Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

పాలకోడేటి కథలు : ఆగూటి గోరొంక, మనిషి మిగిలాడు, వెన్నెల్లో చీకట్లు..

 

                                                                           రచన : విహారి

 
సుప్రసిద్ధ కథారచయిత, సారస్వతవేత్త శ్రీవిరించి ఒక వ్యాసంలో అంటారు.. మనిషి వ్యక్తీకరణ కి అతని సమగ్ర వ్యక్తిత్వాన్ని అధిగమించి, మానసిక వాతావరణ లోతుపాతులను మరింత వివరంగా, స్పష్టంగా చూపించగల రచనలు కావాలి అని..

నాలుగు దశాబ్దాలుగా రచనా కృషిలో తనదైన ముద్రని సంతరించుకుని శతాధికంగా కథానికలు రాసి, 20 ఏళ్ళుగా పత్రికల్లో వివిధ శీర్షికలు నిర్వహించి, జాతీయ అంతర్జాతీయ సారస్వత సమ్మేళనాలతో అనుబంధం గల లభ్ద ప్రతిష్టుడైన పాలకోడేటి సత్యనారాయణరావు ఏమంటారో చూడండి.. కథలనేవి ప్రధానంగా మనస్తత్వ చిత్రణలేనని నా భావం. ఓ సంఘటనకు, ఓ దృశ్యానికి మనిషి ఎలా స్పందించాడనేది కథల్లో ప్రధానాంశం అవుతుందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయానికి శ్రీవిరించి గారన్న వ్యక్తీకరణని అనుసంధించగా వచ్చిన ఎన్నో మంచి కథల్ని అందించారు పాలకోడేటి.

పాలకోడేటి మొన్న డిసెంబర్లో 30 కథలతో ఒక సంపుటం ప్రచురించారు. ఈ కథల్ని చదివినప్పుడు నాకు కొ.కు. సూక్తి ఒకటి గుర్తికొచ్చింది. గొప్ప జీవతం అనుభవించిన వారే గొప్ప రచన్లు చేయగలుగుతారు అనేది. జీవితాన్ని అధ్యయనం చేసి, అనుభవించీ రాసిన కథానికలు - పాలకోడేటి రచనలు.. ఆయన కథానికల్లోని ఒక గొప్ప కథానిక అ గూటి గోరొంక - ఒక రిటైరైన ఉద్యోగి. ఆదాయం తగ్గింది. ఈ కారణాన్నే ఇంట్లో వారి గౌరవమూ, ఆదరణా కూడా తగ్గాయనే వేదనని అనుభవిస్తూ ఇల్లు వదలి వచ్చి హోటల్రూమ్ చేరాడు. ఇంకొక బాగా డబ్బున్న పేరున్న నటుడు.. అందరికి నా డబ్బు కావాలి కాని నేను అక్కర్లేదు అని ఆయన ఆవేదన. ఆయనా ఇల్లు వదిలేసి హోటల్ రూంకి మకాం మార్చాడు.. బాధలూ, వ్యథలూ కలబోసుకున్నారా ఇద్దరూ..
ఇద్దరూ అభిప్రాయాలూ తెలియజేసుకున్నారు. ఆ నటుడు అంటాడు.. వాళ్ళు నన్ను కోరరని తెలిసినా మళ్ళీ బహుశా ఆ కూపంలోకే వెళ్తానేమో. వాళ్ళకు నేను అక్కర్లేదు. కానీ వాళ్ళను నేను కన్నాను. వాళ్ళు నాకు కావాలి. అని . ఈ ఉద్యోగి ఆలోచన్లో పడ్డాడు. తన తెలివితక్కువతనం తెలిసి వచ్చింది. తన సమాన నటుడు తనకు జీవితంలో ఎంతో మేలు చేశాడనుకుంటాడు. ఈయన దృష్టిలో ఆయన ఎంతో ఎదిగాడు. ఉద్యోగి ...ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మనసులో చిందులు వేస్తున్న తన మనుషులు దగ్గరికి అంటూ కథ ముగుస్తుంది.

కథలెలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోవాలి. రెండు జీవితాల నేపథ్యం వచ్చింది. రెండు పాత్రల వర్తమాన స్థితి గతులు వచ్చాయి. ఆ ఇద్దరు మనుషుల వ్యక్తీకరణ వచ్చింది. మానసిక సంఘర్షణకి చక్కటి చిత్రణ జరిగింది. రావలసిన ఆశాభావం, మార్పు వచ్చాయి. కుటుంబ వ్యవస్థనీ, మానవ సంబంధాల్నీ తత్కాలిక ఉద్రేకాలతో తెగనీయకుండా పరిరక్షించుకోవల్సిన అవసరం శ్రుతిలా కలిసిపోయింది. కథానికారాగ ప్రస్తారంలో.. ఒక జీవన సత్యం - విలువలన్నీ మారిపోయాయి. ఎవర్ననుకుని ఏం లాభం? అందుతోంది.. ఆ నిర్వేదం వెనుక కన్నపేగు ఔదార్యం తొణికిసలాడుతోంది.. ఏ తర్కానికీ లొంగని జీవన గతిని కథానికా పట్టకం పారదర్శకం చేస్తోంది. ఎక్కడా జీవితాలు మొత్తం చిత్రించాలన్న చాపల్యం లేదు. కథానికకు సాంకేతికకంగా ఎంతో ఆవశ్యకమైన, (అవసరమైనంత మేరకు) క్లుప్తత, శైలీ వేగం కుదిరాయి. కథానికా దేహ ప్రాణాలు వస్తువు, శిల్పం కూడ ఆ గూటి గోరొంక పేరులో నిండుగా, అర్ధవంతంగా భాసించింది. పక్షి ఎక్కడెక్కడ తిరిగినా తన గూటికే చేరుతుందనేది ప్రాకృతిక సత్యం ఇదీ పాలకోడేటి కథన నైశిత్యం.

అలాగే మనిషి మిగిలాడు అని మరో గొప్ప కథ ఉంది. మునిసిపాలిటి వారు రూల్స్ ప్రకారం ఇళ్ళు కూల్చే కార్యక్రమం మొదలెట్టారు. ఒక మధ్యతరగతి ఉద్యోగి ఇల్లు అది.. డిమోలిషన్ స్క్వాడ్లో నర్సిమ్మ వర్కర్. ఆ రోజే గృహప్రవేశం జరగాల్సిన ఆ ఇంటిని పడగొడ్తుంటే నర్సిమ్మకు చెప్పలేనంత తృప్తి కలుగుతూ ఉంటుంది. అతని భావనలో ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా అక్రమార్జనాపరులే. కసితో ఆ ఉద్యోగి ఇంటిని కూలగొట్టాడు. నిజానికి ఆ ఉద్యోగి మున్సిపాలిటీలో ఒక అవినీతి దగుల్బాజీ సృష్టించి ఇచ్చిన ప్లాన్ అప్రూవల్ మీదే ఇల్లు కట్టుకున్నాడు. ఆ అవినీతి భాగోతం బయటపడి ఈ ఇళ్ళ కూల్చివేత చేపట్టడం జరిగింది. నర్సిమ్మ ఎంతో తృప్తితో ఆఫీసుకి చేరాడు ఇవ్వాళ. ఇలాంటి డ్యూటీనే నిర్వహించి తిరిగివచ్చిన సూరయ్య బాధగా నర్సిమ్మకు చెప్తాడు. యియ్యాల మీ గుడెసెలన్నీ..అని.. నర్సిమ్మకు అంతా అర్ధమైపోయింది.. నోటమాటరావడం లేదు.. గుండెల్లో బాధ.., దుఃఖం నోటికొచ్చిన బూతుల్తో నోటికొచ్చిన వారినల్లా తిట్టసాగాడు. ఆక్రోశం కట్టలు తెంచుకుంది. సూరయ్య అంటాడు నర్సిమ్మ ఏడుపూ, రాద్దాంతం చూసి.. ఇప్పుడు నువ్వూ పోయివచ్చినావ్ కదా, మరి నువ్వు కూడా ఇయ్యన్నీ ఆడాలోచించినావా? అని, క్షణాలు గడిచినై, నర్సిమ్మ అంతరాంతరాల్లోకి ఎప్పుడో ప్రవేశించి, ఎక్కడో కాపురం ఉంటున్న రాక్షసుడు క్షణాల మీద చచ్చిపోయాడు! ఇదీ కథ..

తెలుగు కథానికల మీద కొన్ని వర్గాల కథక విమర్శకులూ, విమర్శక కథకులూ - గొప్ప కథలు రావడం లేదని వాపోతున్నారు. ప్లీజ్ చదవండి ఈ పాలకోడేటి కథానికలు. నవత్వం, శిల్ప సాంకేతికత్వం ఉన్న గొప్ప కథలు పుస్తకమంత నిండి వెలుగులతో కాంతులీనుతున్నాయి. వెన్నెల్లో చీకట్లు అని 1979 లో రాసిన పాలకోడేటి కథానిక ఆరు పేజీల ఆణిముత్యం. అయన ఎంతటి దార్శనికుడో తెలుపుతుంది. అద్దెగర్భం సమస్య రానున్న కాలాల్లో సృష్టించబోయే కల్లోలలని చిత్రించారు. ఒక కోర్టు కేసు సన్నివేశం సృష్టించి! 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ కథలు వాస్తవాలవుతున్నాయి. సామాజిక విలువల ఆవశ్యకత, మనిషి అంతరంగ ఘర్షణ, మంచితనం, స్నేహశీలత, కుటుంబ వైవాహికవ్యవస్థల పటిష్టతని కాపాడుకోవలసిన అవసరం - వంటి వ్యక్తిత్వ వికాస దోహదకరమైన వస్తువిస్తృతితో, శిల్ప భరితంగా కథానికా రచన చేశారు పాలకోడేటి. తెలుగు కథానికాభ్యుదయ పథగామియైన వారికి అభినందనలు!
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech