Sujanaranjani
           
  కబుర్లు  
  నాటకాలు - నా అనుభవాలు
           
 

- రచన : ఓలేటి వెంకట భూపతి రావు

 
 

oletibhupatirao

ఆంధ్రులకూ, నాటకాలకూ ఒక అవినాభావ సంబంధం  ఉందని నా అభిప్రాయం. నాటకాలను గురించిన నా జ్ఞాపకాలూ-అనుభవాలూ  కాల చక్రం  క్రిందపడి  నలిగిపోక ముందే, వాటిని  చదువరులతో  పంచుకోవాలనే  ఆశయమే  నా   రచనకు   నాందీ ప్రస్తావన.

బాల్యం లోనే  మా తల్లి గారు  గతించిన  కారణంగా నేనూ, మా తమ్ముడూ  కొంత కాలం మా మేనత్త  గారి వద్ద ఉండడం జరిగింది.. వారిది  పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు  తాలూకా లో   గౌరీపట్నం  అనబడే  ఒక కుగ్రామం . నేను  జీవితం లో మొదటి నాటకాన్ని  అక్కడే చూసాను. ఊరి మధ్య   రామాలయం దగ్గర స్టేజి  కట్టి బొబ్బిలి యుద్ధం నాటకం ప్రదర్శించారు. నాటకం లో  ఒక సీను లో రంగారాయుడికీ, విజయరామరాజు కీ మధ్య కత్తి యుద్ధం  చూపించారు. హఠాత్తుగా రంగారాయుడు  ఒక చేయి ని కంటి మీద అదిమిపెట్టి క్రింద  పడిపోయాడు దృశ్యం   చూసి నేను చాలా బాధ పడ్డాను. కాసేపటి తరువాత  స్టేజి వెనక వైపు కి వెళ్లి చూస్తే.....రంగారాయుడూ, జయరామరాజూ ఇద్దరూ సిగరెట్లు  కాలుస్తూ, ఒకళ్ళ నొకళ్ళు  భుజాలు చరుచుకుంటూ  కనిపించారు....ఆశ్చర్య పోయాను !!--స్టేజి మీద చూసినదంతా  నాటకమేనని  ఐదారేళ్ళవయసులో అప్పుడు   నాకు  అర్ధం కాలేదు .

నేను  చూసిన రెండవ నాటకం  పాండవోద్యోగ విజయాలు. చిన్నతనంలో పండితులూ పామరులూ మెచ్చిన నాటకం ఇది. గౌరీపట్నం లో  సాయంత్రం  ఎడ్ల బండి  లో పొలాలనుంచి ఇళ్ళకు తిరిగి వచ్చే  పాలేళ్ళు  బావా, ఎక్కడ నుండి రాక ఇటకున్...... అంటూ  కృష్ణుడి పద్యాన్ని   పాడడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది.

పాండవోద్యోగ విజయాలు నాటకం లో అతి ముఖ్యమయినది శ్రీ కృష్ణుడు పాత్ర. 1950  లో గుంటూరులో నాటక పోటీలు జరిగాయి. ఇందులో   గెలిచిన  శ్రీ కృష్ణ పాత్ర దారికి   స్వర్ణ  కిరీటాన్ని బహుమతిగా ప్రకటించారు. కిరీటాన్ని గెలుచుకున్న  మహానటుడు  శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు. ఆయన  మా తండ్రి గారికి  చాలా సన్నిహితులు, బాల్య స్నేహితులు..

గుంటూరులో నాటక పోటీలు జరిగిన ఒకటి, రెండేళ్ళ తరువాత  మా ఊళ్ళో  (గుంటూరు జిల్లా,  చేబ్రోలులో) నాటక ప్రదర్శన  ఏర్పాటు అయింది. ఇందులో, శ్రీ నరసింహ  మూర్తి గారు  శ్రీ కృష్ణుడు., అద్దంకి శ్రీ రామ మూర్తి గారు  ధర్మరాజు,   మాధవపెద్ది  వెంకట్రామయ్య  గారు  దుర్యోధనుడు.  నాటకానికి వచ్చినప్పుడు, నరసింహ మూర్తి గారు  మా ఇంట్లో ఉంటారని  మా తండ్రి గారు చెప్పారు.   సంగతి  విని  చాలా సంతోషపడ్డాను.

నాటకం  రోజు  ఉదయం  నరసింహమూర్తి గారు  మా ఇంటికి వచ్చారు. కానీ  ఆయనని చూడగానే  నాకు  కొంత నిరుత్సాహం కలిగింది. చామన ఛాయ శరీరం, స్ఫురద్రూపి  అని మాత్రం అనలేని  రూపం  ఆయనది. ఈయన శ్రీ కృష్ణ  పాత్రను ఎలా నిర్వహించి  బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారా  అని ఆశ్చర్యపోయాను..మద్యాహ్నం  భోజనాలు  అయిన  తరువాత , ఆయన  వాలు కుర్చీలో  కూర్చుని చుట్ట ముట్టించి , పంతులూ-ఒక పద్యం పాడవోయ్  అన్నారు. వెంటనే  ఆయనను మెప్పిద్దామని  రాయబారం  సీను లో  కృష్ణుడు  పాడిన   జండాపై   కపి రాజు, ముందు సిత వాజి శ్రేణి యున్ గూర్చి .... అన్న పద్యం పాడాను. భేష్ !-చాలా బాగా పాడావోయ్అయితే, సిత వాజి  శ్రేణి  అంటే ఏమిటోయ్  అని   అడిగారాయన. తెల్ల ముఖం వేసాను! ఆయనను మెప్పిద్దామని  పద్యం  పాడాను గానీ  దాని అర్ధం  గురించి ఆలోచించలేదు . సిత అంటే తెల్లని, వాజి అంటే గుర్రముల, శ్రేణి అంటే  వరుస విధంగా  సిత వాజి శ్రేణి అంటే  తెల్లని గుర్రముల వరుస" అని  వివరించి చెప్పారాయన

సాయంత్రం నాలుగు గంటలకు  బ్రాహ్మణ కోడూరు నుంచి  వచ్చే బస్సులో  మాధవపెద్ది వెంకట్రామయ్య  గారు, మిగతా నటులు వస్తారు. ఆయనతో నేను మీ ఇంట్లో బస  చేసానని చెప్పి రా  అన్నారు నరసింహ మూర్తి గారు. మరి ,ఆయనను ఆనమాలు పట్టడం ఎలాగండీ అని అడిగాను. చాలా సులభమోయ్. కృష్ణుడు తోలుతున్న రధం  వెనుక   అర్జునుడు  నిలబడినట్లు, డ్రైవరు   వెనుక సీటులో కూర్చున్న ఆయనే  వెంకట్రామయ్య గారు . తెలిసిందా ? అన్నారాయన..

 బస్ స్టాండ్ కి వెళ్లి బస్ రాగానే   పరుగెత్తుకెళ్ళి   వెంకట్రామయ్య గారితో  విషయం చెప్పాను. ఆయనతో బాటు, మిగిలిన నటులు కూడా  బస్ దిగారు. వారిలో ఒకరు కొంచం వయసు మళ్ళిన వారిలా  కనిపించారు. బహుశాఒకటి, రెండు దంతములు కూడా  లేవు కాబోలు! ఎవరో చెప్పారు ఆయనే గగ్గయ్య గారు అనిశ్రీ కృష్ణ లీలలు   సినిమాలో  కంసుని పాత్రను ధరించి , ధిక్కారమును  సైతునా అంటూ అందరినీ గడ గడ లాడించిన   ఆయన నటన ను  మరచిపోయిన వారుండరు . రోజు నాటకం లో ఆయన భీముని పాత్ర ను ధరించారు.

  రోజు రాత్రి   పది  గంటలకు   మా వూరి  సినిమా హాలు లో  పాండవోద్యోగ  విజయములు  నాటకం ప్రారంభమయిందిశ్రీ కృష్ణ పాత్ర ను ధరించి   నరసింహ మూర్తి గారు  స్టేజి   మీదకు రాగానే , నా కళ్ళ ను నేనే నమ్మలేక పోయాను. మా ఇంటి దగ్గర   చూసిన  నరసింహ మూర్తి  గారికీ, ఇప్పుడు  చూస్తున్న నరసింహ మూర్తి గారికీ  ఎక్కడా పోలిక లేదుసాక్షాత్తూ   శ్రీ కృష్ణుడే స్టేజి  మీద అవతరించాడని  అనిపించింది. ఆయన హావ భావములు, ఆంగికము, వాచికము  చూచి తీరవలసినదే గానీ  చెప్ప సాధ్యం కాదు. ఆయన స్వర్ణ  కిరీటం  ఎలా గెలుచుకున్నారో, నాకు రోజు అర్ధమయింది.

ఇక్కడ, ఒక ఆసక్తికరమైన   విషయాన్ని చెప్పక తప్పదు. మాయా బజార్  చిత్రం  తీసే ముందు , చిత్ర దర్శకుడు   కె. వి. రెడ్డి గారు   ఎన్. టి. రామారావు గారికి   పీసపాటి నరసింహ మూర్తి గారి  పాత్ర ధారణను చూపించారట! విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం  పాడుతా తీయగా అనే   . టి. వి. ప్రోగ్రాం  లో  శ్రీ   ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారు చెప్పారుఇక ఇదే నాటకం లో అద్దంకి శ్రీ రామ మూర్తి గారు  ధర్మ రాజు గా మాధవపెద్ది వెంకట్రామయ్య  గారు  వారి వారి పాత్రలలో  నటించారు అనడం కంటే జీవించారు  అనడం సబబు గా వుంటుంది!

మీసం ఉన్న కృష్ణుడిని  చాలా మంది  చూసి వుండరు. కానీ నాకు అదృష్టం లభించింది. మా హైస్కూలు హెడ్ మాస్టారికీ, మరి  కొందరు ఉపాధ్యాయులకూ, పాండవోద్యోగ విజయాలు  నాటకం వేయాలనిపించినది. మీసం ఉన్న మా  హెడ్ మాస్టారికి  కృష్ణుడి పాత్ర వేయాలని కోరిక.. కానీ , మీసం తీయడం ఆయనకు బొత్తిగా  ఇష్టం లేదుకాబట్టిఆయన మీసం తోనే  కృష్ణుడి పాత్ర ధరించారు.!

1950  లో నేను  బొబ్బిలి యుద్ధం నాటకాన్ని మరొకసారి చూడడం జరిగిందిగుంటూరు లో జరిగిన  నాటకం లో, పీసపాటి నరసింహ మూర్తి గారు విజయరామ రాజు గానూ, అద్దంకి  శ్రీరామ మూర్తి గారు  రంగా రాయుడుగానూ నటించారు. నాటకం అయిపోయిన తరువాత ఎవరో, శ్రీ రామ మూర్తి గారితో    శ్రీ రామమూర్తి  గారూ, మీ నటన అందులోనూ  ముఖ్యం గా   మీరు రాచఠీవితో మాటిమాటికీ  మీసం దువ్విన తీరు అద్భుతంగా ఉన్నాయండీ అన్నారు.   శ్రీ రామ మూర్తి  గారు నవ్వుతూ  అది రాచ ఠీవి  కాదండీ మేకప్  లో  మీసం సరిగ్గా అతికించ లేదు. అది ఊడిపోతుందేమో అన్న భయంతో , దానిని  గట్టిగా  అదిమి పట్టి వుంచాలాన్న  తాపత్రయంతో నేను పడే అవస్థ , మీకు  అలా రాచఠీవి లా అనిపించిందన్న మాట అన్నారు .

1956   నుండి  1960  వరకు  నేను ఆంధ్ర విశ్వ విద్యాలయం  ( వాల్తేరు )   ఇంజినీరింగ్ కాలేజీ   లో ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్   చదివాను.. రోజుల్లో, ప్రతి సంవత్సరం , విశ్వ విద్యాలయం పరిధి లో వుండే  వివిధ ప్రాంతాల నుండీ , కళాశాలలు  నాటికల పోటీలలో పాల్గొనేవి పోటీలు విశ్వ విద్యాలయ ప్రాంగణం  లో ఉన్న  ఆరుబయలు రంగ స్థలం పైన జరిగేవి. ప్రథమ బహుమతి ని పొందిన నాటికను డిల్లి  లో జరిగే  అంతర్విశ్వ విద్యాలయ  నాటికల పోటీలకు పంపించే వారు. ఆంద్ర విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ శ్రీ  కె. విగోపాల స్వామి  గారు  పోటీల విషయంలో వ్యక్తిగత  శ్రద్ధ ను చూపించే వారు ..

ఒక సంవత్సరం, విశ్వ విద్యాలయం తరఫున  ప్రదర్శించబడే  నాటికలో  పాల్గొనే నటులను  ఎంపిక చేసుకోవడానికి , శబ్దోచ్చారణ పరీక్ష పెట్టారు. దానిలో  ప్రతీ నటుడు  చెప్పవలసిన డైలాగు మా మేనమామ  రాజేంద్ర మహేంద్ర చంద్ర  నృసింహ  నృపాలుడు  మాకు కానుక గా నొసంగిన    దివ్య భవ్య  హర్మ్య రాజమును  నీకు బహూకరించెదను అని ..

వాల్తేరులో  చదివిన నాలుగు   సంవత్సరాలలో  నేను మూడు రంగ స్థల నాటికలలోనూరెండు రేడియో నాటికలలోనూ నటించాను. మొదటి  రంగస్థల  నాటిక  హిరణ్య కశిపుడు లో నేను   ప్రహ్లాదుని పాత్ర  ధరించాను. అది  ఒక రాజకీయ వ్యంగ్య (పొలిటికల్ సెటైర్నాటిక. రెండవ నాటిక  ఆరుద్ర గారు   రచించిన  దేముని  ఎదుట. ఆరు  బయలు రంగస్థలం పైన  ప్రదర్శించిన  నాటికను చూడడానికి  ఆరుద్ర  గారు కూడా హాజరవడం ఒక విశేషం! నాటికలో నాది  కోదండం శిక్ష విధింప బడిన  ఒక విద్యార్ధి పాత్ర .. , రంగస్థలం కప్పు  మీద రెండు  గిలకలు  కట్టారు. యా గిలకల మీద  రెండు లావైన  త్రాళ్ళు  వేసి , వాటిని నా చంకల  క్రింద నుండి  పోనిచ్చి  మళ్ళీ గిలకలకు  కట్టారు. అసలు నాటకంలో , గిలకల మీదుగా త్రాళ్ళను  పైకి  లాగితే , నేను భూమి పై నుండి  రెండు, మూడు అడుగులు పైకి, గాలిలోనికి   వ్రేల్లాడాలి! రిహార్సల్స్ లో నేను  అనేక పర్యాయాలు త్రాళ్ళు  లాగే ప్రక్రియ లేకుండా మామూలుగా నేల మీద నిలబడే, డైలాగ్స్  చెప్పడం ప్రాక్టిస్   చేసాను. ఒకటి  రెండు సార్లు  ప్రాక్టిస్ చేసినా  గాలిలో  ఒకటి  రెండు  నిముషాలకు  మించి  వ్రేలాడడం  జరగ లేదు .

నాటకం   మొదలయింది. గబ గబా, గిలకల నుండి  త్రాళ్ళను లాగడం  మొదలు పెట్టారు. తెర తీసారు. జోరుగా  త్రాళ్ళను  లాగడంతో    నేను  చంకల క్రింద   త్రాళ్ళతో  గిర గిరా   తిరగడం మొదలయింది. దానితో  మైక్   ముందుకు తిరిగినప్పుడే   డైలాగ్స్   చెప్పడం నాకు సాధ్యమయింది  .ప్రేక్షకులలో ఉన్న ఆంధ్ర విశ్వ విద్యాలయం  డాక్టరు  గారు, నాటకం దర్శకుడిని దగ్గర గా పిలిచి అతనితో అబ్బాయి  ఇంకా కాసేపు  ఇలా వ్రేల్లాడుతూ వుంటే    చాలా ప్రమాదం అని చెప్పారట. దాదాపు  పదిహేను  నిముషాల తరువాత వాటిని  అన్నిటినీ   తొలగించి  నన్ను  జాగ్రత్త గా కిందికి దింపారు  చంకల క్రింద  నుంచి త్రాళ్ళను  తీసి, చేతులు  పైకి  ఎత్త డానికి ప్రయత్నించాను. కానీ.... నా చేతులు అప్పటికే నా స్వాధీనంలో లేవు. పక్షవాతం వచ్చి  పడిపోయినట్లు అనిపించింది.. విశ్వ విద్యాలయం వాన్  లో  రోజూకింగ్ జార్జ్   హాస్పటల్ ( విశాఖపట్నం)లో ఫిజియో  థెరపీ   చికిత్స ను ఒక నెల రోజులు  తీసుకున్న తరువాత  గానీ, నా చేతులు మళ్ళీ  మామూలు స్థాయికి రాలేదు.

 రంగ స్థలం  పై నేను నటించి  మూడవ (  మరియు ఆఖరి) నాటిక  పినిశెట్టి  గారు  వ్రాసిన  ఆడది. నాటిక పేరు ఆడది అయినా, అందులో స్త్రీ  పాత్ర లేకపోవడం  విశేషం! ఇందులో, నేను  గొల్లపూడి మారుతి రావు  గారి కొడుకు పాత్రను ధరించాను. మేము ప్రదర్శించిన   నాటికను చాలా మంది  ప్రశంసించారుఅంతే కాదు  ఏడాది జరిగిన విశ్వ  విద్యాలయ రంగ స్థల పోటీలలో, మా నాటిక  ప్రధమ బహుమతిని పొందుతుందనీ, తరువాత డిల్లి లో జరిగే  అంతర్విశ్వ విద్యాలయ  పోటీలలో  పాల్గొనే అర్హత ను సంపాదిస్తుందని  చాలా మంది   ఆశించారు. మేమూ, డిల్లి  ప్రయాణం  మాకు  ఖాయం అని కలలు కన్నాము .కానీమా కలలు కలలు గానే  మిగిలి  ఏడాది   ప్రధమ బహుమతిని  విశాఖపట్నం, మిసెస్ .వి. ఎన్. కళాశాల   కైవశం చేసుకుంది.

నాటకాల  మూలాన, నాకు ఇద్దరు మహా నటులతో పరిచయ భాగ్యం  కలిగిందివరుసగా, డు సంవత్సరాలు మహారాజా  కళాశాల, విజయనగరం  వారు  ప్రఖ్య శ్రీ రామ మూర్తి గారు  రచించిన ఫణి, కాళ రాత్రి - టికలను  పోటీలలో ప్రదర్శించారు . అందులో స్త్రీ పాత్రధారి  డి.బి .నీల  కంఠం  గారు . ఆయన పాత్ర పోషణ ఎంత సహజం గా వుండేదీ అంటే పాత్ర దారి  పురుషుడు టే   నమ్మ శక్యం  కాకుండా ఉండేది.. పమిట జారితేఫ్లాష్ష్  లైట్లు    మిల మిల  లాడేవి !  విజయనగరం కళాశాల లో  గ్రాడ్యుయేషన్  అయాకా నీల కంఠం గారు  ఆంధ్ర విశ్వ విద్యాలయంలో  న్యాయ శాస్త్రం (లా) చదివారు. తరువాత ఆయన కూడా నాలాగే , ఇండియన్   ఎయిర్  ఫోర్స్   లో ఆఫీసర్   గా చేరారని విన్నాను. కానీ, ఆయన్ని మళ్ళీ కలిసే  అదృష్టం  లభించలేదు.

నాటకాల వలన  నాకు లభించిన  మరొక మిత్రుడు గొల్లపూడి మారుతి రావు  గారు. ఆయన సహజ నటుడు.   అంతే కాదు ఒక మంచి  రచయిత గా  కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు..ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతూ, నాటకాలు వేసుకునే రోజులలోనే, భవిష్యత్తు లో   ఆయన నటనా రంగంలోనూ, సాహితీ రంగం లోనూ  రాణిస్తారనే ప్రగాఢ విశ్వాసం  నాకు ఉండేది . ఆయన నటించిన రెండు, మూడు సినిమాలు చూసాను. కావీ, అవి అన్నీ   దుష్ట పాత్రలే.!. మారుతి రావు గారు మంచి హాస్యనటులు . ఎక్కువగా  ఆయన హాస్య పాత్రలను ధరిస్తే  చాలా బాగుంటుందని  నా అభిప్రాయం. ఎయిర్ ఫోర్స్  నుండి రిటైర్   అయాకా  1990  లో నేను డిల్లి   లో స్థిరపడ్డాను. బహుశా:  1995   లేక  1996  లో ( సరిగ్గా జ్ఞాపకం లేదునేషనల్   ఫిలిం అవార్డ్ లకు జ్యూరీ  గా డిల్లి వచ్చినప్పుడు , ఆయనను కలవడం  జరిగింది.

నేను  నటించిన  మొదటి రేడియో నాటిక  మిత్రులు మారుతి రావు  గారు  రచించిన  అనంతం. ఇందులో  ఆయన స్వయంగా  అనంతం పాత్ర ను పోషించారు. నేను నటించిన పాత్ర పేరు రాందాసు. రాందాసు   నడివయస్కుడు. కర్కశమైన   గొంతు. అప్పుడు నా వయసు  18  సంవత్సరాలు.   నాటికను   మేము ఆల్ ఇండియా రేడియో, విజయవాడ కేంద్రంలో  రికార్డు చేసాము. తరువాత మేమంతా   ఒక హాలు లో కూర్చుని వుండగా, మా నాటిక  రికార్డింగ్  ని ప్లే  బాక్   చేసారు. అప్పుడు, స్టేషన్ డైరక్టరు   గారు ( శ్రీ బాలాంత్రపు  రజనీకాంత  రావు గారు అనుకుంటానుహాలు లోనికి వచ్చి  నాటిక ను  వినసాగారునా డైలాగ్స్  విన వస్తున్నప్పుడు  , ఎవరు    నటుడు ? అని అడిగారాయన.. అప్పుడు నన్ను చూపించగా , ఆయన నమ్మలేక పోయారు!

సంవత్సరం తెలుగు లో జరిగిన  విశ్వవిద్యాలయ  రేడియో నాటికల పోటీలలో  అనంతం ప్రధమ  బహుమతి ని  గెల్చుకుందిశ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి, ఉస్మానియా  విశ్వ విద్యాలయం, హైదరాబాద్  కూడా రేడియో నాటిక పోటీలో పాల్గొన్నాయి. అర గంట  వ్యవధి  ఉన్న అనంతం నాటికలో  పాల్గొన్న  మా ప్రతి ఒక్కరికీ   ఏభై  రూపాయల  చెక్కు ను కూడా  ఆల్ ఇండియా రేడియో వారు   ప్రతిఫలం  గా  ఇచ్చారు . జీవితంలో    నా ప్రధమ ఆర్జన   ఇది.

  తరువాత   సంవత్సరంలో    కూడా  మేము విజయవాడ, అల్ ఇండియా రేడియో  కేంద్రంలో  మరొక రేడియో నాటిక, ఆంధ్ర విశ్వ విద్యాలయం   తరఫున  రికార్డ్ చేసాము. అందులో, నేను  తిరుగుబాటుదారుడైన  ఒక యువకునిగా  నటించానులా కాలేజీ లో  చదివే ఒక అమ్మాయి   నాకు తల్లి గా నటించింది.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech