Sujanaranjani
           
  సారస్వతం  
 

                                                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

శకుంతల (పద్యకావ్యం) - 8       ప్రథమాశ్వాసం              

  అనుచు నా తన్వి చూతశాఖను స్పృశించి
వృక్షరాజము ప్రక్కన ప్రీతి నిలిచె
అంత చెలి ప్రియంవద జూచి యనియె నిట్లు
సఖియ! చిరుసేపు నిల్వు వృక్షమ్ము చెంత                46


వ్యాఖ్యానం: అలా శకుంతల మామిడి చెట్టు ప్రక్కనే నిలిచి దానికి నీళ్ళు పోస్తూ నిలిచి ఉండగా ఆమె చెలి అయిన ప్రియంవద శకుంతలను చూసి ఇలా పలికింది- ` ఓ సఖీ! నీవు కొంతసేపు ఇలాగే ఈ చెట్టు ప్రక్కనే నిలబడి ఉండు ' అని.

నీవు చూతవృక్షము ప్రక్క నిలుచునపుడు
తీవెతో అల్లుకొన్నట్టి తీరు నిలిచి
కనుల పండుగ సేయునీ కమ్ర శాఖి
నీ తరుస్నేహమునకివే జోతలిడుదు.               47 


వ్యాఖ్యానం: ఓ శకుంతలా! నీవు ఇలా ఈ మామిడి చెట్టు ప్రక్కనే నిలిచి ఉంటే ఈ చెట్టు ఒక తీగతో అల్లుకొనిపోయినట్లు కనబడుతూ కనుల పండుగ చేస్తోంది. తరువులతో నీకు గల స్నేహం అమోఘమైనది. నీ స్నేహానికి జోహారులు .

అనుచు పల్కిన నా చెలి నమిత ప్రీతి
ననియె నో చెలి! ప్రియంవదాఖ్య దనరె
నీకు ఇక్కారణంబున నీ వచనము
కావ్యకమనీయవాక్యమై గాంచె వాసి.             48


వ్యాఖ్యానం: అలా శకుంతల స్నేహితురాలైన ప్రియంవద ఎంతో ప్రియంగా శకుంతలను గూర్చి సంభావించగానే శకుంతల పరమానందభరితురాలై- `ఓ చెలీ! నీవు ఇంత మధురంగా మాట్లాడుతావు కనుకనే నిన్ను అందరూ ప్రియంవదా! అని పిలుస్తున్నారు. నీపేరు ఇలా సార్థకమైంది. అంతే కాదు కావ్యాలలోని కమనీయ వాక్యం వలె మనోహరమై అలరారుతోందీ అని పలికింది.

అనుచు నిలిచిన మునికన్య నంత జూచి
పలికె దుష్యంతు డమితభావప్రమోద 
మాధురులు మది లోపల మసలుచుండ
చెలియ పలుకులు సత్య సమ్మితములనుచు.           49


వ్యాఖ్యానం: ఇలా ప్రియంవద శకుంతలను గూర్చి ఎంతో రమణీయంగా పలికిన వెంటనే  దుష్యంతుడు తన మనస్సులో సంతోష తరంగాలు ఎగసి పడుతుండగా -`ఈ చెలి పలికిన మాటలు సత్యసమన్వితాలు కదా!' అని అన్నాడు.

పెదవి పల్లవరాగము నదిమి పట్టు
భుజములా? మృదుశాఖల పూర్తి దనరు
అవయవములందు విరిసిన యందములకు
యౌవనము లతాంతము రీతి నౌచు దనరె.            50


వ్యాఖ్యానం: ఈ కమనీయసౌందర్యరాశి పెదవి చిగురుటాకుల సోయగాన్ని తనలో పట్టి ఉంచుతోందని అనిపిస్తోంది. ఈమె భుజాలు మృదువైన కొమ్మలను పోలి ఉన్నాయి. ఈమె అవయవాలలో విరబూసిన అందాన్ని చూస్తుంటే ఈమె ఒక పుష్పమా అన్నట్లు  నాకు అనిపిస్తోంది.

ఈ లలనాలలామ ముని కేమగునంచు దలంప నా మదిన్
తూలెడి సంశయమ్ము మరి తోచెడు పెంపుడు కూతురోయనన్
పోలిక లేదు రాదు భువి పోల్చుట కీ యపురూపరూపమున్
క్షాళితదోషభాసురము చారుతరమ్ము తదీయ రూపమౌ.             51


వ్యాఖ్యానం: ఈ లలనామణి కణ్వమహర్షికి ఏమౌతుందో అని నా మనస్సులో సందేహం కొట్టుమిట్టాడింది. నిశితంగా ఆలోచించగా ఈమె కణ్వమునికి పెంపుడు కూతురు అవుతుందని మనస్సు నిశ్చయానికి వచ్చింది.ఈమె రూపానికి ఈలోకంలో పోలిక లేనే లేదు.ఏ దోషాలూ లేనిదీ, సుందరతరమైనదీ ఈ మగువ రూపం.

ఆర్యమైనది నా మది అతివ యందు
కాంక్షపడుటకు నిండగు కారణంబు
నిక్కమీ తన్వి క్షత్రియనేయ యనుచు
అంతరంగము పలుకుట యౌను గాదె!                     52


వ్యాఖ్యానం: నా మనస్సు ధర్మమార్గాన్ని తప్ప మరొక దారిని యెరుగదు. అలాంటి నా మనస్సు ఈ అతివను కోరుతున్నది అంటే ఈమె నిశ్చయంగా క్షత్రియవంశ సంజాత అని చెప్పగలను.లేకుంటే నా మనస్సు ఈమెను కోరనే కోరదు.

సాధువులను సందేహము 
బాధించిన వేళ వారు ప్రబలత మదినే
సాధనముగ నొనరించి స
మాధానము గొనెదరు ప్రమాణంబనుచున్.                53


వ్యాఖ్యానం: సజ్జనులకు ఏదైనా సందేహం కలిగితే వాళ్ళు తమ మనస్సునే  ప్రమాణంగా తీసుకొని, మనస్సు చెప్పిన దానినే సమాధానంగా భావించి స్థిరంగా ఉంటారు.నేను కూడా సజ్జనుడనే కనుక నా మనస్సు ఈమె విషయంలో నాకు అనుకూలసమాధానాన్నే చెబుతోంది.

ఐనను నిజవిషయంబును
పూని సఖీగణము నడిగి పూర్తిగ తెలియన్
నూనంబుగ యత్నించెద 
మానిని చేపట్టు కొరకు మంగళమునకై.                54


వ్యాఖ్యానం: ఐనప్పటికీ సత్యం ఏమిటో ఈ సఖులను కూడా అడిగి తెలుసుకుంటాను. ఇలా వీరిని అడగడం వల్ల ఏకపక్షంగా నేను ప్రవర్తించాననే చెడ్డ పేరు రాదు. అంతేగాక ఈ మానినిని నేను చేపట్టాలనుకొనే ప్రయత్నం కూడా మంగళాత్మకం అవుతుంది. ఇది ఉభయతారకం కూడా.

ఇవ్విధి మనమున దలచుచు
నవ్వనమున రాజు భావితాదృష్టంబున్
జవ్వనియగు మునికన్యను
నవ్వనిలో పొందు కొరకు నాశాసింపన్.                    55


వ్యాఖ్యానం: ఈవిధంగా ఆ దుష్యంతమహారాజు మనస్సులో అనుకొని, ఆ వనంలో తన రాబోయే అదృష్టాన్నీ,యువతి ఐన మునికన్యనూ పొందడం కోసం ఎంతో ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

జలఘటముల చేపట్టుచు
జలదేవతవోలె కన్య జలదానముతో
స్థలరుహముల దడుపుచుండ
నలి యొక్కటి తరుమ రాగ నతి భయవతియై.               56


వ్యాఖ్యానం: ఇంతలో నీటి కడవను పట్టుకొని శకుంతల ఒక జలదేవతలా అక్కడికి వచ్చింది. రాగానే పూలచెట్లకు ఆ కడవతో జలదానం చేసింది.ఆ సమయంలోనే ఎక్కడినుండో ఒక తుమ్మెద పరుగుపరుగున అక్కడికి వచ్చి శకుంతలను
తరుముతూ వెంటబడసాగింది.అప్పుదు శకుంతల భయకంపిత అయింది.

అటునిటుపరుగులుదీయుచు
నటియించెడి కనులతోడ నలుదిక్కులకున్
చటులత పదముల నూనుచు
త్రుటినైనను నిలువకుండ దూరుచు వనిలో .                  57


వ్యాఖ్యానం: తుమ్మెద బాధ పడలేక శకుంతల అటూ,ఇటూ పరుగులెత్తుతూ, కనులను వేగంగా తిప్పుతూ, ఒక్క క్షణం కూడా ఒకచోట నిలువలేక పోయింది.ఇలా ఆమె ఆ వనమంతా కలియదిరుగసాగింది.

వాద్య్విశేషముల్ మిగుల బాసిన నర్తకి వోలె భ్రూలతా 
భేద్యపు చూపులన్ గదలి వేద్యవళుల్ గల మధ్యమంబుచే
చోద్యము గాగ నంగుళుల శోభనరీతి చలింప జేయుచున్
మోద్యవిధానతన్ భ్రమరముక్తిని గోరుచు తన్వి యత్తరిన్.          58


వ్యాఖ్యానం: అలా ఆ శకుంతల తన తనూవిలాసాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆమె వాద్యాలు లేని నర్తకిలా అనిపించింది. కనుబొమలు విరిచి చూస్తూ, నడుముపై ముడతలు కనబడుతుండగా చేతుల వేళ్ళను అందంగా తిప్పుతూ,ఆనందించే రీతిలో తుమ్మెద బాధను తప్పించుకోవాలని ప్రయత్నించసాగింది.

ఇష్టసఖులార! అలిబాధ కష్టమయ్యె
రక్ష సేయుడు వేవేగ రండు! రండు!
అనిన సఖి వాక్కు నంతట నాలకించి
ప్రియ సఖులు పల్కిరిట్లు సంప్రీతి దనర.                          59

వ్యాఖ్యానం: వెంటనే తన చెలులను పిలిచి-`ఓ ప్రియసఖులారా! ఈ తుమ్మెద ఆగడాలతో వేగలేను. నన్ను కాపాడడానికి రండి! రండి! ' అని ఆమె అనగానే ఆ సఖులు శకుంతలతో ఇలా అన్నారు.

నిను కరుణించి గాచుటకు నిశ్చితి మాకు వశమ్మె? మౌనికా
ననముల గాచువాడనిన నర్మిలి భూమిపుడొక్కడే సుమా!
వినుమిక జాగు సేయక జపింపుచు పిల్వుము రాజచంద్రునిన్
ఘనతరబాధలన్ దరిమి గారవమొప్పగ నిన్ను గాచెడిన్!            60

వ్యాఖ్యానం: శకుంతల చెలులైన అనసూయాప్రియంవదలు ఇలా అన్నారు- `ఓ చెలీ! నిన్ను కరుణతో కాపాడాలన్నా మాకు సాధ్యమేనా? కానే కాదు. ఈ మునివాటికలను రక్షించేవాడు ఈ దేశాన్ని పాలించే మహారాజు ఒక్కడే! అందువల్ల నా మాటలు విని  ఆ రాజచంద్రుణ్ణి ఇప్పుడే పిలువు! అతడు వచ్చి నీ బాధను పోగొట్టి నిన్ను లాలించి కాపాడుతాడు.

-(సశేషం)

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech