సుజననీయం  
 

 

                                      

 

                                                            రచన : రావు తల్లాప్రగడ

 
 

స్పర్ధయా వర్ధతే విద్యా

సంగీతసాహిత్యనటనల యందు, వాగ్ధాటినందు, వినమ్రతనందు, చమత్కారశైలినందు, అన్నిటా, తనకు సాటిలేడని నిరూపించుకున్న తనికెళ్ళ భరణిని చూస్తే ఎవరికైనా కొంచెము అసూయ అన్నది సంభవించడము కొంత సహజమే. ఆ బాధతోటే ఆ తల్లితో ఇలా మొర పెట్టుకున్నాను.

సీ.|| ఆ దేవి చిక్కునా యవ్వారు వెదకినా - మన యందరకు నామె మాత యైన?

ధరణి యందున యెట్లు ధరణమై సిద్దించు - వాగ్ధాటి ధారణ వాసికెక్క?

మాతంగి యాకాశ మంతయూ నిండినా - దహరము నింపగ తరము కాదె?

మాతాకటాక్షము మాకు కావలెనంచు - కోరినా మాకేల కూర్మి లేదు?

తే.గీ.|| శివునికి తన సగమొసగు స్త్రీత్వమూర్తి - లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి,

మాకు మిగిలిన దేమమ్మ మందగమన - తక్కిన సగము తనికెళ్ళ తనయుడవ్వ!?

.వె|| మానవుడని కూడ మతిసేయకగ వచ్చు - తల్లి, సురవరతరి త్వరగతికి,

కాళిదాసు కూడ కాళీగ కన్పించ, - నింక మాగతేమి, ఈతి తీర్చు!

అప్పుడు  కలలో కనిపించి, తల్లి ఇలా చెప్పింది, దుఃఖించకు నాయనా..

సీ.|| దృష్టికందని నాదు దృశ్యము దర్శించి - ధన్యుడ వైతివే ధరన నీవు!

కవితధోరణితోడ భవితనటనమున - కమనీయ రచనల కదను త్రొక్కి,

పేరు తెచ్చును వాడు పేదింత పేదింత! - నీవాడు గొప్పైతె నీకు కాద!

భరణికాడయ్య యాభరణమే వాడయ్య - నాకు కాదది నీకె, నమ్ము నన్ను!

తే.గీ.|| మూతిమూడెకరాలవ్వు ముక్క తోటి - మాత మాటకు మంచులా మనసు కరుగ,

తల్లి తీర్పుకు తీరుగా చల్లబడితి - స్పర్థ తెచ్చినానందపు స్పర్శతోటి!

ఇక ఆ మాట విన్న తరువాత భరణిగారి పైన అసూయ కాస్తా అభిమానముగా మారి, ఆయనని వదలి వెళ్ళాలంటే, కాళిదాసు చెప్పినట్ట్లుగా ఇలా అనిపించింది,

తే.గీ.||తనువు ముందుకే వెళ్ళినా ధరణి మీద - దృష్ఠి రెపరెపలాడుచూ తిరిగి చూచె,

రథపతాకము వలె ప్రతిపథము వైపు - రమ్యగుణగణధామ శ్రీరామచంద్ర!

 

సిలికానాంధ్ర ఏకాదశ జన్మదినోత్సవంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదము చేసిన శ్రీ తనికెళ్ళ భరణిగారికి కృతజ్ఞతాభివందనాలు. భరణిగారితో పంచుకున్న కొద్ది క్షణాలు, మనతో పాటుగా వారికి కూడా ఆనందాన్ని పంచుతాయని ఆశిస్తూ, వారిని మళ్ళీమళ్ళీ కలవాలని కోరుకుంటూ, వారికి అన్నిరకాల విజయాలు అన్ని రంగాలలోనూ అందాలనీ కోరుకుంటూ, వారు ప్రతి ఆంధ్రునికీ ఒక గర్వకారణమై నిలవాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాము.

ఇలాగే సిలికానాంధ్ర అనేక జన్మదినాలను జరుపుకోవాలనీ, భవిష్యత్తులో మరిన్ని గొప్పగొప్ప కార్యక్రమాలను అనేకము చేపట్టాలనీ కోరుకుంటూ, మీ ఆశిస్సులను కోరుకుంటూ, సిలికానాంధ్రకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ,

సెలవు

మీ

రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 


Sujanaranjani