ఆకర్షనీయంగా ఉంది. అందుకున్నారు. బరువుగా ఉంది. మూత తీస్తే ... సుదర్శనం గారు కళ్ళు చెదిరాయి... ఏదో కాగితం ... కళ్ళజోడు లేదు...

పక్కకుర్రా డెవరో అందుకున్నాడు...

ఇది ఎవరూ చదవాలని రాయలేద. నన్ను నేను దాచుకోలేక రాసుకున్నాను. ఎవరో ఒకళ్ళు చదవాలన్న ఆశ లేకనూ పోలేదు.

నా జీవితం మీ అందరికి తెలుసున్నదే... శారీరికంగా పూర్తి బలహీనుణ్ణి... కష్టపడి ఏ పని చేసె శక్తి లేనివాణ్ణి ... చేయాలన్న ఉద్దేశం కలిగినా అమ్మ సాగనివ్వలేదు. మనిషికి మనిషెంత బరువో ... మనిషి జీవితం విలువెంతో అమ్మ పోయినాడు తెలిసింది. ఆనాడు అమ్మ చితికి నిప్పంటిస్తూ ఎంతో గర్వపడ్డారని తెలుసు...

’మనిషి బతగ్గానే సరా... జీవితం ఎందుకు , ఏమిటనే ఇంగితం ఉంఖర్లా..’ అన్నా డొకాయన ఆనాడు... జీవితం ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం దొరక లేదు. ఏమిటి అన్నదానికి అంతే...

చిన్నప్పుడు అమ్మ ఒకసారి ’రేపు ఊరు వెడదాం ’ అంద.

ఏ ఊరో తెలియదు. ప్రయాణం ఎందుకో తెలియదు... కాని ఎంతో సరదా వేసింది అదేదో ఉంటుంది.

ఆ ప్రయానం చేయనేలేదు...కాని అది చాలా మురిపించింది. నా జీవితం గురించి అలోచిస్తే ఇదీ ప్రయాణమే అనిపిస్తుంది. స్థాన చలనం లేని ప్రయాణం...

ఎంతో ఇరుకుగా గడిపిన జీవితంలో చైతన్యానికి తావే లేకపోయింది... ఆ ఒక్క రోజు తప్ప ...ఆ ఒక్క చూపు తప్ప... ఎన్నో ఊహలు కదలికలు నిండిన రంగులు కళ్ళముందు నిలిచాయి... ఇంచు మించుగా అమ్మ అప్పుడే పోయింది. నా హీనస్థితిని లోకం విసిరిన అసహ్యముద్దని ఆరంగుల్ని మళ్ళి కనపడ నివ్వలేదు. ఆ నాటి నుండి మిగిలిన ఆలోచన ఇదొక్కటే...

సంఘంలో ఆ ఏర్పాటుందని తెలుసు... ఆనాధప్రేతాన్ని లాగేయలేకపోతున్నారు ...కాని అదీ ఉద్యోగధర్మమే ... మళ్ళీ అసహ్యం... చీదరింపులు...

ఆ స్థీతి నాకు కలగకూడదనే ఈ శ్రమ పడ్డాను. ఈ పచ్చడబ్బాలోది అరవై రూపాయలు కాదు, నారక్తం... ఏ నాడూ శ్రమించి ఎరుగని నా బలహీన దేహపు శ్రమ...

చావు తర్వాత ... ఆత్మ... నాకయోమయం. ఆలోచన అంతదూరంసాగినా అర్ధం చేసుకుని నిర్ణయించుకోగలశక్తి నాలోలేదు. ఈ ప్రయాణంలో, మనిషి తనంతటా తాను దాటలేని ఆఖరి మజీలీని ’దాటించే ఈ ఖర్చుని. ఎవరి నెత్తి మీదేనా వేసుకుని అసహ్యించుకుంటా రేమోనని బాధ... ఈ డబ్బు దానికి వినియోగించండి... ఇలా నాకు నేనుగా... ఈ ఏర్పాటు... బాధో ...ఆనందమో తెలియడంలేదు. కాని ఓ బరువు ... ఎవరికైనా భరించడం కష్టమేనేమో...

ఎదుటివారి హీనస్థితిని సహకరించలేనినాడు... కనీసం ఎవరి అసహ్యాన్ని వాళ్ళు గుండెల్లో దాచుకున్నా గొప్పసహయమే... ’ బలరాం’

శవాన్ని ఎత్తుతుంటే నలుగురితోపాటు ఓ బిచ్చగత్తె కూడా ’నారాయణా’ అంది...


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)