Sujanaranjani
           
  కబుర్లు  
  వీక్ పాయింట్
         కుడితిలో బల్లి  
 

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 
 

విప్లవం తెస్తానన్న వాడు పార్టీని తెచ్చాడు. దొంగలను పడతానని బయలుదేరినవాడు దొంగల ముఠాలో చేరిపోయాడు. అన్నీ తెలిసిన అన్నా సాహెబ్‌గారు తొందరపడి రాజకీయుల్లో కలిశాడు.
కొండ మన దగ్గరికి రానప్పుడు మనమే కొండ దగ్గరికి పోదాం. పార్టీలు మన దారికి రానప్పుడు మనమే రాజకీయ పార్టీల దారికి వెళదాం. ప్రభుత్వం అవినీతిని అణచబోవటం లేదని అర్థమైనప్పుడు అవినీతిని అణచాలన్న ఆందోళననే ఏకంగా ఎత్తేద్దాం అని అన్నా హజారే తాజా థియరీ!
అపరగాంధీ అన్నాజీకి తెలిసిన ఏకైక విద్య అన్నం మాని పంతం పట్టటం. ఆ కళను జాతీయ రంగం మీద ప్రదర్శించి, లోక్‌పాల్ కోసం పదహారు నెలల కింద శంఖం ఊదితే ఓపెనింగ్సు అదిరాయి. అవినీతిని తెగవేసి సమాజాన్ని కడిగేసేందుకు మహాత్ముడు మళ్లీ వచ్చిన లెవెల్లో మీడియావారు బిల్డప్ ఇచ్చారు. టీవీలవాళ్లు కొట్టిన గాలితో, చేసిన స్పెషలెఫెక్టులతో అన్నా అండ్ కోకు కళ్లు నెత్తికెక్కాయి. మొత్తం దేశం తమవెంటే ఉన్నదనీ, సర్వసత్తాకమైన పార్లమెంటు సైతం తాము ఏమి చెబితే అది చచ్చినట్టు చేసి తీరవలసిందేననీ... ప్రభుత్వమూ, పార్టీలూ తాము ఆడించినట్టల్లా ఆడవలసిందేననీ అహంకారం అతిశయించింది. బతకనేర్చిన పార్టీలు, సర్కారు కూడా అప్పటి గాలివాలును గమనించి, అన్నాజీని ఉబకేసి, అంతా తమరు కోరినట్టే జరుగుతుందంటూ నాటకమాడి, దీక్ష నుంచి లేపడంతో తొలి ఘట్టం సుఖాంతమైంది.
తాడూ బొంగరం లేని అన్నా టీముకు ‘సివిల్ సొసైటీ’ అని పెద్ద పేరు పెట్టి లోక్‌పాల్ బిల్లు డ్రాఫ్టింగు పనిలో పీటవేసినట్టే వేసి, తెలివి మీరిన సర్కారు వారు కళ్లూ, పళ్లూ లేని బిల్లును ఇంకోసారి పార్లమెంటులో గజ్జె కట్టించారు. స్టాండింగు కమిటీ అతుకులతో కొంగొత్త బిల్లును ఈ చేత్తో లోక్‌సభలో పాసు చేయించి, ఆ చేత్తో రాజ్యసభలో అడ్డం కొట్టారు. పాలక పక్షమూ, ప్రతిపక్షమూ కుమ్మక్కయి ఆడుతున్న నాటకం ఎప్పటికి తెములుతుందో, ఈ లోపు లోక్‌సభకే ఆయువు తీరుతుందేమో రాజకీయ వెండితెరమీద తిలకించాలి.
నిరుడు ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా అన్నా బృందం నాలుగుమార్లు నిరవధికంగానూ, నాలుగుసార్లు ఒక్కరోజు కోసమూ అన్నం మానింది. అయినా ఏలినవారికి చీమకుట్టినట్టయినా లేదు. లేటెస్టుగా జంతర్‌మంతర్‌లో మారథాన్ దీక్షకు కూచుని బ్రహ్మాండం బద్దలు కొట్టబోతే పదిరోజులు గడిచినా పట్టించుకున్న దిక్కులేదు. దాంతో అన్నాజీకి చిర్రెత్తి, ఇక ఫాస్టులెందుకు? టైమ్ వేస్టు! అవినీతిపై ప్రభుత్వం కదిలేట్టు లేదు కనుక మనం వేరేదారి పడదాం. 2014లో ఎన్నికలొస్తున్నాయి కాబట్టి జనానికి రాజకీయ ప్రత్నామ్నాయం చూపించి, మంచి వాళ్లను పార్లమెంటుకు పంపిద్దాం - అంటూ గాంధీ టోపీలోంచి పార్టీ కుందేలును బయటపెట్టాడు!
ఆందోళనను ప్రభువులు పట్టించుకోకపోతే ఆందోళనను ఇంకా ఉద్ధృతం చెయ్యాలి. గ్రామ గ్రామానికీ చొచ్చుకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్ని వివరించి, జనాన్ని సమీకరించి ఇంకా పెద్ద ఉద్యమం తేవాలి. అది వదిలేసి... గవర్నమెంటు ఖాతరుచెయ్యలేదని అలిగి ఉద్యమాన్ని ఎత్తేయడమేమిటి? రాజకీయ అవినీతిని కడిగేస్తానని పలికి అదే రాజకీయ రొచ్చులో తామూ కాలు మోపడమేమిటి?
ఉద్యమ సంస్థ రాజకీయ పార్టీగా మారటం తప్పుకాదు. అన్నా హజారే ఉద్యమ దుకాణం కూడా దేశమంతటా విస్తరించి, జనాన్ని బ్రహ్మాండంగా కదిలించి ఉంటే... ఈ పార్టీలను నమ్ముకుని లాభం లేదు; మీరే పార్టీ పెట్టి మీ పద్ధతిలో మమ్మల్ని ఉద్ధరించండని అశేష ప్రజానీకం అన్నాను వేడుకుని ఉంటే... వారిని దయ తలిచి హజారే సారు వారికి పార్టీని ప్రసాదించారంటే అర్థం ఉంది.
అన్నా బృందం దీక్షల తమాషాను ప్రభుత్వమూ, పార్టీలే కాదు... ప్రజలు కూడా పట్టించుకోవటం మానేశారు. తాజా దీక్షాయణానికి జనాదరణ బొత్తిగా లేక మైదానం బావురుమంది. రాజధానిలో ఆర్భాటంగా ప్రచారం జరిగిన నిరాహార దీక్షా శిబిరానికే జనాన్ని రప్పించలేకపోయినవారు దేశం మారుమూల ప్రాంతాల ప్రజలను పార్టీ పేర ఎలా కదిలించగలరు? ‘నేను పోతే మజ్జిగ నీళ్లకు గతిలేదు కాని - నా పేర చీటీ పోతే పెరుగు పంపుతారు’ అన్నట్టు - ‘నేను అన్నం మాని దీక్షపడితే పదిమందిరారు గాని నా తరఫున పార్టీ పెడితే కోట్ల మంది ఓట్లు వేస్తారు’ అనే అన్నా కోతలను ఎవరు నమ్ముతారు?
దేశంలో ఏ పార్టీ జనం ఆ పార్టీకి ఉన్నారు. ఏ పార్టీకి చెందని జనం... పార్టీలకు అతీతంగా మేలు జరగాలని కోరే జనం ఒక దశలో అన్నాను అభిమానించారు. ఆయన బృందం తిక్కలు చూసి వారిలో చాలామందికి ఇప్పటికే రోత పుట్టింది. ఏకంగా పార్టీ దుకాణమే పెట్టాక మిగిలిన వాళ్లూ జారుకుంటారు. జంతర్ మంతర్‌లో పదిరోజులపాటు అన్నా వెంట ఉన్న అభిమానుల్లో కొందరైతే పార్టీ పెడతామనే ప్రకటన వినగానే అన్నా పోస్టర్లను అక్కడే తగలేసి, తిట్టుకుంటూ వెళ్లిపోయారు. పైకి తేలకపోయినా మిగిలినవాళ్ల కడుపులోనూ అదే మంట. రాజకీయ అభిప్రాయాలు, పార్టీ విధేయతలు పక్కనపెట్టి అవినీతిపై పోరాటంలో చాలామంది ఇంతదాకా అన్నా వైపు ఆకర్షితులయ్యారు. పోరాటాన్ని మాని సొంత పార్టీ పెట్టుకున్నాక ఆ అభిమానులు ఎవరి పార్టీకి వారు తిరిగి పోతారే తప్ప అన్నా పార్టీలో చేరరు.
పార్టీ పెట్టి ఎన్నికలను గెలవటం టీవీ కెమెరాల ముందు ప్రతిజ్ఞలు చేయటం కాదు; ప్రగల్భాలు పలకటమూ కాదు. టీవీ చానెళ్లలో ఎస్.ఎం.ఎస్.ల ద్వారా వెర్రిజనం మద్దతు రాబట్టటానికీ, జనం దగ్గరికి వెళ్లి, నమ్మకం కలిగించి, ఓట్లు సంపాదించటానికీ చాలా తేడా ఉంది. టీవీ యాంకర్లు ఎన్నికల అధికారులై, ఎస్.ఎం.ఎస్.ల ద్వారా ఓట్లు పొందే ఏర్పాటు ఉంటే బాగానే ఉండును కాని టీమ్ అన్నాకు ఆ చాన్సు లేదు. ఇంతకు ముందు ఆంధ్రాలో జె.పి. అనే ఓ పెద్ద మనిషి సమాజాన్ని ఉద్ధరిస్తానని ఇలాగే పెద్ద కబుర్లు చెప్పి, చివరికి రాజకీయ గుంపులో గోవిందా అన్నాడు. పార్టీకి తానే పెద్దనని ప్రకటించుకుని అసెంబ్లీలో కనీసం తన ఒక్కడి సీటునైనా ఆయన గెలుచుకోగలిగాడు. అన్నాగారికి ఆ యోగంకూడా లేదు. ప్రేరణ తనదే అయనా పుట్టబోయే పార్టీలో తానుండనని చెప్పాడు కనుక కనీసం ఒక్క సీటైనా ఆ పార్టీకి దక్కే ఆశలేదు. ఆయన టీములో మిగతావాళ్లకు కనీసం వారి వీధిలో ని వాళ్లయనా ఓట్లేస్తే గొప్పే! అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయ రాజకీయ కుడితిలో పడటం జనానికి ఉచిత వినోదమే!

 
     
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech