Sujanaranjani
           
  కబుర్లు  
  సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 21
          జి.పి.ఎస్.  
 

- రచన : సత్యం మందపాటి

 
 

 మా ఊరు టెక్సాస్ రాజధాని ఆస్టిన్. దాదాపు ముప్ఫై ఏళ్ళనించీ ఇక్కడే వుంటున్నాం. మొదట్లో మొత్తం పది మంది తెలుగు మిత్రులు, ఇంకో పాతిక మంది ఇతర ప్రాంతాల భారతీయులు వుండేవారు. వాళ్ళల్లో చాలామంది మంచి స్నేహితులయిపోయారు. కొంతమంది ముఖ్య స్నేహితులని తప్పిస్తే మిగతావాళ్ళని అప్పుడప్పుడూ మాత్రమే కలుస్తూ వుండేవాళ్ళం. అందుకని వాళ్ళ ఇంటి అడ్రసులు కాగితాల మీద వ్రాసుకుని కవరులో పెట్టి వుంచేవాడిని. మళ్ళీ మళ్ళీ అడ్రసులు అడక్కుండా ఆ ఆ కాగితాలు ఉపయోగపడేవి.
ఆస్టిన్ కొండలతో, లోయలతో, నదులతో ఎంతో అందమైన నగరం. కానీ రాత్రి పూట ఆ కొండల మధ్యన, సరైన రోడ్డు వెతుక్కుంటూ వెళ్ళటం కూడా అంత సులభం కాదు. అప్పుడప్పుడూ దీని వల్ల దారి తప్పి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేవి.
తర్వాత పదిహేనేళ్ళయిందేమో, జి.పి.ఎస్.లు (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) వచ్చాయి. అప్పటినించీ హాయిగా వుంది. లిండా గొంతుతో వచ్చే సందేశాలు నా జి.పి.ఎస్.లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఆవిడ గొంతు మధురంగా వుంటుంది. రావుగారి అడ్రస్ చెబితే రావుగారి ఇంటికి దారి చూపుతుంది, మూర్తిగారి ఇంటికి వెళ్ళాలంటే మూర్తి గారింటికి దారి చూపుతుంది. అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, వాన పడుతున్నా, మంచులో దారి కనపడక పోయినా... లిండా మాత్రం మమ్మల్ని సరైన మార్గంలో వెళ్ళేటట్టు చూస్తుంది. దారి చూపిన దేవతా అని జేసుదాస్ పాట ఒకటి వుంది. లిండా మాట వింటుంటే, నాకా పాట గుర్తొస్తుంది. మా జిపిఎస్సే మాకు దారి చూపిస్తున్న దేవత.
దేవత అంటే ఒక జోకు గుర్తొస్తున్నది. మాకో మంచి స్నేహితుడున్నాడిక్కడ. వైజాగాయన. పేరు ఐజె అందాం. మంచి రచయిత, సాహిత్యంలో ప్రవేశమున్నవాడు, అంతకు మించి హాస్య ప్రియుడు. హాస్యం అంటే జోకులు చెప్పటమే కాదు, ఆస్టిన్ తో సహా అమెరికాలో చాలా ప్రదేశాలకు వెళ్ళి అక్కడి కామెడి క్లబ్బుల్లో ఇంగ్లీషులో స్టాండప్ కామెడీ చేస్తాడు. అతని కామెడీ నాకెంత ఇష్టమంటే, ఆరు నెలలకొకసారి మేము నిర్వహించే టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సుల్లో ఆయన చేసే ఇరవై నిమిషాల 'నిలబడే హాస్యం' తప్పకుండా వుంచుతున్నాం. మా సాహిత్య కార్యక్రమాలకి అదో పెద్ద ఆకర్షణ.
ఒకసారి ఐజె ఇండియా వెళ్ళినప్పుడు బంగారం రంగుతో చేసిన ఒక చిన్న వినాయకుడి బొమ్మ తెచ్చుకుని, తన కారులో డాష్ బోర్డు మీద పెట్టుకున్నాడుట.
ఒకసారి ఒక అమెరికన్ కొలీగుతో లంచికి వెడుతున్నప్పుడు అతను అడిగాడుట, ఇదేమిటి ఈ బొమ్మ అని. ఐజె తడుముకోకుండా అది నా జిపిఎస్ అన్నాడుట.
అమెరికన్ అతను ఆశ్చర్యంగా అదేం జిపిఎస్? అని అడిగాడుట.
ఆ మాటకి ఐజె, 'దాని పేరు గణేష్ ప్రొటెక్షన్ సిస్టం. అంటే గణేష్ అనే మా దేవుడు దారిలో ఏమీ అడ్డంకులు రాకుండా మమ్మల్ని రక్షిస్తాడన్నమాట ' అన్నాడుట!
0 0 0
ఎన్నో ఏళ్ళ క్రితం తెనాలిలో మా అక్కా బావా వుండేవాళ్ళు. అడ్రస్ అడిగితే, మా బావ ఇంటికి గుర్తులు చెప్పేవాడు. నాజర్ పేట, పోస్టాఫీస్ ఎదురు సందులో, సుబ్బారావుగారింటి మేడ మీద పోర్షన్ అని. అన్ని రోడ్లకీ పేర్లూ వుండేవి కావు మరి. ఆ రోజుల్లో ఒక్క గుంటూరులోనే అరండల్ పేట తొమ్మిదో లైన్, మొదటి క్రాస్ రోడ్ అని అడ్రస్ చెబితే హాయిగా కళ్ళు మూసుకుని వెళ్లేవాళ్ళం. (ఈ రాసే వాడిని నమ్మకండి. నిఝంగా కళ్ళు తెరుచుకునే వెళ్ళేవాళ్ళం).
ఇక మన ఆంధ్రుల రాజధాని హైద్రాబాదులో అయితే, మీరు ఆ ఊరు బాగా తెలిసిన వాళ్ళతోనయినా వెళ్ళాలి లేదా గణపతి దేవుడ్ని నమ్ముకుని మీ మీ అదృష్టం పరీక్షించుకోవాలి.
చాలా రోడ్లకి పేర్లుండవు. పొరపాటున వుంటే గింటే, ఇంటి నెంబర్లు ఒక వరసలో కానీ ఒక పద్ధతిలో కానీ వుండవు. అందులో అక్కడ చాలమంది ఆటోభాయిలు తెలుగులో మాట్లాడరు కనుక, నాలాగా మీకూ హిందీ ఉరుదూ లాటి పర భాషలు రాకపోతే, ఇక ఇంతే సంగతులు. చిత్తగించవలెను.
అందుకే అనిపించింది ఇండియాలో కూడా ఇక్కడిలాగే జి.పి.ఎస్.లు వుంటే బాగుంటుంది కదా అని. అక్కడా వుండే వుంటాయి. నాకు తెలీదు. ఈమధ్య నేను ఇండియాకి వెళ్ళలేదు. అదే ఆలోచిస్తూ వ్రాస్తున్నాను ఈ వ్యాసం.
౦ 0 0
ఇండియాలో మొట్టమొదటగా వచ్చే ప్రశ్న అక్కడ జి.పి.ఎస్ ఏ భాషలో వుండాలి అని.
భారత జాతీయ భాషలు పద్ధెనిమిది వున్నాయి. దేశానికి అధికార భాష అయిన హిందీ, దేశంలో సగం మందికి పైగా అర్ధమే కాదని గణాంకాలు చెబుతున్నాయి. ఇంగ్లీషు మాట్లాడేవారు సగం మందికన్నా కూడా చాల తక్కువ. జాతీయ స్థాయిలో అవన్నీ మనకెందుకయ్యా ఆంధ్ర ప్రదేశం సంగతి చూడు అంటే, అక్కడే నాలుగు రకాల తెలుగులు వున్నాయి. కోస్తా జిల్లాల తెలుగు, తెలంగాణా తెలుగు, రాయలసీమ తెలుగు, హైదరాబాదీ. వాటిల్లో మళ్ళీ జిల్లాలవారీగా యాసలు. ఈ విషయంలో పీత కష్టాలు పీతవి అనుకుని, ఇంకొంచెం ముందుకి వెడదాం.
౦ 0 0
ముందుగా మీకు జిపిఎస్ సంకేతాలు ఐశ్వర్యారాయ్ గొంతుతో కావాలా, సుబ్బారాయ్ (సుబ్బారాయుడు)
గొంతుతో కావాలా అంటే, మనలాటి వారు ఏ రాయయితే ఏమిటిలే అని, ఐశ్వర్యారాయ్ గొంతే కోరుకుంటాం. దాని తర్వాత కొన్ని జిపిఎస్ సంకేతాలు తెలుగులో ఎలా వుంటాయా అని ఊహించి వ్రాస్తున్నాను.
కొత్తగా జిపిఎస్ కొనుక్కుని, మిత్రుడు అప్పారావుని మీ ఇంటి అడ్రస్ చెప్పమంటే ఇలా చెబుతాడాయన.
చిక్కడపల్లి మెయిన్ రోడ్డు వుందా. అక్కడే కొంచెం ముందుకు వెళ్ళు. సుధ హోటల్ వస్తుంది. అక్కడే వాణి మెడికల్ హాల్ వుంటుంది. దాని పక్కనే చిన్న సందు వుంటుంది. ఆ సందులో కారు ముందుకి వెడితే వెనక్కి తిరగటం కష్టం. అందుకని మళ్ళీ అలాగే రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్ళాలి.
“అది కాదు అప్పారావ్. జిపిఎస్ లో పెట్టాలి. పోనీ ఇంటి నెంబరు చెప్పు”
"ఓహో! ఇంటి నెంబరు కావాలా? వ్రాసుకో. నాలుగు బై ఆరు డాష్ ఏడువందల నలభై నాలుగు బై ఎనిమిది డాష్ తొంభై నాలుగు బై ఎఫ్" అంటాడు అప్పారావ్.
ఆ నెంబర్లేమిటో, అన్ని నెంబర్లెందుకో నాకే తెలీదు, ఇక నేను జిపీస్ కేమని చెబుతాను.
0 0 0
అమెరికన్లతో పోలిస్తే మనకి ఉద్రేకం ఎక్కువ. నిదానం తక్కువ. కాపిటలిస్ట్ దేశాల్లో మర్యాదలు తెచ్చిపెట్టుకున్నా, మర్యాదగానే వుంటాయి. ఇలాటివి మన ఈనాటి సంస్కృతిలో తక్కువనే చెప్పాలి. అందుకని ఇలాటి ప్రవర్తనని దృష్టిలో పెట్టుకుని ఈ జిపిఎస్ వ్యవహారం ఎలా వుంటుందా అని కొంచెం హాస్యం రంగరించి ఊహిస్తే, నాకు ఇలా వుంటుందనిపిస్తున్నది.
అనసూయమ్మగారింటికి వెళ్ళాలనుకోండి. ఉంటే రోడ్డు పేరు, సరిగ్గా వుంటే ఇంటి నెంబరు జిపిఎస్లో పెట్టేసి, బటన్ నొక్కేస్తాం.“ఎక్కిస్తున్నాం”(డౌన్ లోడింగ్) అని బుల్లి తెర మీద కనిపిస్తుంది. ఒక ఆకు పచ్చని (కాళ్ళు లేని) కాళ్ళజెర్రి ఎడమ పక్కనించీ కుడి పక్కకి పరుగెత్తుతుంది. అది ఆగగానే బుల్లితెర మీద“ఇహ పద”(గో) అని వస్తుంది. అప్పుడు మనం బయల్దేరతామన్నమాట.
అక్కడినించీ ఇక మన స్టీరింగ్ ఐశ్వర్యారాయి చేతిలోనే. ఆవిడ ఎటు తిరగమంటే అటు తిరగటం, ఏం చెబితే అది చేయటం. "నయానా భయానా" అని పాశ్చాత్య సంస్కృతిలో లేనిది ఒకటి మన సంస్కృతిలో వుంది. అదేమిటంటే:
మనం వెళ్ళేటప్పుడు ఐశ్వర్యారాయ్ కుడి పక్కకి తిరగండి అని చెబుతుంది.
మనమేమో కారు సీడీ ప్లేయర్లో చక్రి వాయిస్తున్న భయంకరమైన డబ్బాల మోతల మధ్య అది వినిపించుకోం. అంటే కుడి పక్కకి తిరక్కుండానే ముందుకి వెళ్ళి పోతామన్నమాట.
ఐశ్వర్యారాయ్ నయానా చెబుతుంది. "ముందుకు వెళ్ళిపోయావు బాబూ! వెనక్కి తిరుగు నాయనా. తిరిగి సరైన మార్గాన వెళ్ళు బాబూ!" అని గుమ్మడి చెప్పినట్టుగా చెబుతుంది.
చక్రి వాయింపు మానేసి దంపుడు మొదలు పెట్టటంతో ఈసారి అసలేమీ వినపడదు.
ఇక ఐశ్వర్యారాయ్ భయానా చెబుతుంది. "ఏం చెబుతుంటే నీకు వినపడదా. తిరుగు వెనక్కి. హన్నా!"
అంటుంది. ఇప్పుడది సూర్యకాంతం డైలాగులా వినపడుతుంది.
మన అదృష్టం బాగుండి చక్రి పాట ఒకటి అయిపోయి, ఇంకోటి రాబోయే ముందు వచ్చే ఒక్క అరక్షణం ప్రశాంతతలో అది వినిపిస్తే, మనం కారుని వెనక్కి తిప్పి ఐశ్వర్యని సంతోషపెట్టవచ్చు.
లేదా తరువాత ఆవిడ ఎలాటి తిట్లు తిడుతుందో తెలుసుకోవాలంటే ఈనాటి తెలుగు సినిమా హీరోయిన్ డైలాగులు వింటే మీకే జవాబు దొరుకుతుంది.
ఒక్కొక్కసారి జిపిఎస్ కి కూడా అనుమానం వస్తుంటుంది. "ఒక్క క్షణం ఆగండి. అహ్మదుల్లాగారి వీధి, ఇటు కుడి వైపో, ఎడమ వైపో తెలియటం లేదు. ఏం చేద్దాం" అని మిమ్మల్నే అడుగుతుంది.
మనం తెలుగు వాళ్ళం. ఎవరి మాటా వినం కదా!
అందుకని ఆలోచించకుండానే, ఐశ్వర్యని పట్టించుకోకుండా కుడి వేపు తిరిగేశాక, అప్పుడు తెలుస్తుంది మనం తిరిగింది అహ్మదుల్లాగారి వీధికి కాదు, మహ్మదుల్లాగారి వీధికి అని.
కుడి ఎడమయితే ఫరవాలేదన్నారు ఘంటసాల గొంతుతో అక్కినేని నాగేశ్వరరావు. అందుకని మళ్ళీ ఎడమ పక్కకి తిరిగితే, అహ్మదుల్లాగారి వీధి బదులు ఉస్మాన్ సాహెబ్ వీధి కనిపిస్తుంది.
అప్పుడు మన జిపిఎస్ మీద మనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది.
జిపిఎస్ స్విచ్ నొక్కేసి, నోరు మూసేసి కారు దిగి వెళ్ళి అక్కడ వున్న షాపులోని తెలుగాయనని తెలుగులో అడుగుతాం 'బాబూ! అహ్మదుల్లాగారి వీధి ఎక్కడ’ అని.
మరి ఆ తెలుగాయన మనకి ఏ భాషలో జవాబు చెబుతాడు?
మనకి దారి తెలుస్తుందా?
మనం వెళ్ళే దాకా అనసూయమ్మగారు భోజనాలు చెయ్యకుండా మనకోసం ఎదురు చూస్తారా?
లేదా ఇంకేం వస్తారులే అనుకుని, వాళ్ళు తినేసి గిన్నెలు కడుగుతూ ఎదురొస్తారా?
వీటన్నిటికీ జవాబులు బుల్లి జిపిఎస్ వెండితెరపై చూడటానికి వీల్లేదు.
దాన్ని ఆఫ్ చేసేశాం కదా మరి!

 

 
 
నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech