Sujanaranjani
           
  కబుర్లు  
  నా మొట్టమొదటి నాట్యగురువు
        నా గురువులు –`పద్మభూషణ్' వెంపటి చిన సత్యం మాష్టారు గారి జ్ఞాపకాలు..  
 

- రచన : `నాట్యభారతి' ఉమాభారతి

 
 

 విశ్వవిఖ్యాతి గాంచిన కూచిపూడి నాట్యాచార్యులు వెంపటి సత్యం గారు నా మొదటి కూచిపూడి గురువుగారు అనుకుంటే నాకు గర్వంగా, ఆనందంగా ఉంటుంది. నాకు ఐదేళ్ల వయస్సులో మా నాన్న గారికి ఆర్మీ మేజేర్ గా మొదటి పోస్టింగ్ మద్రాస్ లో వచ్చింది. మేము ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో సత్యం మాస్టార్ గారి ‘కూచిపూడి ఆర్ట్స్ అకాడెమీ’ ఉండడం నా అదృష్టమే. సాయంత్రం వేళల్లో ఆయన క్లాసులు చెప్పేవారు. నేరుగా ఆయన్నే అడిగాను క్లాస్ లో కుర్చోవచ్చా అని. ఆయన నవ్వుతూ అనుమతి ఇచ్చారు. ఓ రెండు వారాలు, ప్రతి రోజూ క్లాసులో గంటలు తరబడిగా అందర్నీ చూస్తూ అలా కూర్చుండిపోయేదాన్ని. ఆ తరువాత అమ్మ నాన్నల్ని అడిగాను డాన్స్ నేర్చుకుంటానని. అమ్మ నుండి జవాబు లేదు. నాన్న సరే చూద్దాం అన్నారు.

మాస్టర్ గారు నా ఆశక్తి గమనించి మా ఇంటికి స్వయంగా వచ్చి, నాన్న గారిని అమ్మని కలిసి నన్ను క్లాస్ కి పంపమని అడిగారు. అలా ఐదేళ్ళప్పుడు వెంపటి చిన సత్యం గారి డాన్సు స్కూల్లో చేరడం జరిగింది. అక్కడ యడవల్లి రమ, నటి చంద్రకళ, కొత్తపల్లి పద్మ వాళ్ళు సీనియర్స్. డాన్సు ప్రాక్టిస్ చేసేవాళ్ళు.
వాళ్ళలా అవ్వాలని అలా డాన్సు చెయ్యాలని చాలా ఆశక్తిగా ఉండేది. ‘హోలీ ఏంజెల్స్’ లో చదువుతున్న నాకు క్లాస్మేట్ రాధ (నటి రేఖ చెల్లెలు) నాతో పాటే నేర్చుకోనేది. నటి రేఖ, మాల (సింగపూర్), సీత వింజమూరి కూడా క్లాసుల్లో డాన్స్ నేర్చుకోనేవాళ్ళు.

బాగా ఆశక్తి ఉండి చక్కగా చేసేవాళ్ళని సత్యం మాస్టారు గమనించేవారు. మెచ్చుకునే వారు. అలా ఆయన నన్ను గమనించి మెచ్చుకుంటే నాకు ఆ రోజు పండుగేలా ఉండేది. వారానికో రోజు చిన్న పోటీ పెట్టి అడుగులు చేయించేవారు. నేను ఎక్కువ మార్లు గెలిచేదాన్ని కూడా. మాస్టారు నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన అలా ప్రేత్యేకంగా ప్రోత్సహించి, మెచ్చుకోనేవారిలో నేనూ తప్పకుండా ఉన్నాను. ఎవరన్నా బాగా చేయక పోయినా, శ్రద్ధ చూపకపోయినా ఆయన కోప్పడేవారు. నన్ను ఏనాడు కోప్పడలేదు.

డాన్స్ క్లాస్ మొదలుపెట్టిన రెండేళ్ళకి ఆర్మీ వాళ్ళ ఫ్లాట్స్ తయారయ్యాయి. మేము కొత్త ఫ్లాట్ కి మారవలసి వచ్చింది. మరీ దూరమేమీ కాదు. అయినా డాన్స్ క్లాస్ అయ్యాక చీకట్లో ఇంటికి రావడం కష్టం అని అమ్మ డాన్స్ క్లాస్ వద్దంది. మాస్టార్ గారికి ఆ సంగతి తెలిసి, తానే బాధ్యత తీసుకొని ఎలాగైనా నన్ను క్లాస్ నుండి ఇంటికి బధ్రంగా చేరుస్తానని మా అమ్మని ఒప్పించారు. ఎన్నో మార్లు క్లాసు అయ్యాక ఆయనే నన్నుఇంటివరకు సైకిల్ మీద దిగబెట్టేవారు. అప్పట్లో ఆయన సైకిల్ నడిపేవారు. లేదంటే, శేషు మాస్టారు వెంట ఇంటికి పంపేవారు. అంతటి శ్రద్ధ తీసుకొనే వారు శిష్యుల విషయంలో.

నేను చాలా సన్నగా ఉండేదాన్ని. స్ట్రైన్ అయినప్పుడల్లా కాస్త జ్వరం వచ్చేది. నేను రెండు రోజులు క్లాసుకి రాకపోతే, మాస్టర్ గారు, ఇంటికొచ్చి కనుక్కొనే వారు. అలా నా కూచిపూడి నృత్య శిక్షణ బేషుగ్గా సత్యం మాస్టారి గారి వద్ద, ఓ ఐదేళ్ల పాటు జరిగింది.

నా పదవ యేట, నాన్న కి మళ్ళీ బదిలీ. మేము బదిలీ అయి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు, మాస్టారు గారు గారు ఎంతో బాధపడ్డారు. నన్ను మంచి నర్తకిగా తీర్చి దిద్దుతానని, కాన్వెంట్లో చదువుకుంటూ డాన్సు నేర్చుకోవచ్చుననీ, మద్రాస్ లోనే తన వద్ద వదిలేసి వెళ్ళమని, మిగతా పిల్లలతో పాటే చక్కగా చూసుకుంటానని, చాల అడిగారు మా నాన్నగారిని. ఆయన అలా అనడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది, అంతటి గొప్ప గురువుగారు నా అంత చిన్న పిల్లపై ఉంచిన నమ్మకం నాలో చాలా ఉత్సాహాన్ని నింపింది. ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో చెప్పలేను. మా అమ్మ వాళ్ళలోనూ నాపై నమ్మకం పెంచిందేమో. వాళ్ళకే కాదు నా మీద నాకు కూడా ఓ గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చేసింది. తప్పకుండా ఎక్కడ వున్నా కూచిపూడి గురువు వద్ద నాట్యాభ్యాసన కంటిన్యూ చేస్తామని అమ్మ మాస్టారు గారితో అన్నది.

వేదాంతం జగన్నాధ శర్మగారు, సత్యం గారూ అన్నదమ్ముల కొడుకులు. ఇద్దరూ వారి తండ్రిగారైన శ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి వద్ద నాట్యం అభ్యసించారట. నా రెండవ గురువు గారు వేదాంతం జగన్నాధ శర్మ గారవ్వడం కూడా నా అదృష్టమే. అదే నృత్య సాంప్రదాయం కొనసాగించ గలిగాను.
1976 లో, మద్రాస్ కళామహల్లో జరిగిన నా నృత్య ప్రదర్శనకి సత్యం మాస్టార్ గారు విచ్చేసి, “నీవు డాన్సర్ గా ఇంతటి దానవౌతావని నాకు ఎప్పుడో తెలుసు,” అంటూ ఆశీర్వదించారు. మొదటి వరుసలో కూర్చుని నా నాట్యాన్ని తిలకిస్తున్న ఆయన్ని నేను గమనించాను కూడా. చాలా బెరుగ్గా ఫీల్ అయ్యాను. వెంటనే మళ్ళీ ఆయన నా నాట్యాన్ని మెచ్చుకోవాలి అని ఆశ పడ్డాను. అలా దేశ విదేశాల్లో జరిగే సాంస్కతిక సభల్లో అప్పుడప్పుడు కలిసే వాళ్లము. తప్పకుండా నాతో మాట్లాడి నన్ను ప్రోత్సహించే వారు. చుట్టూ ఉన్న వాళ్ళ కి “ఉమ నా శిష్యురాలే,” అని చెబుతూ, ఇప్పుడు మా జగన్నాధ శర్మ శిష్యురాలు అని గర్వంగా అనేవారు. మలేషియా తెలుగు మహా సభల్లో కలిసినప్పుడు కూడా “డాన్స్ విషయంలో నీ గురించిన వార్తలు వింటూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను, చాలా సంతోషం,” అని ఆయన అన్నప్పుడు నాకింకేమి గుర్తింపు కావాలి? అనుకున్నాను.
డిట్రాయిట్, యూ.ఎస్.ఏ లో 1997 లో జరిగిన ఆటా తెలుగు సభల్లో కలిశాము. మాస్టార్ గారి ప్రోగ్రాం అవుతూనే మా ప్రోగ్రాం ఉండడంతో, ఆయన డయాస్ దిగుతుండగా, నేనూ పైకి డయాస్ మీదకి వెళ్తూ పాదాభి వందనం చేశాను.

తరువాత 1998 లో డల్లాస్, యు.ఎస్.ఏ (U.S.A) లో జరిగిన తానా TANA కాన్ఫెరెన్స్ లో, ప్రారంభ సమావేశానికి మా అమ్మాయితో చేయించిన ‘అయిగిరినందిని’ డాన్సు చూసి, వివరాలు కనుక్కొని
నా కోసం కబురంపారు. నేను, మా అమ్మాయి శిల్ప వెళ్లి కలిసాము. ఆయన ప్రశంసించి “అప్పుడే
అనుకొన్నాను ఆ డాన్సు, అమ్మాయి పోలికలు చూసి, చాల సంతోషం”, అని ఆశీర్వదించారు. నేను
మరువలేని విషయాలు ఇవి.

అలా ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వెంపటి సత్యం గారు నా గురువుగా, నా నృత్య ప్రస్థానంలో, ఓ దివ్య మంగళ మహానీయులే.....ఆయనకి నా శతకోటి అభివందనాలు...
 

 
 

‘Natya Bharathi’ Uma Bharathi A world renowned classical Dance exponent, Actress, Producer, Director, Writer, Choreographer with noted educational, artistic dance documentaries, Telefilms and Telugu films, to her credit. 

Youngest state delegated cultural ambassador to raise funds for World Telugu conferences, Temple projects, educational funds, scholarships in India, Malaysia, Singapore, South Africa,  Mauritius  & U.S.A.

Recipient of  Padmasri Balamurali’s ‘Swarnakanakanam’,  Vamsee Berkley award, Tamilnadu Governor’s Rajyalaxmi award, ’89 TANA’s award for her dedication & propagation of art of Kuchipudi for 40 years. 

Uma’s stalwart Kuchipudi gurus are Padmabhushan Vempati China Satyam & Kalaprapoorna Vedantam Jagannaadha Sarma. 

- `నాట్యభారతి' ఉమాభారతి, అర్చన డాన్స్ అకాడెమి, హ్యూస్టన్, టెక్సాస్

www.archanafineartsacademy.com

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech