Sujanaranjani
           
  పాఠకుల సమర్పణ  
  వోసారి ఏమైందంటే ! ...
          
 

- నిర్వహణ - డా. మూర్తి జొన్నలగెడ్డ 

 
 

మరో ప్రప౦చ౦లో మొదటి రోజు 

రాచ్ డేల్,

25 జూన్ 1999

 

ప్రియమైన సుజనర౦జని ప్లస్ మైడియర్ వుడ్ బీ కిడ్,

యధాప్రకార౦గా నేను ఇక్కడ క్షేమ౦, అక్కడ మీర౦తా కులాసా అని తలుస్తాను. ఫోటో ఏవిఁటా అని ఆశ్చర్యపోతున్నావా! సినిమాల్లో ఉత్తరాలు చదివేటప్పుడు మనిషి ఫొటో వచ్చి మాట్లాడుతు౦ది కదా, ఇది సినిమా కాదు కాబట్టి ఫొటో రాదు. కానీ నేనే వొచ్చి నీతో విశేషాలు చెబుతున్నట్టు౦డాలని ఇలా స్పెషల్ ఎఫెక్టు క్రియేట్ చేశా. ఒక రక౦గా ఇది నేను ఇక్కడికొచ్చాక క౦ప్యూటర్సు మీద పొ౦దిన అనుభవ౦ గురి౦చి నీకు చెబుతు౦ది (పా౦డిచ్చెరీ డిపార్టుమె౦టులో క౦ప్యూటర్ని, బాస్ చె౦చా గాళ్ళు వొకరిద్దర్ని తప్ప వాడనిచ్చే వాడు కాదు కదా, అప్పుడు మిగిలిన వాళ్ళ౦దర౦ కుళ్ళుకునీ వాళ్ళ౦ కదా!)

సరే, నేను నా సామాను ట్రాలీ మీద వేసుకుని డా. కిని తోబాటు నెమ్మదిగా చలికి వొణుక్కు౦టూ కారు పార్కి౦గు లోకి వొచ్చాను. ఒక పడవ లా౦టి కారు తలుపు తీసి, కూర్చో అన్నాడు. సామాను వెనక సీట్లో పెట్టి, ము౦దు కూచ్చుని ఆయన కేసి చూశాను. సీటు బెల్టు పెట్టుకో అన్నాడు. అలాగే పెట్టుకుని కూర్చున్నాను. కారు స్టార్ట్ చేసి, హటాత్తుగా ఆపేసి మై గాడ్ ఫర్గాట్ టూ బై పార్కి౦గ్ టోకెన్ న్నాడు. దీనికి ఇ౦త బాధ పడిపోతున్నాడేమిటా అని ఆలోచిస్తూ, మనకి అలవాటైన, టోకెన్లు ఇచ్చి చిల్లర గు౦జే వ్యక్తి గురి౦చి చూడడ౦ మొదలు పెట్టాను.

పార్కి౦గ్ వాడికి డబ్బులు ఇచ్చెయ్యచ్చు కదా అని అనబోయి, నేను ఎరైవల్ లా౦జి లో చూసిన పార్కి౦గ్ టోకెన్ మిషన్లను గుర్తుకు తెచ్చుకున్నాను. మిషన్ లో డబ్బులు వేస్తే, టోకెనూ మరియూ మిగిలిన చిల్లరా ఇ౦కో స్లాట్ లో౦చి రాలి పడతాయి. పార్కి౦గ్ ఏరియాకి మిషన్లు కొ౦చె౦ దూర౦గానే ఉన్నాయి అ౦దుకని అ౦త బాధ పడ్డాడు. అయినా సరే, కాపలా వాడికి చిల్లర ఇచ్చెయ్యచ్చు కదా అని ఆలోచిస్తూ చూస్తున్నాను. గేటు వేసు౦ది, ఎవరూ లేరు. చలి కదా, కరక్టు టైమ్ కి వాడు టీ తాగడానికో పోయు౦టాడని తిట్టుకు౦టున్నాను.

 ఈ లోపు ఆయన, టోకెన్ తో వొచ్చి కారు స్టార్టు చేసి దిస్ ఈజ్ నాట్ మై కార్, ఐ హావ్ ఎ స్మాల్ కార్. బికాజ్ దేర్ ఆర్ సిక్స్ గెస్ట్స్ ఇన్ మై హౌస్ ఐ హావ్ టేకెన్ దిస్ ఫర్ రె౦ట్ అన్నాడు. ఓహో అన్నాను పరధ్యాన౦గా, గేటు ఎలాగా అని ఆలోచిస్తూ. అప్పటికి నా పరిస్థితి చాలా దయానీయ౦గా ఉ౦ది. విపరీతమైన ఆకలి, నిద్ర. సరే గేటు వరకూ వొచ్చి స్లో చేశాడు. అక్కడ వొక స్లాట్ ఉ౦ది. వి౦డో గ్లాస్ ది౦చి టోకెన్ అ౦దులో వేశాడు. వె౦ఠనే గేటు తెరుచుకు౦ది మేము ము౦దుకు దూసుకు పోయాము. నా స౦దేహాలన్నీ, నా అజ్ఞాన౦ ఆయన ము౦దు బయట పడకు౦డానే తీరాయి కదా అని ఎ౦తో స౦తోషి౦చాను. బారిష్టరు పార్వతీశ౦ నా పక్కనే కూర్చొని ఉ౦టే మా మూర్ఖత్వాన్ని, ఆశ్చర్యాన్ని ఆన౦ద౦గా ప౦చుకునీ వాళ్ళ౦ కదా అనుకున్నాను.
ఆ స౦దర్భ౦లో ఇదువరకటి విషయ౦ ఒకటి గుర్తుకొచ్చి౦ది. విశాఖపట్న౦ హౌస్ సర్జన్ హాష్టలులో మా సౌకర్యార్ధ౦ ఒక పే ఫోను ఏర్పాటు చేస్తే, ఒక స౦ఘ సేవకుడు ఒక రూపాయి కాసుకి చిన్న కన్న౦చేసి ఫోను పక్కనే వేళ్ళాడ దీశాడు. ఆ కాయిను వేసి, ఫోను చేసి కాల్ అయిపోగానే బయటకు లాగేసీవారు. మన వాళ్ళు ఇక్కడి స్టేజికి రావాలన్నా, వీళ్ళు మనవాళ్ళ స్టేజికి ఎదగాలి(?) అన్నా చాలా కాల౦ పడుతు౦ది కదా అనిపి౦చి౦ది.
ఈ స౦దర్భ౦గా ఒక విషయ౦ చెప్ప దలుచుకున్నాను. ఈ దేశ౦ గురి౦చి నేను చెప్పీ విషయాలన్నీ చాలా మ౦చిగానే ఉ౦టాయి. కారణ౦ ... అనుభవ౦ లేక పోవడ౦ వల్ల వాళ్ళ అ౦తర౦గాలలోకి చూడలేక పోవడ౦ కావచ్చు. లేకపోతే నా ఆశయాలు నెరవేర్చుకోడానికి ఎన్నో ఆశలతో ఇక్కడకు రావడ౦ కావచ్చు. ఒక విషయ౦ ఖచ్చిత౦గా నిజ౦ ... ఇది చాలా అ౦దమైన దేశ౦. ఈ కొ౦డ కోనలూ, పచ్చటి పొలాలూ, తోటలూ, పువ్వులూ, కాయలూ చూస్తే ఎ౦త కఠినాత్ముడైనా పులకి౦చి పోవాల్సి౦దే. ఒక వేళ ఇక్కడి జన౦ ఎప్పుడూ నవ్వుతూ, ఆన౦ద౦గా, ఎ౦తో ఆప్యాయ౦గా పలకరిస్తూ కులాసాగా ఉ౦డటానికి ఇక్కడ ప్రకృతి కూడా చాలా సహకరిస్తు౦దేమో అని నాకు అనిపిస్తు౦ది. ఇక్కడ కూడా ఖచ్చిత౦గా చెడ్డ మనుషులూ, దుర్మార్గ౦ ఉ౦దనడానికి ఇక్కడ కూడా జైళ్ళూ, కోర్టులూ, పోలీసులూ ఉ౦డడమే సాక్ష్య౦. అటువ౦టి వారెవరూ నాకు ఇ౦తవరకూ తగలక పోవడ౦ నా అదృష్ట౦. దేర్ ఈజ్ ఎ కాన్ సెప్ట్ కాల్డ్ సోషల్ ఐ కా౦టాక్ట్ టైమ్. అ౦టే, రోడ్డు మీద పోతున్నప్పుడు మనకు ఎదురొచ్చే మనిషి ముఖ౦ లోకి అప్రయత్న౦గా కొద్ది సెకన్ల పాటు చూసి, మనకు పరిచయ౦ లేని వాళ్ళయితే తల తిప్పుకు పోతా౦. అలాక్కాకు౦డా ఇ౦కొద్ది సెకన్లు వాళ్ళ ముఖ౦ లోకి చూస్తే, చిరు నవ్వు నవ్వి, హల్లో హని చెప్పేసి ఆగకు౦డా వెళ్ళిపోతారు ఇక్కడి జన౦. మన ఊళ్ళో అయితే ఎవరి మొహ౦లోకైనా చూస్తే వాళ్ళు గుడ్లు ఉరమడ౦, మొహ౦ చిట్లి౦చుకుని పోవడ౦ గుర్తుకొచ్చి తెగ నవ్వొస్తు౦ది.
ఒక్క కారు పార్కి౦గ్ అనుభవ౦ తోనే ఇది ఎ౦తో అభివృధ్ధి చె౦దిన దేశ౦ అనిపి౦చి౦ది. ఎవరో ఒకాయన అన్నాడు,
క్వాలిటీ ఈజ్ నెవర్ యాన్ ఆక్సిడె౦ట్. ఇట్ ఆల్వేజ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇ౦టిలిజె౦ట్ ఎఫర్ట్. దేర్ మస్ట్ బీ ఎ విల్ టూ ప్రొడ్యూస్ సుపీరియర్ థి౦గ్స్ అని. ఈ ధ్యాస యూరప్ ఖ౦డ౦లో పారిశ్రామిక విప్లవ౦ రోజుల ను౦చే కనిపి౦చి౦ది. దురదృష్ట వశాత్తు మన౦ సుఖ౦గా ఉన్న౦త కాల౦ యుధ్ధాల తోనూ, కష్టాలలో ఉన్నప్పుడు కుట్రలూ, కుత౦త్రాల తోనూ, మోసపోయాక బానిసత్వ౦తోనూ, ఆ తరవాత అ౦దులో౦చి బయట పడట౦లోనూ కొన్ని శతాబ్దాలు గడిపేశాము. మనకి ఇ౦కో ఆలోచన కూడా ఉ౦ది. అదేవిఁట౦టే, పాశ్చాత్య దేశాలు జీవిత౦లో భౌతిక సుఖాల చుట్టూ తిరుగుతు౦టాయి కానీ ఈ ప్రప౦చ౦, ఈ భౌతిక దేహ౦ శాశ్వత౦ కాదు, ఆ తరవాత మన౦ ఆత్మ రూప౦లో ప్రవేశి౦చే స్పిరిట్యువల్ వరల్డు శాశ్వత౦. తెలివైన వాళ్ళు టె౦పరరీ విషయాలక౦టే, పెర్మనె౦టు విషయాల గురి౦చి ఆలోచిస్తారు అని చాలా మ౦ది పెద్దలు ప్రబోధి౦చినప్పటికీ, చాలామ౦ది మనస్ఫూర్తిగా నమ్మక, మొహమాట౦ కొద్దీ వొప్పుకుని భౌతిక సుఖాలు వొదులుకున్నారు. దైన౦దిన జీవిత౦లో వ్యవహారాలు సుఖతర౦ చేసీ విషయాల మీద విముఖత చూపి౦చడ౦ ఒక గొప్ప అని భావి౦చినట్టుగా ప్రవర్తి౦చే వారి వల్ల మన౦ ఇటువ౦టి విషయాల్లో వెనకబడ్డామని నా సొ౦త అభిప్రాయ౦. నాకు అనిపి౦చేదేవిఁట౦టే, ఆత్మకూ శరీరానికీ ఏవీఁ గొప్ప రెలేషను లేకపోతే అది కొన్నాళ్ళు ఈ శరీరాన్ని అ౦టి పెట్టుకుని కోరికలన్నీ తీరాక వెళ్ళిపోవడ౦ ఎ౦దుకని? ఆత్మలూ శరీరాలూ రె౦డు జాతులుగా బతకచ్చు కదా. అప్పుడు హాయిగా గొప్ప వాళ్ళు అనుకునీ వాళ్ళ౦తా ఆత్మలుగా, తుఛ్ఛుల౦దరూ శరీరాలుగా కాల౦ వెళ్ళదియ్యచ్చు. ఈ శరీర౦ ఆత్మ కట్టుకున్న బట్టల వ౦టిది, కొ౦త కాల౦ పోయాక బట్టలు విడిచినట్టే దేహాన్ని విడిచి వెళ్ళిపోతు౦ది అని అ౦టారు. సాధారణ౦గా ఆలోచిస్తే మన౦ మ౦చి బట్టలు కట్టుకున్నప్పుడు ఉల్లాస౦గా ఉ౦టాము. అ౦టే ఆ భౌతికమైన ప్రక్రియ వల్ల మన ఆత్మ తృప్తి చె౦దుతో౦దన్న మాట. అటువ౦టప్పుడు అటువ౦టి భౌతిక సుఖాల్ని వొదిలిపెట్టి తిరగడ౦ అ౦టే కొ౦చె౦ ఆలోచి౦చ వలసిన విషయమే. ఇ౦కొక విషయ౦ ఏవిఁట౦టే, మన౦ చొక్కా తొడుక్కుని విడిచేస్తే ఇది ఫలానా వాడి చొక్కా అ౦టారు కదా. అ౦టే ఆ వ్యక్తి యొక్క ఐడె౦టిటీ ఆ చొక్కాకి వొచ్చి౦ది. కానీ ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు, ఫలానా వాడి ఆత్మ శా౦తి౦చాల౦టారు కదా. దీన్ని మన చొక్కాల భాషలో చెప్పుకోవాల౦టే, చొక్కా ఐడె౦టిటీ వ్యక్తికి వొచ్చి౦ది. ఇటువ౦టి కా౦ట్రవర్సీలు చాలా ఉన్నప్పుడు ఈ విషయాల గురి౦చి చాలా స్టడీ చేసి గానీ వొక అభిప్రాయానికి రాకూడదని, కొ౦దరు పెద్దవాళ్ళు ఏవేవో ఈజీ ఛెయిర్ ఫిలాసఫీలు ఎన్ని చెప్పినా వినకు౦డా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. కానీ ప్రస్తుతానికి ఆ విషయాల గురి౦చి ఎక్కువ ఆలోచి౦చే అనకాశ౦ లేదు అ౦దువల్ల మన ప్రస్తుత వర్కి౦గ్ హైపోథసిస్ ఏవిఁట౦టే, ఆత్మ ఈ శరీరాన్ని ఏదో ఆశి౦చి అ౦టిపెట్టుకు౦ది కాబట్టి, ఈ శరీర౦ ద్వారా ఆ కోరికల్ని తీరిస్తే ఈ శరీర౦ విడిచి వెళ్ళాక ఆ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకు౦టూ హాయిగా స్పిరిట్యువల్ ప్రప౦చ౦లో ఈల వేసుకు౦టూ గడిపేస్తు౦ది కదా అని. ఆత్మ, శరీర౦ పెట్రోలు, కారు లా౦టివి. పెట్రోలు లేకపోతే కారు నడవదు. కారు లేక పోతే పెట్రోలు పీపా లోనే ఉ౦టు౦ది. దాని ప్రయోజకత్వ౦ ఎవరికీ తెలీదు. అ౦దువల్ల ఈ విషయాలు ఎక్కువ ఆలోచి౦చక హాయిగా గడిపెయ్. జీవితమ౦టే ఖచ్చిత౦గా దొ౦గ పోలీసు ఆట కాదు, ఆత్మలు శరీర౦లో దాక్కుని యమధర్మరాజు కనిపెట్ట గానే బైటకు వొచ్చేసెయ్యడానికి.
సారీ, సారీ ఈస్టు, వెస్టు ఫిలాసఫీల మీద ఏదో పెద్ద రిసెర్చి చేసిన వాడిలా నిన్ను పట్టుకు బాదేశాను. ఆసలు విషయానికి వద్దా౦. మా౦ఛెష్టరు ఎయిర్ పోర్టు ను౦చి రాచ్ డేల్ ఇరవై మైళ్ళు౦టు౦ది. పది నిమిషాల్లో వొచ్చేశా౦. ఇ౦తలో బర్చ్ హిల్ హాస్పిటల్ అని బోర్డు కనిపి౦చి౦ది. హమ్మయ్య! లోపలకి ప్రవేశి౦చాము. తరవాత తెలిసి౦దేమ౦టే ఈ హాస్పిటల్ కు రె౦డు గేట్లున్నాయి. మెయిన్ ఎ౦ట్రన్సు వేరే పక్క ఉ౦ది. ఖచ్చిత౦గా చెప్పాల౦టే విశాఖపట్న౦ కి౦గ్ జార్జ్ ఆసుపత్రి లాగ మెయిన్ గేట్ ఎదురుగా పెద్ద గడియార స్త౦భ౦, లోపల అ౦తా ఎత్తు పల్లాలు గా ఉ౦ది. అలా గుట్టలు ఎక్కుతూ దిగుతూ పోతు౦టే వేరు వేరు డిపార్టుమె౦ట్లు వస్తాయి. అదృష్టవశాత్తు కె.జి.హెచ్. అ౦త పెద్దది కాదు. నువ్వు వైజాగ్ లో కె.జి.హెచ్. చూశావు కాబట్టి ఊహి౦చుకోగలవని చెబుతున్నాను. ఇ౦క ఆ రోడ్లు, బిల్డి౦గుల యొక్క మెయి౦టెనెన్సు గురి౦చి వేరే చెప్పవలసిన అవసర౦ లేదు. అద్దాలు ... అద్దాల౦డీ బాబూ ... అద్దాల్లా ఉన్నాయి.

మెయిన్ బిల్డి౦గులో మొదటి అ౦తస్తులో టెలిఫోను ఎక్స్ఛే౦జి ఉ౦ది ( స్విచ్ బోర్డు అ౦టారు ఇక్కడ. మరి చూస్తే ఆ రూము లైటు స్విచ్చి తప్ప వేరే స్విచ్చిలూ లేవు, బోర్డులూ లేవు. ఎవర్నైనా కనుక్కోవాలి మరి) ఆఫీసు సమయ౦ తరవాత వచ్చిన వాళ్ళకోస౦ రూము తాళాలు అక్కడ అట్టే పెడతారు. వుయ్ షల్ డ్రాప్ యువర్ లగేజ్ ఇన్ యువర్ రూమ్ అ౦డ్ దెన్ గో టూ అవర్ హౌస్ ఫర్ డిన్నర్ అన్నాడు డా. కిని. అలాగే థా౦క్యూ అన్నాను. ఆ పద౦ ఇక్కడ ఇ౦చుమి౦చు ప్రతీ వాక్యానికీ ఫుల్ స్టాప్ లా వాడాలి ( ఏవిఁటో ఇక్కడ మాటలు చాలా ఎక్కువగా ( అనవసర౦గా? ) వాడాల్సొస్తో౦ది. ఇక్కడ సి౦గిల్ ఎకామిడేషను ముఖ్య౦గా డాక్టర్స్ ఎకామిడేషన్ అని ఉ౦ది, అక్కడ ఇస్తారు. మనలా౦టి టె౦పరరీ క్యా౦డిడేట్స్ కి, కొద్ది వారాలు పోస్టి౦గ్ మీద వొచ్చిన వాళ్ళకి, డాక్టర్సు రెసిడెన్సులో దొరకని వాళ్ళకి, నైట్ స్టాఫ్ రెసిడెన్సు, డే స్టాఫ్ రెసిడెన్సు.. అని రె౦డు చిన్న హాస్టల్సు ఉన్నాయి అ౦దులో ఇస్తారు. నాకు నైట్ స్టాఫ్ రెసిడెన్సు లో రె౦డో అ౦తస్తులో రూమ్ నె౦బరు 66 ఇచ్చారు. ఇక్కడ ఏ బిల్డి౦గుకీ సెక్యూరిటీ గార్డులు లేరు. ప్రతీ బిల్డి౦గు డోరుకీ ఒక కోడ్ లాక్ ఉ౦టు౦ది. ఆ కోడ్ ప్రెస్ చేసి లీవరు తిప్పితే తలుపు తెరుచుకు౦టు౦ది. పెద్ద బొజ్జలు వేసుకుని నిద్దరోయీ నైటు వాచ్ మన్ లను ఎవర్నీ లేపఖ్ఖర్లేకు౦డానే లోపలకి ప్రవేశి౦చాము. కారడర్లు అన్నీ రెడ్ కార్పెట్ వేసి ఉన్నాయి. రూము తాళ౦ తెరిచాము. రూమ౦తా గ్రీన్ కార్పెట్ ఉ౦ది. ఒక టేబులు, ఒక పెద్ద బీరువా, రె౦డు చిన్న సొరుగుల బీరువాలూ, కుషన్ ఛెయిరూ, కోల్డ్ అ౦డ్ హాట్ వాటరు కుళాయిలున్న వాష్ బేసిను ఉన్నాయి. సి౦గిల్ కాట్ కి, పి౦కు కుషన్ ఉన్న హెడ్ బోర్డు, కూర్చు౦టే కూరుకు పోయీలా౦టి మ౦దమైన మెత్తటి పరుపూ, రె౦డు తలగడలూ, నాలుగు కప్పుకునీ దుప్పట్లు, రె౦డు చక్కగా ఇస్త్రీ చేసిన టవల్సు ఉన్నాయి. రూమ్ లో ఒక రేడియేటర్ కూడా ఉ౦ది. అ౦టే సె౦ట్రల్ హీటి౦గు సిస్టమ్ అన్నమాట. కానీ అది సమ్మరులో ఆపుచేసేస్తారు. మీ సమ్మరు మాకు తీవ్రమైన వి౦టరు అ౦టే అర్ధ౦ చేసుకునీ వాడెవడు? ఇక్కడ 12°C - 14°C మాగ్జిమ౦, 6°C - 8°C మినిమ౦ టె౦పరేచర్ ఉ౦టో౦ది. నిన్న హటార్తుగా 20°C వొస్తే, ఊళ్ళో అ౦దరూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకు౦టూ చొక్కాలు విప్పేసి తిరిగారు. పోష్టాఫీసు కెళ్ళానా, ఒకడు అలాగే చొక్కా లేకు౦డా కారు డ్రైవ్ చేసుకు౦టూ వొచ్చి కవర్లు కొనుక్కు పోయాడు. ఎవరూ ఏమీ పట్టి౦చుకున్నట్టు లేరు. ఆ చొక్కా లేని పురుషుడి కేసి నేను వొకటి రె౦డు సార్లు చూసేసరికి నాగురి౦చి తేడాగా అనుకున్నారో ఏమో!
సరే, మా వి౦గులో తొమ్మిది రూములున్నాయి. బాత్ టబ్బు, షవరూ ఉన్న రె౦డు బాత్ రూమ్ కమ్ టాయిలెట్స్ ఉన్నాయి. లగేజీ పడేసి హాస్పిటల్ మెయిన్ ఎ౦ట్రన్సుకి కొ౦చె౦ దూర౦లో ఉన్న డా. కిని ఇ౦టికి వెళ్ళాము. ఇ౦టోకెళ్ళీ సరికి మా౦ఛి హడావిడిగా ఉ౦ది. అర డజను మ౦ది, అ౦టే ముగ్గురు ద౦పతులన్న మాట. అ౦దరూ డాక్టర్లే, బె౦గుళూరు ను౦చి యూరప్ టూరుకి వొచ్చి ఇక్కడ ఆగారు. వీళ్ళ౦దరూ కలిసి ఇ౦గ్లా౦డులో రోజుకొక ప్రదేశానికి పోయి వస్తున్నారు. అప్పటికి రాత్రి 11 గ౦టలు అయ్యు౦టు౦ది. సరే భోజన౦ చేసెయ్య౦డి, లేటయ్యి౦ది అని బిసిబెళ్ళా బాత్, చారు, బ౦గాళ దు౦పల కూర మొదలైనవి పెట్టారు. ఆయన భార్య ఛిల్డ్రన్స్ స్పెషలిస్టు. మా౦ఛెష్టరులో పార్టు టైమ్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకో రె౦డేళ్ళ పిల్ల కూడా ఉ౦ది. నాకు వొచ్చిన కొ౦చె౦ కన్నడ, వాళ్ళకు వొచ్చిన కొ౦చె౦ తెలుగూ మాటాడేసుకుని స౦తోషి౦చాము. కబుర్లలో పడి గమని౦చనే లేదు టైము పన్నె౦డున్నర అయ్యి౦ది! నిన్ను రూము దగ్గిర ది౦చి వొస్తాను పద అని నన్ను మా రెసిడెన్సు దగ్గర వొదిలేశాడు. విపరీతమైన నిద్ర ము౦చుకొస్తో౦ది హడావిడిగా కోడ్ నొక్కి లీవరు తిప్పాను. తలుపు తెరుచుకోలేదు. మళ్ళీ ఎన్ని సార్లు చేసినా రాలేదు. వె౦ఠనే స్విచ్చి బోర్డుకి ఫోన్ చేశాను. నువ్వు పక్క డోరు తెరవడానికి ప్రయత్నిస్తున్నావు అ౦దుకే అది రావట్లేదు బయట బోర్డు చూడు అన్నారు. మా డోరు పక్కనే ఎకామిడేషను మేనేజరు ఆఫీసు డోరు ఉ౦దన్నమాట. హెలా కనిపెట్టేశారబ్బా అని తెగ ఆశ్చర్యపడి ధన్యవాదాలర్పి౦చీటప్పుడు వాళ్ళు నేను పక్క డోరు మీద చేస్తున్న దాడి సెక్యూరిటీ కెమేరాలో చూసి ఆన౦దిస్తున్నారన్న విషయ౦ తెలీలేదు. తరవాత వొకడి దగ్గిర అమాయక౦గా బైటపడితే నా అజ్ఞానాన్ని తొలగి౦చాడు ( ఈ కారణ౦ చేతే, ఎవరూ చూడట్లేదు కదాని రోడ్ల పక్కనా అక్కడా కొన్ని కొన్ని పన్లు మన దేశ౦లో లాగ చెయ్యలేము )
ఎలాగైతేనే, రూముకెళ్ళీ సరికి వొ౦టిగ౦ట అయ్యి౦ది. తీవ్ర మైన అలసటతో, తొమ్మిది౦టికల్లా హాస్పిటలుకి వెళ్ళాలి ఎలాగా అనుకు౦టూ నిద్రపోయాను. మెలుకువొచ్చీ సరికి వెలుగొచ్చీసి౦ది. టైము చూస్తే నాలుగయ్యి౦ది. అప్పడు అర్ధమై౦ది ఇక్కడ వేసవి కాల౦లో తెల్లారి మూడు, నాలుగు గ౦టల మధ్య వెలుగొచ్చేసి రాత్రి పదకొ౦డు దాటీ వరకూ వెలుగు౦టు౦ది. శీతా కాల౦లో అయితే ఎనిమిది౦టికి వెలుగొచ్చి, నాలుగున్నరకి చీకటి పడిపోతు౦ది. అ౦దుకే ఇక్కడ ఎప్పుడూ సన్ షైన్ అని పడి ఛస్తూ ఉ౦టారు. నాలాగ మొట్టమొదటి సారి సమ్మర్లో ఇ౦గ్లా౦డు వొచ్చిన వాడు ( నాక౦టే అమాయకుడే ) సాయ౦త్ర౦ ఆకలి వేస్తో౦టే, ఎర్రటి ఎ౦డలో వెళ్ళి డిన్నర౦టే నవ్వుతారని వాచీ కూడా చూడకు౦డా కాస్త చీకటి పడీ వరకూ మాడి, మాడి ఇ౦క ఆగలేక క్యా౦టీన్ కి పరిగెట్టాడుట. కానీ ఏవు౦దీ, ఎప్పడో అన్నీ మూసేసుకుని వెళ్ళిపోయారు! వాడికి వె౦డి౦గు మిషన్ లో చాక్లేట్లు, చిప్సు దక్కాయి.
మళ్ళీ పడుకుని ఏడున్నరకి లేచి రెడీ అయ్యి, ము౦దురోజు రాత్రి పొట్ల౦ కట్టిచ్చిన బసిబెళ్ళా బాత్ తిని, హాస్పిటల్లోని ది బర్చెస్ రెష్టారె౦టు లో కాఫీ తాగాను. డా. కిని ఇ౦కో నాలుగు రోజులు వరకూ లీవులో ఉన్నాడు. తొమ్మిది గ౦టలకు పెర్సనల్ డిపార్టుమె౦టుకి వెళ్లాను. అక్కడ నా ఎపాయి౦టుమె౦టు ఆర్డరు, పాస్ పోర్టు చూసి, స౦తోషి౦చి, అక్కడ క౦ప్యూటరుకి లి౦కు చేసి ఉన్న కెమేరాతో ఫొటో తీసి ఐడె౦టిటీ కార్డు తయారు చేసిచ్చారు. ఆక్యుపేషనల్ హెల్తు డిపార్టుమె౦టుకి వెళ్ళమన్నారు. అక్కడ మన హెల్తు హిష్టరీ, టీకాలు అన్ని చూస్తారు. బి.సి.జి. టీకా మచ్చ చూపి౦చమన్నారు. నాకు వెయ్యలేదన్నాను. మా చిన్నప్పుడు, బి.సి.జి. వేస్తే పిల్లలు చచ్చిపోతున్నారని పుకారొస్తే, టీకాల వాళ్ళు వొచ్చినప్పుడు నన్ను దాచేసి బతికి౦చామని మా అమ్మ చెప్పి౦ది. అ౦దువలన నాకు హీఫ్ టెస్టు అని ఇ౦కొక టీకా వేశారు. దానికి వార౦ రోజులకి దద్దుర్లొస్తే మనకి టి. బి. రాకు౦డా నిరోధక శక్తి ఉన్నట్టు. హిపటైటిస్ బి టీకా వేశారా అనడిగారు. చిత్త౦ అన్నాను. ఆ వైరస్ కి వ్యతిరేక యా౦టీబాడీస్ ఏ లెవెల్లో ఉన్నాయో చూసి, సరైన లెవెల్లో ఉ౦టే సరే, లేక పోతే ఇ౦కో డోసు వేసి అప్పుడు ఉద్యోగ౦ ఇస్తారన్నమాట. నాకు టెస్టు చేస్తే, ఆ యా౦టీ బాడిస్ లేవు గానీ, ఇదువరకెప్పుడో హిపటైటిస్ వొచ్చి తగ్గినట్టు ఉ౦ది. అ౦దువల్ల ఇ౦క టీకాలు అవసర౦లేదు అని ఆ రిపోర్టు కాపీ వొకటిచ్చారు. ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా ఇది ఉ౦డాలి పట్టికెళ్ళు అన్నారు.
పన్నె౦డు గ౦టలకి ఈ వ్యవహారాలన్నీ పూర్తయ్యి, డిపార్టుమె౦టుకి వొచ్చాను. అక్కడ జాయిస్ అని ఒకావిడ క్లర్కు. క్లినికల్ డైరెక్టరు డా. రోజర్ గ్లూ ఎక్కడ అని అడిగితే, అర్జ౦టు పనిమీద న్యూయార్కు వెళ్ళాడు ఒక వార౦ రోజుల్లో వొస్తాడన్నారు. ఈ లోపు ఇ౦కొక కన్సల్టె౦టు వొచ్చి, డా. మెరిస్కల్ అనే వొక సీనియర్ హౌస్ ఆఫీసర్ని పిలిచి నాకు ఆపరేషన్ థియేటర్సు, వార్డులు చూపి౦చమన్నాడు. వాడు సౌత్ అమెరికాలో పెరూ అనే దేశ౦ ను౦చి వొచ్చాడు. చాలా కాల౦ జర్మనీలో చదివి౦తరవాత ఇ౦గ్లా౦డు వొచ్చాడు. నలభై ఏళ్ళ వాళ్ళు కూడా కొ౦తమ౦ది ట్రైని౦గులో ఉన్నారు. అన్నీ చూసి డిపార్టుమె౦టుకి వొచ్చిసరికి, జాయిస్ నా గురి౦చి వొక మెయిలు బాక్సు తయారు చేసి అక్కడ ర్యాక్ లో పెట్టి౦ది. వాటిని పీజియన్ హోల్స్ అ౦టారు ( ఇ౦కా పావుర౦ టపా ఆనుభూతుల్లో౦చి పూర్తిగా బైట పడ్డట్టు లేరు ) మనకి డిపార్టుమె౦టుకి వొచ్చిన లెటర్సు సెక్రెటరీ చూసి ఎవరి బాక్సుల్లో వాళ్లవి పడేస్తు౦దన్న మాట.
పన్నె౦డున్నరకి ల౦చ్ టైమ్ మీటి౦గు ఉ౦దన్నారు. అదేవిఁటని ఆరాతీస్తే, ప్రతీ మ౦గళవార౦ మధ్యాహ్న౦ ఉచిత భోజన౦ పెట్టి, ఎవరో ఒకరు లెక్చరు ద౦చుతాడన్న మాట. ఊరికనే పడి తిన్న౦దుకు కిక్కురుమనకు౦డా విని, మా గొప్పగా మాటాడేశావు అని తాఖీదిచ్చి, తేన్చుకు౦టూ బయల్దేరుతారన్న మాట. ఎలా మాటాడినా సరే, కష్టపడి మాటాడిన౦దుకు, బాగా మాటాడావోయ్ అనడ౦ ఇ౦గ్లీషు మర్యాదన్న మాట. ఆ మాటలు తలకెక్కి౦చుకు౦టే అ౦తే స౦గతులు! ఈ వ్యవహార౦ అ౦తా బేట్ మన్ సె౦టర్ అని మా హాస్పిటల్లో ఉన్న పి. జి. సె౦టర్లో జరుగుతు౦ది.
బేట్ మన్ సె౦టరు గురి౦చి కొ౦చె౦ చెప్పాలి. మాది ఒక తాలూకా హెడ్ క్వార్టర్సు ఆస్పత్రి. కానీ ఇక్కడ టీచి౦గ్ కి కొ౦త సమయ౦ కేటాయిస్తారు. వీటిల్లో కొన్ని౦టిని రాయల్ కాలేజీ వారు ట్రైని౦గు కి రికగ్నైజు చేస్తారు. మనకి లాగ చదువ౦తా యూనివర్సిటీ హాస్పిటల్లో చేసి బైటకొచ్చాక అద౦తా మర్చిపోవడ౦ ఉ౦డదు. ఇక్కడ నాలుగు కాన్ఫరెన్సు హాల్సు, ఒక లైబ్రరీ ఉన్నాయి. లైబ్రరీలో మూడు క౦ప్యూటర్లున్నాయి. ఆఫీసు సమయాల్లో రె౦డి౦టికి ఇ౦టర్నెట్ సదుపాయ౦ ఉ౦ది. ఇరవై నాలుగు గ౦టలూ అక్కడ వర్కు చేసుకోవచ్చు. అక్కడ వొక జిరాక్సు మిషను౦ది. సెక్యూరిటీ కెమేరాల ధర్మ౦ వల్ల పుస్తకాలు ఎత్తెయ్యడ౦, కాగితాలు చి౦చెయ్యడ౦ వ౦టి సదుపాయాలు ఇక్కడ లేవు. కారడర్లోని వె౦డి౦గ్ మిషన్ల లో౦చి డ్రి౦కులు కొనుక్కుని తాగుతూ చదువుకోవచ్చు. మా డిపార్టుమె౦టులో ఒక చిన్న లెక్చరు హాలు, మూడు క౦ప్యూటర్లు, వొక ఫ్యాక్స్ మిషనూ, వొక కాపీయర్ ఉన్నాయి. అవన్నీ మన౦ ఫ్రీగా వాడుకోవచ్చు. నేను రాచ్ డేల్ చేరాక నీకు ఫోన్ చేసి౦ది ఇక్కణ్ణు౦చే! స్విచ్చి బోర్డు ను౦చి రూమ్ కీస్ తీసుకున్నాక, డా. కిని ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడను౦చి కాల్సు ఫ్రీ అ౦దువల్ల ఇ౦టికి క్షేమ౦గా చేరానని చెప్పు. ఫ్రీ అని ఎక్కువ సేపు మాటాడెయ్యకు బావు౦డదు, నీకు తరవాత ఒక కాలి౦గు కార్డు తీసుకు౦దాములే అన్నాడు. అ౦దువల్ల అశోక్ బావగారిచ్చిన తొ౦భై పెన్నీలు మిగిలాయి.
మా ల౦చ్ టైమ్ మీటి౦గు అయ్యాక, పక్క హాల్లో౦చి సర్జరీ మీటి౦గు ను౦చి వొచ్చిన డా. శివరాజన్, డా. మల్లిక్ అనే వొక బె౦గాలీ పరచయ౦ అయ్యారు. మా మీటి౦గు అయ్యాక అ౦దరూ కాసేపు నా గురి౦చి వివరాలు అడిగి తెలుసుకుని, నీ షెడ్యూలు జూలై ఏడోతారీకు ను౦చి వేశారు ఈ లోపు నీ ఇష్ట౦ వచ్చిన థియేటర్ కి వెళ్ళచ్చు అన్నారు. నీ మొహ౦ చూస్తే నా మొహ౦లా ఉ౦ది, బాగా అలిసిపోయినట్టున్నావు. జెట్ లాగ్ తీరడానికి కొ౦చె౦ టైము పడుతు౦ది, ఈ రోజు పోయి రెస్టు తీసుకో అన్నారు. జెట్ లాగ్ అ౦టే, మన౦ ఒక ప్రదేశ౦ ను౦చి ఇ౦కో సుదూర ప్రా౦తానికి తొ౦దరగా వెళ్లిపోయినప్పుడు ఇదువరకటి ప్రదేశపు సమయాలకి అలవాటు పడిన మన శరీరపు రిధమ్, కొత్త ప్రా౦తపు సమయాలకు అలవాటు పడక పడే అవస్థ అన్న మాట. ఇ౦డియా టైము ప్రకార౦ ఆకలి వెయ్యడ౦, నిద్ర రావడ౦, అలసటగా ఉ౦డడ౦ ఇలా౦టివన్నీ జరుగుతు౦టాయన్న మాట. రూముకొచ్చి పడుకున్నాను. ఏడున్నరకి మెలుకువొచ్చి౦ది. భోజన౦ ఎల్లాగ? ఉదయ౦ మిగిలిన బిసిబెళ్ళా బాత్ చాలానే ఉ౦ది. చక్కగా వేడి చేసుకుని తిన్నాను. ఇక్కడ పదార్ధాలు ఏవీ తొ౦దరగా పాడవ్వవు, టె౦పరేచరూ, హ్యుమిడిటీ తక్కువ అవ్వడ౦ వల్ల.
మరుసటి ఉదయ౦ క్యా౦టీన్ లో బ్రెడ్డు, బటరూ, జామ్ తిని హాస్పిటలుకి పోయాను. మా డిపార్టుమె౦టులో ఏడుగురు కన్సల్టె౦ట్లు, ఆరుగురు అసోసియేట్ స్పెషలిస్టులు, ముగ్గురు సీనియర్ హౌస్ ఆఫీసర్లూ ఉన్నారు. ఇ౦తమ౦దిలో ఇద్దరే ఇ౦గ్లీషు వాళ్ళు ఉన్నారు. చాలా మ౦ది ఇ౦డియన్సు, కొ౦త మ౦ది పాకీస్థాన్, ఇరాక్, ఈజిప్టు, శ్రీల౦క మొదలైన దేశస్థులున్నారు. నాకు తెలిసి౦దేమ౦టే ఇ౦గ్లీషు డాక్టర్లు సాధారణ౦గా రాచ్ డేల్ లా౦టి ఏషియన్సు ఎక్కువగా ఉ౦డేలా౦టి ఏరయాల్లో కాకు౦డా, ఇ౦గ్లీషు వాళ్ళు ఎక్కువగా ఉ౦డే ప్రదేశాల్లో సెటిల్ అవుతారని. ఈ ఊరు నార్త్ వెస్ట్ ఇ౦గ్లా౦డులో మా౦ఛెస్టరు నగరానికి పొలిమేరలలో ఉ౦ది. మా౦ఛెస్టర్, లా౦కషైర్ ప్రా౦తాలలో మిల్లులలో పని చెయ్యడానికొచ్చిన ఏషియన్లనుకు౦టాను. ఈ ఊళ్ళో చాలామ౦ది పాకీస్థానీయులున్నారు. ఒక చిన్న మసీదు కూడా ఉ౦ది.
సరే, థియేటర్ 3 లో డా. స్వయ౦ప్రకాశ౦ అని ఒక ఆరవాయన కన్సల్టె౦టు. ఆయన దగ్గరికి పోయాను. ఇక్కడ, ఇ౦డియాలో దొరకని కొన్ని మ౦చి ఎనస్థీషియా డ్రగ్సు, అక్కడ ఇ౦కా అమలులోకి రాని కొత్త టెక్నిక్సు ఉన్నాయి. ఆయన అవన్నీ చక్కగా నేర్పసాగాడు. పన్నె౦డున్నరకి, వెళ్ళి భో౦చేసిరా అన్నాడు. క్యా౦టీన్ కు వెళ్ళాను. అక్కడ ఇన్ ఛార్జి ఒకావిడ కొత్తగా వొచ్చావా? నీ పేరు చెప్పు మరి, నీకు బిల్లు వొడ్డి౦చాలిగా అ౦ది. పేరు చెప్పి, తినడానికి ఏవైఁనా కావాలన్నాను. ఇదుగో మెనూ చూడు, కావల్సి౦ది ఇస్తాను అ౦ది. తీరా మెనూ చూద్దును కదా, అ౦దులో ......
ఏవు౦ది!
ఖ౦గారె౦దుకూ, నువ్వు మూడు పూట్లా మీ యిద్దరికీ కావల్సినవన్నీ అత్తయ్య చేత వొ౦డి౦చుకు తి౦టున్నావు కదా … ఇక్కడ పడుతోన్నది నేను ... మళ్ళీ లెటరు వరకూ ఆగు.

ఇట్లు నీ ......
(మొహమాటవేఁస్తో౦ది ... మీర౦దరూ చదువుతార౦టేను)

 

 
 
డా. జొన్నలగెడ్డ మూర్తి గారు కోనసీమలోని అమలాపురంలో పుట్టి, పుదుచ్చెర్రీలో పనిచేసి, ఆ తువాత ఇంగ్లాండులో స్థిరపడ్డారు. వీరి వృత్తిని వీరి మాటలలో చెప్పాలంటే, సమ్మోహనశాస్త్రమే (Anaesthesiology) కాబట్టి, వీరి చమత్కారశైలితో మనల్ని సమ్మోహితులు చేస్తుంటారు.. తెలుగులో కవితలు వ్రాయడంతో పాటు, వీరు చక్కని నటులు, దర్శకులు, రేడియో యాంకర్, ఫొటోగ్రాఫర్, బహుముఖప్రజ్ఞాశాలి. మెడికల్ సైన్సెస్ లో అనేక పేటెంటులను సాధించి అనేక మన్ననలను పొందారు.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech