కబుర్లు    
     పట్టాభిరామాయణం

- రచన : బి.వి.పట్టాభిరాం

 

పంచసూత్రాల పథకం

"ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు మరొకరుంటారని నేను అనుకోను."

"ప్రతి వ్యక్తీ ఇలాగే అనుకోవచ్చు. ఇంతకూ నీ సమస్య ఏమిటమ్మా?" అని అడిగాను. ఆమె వయసు ముప్పయ్ ఏళ్ళుండవచ్చు.

"నేనిలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీ ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్లు ఏ వయసులో చేస్తారు?" ఆమె కంఠంలో తీవ్రతను బట్టి బహుశా ఇంకా పెళ్లి కాకపోవడం కారణమనిపించింది.

"పూర్వమైతే 20-25 మధ్యలో చేసేవారం. ఇప్పుడు చదువులూ, ఉద్యోగాలూ కాబట్టి కొంచెం అటూ, ఇటూ కావచ్చు. పైగా మంచి సంబంధం రావాలి. వచ్చినవాడు సరైన జోడీ కావాలి..." అని ఇంకా ఏదో చెప్పబోతూవుండగా, "అవన్నీ బావున్నాయనుకోండి. ఒకరికొకరు నచ్చారు. కట్నకానుకలేవీ వద్దన్నారు. చదువూ, వయసూ అద్భుతంగా సరిపోయాయి. ఏ కోణంలోంచి చూసినా ఆవగింజంత లోపం లేనప్పుడు పెళ్లి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద వుందా, లేదా?" కొంచెం గట్టిగానే అడిగింది.

"తప్పకుండా వుంది. ఇంతకూ నువ్వు అసలు సమస్య ఏమిటో చెప్పలేదు."

"అదే చెప్తున్నాను. నాకు ముప్పయ్యేళ్లొచ్చాయి. గెజిటెడ్ ఆఫీసరును. ఇంతవరకూ పెళ్లీ, పెడాకులూ లేవు. నా తరువాత ఇద్దరు తమ్ముళ్లున్నారు. వాళ్ల చదువు పూర్తయ్యేవరకూ నాకు పెళ్లి చేసేలా లేరు. నేను మా తల్లిదండ్రుల్ని డైరెక్టుగా అడగలేను. ఓసారి మా కొలీగ్ అడిగితే ఏవో సంబంధాలు చూస్తున్నామని దాటేశారు."

"పోనీ, నువ్వు నెమ్మదిగా మీ అమ్మగారితో చెప్పడానికి ప్రయత్నించలేకపోయావా?"

"చండశాసనుడైన మా నాన్న ముందు మా అమ్మ నోరు విప్పదు. ఈ మధ్య మాకు తెలిసిన బంధువులు తమకు తాము వచ్చి చేసుకుంటామని అడిగితే మా నాన్న తిరగ్గొట్టాడు. మధ్యలో కలగజేసుకుందని అమ్మ మీద చెయ్యి చేసుకున్నాడు. అప్పుడు నేనే గట్టిగా మాట్లాడుదామనుకుంటే... నాకూ ధైర్యం చాలలేదు."

"ఇంతకూ మీ నాన్నకున్న అభ్యంతరం ఏమిటి?"

"నాకు నెలకు పాతికవేల దాకా వస్తుంది. దాంతో ఇల్లు సాఫీగా గడిచిపోతూంది. ఆయన మొన్ననే రిటైరయ్యారు. ఆయన అలవాట్లకు ఆయనకొచ్చే డబ్బు సరిపోతుంది. నాకు పెళ్లయితే ఇంటి బాధ్యతలు తన మీద పడతాయని భయం. అప్పటికీ నేను సాయం చేస్తానని అమ్మతో చెప్పాను. కానీ ఈ సంగతులు నాన్నదాకా ఎలా వెళ్తాయి? దీనికి పరిష్కారం వుందా?"

"తప్పకుండా వుంది. మీలాంటి సమస్యల్లో వున్న అమ్మాయిలూ, అబ్బాయిలూ చాలమందున్నారు. దీనికి నేనొక చిట్కా చెప్తాను. ఇది నీకే కాదు, ప్రమోషన్ రాని ఎగ్జిక్యూటివ్ లకూ, భర్తతో వేగలేకపోతున్న భార్యకూ, భార్య మొండిపట్టుదలతో విసిగిపోతున్న భర్తకూ ఇది మంచిది. ఈ చిట్కాలో అయిదు స్టెప్స్ వుంటాయి. నిరీక్షణ, సంభాషణ, ఘర్షణ, నిష్క్రమణ, క్షమాపణ దీన్ని పంచసూత్రాల పథకం అందాం.

"మొదటిది నిరీక్షణ. అంటే సమస్య ఉత్పన్నమైనప్పుడు కొంతకాలం వేచిచూడాలి. ఎందుకంటే కొన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది. మనం తొందరపడితే మొదటికే మోసం రావచ్చు. ఇక్కడ నీకీ స్టెప్ అవసరం లేదు.

రెండోది సంభాషణ. ముప్పయ్ ఏళ్లు వచ్చిన తరువాత కూడా తండ్రితో మాట్లాడ్డానికి భయపడటం మూర్ఖత్వం. నీవు మాట్లాడకపోవడాన్ని ఆయన అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు కాబట్టి, ఎవరూ లేనప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ప్రస్తావించు. కుటుంబానికి అవసరం మేరకు సాయం చేస్తానని చెప్పు. తమ్ముళ్లు పెద్దవాళ్లయ్యాక వారిని చూసుకుంటారని గ్యారంటీ లేదు కదా!"

"ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే?"

"అప్పుడు మూడో బాణం తియ్యి. ఘర్షణ. ఇది కొంత సున్నితంగా ప్రయోగించాలి. అయన కిష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానని బెదిరించు. ఏదైనా ధైర్యంగా, విశ్వాసంతో నడిపే పద్ధతిని బట్టే గెలుపూ, ఓటమీ వుంటాయి."

"ఓడిపోతే?"

"వేరే చెప్పేదేముంది? నిష్క్రమణ. ఈ వూరి నుంచి వేరేచోటికి ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడ నీకు నచ్చిన సంబంధం చేసుకోవచ్చు. ఈ వయసులో ఇంత ఒత్తిడి భరించడం అనవసరం!"

"నాకంత ధైర్యం లేదు. మా వాళ్లను ఎదిరించి నెను పెళ్లి చేసుకోను. ఇంతకు మించి మార్గం లేదా?"

"అదే చెబుతున్నా. చివరిది క్షమాపణ. మీకు ధైర్యం లేకపోతే జరిగిన దానికి క్షమాపణ చెప్పి మళ్లీ మామూలుగా వుండు. అయితే నేను గ్యారంటీగా నీకు చెప్పగలను మూడోబాణం దగ్గరే మీ నాన్న లొంగిపోతాడు!"

"నాకెందుకో ఆ వమ్మకం లేదు!"

"ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. ప్రయత్నమే చెయ్యకుండా భయపడేవాళ్లు పిరికివాళ్లు. కాబట్టి మైండ్ ను ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఈరోజే మీ నాన్నతో నెగోషియేషన్ ప్రారంభించు!"

"థ్యాంక్స్! నాలో కొత్త ధైర్యం ప్రవేశించింది" అంటూ లేచింది.

"పెళ్లికి పిలవడం మరిచిపోవద్దు" అంటూ నవ్వుతూ లేచాను.

 
Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech