మహానుభావులు - ఎనిమిది పదులపాట అనసూయాదేవి

 

                                                                                  - చీకోలు సుందరయ్య

 
 

'కొయ్యోడు' పాటని పాతతరం వాళ్లలో విననివారుండరు. ఆ పాటని వాళ్లు జానపదంగా ఆనందించారు. ఎవరీ అమ్మాయి చాలా బాగా పాడుతోందే అని రేడియోలో, హెచ్.ఎం.వి. రికార్డులో విని ఆనందించారు. చాలా చిన్నమ్మాయే అయినా ఏమాత్రం బెరుకులేకుండా పాడడం... ఆ పాటతోనే ఆపేయక అలా అనేక గీతాల్ని సేకరించి, వాటికి జానపదులు పాడుకొనే బాణీలేమిటో అర్థం చేసుకొని, తిరిగి వాటిని సంస్కరించి పాడటం తన కర్తవ్యంగా ఎంచుకొన్నారు. అప్పుడామెకి తెలియదు తానొకనాటికి ఓ చరిత్ర సృష్టిస్తాననీ! తెలిసో, తెలియకో చేసినా ఈనాడు జానపద సంగీతాన్ని తరగని ఆస్తిగా తెలుగువారికి అందించిన ఘనతను మాత్రం తన కొంగున కట్టేసుకున్నారు రాష్ట్రమంతా సుపరిచయమైన వింజమూరి సోదరీమణుల్లో ఒకరైన వింజమూరి అనసూయాదేవి!
'
వింజమూరు' అనగానే కృష్ణశాస్త్రి కూడా గుర్తుకొస్తారు. భావకవితా పితామహుడు దేవులపల్లి వింజమూరి అనసూయాదేవికి స్వయానా మేనమామ మరి! తొమ్మిదోయేటే ఆయన గీతాలకు బాణీలు కూర్చిన గడుగ్గాయి ఆమె! ఎనిమిదో ఏటకే పాడి, హెచ్.ఎం.వి. వంటి ప్రసిద్ధ సంస్థ సత్కారం పొందిన బాలమేధావి అనసూయాదేవి. 'బ్రతుకుల్లో, భావాల్లో, సంగీతంలో కూడా ఏదో నూతనత్వం తీసుకురావాలని, కొత్తదనం కనపరచాలని తాపత్రయ పడ్డాను' అనే ఆమె కొన్ని నెలల కిత్రం హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ''నేనూ - నారచనలు'' అనే పుస్తకాన్ని ఆవిష్కరింపచేశారు. ప్రవాసాంధ్రులతో కలిసొచ్చి ఈ ఆంధ్రులతో ముచ్చటలాడారు. 1920లో వి.వి.యల్.నరసింహారావు, వెంకటరత్నమ్మలకు జన్మించిన అనసూయాదేవి... పేరుతోనే వెంకటరత్నమ్మ 'అనసూయ' అనే పత్రికను కూడా నడిపారు. అయితే వెంకటరత్నమ్మ ఆ పత్రికను అనసూయాదేవి పుట్టక ముందు అంటే 1914 నుంచి 1920 వరకు అంటే ఆమె పుట్టేంతవరకూ నడపడం విశేషం.
ఉదయకాలమందు ధరణియు జలనిధియు
నినుని కాంతికి ప్రతిఫలమిచ్చునపుడు
ఇలు విడిచి కడు నుత్సాహ హృదయనగుచు
బ్రేమరాజ్యము న్వెదుకంగ వెడలియుంటి
వంటి ఎన్నో శీర్షికలను ''గృహలక్ష్మి'' పత్రికలో ప్రచురించిన తల్లివారసత్వాన్ని సంగీత రంగంలో నిజం చేశారు అనసూయాదేవి. పిఠాపురం, కాకినాడ, మద్రాసు, హైదరాబాదు, అమెరికా... ఇలా సాగింది అనసూయాదేవి ప్రస్థానం. ఐదో యేట శాస్త్రీయ సంగీతంలో ''లంబోదరలకుమికర'' అంటూ సరిగమ పదనిసల వాక్‌చిత్రాల స్వరూపాన్ని మనసులో ముద్రించుకొన్న అనసూయాదేవి తన సోదరి సీతతో కలసి తన సంగీత విద్యను ప్రదర్శించే చిన్ని అవకాశాన్ని కూడా పోగొట్టుకోలేదు. అప్పటివరకు పీఠికాపురాస్థానం మర్యాదలు, గౌరవాలు అందుకొంటూ నాలుగ్గోడలమధ్యే ఉండిపోయిన నారీజనాన్ని కాదని అనసూయాదేవి తన పాటని పదిమందిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో వంగ సంగీతానికి, కర్ణాటక సంగీతానికి మాత్రమే ఆదరణ ఉండేది. జానపద గీతాలు ఉన్నత కులాలవారు పాడడం అనేది లేదు! ఆ సంప్రదాయాన్ని తోసిపుచ్చారు అనసూయాదేవి. కాంగ్రెస్ మహాసభలు జరిగినపుడు, దేవులపల్లి తదితరులు విద్వత్సభలు జరిగినపుడు పాటకచేరీ వీరిదే. పైగా ఆ కాలంలో బ్రహ్మసమాజం ఊపందుకొంటూ ఉండేది. సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమాలు... వెరసి వాతావరణం అంతా నిత్యమూ సభలు, హర్తాళ్లు, పాదయాత్రలమయంగా ఉండేది. చిన్నారి అనసూయాదేవికి పాడే అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. 1938 ప్రాంతాల్లో మద్రాసు ఆకాశవాణి జానపద సంగీతాన్ని పరిచయం చేయడం ప్రారంభించింది. ఇంకేముంది... అనసూయాదేవి పాటకి మద్రాసు నగరం వెళ్లక తప్పలేదు. అక్కడికెళ్లాక ఆకాశవాణిలో సంగీత నిర్దేశకురాలయ్యారు. దేవులపల్లి, బాలాంత్రపు రజనీకాంతరావు... మరోవైపు సినిమాలు ఆమెను ఊపిరి తీసుకోనివ్వలేదు. పాటల్ని చిరునామాగా చేసుకొని ఆమె ఎదిగారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో సినిమా పాటకి సంగీతం సమకూర్చే ఘనత ఆమెకే దక్కింది. 'మల్లీశ్వరి' చిత్రంలో పాటల్నీ మేనమామ దేవులపల్లివే. ''మనసున మల్లెల మాల లూగెనే'', ''పిలిచినా బిగువటరా'' వంటి గీతాలకు స్వరాలు తానే సమకూర్చానని ఆమె తన స్వీయచరిత్రలో రాసుకొన్నారు. అలాగే ''బంగారుపాప'' చిత్రంలో ఆరు పాటలకు ఆమె స్వరం కూర్చారు. అయితే ఆమె పేరు ఎక్కడా కనిపించదు. అదొక చేదు అనుభవంగానే భావించారామె.


ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ సభ్యురాలుగా జానపద సంగీత, సాహిత్యాల కోసం ఎంతో కృషిచేశారు. ''భావగీతాలు, జానపద గేయాలు, పెళ్లిపాటలు, సంప్రదాయపు పాటలు, పండుగల పాటలు... ఇలా ఎన్నో సందర్భాలకు తగిన గీతాల్ని సేకరించి... వాటిని పుస్తకం రూపంలో తెచ్చారు. ఆమె జానపద సంగీతానికి, సాహిత్యానికి చేసిన కృషిని గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో థియేటర్ ఆర్ట్స్‌లో సభ్యత్వమిచ్చి గౌరవ డాక్టరేట్‌తోనూ సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ కళాసరస్వతి బిరుదుతో సత్కరించింది. ఆమె 'బొమ్మలాట' అనే తెలుగు సినిమాకు, ''మహాత్మా కబీర్'' అనే కన్నడ సినిమాకు సంగీతం సమకూర్చారు. జానపదగీతాల క్యాసెట్లు, గ్రామఫోను రికార్డులు ఎన్నోతెచ్చారు. అమెరికా, ఐరోపాలలో విస్తృతంగా పర్యటించారు. 'రత్నపాప' వంటి ఆణిముత్యాన్ని నృత్యరంగానికి కానుకగా ఇచ్చారు. దేశ సరిహద్దుల ఆవల అమెరికాలో ఆమె ప్రఖ్యాత నర్తకిగా ఇప్పటికి పాతికేళ్ల క్రితమే ఎంతో గుర్తింపు పొందారు. టెక్సాస్ రాష్ట్రమనగానే ప్రవాసాంధ్రులకి రత్నపాపే గుర్తుకొస్తారు. కూతురు సాధించిన విజయాల్ని చూసి ఆనందించే అనసూయాదేవి తన చిన్నతనాన్ని గుర్తుచేసుకొంటే మాత్రం - ''నా చిన్నతనంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెండెడ్ల బండి మీద షికారుచేస్తూ చుట్టూ వరిచేలల్లో పనిచేసేవాళ్లు పాడే నాట్ల పాటలు, కలుపుల పాటలు, కోతల పాటలు, ఉప్పుటేరు దగ్గర పడవలవాళ్లు పడవలు లాగుతూ పాడే పాటలూ అన్నీ ఎంతో యిష్టంగా చెవులువిప్పి వినేదాన్ని. వినీ వినీ వాటిని పాడుకునేదాన్ని''... ఇటువంటి ఎన్నో అనుభవాలు ఆమె రాసిన ''నేనూ - నా రచనలు''లో కనిపిస్తాయి. జానపద సంగీతానికి చిరునామా... ఈ వింజమూరి అనసూయాదేవి... డా... అవసరాల అనసూయాదేవి.
-
చీకోలు సుందరయ్య

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech