Sujanaranjani
           
  కబుర్లు  
  సెటైర్
          ఏభై డాలర్ల కురుక్షేత్రం గోల  
 

- రచన : మధు పెమ్మరాజు

 
 

ఆదివారం పొద్దున్న నా రూమ్లో చీమ నడిచినా వినిపించేంత నిశ్శబ్దం, కురుక్షేత్రం సినిమా చూడ్డం మొదటిసారేమో రెప్పలు ఆర్పకుండా తీక్షణంగా చూస్తున్నా..మహాభారతంలోని ఘట్టాలు ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా చూసినా కొత్తగానే ఉంటాయి. మెల్లిగా తలుపు తెరిచి మా అమ్మాయి "నేను ఇప్పుడే బార్బీ కార్టూన్ చూడాలి, ఇప్పుడే చూడాలి” అని నా పరిశోధనని దాని నసతో భంగపరిచింది. "ఉండవే ఒక్క అర గంటలో లాప్-టాప్ ఇచ్చేస్తా" అని సర్ది చెప్తుంటే, ఎవడి పిచ్చి వాడికి ఆనందం" అని వెనకాల మా ఆవిడ వెటకారం...అసలు నేను 2012 లో 1977 సినిమా చూడవలసిన అవసరం ఎందుకొచ్చిందో చెప్పడానికి ముందురోజు జరిగిన విషయంతో మిమ్మల్ని ముడిపెట్టాలి.
"బావగారు! అవెంజర్స్ సినిమా 'కేక' వెళ్లి చూడండి" అని మా బామ్మర్ది సినీసాయం, ఎంత సిలికాన్-వాలీ వాళ్ళు చెప్తే మాత్రం ఒగుర్చుకుంటూ చూడ్డానికి నేనేమైనా ఇచ్చాపురం వాడినా? వయసు కంటే అపనమ్మకం వేగంగా పెరుగుతున్నవాడిని. ఆ మాటలో ఎంత నిజముందోనని కంగాళీగా అన్ని సైట్లల్లో రివ్యూలు పావు గంటలో కిళ్ళీ నమిలినట్టు నమిలేసా, ప్రతి చోటా 'మేము భరోసా ఇస్తున్నాం వెళ్లి చూడు' అని నా పేరు పెట్టి గట్టిగా రాసారు. ఇక దాని సంగతి తెలుద్దామని మా బలగాన్ని "అవెంజర్స్ అనే కొత్త సినిమా చాలా బావుందిట....మన చందా ఇచ్చి వద్దాం" అని సిద్ధం చేసి, పద్మవ్యూహంలో అభిమన్యుడి చివరి ప్రయత్నంలా డిస్కౌంట్ కూపన్ కోసం సైట్స్ కలియ తిరిగా, యాభై డాలర్ల ఖర్చు కంటే ఒక డాలర్ అదా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. తప్పని ఓటమిలో చివరి గెలుపు!
ధియేటర్లో లైట్లు ఆరగానే రాబోయే చిత్రాల ట్రైలర్స్..వరద నీళ్ళల్లా మొదలు , వాచీలో చూస్తే నలభై నిమిషాలపాటు ఆపకుండా వాయించేశారు, ఓ సమయానికి అసలు ఎక్కడికి వచ్చామో? ఎందుకొచ్చామో మర్చిపోయా ‘A/C నే కదా ఎంజాయ్ చెయ్యి’ అనుకుందుకు నేనేమైనా తణుకు నరెంద్రలో మండువేసవి, మాట్న...కూల్ ఎయిర్ కోసం రాలేదు కదండీ!
సినిమా పేర్లు పడ్డాకా సీన్ –ఓ దుష్టుడు అదేదో ఎత్తుకెళ్ళి పోయాడు దాంతో ప్రపంచానికి మళ్ళీ ముప్పు వచ్చింది ...ప్రభుత్వ ఆఫీసులో ముసలాయనలా పాపం, ఓ పెద్దాయన ఐరన్ మాన్, తొర్, హల్క్, కాప్టైన్ అమెరికా లాంటి విచిత్ర వేషగాళ్ళ కాళ్ళు, గడ్డం, తోక విడి విడిగా పట్టుకుని, బతిమాలి పనులు పురమాయించాడు. వాళ్ళలో నేనూ ఒకడినై ప్రపంచాన్ని రక్షించాలని బాధ్యతగా చూస్తున్నా, మొదట్లో మాటలు అర్థం కాకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ బానే అనిపించాయి..కొన్ని రీళ్ల తర్వాత సూపర్ హీరోస్ అంతా ఒకచోట జేరేసరికి పాత ఫ్యాక్షన్ గొడవలు, కండకావరం బయటపడి..వినాశకాలం అని కూడా చూడకుండా గొడవలు మొదలు పెట్టారు అంతే ఆ సీన్ నుండి నా ఫ్యూస్ ఎగిరిపోయింది!
వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారో తెలియాలంటే, ఈ సినిమా చూడక మునుపే ఇప్పటి దాక విడుదల అయిన 18 సూపర్ హీరో సినిమాలు (పార్ట్స్) చూసి ఉండాలి, అప్పుడు వారి గుణ, గణాలు, మనస్పర్ధలు తెలిసి ఈలలు వేస్తూ ఎంజాయ్ చెయ్యగలిగేవాడినని...అయినా చివరి బొట్టు ఓపిక, ఏకాగ్రత కూడగట్టుకుని చూసినా వ్రతఫలం దక్కలే - బాష కాదండి బాబూ సమస్య..సందర్భం! నా పరిస్థితి అర్థమయ్యి మా రెండేళ్ళవాడు ఏడుపు మొదలుపెట్టాడు, స్క్రీన్ పై సూపర్ హీరోల దొమ్మీ కంటే వాడి ఏడుపు బెటర్ అనిపించింది, ఓ పక్క వెళ్లి పోదామంటే చెమటతో నిండిన నా యాభై డాలర్స్..ఇంకో పక్క మా ఆవిడ ముందు పరువు, రేపొద్దున అందరికీ "మా వారికి ఇంగ్లీష్ సినిమాలు అస్సలు అర్థం కావు, దుబాయ్ శీను పద్నాలుగు సార్లు చూసారు, అయన లెవెల్ అంతే" అని చెప్పడమే కాకుండా ఫేస్బుక్లో స్టేటస్ పెడుతుంది..దానికి లైకులు, నా మొహానికి ఎండిన పూదండలాంటి కామెంట్స్!!
నన్నెలాగైనా రక్షించాలని మా వాడు ఏడుపు ఉదృతం చేసాడు "మీరు సినిమా చూస్తూ ఉండండి, నేను వీడిని బయటకి తీసుకెళ్తా" అని మా ఆవిడ త్యాగం చెయ్యబోతే, కలిసొచ్చిన అదృష్టాన్ని వదులుతానా చెప్పండి, కొండవీటి సింహంలో ఎన్.టీ.ఆర్లా "లక్ష్మీ! చీకట్లో ఒక్కత్తివే వెళ్తావా, నేనూ వస్తా" అని సింపతి వోట్లతో బయటపడ్డా....ఆ సాయంత్రం మా బామ్మర్దికి ఫోన్లో "సినిమా నిజంగానే అదిరింది..భలే సలహా ఇచ్చావ్, ముందు ముందు ఇలాంటివి చెప్తూ ఉండు" అని ఇంకే వివరాలు అడగనివ్వకుండా పెట్టేసా!
ఏ సినిమా అయినా ముందు, వెనకాల (sequels, prequels) సంబంధం లేకుండా అలరించాలి!! అవెంజేర్స్ సినిమా అసంప్షణ్, నాకు అస్సలు నచ్చని విషయం ఏమిటంటే ప్రేక్షకులకి ఆ సూపర్ హీరోస్ పక్కింటి వాళ్ళంతా దగ్గరగా తెలియాలి..తెలీనివారు హోమ్ వర్క్ చేసుకుని రావాలి. ఆ విషయం నివృత్తి చేసుకుందుకు ఆపరేషన్-కురుక్షేత్రం మరుసటి రోజు మొదలు పెట్టా- మహాభారతం కధలకి మూలం, చాలా నిర్దుష్టమైన, లక్షణమైన పాత్రలు...ఇవన్నీ తెలీని విదేశీయుడు సబ్-టైటిల్ల్స్ తో చూస్తే సినిమా అర్థం అవుతుందా?- లేక అర్థం అవ్వడానికి ఆ పాత్రలు తెలిసి తీరాలా? అసలు మనవాళ్ళు అంత పెద్ద గ్రంథంలోని ఓ ముఖ్య ఘట్టాన్ని ఎలా చూపారు? అనేది నా పరిశోధన. మొదటి సీన్ నుండి కౌరవులు /పాండవులు రాజ్య విభజనపై చర్చ..ముఖ్య పాత్రలు మధ్య వైరం చూపుతూ, సీన్స్ అల్లుతూ క్లైమాక్స్కి తీసుకెళ్ళారు.. అస్సలు సౌండ్ లేకుండా చూసిన కురుక్షేత్రం, డోల్బి డిజిటల్- అవెంజేర్స్ కంటే బాగా అర్థం అయ్యింది.
వారానికొకటి విడుదల అవుతున్నసూపర్ హీరోల (వి)చిత్రాలు భరించలేకుండా ఉన్నాయి, అన్నీ ఒకటే ఫార్మాట్ - న్యూయార్క్ నగరంలో ప్రళయం (అంటే ప్రపంచ ప్రళయం), ఒక వికృత విలన్, దద్దరిల్లే స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్, రక్షకరత్న సూపర్ హీరో..పెద్దగా మార్పులు లేకుండా, ఊహించే ఫ్రేం-వర్క్ గల ఎస్కేపిస్ట్ మూవీస్. మా ఐ.క్యూ చాలా ఎక్కువ..ఏం జరుగుతుందో ముందే పట్టేస్తాం, అని ప్రేక్షకుడికి అనిపించాలి!! ఆ చట్రంలో ఎన్ని కుప్పి గంతులైనా వేస్తారు. హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా...ఏ రాయైనా...సంవత్సరానికి చాలా బావుంది, వైవిధ్యంగా ఉంది అనే సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు, హాలీవుడ్ సినిమాల్లో మన సినిమాల్లా బేసిక్ తప్పులు ఉండకపోవచ్చు, అంత మాత్రాన ఆటోమాటిక్గా అద్భుతమైపోవు. స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కథలో ఒదిగి పోవాలి కాని వాటి కోసమే కథ అయితే భరించడం కష్టం....అప్పుడే కొట్టి పడేయ్యకండి- ‘అయితే సినిమాకి ఎందుకు వెళ్లావోయ్?’ అన్నారనుకోండి..మనం తెలిసిన తప్పులే మళ్లీ మళ్లీ చేసి చెంపలు వేసుకుని మళ్లీ వెళతాం, 'అసలు పోలికే సరిగ్గా లేదు' అంటే ఒప్పుకుంటా ..ఈ సూపర్ హీరో సినిమాల కాలుష్యానికి పోలికే లేదు..
ఈ మధ్య ఆర్ధికమాంద్యం వల్ల మనం నమ్మేలా ఉండాలని గొప్ప హీరోలకి కొంత సహజత, సున్నితత్వం తెచ్చారు- వాళ్ళు మనలా డబ్బులు లేవని ఏడుస్తారు, మూగగా ప్రేమిస్తారు.....‘కాసినో రాయల్’ అనే సినిమాలో జేమ్స్ బాండ్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి నాకు కన్నీళ్లు ఆగలే, పక్కన ఓ మిత్రుడు "ఇది ‘ప్రేమ్ నగర్’' కాదు ఏడవకు ఆపేయ్" అంటే ఉగ్గబెట్టుకున్నా. ఇక స్పైడర్ మాన్ విషయం మీకు తెలిసిందే ప్రతీ పార్ట్ లోను ఆ కుర్రాడు పడే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు, చదువుకి డబ్బులు లేక, ప్రేయసిని కలవనని మాట ఇచ్చి గుండెలు పిండేస్తాడు..ఆ బాధకి పాటల బ్యాక్ గ్రౌండ్ ఉంటే హాలీవుడ్ తారల తమిళ్ సినిమా అనిపిస్తుంది..ఈ మధ్యన వచ్చిన విడతలో స్పైడర్ మాన్ ఇంకో అడుగు ముందుకెళ్ళి "మీరంతా వెర్రి వాళ్ళల్లా ఉన్నారు, నాకు సూపర్ పవర్ లేదు, సింగినాదం లేదు..నేను కుట్టుకున్నది ఎలాస్టిక్ డ్రాయర్, చేతికున్న నైలాన్ తాడు" అని తేల్చేసాడు..అంతే కాకుండా కనిపించిన ప్రతి వాడిని చూసి .."నేనే స్పైడర్ మాన్, నేనే స్పైడర్ మాన్" అని స్టెప్స్ కూడాను, ఫేస్బుక్, త్విట్టేర్ మహిమ అనుకుంటా, ఎవ్వరి నోట్లో నువ్వుగింజ నానట్లే, ఇలాంటి మార్పులతో అతి తెలివి చూపిస్తారు తప్ప, ఫ్రేం వర్క్ మారదు. విజయవంతమైన ఫార్ములానే తెగేదాకా వాడుతూ ఉంటారు, విసుగు పుట్టేదాకా మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే సినిమా అయినా ఇతర విషయాలైనా, అమెరికా అయినా , అనకాపల్లి అయినా జనాలు అంతా ఒకటే! పెద్దగా మార్పులంటే ఇష్టపడరు. సీసాలు మారిస్తే చాలు, సారాన్ని పట్టించుకోరు!!
తాత్పర్యం - తలా, తోక అవసరమైన సూపర్ హీరో సినిమాలు, ప్రేక్షకుడిని అలరించడం మాని కలవరపెడతాయి

జంధ్యాలగారు బాట్మాన్ సినిమా తీస్తే దాంట్లో వాళ్ళ అమ్మమ్మ "ఆ మురికి గబ్బిలం గుడ్డలు వేసుకుని తిరక్కు, ఎవ్వరూ పిల్లని ఇవ్వరు" అనే డైలాగ్ తప్పక పెడతారు.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech