తెలుగు తేజోమూర్తులు - చరిత్రకారుడు, నిత్య పరిశోధకుడు - బి ఎన్ శాస్త్రి

 

                                                                                  -  ఈరంకి వెంకట కామేశ్వర్
 

 


తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు.
వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

ఒక చరిత్యాత్మిక చరిత్రకారుడి రూపంలో అనేక శిలా శాసనాల ఆధరముగా ఆంధ్ర దేశాన్ని సుమారు వెయ్యేళ్ళేలిన - " విష్నుకుండిన " వంశ చరిత్రను వెలుగులోకి తెచ్చిన మేటి, నిత్య పరిశోధకుడు శ్రీ బి ఎన్ శాస్త్రి గారు. ఆంధ్రావనిని నేలిన ఇక్ష్వాకులు, పల్లవులు మధ్య యవరికీ అవగతం కాకుండా ఉన్న దాదాపు వెయ్యేళ్ళ చరిత్రని కనుగొని ఆంధ్రేతిహసానికి అందించారు. తన పరిశోధనా తృష్ణతో, శాసనా సంపుటాలు అందించిన యొగతత్పరుడు. ఈ స్వయం చోదక పరిశోధకుడు 12,000 పుటల భారతదేశ చరిత్ర, సంస్కృతిని లిఖిత పూర్వకముగా ప్రకటించారు. ఇంతటి అసాధారణ ఇతిహాస ధారణ చేసిన వారు తెలుగు నాట ఇంకెవ్వరూ లేరు. బి ఎన్ శాస్త్రి గారు ఆయనకు ఆయనే సాటి.

శాస్త్రి గారు స్వయం చోదక పరిశోధకుడు. అనేక శాసన సంపుటాలు వెలయించడంతో పాటు, సూరవరము ప్రతాపరెడ్డి గారు అసంపూర్ణముగా వదిలి పెట్టిన " ఆంధ్రుల సాంఘిక చరిత్ర " పూర్తి చేశారు. ఇలాటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. శాస్త్రి గారి దీక్ష దక్షతలు అలాంటివి. " ఏదో ఒక పరిశోధనకు ఒక డాక్టరేట్ ఇస్తారేమోగాని, ఇన్ని పరిశోధనలు చేస్తే ఏమి ఇవ్వాలో తెలియక విశ్వవిద్యాలయాలు తికమక పడటం సహజం " అని వ్రాశారు, ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ, తన కాలం "అప్పుడు - ఇప్పుడు " - "నిత్య పరిశోధకులు" అన్న పేరుతో.

శాస్త్రి గారిని చరిత్ర విద్యార్ధిగా భావిస్తే అది అపోహే. ఆయన తెలుగు పండితుడూ, సాహితీవేత్త. కానీ శాసన పరిష్కారమే తన జీవాన విధి గా పెట్టుకున్న కార్యతత్పరాయణుడు. బి ఎన్ శాస్త్రి గారు సత్యాన్వేషి; అనేక ఊళ్ళు తిరిగి శాసనాలు సేకరించి, విషయాలను ఆకళించుకుని, వెలయించిన సాహితీ సౌరభాలను ప్రతీ తెలుగు వాడు చదువవలసినదే.

ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ శాస్త్రి గారికి మంచి మిత్రులు. అప్పుడప్పు డు కలసి తెలుగు చరిత్ర, సంస్కృతిక అంశాల మీధ విషయాలు చర్చిస్తూ ఉండేవారు. శాస్త్రి గారు అభిప్రయాలకు - శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు (వీరు శాసన పరిశోధనలో అగ్రేసులు, సంస్కృతాంధ్ర, కన్నడ భాషలలో పండితులు), శ్రీ తిరుమల రామచంద్ర గారిని అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉండేవారు శాస్త్రి గారు.


శాసన పరిశోధన, పరిష్కారాలు, వ్యాఖ్యానాలు, వెలయించడం:

పదేళ్ళ పాటు ఉపాధ్యాయుడిగా పని చేసిన పిదప, 1959 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎం ఏ (తెలుగు) చేసారు. ఈ సమయంలో " ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి " పాట్యాంశం అభ్యసిస్తూ ఉండగా శాసనముల మీద శాస్త్రి గారికి మక్కువ ఏర్పడింది. ఆచర్య దాక్టర్ బి రామరాజు గారు శాస్త్రిగారిని ఈ దిశగా ప్రోత్సహించారు. ఎం ఏ రెండో సంవత్సరములో శ్రీ ఖండవల్లి లక్ష్మిరంజనం గారి పర్యవేక్షణలో సభ జరిగినది. అది వారి దృష్టిని మరింత ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచి శాస్త్రి గారు " శాసనాలు " వెలికి తీయటం తన జీవిత ధ్యేయముగా పెట్టుకున్నారు.


" నా అనుభవుంలో శాసన పరిశోధన కన్నా శాసన ప్రతిబింబముల సేకరణ కష్టతరమైనది " అని వ్యాఖ్యానించారు శాస్త్రి గారు. ఇది వాస్తవమే. ఎందుకంటే ఆయన తెలంగాణాలోని తొమ్మిది మండలాలలో సుమారు నాలుగు వేల గ్రామ పంచాయతీలు శాసనముల, విషయ సేకరణ కొరకు సందర్సించారు. కొన్ని సందర్భాలలో - భూమిలో పాతుకు పోయిన శాసన శిలలను, త్రవ్వి తీయవలసి వచ్చినపుడు, కూలీవారు, గ్రామీణులు వెలికి తీయడానికి సహకరించక పోవడం వల్ల, కావల్సిన పని ముట్లను కొని, తన చేతబూని, శాసన శిలలను త్రవ్వి తీసే పనిని స్వయముగా నిర్వహించారు శాస్త్రి గారు. ఇంతటి కార్య తత్పరుడు, శ్రద్ధానురక్తి, తదైక భావం కలవాడు తెలుగు నాట ఆట్టే కాన రాడు. తన పనిని యోగముగా సాధిస్తూ వచ్చారు శాస్త్రి గారు.

పరిశోధనల నిమ్మిత్తం గ్రామాలు సందర్సించినప్పుడు, శిలల ప్రతిబింబాల సేకరణలో జాప్యం జరిగినపుడు ఆట్టే వసతులు లేని ఆ వూరి పాఠశాలలో లేక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నివసించేవారు.

సిరికొండ, ఇందంపల్లి, కన్నెకల్లు, మల్లేపల్లి, బొల్లేపల్లి, దుప్పల్లి గ్రామాలలో శాసనలు సేకరించారు. వీరికి పేరూరు, కందుకూరు లో తామ్ర శాసనములు లభ్యమైయాయి. కందుకూరి చోడుల గూర్చి 10 శాసనములు; కల్యాణీ చాళుక్యుల శాసనములు 12; కాకతీయుల శాసనములు 10; విష్ణుకుండిన శాసనములు 8; మరఠీ వంశముల శాసనము 1; తూర్పు గాంగ వంశీయుల శాసనములు 2 సేకరించి, శాసన స్వరూపం, లిపి, శాసన విషయం, కాలనిర్ణయం, శాసన పాఠం, వాటి మీద వ్యాఖ్యలు చేసి ప్రకటించారు బి ఎన్ శాస్త్రి గారు.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు - పరిశోధనాశక్తి చాలా పట్టుదల, దీక్ష కలిగిస్తుంది. సంస్కృతి జీవన విధానం. వాటిని గూర్చి పరిశోధన చేయాలన్న, వ్రాయాలన్నా, తెలుగు వాళ్ళ ఆచార సాంప్రదయాలు, నిత్య జీవన వ్యవహారాలు, ధోరణులు, పోకడలు, మనస్తత్వాలను అర్ధం చేసుకోవాలి. శాసన పరిశోధన చేసి అనేక విషయాలు బయటకి వెలికి తీయాలన్న శాస్త్రిగారి జిజ్ఞాస అపారమైనది.


శాసనాలను కనుగొనడం వారి జిజ్ఞాసకి హేతువు. వారిలో ఆ జిజ్ఞాస అలానే వుండి - అణగారి పోకుండా, అది తీరే దాకా ప్రెరేపిస్తూనే ఉంది. ఇందులో ఏముంది అని కొందరు అనుకున్నా అసలు ప్రౌడిమ అక్కడే ఉంది. శాసనాలను వెలికి తీయటం, వాటిని పరిష్కరించి, వ్యాఖ్యానాలు ఇవ్వడం శాస్త్రి గారి " ప్రాప్యం"; ఆయన తపన, ప్రయత్నము అపారమైనవే. కూలీలు గడ్డపారలెత్తనపుడు వాటిని తన చేతబూని శిలా శాసనాలను విలికి తీసి, సుభ్రపరచి, ప్రతిబింభాలు సేకరించారు. ఇలా బాధాప్లావితాలు అనుభవించినా, అవి వారిని రవ్వైనా బాధించలేదు. లక్ష సిద్ధి కొరకు అలా జీవితాంతం కృషిచేస్తూనే ఉన్నారు. ఇట్టి మహోజ్వల వ్యక్తిత్వం తెలుగు నాట కానరావటం అద్రుష్టం గానే భావించాలి.


శాస్త్రి గారి శాసన పరిశోధనా కాలం లో ఆయన్ని ప్రోత్సాహించి, సలహాలు అందించినవారెలో శ్రీయుతులు - డాక్టర్ జి ఎస్ గాయి, పి వి పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ పుల్లా దుర్గైయ్య, శొంఠి అచ్చుతరామయ్య, జి వి సీతపతి మున్నగువారున్నారు. ఈ స్వయం చోదక పరిశోధకుడికి ప్రముఖ పాత్రికేయుడు శ్రీ జి కృష్ణ మంచి మిత్రుడు; తరచు విభిన్న అంశాల మీద పరస్పరం చర్చిస్తూ ఉండే వారు.

శోధించి విషయాలను సాధించడం శాస్త్రిగారి ధీర గుణం. ఉదాహరణకి - ఈపూరు తామ్ర శాసనములు (6), ఒక శిలా శాసనము అధారముగా విష్ణుకుండినులు - "ద్కషిణాపధపది ", " త్రికూట మలయాధిప ", "శ్రీ పర్వతస్వామి పాదనుధ్యాత " బిరుదులు కలిగి ఉన్నారని ప్రకటించారు. విష్ణుకుండినులు - కృష్ణ - గోదావరి మధ్య ప్రదేశాలే కాక నల్గొండ, ఇంద్రపాలగుట్ట గ్రామాలను నేలినారని చరిత్ర పరిచయం చేశారు. అంతే కాక, వేగీపురము, అమరావతి, దెందులూరు, బెజవాడ పట్టణములు వీరికి రాజధానులుగా ఉన్నాయన్న విషయాలను తేట తెల్లం చేసారు శాస్త్రి గారు. వారి శ్రద్ధా శక్తులు ఎంత మహోత్కృష్టమో తెలియవస్తున్నాయి.

ఇవే కాక శాస్త్రి గారు వెలికి తీసి, పరిష్కరించి, వ్యాఖ్యానాలందించిన శాసనాలలో - అనంతవర్మ సేవిది తామ్ర శాసనము ఉమావర్మ హోణరేజ్ఞ తామ్ర శాసనము; మధనంతవర్మ చోడ గంగదేవుని తెంబూరు శాసనము; రాచూరు శాసనములు (3); పడమటిపల్లి శాసనము; ఇదంపల్లి శాసనము (2); ఆగామోతుకూరు శాసనము; పేరూరు శాసనము - 9; మెడేయభట్టు బొల్లేపల్లి శాసనము; శనిగరం శాసనము; తుంగపాడు శాసనము; ఇర్విన్ శాసనము; తాడువాయి శాసనములు - 2; దుప్పల్లి శాసనము ఉన్నాయి. వీటన్నిటిని శాసన సంపుటిగా వెలయించినారు.

కొన్ని శాసనాలని, 1965 లో అప్పటి ప్రముఖ పత్రిక - " భారతి " సంచికలో వెలయించారు శాస్త్రి గారు.

వెయ్యేళ్ళ ఆంధ్ర చరిత్ర కనుగొన్న " ఘనుడు " బి ఎన్ శాస్త్రిఇక్ష్వాకులు, పల్లవుల మధ్య యవరికీ అవగతం కాకుండా ఉన్న దదాపు వెయ్యేళ్ళ చరిత్రని కనుగొన్నాడు. తన పరిశోధనా
తృష్ణతో, శాసనాల ఆధారముగా " విష్ణుకుండిన " వంశాన్ని కనుగొన్నారు. బి ఎన్ శాస్త్రి గారు విష్ణుకుండిన వంశాన్ని వెలుగులోకి తెచ్చారు. నిత్య సత్యాన్వేషుడై, పరిశోధనలు కావిస్తూ, మునుపెన్నడూ తెలియని అనేక విషయాలను నానుడిలోకి తెచ్చిని స్వయం చోదక పరిశోధకులు. తెలుగు భషా పటిమ కలిగి ఉండి, అసాధారణ దీక్ష, దక్షతతో, ఏకాగ్రచిత్తుడై, విషయ పరిష్కరణ చేసి లోకాని అందించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
ఇంతటి నిగూడ చరిత్ర పరిశోధనలు చేసిన ఉదంతాలు తెలుగు నాట లేవు.


విష్ణుకుండిన వంశము శాసనాధరముగా కనుగొనడం - చారిత్యాత్మిక అంశం:

తెనుగు చరిత్ర చదివిన వారు చాలా మంది ఉన్నారు. కాని వారు మునుపెన్నడూ ఎరుగని చరిత్ర ఉన్నది. విష్ణుకుండిన వంశము శాసనాధారముగా కనుగొనడం - తెలుగు వారి చరిత్రలో చారిత్ర్యాత్మకఘట్టం. అట్టి మహత్తర శ్రేయస్సు అందుకున్న వారు బి ఎన్ శాస్త్రి గారు.

విష్ణుకుండిన వంశజులు:

విష్ణుకుండిన వంశజుల క్రమం ఇలా వివరించారు శాస్త్రి గారు:
- మహారాజ రజేంద్ర వర్మ
- మహారాజ మాధవ వర్మ
- మహారాజ గోవింద వర్మ
- మహారాజ మాధవ వర్మ - రెండు
- మహారాజ దేవ వర్మ
- మహారాజ మాధవ వర్మ - మూడు
- మహారాజ దేవ వర్మ తో పాటు - మహారాజ విక్రమేంద్ర వర్మ
- మహారాజ ఇంద్రభట్టారక వర్మ
- మహారాజ విక్రమేంద్రభట్టరక వర్మ;
- మహారాజ గోవింద వర్మ - రెండు
- మహారాజ మాధవ వర్మ - నాలుగు
- మహారాజ మంచన భట్టరక

లభ్యమైన శిలా పలకాలు, తామ్ర శాసనాలు, శిలా శాసనాల ఆధారముగా ఈ విషయాలు వివరింపబడినవి. ఇంతటి మహత్తర పరిశోధనాశక్తి ఎందరికి ఉంటుంది? ఉంటే, ఇలా దుస్సాధ్యాన్ని, సుసాధ్యం చెయ్యక మానరు. బి ఎన్ శాస్త్రి వారి వ్యక్తిత్వం అలా ఉంటుంది, ఫలితాలను అందిస్తుంది.
" జయంతి రామయ్య తరువాత ఇతడు నేటి జయంతి రామయ్య ":

అపట్లో శాస్త్రి గారికి గుర్తింపు వచ్చిందా అంటే? - ఈ విషయం చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు: - ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ తన వ్యాసంలో ఇలా వ్రాశారు - " ఏదో ఒక పరిశొధనకు ఒక డాక్టరేట్ ఇస్తారేమోగాని, ఇన్ని పరిశోధనలు చేస్తే ఏమి ఇవాలో తెలియక విశ్వవిద్యాలయాలు తికమపడటం సహజం. .... శాస్త్రి గారు తెలుగు విద్యార్ధి మాత్రమే; " చరిత్ర " విద్యార్ధి కాదు. ఏ చరిత్రకారుని అనుమతితో, అజమాయషీలో ఇంత పరిశోధన చేశాడు? ". ఇలా తన వ్యంఘ్యాశ్త్రాన్ని విశ్వవిద్యాలయాల మీద సారించారు కృష్ణ గారు, ఆంధ్రప్రభ, " అప్పుడు - ఇప్పుడు " శీర్షికలో. " జయంతి రామయ్య తరువాత ఇతడు (బి ఎన్ శాస్త్రి) నేటి జయంతి రామయ్య " అని స్లఘించారు కృష్ణా జి.

పరిశోధనలు, రచనలు, ప్రకటనలు:

ఆంధ్ర లోకానికి శాస్త్రి గారు రచించి, వెలయించి అందించిన గ్రంధాలలో ముఖ్య గ్రంధాలు - " భారత దేశ చరిత్ర సంస్కృతి "
(21 భాగాలు); " బ్రాహ్మణ రాజ్య సార్వస్వము "; " మల్యాల వంశ చరిత్ర "; " రెడ్డి రాజ్య సార్వస్వము "; " త్రిపురాంతక దేవాలయ
శాసనములు " ఉన్నాయి. " బ్రాహ్మణ రాజ్య సార్వస్వము " ప్రకటన శాస్త్రి గారికి చరిత్రకారుడిగా మంచి పేరు తెచ్చింది. అనేక చారిత్రిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూరవరం ప్రతాప రెడ్డి గారు వదిలి పెట్టిన " ఆంధ్రుల సాంఘిక చరిత్ర " భాగాన్ని పూర్తి చేసారు శాస్త్రి గారు. బి ఎన్ శాస్త్రి అనేక సంపుటాలు వెలయించాడు. కందూరు చోడులను గురించి శాసన ఆధారంతో తేల్చి చెప్పారు.

" శ్రీనాధ భారతము " లో వ్యాసం వ్రాశారు. ఈ గ్రంధాన్ని "గోల్కొండ " పత్రికా సంపాదకులు, ఊస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ నూకల సర్వోత్తమ రెడ్డి గారు సహాయముతో ప్రచురించినారు.

శాస్త్రి గారు జరిపిన నిత్య పరిశోధనల ఫలితాలలో ముఖ్యమైనవి:

శాసన శంపుటి - (1,2 భాగ్గాలు) - వెలయించారు. ప్రముఖ సహితీవేత్త శ్రీ తిరుమల రామచంద్ర ఈ సంపుటానికి ముందు మనవి వ్రాసినారు. ఈ గ్రంధాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ వరాహగిరి వేంకట గిరి గారు చదివి, తన సదభిప్రాయం వెలుగూర్చినారు.

- " చెరకు రెడ్డి వంశ చరిత్ర శాసనములు " (1989)
- " గోల్కొండ చరిత్ర " - సంస్కృతి శాసనములు (1989)
- " గ్రామ జీవనం " (నాటకం) (1976)
- " జీవితం - గమనం " (1975)
- " కందూరి చోడుల శాసనములు, చరిత్ర-సంస్కృతి " (1984)
- " ముఖలింగ దేవాలయ చరిత్ర - శాసనములు " (1985)
- " రేచర్ల పద్మనాయకులు " (1991)
- " రేచెర్ల రెడ్డి వంశ చరిత్ర - శాసనములు " (1989)
- " శాసన సంపుటి - 1,2 భాగాలు " (1973)
- " వేములవాడ చరిత్ర - శాసనములు " (1991)
" భారతదేశ చరిత్ర సంస్కృతి " - శాస్త్రి గారు ప్రకటించిన
మొదటి ఆరు (భాగాలు) గ్రంధములు - వేద, మౌర్య, గుప్త, చాళుక్య, ప్రతీహార, కాకతి యుగముల వివరాలకు సంబంధించినవి. ఘజనీ వంశంతోపాటు, మోరీ, బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యెద్, లోడి వంశాల చరిత్రలు, మంగోలుల దండయాత్రలు వివరాలు ఇత్యాది విషయాలతో పూరించారు.

భారతదేశ చరిత్ర సంస్కృతి - ఏడవ భాగం (652 పుటలు) -
డిల్లీ సుల్తాన్ యుగము - 1 వివరిస్తుంది.
భారతదేశ చరిత్ర సంస్కృతి - ఎనిమిదవ భాగం (676 పుటలు) - డిల్లీ సుల్తాన్ యుగము - 2; ఇందులో డిల్లీ సుల్తాన్ల చరిత్రతో పాటు
- గాంగ, బహమనీ, ముసునూరి పద్మ నాయక వంశజుల చరిత్రలు కూడా విస్తారముగా వ్రాసేరు.

భారతదేశ చరిత్ర సంస్కృతి - తొమ్మిదవ భాగం (660 పుటలు) - విజయనగర యుగము - ఇందులో కొండవీడు, జమహేంద్రవరము, కందుకూరు రెడ్డి రాజ్యములు, అనెగొంది, సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశములు, ఎలమంచలి చాళుక్యులు, ఒడ్డాడి మత్స్య వంశములకు చెందిన సామంత రాజుల చరిత్ర, కళింగ గజపతుల చరిత్ర, తంజావూరు నాయక రాజుల చరిత్ర, మధుర నాయక రాజ వంశ విషయాలు చక్కగా వివరించారు.

భారతదేశ చరిత్ర సంస్కృతి - పదవ భాగం (680 పుటలు) - పదవ భాగం - దక్కన్ సుల్తాన్ యుగం వివరణలు ఉన్నాయి.భారతదేశ చరిత్ర సంస్కృతి - పదకొండవ భాగం (450 పుటలు) - మొగలు యుగము భారతదేశ చరిత్ర సంస్కృతి - పన్నెండవ భాగం (412 పుటలు) - మొగలు యుగము - ఇందులో జహంగీరు మొదలు, సామ్రాజ్య పతనము వరకు ఉన్న చరిత్రను వివరించారు.

భారతదేశ చరిత్ర సంస్కృతి - పదమూడవ భాగం (450 పుటలు) - రాజపుత్ర యుగము - భారతదేశంలో అత్యంత శక్తివంత మైన జాతిగా కీర్తి ప్రతిష్ఠలనార్జించిన రాజపుత్రుల వీర చరిత్ర వివరించారు.

భారతదేశ చరిత్ర సంస్కృతి - పదనాల్గవ భాగం - మరాఠా యుగము - 386 పుటలు - శివాజీ జీవిత చరిత్ర, బీజాపూర్, నిజాం రాజ్యముల దాడులు, శంభాజీ, పేష్వాలు, భాజీరావు, బాలాజీ భాజీ రావు, మాధవ రావు, నారాయణ రావు, రఘునధరావు పాలనలతో పాటు కొళాపూర్ రాజ్యము, నాగ్పూర్ భొన్స్లే రాజులు, గ్వాలియర్ సింధియాలు, ఇందోర్ హేల్కర్లు, బరోడా గేక్వార్డులకు సంభందించిన చరిత్రా వివరించారు. భారతదేశ చరిత్ర సంస్కృతి - పదినైదవ భాగం (364 పుటలు) - బ్రిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యుగము భారతదేశ చరిత్ర సంస్కృతి - పదహారవ భాగం (330 పుటలు) - ఇందులో కారన్ వాలిస్ నుండి, లార్డ్ డళౌసి వరకు పరిపాలించిన 12
గవర్నర్ జెనరల్ వరకు వివరించారు.

భారతదేశ చరిత్ర సంస్కృతి - పదిహేడవ భాగం (340 పుటలు) - మహావిప్లవ యుగముభారతదేశ చరిత్ర సంస్కృతి - పదునెనిమిదవ భాగం (374 పుటలు) - వైస్రాఇ ల యుగము భారతదేశ చరిత్ర సంస్కృతి - పంతొమ్మిదవ భాగం (356 పుటలు) - వైస్రాఇ ల యుగము - 2 (1926 నుండి 1947 వరకు)
భారతదేశ చరిత్ర సంస్కృతి - ఇరవైయ్యో భాగం (386 పుటలు) – సాంస్కృతిక పునర్జీవ యుగము
భారతదేశ చరిత్ర సంస్కృతి - ఇరవై ఒకటవ భాగం (372 పుటలు) - సంస్థానాల యుగము

బ్రాహ్మణ రాజ్య సార్వస్వము - 850 పుటలు - ఈ రచన చలా ప్రక్త్యాతి గాంచినది. ఇది బి ఎన్ శాస్త్రి గారి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలచింది. శాసన పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా పేరు తెచ్చింది.ఇందులో 26 బ్రాహ్మణ వంశాలు, గణతంత్ర రాజ్యాలు, అప్పటి సాంఘిక చరిత్ర, సంస్కృతి, మతవర్గ శాఖలు - 135 శాసనాల అధ్యయనం ద్వరా తెలియ పరిచారు.

ఇందులో 26 బ్రాహ్మణ వంశాలు, గణతంత్ర రాజ్యాలు, సంస్థానాలు, మరాఠీ పేష్వాలు, అప్పటి సాంఘిక చరిత్ర, అనేక శాసనాధారలతో నిశితముగా వివరింపబడినది. ఈ సార్వస్వంలో బృఘు వంశం, ఇంద్రవర్మ వంశం, శాతవాహన, గుప్త, ఇక్ష్వాకు, పల్లవ, శాలంకాయన వంశాలు; కంబుజ రాజ్యం (నేటి కంబోడియా దేశం), జావామాతరాం రాజ్యం, తూర్పు జావా - సిండోక్ రాజ్యం (నేటి ఇండోనేసియా, థైలాండ్, లాఓస్ ప్రాంతాలు)

మల్యాల వంశ చరిత్ర (224 పుటలు) - కాకతి బేత రాజు కాలం నుండి రుద్రమదేవి పాలన దాకా, విరియాల వంశజుల పాలాన వివరాలు ఇందులో పొందుపరిచారు.

రెడ్డి రాజ్య సార్వస్వము - 850 పుటలు - ఏ గ్రంధాలలో చోటు చేసుకోని అనేక విషయాలు ఈ గ్రంధములో వివరించారు శాస్త్రి గారు. వారి కృషి అసామాన్యమైనది. రెడ్డి రాజుల కాలం లో మోటపల్లి రేవు నిర్మాణం, విదేశాలతో సాగిన వర్తక, వ్యాపారాలు నిసితముగా వివరించారు.

" త్రిపురాంతక దేవాలయ శాసనములు " (1991) - 256 పుటలు - త్రిపురాంతక క్షేత్రము మహావైభవం తో ఒప్పారినది. శతాధికముగా శాసనాలు ఇక్కడ వెలయింపబడినవి. " దుర్గామల్లీస్వర దేవాలయ శాసనములు "; " కుందూరి చోడుల శాసనములు, చరిత్ర " వీరి రచనలే.ఇవీ కాక - " మల్యాల వంశ చరిత్ర - శసనములు " పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించారు.

మూసీ పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. శాస్త్రి గారి సంపాదకీయంలో - " పానుగల్లు ఉత్సవ సదస్సు వ్యాసాలు "
ప్రచురించారు.

ఏప్రిల్ 5, 2002 లో బి ఎన్ శాస్త్రి గారు హైద్రాబాదులో స్వర్గస్తులైనారు. చిత్త శుద్ధితో చేపట్టిన పరిశోధనను తుది దాకా నిర్వతించారు. ఆయనకు ఏ విశ్వవిద్యాలము డాక్టరేట్ ఇవ్వకపోయినా, సంఘాలు బుజ కీర్తులు తొడగక పోయినా, ఆయన నిత్య పరిశోధకుడిగా, అందించిన ఘన చరిత్ర సంపదను నానుడిలో ఉన్ననాళ్ళు ఆ మాహానుభావుడిని ఒక సారి తలిస్తే ఓ చరిత్రకారుడిగా, నిత్య పరిశోధక ఉదాహరణ మూర్తిగా, చిరస్మరణీయుడిగా ఉండిపోతారు బి ఎన్ శాస్త్రి గారు. ఆంధ్ర దేశ చరిత్రకు వెయ్యేళ్ళ చరిత్రను ఆపాదించటంతో, ఆయన పేరు భారత, ఆంధ్ర దేశ ఇతిహాసాలలో అచిర కాలం మిగిలిపోతుంది. శాస్త్రి గారి దీక్ష, కనపరచిన పరకాష్ఠ భవితవ్యానికి
ఉద్దీప్తి కలిగిస్తుందని, స్పూర్తిదాయకమని నిస్సందేహముగా చెప్పవచ్చు.

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech