Sujanaranjani
           
  శీర్షికలు  
  పద్యం - హృద్యం
 

  నిర్వహణ : తల్లాప్రగడ రావు     

 

"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు సెప్టెంబర్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ  మాసం సమస్యలు  (కె. ఎల్. జగన్నాథ రావు గారు ఇచ్చినవి)

తే. గీ. || తలకు  నూనె  వ్రాసుకొనుట  తప్పు! తప్పు!
కం || వగచెను  పురుషార్థమిచట  పరుషార్థంబై

క్రితమాసం సమస్యలు  

తే.గీ.|| పదవి పదిల పరచుకొను పధక మిదియె.

ఉ.|| నీతికి బాహ్యులైన జననేతల చేతలు ప్రీతి గూర్చునే.

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ - గండికోట  విశ్వనాధం హైదరాబాద్ (ప్రస్తుతం-శాన్ హోసే, కాలిఫోర్నియా),   

తే.గీ.|| మంత్రి పదవుల పందేర మంతనాలు

పనుల టెండర్ల, ఆఫర్ల పంపకాలు

తమకు నచ్చిన వారికి తాయిలాలు

లబ్ధి గూర్చెడి ఆర్ధిక లంపటాలు

బేర సారాలు, సారా కుబేర బాంధ

వాలు, దాడుల గొడవల  గోలు మాలు

ఎదురు దాడుల వాడితో ఎదురుకోలు

గోడ మీది పిల్లుల పిల్చి వేడుకోలు

బుజ్జగింపులు,బెదిరింపు వుద్యమాలు

కుంభకోణాల కుహకాల కుచ్చితాలు

కోటి నాటకాల కుటిల బూటకాలు

దండమెట్టి అమ్మ భజన దండకాలు 

క్రొత్త  పంచ  తంత్రములంచు కొంద రెంచు 

పదవి పదిల పరచు కొను పధక మిదియె

 

.|| జాతికి మేలు చేసెడి  నిజాయతి, స్వార్ధము లేని పాలనన్

కోతలు మాని పేదలకు కొల్వులు కొంపలు గూర్చు రీతిలో

నీతియు, పారదర్శకత నిండిన కార్య కలాపముల్, వినా

నీతికి బాహ్యులైన జన నేతల చేతలు ప్రీతి గూర్చునే

 

రెండవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం          

 తే.గీ.|| పదవి లేకున్న ఘనముగా బ్రతకగలమే?

చిత్తశుద్ధిని సేవలు చేతున నేడి

"ప్రక్కవాడిని కనిపెట్టి తొక్కిపెట్టు"

పదవి పదిలపరచుకొను పథలమిదియె

 

ఉ.|| నీతులు గొప్పగా పలుకనేర్తురు నేతలులోకమందునన్

చేతలు చూడ చెప్పికొన సిగ్గగు; స్వార్థము పెచ్చు మీరగా

నీతికి నీళ్ళసంగి కడు నేర్పున తీయని మాటలండుచున్

నీతికి బాహ్యులైన జననేతల చేతలు ప్రీతిగూర్చునే 

 

మూడవ పూరణ - -యం.వి.సి. రావు, బెంగళూరు

తే.గీ.||సొంత తాతల తండ్రుల సొమ్ములట్లు

పదవి పదిలపరచుకొను పథకమిదియె

ననగ, ప్రజల ధనమునెల్ల నష్టపెట్టి

బడుగు జీవి బ్రతుకు భంగ పరచుటనరె

 

ఉ.|| రోతలు పుట్టునందరికి కోట్లకు కోట్లను దోచినంత, నా

జిత్తులు పారనప్పుడట జేలుల యూచలు లెక్కపెట్టుచో

పత్నియు రాదు, బాసటకు బంధులు కూడను చేరరక్కటా

నీతికి బాహ్యులైన జననేతల చిత్తము ప్రీతి గూర్చునే

 

నాల్గవ పూరణ- నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ 

ఆ.వె.|| వేరు  దారుల పయనించి వేడ్క మీర

ధనము రాబట్టు కొనురీతి తనివి దీర

గద్దె పైనున్న చాలును ఘనము గాను

పదవి పదిల పరచుకొను పధక మిదియె !

 

ఉ.|| నీతులు జెప్పు నాయకులు నేవిధి నైనను మాయ జేతురే

రాతలు  కోతలున్  జరిపి రాజ్యము నేలెడి రక్కసుల్ యిలన్

భీతిని పాపమున్ మఱచి భీరువులై బ్రతుకంగ జూచితే

నీతికి బాహ్యులైన జన నేతల చేతలు ప్రీతి గూర్చునే ?    

 

ఐదవ పూరణ- డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా

తే. సేవ చేయుచు ప్రజలకు చేరువౌచు

నీతితో  జాతి నడిపించె నేత నాడు

కులము-రిగ్గింగు-సిరి-సార కూడి నేడు

పదవి పదిల పరచుకొను పధక మిదియె

 

ఉ.|| చేతన స్వప్రయోజనము చేర్చును దుష్టుల నాతతాయిలన్

ప్రీతిని నాక్రమించు నిరుపేదల భూములు దైవభూములన్

నీతిని పాతిపెట్టి యవినీతితొ దోతురు జాతిసంపదల్

నీతికి బా హ్యులైన జననేతల చేతలు ప్రీతి గూర్చునె?   

ఆరవ పూరణ - జగన్నాథ రావ్  కె.  ఎల్., బెంగళూరు   
 

తే. గీ.|| ఏది విడువగ మనసొప్ప దెవరికైన ?
దాని విడలేని వారికి దారి యేమి ?

'నాకు ఇది నీకు అది ' యనే నైజమేది ?

పదవి - పదిల పరచుకొను - పధకమిదియె

( మూడు ప్రశ్నలకి వరుసగా జవాబులు నాలుగవ పాదంలో .

నాకు ఇది నీకు అది = quid pro quo )

 

ఏడవ పూరణ-  సుమలత మాజేటి, కుపర్టినొ

 తే.గీ.|| వంది మాగధులందరు వంత పాడ

తాన తందాన యను "మంది" తాళ మేయ

నింద సల్పుచు ప్రతిపక్ష నేత యైన

పదవి పదిల పరచు కొను పధక మిదియె

 

ఉ. || జాతిని యుద్ధరింతుమని జాణపు మాటల మభ్య పెట్టిరే

రీతిని అంతరంగమున రేగెడు భీతిని కప్పి పెట్టియూ

ఖ్యాతి గడింపగా సతత మార్జన కాంక్షను భూములేలుచున్

నీతికి బాహ్యులైన జన నేతల చేతలు ప్రీతి గూర్చునే

 

ఎనిమిదవ పూరణ - కిరణ్ సింహాద్రి

 తే.|| సేవకొరకే పదవులన్న చింత విడిచి

మునిగి అవినీతిలో సొమ్ము మూటగట్టి

ఇచ్చి లంచాలు చెలగెడు ఇంద్రులకిల

పదవి పదిల పరచుకొను పధకమిదియె.

 

ఉ.||చేతికి అందినంత తిని శేషము భిక్షగ  పారవేసినన్

భ్రాతగ గారవించుదురభాగ్యులు మోసము గానలేరు యీ

పాతకమెల్లను ప్రజకు పట్టక యున్నను దైవముండడే

నీతికి బాహ్యులైన జననేతల చేతలు ప్రీతి గూర్చునే

 

తొమ్మిదవ పూరణ - రాజా తల్లాప్రగడ, సిడ్నీ, అస్ట్రేలియా 

కవిత|| పదవనే ప్రలోభపు ఊబిన చిక్కుటే పరమ పదమాయె

వందిమాగదులంటి మందితో కూడుటే జన ప్రాభల్యమాయె

సంక్షోభాలు సంక్షేమపధకాలు పార్టీఫిరాయింపులే సౌఖ్యమాయె

నేడిలలో "పదవి పదిల పరచుకొను పధకమిదియెనాయె

 

కవిత||నీతికి బాహ్యమైన నేతలచేతలు ప్రీతికూర్చునే

నేతలే జనమన్న సంకుచిత భావజాలంలో మునక

నేతలైనది జనంచేతని సొంతలాభం కొంతైనా మానక

ఉచితానుచితాల  వివక్షతకి తావీయలేక

"నీతికి బాహ్యమైన నేతలచేతలు ప్రీతికూర్చునే"

 

పదవ పూరణ - సుబ్రమణ్యం బత్తల, రోచెస్టర్ హిల్స్ , మిచిగన్

కవితలు|| పదవులందు  జేరి  ప్రజ్న  జూపెడు    వారు

దాచి  పెట్టుకొనుట  ధర్మమ్ము  గాదనుచు

పంచవలయు  జ్ఞానమ్ము  పరులకెపుడు

పదవి  పదిల  పరచుకొను  పధక  మిదియె.

 

రాతలు  మారునంచు  బహు  నేర్పున  వారలు  మాటల  జెప్పి

చేతులు  జాపి  యడుగ  నా  చేతుల  నోటు  వేయ గెలిచిన వారై

రీతులు  మారిచి  నేడు  మోసములన్  పలు   రీతుల జేయ నకటా

నీతికి  బాహ్యులైన  జన  నేతల  చేతలు  ప్రీతి గూర్చునే? 

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
  

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech