Sujanaranjani
           
  శీర్షికలు  
       శ్రీ శనీశ్వర శతకం- 11

        

 

- రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ

 

91. సుచరితులన్న ఖ్యాతి కడు సొంపుగ వెల్గెడు నాదు సోదరుల్
కచు గురువర్యుమించుటలు గంటిని; కల్గు ను విస్కి ని బ్రాండి గ్రోల, ఈ
రుచులకు సుంత లోనయిన, ఋత్విజులైనను భ్రష్టుపట్టరే?
పచనము గావు కొందరకు ప్రాజ్ఞుల వాక్కులు శ్రీశనీశ్వరా

92. కానక ఏది నిక్కమగు? కల్తివి కల్లు గుడుంబ సారలన్
పానమొనర్చి ప్రాణములు బాసెడి వారల కాంచు చుంటి వి
ద్యానిధులయ్యు నిద్ధరను తద్దయు ఖ్యాతిని గన్న గొప్ప అ
జ్ఞానుల బుడ్డి దాసులను; కాలమహత్త్వము! శ్రీ శనీశ్వరా

93. పాలును కల్తి, పీల్చెడిది వాయువు కల్తియె; నీళ్లు కల్తి; పె
ట్రోలు ను కల్తియే; గుడులలోపల నీపద పీఠి భక్తి దీ
పాల నొనర్చు నూనెయు దివాకర పుత్రక! కల్తియయ్యె; పా
పాలకు కేంద్రమయ్యెనవ భారత మిప్పుడు శ్రీ శనీశ్వరా!

94. మందుల కల్తి యే; పనికి మాలిన వస్తువు లన్ని కల్తి ఏ
మందు ను గ్రోల జూచినను మాన్య మహోదయ! భీతియయ్యె; ఏ
మందును నేటి మాఘనత మాటల చెప్ప నసాధ్యమౌనురా!

95. నీ తలపైని మేమిడెడు స్నేహము నిక్కపు కల్తి గావునన్
భూతలమందు భక్తతతి పొల్పుగ కోరెడి కోర్కెలన్నిటిన్
ఖాతరు జేయవీవు; అధికంబగు సత్ఫలమీయవందుకే;
మా తరమా నినున్ దెలియ మాన్య మహోదయ శ్రీ శనీశ్వరా!

96. దేవుని మాన్యముల్, కడకు దేవుని కిచ్చిన పట్టు సాలువుల్
దేవుని ప్రతి పూవులును దేవుని సొమ్ములు తారహారముల్
దేవుని పప్పు బియ్యములు దేవిని హుండి యు ప్రక్క దారికిన్
పోవుచు నుండగా రగిలిపోవును నా యెద శ్రీ శనీశ్వరా!

97. ధారుణిలోన గంటి తమ తల్లికి తండ్రికి చెప్పకుండనే
నేరుగ పోరగాండ్రు తమ నేస్తపు బృందము రక్షణంబుతో
మీరిన నమ్మకాన మది మెచ్చి వరించిన యంగనళినే
నేరుపు మీర కట్టుకొన నేరిచి రక్కట శ్రీ శనీశ్వరా!

98. ప్రేమ వివాహమెప్డు మురిపించును తీయగ మూడునాళ్ళె; ఆ
ప్రేమయె రెండు కండ్లు తెరిపించును చిత్రము కొన్నినాళ్ళకే
ఏమెయి చింత జేసినను నిమ్మహిలోపల ప్రేమ పెండ్లి, పల్
బాముల పాలొనర్చును; అపార్ధము వద్దుర! శ్రీ శనీశ్వరా!

99. వివరణ గాదుగాని కడు ప్రేమను నాడదె కణ్వపుత్రి, అ
కువలయ నేత్ర సుందరి శకుంతల సర్వ మొసంగ వాని కా
సువిదితుడైన భూపునకు చోద్యమదెట్టు సమాప్తమాయెనో
అవని నెరుంగవా మరి మహాశయ నీవును శ్రీ శనీశ్వరా!

100. కులములు లేవు లేవనుచు గోత్రము లయ్యవి నేను చూడ, నీ
చెలిమియె నాకు గావలెను, చేయిచు చేయిచు గల్ప రమ్ము నా
పలుకులు నమ్ము; మంచు మురిపంబుగ పల్కిన పోటుగాడె; తా
ఖలమతియౌచు మారుటది గంటిని నేనిల శ్రీ శనీశ్వరా!

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech