కథా భారత
పరిష్కృతం
-

ఎలక్ట్రాన్

సమాజం ప్రజల అవసరాల నిమిత్తం కొన్ని వెసులుబాట్లని కలిగిస్తుంది. కొన్ని ధర్మాసూక్ష్మాలనీ చెబ్తుంది. ఆ ధర్మసూక్ష్మాలని అమలు చేస్తున్నప్పుడు మనకి తెలిసినా, తెలియకపోయినా కొన్ని ధర్మాలని విస్మరించడం జరుగుతుంది. ఆ విధంగా జరిగిన పొరబాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తే సంస్కారమనేదానికి నిర్వచనం లభిస్తుంది. స్త్రీపురుష సంబంధాలకి ఆమోదముద్ర సమాజం నిర్థారించిన వివాహమనే వ్యవస్థ. కలిగిన సంతుకి సాధికారత కలిగించేది వివాహం. సంతానం నిర్వహించవలసిన విధులనుకూడా సమాజం నిర్దేశిస్తుంది. సంతానం కలగనప్పుడు సమాజం చెప్పే ధర్మసూక్షం దత్తత.

రాఘవరావు ఆస్తిపరుడు. ప్రభుత్వాకళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం. యిరవైమూడో ఏటన వివాహమై, అయిదేళ్లు దాటినా సంతు కలగలేదు. రాఘవరావు భార్య శకుంతలకీ అప్పటికి యిరవైఅయిదు సంవత్సరాలు నిండాయి. ఎకరాల భూమి ఉండీ వారసులు లేకపోవడంతో, రాఘవరావు తల్లిదండ్రులూ, వారితోబాటు వీరిద్దరూ బెంగపెట్టేసుకొన్నారు. వైద్యపరీక్షల్లో సంతు కలగడానికి ఏ విధమైన అవకాశమూ లేదని నిర్థారణ కావడంతో దత్తత తీసుకోవడం గురించి ఆలోచనల్లో పడ్డారు.

అదే సమయంలో తల్లి తరఫు బంధువులింటికి ఓ శుభకార్యానికని రాఘవరావు భార్యతోనూ, తల్లిదండ్రులతోనూ కలిసి వెళ్ళాడు. తల్లికి పినతల్లి మనవడా బంధువు. పేరు సత్యనారాయణ. ఆ గ్రామం తపాలా ఆఫీసుకి ఆయనొక్కడే అన్నీ. పోస్ట్ సత్యంగారుగా ప్రసిద్ధుడు. ఆయనకి నలుగురు పిల్లలు. పెద్దవాడికి ఎనిమిది. రెండోవాడికి అయిదు. తర్వాత యిద్దరు ఆడపిల్లలు. వయసులు మూడూ, ఒకటీ. నాలుగో తరగతి చదివే పెద్దవాడికి ఉపనయనం. అంత చిన్నవయసులోనే ఒడుగెందుకు చేసేస్తున్నారని కొంతమంది యాదాలాపంగా ప్రశ్నించారు.

‘నిత్యగాయత్రీపారాయణ చేస్తాడని కాదుకాని, సంప్రదాయరీత్యా ఉత్తరకర్మలు చెయ్యడానికి అధికారం కల్పించాలికదా? మాకే క్షణంలో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. చాలాదూరంగా ఉందనుకొన్న గీత ఒక్కోసారి మనకి తెలియకుండానే దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే ఈ భయమూ, తొందరా!’ అన్న సత్యంగారి సమాధానం రాఘవరావులో ఆందోళన కలిగించింది. ఆయనన్న మాటలు సంప్రదాయరీత్యా ఆలోచిస్తే వాస్తవమే. వారసత్వంలో ఉత్తరకర్మలు కూడా ఒక భాగమేనన్న భావం రాఘవరావులో బలపడింది.

ఉపనయనం జరుగుతోన్న సమయంలో రాఘవరావు దంపతుల దృష్టి సత్యంగారి రెండోకొడుకు చంటిమీద పడింది. తన వయసుకుదగ్గ చిన్నచిన్న పనులు ఒబ్బిడిగా చేస్తూండడం చూసి రాఘవరావు దంపతులు ముచ్చట పడిపోయారు. మనసులోని ఆలోచన గాలిమాటగా తల్లి చెవిన పడ్డంతో, ఆవిడ ఆ మాటని సత్యం తల్లికి తన ఉద్దేశ్యంగా చెప్పింది. ‘ దిష్టి కొట్టడం కాదుకని, చంటి లాంటి మనవడు మా యింట్లో తిరుగాడాలనీ, నా ఒళ్లో ఆడుకోవాలనీ ఉందే! నీ కొడుకునీ, కోడల్నీ నువ్వు ఒప్పించు, నాకొడుకునీ, కోడల్నీ నేను ఒప్పిస్తాను. ఏమంటావు?’’ రాఘవరావు తల్లికి లౌక్యం తెలుసు.

సత్యం తల్లికీ లౌక్యం తెలుసు. పెంపుకిస్తే వచ్చే పుణ్యాల్నీ, లాభాల్నీ కలబోసి చెప్పి సులువుగానే కొడుకునీ, కోడల్నీ ఒప్పించింది. తక్షణ నిర్ణయం ఉపనయనం జరిగిన రెండో రోజే కార్యరూపం దాల్చింది.

పది ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన మాటని గుప్తంగా ఉంచి, శాస్త్రోక్తంగానూ, చట్టపరంగానూ రాఘవరావు దంపతులు చంటిని దత్తు తీసుకొన్నారు. అప్పటికి అయిదేళ్ళ వయసులో ఉన్న చంటి వాళ్ల గ్రామపంచాయితీ ప్రాధమిక పాఠశాలలో ఒకటో తరగతి చదివేవాడు. పల్లె వదిలి రాఘవరావు దంపతుల వెంట పట్నం పోతున్నప్పుడు, యిద్దరు చెల్లెళ్లని ఒకసారి గట్టిగా హత్తుకొని గుడ్లమ్మట నీళ్లుకుక్కుకొని, తల్లిదండ్రులవైపు చూడనైనా చూడకుండా, పోయి కారులో కూర్చున్నాడు.

తెలిసీ తెలియని ఆ వయసులో తల్లిదండ్రులు తనని అమ్మకానికి పెట్టేశారని చంటి గ్రహించగలిగాడు. తన మంచికోరే మంచి చదువులకోసం ఆ పని చేస్తున్నట్టు నాయనమ్మ హితోపదేశం చెయ్యడంతో చంటి మనసు రాజీ పడిపోయింది. రాఘవరావు దంపతులు చంటిని చాలా అభిమానంగా చూసుకోసాగారు. చంటికూడా అనతికాలంలోనే వాళ్ళని అమ్మా, నాన్నలంటూ పిలవడంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేకపోయాయి. జేబుఖర్చులకని రాఘవరావు రోజుకో రూపాయిచ్చేవాడు. శకుంతల కూడా ఓ రూపాయిచ్చేది. చంటి రోజుకో పావలా పెట్టి ఒక అరటిపండు కాని, నువ్వుపప్పులద్దిన బెల్లం జీళ్లు కాని కొనుక్కుని తినేవాడు. మిగిలిన సొమ్ముల్ని ఓ యిత్తడిడబ్బాలో దాచుకొనే వాడు. ఒకరోజున శకుంతల చంటి పుస్తకాలగూటిని సర్దుదామని తెరిచింది. యిత్తడి డబ్బాలో దాదాపు వంద రూపాయిలు దాకా కనబడ్డాయి. ఆ రాత్రి చంటిని ఒళ్ళోకి తీసుకొని, ‘హాయిగా ఏ చాక్లెట్లో కొనుక్కుని తినకుండా డబ్బులు దాచుకోవడం ఎందుకు?’ అని బుజ్జగిస్తూ అడిగింది, ‘ చిన్నచెల్లాయి పుట్టినరోజుకి ఓ గౌను కొందామని దాస్తున్నానమ్మా. అయినా రోజూ ఓ పావలా పెట్టి ముసలవ్వ కొట్లో నువ్వుపప్పులద్దిన జీళ్లు కొనుక్కుని తింటున్నా. నాకు చాక్లెట్లకన్నా జీళ్లే యిష్టం. మనింటికివచ్చే పాలేరు కొడుకు రామం కూడా నా క్లాసే. వాళ్ల నాన్న వాడికి వారానికంతటికీ కలిపి ఓ పావలా యిస్తాదట. రామానికి కూడా నేను జీళ్లు యిస్తూంటాను’ అల్లరి చెయ్యడం, కుదురుగా ఉండడం, అయినదానికీ కానిదానికీ పేచీలుపెట్టడం, లేక బుద్ధిగా ఉండడం,-యిలాంటి లక్షణాలు పుట్టుకతోనే అబ్బే సహజ ప్రవృతికి నిదర్శనాలు. ఒకే యింట పుట్టిపెరిగినా, పిల్లల ప్రవృతులు ఒకేలా ఉంటాయని ఖచ్చితంగా అనుకోవడానికి వీలులేదు. చంటి సాధుస్వభావం చూసే పెంచుకోవాలని తామిద్దరికీ అభిప్రాయం కలగడం, అది వీలు కావడం, తమ అదృష్టంగా భావించడం జరిగింది. చంటి చెప్పిన సమాధానం విని శకుంతల ఆశ్చర్యపోయింది. శకుంతలకి మనసులో ఓ చిన్న అపరాధభావం తలెత్తినా దాన్ని వెంటనే అణిచి వేసుకొంది.

అ రాత్రి శకుంతల భర్తకి జరిగిన విషయం చెప్పింది. ‘ ముసలవ్వ కొట్టు గురించి నాకు తెలుసు. పాపం ఆమె భర్త ఓ రైలు ప్రమాదంలో పోతే ప్రభుత్వమిచ్చిన నష్టపరిహారాన్ని దళారులు మింగేశారు. ఏదో చిన్న దుకాణం పెట్టుకొని కాలం గడిపేస్తోంది. స్కూల్లో చేర్పించటానికి చంటిని తీసుకు వెళ్లినప్పుడు ముసలవ్వ సంగతి యాదాలాపంగా చెప్పానంతే. పాలేరు కొడుకు రామాన్ని కూడా అదరంగా చూస్తున్నాడు. చంటిది చాలా జాలి గుండె అని తెలుస్తోందిదా కదా? యిది మనకి సంతోషకరమైన విషయం. యికపోతే మనం చంటిని బజారుకి తీసుకుపోయి, చెల్లెలికి తను దాచుకొన్న సొమ్ముతోనే తనకి నచ్చిన ఓ గౌను కొనిపిద్దాం. విలువైన దుస్తులు మనం కొనిచ్చినా చంటికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కారులో వెళ్లి బహుమతిని చంటి చేత యిప్పించి వద్దాం.’ అన్నాడు రాఘవరావు.

‘మనం చంటిని అక్కడకి తీసుకు వెద్తే మీరు చెప్పినట్టుగా బాగానే ఉంటుంది కాని, అందుకుంటూన్న ప్రేమ చేజారిపోతుందన్న భయం నాకూ, పేగుతెంపుకొని పెంపకానికిచ్చినందుకు బాధ ఆమెకూ కలగడం సహజం. మేమిద్దరమూ భావోద్రేకాలకి గురైతే ఆ ప్రభావం చంటిమీద పడొచ్చు. అది నాకిష్టంలేదు. మీదుమిక్కిలి చెళ్లెళ్లని చూసి తిరిగి రానంటే అది మరో చిక్కుసమస్యగా మారిపోతుంది. తను తెలిసో తెలియకో మనవెంట వచ్చాడు. కడుపులో ఏం బాధపడ్తున్నాడో, ఏమాలోచిస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. చిన్న పిల్లలకి మరుపు త్వరగానే వచ్చేస్తుందని మా నాయనమ్మ చెప్పేది. నా అయిదోఏట మా నాన్న పోయాడు. ఆయన నన్ను ఎత్తుకొని ఎలా ఆడించేవాడో, ఏడ్చినప్పుడెలా బుజ్జగించేవాడో నాకు గుర్తులేవు. మా అమ్మ చేబ్తెనే తెలిసేది. మనకీ, చంటికీ కాస్త బాధాకరంగా ఉన్నా తీసుకువెళ్లకుండా ఉంటేనే బావుంటుంది,’ అంది శకుంతల.

రాఘవరావు సత్యానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

‘ మీ శ్రీమతి ఆలోచన సవ్యమైనదే, కాదనలేం. పెంపుకిచ్చి తప్పుచేసామంటూ మా ఆవిడ మధ్యమధ్యలో మౌనంగా బాధపద్తోనే ఉంది. ఎదుగూ, బొదుగూ లేని జీవితం నాది. కనీసం ఒక కుర్రాడైనా శ్రీమంతుల యింట్లో పెరిగి వృద్ధిలోకి వస్తాడన్న స్వార్థానికి యిద్దరం తలొగ్గిన మాట వాస్తవం. మీ అండలో చంటికి ఏ విధమైన లోటూ ఉండదని భావించుకుంటూ మేము చేశామనుకుంటూన్న తప్పిదాన్ని మేమే మన్నించుకొంటున్నాం. చంటిని యిక్కడకు తీసుకు వస్తే, వాడి కళ్లలోకిచూసే ధైర్యం కాని, వాణ్ణి ఎత్తుకొని బుజ్జగించే నైతికబలం కాని మాకుండవు. ఆఖరిదాని పుట్టినరోజు దీపావళినాడు. యింకా రెండు నెలలుంది. ఈలోపుగా ఏదోవిధంగా చంటి దృష్టిని మళ్లించండి,’ అన్నాడు సత్యం ప్రాధేయపడుతూ.

సత్యం సమాధానం రాఘవరావుని కలచివేసింది. అపరాధభావంలో అందరదీ సమానపాత్రే అయినా, ఆద్యులు తామే! రాఘవరావు పరిపరి విధాలా ఆలోచించాడు. తన తరంలో తోడబుట్టినవారు లేకుండా ఏకాకిజీవితాలు గడపడం మంచిదికాదని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పే మాటలు సత్యదూరాలు కావు. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల, లేదా అక్కాతమ్ముళ్ల అనుబంధాలు చాలా ప్రభావవంతమైనవని. కష్టసుఖాలలో పాలు పంచుకోవడానికి నా అన్న వారనే భావనా, ఆత్మీయతా కాదనలేని ఓ అవసరం. అలాంటి ఆత్మీయబంధాన్ని తాము చంటి విషయంలో తెంచివేశారు.
‘ చంటీ! వచ్చే ఆదివారం చెల్లాయి వద్దకు పోదాం. సరేనా,’ అన్నాడు రాఘవరావు.

‘ మా చెల్లాయి పుట్టినరోజు యింకా చాలరోజుల తర్వాత దీపావళినాడు,’ అన్నాడు చంటి.

‘ దీపావళికి నువ్వన్నట్టుగానే చాలా రోజులే ఉందనుకో. అయినా ఒకచోటుకి ముగ్గురం వెడదాం. ఆటలకని అటూ యిటూ పోక,’ అన్నాడు రాఘవరావు.

ఆ ఆదివారం ఉదయం రాఘవరావు దంపతులు చంటిని తీసుకొని జోగమ్మా శిశుశరణాలయానికి వెళ్లారు.
‘ చంటీ! నీ చెల్లాయిలిద్దరికీ అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు. పాపం ఈ పాపలకి అమ్మా, నాన్నలూ, అన్నయ్యలూ లేరు. వీరిలో ఏ చెల్లి కావాలో చెప్పు. మనం తీసుకుపోయి దీపావళినాడు పుట్టినరోజు చేసి, మన దగ్గరే ఉంచేసుకుందాం, ఏమంటావు?’ అంది శకుంతల.

చంటి యిద్దరు పాపల్ని చూపాడు.

చేసిన తప్పుని సరిదిద్దుకొన్న రాఘవరావు దంపతుల యింట్లో ఆ దీపావళి నాడు మూడు జ్యోతులు ప్రకాశించాయి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)