ముఖపత్రం    
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 9

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యాలు

 

                                             పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

 

15-వ శతాబ్ది పూర్వోత్తరార్ధాలలో సాక్షాద్భగవదవతారమూర్తులై విరాజిల్లి తెలుగు సాహిత్యాన్ని నిరుపమాన దేదీప్యమానం చేసిన మహాత్మకవులు శ్రీనాథ – పోతనలకు సాంయుగీనుడై, సరస్వతీపాదపద్మారాధకుడై సొంత గొంతుకను సవరించుకొని, స్వీయవ్యక్తిత్వాన్ని సంతరించుకొని,వాణి నా రాణి” అని అఖర్వగర్వపూర్వకంగా ప్రకటించి, తాలోత్తాలమూర్తియై “బహురూపకావ్యనిర్మాణనిపుణుఁ డగుచు, నుతిఁగాంచె సకలదిగంతరములఁ, గుకవిజనగర్వతిమిరసంకోచకృత్ప్ర, భాతరవి యైన పినవీరభద్రసుకవి” అని పొగడ్తకెక్కిన వరేణ్యకవితల్లజుడు శ్రీ పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు. దర్శనాంతసాహిత్యదీక్షాదక్షుడై, పాదుకాంత నితాంత పూజాపరాయణుడై పంచాక్షరీవర్ణకిర్మీరితమైన సువర్ణమేరుఘంటాన్ని శ్రీ పరమేశ్వరనామసూత్రితమైన పవిత్ర మంత్రోదకంలో ముంచి తన కుశలకరాంగుళులతో అనర్ఘకావ్యరత్నాలను తీర్చిదిద్దిన పుంభావసరస్వతి. భువనభాసురమహాకృతినిర్మాతలైన మహనీయకవయితలకు జన్మస్థానమైన పిల్లలమఱ్ఱి వారింట జన్మించిన చరితార్థజీవనుడు.

      పాఠకలోకానికి సుపరిచితుడైన ఆ పంక్తిపావనుని సాహిత్యిక చారిత్రిక జీవిత విశేషాలను అధికరించిన కొన్ని సరిక్రొత్త వివరాలను ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.   

పిల్లఱ్ఱి ఇంటిపేరు : వంవులు  

      పినవీరభద్రకవి శాకుంతల శృంగారకావ్యము లోనూ, జైమిని భారతములోనూ “పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవిప్రణీతం బైన” అని చెప్పికొన్న గ్రంథాశ్వాసాంత గద్యలను బట్టి  ఆయన ఇంటిపేరు “పిల్లలమఱ్ఱి” వారని తెలుస్తున్నది.

      ఈ పిల్లలమఱ్ఱి వారిల్లు తరతరాలుగా కవి-పండితులకు నిలయం. జైమిని భారతము అవతారిక (1-21)లో కృతిభర్త సాళువ నరసింహరాయలు –

      “క.  తాతయుఁ, దండ్రియు, నగ్ర

              భ్రాతయునుం, దాను భువనభాసుర కృతిని

              ర్మాతలు; పిల్లలమఱ్ఱి వి

              ఖ్యాతునిఁ బినవీరుఁ బోలగలరే సుకవుల్.”  

అని పినవీరనను ప్రశంసించాడు. అయితే, నిండుసభలో ఆనాడు ఆ విధంగా జగత్ప్రసిద్ధకృతినిర్మాతలని రాజప్రశంసకు నోచుకొన్న పినవీరన తాత-తండ్రులు, అగ్రభ్రాత రచించిన ఆ భాసురకృతులేమిటో తెలియటం లేదు. సంకలనకృతులలో “పురుషార్థ సుధానిధి” కృతికర్తగా ప్రసిద్ధుడైన “పిల్లలమఱ్ఱి వీరయ్య” ఆ పెద్దలలో ఉన్నదీ లేనిదీ చరిత్రవేత్తలు నిశ్చయింపవలసి ఉన్నది.  

పిల్లఱ్ఱి వీయ్య : పురుషార్థసుధానిధి 

  

      1918లో బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రబంధ రత్నావళి అన్న పేరిట తంజావూరులో ఉన్న పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధ రత్నాకరము యొక్క వ్రాతప్రతిలో నుంచి తమకు నచ్చిన అముద్రితపద్యాలను; కాకినాడలోని ఆంధ్ర సారస్వతపరిషత్కార్యాలయంలో ఉన్న “ఉదాహరణ పద్యములు” అన్న ఒక సంకలనగ్రంథంలోని అముద్రితపద్యాలను సేకరించి, ఒక చక్కని సంకలనగ్రంథాన్ని ప్రకటించారు. అందులో “ఉదాహరణ పద్యములు” అన్న శీర్షికతోడి వ్రాతప్రతినుంచి గ్రహించినవి - “పిల్లలమఱ్ఱి వీరయ్య అనే కవి రచించిన పురుషార్థ సుధానిధి” లోనివి (చూ. 1976 నాటి పునర్ముద్రణ, పద్యము 453-4లు) రెండు పద్యాలు ఉన్నాయి.

   

   ఆ పద్యాలివి:

 

సీ.  కాశకర్పూరనీకాశఁగా భావింపఁ

                     గవితానిరూఢిఁ బ్రఖ్యాతి నెసఁగు

       యావకారుణదేహయష్టిఁ గాఁ జింతింప

                     మదకుంభియానంబు మరులు గొలుపు

       నీలజీమూతసన్నిభఁగా విలోకింప

                     సకలమాయాప్రపంచంబు నడఁచుఁ

       గనకచంపకధామ గౌరిఁగా శీలింప

                     నంహస్సమూహంబు సంహరించు

గీ.    శంభుదేవి విశాలాక్షి సదనుకంప

       యోగిజనసేవ్య యోగపయోదశంప

       శ్రీకరకటాక్షలేశరక్షితనిలింప

       ముజ్జగంబుల మొలిపించు మూలదుంప.

సీ.   భర్గభట్టారకు పర్యాయమూర్తికి

                     షాణ్మాతురుని కూర్మిజనకునకును

       మేషరాజము నెక్కు మేటిరౌతున కమ

                     రాధీశు పొరుగుదిశాధిపతికి

       హరిణవాహనుని నెయ్యపు సంగడీనికి

                     సామిధేనీప్రియస్వాంతునకును

       యాయజూకుల యిండ్ల యనుఁగుఁజుట్టమునకు

                      స్వాహాస్వధాప్రాణవల్లభునకు

గీ.    దండములు వెట్టెదము; మోడ్చెదము కరములు;

       సేవ యొనరించెదము; మమ్ముఁగావు; ప్రోవు;

       యాగవేదికి విచ్చేయు మారగింపఁ

       బ్రథమజన్ముల యింటి కల్పద్రుమంబ!

                           ప్రబంధ రత్నావళి (ప. 453, 454లు)     

వీటిలో మొదటి పద్యం కాశీపుణ్యక్షేత్రంలో కొలువుతీరిన విశాలాక్షిని సన్నుతిస్తున్నది. “కాశకర్పూరనీకాశఁగా భావింపఁ గవితానిరూఢిఁ బ్రఖ్యాతి నెసఁగు” అని కవి ఆ తల్లి సత్కవితాప్రసాదాన్ని అభివర్ణిస్తున్న దళం ఇది కథావతరణికలోని పద్యమై ఉండవచ్చునని వెల్లడిస్తున్నది.

 

రెండవది అగ్నిభట్టారక స్తోత్రం. కావ్యభాగంలోనిదై ఉంటుంది.

ఈ రెండు పద్యాల పోహళింపులోనూ శ్రీనాథ-పోతనల ముద్ర విస్పష్టంగా కానవస్తున్నది. సుకుమారమైన శయ్య, సుభగమైన రీతి, శ్రావ్యమైన శబ్దాలంకారం, సుప్రసన్నత ఉట్టిపడుతున్న మాధుర్యగుణం, ఆశుధారాశుద్ధి కావ్యరచనలో కవి సాధించిన పరిణతికి నిదర్శకంగా ఉన్నాయి. పదబంధాల తీరుతీయాలను బట్టి కవితారచన క్రీ.శ. 1475 నాటికి అనంతరీయమని చెప్పగలము. నన్నెచోడుని కళావిలాసములోని శైలితో కొంత పోలిక ఉన్నది.

ఈ “పురుషార్థ సుధానిధి” అన్నది అనువాదగ్రంథమైతే - సంస్కృతంలో ఆ పేరుతో విజయనగర మహాసామ్రాజ్య స్థాపనాచార్యులు మాధవ విద్యారణ్యుల వారి సుప్రసిద్ధమైన కృతి ఉన్నది. అందులో పైని పద్యంలో వలె శ్రీ పరమేశ్వరస్వరూపు డైన అగ్నిభట్టారకునికి ఉపచారపూర్వకావాహనరూపమై, మంత్రాత్మకమైన “భర్గభట్టారకు పర్యాయమూర్తికి” ఇత్యాదిరచితానికి మూలమని చెప్పదగిన సన్నివేశమేదీ లేదు. అయితే, పురుషార్థ సుధానిధిలో పురాణముల నుంచి గ్రహించిన ప్రాయశ్చిత్తవిధుల అధ్యాయంలోనూ, ఆదినే ఉన్న అగ్న్యాధానమంత్రాల అధ్యాయంలోనూ ఉన్న ఏదైనా శ్లోకాన్ని కవి పై విధంగా కవితాత్మకంగా మలుచుకొన్నాడేమో చెప్పలేము. “యాగవేదికి విచ్చేయు” మన్న ఆహూతి అగ్న్యాధానంలోనిది కాదని భావిస్తే, అందుకు ఆధారకల్పమైన భాగాన్ని కవి పురుషార్థ సుధానిధికి అనుబంధమైన మాధవ విద్యారణ్యులదే, యజ్ఞతంత్ర సుధానిధిలో నుంచి స్వీకరించి, ఇక్కడ సందర్భోచితంగా అనువర్తించుకొని ఉండవచ్చును. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలో పురుషార్థ సుధానిధి అన్న పేరుతోనే డి. 2470, 2471 సంఖ్యలు గల వేఱొక సంస్కృత కృతి వ్రాతప్రతులు రెండు ఉన్నాయి.  వాటిలోనూ పై సన్నివేశానికి తావలమైన భాగమేదీ కనబడలేదు. ఇంతకీ, పురుషార్థ సుధానిధి కర్త పిల్లలమఱ్ఱి వీరయ్య ఎవరో ప్రభాకరశాస్త్రి గారు ఉపోద్ఘాతంలో వ్రాయలేదు కనుక చర్చింపవలసి ఉన్నది.

 

లు :

      

1918లో ప్రబంధ రత్నావళిని ప్రకటించేందుకు మునుపే, 1914లో శ్రీ ప్రభాకరశాస్త్రి గారు చాటుపద్యమణిమంజరిలో (చూ. 1988 పునర్ముద్రణ: ప. 106-119లు) “నవరత్నములు” అన్న శీర్షిక క్రింద “గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అన్న మకుటంతో ఉన్న తొమ్మిది పద్యాలను; అదే మకుటంతో “సప్తాంగ పద్ధతి” అన్న శీర్షిక క్రింద ఉన్న ఐదు పద్యాలను – మొత్తం పధ్నాలుగు పద్యాలను – కర్తృనామవిరహితంగా, చెన్నపురి ప్రాచ్యలిఖితగ్రంథాలయంలోని వ్రాతప్రతులలో తమకు దొరికినవాటిని యథాయోగ్యంగా పరిష్కరించి ప్రకటించారు. ఆ రాజనీతి పద్యావళి “గ్రంథకర్త పినవీరభద్రుడు కాదగును” (పు. 39) అని అభిప్రాయపడ్డారు. ఆ రెండు రచనల విశేషాలివి:

 

౧)  నత్న ద్యములు :  

ఇవి “గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అన్న మకుటంతో ఉన్న “నవరత్న పద్యాలు.” మొత్తం తొమ్మిది. చూడగా ఏదో పురుషార్థసుధానిధి వంటి ఒక ఉపదేశగ్రంథానికి అనువాదాల వలె లేవు. సంస్కృతంలోని సుప్రసిద్ధమైన సుభాషితశ్లోకాల నుంచి కవి తనకు నచ్చిన కొన్ని కొన్నింటిని ఎన్నుకొని, వాటిని సామాన్య రాజనీతి ప్రసక్తాలుగా మలిచినట్లు కనబడుతుంది. ఈ సుభాషితశ్లోకాలలో అధికభాగం మాధవ విద్యారణ్యుల వారి సుభాషిత సుధానిధి లోనూ; కొన్ని కొన్ని ఇతర సంధానగ్రంథాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు,అదనున వర్షించి యఖిలజీవులఁ బ్రోచు జలధరం బే ప్రయోజనము గోరుఁ; బరహితం బాత్మహితమతి  పరమపుణ్యు, లన్యు లొనరించు మేలు తా రాసపడరు” (చాటుపద్యమణిమంజరి, నవరత్నములు”: ప. 106) అన్న పద్యభాగం చూడదగినది. ఇది “నవామ్బుభి ర్దూరవిలమ్బినో ఘనాః ... స్వభావ ఏవైష పరోపకారిణామ్;సన్తః స్వయం పరహితే విహితాభియోగాః” అన్న భర్తృహరి సుభాషితాలకు (నీతి: 61, 62) జ్ఞాపకమని చూడగానే తెలుస్తుంది. కాళిదాసు అభిజ్ఞానశాకుంతలము లోనూ ఇటువంటి దళం ఒకటున్నది. ఈ మాత్రపు కాళిదాసానుసరణం మూలాన శాకుంతలమును అనువదించిన పినవీరనే ఈ గ్రంథకర్త అని చెప్పలేము. మూలం ఏదైనప్పటికీ, తెలుగు పద్యం అనువాదమన్న విషయం మాత్రం స్పష్టం.

మఱొక ఉదాహరణ: “సరససత్కవికావ్యసరణి వినోదించు నతిపుణ్యులకు వేఱె యమృత మేల? (ప. 112) అన్న పంక్తి “సుకవితా య ద్యస్తి రాజ్యేన కిమ్” (నీతి: 17),జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః, నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్” (నీతి: 20) ఇత్యాది భర్తృహరి శ్లోకాలకు అనురణనమని స్పష్టం. తక్కినవీ ఇటువంటివే. మాధవ విద్యారణ్యుల వారి సుభాషిత సుధానిధి, సుందర పాండ్యుని నీతి ద్విషష్టిక, విద్యాకరుని సుభాషిత రత్నావళి, జల్హణుని సూక్తి ముక్తావళి మొదలైన కృతులలోని శ్లోకాలకు ఇందులో అనువాదాలున్నాయి. కవితాధోరణి మఱీ ప్రాథమికం.

౨)  సప్తాం ద్ధతి :

గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అన్న మకుటంతో ఉన్న “నవరత్న పద్యాలు” ఖండిక విషయం ఇలా ఉండగా,సప్తాంగ పద్ధతి” లోని పద్యాలు మాత్రం అర్థశాస్త్ర కామందకీయ శుక్రనీతిసార తదితర రాజనీతి ప్రకరణగ్రంథాలలోని భాగాలకు అనువాదాల వలె ఉన్నాయి. ఇందులో 1) రాజ పద్ధతి, 2) కోశ పద్ధతి, 3) రాష్ట్ర పద్ధతి, 4) దుర్గ పద్ధతి, 5) బల పద్ధతి అన్న శీర్షికలతో ఐదు పద్యాలు మాత్రమే దొరికాయి. తక్కినవి 6) అమాత్య పద్ధతి 7) మిత్ర పద్ధతి అన్నవి రెండూ లభింపలేదు.

 

మొత్తంమీద ఇదీ స్వతంత్రగ్రంథం కాదని మాత్రం స్పష్టమే. ఈ పద్యాలు పురుషార్థ సుధానిధి లోనివి కావు. “గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అన్న మకుటం “నవరత్న పద్యాలు,సప్తాంగ పద్ధతి” అన్న రెండింటిలోనూ సమానంగా ఉన్నందువల్ల రెండింటి కర్త ఒకరే అని మాత్రం ఊహించటానికి వీలవుతున్నది.

 

పినవీరన రచించిన శాకుంతల శృంగార కావ్యములో నారద మహర్షి దుష్యంతపుత్త్రునికి రాజనీతిని బోధించిన సన్నివేశం (4-171)లో –

క.   అంగములు పతికి, విను!

       ప్తాంగములును; వానిఁ దగు సమంచితగతి సా

       రంగాంకవంశతిలక! పొ

       సంగును రక్షించుకొనఁగ జననాథునకున్.

అని ఒక పద్యంలో “సప్తాంగము”ల ప్రసక్తి ఉన్నది. ఈ ప్రస్తావన హేతువుగా ఇది పినవీరన రచనమని భావించటానికి అవకాశం ఉన్నది.

 

అయితే, కవితాధోరణి ఇందులో సామాన్యం. పరిణతప్రజ్ఞుడైన మహాకవి రచన వలె లేదు.

 

ఇంతకీ ఈ “పిల్లలమఱ్ఱి వీరయ్య” ఎవరు? పెనుమళ్ళ సోమన తన సీమంతినీ పరిణయము అవతారిక (1-44)లో పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని అన్నగారు పిల్లలమఱ్ఱి పెదవీరభద్రుని గుఱించి చెబుతూ,

సీ.  ... పెదవీరభద్రుఁడు పృథ్వి ధీనుతకార్య

                     దక్షుఁడై కర్ణాటధరణి కరిగి,

       వాసిగా రాయసింహాసనమున నుండి

                     యధికులౌ రాయదాయాదులకును,

గీ.    మఱియు డెబ్బదివేల సామంతులకును

       తానె యధికారియై మహాస్థానులందు

       సకలమంత్రివరేణ్యులు సన్నుతింప

       భూనుతం బైన కీర్తివిస్ఫూర్తిఁ గనియె 

అని ఆయన అధికారవైభవాలను, సమర్థతను పరిపరివిధాల ప్రశంసించాడు. ఆ “అగ్రభ్రాత” కూడా “భువనభాసురకృతినిర్మాత” అని జైమిని భారతము చెబుతున్నది. విజయనగరసామ్రాజ్య ప్రభువుల వద్దకు ఆశల సంచీని భుజాన వేసికొని యౌవవయస్సులోనే వెళ్ళి, మంత్రాంగనైపుణి మూలాన మంత్రి పదవిలో కుదురుకొన్నాడు. కవిత్వయోగం కులక్రమానుగతంగా అభ్యస్తమైన విద్యే. కనుక, పురుషార్థసుధానిధిని రచించిన “వీరయ్య” ఈ పిల్లలమఱ్ఱి పెదవీరభద్రుడు కావచ్చును. ఏవంవిధమైన కృతినిర్మాణం ఆయన అధికారానికి, అభిరుచికి తగిన వ్యాసంగమే కనుక.

 

పెవీద్రుడు – పివీద్రుడు  

ఇద్దరు అన్నదమ్ము లున్నప్పుడు – ఇద్దరి పేర్లూ “వీరన” లేదా “వీరభద్రుడు” అయితే, పిన్నవానిని “పినవీరన” లేదా “పినవీరభద్రుడు” అన్నట్లుగానే, పెద్దవానిని అనునిత్యం “పెదవీరన” లేదా “పెదవీరభద్రుడు” అన నక్కరలేదు. “వీరన” లేదా “వీరయ్య” లేదా “వీరభద్రుడు” అంటే ఇద్దరిలో పెద్దవాడనే అర్థం. పుట్టిన వెంటనే శిశువుకు “పెదవీరయ్య” లేదా “పెదవీరభద్రుడు” అని పేరుపెట్టడం ఉండదు. రెండవ కొడుకు పుట్టిన తర్వాత అతనికి కూడా “వీరయ్య” లేదా “వీరభద్రుడు” అని పేరు పెట్టిన తర్వాతనే ఈ “పెదవీరభద్రుడు,చినవీరభద్రుడు” అన్న పేర్లు వాడుకలోకి వస్తాయి. దైనందినవ్యవహారంలో పెద్దవానిని “వీరన” లేదా “వీరయ్య” లేదా “వీరభద్రుడు” అంటే చిన్నవానిని మాత్రమే ప్రత్యేకించి,చినవీరన” లేదా “పినవీరన” ఇత్యాదిగా అంటారు. కనుక,వీరయ్య” అన్న వ్యవహారం పెద్దవానికి మాత్రమే వర్తిస్తుందని ఒక ఊహ.

అయితే, గాదయామాత్యుని ఇంటిలో జరిగిన  కథ ఇందుకు వేఱు విధంగా ఉన్నది. గాదయామాత్యునికి లేక లేక భగవదనుగ్రహం వల్ల జన్మించిన కొడుకులిద్దరూ కవల పిల్లలని – పెనుమళ్ళ సోమన సీమంతినీపరిణయము అవతారిక లోని 

క.   ఆ గాదిరాజు వనిత మ

       హాగుణవతి పరమసాధ్వి యన విశ్రుతయౌ

       నాగాంబ రూపలీలా

       భోగాఢ్యులఁ గవలవారి బుత్త్రులఁ గాంచెన్.” 

అన్న 42-వ పద్యంవల్ల మనకు తెలుస్తున్నది. అందువల్ల పేర్లు పెట్టినప్పుడే పెదవీరయ్య – పినవీరయ్య అని పెట్టడం జరిగినా లోకవ్యవహారం మాత్రం పెద్దవాడికి “వీరయ్య” అని, పిన్నవాడికి “పినవీరయ్య” అనే ఉంటుంది. అందువల్ల “పిల్లలమఱ్ఱి వీరయ్య రచించిన పురుషార్థ సుధానిధి” అన్నది పిల్లలమఱ్ఱి పెదవీరభద్రునికే అనువర్తిస్తుంది కాని రూఢ్యనుసారం పినవీరనకు అనువర్తింపదని మఱొక ఊహ.  

పైగా, పురుషార్థ సుధానిధి పినవీరన బాల్యకృతి అనుకోవటానికి వీలులేదు. బాల్యకృతి అయితే, శాకుంతల శృంగార కావ్యములోని రచనల పట్టికలో  కెక్కివుండేదే. ఉత్తరవయస్సులో చెప్పినదైతే, పద్యశైలి అందుకు విరుద్ధంగా ఉన్నది. శాకుంతలాది మహాకావ్యరచన కావించిన తర్వాత - ఆ వయస్సులో రాజదర్శనానికి వెళ్ళి, నలభైయేళ్ళుగా పరిపాలన చేస్తున్న మహారాజుకు “నవరత్న పద్యాలు,సప్తాంగ పద్ధతి” వంటి సామాన్యనీతులను వినిపించాడనటం కూడా భావ్యంగా ఉండదు. కనుక, పినవీరన సాళ్వ నరసింహరాయల ఆస్థానానికి చేరక మునుపే ఎన్నాళ్ళుగానో ఆయన కొలువులో ఉన్న పిల్లలమఱ్ఱి పెదవీరభద్రుడు, నవరత్న పద్యములు,సప్తాంగ పద్ధతి మొదలైన చాటుపద్యాలను యౌవనవయస్సులో ఉండగా చెప్పినట్లు, అంతకు ముందువెనుకలలో ఎప్పుడో - విజయనగరంలో ఉన్నాడు కనుక – ఆయనే అక్కడ పఠనపాఠనాలలో ఉన్న మాధవ విద్యారణ్యుల వారి పురుషార్థ సుధానిధి కృతిని తెలుగులోకి అనువదించినట్లు - మనము స్థితగతిచింతనగా ఊహింపవచ్చును.

పిల్లలమఱ్ఱి వీరయ్య” అన్న వ్యవహారం మన పినవీరనకు కూడా ఉన్నది. కాదనలేము. శాకుంతలములో చిల్లర వెన్నమంత్రి వాక్యం ఇది:

 

సీ.  నన్నపార్యుని ప్రబంధప్రౌఢవాసనా

                     సంపత్తి సొంపు పుట్టింప నేర్చుఁ

       తిక్కన యజ్వ వాగ్భక్కికామోదంబు

                     చెలువు కర్ణముల వాసింప నేర్చు

       నాచిరాజుని సోము వాచామహత్త్వంబు

                     సౌరభంబుల వెదఁజల్ల నేర్చు

       శ్రీనాథభట్టు భాషానిగుంభంబుల

                     పరిమళంబులఁ గూడఁబఱచనేర్చు

గీ.    మహితగుణశాలి పిల్లలమఱ్ఱి వీర

       నార్యుఁ డా యింటఁ బైతామహం బగుచు

       వెలయుచున్నది నేఁడు కవిత్వలక్ష్మి

       యఖిలసత్కవినికరంబు నాదరింప.”     శాకుంత.(1-19) 

ఈ నిర్దేశికను బట్టి పినవీరనకు పై పద్యంలోని ఛందోనిబంధం మాటెలా ఉన్నా,పిల్లలమఱ్ఱి వీరనార్యుడు” అనే వ్యవహారం కూడా ఉండినదని స్పష్టం. ఆ ప్రకారం వాదిస్తే - పురుషార్థ సుధానిధి కర్త అయిన “పిల్లలమఱ్ఱి వీరయ్య” పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడే అవుతాడు. 

ఇంకొక విషయం: పినవీరభద్రకవి వంశీయుడైన పెనుమళ్ళ సోమన తన సీమంతినీ పరిణయము అవతారికలోని 46-వ పద్యంలో –

గీ.   భాగ్యనిధి యైన పినవీరభద్రసుకవి

       కాత్మజులు సంభవించి రుదారమతులు

       ఘనుఁడు వీరన్నయును జగద్గణ్య పుణ్య

       ధనుఁడు మల్లేశ్వరుం డన్న ధర్మపరులు.”     

అని చెప్పిన వంశక్రమం ప్రకారం పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవికి కూడా వీరన్న, మల్లేశ్వరుడు అనే ఇద్దరు కొడుకు లున్నట్లు తెలుస్తున్నది. వీరిలో పెద్దకొడుకు వీరన్న

 

                  “... గీష్పతితుల్యసమగ్రశేముషీ

సారవచోవిలాసనిధి సర్వనృపాలసభాగ్రపూజ్యుఁడౌ

వీరన మంత్రిశేఖరుఁడు ...”                 సీమంతినీ. (ప. 47)

 

అని పెనుమళ్ళ సోమన ప్రశంసించాడు.

 

      ఈ ప్రస్తావనల మూలాన “పిల్లలమఱ్ఱి వీరయ్య” అన్న వ్యవహారం 1) పిల్లలమఱ్ఱి పెదవీరభద్రునికి 2) పిల్లలమఱ్ఱి పినవీరభద్రునికి 3) పినవీరభద్రుని కొడుకైన వీరనకు – మొత్తం ముగ్గురికి అనువర్తిస్తున్నది. వీరిలో పినవీరన ఈ రచన కావించి ఉండడని ఇంతకు మునుపే అనుకొన్నాము. పినవీరన కొడుకు వీరన “గీష్పతితుల్యసమగ్రశేముషీసారవచోవిలాసనిధి”అనే కాని, ఆయన “కవి” అని కాని,గ్రంథకర్త” అని కాని సోమన చెప్పలేదు. “గీష్పతితో సరిపోల్చదగిన సారవచోవిలాసనిధిత్వం” అంటే చాలదా? అంటే, పురుషార్థ సుధానిధి కర్త పినవీరన కొడుకైన ఈ వీరన్న అయితే పెనుమళ్ళ సోమన తప్పక చెప్పేవాడే. కర్త సుప్రసిద్ధుడైన పినవీరన అయితే ఆయన గ్రంథావళిని పేర్కొన్న పద్యంలో అయినా చెప్పేవాడే. కాబట్టి పురుషార్థ సుధానిధి కర్త అయిన “పిల్లలమఱ్ఱి వీరయ్య” – సుప్రసిద్ధుడైన పినవీరన కాని, కవిగా ప్రసిద్ధి లేని పినవీరన కొడుకు “వీరన్న” కాని కారని; పినవీరన అన్నగారైన పెదవీరభద్రుడేనని మనము నిశ్చయింపవలసి ఉంటుంది. పైగా పినవీరన కొడుకు వీరన్న యుక్తవయస్కుడై కవిత్వయోగాన్ని అభ్యసించిన 16-వ శతాబ్ది ప్రథమపాదపు రోజుల్లో సాళ్వ నరసింహరాయలు అప్పటికింకా పరిపాలకుడై ఉండటం, ఈయన ఆయనపై “గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అని పద్యాలు చెప్పటం చారిత్రకంగా సాధ్యం కాదు. అందువల్ల కూడా “నవరత్నములు,సప్తాంగ పద్ధతి,పురుషార్థ సుధానిధి” రచనల కర్తృత్వం పిల్లలమఱ్ఱి పెదవీరభద్రునికే సంక్రమిస్తున్నది. 

     

ఇంతకంటె బలమైన ఆధారం మఱొకటున్నది. “పురుషార్థ సుధానిధి”లోని పద్యంలో కవి కవితానిరూఢికోసం “కాశకర్పూరనీకాశఁగా భావింపఁ గవితానిరూఢిఁ బ్రఖ్యాతి నెసఁగు” అని శంభుదేవి విశాలాక్షిని అభివర్ణించాడు. ఈ విధంగా శ్రీ విశాలాక్షిని సన్నుతించినది శ్రీ శారదాదేవి ఉపాసకుడైన పినవీరభద్రుడు గాక – ఈ పెదవీరభద్రుడే అని మనము విశ్వసింపవచ్చును. ఇది పినవీరభద్రుని భావస్పందం కాదు.

 

పురుషార్థ సుధానిధి” పెదవీరభద్రుని రచన అయితే మాత్రం, ప్రసిద్ధి ఎందుకు రాలేదు? అంటే, నరసింహరాయల మరణానంతరం విజయనగర సామ్రాజ్యస్థితిగతులలో వచ్చిన మార్పులు కారణంగా అది క్రమంగా మఱుగునపడి ఉంటుంది. పెనుమళ్ళ సోమన కాలానికే అంతరించినందువల్ల సోమన దాని ప్రస్తావనను చేసి ఉండడు. పైగా, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి పాఠకుల అభిరుచి మారిపోయింది. భోగలాలసత విజృంభించింది. మతవిషయకమైన రచనలు, ఆచారవిధులకు సంబంధించినవి అయిన కావ్యాలకు ఆదరణ లోపించింది. కావ్యవస్తువు, కథాకథనం, శైలి పూర్తిగా మార్పుచెందాయి. ఇతివృత్తస్వీకరణలో, కథాసంవిధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకొన్నాయి. అంతర్హితమైన ఆ రచనలో నుంచి పెద్దల నోట తాను విని, తనకు నచ్చిన పెదవీరభద్రుని రెండు పద్యాలను మాత్రం “పిల్లలమఱ్ఱి వీరయ్య రచించిన పురుషార్థసుధానిధి” అన్న పేరిట “ఉదాహరణ పద్యములు” సేకరించిన సంకలనకర్త చేర్చుకొని ఉండాలి. మన పాలిటికి కనీసం అవైనా మిగిలాయి.

పిల్లఱ్ఱి పెద్దన్న

 

      ఈ పెద్దలందరి కంటె మునుపు వేఱొక ప్రసిద్ధవ్యక్తి పిల్లలమఱ్ఱి పెద్దన్న ఉన్నాడు. హరవిలాసము కావ్యావతారిక (1-29)లో శ్రీనాథుడు తన కృతిని అంకితం గొన్న అవచి తిప్పయసెట్టికి చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన దేశికతల్లజునిగా ఒక పిల్లలమఱ్ఱి గ్రామ మహాప్రధాని పెద్దన్న గారిని -

 

ఉ.  పిన్నటనాడు సత్కరుణఁ బిల్లలమఱ్ఱి మహాప్రధాని పె

       ద్దన్న గురూత్తముండు తగ నక్షరశిక్షయు, దైవమార్గసం,

       పన్నతయున్, వివేకపరిపాటియునుం గృపఁ జేసె ...

అని పేర్కొని, ఆయన విద్యాదాతృత్వగరిమను వేయినోళ్ళ వినుతించాడు. మహాకవి రచన కాబట్టి పద్యంలోని అక్షరాక్షరం అనర్ఘ భావోదయమై అలరారుతున్నది. “గురూత్తముండు” అన్న విశేషణం వల్ల ఆ పెద్దన్న ఉత్తమ దేశికుడని;అక్షరశిక్ష” కావించినవాడనటం వల్ల ప్రణవపూర్వక శివపంచాక్షరీ మంత్రయుక్త విశిష్టవిద్యాదాతగా సుప్రసిద్ధుడని;దైవమార్గసంపన్నత” ప్రసాదించినవాడు కావటంవల్ల అధ్యాత్మవిద్యాకోవిదుడని;వివేక-పరిపాటి”ని నేర్పినందువల్ల లోకజ్ఞుడని; మహాప్రధాని” అన్నందువల్ల గ్రామాధికారి అని;సత్కరుణన్” అని,కృపఁ జేసె” అని రెండుమార్లు అన్నందువల్ల తీరికలేని బహుముఖవ్యాసంగంతో ఉండినవాడని తెలుస్తున్నది. శ్రీనాథుని హరవిలాసము రచనాకాలాన్ని బట్టి అవచి తిప్పయసెట్టి బాల్యకాలాన్ని క్రీ.శ. 1340 ± అని నిర్ణయిస్తే, ఆ పిల్లలమఱ్ఱి పెద్దన్న మన పినవీరనకు కనీసం మూడు తరాల మునుపటివాడై ఉంటాడని ఊహించటంలో విప్రతిపత్తి ఉండకూడదు. ఆయనను గుఱించిన ఇతరవిశేషాలేవీ మనదాకా రాలేదు.

 

మొత్తంమీద ఈ ప్రస్తావనలను బట్టి క్రీ.శ. 15-వ శతాబ్ది నాటికి పిల్లలమఱ్ఱి వారు విద్వాంసులై, విద్యాదాతలై, భువనభాసుర కృతినిర్మాతలై, జగత్ప్రసిద్ధిని పొందినవారని తెలుస్తున్నది. 

 

పిల్లఱ్ఱి గ్రామం

ఈ “పిల్లలమఱ్ఱి తెలంగాణంలో నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఆమనగంటికి సుమారు ఆఱు మైళ్ళ దూరంలో ఉన్న జనావాసం. అప్రతిహతవీరవరేణ్యులై ఆంధ్రాభ్యుదయానికి, రాష్ట్రోన్నతికి నిస్తులకృషి చేసిన వెలమ రేచర్ల వెలుగోటి వంశీయుల ప్రాభాతికసూర్యోదయానికి తూర్పు పర్వతమై పరిఢవిల్లిన సుక్షేత్రం. ఆ ఊరి పొలిమేరలో “బేతాళ వటం” అని పేరొందిన సువిశాలమైన న్యగ్రోధవృక్షం - “పిల్లలమఱ్ఱి” ఒకటుండేదని; రేచర్ల వంశ మూలపురుషుడైన చెవిరెడ్డికి రేచడనే నమ్మిన బంటు ద్వారా అక్షయనిధి అక్కడే లభించినదని వెలసిన అతీతకథానకాన్ని వెలుగోటి వారి వంశావళి – “అనుమనగ ల్లను ఘనమైన పురమున ...  చేని బైటఁ ... ద్రోవ చేరువయందు దొడ్డ డొంక; కా చెంత నొక వృక్ష మమరుఁ - బిల్లలమఱ్ఱి బేతాళవట మని పేరుఁ గలిగి” (పద్యం. 1) అని చెబుతున్నది. పినవీరన ఆ ఉదంతాన్ని స్మరించుకొంటూ, కవితాత్మకంగా - పిల్లలమఱ్ఱి” అంటే - అదేదో సామాన్యమైన ఊరిలో ఏదో మామూలు మఱ్ఱిచెట్టు కాదని; కాలానికి గుర్తు తెలియని రోజులనుంచే దానికి సమ్మానార్హమైన చరిత్ర ఉన్నదని; అది సాక్షాత్తు భగవన్నివేశన పుణ్యస్థానమని; మహనీయులైన విద్వత్కవి పండితుల ఉనికి వల్ల శారదాపీఠమని - జైమిని భారతము కావ్యం మొదట అవతారికలో తమ యింటిపేరు పుట్టుపూర్వోత్తరాలను గుఱించి చెప్పిన కథానకం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఎంతో అందమైన ఆ పద్యం ఇది:

       “సీ.  అమృతాంశుమండలం బాలవాలము గాఁగ

                           మొలిచె నొక్కటి జగన్మోహనముగఁ

              జిగురించె విలయసింధుగతకైతవడింభ

                           కమనీయ వరపలాశముల తోడఁ

              బితృదేవతలకు నంచితసత్త్రశాలయై

                           చెట్టుగట్టెను గయాక్షేత్రసీమ

              నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా

                           కోటీరునకు భోగికుండలునకు

       తే.   మఱ్ఱి మాత్రంబె! పిల్లలమఱ్ఱి పేరు;

              పేరు వలెఁ గాదు, శారదాపీఠకంబు!

              వారిలోపలఁ బినవీరు వాక్యసరణి

              సరసులకు నెన్నఁ గర్ణరసాయనంబు.”   జైమిని. (1-22)     

      పద్యకల్పన లోకోత్తరంగా ఉన్నది. చంద్రమండలం ఆలవాలంగా ఒక మఱ్ఱిచెట్టు లోకమోహనంగా ఆవిర్భవించినదట. పూర్వం కల్పాంతవేళ ప్రళయజలాలలో “కరారవిన్దేన పదారవిన్దం, ముఖారవిన్దే వినివేశయన్తమ్, వటస్య పత్త్రస్య పుటే శయానం, బాలం ముకున్దం మనసా స్మరామి” అన్న శ్లోకంలో లాగా బాలముకుందవేషధరుడైన లీలామానుషరూపునికి శయ్యగా అమరిన ఆనాటి మఱ్ఱి ఆకుతో చిగురించి – ఊర్ధ్వముఖంగా పైకి లేచి, ఉవ్వెత్తున ఆకాశాని కెదిగి, శాఖోపశాఖలై, దిగంతాలకు విస్తరిల్లిన మహాన్యగ్రోధం అది.

      పితృదేవతల అన్నపానాదులకు సత్త్రశాల వంటి ఆ తరువు నీడలో ఆస్తికులు తమతమ కులాచారాన్ని అనుసరించి శ్రాద్ధక్రియలను నిర్వహించి పితౄణముక్తు లౌతారు. లోకానుగ్రహార్థం భక్తరక్షణకళాతత్పరు డైన శ్రీ పరమేశ్వరుడు వచ్చి కొలువుతీరిన పుణ్యస్థలం అది. చెట్టంటే, ఈ పిల్లలమఱ్ఱి చెట్టు పేరు సామాన్యమైన పేరా? చదువుల తల్లికి ఆవాసనిలయం.

      చరితార్థమైన పిల్లలమఱ్ఱి వంశోన్నతిని సగర్వంగా వర్ణిస్తున్న ఈ పద్యాన్ని చూడగానే పఠితలకు “కర్ణరసాయనం రచయితుం వాచః సతాం సమ్మతామ్” అని పినవీరనకు అత్యంత ప్రీతిపాత్రమైన విద్యాకరుని సుభాషితరత్నావళి లోని 1701-వ శ్లోకం జ్ఞాపకానికి రావటం సహజమే. దానినే,పినవీరు వాక్యసరణి సరసులకు నెన్నఁ గర్ణరసాయనంబు” అని ఆయన తనదైన రీతిలో తెలిగించుకొన్నాడు.

      ఈ సందర్భంలో పినవీరనకు మునుపు అనంతామాత్యుడు క్రీ.శ. 1450 (±) నాటి తన భోజరాజీయములో ఒక మఱ్ఱిచెట్టును వర్ణించిన సన్నివేశం కూడా గమనింపదగినదే. ఆ పద్యం ఇది:     

      “సీ.  ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు

                           శేషాహిశాయికి సెజ్జ యయ్యె

              నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే

                           కాగ్రచిత్తంబున నతిశయిల్లు

              నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ

                           బ్రతిబింబరూపమై పాయకుండు

              నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ

                           పములతో లంఘించెఁ బక్షివిభుఁడు

       ఆ.   నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట

              ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ!

              తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప

              మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు.”  భోజ. (2 – 61)

        అనంతుని కల్పనలోని “ఏకార్ణవము నాఁడు         శేషాహిశాయికి సెజ్జ యయ్యె” అన్నదానినే, పినవీరన పద్యంలోని “చిగురించె విలయసింధుగతకైతవడింభకమనీయవరపలాశముల తోడ” అన్న దళం సరిపోలి ఉన్నది. అనంతుని “ఈ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డేకాగ్రచిత్తంబున నతిశయిల్లు” అన్న భావనకు సరిగా పినవీరన పద్యంలోని “నిలువ నీడయ్యె నిందీవరప్రియకళాకోటీరునకు భోగికుండలునకు” అన్న పాదం సమానం. “ఈ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు” అన్న అనంతుని రూపణమే పినవీరన పద్యంలోనూ “అమృతాంశుమండలం బాలవాలము గాఁగ మొలిచె నొక్కటి జగన్మోహనముగ” అని ఒకపాటి మార్పుతో కనుపిస్తుంది. అంత మాత్రాన పినవీరన అనంతుని పద్యాన్ని తన వంశవర్ణనకు యాథాతథ్యంతో స్వీకరించా డనటం భావ్యం కాదు. అనంతామాత్య – పినవీరన లిద్దరికీ ఆ విశాల మహాన్యగ్రోధ తరువర్ణనకు దారిచూపిన శ్లోకం ఏదైనా ఉన్నదేమో తత్పూర్వకృతులలో అన్వేషించటం భావ్యం. పైగా, అనంతుని కావ్యం ఏ సంస్కృతరచనకు అనువాదమో మనకింకా స్పష్టంగా తెలియదు. అందులో ఈ వర్ణనకు మూలం ఒకటున్నదో, లేదో చెప్పలేము.

      పినవీరన వర్ణింపదలచినది గయా పుణ్యక్షేత్రంలో వెలసిన ఒక గొప్ప మఱ్ఱిచెట్టు తమ వంశనామానికి మూలమన్న సంగతిని. అనంతుడు వర్ణించినది ధారానగర రాజు భోజుడు వేటకోసం అడవికి వెళ్ళి, అక్కడొక పెద్ద మఱ్ఱిచెట్టును చూసి, దానిపై నివసిస్తున్న సర్పటి అనే సిద్ధుని కలుసుకొన్న సన్నివేశాన్ని. అనంతుని పద్యం స్వరూప హేతుఫల రూపణీయత మూలాన ఉత్ప్రేక్షితానికి నిదర్శన కాగా పినవీరన పద్యం అద్భుతావహమైన వర్ణనప్రౌఢితో అతీతకథానకాన్ని ప్రత్యక్షాయమాణంగా వర్ణిస్తూ భావికానికి ఉదాహరణీయంగా ఉన్నది. పినవీరన “పితృదేవతలకు నంచితసత్త్రశాలయై చెట్టుగట్టెను గయాక్షేత్రసీమ” అని చెప్పినది గయా పుణ్యస్థలంలో వెలసిన సుప్రసిద్ధమైన అక్షయ వటవృక్షాన్ని గుఱించి. అనంతుని పద్యంలో ఆ సూచన లేదు. కనీసం పదిహేనువందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్లుగా ఆధారాలున్న ఆ మహావటవృక్షాన్ని మన కవి “పిల్లలమఱ్ఱి” అన్నాడు.

యాక్షేత్రంలో పిల్లఱ్ఱి  

      పురాణప్రఖ్యాతమై, చరిత్రాత్మకమైన ఈ అక్షయ వటవృక్షం గయా పుణ్యక్షేత్రంలో ఉన్నది. ఈ వృక్షం పుట్టుకను గుఱించిన పురాణకథలు, బహుముఖీన మహిమానువర్ణనలు ఆ ప్రాంతంలో ఇప్పటికీ అనేకం వినిపిస్తుంటాయి. కొన్ని కొన్ని ప్రస్తావనలు మనకు వాల్మీకి రామాయణములో సంక్షిప్తం గానూ, మహాభారతములో పలు పర్యాయాలు సువిస్తృతం గానూ కనుపిస్తాయి. దీనికి “శ్యామ” అనే సంప్రదాయనామం కూడా ఉన్నదట. కోశకర్తలు వటేశ్వర” మని,గృధ్రవట” మని వివిధ పర్యాయపదాలను పేర్కొన్నారు. కావ్యకర్తలు తమ కథావ్యక్తులు ఇక్కడికి వచ్చినప్పటి సంనివేశాలను బహుభణితిభంగీవిశేషాలతో అభివర్ణించారు. సంస్కృత మహాభారతము వనపర్వంలోని తీర్థయాత్రోపపర్వం (3-82:71,72)లో ధర్మరాజుకు నారదుడు గయాతీర్థాన్ని గుఱించి చెబుతూ  -

 

      “తతో గయాం సమాసాద్య బ్రహ్మచారీ జితేన్ద్రియః

       అశ్వమేధ మావాప్నోతి గమనా దేవ భారత!

       త త్రాక్షయవటో నామ త్రిషు లోకేషు విశ్రుతః

       పితౄణాం తత్ర వై దత్త మక్షయం భవతి ప్రభో.”

 

      అంటాడు. నన్నయ్య గారు దీనిని తెలుగుచేసినప్పుడు “... గయకు నరుగునో యనియును నశ్వమేధం బొప్పఁ జేయునో యనియును” (చూ. ఆంధ్ర మహాభారతము : ఆరణ్య. 2-275) అన్నచోట ఈ అక్షయ వటవృక్షం ప్రస్తావనను ఎందుకో విడిచివేశారు. పినవీరన రచనలో “పితౄణాం తత్ర వై దత్త మక్షయం భవతి” అన్న భారత భావదీపం వెలుగు కొంతవఱకు “పితృదేవతలకు నంచితసత్త్రశాలయై చెట్టుగట్టెను గయాక్షేత్రసీమ” అని కనుపిస్తుంది. వనపర్వంలోనే, మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ప్రళయప్రకారాన్ని వివరించినప్పుడు -

 

      “తతః కదాచిత్ పశ్యామి తస్మిన్ సలిలసంప్లవే

       న్యగ్రోధం సుమహాన్తం వై విశాలం పృథివీపతే.

       శాఖాయాం తస్య వృక్షస్య విస్తీర్ణాయాం నరాధిప

       పర్యఙ్కే పృథివీపాల దివ్యాస్తరణసంస్తుతే.

       ఉపవిష్టం మహారాజ పూర్ణేన్దుసదృశాననమ్

       ఫుల్లపద్మవిశాలాక్షం బాలం పశ్యామి భారత.”       (3.186:81,82)

 

        అని ఉన్న భాగం ఎఱ్ఱాప్రగడ అనువాదం (ఆరణ్య. 4-250, 51, 53, 54) లోనూ ఉన్నది కాని, ఎఱ్ఱన్న గారి రచన పినవీరన పద్యానికి మూలమైనట్లు కనబడదు.   

 

      సంస్కృతంలోని భారత భాగాన్ని పురస్కరించుకొని, క్షేత్రమాహాత్మ్య కథనపూర్వకంగా వెలసిన గయా మాహాత్మ్యము వేఱొకటి వాయు మహాపురాణములో ఉన్నది. నాగరి లిపిలో అచ్చయిన సంస్కృత వాయు మహాపురాణము ప్రతులన్నిటిలో ఈ గయా మాహాత్మ్యము వేర్వేఱు అధ్యాయ సంఖ్యలతో, వేర్వేఱు శ్లోక సంఖ్యలతో కనబడుతున్నది. తెలుగు లిపిలో శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ ప్రకాశకులు ప్రచురించిన వాయు మహాపురాణము ద్వితీయ సంపుటంలో ఇది సనత్కుమారుడు నారదాదులకు చెప్పినట్లుగా 43-వ అధ్యాయం మొదలుకొని 50-వ అధ్యాయం వఱకు ఉన్నది. ఈ గయా మాహాత్మ్యము విడిగా క్రీ.శ. 14-వ శతాబ్ది పూర్వార్ధంలో ఎప్పుడో రచితమై, వాయు మహాపురాణము లోనికి ప్రవేశించి ఉంటుందని తత్పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అచ్చై అందుబాటులో ఉన్న గయా మాహాత్మ్యము ప్రతుల పీఠికలలో ఈ విషయం ఈ విధంగానే ప్రస్తావింపబడుతున్నది. అదే నిజమైతే, తనకు కొన్నాళ్ళ క్రితం వెలసిన ఆ కృతిని వ్యస్తం గానో, వాయుపురాణాంతర్గతం గానో పినవీరన చదువుకొని, ఆ కథాకథనానికి ముగ్ధుడై తమ ఇంటిపేరుకు అన్వయించి పద్యం చెప్పి ఉంటాడని మనము విశ్వసింపవచ్చును. ఇంతకీ, గయా మాహాత్మ్యము లోని ఆ శ్లోకాలివి:

      “కృతే శ్రాద్ధేఽక్షయవటే అన్నేనైవ ప్రయత్నతః

       పితౄన్నయేద్బ్రహ్మలోక మక్షయం తు సనాతనమ్.

       వటవృక్షసమీపే తు శాకేనాప్యుదకేన వా

       ఏకస్మిన్ భోజితే విప్రే కోటి ర్భవన్తి భోజితాః.

       దేయం దానం షోడశకం గయాతీర్థపురోధసే   

       వస్త్రం గన్ధాదిభిః పుత్త్రైః సమ్యక్సంపూజ్య యత్నతః.

       గయాతీర్థవటే చైవ పితౄణాం దత్త మక్షయమ్

       దృష్ట్వా నత్వా చ సంపూజ్య వటేశం సుసమాహితః.

       పితౄన్నయేద్బ్రహ్మలోక మక్షయం తు సనాతనమ్

       గయాయాం ధర్మపృష్ఠే చ సరసి బ్రహ్మణ స్తథా.

       గయాశీర్షే వటే చైవ పితౄణాం దత్త మక్షయమ్

       ఏకార్ణవే వటస్యాగ్రే యః శేతే యోగనిద్రయా.

       బాలరూపధర స్తస్మై నమస్తే యోగశాయినే

       సంసారవృక్షశస్త్రాయాశేషపాపహరాయ చ.

       అక్షయబ్రహ్మదాత్రే చ నమోఽక్షయవటాయ చ.”  

                                                వాయు. (48:93-100)      

        ఈ శ్లోకాలు, పైని ఉదాహరించిన మహాభారతాదిశ్లోకాలు పినవీరన రచనకు మార్గదీపకాలని స్పష్టం. ఒక చిన్ని పద్యాన్ని రచించేందుకు ఆయన చేసిన విశాలమైన కృషి, చదివిన సంస్కృతాంధ్రకృతుల నైపథ్యం రసజ్ఞులకు ఆశ్చర్యానందాలను కలుగజేస్తాయి.

 

పిల్లఱ్ఱి వారి కుటుంబం

 

      క్రీస్తుశకం 14-వ శతాబ్ది చరమపాదంలో ఎప్పుడో గాదయామాత్యుడు తన పన్నెండు మంది సోదరులతో ఈ గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడట. ఆయన కాలంలోనే వీరి ఇంటిపేరు “పిల్లలమఱ్ఱి” వారయిందని పెనుమళ్ళ సోమన అన్నాడు కాని, నిజానికి అంతకు ముందు నుంచే ఆ గ్రామంలో పిల్లలమఱ్ఱి వారున్నారు. గాదయామాత్యుని వల్ల ఈ ఇంటిపేరు సుప్రసిద్ధమై ఉంటుంది. ఈయన “భువనభాసురకృతినిర్మాత” అని జైమిని భారతము అవతారికలో సాళువ నరసింహ రాయలు అన్నాడు కదా. ఆ కారణం వల్ల ఆ ఇంటిల్లిపాదీ పేరెన్నిక గనటం జరిగింది. పెనుమళ్ళ సోమన కూడా సీమంతినీ పరిణయము అవతారికలోని 20-వ పద్యంలో “కవివర్ణనీయుఁ డా గాదిరాజు - వివేకఘనుఁడు” అని మెచ్చుకొన్నాడు. “కవివర్ణనీయుఁడు” అనటం మూలాన ఆయన సన్నిధికి ఎక్కడెక్కడి నుంచో కవిమండలి వచ్చి ఆయనను సేవించుకోవటమే గాని, ఆయన స్వయంగా “కవి” కాకపోవచ్చునని స్ఫురింపవచ్చును కాని, ఆయన “కవి” అని జైమిని భారతము అంటున్నది కదా! అందుచేత “కవివర్ణనీయుఁడు” అంటే “కవులు మెచ్చుకొనే కవి” - “కవీనాం కవిః” అని అర్థం చెప్పుకోవాలి.

 

      పిల్లలమఱ్ఱి గ్రామం నిరంతరయుద్ధాలతో రక్తసిక్తం కాజొచ్చినప్పుడు గాదయామాత్యుని తర్వాతి తరంలో పినవీరన కుటుంబం అక్కడి నుంచి నేటి ప్రకాశం జిల్లాలోని కందుకూరుకు సమీపంలోని “పంట నృపకౌస్తుభములకు పాలవెల్లి” అయిన సోమరాజుపల్లెకు తరలివెళ్ళిపోయినట్లు విమర్శకులు భావిస్తున్నారు. లేక, పినవీరన తన అన్నగారు గౌరవాదరాలకు నోచుకొన్న విజయనగరానికి బయలుదేరి, మార్గమధ్యంలో చిల్లర వెన్నమంత్రి యశోగాథలను విని, కొంతకాలం అక్కడ ఆగి, ఆయనకు శృంగార శాకుంతలమును వినిపించి, అక్కడినుంచి విజయనగరానికి బయలుదేరి ఉంటాడని భావింపవచ్చును. విజయనగర ప్రవేశానికి చిల్లర వెన్నమంత్రి ప్రాపకం, ఆయన ప్రాభవం పనికివచ్చాయేమో.

గోత్రనామాది స్య :

 

      శాకుంతలము గద్యలోనూ, జైమిని భారతము గద్యలోనూ పినవీరన “ఇది ... గాదయామాత్యపుత్త్ర ... పిల్లలమఱ్ఱి పినవీరభద్రప్రణీతంబైన” అని చెప్పుకొన్నందువల్ల ఈ పిల్లలమఱ్ఱి వారు నియోగులని సామాన్యాభిప్రాయం. వీరిది భారద్వాజ సగోత్రమని పెనుమళ్ళ సోమన చెప్పాడు. అయితే, శాకుంతలము అవతారికలో “కశ్యపాన్వయు చేతన్” (1-20) అని ఉన్న దళం వల్ల ఈ విషయం వివాదాస్పదమైంది.

 

      శాకుంతలములో చిల్లర వెన్నమంత్రి వాక్యం ఇది:

 

      “క.   ఆ సుకవిచేత శివభజ

              నాసక్తుని చేతఁ గశ్యపాన్వయు చేతన్

              భాసుర నవకవితాలక్ష్మీ

              సదనునిచేత వలయుఁ గృతిఁ జెప్పింపన్.”    

      అని. కాశ్యప సగోత్రులలో “పిల్లలమఱ్ఱి” వారు వెలనాటి వైదికులలో మాత్రమే ఉన్నారు. “ఇప్పుడు నియోగులలో ఈ యింటిపేరు కలవారు లేరు” అని కొందరంటున్నారు. టేకుమళ్ళ అచ్యుతరావు గారు విజయనగర సామ్రాజ్యమందలి ఆంధ్రవాఙ్మయచరిత్రము (మొదటి భాగం)లో ఈ విషయమై కొంత పరిశోధించినా, ఏ సంగతీ ఇదమిత్థంగా నిర్ణయించలేకపోయారు. పినవీరన వంశీయుడైన పెనుమళ్ళ సోమన తాము భారద్వాజ సగోత్ర నియోగులమనే చెప్పుకొన్నాడు. ఇంటిపేర్లు వేరుగా ఉన్నాయి కాబట్టి అదే వంశీయులైనప్పటికీ గోత్రనామాలు ఎందుకు మాఱలే? దని సందేహం కలుగకుండా, పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కొడుకు మల్లేశ్వరుని కాలంలో కుటుంబం మళ్ళీ ఇంకొక చోటికి తరలివెళ్ళి, పెనుమళ్ళలో స్థిరపడిందని, అప్పటి నుంచి వారింటిపేరు “పెనుమళ్ళ”గా మాఱిందని, తామిరువురమూ భారద్వాజ సగోత్రులమేనని కూడా - తానే వివరించాడు. పిల్లలమఱ్ఱి వారు భారద్వాజ సగోత్రులని “వినుతభరద్వాజమునిగోత్రశేఖరుఁడు పిల్లలమఱ్ఱి గాదిరాజు” అని (చూ. సీమంతినీ పరిణయము. 1-9) వ్రాశాడు. అందువల్ల కాశ్యపాన్వయాన్ని పేర్కొంటున్న ఆ పద్యం శృంగార శాకుంతలం లోనికి కాలాంతరంలో ప్రవేశించి ఉండవచ్చునని; ఆ పద్యాన్ని తొలగిస్తే వాక్యాన్వయం సమంజసంగానే ఉన్నది కాబట్టి ప్రక్షిప్తం కావచ్చునని శ్రీ చాగంటి శేషయ్య గారి వంటి విమర్శకులు కొందరు భావించారు.

 

      కవిజీవితములు గ్రంథంలో గురజాడ శ్రీరామమూర్తి గారు ఈ గోత్రనామాదికాన్ని గురించి వేఱొక విధంగా వ్రాశారు:

 

పినవీరయ్య గోత్రవిషయము:

      దీనింగూర్చి పినవీరభద్రకవిచే నేమియుఁ జెప్పఁబడదయ్యెను. కాని యతఁ డాంధ్రకవులంగూర్చి వర్ణించుచు వ్రాసిన పద్యములవలన నీతని గోత్ర మూహింపఁదగి యున్నది. ఎట్లన్నను :-

        మ.   కవులన్ బంకజగర్భసన్నిభుల వక్కాణింతు వల్మీకసం

                భవునిన్, వ్యాసునిఁ, గాళిదాసు, బిలహున్, బాణున్, మయూరున్, శుకున్,       

                భవభూతిన్, శివభద్రు, మల్హణుని, ఘంటామాఘునిం, జోరు, భా

                రవి; మా నన్నయభట్టుఁ, దిక్కకవి, నేఱాప్రగ్గడన్, సోమునిన్.

అను పద్యములోని "మా" అనుదానింబట్టి చూడ నన్నయభట్టును పినవీరనయొక్కవంశమువారును నొక్కగోత్రమువా రై యుందురనియుఁ జెప్ప నొప్పి యున్నది. నన్నయభట్టుది భారద్వాజసగోత్రము కావునఁ బినవీరనగోత్రమును నదియే యని యూహింపనై యున్నది."

      ఇక్కడ పద్యాన్వయంలో శ్రీరామమూర్తి గారు పొరబడ్డారని విమర్శకులు వెంటనే గుర్తించారు. పినవీరన పద్యంలో “మా” అన్నది వాల్మీకి వ్యాసాది సంస్కృతకవులను ప్రార్థించిన తర్వాత ఆ క్రమంలో వక్ష్యమాణులై ఉన్న నన్నయ తిక్కనాది ఆంధ్రకవుల విషయమే కాని;మా నన్నయభట్టు”  అని ఆ దళం నన్నయ గారికి ఏకదేశంగా అన్వయింపదు. పైగా, శ్రీరామమూర్తి గారే, నన్నయభట్టు చరిత్రను వ్రాసినప్పుడు భారతంలో నన్నయ గారు “తన కులబ్రాహ్మణు ...” అన్న పద్యంలో తమను గూర్చి వ్రాసికొన్న “ముద్గలగోత్రజాతు” అన్న దళాన్ని తామే (48-వ పుటలో) ఉదాహరించిన విషయాన్ని మర్చిపోయారు. నన్నయ గారిది మౌద్గల్య సగోత్రం. భారద్వాజం కాదు. ముద్గలగోత్రజాతులు నియోగులలోనూ ఉన్నారు కాని పినవీరనది మౌద్గల్య సగోత్రం కాదు. పినవీరనది భారద్వాజ సగోత్రమని చెప్పటానికి శ్రీరామమూర్తి గారు చూపిన కారణం సరికాదు.

      ఇంతకీ గురజాడ శ్రీరామమూర్తి గారు చూచిన ప్రతులలో శాకుంతలములో “కాశ్యపాన్వయుచేతన్” అన్న దళం ఉన్న పద్యం లేదన్నది మనకు ప్రస్తుతాంశం. ఉంటే, ఆ విధంగా వ్రాసేవారు కారు. ఆ ప్రకారంగానే ఆంధ్ర కవుల చరిత్రములో కందుకూరి వీరేశలింగం గారు; కవిజీవితములులో శ్రీరామమూర్తి గారు తమ ప్రతులలో ఈ పద్యం లేనందున “కవి నియోగి” అని వ్రాశారు. 1898లో దీనిని తొలిసారి సరస్వతీ పత్త్రికలో  ప్రకటించిన కొచ్చెర్లకోట జమీందారు రామచంద్ర వేంకట కృష్ణరావు గారు కావ్యంలో ఈ పద్యం ఉనికిని బట్టి కాశ్యప సగోత్రుడైన పినవీరన వైదికుడు కావచ్చునని విశ్వసించారు. 1923లో శృంగార శాకుంతలమును వావిళ్ళ వారికోసం పరిష్కరించిన తత్పండితులు పీఠికలో పినవీరన వైదికుడన్న వాదమే సయుక్తికమని కృష్ణరావు గారిని సమర్థించారు. 1940లో జైమిని భారతమును పరిష్కరించిన దేవరకొండ అమ్మన్నశాస్త్రి గారు తండ్రిపేరు గాదయామాత్యుడని ఉండటంవల్ల ఈ పిల్లలమఱ్ఱి వారు నియోగులని భావించారు.

      పిల్లలమఱ్ఱి వారిలో నియోగులు ఇప్పుడు లేరని విమర్శకులు వ్రాసిన విషయమూ సత్యం కాదు. వెలనాటి నియోగులలోనూ, ఆరువేల నియోగులలోనూ పిల్లలమఱ్ఱి వారు ఉన్నారు. చిత్రమేమంటే, వెలనాటి నియోగులలోనూ, ఆరువేల నియోగులలోనూ పిల్లలమఱ్ఱి వారిది భారద్వాజ సగోత్రమే.  

      పిల్లలమఱ్ఱి వారిలో వెలనాటి వైదికులలోనూ భారద్వాజ సగోత్రం వారున్నారు. లేరని విమర్శకులు వ్రాసినది సరికాదు. నిన్న మొన్నటి సుప్రసిద్ధ సాహితీవిమర్శకులు, నవ్యాంధ్ర సాహిత్యవీథులు రచయిత ఆచార్య కురుగంటి సీతారామభట్టాచార్యుల వారిది వెలనాటి వైదికులలో కాశ్యప సగోత్రమని, వారి అల్లుడు – సుప్రసిద్ధ సాహితీవిమర్శకులు, మహావక్త శ్రీ పిల్లలమఱ్ఱి హనుమంతరావు గారిది భారద్వాజ సగోత్రమని – సీతారామభట్టాచార్యుల వారి దౌహిత్రి, హనుమంతరావు గారి మేనకోడలు అయిన శ్రీమతి నైషధం వరలక్ష్మి గారు ఈ విషయమై వారిని అడిగినప్పుడు నాకు వారి వంశవృక్షాన్ని గురించి వివరించి చెప్పారు.

      కనుక, ప్రత్యంతరాలను శోధించి, సరైన పాఠనిర్ణయం చేస్తే కాని ఈ విషయమై పార్యంతికంగా ఏ సంగతీ నిశ్చయించటం సాధ్యం కాదు. అసలు కులమతాలే అనవసరమని భావిస్తున్న ఈ రోజులలో యువతరానికి – ఎంత చరిత్రావగాహనకు ఆవశ్యకమైన ఆసక్తికర విద్యావిషయక మైనప్పటికీ, ఈ చర్చ అనుపయుక్తంగా తోపవచ్చునని – ఇంతటితో విడిచివేద్దాము. 

శ్రీ భాతీ తీర్థ తీంద్రులు

     శృంగార శాకుంతలము ఆశ్వాసాంతగద్యలలో పినవీరన “శ్రీ భారతీతీర్థ గురుచరణకరుణాలబ్ధ సిద్ధసారస్వతపవిత్ర” అని; జైమిని భారతము ఆశ్వాసాంత గద్యలలో “ఇది భారతీతీర్థ శ్రీచరణకరుణాపాత్ర” అని చెప్పుకొన్నాడు. శృంగార శాకుంతలము అవతారిక (1-8)లోని ఇష్టదేవతా ప్రార్థనలో -

 

శా.  అర్థిన్ మామకమానసాబ్జమున నధ్యాసీను గావించి సం

       ప్రార్థింతున్ యతిసార్వభౌముఁ, బరమబ్రహ్మానుసంధాత, నా

       నార్థాలంకృతబంధురశ్రుతిరహస్యజ్ఞాత శ్రీ భారతీ

       తీర్థ శ్రీచరణంబు, నుల్లసితముక్తిప్రేయసీవల్లభున్.

      అని తన హృదయపద్మపీఠం పైని అధివసింపజేసి  భక్తిపూర్వకంగా సంస్మరించాడు.

      ఈ గురుస్తుతిపరకపద్యాన్ని కొంత జాగ్రత్తగా అధ్యయన చేయవలసి ఉంటుంది. అలవోకగా చదివితే విశేషాలు అర్థం కావు. “యతిసార్వభౌము,పరమబ్రహ్మానుసంధాత” అన్న విశేషణాలు,శ్రీ భారతీ తీర్థ శ్రీచరణంబు” అన్న విశిష్టనామాంకనం ఆ మహనీయుని తురీయాశ్రమ శ్రీస్థితిని, పినవీరనకు ఆయన యెడ గల గౌరవాతిశయాన్ని ప్రకటిస్తున్నాయి. “యతి-సార్వభౌముడు” కనుక సంయమిగణానికి వహించిన సార్వభౌమత్వం వల్ల ఆయన సంగపరిత్యాగం చేసిన విరాగి మాత్రమే గాక ఏదో యతీంద్రపీఠానికి ఆధిపత్యం వహించిన పదవీనిరూఢుడని తెలుస్తున్నది. “పరమబ్రహ్మానుసంధాత” అన్న అభివర్ణన ఆయన నిర్గుణము, నిరుపాధికము అయిన బ్రహ్మవస్తువునందు నిరంతర ధ్యాననిష్ఠుడని వెల్లడిస్తున్నది. “నానా+అర్థ+అలంకృత బంధుర శ్రుతిరహస్య-జ్ఞాత” అన్న దళం విపులార్థగర్భితమై,  “1) సాహిత్యిక 2) పౌరాణిక 3) యాజ్ఞికాది నానార్థాలతో నిండిన వేదవాక్కుల రహస్యాలను గుర్తెఱిగిన విజ్ఞాని” అని శ్రీ భారతీ తీర్థుల వారికి గల విద్యారణ్య భాష్యపరిచయాన్ని, నిరుపమాన పాండిత్యవైభవాన్ని నిరూపిస్తున్నది. “ఉల్లసితముక్తిప్రేయసీవల్లభున్”  అన్న దళం ఆయన ముక్తికాంతను వలచి, వలపించుకొన్న విజ్ఞానపురుషుడని; జ్ఞానాగ్నిలో సర్వకర్మలను దహించివేసిన జీవన్ముక్తుడని; శాకుంతల రచనాకాలం నాటికి బ్రహ్మభూయం చెంది ఉంటాడని సూచిస్తున్నది.

      ఈ పద్యంలో గల విశేషార్థాన్ని గుర్తించటానికి ముమ్మొదటి పద్యం మొదలుకొని కృతిప్రారంభం ఎలా ఉన్నదో చూద్దాము: కావ్యావతారికలో క్రమంగా –

      1)    “శ్రీవత్సాంకుఁడు ... మంత్రి వెన్నని నితాంతశ్రీయుతుం జేయుతన్ – అని, శ్రీమహావిష్ణువు చిల్లర వెన్నమంత్రిని సిరులలో ముంచెత్తాలని;

      2)   “అష్టమూర్తి ... వెన్నమంత్రిఁ జిరతరైశ్వర్యుఁ జేయుఁగాత” – అని, అష్టమూర్తిధరు డైన పరమేశ్వరుడు వెన్నమంత్రిని అష్టైశ్వర్యయుతుని కావించాలని;

      3)   “అబ్జాతగర్భుండు దీర్ఘాయుష్మంతునిఁ జేయు నాగవిభు వెన్నామాత్యచూడామణిన్” – అని, బ్రహ్మదేవుడు వెన్నమంత్రికి చిరాయువును ప్రసాదించాలని;

      4)   “విఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె,న్ననికి న్మన్నన సొంపుమీఱ నొసఁగు న్భద్రంబు లెల్లప్పుడున్” – అని, విఘ్నేశ్వరుడు సర్వశుభాలను ప్రసాదించాలని;

      5)   “భైరవస్వామి సకలసంపదల నొసఁగి మనుచుఁ జిల్లర వెన్నయామాత్యవరుని” – అని, బిట్రగుంట భైరవస్వామి సంపదలను ప్రసాదించాలని;

      6)   “ఆదిమలక్ష్మి వసించుఁ గావుత, న్మచ్చిగ వెన్నయప్రభుని మందిరరాజమునందు నిచ్చలున్” – అని, ఆదిలక్ష్మి వెన్నమంత్రి యింట కొలువుతీరాలని;

      7)   “ఇచ్చుఁగాత ... పరిపూర్ణం బొంద వాగ్దేవి” – అని, చదువుల తల్లి తన వాక్కునకు సౌరభాన్ని, సార్థకతను ప్రసాదించాలని -

 

మొత్తం ఈ విధంగా ఏడు పద్యాలున్నాయి. ఇవన్నీ కావ్యాదిలోని ఇష్టదేవతాప్రార్థనలు.

 

      ఆ తర్వాత 8-వ పద్యంగా పైని ఉదాహరించిన శ్రీ భారతీ తీర్థస్వామి ప్రార్థన (“సం, ప్రార్థింతున్ యతిసార్వభౌము”) ఉన్నది. ఇది కూడా ఇష్టదేవతాప్రార్థనమే.

 

      ఆ తర్వాత,అని యిష్టదేవతాప్రార్థనంబుఁ గావించి” అన్న 9-వ వచనమూ; ఆ తర్వాత “పూర్వకవిస్తుతి మొదలైనవి ఉన్నాయి. ఏవంవిధమైన సందర్భాన్ని బట్టి శ్రీ భారతీ తీర్థస్వామి కవికి ఇష్టదేవత అని, సామాన్య వ్యక్తిమాత్రుడు కాడని, నిత్యపూజార్హుడని స్పష్టం.                

  

శాకుంతల కృతిభర్త చిల్లర వెన్నమంత్రి కూడా ఆయనను -

 

      “గీ.   భారతీతీర్థ యతిసార్వభౌమ గురుకృ

              పాతిశయలబ్ధ కవితావిభూతిఁ గలిగి

              గౌరవముఁ గాంచినాఁడవు కవులచేత

              విపులచాటూక్తినిర్ణిద్ర! వీరభద్ర!”           శాకుంత.(1-22)

 

      అని ప్రశంసించినట్లుగా ఉన్నది. జైమిని భారతము కావ్యాంతంలోనూ పినవీరన “భారతీతీర్థ గురుకృపాసమిద్ధసారస్వతుఁడు (8-219)” అని తనను గురించి స్వయంగా తానే చెప్పుకొన్నాడు.

 

      ఈ భారతీ తీర్థ స్వామి ఎవరు? విద్వాంసులు పరిపరి విధాల ఊహించారు.

 

      కర్ణాటకంలోని శ్రీ విద్యారణ్యుల వారి ఆధ్వర్యవంలో హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు క్రీ.శ. 1336 నాటికి శ్రీ శృంగేరి జగద్గురుపీఠంలో శ్రీ భారతీ కృష్ణతీర్థ స్వామివరేణ్యులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులై ఉన్నారు. వీరు క్రీ.శ. 1229 నుంచి 1233 వరకు ఆమ్నాయపీఠాన్ని అధిష్ఠించిన శ్రీ విద్యాశంకరతీర్థుల వారి శిష్యవరేణ్యులు. క్రీ.శ. 1233లో శృంగేరి మఠాధీశ్వరులైన తర్వాత క్రీ.శ. 1280 వరకు, సుమారు నలభైయేడేండ్లు ఉన్నారు. వీరే పినవీరనకు గురువైన శ్రీ భారతీ తీర్థుల వారని; జైమిని భారతము అవతారిక (1-22)లో పినవీరన తన కృతులలో స్తుతించిన శారదాదేవి ఈ జగద్గురుపీఠవర్తిని అయిన శారదాదేవి అని;మఱ్ఱి మాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు, పేరు వలెఁ గాదు; శారదాపీఠకంబు” అని అన్న నిర్దేశకవాక్యం శృంగేరిలోని “శారదాపీఠము”నకు సూచకమని నిర్ణయించి, - 1893లో శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారు తమ కవిజీవితములు గ్రంథంలో ఇంకా ఇలా వ్రాశారు:

      పై భారతీతీర్థులు శా.సం. ౧౨౫౦ లోఁ దురీయాశ్రమమును స్వీకరించి శా.సం. ౧౩౦౨ లో సిద్ధినందినట్లు శృంగేరీజగద్గురుపీఠాధిరోహణకాలనిర్ణయపట్టికలో నున్నది. దాని నే నీవఱ కాచార్యకల్పవల్లిలోఁ బ్రచురించియున్నాఁడను. పినవీరన భారతీతీర్థులచరమకాలములో యోగోపదేశము నందియుండు నని తోఁచెడిని. అప్పటి కీతఁడు మిక్కిలి బాల్యవస్సున నుండి యుండును. కావున నీపినవీరన శా. సం. ౧౩౦౦ మొదలు శా. సం. ౧౩౫౦ వఱకుఁ గల కాలమువాఁడని నిర్ణయించెదను.

                                                      (పు.112)   

      పినవీరన బాల్యవేళ దాకా – అంటే ఒక శతాబ్దికి పైబడి కనీసం ఇరవయ్యేళ్ళ కాలం పాటు ఈ భారతీ కృష్ణతీర్థుల వారు జీవించి ఉండినట్లు  ఆధారాలు లేవు. ఒకవేళ జీవించి ఉండినా వారికి శ్రీ భారతీ కృష్ణతీర్థులనే గాని – “శ్రీ భారతీ తీర్థు” లని వ్యవహారం ఉన్నట్లు లేదు. ఒకవేళ ఉండినా, వారు శతాయుష్కులై, జీవితభానుడు అపరసంధ్యాకాలంలో ఉండగా పినవీరన శృంగేరికి వెళ్ళి వారి శిష్యత్వానికి నోచుకొన్నాడనటం విశ్వసనీయం కాదు. పినవీరన క్రీ.శ. 1378లో జన్మించి, 1428 వరకు జీవించి ఉంటాడన్న వీరి నిర్ణయమూ సరికాదు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ప్రామాణికాధారాలను బట్టి శ్రీనాథుడు క్రీ.శ. 1360లో జన్మించి, 1450 వరకు జీవించి ఉంటాడని నిశ్చయిస్తే, పినవీరన శ్రీనాథుని పెక్కు రచనలను చదవనే లేదని భావింపవలసి వస్తుంది.

      1965లో నరేంద్రనాథ సాహిత్యమండలి వారు తణుకు నుంచి వెలువరించిన శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు గారి అభినందన సంపుటిసాహితీవాల్లభ్యము”లో సుప్రసిద్ధ చరిత్రకారులు శ్రీ కుందూరి ఈశ్వరదత్తు గారు “సాళువ నరసింహరాయల సాహితీపోషణము” అన్న వ్యాసం (450-వ పుట)లో క్రీ.శ. 1464-72 సంవత్సరాలలో రెండవ నరసింహ భారతీ స్వాముల వారు; క్రీ.శ. 1472-1517 సంవత్సరాలలో రెండవ పురుషోత్తమ భారతీ స్వాముల వారు ఉండిన విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఈ ఇద్దరిలో ఒకరు శ్రీ భారతీ తీర్థులు కావచ్చునని ఊహించారు. దీనిని పురస్కరించుకొని పెక్కుమంది సాహిత్యచరిత్రకారులు, శాకుంతలాది కావ్యపరిష్కర్తలు, విమర్శకులు ఆ ఇద్దరిలో రెండవ నరసింహ భారతీ స్వాముల వారే పినవీరనకు గురువు కావచ్చునని భావించారు.

      కాని, శ్రీ శృంగేరీ జగద్గురుపీఠం వారి చరిత్రలోని జగద్గురుపరంపర ఈ విధంగా లేదు. శ్రీ శృంగేరి పీఠం స్థానికచరిత్రను సాధికారికంగా రచించిన శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి పెక్కు ఆంగ్లాంధ్రరచనలను బట్టి, శ్రీ శంకరకృప పత్రికలో తత్సంపాదకులుగా వారు ప్రకటించిన పెక్కు వ్యాసాలను బట్టి; ధనికొండ విజయ గారు రచించిన శ్రీ శృంగేరీ పీఠము చరిత్ర అన్న గ్రంథాన్ని బట్టి; శ్రీ శృంగేరీ సంస్థానము వారు ప్రచురిస్తున్న అంతర్జాల సమాచారాన్ని (http://www.sringeri.net/jagadgurus) అధికరించి - ఆమ్నాయపీఠాన్ని క్రీ.శ. 1464-79ల నడిమి కాలంలో శ్రీ నృసింహభారతీస్వాముల వారు, 1479-1517ల మధ్య శ్రీ పురుషోత్తమభారతీ స్వాముల వారు అధిష్ఠించి ఉన్నట్లు తెలుస్తున్నది. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులైన ఈ మహాస్వాము లిద్దరికీ భారతీ తీర్థులన్న వ్యవహారం లేదు. శ్రీ నృసింహభారతీస్వాముల వారు, శ్రీ పురుషోత్తమభారతీ స్వాముల వారు అన్న పేర్లను శ్రీ నృసింహ భారతీతీర్థ స్వాముల వారు, శ్రీ పురుషోత్తమ భారతీతీర్థ స్వాముల వారు అని – శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారి వలెనే శ్రీ కుందూరి ఈశ్వరదత్తు గారు పొరబడినట్లు కనబడుతుంది. వారిపైని ప్రామాణ్యభావంతో అనంతరీయ పరిశోధకులు వారినే అనుసరించినందు వల్ల, వారూ పొరబడక తప్పలేదు.          

      వీరందరూ గుర్తింపని విశేషం మరొకటున్నది. పినవీరన స్తుతివాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవలసినదేమంటే - శ్రీ భారతీ తీర్థ యతిసార్వభౌముల వారు ఆయనకు ఇష్టదేవతాకోటిలో పరిగణింపబడినవారే కాని, సామాన్య వ్యక్తిమాత్రులు కారని ఇంతకు మునుపే అనుకొన్నాము. శాకుంతలము రచనాకాలానికి రెండవ నరసింహ భారతీ స్వాముల వారు పరమపదించారు. వారి తురీయాశ్రమస్వీకారానికి పూర్వోత్తరాలలో ఎప్పుడో పినవీరన శృంగేరికి వెళ్ళి వారి సన్నిధి రూపమైన పెన్నిధిని కైవసం చేసుకొన్నట్లు ఆధారాలు లేవు. అదే నిజమైతే, పినవీరన శైశవదశలో పిల్లలమఱ్ఱి నుంచి విజయనగరానికి సమీపాన ఉన్న శృంగేరికి వెళ్ళి, శ్రీ నరసింహ భారతీ గురుచరణుల వద్ద విద్యాభ్యాసం ముగించుకొని (లేదా, వారి వద్ద మంత్రోపదేశం పొంది), కొన్ని కొన్ని రచనలు చేసి, కవిగా ప్రతిష్ఠను గడించిన తర్వాత సోమరాజుపల్లెకు వచ్చి, అక్కడి నుంచి అతోధిక యశోలబ్ధి కోసం మళ్ళీ విజయనగరానికి వెళ్ళాడని భావింపవలసి ఉంటుంది.

      ఏ విధంగా చూసినా ఇది పొంది పొసగే నిర్ణయ మనిపించదు.

 

      ఇంతకీ శ్రీ భారతీ తీర్థుల వారిని గురించి సీమంతినీ పరిణయములో పెనుమళ్ళ సోమన చెప్పిన విశేషాలను ఈ విద్వన్నికరంలో కనీసం ఒకరైనా గుర్తింపకపోవటం నిజంగా ఆశ్చర్యకరం.

 

      సోమన 28 పద్యాలలో అతివిపులంగా చెప్పిన కథ ఇది:

      “పిల్లలమఱ్ఱి పురంలో మంత్రిశేఖరుడైన గాదిరాజుకు, ఆయన అర్ధాంగి నాగాంబకు లక్ష్మీసంపద లెన్ని ఉన్నా సంతానభాగ్యం కలుగలేదు. గాదిరాజు నిత్యాన్నదానాది కార్యజాతాన్ని తమ్ములకు అప్పగించి, శ్రీశైలానికి వెళ్ళి శ్రీ మల్లికార్జునస్వామిని ఆరాధించి, ఒక కొండగుహలో కూర్చొని ఆ స్వామి దర్శనార్థం తపస్సు మొదలుపెట్టాడు. స్వామి ఆతనికి ఆత్మాకారంలో ప్రత్యక్షమై, “ఈ జన్మకు నీకు సంతు కలగదు. మఱుజన్మలో పొందుదువుగాని లే” అన్నాడు. ఆ మాటకు గాదిరాజు బాధపడి, “స్వామీ! నీ దయ తప్పినందున సాధ్యం కాదని అన్నావు కానీ, నీవే తలచుకొంటే అసాధ్యం ఉంటుందా!” అని పలికి, కొండకు ఉత్తరాన పదిహేను కోసుల దూరంలో పాతాళగంగ వద్ద ఉన్న బిల్వవనంలో ఉంటూ దీక్ష వహించి, నలభై రోజులక్కడ తపస్సుచేశాడు. పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి మళ్ళీ ప్రత్యక్షమై, “నేను భద్రకాళీ వీరేశ్వరుడను” అని, అతని కోరికను విని, అతడు మరీ మరీ ప్రార్థించిన పిమ్మట, “ఇక్కడికి దక్షిణాన ఒక శైలగుహలో శ్రీ భారతీ తీర్థులని వేయిన్ని ఎనిమిదివందల యేండ్ల యతి ఉన్నాడు. ఆయనను ప్రసన్నం చేసికొని, మంత్రోపదేశం పొంది, నీవు మా దంపతులను ధ్యానిస్తే, మేము ఆలోచిస్తాము” అన్నాడు. గాదిరాజు ఆ ప్రకారం దక్షిణ గుహ ద్వారాన్ని చేరి, 

      “సీ.  అసదృశబ్రహ్మవర్చసవిలాసంబుచే

                           బాలభాస్కరు లీలఁ బఱఁగువాని

              బహువర్షములు చన్న పరమవృద్ధుం డయ్యుఁ

                           దారుణ్యనిధి వోలెఁ దనరువాని

              సకలేంద్రియముల చంచలత లేక

                           తరంగవిరహితాంబుధివోలె వెలయువాని

              సహజవైరము మాని జంతుసంతతు లెల్ల

                           సేవింపఁ గరుణ నీక్షించువాని

       గీ.    భారతీతీర్థ యతిసార్వభౌముఁ గాంచి

              వినయ మొప్పంగ నాతని వినుతిసేసి

              ముకుళితకరారవిందుఁ డై మ్రోల నిలువఁ

              గేవలకృపార్ద్రదృష్టి నీక్షించి యతఁడు. సీమంతినీ. (1-36)

      ఆ యతీంద్రుని ప్రసన్నుని కావించికొని, చేరువలో ఉన్న  వీరభద్రాలయానికి వెళ్ళి శ్రీ వీరేశ్వరస్వామిని స్వామిని అర్చించాడు. అప్పుడు భద్రకాళీసమేతుడై స్వామి సాక్షాత్కరించి, తాను “రెండు రూపములను” చెంది, వారింట అవతరింపగలనని మాటయిచ్చాడు.

      గాదిరాజు సంతోషాతిశయంతో స్వామికి ప్రణమిల్లి, కొన్నాళ్ళకు స్వగృహానికి వచ్చి, బంధుమిత్రులను కలుసుకొన్నాడు. నాగాంబ సంతసించింది. వారికి పెదవీరభద్రుడు, పినవీరభద్రుడు అని కవలలు; భద్రమ్మ అని ఒక కుమార్తె కలిగారు.

      పెనుమళ్ళ సోమన చెప్పిన ఈ కథ విశ్వాసయోగ్యం కాదని కొట్టిపారవేయలేము. తన కాలానికి, తమ యింటిలో చెప్పుకొంటున్న కథానకాన్ని ఆయన ప్రస్తావించాడు. ఆరుద్ర గారొక్కరే తమ సమగ్రాంధ్రసాహిత్యం (నాలుగవ సంపుటం)లో ఈ కథను ప్రమాణీకరించినా, అంతకు మునుపటి విమర్శకుల అభిప్రాయాలను క్రోడీకరించలేదు. లభ్యసాహిత్యికాధారాల ప్రకారం పినవీరన గురువైన శ్రీ భారతీతీర్థ యతిసార్వభౌములు వీరేనని విశ్వసించాలి. కనుకనే, పినవీరన తన జన్మకారకుడైన ఆచార్యుని కృతజ్ఞతాపూర్వకంగా,సం, ప్రార్థింతున్ యతిసార్వభౌము” అని మనసారా తలచుకొన్నాడు. నాటి వీరేశ్వరుని దయను స్మరించి, తన పెద్దకొడుకుకు “వీరన్న” అని; తమ కుటుంబానికి ఇలువేల్పు, తనకు జన్మను ప్రసాదించిన ఇలవేల్పు అయిన శ్రీశైల మల్లికార్జునస్వామి పేరిట రెండవ కొడుకుకు “మల్లేశ్వరు” డని పేర్లు పెట్టుకొన్నాడు. నిరంతర శివారాధనతత్పరుడై జన్మ చరితార్థం చేసుకొన్నాడు.

పివీ బిరుదులు

      భోగభాగ్యాలకు ఆలవాలమైన సత్కుటుంబంలో లేకలేక జన్మించి, అల్లారుముద్దుగా పెరిగినందు వల్ల, దుష్ప్రవేశాలయిన రాజాస్థానులలో సంచరించటం వలన, శివానుగ్రహప్రాప్తజీవితు డైనందున, మంత్రసిద్ధుడైనందున పినవీరన కొంత స్వభావతః ఉద్ధతుడైనట్లు కనబడుతుంది. జైమిని భారతము రచనావేళకు జీవితంలోని ఒడిదుడుకు లన్నింటినీ చూసినట్లుంది. మనస్సు కొంత స్తిమితపడింది. తొలినాళ్ళ ఉద్ధతి తగ్గి, శాకుంతలము గద్యలోని “ఆరాధితామరవీరభద్ర” అన్న విశేషణాన్ని తొలగించి, దాని స్థానంలో “వినయవిద్యాసముద్ర” అని వేసుకొన్నాడు. అయినా, వాణీమంత్రసిద్ధుడన్న ప్రసిద్ధి ఉండనే ఉన్నది. ఆ అతిశయం వల్లనే

వాణి నా రాణి

అన్నాడని తెలుగుదేశంలో ప్రచారం ఏర్పడింది. ఇది గాక వేరే బిరుదులేమీ పెట్టుకోలేదు. ఇదీ నిజానికి బిరుదు కాకపోయినా, పెనుమళ్ళ సోమన సీమంతినీ పరిణయము (1-44)లో

      “వాణి యిల్లాలుగాఁ గవిశ్రేణికెల్లఁ బృథుత

                     రాశ్చర్యకరమైన బిరుదు పూనె

అని, “బిరుద”మనే అన్నాడు. (పై ముద్రిత ప్రతి పాఠంలో గణభంగం ఉన్నది. వ్రాతప్రతులను చూచి సవరించాలి)

      ఈ ప్రశస్తివాక్యానికి మూడర్థాలను ఊహింపవచ్చును.

      మొదటి అర్థం: “వాణి నా రాణి” అనటం వల్ల కవి తనకు గల బ్రహ్మపదవీసిద్ధిని సూచిస్తున్నాడని. ఉపనిషత్తు సైతం “కవి ర్మనీషీ పరిభూః స్వయంభూః” అన్నది కదా. ఆ బ్రహ్మయే బ్రహ్మము. వేదము, జ్ఞానము, తపస్సు, అధ్యాత్మము, తత్త్వము, చేతనాచేతనములు ఆ బ్రహ్మవస్తువే. తన అనుభూతికి శాస్త్రము కారణముగా కలది; సర్వశక్తిసంపన్నము అయిన పరమాత్మ అది. ద్వైతశూన్యము, మనోవాక్కులకు గోచరింపనిది, సత్తామాత్రము, స్వసంవేద్యము, జ్ఞానరూపము అయిన సద్వస్తువు. అఖండము, అద్వితీయము, సత్ చిత్ ఆనందమైన ఆ బ్రహ్మపదార్థము సాక్షాత్తు అపరోక్షమని సాధన మూలాన అవగతమైంది. సృష్టి సమష్టి స్థూల సూక్ష్మ కారణరూపాలైన ఎటువంటి ఉపాధులు లేని శుద్ధచైతన్యస్వరూపం. కవి బ్రహ్మోపాసన వల్ల ఆ బ్రహ్మత్వసిద్ధిని చూరగొన్నాడు. ప్రాప్యము ప్రాపకునికి ప్రాప్తిగా పరిణమించింది. “పరమబ్రహ్మానుసంధాత” అయ్యాడు.

      ఆ బ్రహ్మత్వసిద్ధి వల్లనే అఘటనఘటనాత్మకమైన సామర్థ్యం,యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే” అన్న విశ్వాసం కలిగాయి. వాణీభర్తృత్వగౌరవం ఏర్పడింది. తత్సూచకంగా,వాణి నా రాణి” అని ప్రకటించాడు.

      పర్యాయాన,వాణి నా రాణి” అనటం వల్ల కవి తాను వాణీభర్తృత్వసిద్ధి మూలాన “కవిబ్రహ్మ” నని, ఆ బిరుదు గల ఒకేఒక్క కవి తిక్కన గారు కావటం వల్ల – తాను సాక్షాత్తు తిక్కయజ్వ అంతటి వాడినని చెబుతున్నాడు.  “తిక్కన యజ్వ వాగ్భక్కికామోదంబు చెలువు కర్ణముల వాసింప నేర్చు” అని శాకుంతలములో సగర్వంగా చెప్పుకొన్నాడు కదా. ఇది రెండవ అర్థం.

      “వాణి నా రాణి” అంటే “కవిబ్రహ్మ” అన్న బిరుదానికి సామ్యప్రకటనం అన్నమాట! ఆ అభిజ్ఞానం ఉన్నవాడు కనుకనే, కవిత్రయం వారు తెలుగుచేసిన వ్యాసప్రోక్త మహాభారతమునకు తులగా జైమినిప్రోక్తమైన జైమిని భారతమును చేపట్టి నిర్విఘ్నంగా తెలుగుచేశాడు.

      ఇక, మూడవ అర్థం: “వాణి = సరస్వతి; నా = నా యొక్క; రాణి = ధ్యేయవస్తువైన భగవతి మహారాజ్ఞి” అని ప్రతీయమానం. తాను శారదోపాసకుడనని భావం.

      ఈ ఉపాసన విషయాన్ని మళ్ళీ సవిస్తరంగా ప్రస్తావిస్తాను.

      ఇందులో మరొక చమత్కారం కూడా ఉన్నది: వాణి నా(న్) = సరస్వతి అనగా; రాణి = సర్వారాధ్య అయిన దేవి” అని శాస్త్రనిర్దేశం.

      ఆంధ్రపురాణములో శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు ఈ చమత్కృతార్థాన్ని ఊహించి, సన్నివేశోచితంగా ఎంతో సొగసుగా ప్రయోగించారు.

      జైమిని భారతము (8-219)లో పినవీరన “కుకవిమల్లకషోల్లసత్కులిశహస్తపల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి” అని తనను గూర్చి “కుకవిమల్లకషోల్లసత్కులిశహస్తపల్లవుఁడు” అనే విశేషణాన్ని వేసుకొన్నాడు. నిజానికిది బిరుదు కాదు. ఈ పాఠమూ సమంజసంగా లేదు.

      కవి కుకవులను మల్లురతో పోల్చి చెప్పాడు. ఆ మల్లురకు ఒరపిడి పెట్టగల ఉల్లసత్ కులిశము (వజ్రాయుధము) వంటిది ఆయన హస్తపల్లవం.

      ఈ దళంలో “కులిశము వంటి హస్తము” లేదా “కుకవులు అనే మల్లులకు (కల్పన అల్లుకోవటానికి అనుక్షణం కుస్తీ పడుతుంటారని కాబోలు మల్లురతో పోల్చాడు) ఒరపిడి పెట్టే కులిశమైన హస్తము” అని చెప్పిన తర్వాత ఆ హస్తమునకు పల్లవము (చిగురు)తో తాద్రూప్యాన్ని చెప్పటం భావ్యంగా లేదు. “కుకవిమల్లకషోల్లసత్కుశలహస్తపల్లవుఁడు” అని చెప్పుకొంటే సముచితంగా ఉంటుంది. “మల్లురకు ఒరపిడి పెట్టుటయందు నిపుణమైన హస్తమనెడి పల్లవము” అని పదాల ఉత్తరోత్తరాన్వయంతో విగ్రహవాక్యం చెప్పుకోవటం సులువు.

      ఈ పాఠం ఈ విధంగానే ఉండాలని నిరూపించటానికి నాకు ఇంకొక ఆధారం దొరికింది. క్రీ.శ. 1890 ప్రాంతం నాటి పరవస్తు మునినాథకవి జైమిని భారతములో పినవీరన కల్పనను అనుసరించి తన “లక్ష్మీ శతకము”లో ఈ విధంగా చెప్పుకొన్నాడు:

      “అనుపమకవితారచనా

       ఘనప్రవీణుండ మదకుకవిమూర్ధవిలుం

       ఠనకుశలహస్తపల్లవుఁ

       డను మునినాథాభిధానుఁడను శ్రీలక్ష్మీ!

      అని.  మునినాథకవి యెదుట పినవీరన పాఠం “కుకవిమల్ల కష ఉల్లసత్ కుశల హస్తపల్లవుఁడు” అని ఉన్నందువల్లనే ఆయన “మదకుకవి మూర్ధవిలుంఠన కుశల హస్తపల్లవుఁడు” అని వ్రాసుకొన్నాడు.  ఇంతకంటె మేలైన సాక్ష్యం ఇంకేమి కావాలి?

      జైమిని భారతములో ఈ ప్రకారం “కుకవిమల్లకషోల్లసత్కుశలహస్తపల్లవుఁడు” అని పద్యపాఠాన్ని సరిదిద్దుకోవాలి.       

పివీ కృతులు

      సాధననైరంతర్యం వల్ల, అవకాశాలు కలిసివచ్చినందున పినవీరన కృతిరచన బహుముఖీనంగా సాగింది. కావ్యగౌరవానికి తగిన ప్రజాదరణ పుష్కలంగా లభించింది. చరిత్రగతిలో ఆ కావ్యాలన్నీ లభింపకపోయినా, విమర్శకులు వాటి స్వరూప స్వభావాలను గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. ఆ యత్నాలన్నింటికీ ముఖ్యాధారం శాకుంతలములో చిల్లర వెన్నమంత్రి కావించిన ప్రస్తావనమే. ఆ పద్యం ఇది:

      “సీ.  రచియించినాఁడవు రమణీయవాగ్రీతి

                           నవతారదర్పణం బభినవముగఁ

              బల్కినాఁడవు తేటవడఁజేసి నారదీ

                           యము సత్కవిశ్రేణి యాదరింపఁ

              జెప్పినాఁడవు శేముషీవిశేషంబున

                           మాఘమాహాత్మ్యంబు మంజుఫణితిఁ

              గావించినాఁడవు ఘనబుద్ధి మాన

                           సోల్లాససారము సముల్లసితశయ్య

       గీ.    భారతీతీర్థయతిసార్వభౌమ గురుకృ

              పాతిశయలబ్ధకవితావిభూతిఁ గలిగి

              గౌరవముఁ గాంచినాఁడవు కవులచేత

              విపులచాటూక్తినిర్ణిద్ర! వీరభద్ర! శాకుంత. (1-22)

      ఈ పేర్లను బట్టి విమర్శకులు వీటి కథాసంవిధానాన్ని, స్వరూప స్వభావాలను యథాయోగ్యంగా ఊహించారు.  

 

౧.  అవతారదర్పణము   

      వీటిలో మొదటిది అవతారదర్పణము. వ్రాతప్రతిలో దీనికి నవరసదర్పణము అనే పాఠాంతరం ఉన్నది కాని, ఆ పక్షాన యతిభంగం అవుతుంది. లేదా, వ – భ లకు ప్రాసయతిని అంగీకరింపవలసి వస్తుంది. అంతేకాక,తొమ్మిది రసములకు దర్పణం వంటిది” అన్న శీర్షికే అర్థరహితం. రసతరంగిణి, రసదీర్ఘిక, రసకౌముది, రసరత్నాకరముల వలె సార్థకమైనది కాదు. అవతారదర్పణము అన్న కావ్యం సంస్కృతంలో లేదు. క్షేమేంద్రుని ఏ దశావతారచరిత వంటిదో అనుకొందామంటే, ప్రారంభంలోనే అటువంటి వైష్ణవీయకావ్యాన్ని చేపట్టి ఉంటాడా? అని సందేహం. శాకుంతలము పీఠికలో తత్పరిష్కర్త్రి ఆచార్య నాయని కృష్ణకుమారి గారు ఆ కావ్యంలో పినవీరన “పృథివి కవతంసమణి యైన బిట్రగుంట, తానకంబుగ నవతారమైనవాఁడు, భైరవస్వామి (1-5)” అని చేసిన ప్రార్థనవాక్యాన్ని పురస్కరించుకొని, అది భైరవస్వామి యొక్క అవతారములకు దర్పణప్రాయం కావచ్చునేమో! అని ప్రతిపాదించారు. పెనుమళ్ళ సోమన సీమంతినీ పరిణయము (1-46)లో “అవతారదర్పణం బన్న కావ్యముఁ జేసె” అని, పై పద్యభాగాన్నే అనువదించుకొన్నాడు. అయితే, భైరవస్వామి యొక్క అవతారములకు దర్పణము; శ్రీమహావిష్ణ్వవతారములకు దర్పణము అన్న అర్థం వచ్చే కావ్యనామంతో పినవీరన ఒక కృతిని వ్రాసి ఉంటాడనటం అంగీకార్య మనిపించటం లేదు.

      మరి, నవరసదర్పణము అన్న పాఠాంతరం ఎందుకేర్పడిందో కూడా కొంత చర్చనీయమే. వ్రాతప్రతులలో నిష్కారణంగా ఇటువంటి పాఠం పుట్టదు కదా. ఏమంటే, కవికి ఆలంకారికగ్రంథాలంటే అమితాభిమానం. లాక్షణికదృష్టి, అనేకలౌకికశాస్త్రాల పట్ల అభినివేశం ఉన్నవాడు. శ్రీనాథుని తర్వాత అలంకారశాస్త్ర గ్రంథాలను ఇంతగా అభిమానించిన ప్రసిద్ధకవి వేరొకరు కనబడరు. శాకుంతలము పూర్వకవిస్తుతి (1-10)లో వరసపెట్టి,లల్లటుని ... భామహుని దండి వామను భాను” అంటూ 1) లల్లటుని (“లల్లటుని” సరైన పాఠం కాదు. “లోల్లటుని” అని ఉండాలి. భట్ట లోల్లటుడు భరతుని నాట్యశాస్త్ర వ్యాఖ్యాతలలో ఒకడు); 2) భామహుని; 3) దండిని; 4) వామనుని; 5) భానుకవిని (సుప్రసిద్ధమైన రసమంజరీ కర్త) - మొత్తం అయిదుగురు ఆలంకారికశిరోమణులను ప్రస్తుతించాడు. ఈ తీరు లక్షణాభిమానం వల్ల నందికేశ్వరుని అభినయదర్పణము వంటి ఏ కృతినో “అభినవముగ = అభినవగుప్తాచార్యుల సంప్రదాయానుసారం)” తెలుగుచేశాడేమో పరిశీలింపవలసి ఉన్నది. చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో తెలుగు అభినయదర్పణము అనువాదపద్యకావ్యం వ్రాతప్రతు లున్నాయి. వాటిని సాకల్యంగా పరిశీలిస్తే, అసలు పాఠం “రచియించినాఁడవు రమణీయవాగ్రీతి నభినయదర్పణం బభినవముగ” అని ఉండినదేమో తేటతెల్లమవుతుంది. గ్రంథాలయం వారు వర్ణనాత్మక సూచిలో ఇచ్చిన పద్యాలు గ్రంథకర్తృత్వనిశ్చయానికి ఉపకరింపలేదు. అంతవరకు, అవతారదర్పణము అన్న పాఠమే అంగీకర్తవ్యం.

౨.  నారదీయము

      రెండవ కృతి నారదీయము. పేరును బట్టి ఇది నారదుని చరిత్ర కావచ్చునని కొందరు; నారద పురాణమునకు అనువాదమని కొందరు భావిస్తున్నారు. రెండూ సరికాదనిపిస్తున్నది.

      పినవీరన కేవల భక్తికావ్యాలను చేపట్టలేదు. అది ఆయన స్వభావం కాదు. కావ్యం కాంతాసమ్మితంగా ఉంటూనే,యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర-క్షతయే” రచింపబడాలన్న విశ్వాసం కలవాడు. శ్రీనాథ పోతనలు నిర్మింపగా సుగమమైన మార్గంలో నడిచి, యాతాయాత గాతానుగతికుల కోవలో చేరదలచినవాడు కాదు. నన్నయ తిక్కనలకు నడుమ నిలిచి ఎఱ్ఱన ఆ రెండు మహాతరంగిణులకు సౌమ్యవారధిని నిర్మించినట్లు తన కల్పనాసామర్థ్యం తోనూ, నవీనేతివృత్తాభిమానం తోనూ అటు పురాణయుగానికి, ఇటు ప్రబంధయుగానికి మధ్య పూలవంతెన కట్టాడు.      

      ఈ నారదీయము తెలుగువారికి “తేటవడ”జేయాలన్న సంకల్పంతో “సత్కవిశ్రేణి యాదరింప” చెప్పిన రచన. బహుశః కృతిభర్త ప్రేరణ మూలాన గాక – స్వయంగా ఎన్నుకొన్న వృత్తాంతమై ఉంటుంది. విమర్శకు లూహించినట్లు ఇది నారదుని భక్తిమయజీవనగాథ అయివుండదు. “నారదీయము” అన్న పేరే - అది నారద పురాణము కాని, నారద భక్తిసూత్రములు కాని, నారదుని గాథ కాని కాదని వేనోళ్ళ ప్రకటిస్తున్నది. అది సంస్కృతంలో దురవగాహంగా ఉన్న రచనను సులభగ్రాహ్యం చేసి,తేటవడ”జేయాలన్న సంకల్పంతో “సత్కవిశ్రేణి యాదరింప” చెప్పిన రచనమై ఉండాలి. నారద పురాణము కాని, నారద భక్తిసూత్రములు కాని ఆ కోవకు చెందవు.

      మరయితే,నారదీయము” ఇతివృత్తము ఏమైవుంటుంది?

      “నారదీయము” సంస్కృతంలోని నారదీయ ధర్మసూత్రములు గ్రంథానికి తెలుగుసేత. దీనికే నారద స్మృతి అని నామాంతరం. మూలఘటిక కేతన తెనిగించిన విజ్ఞానేశ్వరీయము తర్వాత తెలుగులో ఇది రెండవ ధర్మశాస్త్రగ్రంథానువాదం. పరిమాణంలో విజ్ఞానేశ్వరీయము కంటె పెద్దది. రెండు ఖండాలలో - 9 + 18 = మొత్తం 27 అధ్యాయాలలో ఉన్న బృహద్రచన. 

      శాకుంతల శృంగారకావ్యము చివర దుష్యంతుడు కొడుకుకు పట్టాభిషేకం చేసి, రాజ్యభారాన్ని అప్పగించి, నారద మహర్షిని “జనతాపాలనహేతునీతిని (4-157)” ఉపదేశింపమని అభ్యర్థిస్తాడు.  అప్పుడు మహర్షి బోధించిన నీత్యుపదేశం – చతుర్థాశ్వాసంలో 161-వ పద్యం మొదలుకొని 178-వ పద్యం వరకు వ్యాపించి ఉన్నది. ఈ భాగమంతా నారదీయ ధర్మసూత్రములు ఆధారంగా రచింపబడినదే.

      కనుక,పల్కినాఁడవు తేటవడఁజేసి నారదీయము సత్కవిశ్రేణి యాదరింప” అని వెన్నమంత్రి పలికినది నారదీయ ధర్మసూత్రములు అనువాదవిషయమని నిశ్చయింపవచ్చును.

 

౩.   మాఘమాహాత్మ్యము

 

      పినవీరన చెప్పిన మూడవ కృతి మాఘమాహాత్మ్యము. తమిళదేశంలోని కుంభకోణం క్షేత్రంలో మాఘోత్సవం నాడు అక్కడ నదీస్నానం చేస్తే కలిగే పుణ్యఫలం ఇందులోని ఇతివృత్తం. పద్మపురాణము ఉత్తర ఖండములో 47 అధ్యాయాలలో ఉన్న కథ. తెలుగులో ఒక మాస మాహాత్మ్యాన్ని వర్ణిస్తున్న తొలి కావ్యం ఇదే. మడికి సింగన కొంత సంక్షేపంగా చెప్పిన భాగాన్ని పినవీరన విస్తరించి, కావ్యోచిత మర్యాదలతో తన “శేముషీవిశేషము”తో “మంజుఫణితి”ని చెప్పివుంటాడు.

 

౪.  మానసోల్లాస సారము

 

      ఇది కావించినాఁడవు ఘనబుద్ధి మానసోల్లాస సారము సముల్లసితశయ్య” అని కవి చెప్పుకొన్న నాలుగవ కావ్యం. గ్రంథనామాన్ని బట్టి కావ్యతత్త్వాన్ని ఊహింపవలసి ఉంటుంది.

      టేకుమళ్ళ అచ్యుతరావు గారు తమ విజయనగర సామ్రాజ్యమందలి ఆంధ్రవాఙ్మయచరిత్రము (మొదటి భాగం)లో ఇది తైత్తిరీయోపనిషత్తుకు శ్రీ విద్యారణ్యస్వామి చెప్పిన మానసోల్లాస వ్యాఖ్యకు ఆంధ్రీకరణమై ఉంటుందని ఊహించారు.  జగద్గురు శ్రీమదాదిశంకరాచార్యుల దక్షిణామూర్తి స్తోత్రమునకు శ్రీ సురేశ్వరాచార్యుల వారు చెప్పిన వ్యాఖ్యకు కూడా మానసోల్లాసము అని పేరున్నది. ఇవి రెండూ అద్వైతశాస్త్రగ్రంథాలు. భక్తకోటికి నిత్యోపాదేయాలు. కాని, ఒకానొక ఉపనిషద్భాష్యాన్ని – అదెంత ప్రామాణిక మైనప్పటికీ – కావ్యరూపంలో తెలుగుచేయటం అన్నది ఎంతో అరుదుగా కాని జరగని పని. అటువంటి కేవల నిష్కైవల్యశాస్త్రాన్ని తెలుగుచేయటం పినవీరన స్వభావధర్మమూ కాదు. ఇక శాంకరీయ దక్షిణామూర్తి స్తోత్రము మరీ లఘుతరమైన ప్రకరణగ్రంథం. పినవీరన దానిని కావ్యసామాన్యంగా మలిచి ఉండటం అనూహ్యమైన సన్నివేశ మవుతుంది.

 

      ఇక మిగిలినదొక్కటే. క్రీ.శ. 1126-1138ల నాటి పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల, భూలోకమల్ల, సర్వజ్ఞభూప మూడవ సోమేశ్వరుని ఉత్తమ విజ్ఞానసర్వస్వమైన మహాకృతి అభిలషితార్థ చింతామణి అని పేరొందిన మానసోల్లాసము. లౌకికశాస్త్రవర్ణన పురస్సరమైన ఈ రచన పినవీరన స్వభావానికి, దృగ్విషయానికి తగిన గ్రంథం. గ్రంథ పరిమితి అత్యంతవిస్తృతం. మొత్తం నూరు అధ్యాయా లున్నాయి. ఈ నూరింటిని సోమేశ్వరుడు 1) రాజ్యప్రాప్తికరణ వింశతి 2) రాజ్యస్థైర్యకరణ వింశతి 3) ఉపభోగ వింశతి 4) వినోద వింశతి 5) క్రీడా వింశతి – అని అయిదు విషయవిభాగాలతో అపురూపంగా తీర్చిదిద్దాడు.  మహావిద్వాంసుడైన ఆ రాజు రచన పినవీరనకు మెచ్చుగొలిపి, అనువాదానికి ఉపక్రమించి ఉంటాడు. సోమేశ్వరుని గ్రంథం అత్యంతవిస్తారితం కనుక దానిని సంక్షేపింపక తప్పదు.  అందువల్లనే,కావించినాఁడవు ఘనబుద్ధి మానసోల్లాస సారము సముల్లసితశయ్య” అని తాను రచించినది “సారసంగ్రహం” మాత్రమే అని స్పష్టం చేశాడు.  

 

      ఇవన్నీ పినవీరన అలబ్ధకృతులు. లభించినవి రెండే. 1) శాకుంతల శృంగార కావ్యము 2) జైమిని భారతము.

 

      ఈ రెండిటిని అధికరించిన కొన్ని నూత్నవిశేషాలను మరుసటి నెల వ్యాసంలో వివరిస్తాను.  

 

      (ఈ వ్యాసరచనాకాలంలో శ్రీ శృంగేరి జగద్గురు సంస్థానము నుంచి ఆవశ్యకాలైన ఆధికారిక వివరాలను సేకరించి ఎంతగానో తోడ్పడిన విదుషీమణి శ్రీమతి పప్పు శాంతాదేవి గారికి; ఈ వ్యాసపరంపరను ఎప్పటికప్పుడు చదివి, గుణదోషాలను ఎఱుకపఱచి, ఈ వ్యాసంగానికి అమోఘమైన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్న సహృదయిని, విద్వద్విమర్శకతల్లజ డా. రాయదుర్గం విజయలక్ష్మి గారికి, నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.) 

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech