మంత్రానికి శక్తి..
                       

సుజనరంజని పాఠకులకు ప్రత్యేక కానుక!.

 "మంత్రానికి శక్తి ఉందా" అనే శీర్షికతో సుజనరంజనిలో   ప్రఖ్యా మధుబాబుగారు అందిస్తున్న రచనలకి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రసిద్ది గాంచిన వీరి  రచన మీకోసం...
(పుస్తకంపై క్లిక్ చేయగలరు)
       

                       

                 నమ్మకం దాని పట్టు - సాధనలో మరో మెట్టు

                                                                                                         - ప్రఖ్యా మధు

 

 

 

అది రాజమండ్రికి దగ్గరగా ఉన్న ఓ చిన్న గ్రామం. పేరు సీతానగరం. కొన్నేళ్ళ క్రితం ఇక్కడ చిట్టిబాబా గారు అనే
అవధూత (భౌతికంగా) ఉండేవారు. గురువాక్యానికున్న శక్తి కిదో చిన్న నిదర్శనం. ఆయన వారి శిష్యులకి చెప్పారు. ఈ ప్రదేశం గొప్ప క్షేత్రమవుతుంది అని. వారు సిద్ధి పొందాక ఉన్న ఒకరిద్దరు శిష్యులు నిరాడంబరం గా జీవిస్తూ సాధకులై గురువాక్యాన్ని నమ్మి వచ్చిన వారికి అన్న దానం చేస్తూ యధాశక్తి ఏ పటాటోపం లేకుండా జీవిస్తుండేవారు. ఆశ్చర్యం, పది సంవత్సరాల వరకు ఇక్కడ ఏమి లేదు. ఇప్పుడు అక్కడికి వెడితే సామన్యులే కాక ఎంతో విద్యా వంతులు కూడా కనిపిస్తారు సేవచేస్తూ, సాధన మార్గంలో ముందుకెడుతూ. ఇక్కడ 1,000 గోవులతో ఒక గోశాల, 9 ఏనుగుల గజశాల ఉండాలని గురు సంకల్పం. ఇప్పుడు కొన్ని ఆవులు ఉన్నాయి. క్రితం నెలలోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ఈ ఆశ్రమానికి 'లీల ' అనే ఒక చిన్న ఏనుగుని బహూకరించారుట. ఈ బుజ్జి గణపతిని అందరూ కుంభాలతో స్వాగతం చెపుతూ తీసుకెళ్ళారుట. అయితే ఈ గున్న ఏనుగు బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి వెడుతున్న ట్రైను చప్పుడుకి భయపడి పరిగెత్తడం మొదలు పెట్టింది. ప్రజలు భయపడి పరిగెత్తారు, మావటి వాడు కూడా దాన్ని అదుపులోకి తేలేక పోయాడు. మూలాధార చక్రాన్ని అదుపు చేయడం అంత తేలికేం కాదు కదా! ఏమి చేయాలో ఎవరికి తెలియలేదు. అప్పుడు ఆ అవధూతల ముఖ్య శిష్యులొకరు ఆ ఏనుక్కి అడ్డుగా వెళ్ళి నిల్చున్నారు, అంతే ఆ ఏనుగు ఆగిపోయింది. తర్వాత కార్యక్రమం మామూలుగా సాగింది. ఒకరిద్దరు ఆసక్తితో ఆయన్ని అడిగారుట, ఏమండీ మీరు ఏనుగు ఎదురుగా వెళ్ళారు దాన్ని ఆపేశారు, ఇది ఎలా సాధ్యం అని. ఆయన దణ్ణం పెట్టి ఏమోనండి నాకూ తెలియదు గురువుగారిని తల్చుకున్నా అంతే అని మళ్ళీ తన పనిలో పడిపోయారు, పెద్ద విషయం కాదు అన్నట్టు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కోసారి మనం మంత్రానికి శక్తి ఉందా, తంత్రానికి తాడు ఉందా, యంత్రానికి అంచు ఉందా అనుకుంటూ సాధన చెయ్యకుండా ఎక్కువ చర్చల్లో కాలం గడుపుతున్నామేమో అని.

ఒక గురువుగారన్నారు. సాధన వైరాగ్యాన్ని కలిగించాలి కాని సాధకుల్లో అది వ్యతిరేక పరిణామాల్ని ఇచ్చే అవకాశం ఉంది అని. అంటే ఏమిటి అని అడిగితే ఆయన అన్నారు - ఏ పని దానంతట అదే జరగాలో అవి చెయ్యాలనుకోవడం, ఏ పని వ్యక్తి తను విధిగా నిర్వర్తించాలో అవి దేవుడే చేస్తాడులే అని ఎదురు చూడ్డం ఇవి అనవసర వైరాగ్య లక్షణాలని ఆయన అన్నారు. ఇందులో చాలా అంతరార్ధం ఉందని తర్వాత తెలిసింది.

 మనో నిర్మలతాం యాతం శుభసంతానవారిభిః  
బ్రాహ్మీం దృష్టిముపాదత్తే రాగం శుక్ల పటో యధా
-యోగ వాశిష్టము (స్థితి ప్రకరణం)


తెల్లని వస్త్రము రంగును గ్రహించునట్లు, సమాధ్యభ్యాసాది శుభ గుణములను జలముచే నిర్మలత్వమును బొందిన మనస్సు బ్రహ్మ సంబంధమగు దృష్టిని పరిగ్రహించు చున్నది అని దీని అర్ధం చెపుతున్నారు. మహా మంత్ర బలం పొందడానికి సామాన్య సాధన కేవలం కొన్ని లక్షల మంత్ర జపమూ సరిపోదుట. మంత్ర జపంతో బాటు 'మన్ ' సంధించబడి ఉండాలి. మనస్సు లయం కాని మంత్రం శక్తి వంతం కాజాలదు, ఎందుకంటే అన్ని అనుభూతులకు ఆలోచనలకు అంతరంగమే రంగం కదా. తపస్వులు మహానుభావులు అన్ని రసాలని దేవత తత్వానికి అంకితం చేశారు. నిర్మల మనస్సుతో కృష్ణ తత్వాన్ని, హనుమంతుని శక్తిని, దేవి శక్తి మహతత్వాన్ని మంత్రాలుగా, కీర్తనలుగా, పద్యాలుగా ఎంతో పొందుపరిచారు. ఇవన్ని తరతరాలకి సరిపడ అపురూప నిధిగా మనకి లభించాయి. దృశ్యకావ్యాలైన నాటకాలు, సినిమాలైనా కూడా మనకి దివ్యానుభూతిని అందించగలుగుతున్నాయి. భక్తిపరవశంతో అనేక సార్లు కళ్ళు చెమర్చే అనుభూతిని పొందకపోతే జీవితానికర్ధమేముంది అనిపిస్తుంది.

చాలా సార్లు మనం పూజ చేసేటప్పుడు దేవుడిని లేక దేవతని ఆహ్వానిస్తాం. అక్షింతలు, షోడశోపచార పూజా సామగ్రితో సిద్ధంగా ఉంటాం. కాని నిజంగా దేవుడు వస్తాడు అని మాత్రం సిద్ధంగా ఉండం. లాంఛనంగా పిలుస్తాం. 'శ్రీ కనక దుర్గా దేవతాం ఆవాహయామి ' అన్న వెంటనే ఆమె రావచ్చు. వచ్చి మన్ని చూస్తూ ఉండి ఉండ వచ్చు అని మనకి అనిపించదు. ఆవాహన చేసి ఒక్కో సారి మరీ మామూలు వ్యవహారాలు మాట్లాడ్డంలోనో, పిల్లల్ని తిట్టడంలోనో మనం ఉంటే ఆ దివ్యశక్తి ఆవాహన చేసిన ఫలితం రావడం ఎలా? మనింట్లో టీ.వీ. ని కరంటుతో కనెక్ట్ చేశాక టీ.వీ. ని కూడా ఆన్ చేసి ఛానల్ పెట్టకపోతే ప్రోగ్రాం ఎలా వస్తుంది? ఆవహన చేసిన మనమే ఆ దేవత వచ్చిందని నమ్మక పోతే మన భక్తికి విలువేంటి? ఆ దేవత మననెలా నమ్ముతుంది? పూజలో ఆవాహన చేసిన వెంటనే ఎంతమంది భావిస్తున్నారు ఆ దివ్య శక్తి వచ్చిందని? ఎంత మంది నమస్కరిస్తున్నారు కనీసం మనసులో అయినా? ఎన్ని పూజలు అవుతున్నాయి - ఎవరినీ నిందించకుండా? ఎంతమంది చేయగలుగుతున్నారు నిజమైన పూజని లేక వ్రతాన్ని - అదీ ఒక పార్టీ లా కాకుండా? వీటికి వచ్చే సమాధానాలు నిజ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రజల్లో మనకి లోపాయకారిగా మాటలు కాకుండా నిజంగానే ఆధ్యాత్మిక చింత పెరిగింది. చాలా మంది దీన్ని పాపభీతి అని తమ గొప్ప దనాన్ని కొంచెం ఇవతలగానూ, ఇతరులని తక్కువ చేయడం చేయకుండ ఉన్న ముహుర్తంలో ఆలోచిస్తే నిజంగా పూర్వం రోజుల్లో కన్నా మనిషికి తనని గురించి తనకి శ్రద్ధ పెరిగింది. చాలా మందికి (మనకి తెలిసిన వాళ్ళలో కనీసం) దారిద్ర్యం లేదు. అప్పులు అందరికి ఉన్నాయి - దాన్నే గర్వంగా ఋణ చరిత్ర (క్రేడిట్ హిస్టరీ) అని పిలుస్తారు. అది పక్కన పెడితే ఈరోజు అవకాశాలు, ప్రతిభకి తొట్పడే దాతలు ఈ ప్రపంచంలో తక్కువున్నారు అంటే మనం నమ్మలేం. నిజంగా చెప్పండి మీ పూర్వీకుల కన్నా మీరు మంచి స్థితిలోనే ఉన్నారా లేదా? భౌతిక అవసరాలు - తిండి, గుడ్డ, ఇల్లు వచ్చాక మనిషికి కొన్ని మౌలిక ప్రశ్నలు ఉదయిస్తాయి. తను ఇంకా వృద్ధి చెందగలను అని.  అది అయ్యాక తను ఎవరు? ఎక్కడికి వెడుతున్నాను అని. ఈ అన్వేషణకి ఈరోజు అనేక అధ్యాత్మిక మార్గాలు దొరుకుతున్నాయి. పది సంవత్సరాల క్రితం ఎక్కడో ఉత్తర భారతంలో ఎక్కడో ఉన్న గురువుల వద్ద మాత్రమే దొరికే మంత్రాలు, మీ ఇంట్లో గూగిల్ చేసి మీరు తెలుసుకో వచ్చు. అది ఎలా సాధన చెయ్యాలి అర్ధం ఏమిటి ఇలాంటివన్నీ ఈరోజు మంచి గురువులకి (హిమాలయాల్లో కూడా సెల్ ఫోన్లు వచ్చాయి) ఫోన్ చేసి సందేహ నివృత్తి చేసుకోవచ్చును. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఊరికి దాదాపు యోగ కేంద్రాలు వచ్చేస్తున్నాయి. ఏమిటిదంతా? సృష్టి ప్రణాళికలో మనమొక అంతర్భాగం అయితే మనమూ కొంత మంచి చెయ్యగలం.

మంత్ర శాస్త్రంలో ఒక విశేషమైన మంత్రం.  కార్తవీర్యార్జున మంత్రం. చిత్రమేమంటే ఎవరైన ఏదైనా వస్తువుని కోల్పోతే ఈ మంత్రం చేస్తే వెంటనే దొరుకుతుందని ప్రతీతి. ఇంట్లోంచి వెళ్ళిన వారు వెనక్కి రావడం, వీసాలు అవీ త్వరగా రావడం మొదలైన వాటిలో ఈ మంత్రానికో ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగం దొరకడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి కూడా ఈ సాధనని ఉపయోగిస్తారు. గురుముఖతః ఈ సాధనని తెలుసుకో వచ్చు. చిన్న పరిచయంగా ఈ మంత్ర సాధన గురించి, అసలు మంత్ర సాధనకి కావలసిన విషయాలు, విశ్లేషణతో ఆంగ్లంలో ఒక చిన్న ఈ-పుస్తకం ఈ వ్యాసానికి జతపరుస్తున్నాం. చదివి, ఆసక్తిపరులచే చదివించగలరని, ఆనందిస్తారని ఆశిస్తున్నాం.

శ్రీ గురుభ్యో నమః

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech