Sujanaranjani
           
  సారస్వతం  
   

సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (16వ భాగం)

 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil               

 

20. చర్వితచర్వణన్యాయం:--

 
 

 

“చెప్పిందే చెప్పడం, చేసిందే చేయడం, పాడిందే పాడటం” లాంటి సందర్భాలలో ఈ న్యాయం వర్తిస్తుంది. చర్వితచర్వణం అంటే నమిలిందే నమలడం అని అర్థం. అల్పమైన, అశాశ్వతమైన, అప్రయోజనమైన విషయాలను గూర్చి మాటి, మాటికి చెపితే అదిప్రయోజన శూన్యం. అట్టి చోట ఈ న్యాయం ఉదహరిస్తారు. కాని “శాశ్వతమైన, బ్రహ్మానంద సంధాయకమైన” ఆత్మ జ్ఞానాన్ని బోధించే ఉపనిషత్తులను గూర్చి, ఆత్మ, పరమాత్మా తత్త్వాలను గూర్చి  ఎన్నిపర్యాయాలు చెప్పినా కొత్తగానే ఉంటుంది కాని చర్వితచర్వణంలా విసుగు జనించదు. వేల, వేల సంవత్సరాలకి పూర్వం ఋషులు దర్శించి, లిఖించి మనకందించిన ప్రాచీన సాహిత్య సంపదను కాపాడుకొని, అందలి విషయాలను ఆకళింపు జేసుకుని, ఆచరిస్తే--మానవ జీవితాలు శాంతి, తుష్టి, పుష్టి,కలిగి “సర్వేపి  సుఖినః సంతు, సర్వేసంతు నిరామయాః, సర్వేభద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దు:ఖమాప్నుయాత్” అన్నట్లు సకల శుభములు చేకూరి,సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి. అన్నమాట సత్యం,సత్యం.పునః సత్యం.

               సంస్కృతి,సంప్రదాయాలు మనలో సంస్కారాన్నినింపుతాయి. ఆ సంస్కారమే మనిషిని “మనీషిగా” నిలబెడుతుంది. ఈ న్యాయాన్ని “ఉపనిషత్ సారము,యోగశాస్త్రము, బ్రహ్మవిద్య,సాక్షాత్ భగవంతుని ముఖమునుండి వెలువడిన భగవద్గీత” ద్వారా వివరిస్తాను.

మనలో పరస్పర విరుద్ధమైన మంచి,చెడుగుణాలు ఉన్నాయని ఇంతకుముందే తెలుసుకొన్నాం. వాటికి దైవ,అసుర గుణాలని పరమాత్మపేరుపెట్టి, దైవాసురసంపద్విభాగ యోగమనే ౧౬వ అధ్యాయంలో  అద్భుతంగావివరిస్తాడు.చూడండి:---ముందు దైవగుణాలని తెలుసుకొందాం.

౧.అభయము. ఏవిషయంలో కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు పోవడమే అభయము.

౨.అంతఃకరణశుద్ధి. అనగా మనస్సు నిర్మలంగా ఉంచుకొనుట. శరీరానికి అంటిన మలినాన్నిస్నానంద్వారా,పరిమళ ద్రవ్యాలద్వారా శుభ్రంచేసుకొంటాం.

మరి మనస్సుకంటిన మాలిన్యాన్ని. మంచిపనులద్వారా,మంచిమాటలద్వారా,భక్తి,జ్ఞాన,వైరాగ్యాలనే గుణాలవల్ల పోగొట్టుకొని నిర్మలంగా ఉంచుకోవడమే అంతఃకరణశుద్ధి.

 ౩.జ్ఞానము. అనగా “నేను” అనే భావన పంచభూతాత్మకమైన ఈ శరీరమునకుగాక లోపలనున్న ఆత్మకు సంబంధించినదని,ఆత్మనిత్యము,శరీరమనిత్యమని తెలుసుకోనుటే జ్ఞానము. ఇక్కడ ఒకచిన్నకథ ఉదహరిస్తాను. “ఆదిశంకరులు ఒకరోజు శిష్యులతో వెళ్ళుచుండగా ఒక చండాలుడు(మన్నించాలి,ఇదికథ) ఎదురుపడతాడు. శంకరులు తొలగు,తొలగు అంటారు. అపుడు ఆ చండాలుడు “ స్వామీ!మీరు తొలగు అన్నది దేనిని.ఈ దేహాన్నా? దేహంలోఉండే ఆత్మనా? దేహమైతే అశాశ్వతమైనదిగాన తొలగక్కరలేదు. ఆత్మ అయితే అందరిలో ఉన్నది ఒకే ఆత్మ కనుక తొలగక్కరలేదు. మరి దేనిని తొలగమంటారుఅని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు ఆ వచ్చినది సాక్షాత్ పరమశివుడనిగ్రహించి,సాష్టాంగపడిస్తుతిస్తారు. అట్టి అత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం.(ఈ కథ ఎన్నిమారులుచెప్పినా,చర్వితచర్వణం కాదు)

౪.దానం. అనగా-మనాసా,వాచా,కర్మణా పరిశుద్ధంగా సంపాదించిన దానిలో కొంతభాగాన్నియోగ్యులైన వారికి ఒసంగుటయే దానము.

౫.దమము:-అనగా-నిగ్రహముగా ఉండుట ‘దమము.’

మనస్సు “శబ్ద,శ్పర్శ,రూప,రస,గంధ”ములవైపు మరలకుండా ఉండుటయే అంటే కోరికలను అదుపులో ఉంచుకోవడమే దమము.

౬.యజ్ఞము. ఇది అగ్నిలో హవిస్సులు వేసిచేసే హోమముకాని,యాగముకాని కాదు. మన జన్మకి,ఉనికికి కారణ భూతులైన అ)దేవ.ఆ)పితృ.ఇ)మనుష్య.ఈ)ఋషి.ఉ)భూత అనే ఈ ఐదుగురుయడ కృతజ్ఞతకలిగి,ఋణం తీర్చుకోడమే యజ్ఞం. అది ఎలాగో తెలుసుకొందాం:-

అ) దేవయజ్ఞం.  నిత్యం భగవంతునికి ఇష్టమైన రీతిలో ఉంటూ “పత్రం,పుష్పం,ఫలం,తోయం ఏదోఒకటి భక్తి పూర్వకంగా సమర్పించి, అంతా నీదే తప్ప నాది అనేది ఏది లేదు అని తలచి “ప్రహ్లాద,నారద,పరాశర,పుండరీక,వ్యాస,వాల్మీక,వశిష్టాది పరమభాగవతుల చరిత్రలు స్మరిస్తూ, బలి వలె ఆత్మార్పణ గావించుటయే దైవయజ్ఞం.

ఆ)పితృయజ్ఞం- మన జన్మకు కారణ భూతులైన తలిదండ్రులను “మాతృదేవోభవ,పితృదేవోభవ” అని దైవసములుగా భావించి,వృద్దాప్యంలో వారిని బాగాచుసుకోవాలి. వృద్దాశ్రమాలలో ఉంచక మనవద్దె ఉంచుకొని సేవచేసుకోనుటే పితృ యజ్ఞము.

ఇ)మనుష్యయజ్ఞం:-“అతిధి దేవోభవ” అన్నట్లు అతిధులను,అభ్యాగతులను ఆదరించడం “మానవసేవే మాధవసేవ”అని భావించి,పరోపకార పరాయణులుగా ఉండడమే మనుష్యయజ్ఞం.

ఈ).ఋషి యజ్ఞం:- అమూల్య,ప్రాచీన సాహిత్య సంపదను మనకు ప్రసాదించి,మన నడవడికి చక్కని ఒరవడులు దిద్దిన వాల్మీక,వ్యాసాది ఋషులను స్మరించడమే రుషియజ్ఞం.

ఎ)భూత యజ్ఞం.—సకల ప్రాణికోటియడ సమభావనతో మెలగుచు “పశు,పక్ష్యాదులకు” ఆహారాన్ని సమర్పించి,రక్షణ కల్పించడమే భూతయజ్ఞం. దైవీ సంపదలో ఈ యజ్ఞం అనేగుణం అద్భుతమైనది.

(వచ్చేనెల మరికొన్ని)

(సశేషం.) 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech