జగమంత కుటుంబం

పిల్లల పెంపకం

- సద్గురు జగ్గీవాసుదేవ్ యోగి   


 


ఒక శిశువు తమ జీవితంలోకి ప్రవేశించగానే, చాలామంది ఇక తాము బోధించే సమయం వచ్చిందని అనుకుంటారు. అసలు ఒక శిశువు మీ జీవితంలోకి ప్రవేశిస్తే, మీరు మఱచిపోయిన జీవితాన్ని తిరిగి నేర్చుకునే సమయం వచ్చినట్లు అర్ధం. ప్రస్తుతం మీరొక చెక్క బొమ్మలాగా అయిపోయారు. ఇప్పుడు ఈ బుజ్జి ఆనందాల మూట మీ జీవితంలోకి ప్రవేశించింది. ఇక తెలీకుండానే మీరు నవ్వడం మొదలుపెట్టారు, పాడటం మొదలుపెట్టారు. సోఫాల క్రింద పాపాయితో బాటు పాకసాగారు. మీ పాపాయి వల్లనే, జీవితం జీవితంలాగా ఉంది. అంతేగాని మీ వల్ల కాదు. జీవితం విషయంలో, మిమ్మల్ని మీ పాపాయిని పోల్చిచూద్దాం. 24 గంటల్లో ఎవరు ఎక్కువ ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు? మీ పాపాయి, అవునా! మరి జీవితం గురించి ఎవరిని సంప్రదించాలి? మీ పాపాయిని! కాబట్టి అది మీరు జీవితాన్ని నేర్చుకునే సమయం. జీవితాన్ని బోధించే సమయం కాదు.

ఆందోళన, కోపం, భయం, ఆదుర్దా, అసూయ వీటిపై ప్రతిరోజూ మీ ఇంట్లో ఒక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. మీ పిల్లవాని ముందు ఈ విషయాలే ప్రదర్శించబడుతూ ఉంటాయి. అతడు అవే నేర్చుకుంటాడు. మీ పిల్లవాణ్ణి చక్కగా పెంచాలనే ఉద్దేశ్యం మీకు నిజంగా ఉంటే, మీ అనవసరపు సోదినంతా వాళ్ళకు బోధించవద్దు. ముందు మీరు మీ తీరును మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు పరివర్తనం చేసుకోలేని అసమర్ధులైతే, ఇక మీ పిల్లవాణ్ణి పెంచటం అనే ప్రశ్నకు తావెక్కడిది?

మీ పిల్లవాడిని మీరు పెంచే అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఇంట్లో ప్రేమ,ఆదరణతో నిండిన వాతావరణాన్ని కల్పించడమే. పిల్లలు తమంత తాము ఆనంద సాగరాలు, ఆనందపు సారధులు. మీ పిల్లలకు కేవలం కోపం, విసుగు, వ్యధ అనేవి ఏమిటో తెలియకుండా చూసుకోండి. ఇల్లు ప్రేమతో, ఉల్లాసంతోనిండి ఉండేలా చూడండి. మీ పిల్లవాని చుట్టూ ఒక ప్రేమ పూర్వకమైన వాతావరణాన్ని సృష్టించండి. ఇకవారుచక్కగా పెరుగుతారు. ఇది మీ తోటలో ఒక మొక్కను పెంచడం వంటిదే. వాతావరణం సరిగ్గా ఉండేటట్లు మీరు చూసుకుంటే చాలు. మొక్క తన సంపూర్ణ సామర్ధ్యంతో పెరుగుతుంది. ప్రతిరోజూ, అదే పనిగా మీరు దాని జోలికి పోతూ ఉంటే కనుక, అది పెరగనే పెరగదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, వాళ్ళు ఉల్లాసవంతంగా జీవించగలగాలి. ఆ రకంగా వాళ్ళను పెంచండి.

పిల్లవాణ్ణి ప్రేమ పూర్వకంగా పెంచడం అంటే అతనికి అడిగినదల్లా ఇవ్వడమే అని చాలా మంది అర్ధం చేసుకుంటారు. మీరు మీ పిల్లవాడిని తెలివితో గమనించి చూస్తే, అతడు అడిగినదల్లా తెచ్చిఇవ్వడం ఒట్టి మూర్ఖత్వమే అని మీకు తెలుస్తుంది. దానికిమీరు ప్రేమ అని పేరు పెట్టారు. కాని అది అతి గారాబం అని గ్రహిస్తారు.

ప్రతి పిల్లవాడికీ జీవితాన్ని పూర్తిగా జీవించడానికి తగిన తెలివితేటలు ఉన్నాయి. మీ పిల్లలు స్వతహాగా మీ పిల్లల మీద పెద్దగా ఉండకూడదు, అదొక్కటే మీ పని. మీ ఉద్దేశ్యంలో తెలివి అంటే మీ పిల్లవాడు డాక్టర్ కావడమే. అసలు వాడు మంచి వడ్రంగి అయ్యేవాడేమో, కాని మీరు మాత్రం వాడు డాక్టరు కావాలనే కోరుకుంటారు. ఈ దేశానికి డాక్టర్లు చాలా అవసరమనో లేక సమాజంలోని ప్రజలు పడుతున్న బాధలవల్ల మీకున్న స్పందనతోనో వాడు డాక్టరు కావాలని మీరనుకోవడం లేదు, వాడు డాక్టరు కావాలనుకోవడం కేవలం మీ మనసులోని ఒక పిచ్చి ఆలోచన. ప్రస్తుత సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, కావడం అంటే ప్రతిష్ట. నా కొడుకు డాక్టర్ అని మీరు చెప్పుకోవాలనుకుంటారు. మీరు మీ జీవితాన్ని మీ పిల్లల ద్వారా జీవించాలనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా వారిని నాశనం చేసే విధానమే.

జీవితంలో మీరు చేసిందే మీ పిల్లలు చేయాలని లేదు. మీరు మీ జీవితంలో ఊహించడానికి కూడా సాహసించని వాటిని మీ పిల్లలు చేసి చూపాలి. మీరు ఆలోచన చేయడానికి కూడా భయపడే వాటిని మీ పిల్లలు చెయ్యాలి. అప్పుడే ఈ ప్రపంచం ప్రగతి పథాన నడుస్తుంది. ఉత్తమమైనదేదో అదే జరుగుతుంది.


శ్రీ సద్గురు అక్టోబర్, 2013 - 11, 12, 13 తేదీలలో (మూడు రోజులు) San Mateo County Event Center లో Inner Engineering అను శిక్షణ నిర్వహిస్తున్నరని Isha సంస్థ తెలియజేస్తున్నది. మరిన్ని వివరాలకు http://www.innerengineering.com సందర్శించండి.

 


 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)