సారస్వతం - 'దీప్తి' వాక్యం
నదీమ తల్లికి వందనాలు
- దీప్తి కోడూరు

2015లో గోదావరి పుష్కరాలు జరుపుకొంది. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించి ఆ నదిని పవిత్రం చేస్తుంది. 14 జూలై నుండి 25 జూలై 2015 వరకు ఆది పుష్కరాలతో గోదావరి పుష్కరాలు ఆరంభమయ్యాయి.

ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలకు మరొక ప్రత్యేకత ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలను మహా పుష్కరాలు అంటారు. బ్రిటీష్ పరిపాలనలో జరుపుకున్న తర్వాత గోదావరీ మాత ఈ 2015లో మహా పుష్కరాలు జరుపుకొంది. మరల మహాపుష్కరం 2159వ సంవత్సరంలో వస్తుంది.

మహారాష్ట్రలోని త్రయంబకంలోని జ్యోతిర్లింగం వద్ద జన్మించి, నాసిక్ మీదుగా, తెలుగుదేశంలో ధర్మపురి, కాళేస్వరం, బాసర, భద్రాచలం, రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరు మార్గంలో సాగి అంతర్వేదిలో సముద్ర జలాలలో కలిసిపోతుంది గోదావరి.

రాజమండ్రి వద్ద పాపికొండలలో అనేక చిన్న నదులు గోదావరిలో కలుస్తాయి. ఇక్కడ గోదావరిని అఖండ గోదావరి అని పిలుస్తారు. అందుకే రాజమండ్రి వద్ద ప్రవహించే గోదావరికి పవిత్రత, ప్రత్యేకత అధికమని భక్తుల విశ్వాసం.
ఇంతకీ ఈ పుష్కరాలు అంటే ఎమిటో ఒకసారి చూద్దాం.

పుష్కరము అంటే పోషణ. పుష్కర అంటే పోషణకు కావలసిన శక్తి. అందుకే విష్ణు సహస్రనామంలో విష్ణువును పుష్కరాక్షుడు అని స్తుతిస్తారు. సమస్త విశ్వము యొక్క పోషణను వీక్షించువాడు అని భావం.

జ్యోతిష శాస్త్రంలో కూడా పుష్కర నవాంసము అనే ప్రస్తావన ఉంది. సంబంధిత గ్రహానికి లేదా ముహుర్తానికి బలం చేకూర్చేదని అర్ధం.

జీవనదులకు సంబంధించినంత వరకు నదులను ప్రత్యేకంగా పూజించే కాలం పుష్కరాలు. అంటే బృహస్పతి ఆయా నదులకు సంబంధించిన రాశులలోకి ప్రవేశించే పవిత్ర దినాలు. ఇది ప్రతి నదికీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

బృహస్పతి రాశిలోకి ప్రవేశించే తొలి పన్నెండు దినాలు ఆది పుష్కరంగా, విడిచే చివరి పన్నెండు దినాలు అంత్య పుష్కరంగా నిర్వహిస్తారు.

ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది.

జన్మప్రబృక్రియత పాపం స్త్రియావ పురుషేణ
పుష్కర్యోమాత్రశ్య సర్వయే ప్రణశ్యతి||

ఇక పురాణ కధనాలు అనేకం.

వరుణుడు కుమారుడైన పుష్కరుడు అన్ని నదీ తీర్ధాలకు పవిత్రత చేకూర్చాలనే సదుద్దేశ్యంతో బ్రహ్మదేవుని వాటిలో నివసింపమని తపస్సు చేశాడు. నిస్వార్ధమైన అతడి కోరికను బ్రహ్మ మన్నించి. బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తే తత్సంబంధిత నదిలో ఆ కాలం తానుండేట్లు అనుగ్రహించాడు. ఆ ప్రకారంగా పన్నెండు జీవనదులకు సంబంధించిన పన్నెండు రాశులు, సంవత్సరానికి ఒక నది చొప్పున పుష్కరాలు జరుపుకుంటాయి.

పన్నెండు నదులకు మాత్రమే పుష్కరాలు నిర్వహిస్తారు. అవి గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, పుష్కరవాహిని, తుంగభద్ర, సిందు, ప్రాణహిత.

బ్రహ్మాండ పురాణం ఇలా చెప్తుంది. పుష్కర స్నానం జన్మజన్మల పాపాన్ని కడిగివేసి, సద్బుద్దిని ప్రసాదిస్తుంది. అశ్వమేధ యాగంతో సమమైన ఫలితాన్నిస్తుంది. నర్మదా నది వద్ద ధ్యానం, కురుక్షేత్రం వద్ద దానం, కాశీలో మరణం అత్యంత ఫలప్రదాలని ప్రతీతి. ఆ మూడు కలిపిన ఫలం పుష్కర స్నానం ప్రసాదిస్తుంది.

పుష్కర సమయంలో సమస్త దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంగానది పర్యంతం సమస్త తీర్ధాలు ఆ నదిలోనే నివసిస్తుంటాయని విశ్వాసంతో పరమ పవిత్రంగా ఆ జలాలను స్వీకరిస్తారు సాధకులు, భక్తులు. అట్టి పవిత్ర సమయంలో ఆ నదుల వద్ద నివసించడం, ఆ జలాలను స్వీకరించడం సర్వ పాపహారకంగా, పుణ్యప్రదంగా భావిస్తారు.

మన ఋషులు పుష్కర విధిని కూడా నియమించారు. పుష్కర సమయంలో ఖచ్చితంగా చేసి తీరవల్సిందిగా పుష్కరస్నానం, పుష్కరవాసం, శిరోముండనం, ఉపవాసం, పుష్కర పితృకర్మ, పుష్కర దానం విధించారు.

పుష్కర స్నానం అంటే వేలాదిగా తరలివచ్చిన జన సందోహం మద్య తొక్కుకుంటూ, తోసుకుంటూ నదిలో మునక వేసి రావడం కాదు. నదీ జలాలతో భౌతికంగా దగ్గరగా రావడం ద్వారా మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని ఆ తీర్ధాలతో అనుసంధానం చేసుకోవాలని ఋషి ప్రోక్తం.

దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇలా ఉన్నాయి.

ఆ సమయంలో సూర్యుని వల్ల ప్రభావితమయ్యే భూమి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రం మరింత తీవ్రతరంగా ఉండి, నదీజలాల రోగనిరోధక లక్షణాలను మరింత శక్తివంతంగా చేస్తాయి. ధ్యానం ద్వారా చేకూర్చుకొనే శక్తిని పుష్కర స్నానం ద్వారా సంగ్రహించవచ్చని శాస్త్రఙ్ఞుల అంచెనా.

ఈ సంవత్సరం సుమారు 12కోట్ల మంది పలుచోట్ల పుష్కరాలలో పాల్గొన్నారు. దీనిని బట్టి మన ప్రాచీన ఋషులు వివరించి, విధించిన పద్ధతులు, సాధనలు, అనుష్ఠానాలు ఎంత శక్తివంతంగా ఈనాటికీ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయో అర్థమౌతుంది.

భారతీయ ఆధ్యత్మిక విధానంలోనే ఆ ప్రత్యేక శక్తి ఉంది. అది లోకోత్తరమై సమస్త మానవజాతికీ మార్గదర్శనం చేయాలని ఆశిద్దాం!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)