Sujanaranjani
           
  కథా భారతి  
 
మనసుంటే .... మార్గాలు కొదవా?
 

రచన : స్వాతీ శ్రీపాద     

 
1
ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు.
అలాగని ఇల్లు నిశ్శబ్దంగానూ లేదు.
లో స్వరంలో వినీ వినిపించని చర్చలు సాగుతూనేవున్నాయి.
"ఎవరెవరికి టీ కావాలి? " వంటగది గుమ్మంలో నించుని అడిగింది అపరంజి.
హాల్లో కూర్చుని గోరుచిక్కుళ్ళు తుంపుతున్న మాలతి, మాలిని ,క్యాబేజీ కోస్తున్న సునంద పనిమనిషికి వాషింగ్ మెషీన్ లో బట్టలు వెయ్యడానికి సాయపడుతున్న స్వయం ప్రభ
వరండాలో శంకర్ ,వినోద్, సత్యమూర్తి అందరూ విన్నారు. కాని ఒక్కరూ కావాలని కాని, వద్దని కాని అనలేదు. ఒక్క క్షణం ఆగి,
సరే, అందరికీ చెప్పేస్తాను
ప్రతిస్పందన ఆశించకుండా వంటగదిలోకి వెళ్ళి వంట మనిషికి సూచనలివ్వడం ఆరంభించింది.
ఈ స్టౌమీద టీనీళ్ళు పెట్టి ఆ పక్కన ఇడ్లీ పెట్టెయ్యండి. ఈ లోగా చట్నీమిక్సీ లో వెయ్యొచ్చు
ఏ గదిలో చూసినా సూట్ కేస్ లూ బాగ్ లూ ... ఆ మూలో ఈ మూలో గుంపులు గుంపులుగా జనం.
నిజమే.
వర్ధనమ్మ మహాభినిష్క్రమణ పెద్ద ఎదురు చూడని సంఘటనేమీ కాదు.
ఎనభై దాటిన ఆవిడ మూడేళ్ళుగా మంచం మీదే వుంది. చివరకు ఎదురు చూసిన ఘడియ వచ్చి ఆవిడ వెళ్ళిపోయింది.
అందరూ వచ్చాక క్రితం సాయంత్రం అంత్యక్రియలు ముగిసాయి. ఇంటికి తిరిగి వచ్చాక కాస్త తిని పడుకుని తెల్లారి నిద్ర లేచి తప్పని కార్యక్రమాల్లో మునిగిపోయినా అందరికీ మనసింకా భారంగానేవుంది.
నిన్నటి వరకు సజీవంగా వున్న మనిషి ఇప్పుడు లేకపోవడం .... ఆఖాళీ పూర్తిగా కుదిపేసిన వ్యక్తి అనసూయ. అవును అనసూయకే తల్లితో ఎక్కువ అనుబంధం.
పుట్టినప్పటినుండీ నిన్నటి వరకూ తల్లిని విడిచి ఒక్కరోజూ గడపలేదు. అందులోనూ గత ఏడెనిమిదేళ్ళుగా ఇంట్లో ఇద్దరేమిగిలి ఒకరికొకరుగా మారాక, ఇరవై నాలుగ్గంటలూ సన్నిహితంగా గడిపాక ............
అనూ ...అనూ....
వంటింటి లోంచి పిలిచింది అపరంజి.
ఉహు! పిలుపుకి జవాబే లేదు.
అప్పటి దాకా అనూ గుర్తురాలేదెవరికీ. కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు.
అమ్మ గదిలో వుందేమో.. మాలతి సూచన
అపరంజి గబగబా తల్లి గదిలోకి వెళ్ళింది.
అనూ
కిటికీ దగ్గర నిల్చుని బయటకు చూస్తున్న అనసూయ నిర్లిప్తంగా తల తిప్పింది.
ఇకపైన జీవితం ఏ అనుకోని మలుపు తిరుగుతుందో తెలీని అయోమయంలో వుంది అనసూయ.
అదే ఆమె మొహం లోనూ కనిపించిందేమో అపరంజి గబగబా వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ,
బెంగపడుతున్నావా అనూ?
.................
ఒక్క దానవని దిగులు పడుతున్నావేమో మేం అందరం ఉన్నామని మరచిపోకు....
ఫక్కున నవ్వాలనిపించింది అనసూయకు.
ఆ మెరుపు పెదవులమీదకు పాకినట్టుంది
ఎందుకు నవ్వుతున్నావు? అపరంజి అనుమానంగా అడిగింది.
అబ్బే
చెప్పు
నువ్వు ఎన్ని సార్లు ఇక్కడ్నించి పారిపోదామనివుందని అన్నావో గుర్తొచ్చి
నేనా? ఎప్పుడు?
అనసూయకు మళ్ళీ నవ్వు తన్నుకు వచ్చింది.
అపరంజి ఆమెకన్నా పన్నెండేళ్ళు పెద్ద కాని తన కన్న ఓ పాతికేళ్ళు చిన్నదేమో అనిపించిందా క్షణంలో.
రా... అందరిలో వుండాలి కాని ఇలా ఒంటిగా వుంటే మరీ దిగులనిపిస్తుంది. సుగుణమ్మను టీ చెయ్యమన్నాను. ........
అపరంజితో బయటకు కదిలినా అనసూయ కళ్ళు ఖాళీ గావున్న తల్లి మంచాన్నీ , బోసిపోయిన గదిని ఆర్తిగా తడిమాయి.
ఎంత డిస్పోజబుల్ గ్లాస్లూ ప్లేట్ లూ వాడినా , పనిమనిషినీ వంటమనిషినీ మాట్లాడుకున్నా ఇల్లంతా ఒకటే హడావిడి.
నిశ్శబ్ద వాతావరణానికి అలవాటు పడ్డ అనసూయకు ఆ సందడి కొంచం విసుగ్గానేవుంది.
అలాగని ఆ విసుగును వెల్లడించలేని స్థితి.
నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే ..............
టీలు , ఫలహారాలు... మళ్ళీ వంట ప్రయత్నాలు...
వీటన్నింటి మధ్యా చర్చలు.
ఏం చెయ్యాలి? జరగ వలసినది ఏమిటి?
కర్మ కాండ మూడో రోజున మొదలెట్టాలి. దానికి కావలసిన అరేంజ్ మెంట్స్ ... ముందుగా చేయించేవాళ్ళు, దానిక్కావలసిన వస్తువులు అన్నీ అమర్చుకోవాలి .. పాతికేళ్ళ క్రితమే అమెరికా వెళ్ళీ చదువుకుని అక్కడే స్థిరపడిన మాలతి మాటలవి.
అనసూయకు నవ్వొచ్చింది. ఎలెక్ట్రికల్ క్రిమెటోరియమ్ లో దహనం చేసి ఇంకా ఇరవై నాలుగు గంటలైనా కాలేదు.
అమ్మ కిలాంటి నమ్మకాలు లేవని నీకు తెలీదా పెద్దక్కా? అవునులే , అమ్మతో నీకంత టచ్ ఎక్కడ.........అమ్మ చాలా సార్లు చెప్పింది.
ఇలాంటి వన్నీ నేను నమ్మను నేను లేను కదా అని మీ పిచ్చి నమ్మకాలు నామీద రుద్ది గందరగోళం చెయ్యవద్దని...
ఓ పక్కన తనపని తను చేస్తూనే స్వయంప్రభ జవాబిచ్చింది.
అవుననుకో ..అయినా నలుగురూ ఏమనుకుంటారు ? ఇంతమంది వెల్ సెటిల్డ్ పిల్లలూ మనవలూ వుండి..........
అనుకోని విధంగా ఎప్పుడూ నిశ్శబ్దంగా వుండే మాలిని తీవ్రంగా స్పందించింది.
అవునే, పుట్టిందగ్గరనుంచి చచ్చాక కూడా మన ఇష్టాఇష్టాల ప్రసక్తి వదిలేసుకుని ఎవరేమనుకుంటారో ననే బతకాలా......
నీ కొడుకు అమెరికన్ ని పెళ్ళి చేసుకున్నాక కూడా నువ్విలా ఎలాగన్నావో నాకర్ధం కావడం లేదే పెద్దక్కా?
బాగా చెప్పావే చిన్నక్కా! అయినా అమ్మ తృప్తి కావాలిగాని ...ఇలా పిచ్చి పిచ్చి నమ్మకాలకు ఖర్చుపెట్టడం కాదుగా .... నయా పైసకు పదిముళ్ళువేసే సునందకల్పించుకుంది.
మేమిప్పుడు ఖర్చు డబ్బు గురించి మాట్లాడటం లేదు సునందా ...ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం.
కార్యక్రమాలు చెయ్యనంత మాత్రాన అమ్మ పేరిట ఏదైనా చెయ్యకూడదా?
ఎలాగూ ముందు అమ్మ పేరిట అన్నదానం అదీ బీదా బిక్కి కి. ఆ పైన మిగతావి ఆలోచిద్దాం...అపరంజి నిర్ణయించినట్టుగా చెప్పింది.
పోనీ ఎవరినైనా సంప్రదిస్తే...
మాలతి మరో మారు ప్రయత్నించింది.
అక్కయ్యా ! నీ వయసు అరవైకి చేరువవుతున్నా, జీవితమంతా అమెరికాలో గడిపినా, ఇంకా నీలో అభ్యుదయం కొంచం కూడా రాలేదు. ఇది అమ్మకు మనకు సంబంధించినది. ఎవర్నో సంప్రదించడం అనవసరం.. మాలిని అందుకుంది మళ్ళీ .
అనసూయా నువ్వేమంటావు ?
అపరంజి హఠాత్తుగా అడిగింది.
అమ్మ జ్ఞాపకాలు మనసుల్లో నిక్షిప్త పరచుకోవడమేగా ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం . అయినా నాన్న పోయి పదిహేనేళ్ళు దాటుతోంది. అయినా ఆయన తీపి గుర్తులు మన మనసులనించి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయా? కాలం ఆగిపోయినట్టని పించినా కదులుతూనే ఉంటుంది. .."
చెప్పు అనూ..
మీరందరూ ఎలాగంటే అలాగే.......
మూడేళ్ళు అమ్మ ఎంత బాధ పడింది ? లేవలేని క్షణాలు , ఊపిరందని యుగాలు , పక్కకు కూడా ఒత్తిగిలలేని నిస్సహాయత ............... అనసూయ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ,,,,,,,,
అయిదో రోజున అమ్మ పేరిట బీదలకు అన్నదానం .... ఆ పైన మిగతావి ఆలోచిద్దాం నిశ్చయంగా తేల్చేసింది అపరంజి.


***********************
2

అనసూయ అంతరంగం

అప్పుడే అందరూ వెళ్ళిపోయి వారం దాటి పోయింది.
చివరిగా వెళ్ళినది అపరంజి.
పెద్దక్కకూ నాకూ తేడా పాతికేళ్ళ పైమాటే.
అక్కతో నాకు అంతగా చనువులేదు.
నాకు పూర్తిగా ఊహ తెలియకముందే అక్క అమెరికా వెళ్ళిపోయింది. వెళ్ళడం చదువుకుందుకే అయినా చదువు పూర్తి కాకుండానే, ప్రేమలో పడటం, అదీ తమ వాళ్ళేనని తెలిసాకే సుమా__అమ్మ నాన్నల ఇష్టం తోటే పెళ్ళి జరగటం అయిపోయాయి. అప్పటికి నాకు రెండేళ్ళో మూడేళ్ళోనట.
నాన్నది మంచి హోదా గల ఉద్యోగమే ...
కారు, ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు , వంటమనిషి .... ఎప్పుడు చూసినా ఈ వైపు వాళ్ళు ఆ వైపు వాళ్ళు ఇంటినిండా బంధుమిత్రులే.
ఒక్క మాట మాత్రం నాకు బాగా గుర్తు
పిల్లల గురించి దిగులు మనకెందుకే వర్ధనీ .... పెంచలేమా , పో్షించలేమా...... ఎంతో మంది కన్న ఉన్నతంగా వున్నారు. మంచి చదువులు చదివిస్తున్నాం.
అదే ఒక్కరో ఇద్దరో అనుకో....వాళ్ళ పెళ్ళిళ్ళయి వెళ్ళిపోతే ఇల్లెంత చిన్నవోతుంది. నాకూతుళ్ళే నా ఆస్థి అనేవారు నాన్న గర్వంగా... మాలినక్క పెళ్ళికి నాకు ఐదేళ్ళు
పెళ్ళి వేడుకలు సంబరాలు ఎంతగానో నచ్చాయి..
నేనూ పెళ్ళి చేసుకుంటా చెయ్యమని అడిగానట.
ఇల్లెప్పుడూ ఇలాగుంటే ఎంత బాగుండుననిపించేది. నాకు పదేళ్ళు రాకముందే సునంద, స్వయంప్రభ చదువులు పెళ్ళిళ్ళు జరిగిపోయాయి.
అపరంజికీ నాకూ పన్నెండేళ్ళ తేడా..
అమ్మ ఇహ పీరియడ్స్ ఆగిపోయాయనుకున్న సమయంలో అనూహ్యంగా పుట్టిన దానను నేను.
పెద్దక్క పిల్లలు నాకన్నా అయిదేళ్ళు చిన్నవాళ్ళు. అయిదేళ్ళనుండీ పదేళ్ళ తేడాలో అక్కల పిల్లలంతా దరిదాపుల్లో నా వయసు వారే..
నేను హైస్కూల్ దాటకముందే అపరంజి కులమతాల నధిగమించి రఫీని పెళ్ళి చేసుకుంది.
అప్పటికి మా హోదాలు అంతరించిపోయి చాలా కాలమయింది. నాన్న ఉద్యోగ విరమణ తరువాత పాత వాసనలు పోక కొన్నాళ్ళు వంటమనిషినీ పనివాళ్ళనూ ఉంచుకున్నా వాళ్ళను భరించే తాహతులేక అవసరం లేదని మానిపించాల్సి వచ్చింది.
అలవాటు లేకపోవడంతో అపరంజీ నేనూ పని చేసుకుందుకు చాలానే అవస్థ పడ్డాం.
అమ్మ గురించి ఇక్కడ కాస్త చెప్పక తప్పదు. అవును.
అసలు గాజు బొమ్మలా అతి సుకుమారంగా వుండేది అమ్మ. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ అమ్మ అలాగే వుండేది. ఒక రోజా రెండు రోజులా ? ముప్పై ఐదేళ్ళపాటు. వయసు అక్కడే ఆగిపోయినట్టు... ఇంచుమించు అయిదడుగుల ఎత్తు.
చిన్ని లేత తమలపాకుల్లాంటి అరచేతులు ..శరీరమంతా శోధించినా అరకిలో కండకూడా వుండదు. వెన్నుకంటుకుపోయిన కడుపు..
ఇంత సుకుమారపు బొమ్మ మా ఆరుగురికి జన్మనెలా ఇచ్చిందోనన్న విషయం ఇప్పటికీ ఓ పెద్దవింతే.....
నేను కొంచం పెరిగి పెద్దయ్యే వయసులో చిత్రమైన ఊహలు వచ్చేవి ఆరడుగుల ఎత్తుతో , దబ్బపండు చాయతో భారీగావుండే నాన్నకు అమ్మకు ఎలాపొత్తు కుదిరిందా అని.
మరో వంకా ఈ భారీ ఆకారాన్ని అమ్మ ఎలా ఇష్టపడిందా అని
మొత్తానికి అమ్మ ముట్టుకుంటే మైలపడే వెన్నెల ముక్కలా వుండటం వల్ల , ఇల్లు సంభాళించే బాధ్యత నా మీద అపరంజిమీదే పడింది.
అమ్మ షోకేస్ లో బొమ్మ.
అప్పటికే నాన్న ఆరోగ్యం దెబ్బతినడం మొదలయి, అపరంజి పెళ్ళి ఒక పెద్ద షాకయి కుప్పకూలిపోయాడు. ఎందుకు దిగులు పడుతున్నాడో అమ్మతో కూడా చెప్పేవాడుకాదు.
ఒకప్పుడేమైనా చెప్తే కద ఇప్పుడు మాట్లాడట్లేదని బాధపడేందుకు?
పెళ్ళికిముందు మీ నాన్న గురించి ఎంత తెలుసో ఆయన చివరి రోజున కూడా నాకంతే తెలుసు. అప్పుడో ఇప్పుడో అమ్మ తోచినప్పుడు చెప్తుండేది.
అందర్నీ పంపి ఆఖరున బయల్దేరింది అపరంజి.
అది ఢిల్లీలో వుంటోంది.
కాస్తైనా కుదుట పడ్డావా అనూ? వెళ్ళేముందు అడిగింది.
కుదుట పడటమా? అంటే.
ఎప్పటిలానే వున్నానుగా ...ఏ మాత్రం మార్పు లేదు. పైగా పదిరోజుల పైన అందరి మధ్యనా నాలుగు ముద్దలు ఎక్కువే తిన్నట్టున్నాను జాకెట్లు బిగుతయాయి. ఇహ ఏ గదిలో చూసినా పనికి రాని చెత్త పేరుకుపోయింది.
ఒక్కొక్కరు మరచిపోయినవి, వద్దనుకుని వదిలేసినవి..
చెయ్య వలసిన పనులు చాలానే వున్నాయి.
ఇహా నా అభిరుచికి తగినట్టు ఇల్లు సర్దుకుందుకు ఎన్నాళ్ళు పడుతుందో..... ఇప్పుడిహ కాస్తయినా సమయాన్ని కేటాయించగలను..
ఇప్పుడిహ ఈ ఇల్లు నాది. పూర్తిగా నాదే.. జీవితంలో అందరూ స్థిరపడ్డారు గనక , నా పెళ్ళి కాలేదు గనక వాళ్ళ వాటా అడక్కుండా నాకే వదిలేసారు.
ఈ ఏకాంతం ఒకరకంగా జీవితంలో మొదటిసారి దొరికిన అవకాశం.
నాకంటే చాలా పెద్దవాళ్ళైన అక్కలే వెళ్ళగా లేనిది నేను విదేశాలకు వెళ్ళలేనా అనిపించేది.
కాని మాలిని సింగపూర్ లో , సునంద ఆస్ట్రేలియాలో ,స్వయంప్రభ లండన్లో స్థిరపడ్డాక అపరంజి వైవాహిక జీవనం నడి సముద్రంలో నావలా ఊగిసలాడుతుంటే అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళను?
అమ్మ చాలా సార్లే అనేది నా కోసం నీ జీవితాన్నే ఫణంగా పెడుతున్నావా ? అని.
నాన్న అనారోగ్యం అమ్మ అసహాయత ..........నాన్న నిష్క్రమణ అమ్మ జబ్బు, నన్ను అదృశ్యంగా కట్టిపారేశాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు చేరుకున్నాక , ఓ రకంగా చెప్పాలంటే కాస్త మార్పు కోసం బెంగుళూరులోని వసుధ దగ్గరకు వెళ్ళాను.
ప్రతి వాళ్ళూ
అయ్యో అమ్మ పోయారటగా ? ఒక్కదానవైపోయావు అంటూ చూపే అఖ్ఖర్లేని సానుభూతి నుండి తప్పించుకుందుకు ,
అమ్మ లేని శూన్యాన్ని అప్పుడే భరించే స్థైర్యం లేక ,
మరింక నీ మాటేమిటి ? పెళ్ళీ పెడాకులూ వద్దా? అనే పరామర్శలనుండి పారిపోయాను.
వసుధ గురించి పెద్దగా పట్టించుకో దలచుకోలేదు.
నాకోసం నేను వెళ్ళానంతే.
అక్కడ నన్నెవరూ గుర్తు పట్టరు. నా వివరాలు ఎవరికీ తెలియవు. నా ఒంటరితనం అక్కడ అపరిచితం.
నా ఏకాంతం ఎవరూ ఎత్తి చూపరు. అందుకే అలా వెళ్ళడం నాకు మంచిపనిగానే తోచింది.
అయితే ఆ విషయం పెద్దక్కకి అసలు నచ్చలేదు.
నీ కింకా అంత తెలీదు అనూ........... ఏదో చెప్పబోయింది.
తరువాత మాట్లాడుకుందాంలే సంభాషణ తుంచేసాను. ఇంచుమించు అక్కలందరి తరహా అలాగే వుండింది. చివరగా ఫోన్ చేసింది అపరంజి.
అనూ ఎలావున్నావు?
ఫోన్ చేస్తూనే ఎందుకు వెళ్ళావక్కడకని అడక్కపోవడంతో రిలీఫ్ గా ఊపిరిపీల్చుకున్నాను.
బాగానే ఉన్నాను
ఇంకా అమ్మ జ్ఞాపకాల్లోనేనా?
లేదక్కా ఇప్పుడిప్పుడే నాకోసం నేను బతకడం నేర్చుకుంటున్నాను
అనూ ఒక్కమాట మనం సూటిగా మాట్లాడుకుందాం. ఇప్పుడనిపిస్తోంది. మేమంతా చుట్టం చూపుగా వచ్చి ఎవరిళ్ళకు వాళ్ళం వచ్చేశామే తప్ప నీ గురించి ఆలోచించనే లేదని.
చ చ అలాంటిదేం లేదక్కా
కాదులే , అయినా నాఇల్లు నీది కాదా? నేనే ఆహ్వానించాలని లేదుగా ...నీకు ఎప్పుడు రావాలనిపించినా చెప్పాపెట్టకుండా వచ్చెయ్యవచ్చుగా....
నిజమే నేను కాదనలేదు. ఎవరూ తెలిసిన మొహాలు లేనిచోట ఓ నాలుగు రోజులు గడుపుదామనిపించింది. ఇక్కడ వసుధ తన టీవీ ప్రొగ్రామ్స్ లో బిజీ గా వుంటుంది. ...అంతకన్న మరో కారణం లేదు
అయినా నాకు .....నా మనసుకు గిల్టీ గానేవుంది
నో! అలాంటి ఆలోచనే వద్దు.. అక్కను అనునయించాను.
వారం అనుకున్న దాన్ని ముందరే తిరిగి వచ్చేసాను.
*************************

3
చాలా రోజుల తరువాత స్వయం ప్రభ ఆడపడుచు వసుంధర పలకరించిపోడానికి వచ్చింది. వసుంధర యూనివర్సిటీ లో ప్రొఫెసర్.
చాలా ఆలస్యంగా తన కొలీగ్ ని పెళ్ళి చేసుకుంది. అప్పటికే నలభై దాటాయి.
అయినా ఇద్దరూ ముప్పైల్లో ఉన్నట్టుగానే అనిపిప్స్తారు.
నిజమే నిత్యానందమే వారి జీవన రహస్యం. అందుకే నిత్య యౌవనులుగా కనిపిస్తారు.
మా ఇంటికి వచ్చెయ్యి అనూ! ఇది నా ఒక్కదాని మాటే కాదు. సంజయ్ కూడా గట్టిగా చెప్పమన్నాడు.
కాని నాకు తెలుసు నా హద్దులూ సరిహద్దులూ.. వసుని పంపించి వెనక్కు తిరిగాక పక్కింటి వారబ్బాయి నన్ను చూసి నుదురు కొట్టుకుని
ఆంటీ మర్చేపోయాను, మీవి అయిదారుత్తరాలు మాఇంట్లో వున్నాయి. ఆగండి అంటూ లోనికి పరుగెత్తుకెళ్ళి అంతే వేగంతో ఉత్తరాలతో బయటకు వచ్చాడు.
నాకు ఉత్తరాలు రాసేదెవరు? ఈలోగా ఆలోచిస్తూనే ఉన్నాను.
చిన్నప్పటినుండీ పెద్ద సన్నిహితులెవరూ లేరు. ఆత్రంగా ఫ్రమ్ అడస్ లు చెక్ చేసుకుంటే చిత్రంగా అపరంజి , వసుధల ఉత్తరాలతో పాటు ఏడాది క్రితం సాహిత్య అకాడెమీకి అనువదించి ఇచ్చిన నవల తాలూకు పారితోషికం మరో అసైన్మెంట్ ...
వీటితో పాటు ప్రకాష్ ఉత్తరం. ఇదివరకైతే అక్కడే నిల్చుని ఉత్తరాలుమొత్తం చదివేసి వుండే దానను .
కాని ఇప్పుడు అలాకాదు. బహుశా వయసుతోపాటు నిదానమూ పెరిగివుంటుంది.
తాళం తీసి ఇంట్లోకి వస్తుంటే అమ్మ గుర్తుకు వచ్చింది.
జననం మరణం ఎంతసహజమైన వైనా కన్నుతెరిచింది మొదలు నిన్నమొన్నటి వరకు కలసి బ్రతికిన మనిషి ఇవ్వాళ లేదంటే .....
ఓదార్చేందుకు ఎన్నిమాటలైనా చెప్పవచ్చు..కాని గుండె రగిలిపోయే ఆ బాధ ఏమిటో అనుభవించేవారికే తెలుస్తుంది.
నా మనసు నేను డైవర్ట్ చేసుకుందుకు ఓ కప్పు టీ తాగుదామని ఉత్తరాలు టేబుల్ మీదుంచి కిచెన్ లోకి వెళ్ళాను.
ఓ పక్క టీకి నీళ్ళు మరో పక్క పాలు పెట్టాక వెళ్ళి ఉత్తరాలు చూద్దామా అనిపించింది. కాని ఒకసారి బయటకు వెళ్ళానంటే మరిక ఉత్తరాల సంగతి తప్ప టీ సంగతి గుర్తుండదు.
ఎన్ని సార్లలా మరచి పోయి ఎన్ని గిన్నెలు మాడి పెంకులయాయో..
అందుకే స్టౌ ఆర్పికాని బయటకు రాకూడదని ఒట్టు పెట్టుకున్నాను( ఉత్తుత్తదే)
ఓ కప్పుటీ ఫ్లాస్క్ లో పోసి మరో కప్పు తీసుకుని బయటకు వచ్చాను.
డైనింగ్ టేబుల్ ముందు కూచుని ఉత్తరాలు చేతిలోకి తీసుకున్నాను.
ప్రకాశ్ రాసిన ఉత్తరం చదివితే ఎంతో సేపు మరో లోకంలో ఉన్నట్టు ట్రాన్స్ లో ఉండిపోతాను. అందుకే ముందుగా అపరంజి , వసుధ ఉత్తరాలు తీసాను.
ఈ రెంటిలో ఏది ముందు చదవాలి? వసుధ _అపరంజి
అపరంజి_ వసుధ
ఉహు! ఎటూ తేలదే
వేడి వేడీ టీ రెండు గుక్కలు తాగి , కళ్ళుమూసుకుని రెండుత్తరాలూ పదిసార్లు ఇటు దిటూ , అటుదిటూ మార్చి చివరకు ఒకటి ఎంచుకున్నాను. అది అపరంజి ఉత్తరం.
చాలా బరువుగానేవుంది కవరు.
బహుశా చాలా రోజులపాటు ఉత్తరం రాసివుంటుంది.
కప్పులో మిగిలిన టీ చల్లారిపోవడంతో ఒక్కగుక్కలో తాగేసి కవర్లోంచి కాగితాలు బయటకు లాగాను.
నిజమే చాలా పెద్ద ఉత్తరం!
సెల్ ఫోన్లూ ఈ మెయిల్స్ వచ్చాక కట్టె , కొట్టె తెచ్చె వ్యవహారంలా మాట్లాడు కోవడమమే కాని మనసు విప్పి భావాలూ భారాలూ పంచుకోవడం ఎప్పటిమాట
అనూ!
నువ్వు పుట్టినప్పుడు నాకు పన్నెండేళ్ళు. ఆ రోజు నాకింకా గుర్తుంది.
ఏమిటిలా మొదలు పెట్టానని అనుకుంటున్నావా?
నీతో మాట్లాడాక నామనసు నెమ్మదించడానికి బదులు మరింత బరువెక్కింది. ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా అలాగే అనిపిస్తుంది. ప్రైవసీ లేదనిపిస్తుంది. మాటలు గొంతుదాటి రాని ఫీలింగ్.
ఎవరైనా వింటున్నారేమో అని ఓ రకమైన జంకు. ఏదో తెలియని తడబాటు.
ఇక్కడికి వచ్చాక కూడా అమ్మ లేదన్న వెలితి అంతర్లీనంగా మనసును వెన్నాడు తూనేవుంది. ఎక్కడ వున్నా అమ్మవుంటే ఒక ఆశీర్వాదం వెనకవున్న ధైర్యం. ఒకరన్నా మనను దీవించే వాళ్ళున్నారన్న విశ్వాసం. అయినా ఈ రోజువారీ కార్యక్రమంలో మనను మనం ఓదార్చుకుంటూ బుజ్జగించుకుంటాం.
పిల్లలు , హర్ష ,రాలేకపోయామని రిగ్రెట్స్ చెప్పారు. వాళ్ళు రొటీన్ నుండి బయటకు రాలేదు గనక మళ్ళీ వెనక్కు వెళ్ళే సమస్య లేదు. కాని మనం అలా కాదుగా.
ఒకసారి మృత్యుముఖంలోకి అడుగుపెట్టి వెనక్కు వచ్చిన నాకు జీవితం విలువ బాగా తెలుసు.
అందుకే నాకు నేను నచ్చ జెప్పుకుంటాను _ బ్రతికున్న ప్రతిక్షణం సద్వినియోగపరచుకోవాలి. సంతో్షించాలి , సంతోషాన్ని పంచాలి. ఇలా అనుకుందుకు ఏడాది పట్టింది.
నాలో ఈ మర్పుకు కారణం హర్ష. రఫీ నాకు జీవితానికి ఆవలివైపును చూపిస్తే హర్ష ఈ వైపు ఆనందాలను పరిచయం చేసాడు.
అమ్మాయిలు ఎంత అల్ప సంతోషులా అనిపిస్తోంది అనూ ...అప్పటి నా ప్రవర్తన తలుచుకుంటే .
ఇరవై నాలుగ్గంటలూ రఫీకి నా ధ్యాసే అన్న భావన నాకు కలిగించటం , నా కోసం అతని క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా గొడవలకు దిగి వారిని కొట్టడం నాకు హిరోయిజం లా అనిపించేది. అయినా అంత తొందరపడలేదు..ఐదారేళ్ళు అన్నికోణాల్లోనూ అతన్ని పరిశీలించి , పరీక్షించి, నిరీక్షించి సంతృప్తి పడ్డాకే ఇద్దరం రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.
చాలా రోజులు ఇటు అమ్మావాళ్ళకు ఎలా తెలీదో అటు వాళ్ళవాళ్ళకూ తెలీదనే అనుకున్నాను.
మా ఇద్దరినీ యాక్సెప్ట్ చెయ్యడం వాళ్ళ సంస్కారం అనుకున్నాను. నా సెలెక్షన్ సరైనదేనని గర్వపడ్డాను.
ఇంకా కొత్తజీవితానికి అలవాటు పడకముందే నన్ను ఉద్యోగం చూసుకోమని పోరు. అది రఫీ ఒక్కడి నించే కాదు అతని తల్లి తండ్రి, మిగతా కుటుంబ సభ్యులందరి నించీ........
మరో వైపు నా పేరు మార్చుకోమన్న ఒత్తిడి..
ఆ రోజుల్లో
మనదర్జా గురించే చాలా మందికి తెలుసు, పనివాళ్ళు , వంట మనిషి ...........మనను కాస్త ఉన్న వాళ్ళుగా లెఖ్ఖించి
ఏవో పెట్టి పోతల మీద ఆశలు.
కాని అసలు నిజం మనకు తెలుసు....నిజానికి రఫీకి చాలా స్పష్టంగా చెప్పాను___మనం మధ్య తరగతి వాళ్ళమని . అతను నమ్మకపోవడం నా తప్పు కాదుగా..
ఆ ఇంటికి వెళ్ళాక గాని నాకు నిజా నిజాలు తెలిసి రాలేదు.
రఫీ తండ్రికి ఈ కుటుంబమే కాక మరి రెండున్నాయి. మరో ఇద్దరు భార్యలు.
అది మాకు చట్ట బద్ధమే నానమ్మే చేసిందా పెళ్ళిళ్ళు ఇది రఫీ సమర్ధింపు. ఇక్కడా రఫీ తో పాటు ఇద్దరు చెల్లెళ్ళు మరో ముగ్గురు పెళ్ళైన అక్కలు .............
మిగతా భార్యలకు ఎంతెంతమంది పిల్లలో ...........
ఆయన ఇంటికి రాని రోజల్లా ఏడుపులు.......... శోకాలు .........వంటా వార్పులువుండవు, తిండీ తిప్పలు ఉండవు.
తల్లి చుట్టూ మూగి పిల్లలంతా ఏడ్పులు.
గోల గోలగా వుండేది.
నా పరిస్థితి నాకు అయోమయం అనిపించేది.. రఫీ అంతంత మాత్రం చదువుకి ఎక్కడా ఉద్యోగమే దొరకడం లేదు.
ఒకప్పుడు నువ్వు నిజంగానే అపరంజివి , దేవతవు ఇంతదానవు అంతదానవు అని పొగిడిన అతను రుసరుసలాడటం భరించలేకపోయాను. అంతలోనే చిన్నపిల్లవాడిలా
ఏం చెయ్యను అపరంజీ , టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ...క్షమించవూ ...క్షమించవూ అంటూ చెంపలు వేసుకుని బ్రతిమాలటం
ఒక దశలో రపీ కి కొంచం మెంటల్ ఇంబాలెన్స్ వుందా అనికూడా అనిపించింది. కాస్త కాస్తగా బిగుస్తున్న సంకెళ్ళూ..
ఒంటిగా బయటకు వెళ్ళలేను.
అయితే రఫీ లేదా అతని చెల్లెళ్ళు వెంట రావలసిందే !
నువ్వూ మాలా బురఖా వేసుకోరాదూ అంటూ పెద్దవాళ్ళ బలవంతం. ఏడాది పాటు ఆ ఇంట్లో నోరు మెదపకుండా గడిపానంటే దానికి వున్న ఒకే ఒక్క కారణం అమ్మా నాన్నముందు నా ఓటమిని అంగీకరించలేని అహం.
ఆ పరిస్థితుల్లో ఢిల్లీ లో ఉద్యోగం రావడం నా అదృష్టం
నా చదువు, నా యోగ్యత, నా వ్యక్తిత్వం నాకు గుర్తుకు వచ్చాయి. ఇన్నాళ్ళూ ఎందుకింత నరకాన్ని అనుభవించానా అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి ___________అంత తొందరగా రాననుకున్నారులావుంది.
రఫీ వాళ్ళ అమ్మ, నాన్న, అక్కలు ఏదో సీరియస్ గా చర్చిస్తున్నారు. మామూలే ననుకుని లోపలకు వెళ్ళబోయి నా పేరు వినిపించి ఆగిపోయాను
అపరంజి పెరిగిన తీరు చూసి చాలా ఆస్థి పాస్తులున్నాయి , ఈ పిల్లకొచ్చే వాటాకి మన కష్టాలు గట్టెక్కుతాయను కున్నాను. కాని ఇలా చేతులూపుకుంటూ వస్తుందని కల్లోకూడా అనుకోలేదు.
అయినా యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిందిగా జీతం బాగానేవుంటుంది.
ఎంతబాగున్నా మీరిద్దరూ కాపురం పెడితే మాకేమిటి లాభం? మేం ఎక్కడవాళ్ళం అక్కడే వుంటాం. నీ పెళ్ళికి ఒప్పుకుని తప్పు చేసా. ఆ ఉద్యోగమేదో ఇక్కడే చూసుకోమను.
అల్లాకాదులే , నేనిక్కడేవుంటాను. వారానికో పక్షానికో ఓ సారి వెళ్ళి వస్తాను. మనకు జీతం ఇచ్చేందుకు తను కాదనదు.
తల తిరిగి పోయినా తమాయించుకున్నాను.
ఆ పని చెయ్యి , కావాలంటే ఇక్కడ మరో పెళ్ళి కూడా చేసుకోవచ్చు...
ముందు అక్కడినించి బయట పడాలి.
అమ్మను చూసిరావాలంటూ నా సూట్కేస్ తో ఇంటికి వచ్చాను గుర్తుందా? .....
పుట్టెడు దుఃఖం కళ్ళల్లో దాచుకు ఆనందం నటించాను.
అట్నించటే ఢిల్లీ వచ్చేసాను.
ఇప్పుడది చెప్పుకుందుకు మామూలుగా అనిపిస్తోంది కాని అడుగడుగునా రౌరవాది నరకాలు చవిచూసాను.
ఏ బాధయినా సహించగలమేమో గాని ఒకరిని నమ్మి మనసా వాచా సమర్పించుకున్నాక వాడు మోసం చెయ్యడం ఎంతధారుణం!
ఉద్యోగంలో చేరాక నెలరోజులకు తెలిసింది .....నెల తప్పిందని.
అనూ చెప్తుంటే ఇప్పుడూ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.
మాతృత్వం, భౄణహత్య- ఈ వంకన అవసరం లేదనుకున్న వైవాహిక బాంధవ్యం కొనసాగింపు .ఫలితంగా ఒక నిరంతర నరకయానం ... అనంతమైన రాజీ .......
తెలిసి తెలిసి నిప్పుల్లో కి దూకటం ఈ ఆలోచనల మధ్య కుమిలి కుమిలి కుంగి కృశించి చివరకు తెగించి ధైర్యాన్ని పోగుచేసుకున్నాను.
ఈ విషయం ఎవరికీ తెలియకముందే , నా గర్భ కుహరంలో మాంసపు ముద్ద బిడ్డగా మారక ముందే ఆ విష వలయం నించి బయటపడ్డాను.
ఒక్కదాన్నే లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి జరిగిన కధ జరుగుతున్న కధ వల్లించాక ఆవిడ కాదనలేదు, ధర్మ పన్నాలు వల్లించలేదు
తీసుకునే రిస్క్ గురించి , జరగబోయే సంభవాల గురించి సంపూర్ణంగా వైద్య భాష లో వివరించారు.
పరిస్థితులకు రెండు జీవితాలు బలికావడం కన్న నాఅదృష్టం ఎలాగున్నా స్వీకారమేననే నిర్ణయానికి రావడానికి నేను రెండు నిమిషాలకు మించి వెచ్చించలేదు. ఈ విషయం ఒక్క హర్షకు తప్ప మరెవరికీ తెలియదు. విడాకుల కోసం కూడా రఫీ ఎంత వేదించాడని .....
చివరకు ఆ రొంపినుండి బయటపడేందుకు అయిదారేళ్ళయింది. ఓ పక్క రఫీకి దూరమవుతున్న సమయంలో నాకు అండగా నిలబడి ఓదార్చి ధైర్యాన్నిచ్చి నన్ను నన్నుగా నిలబెట్టిన వాడు హర్ష. పెళ్ళితో ఓరకమైన హోదా అండదండలు ముఖ్యంగా ఓ మంచి మితృడు లభిస్తాడనుకుంటే అవన్నీ నాకు హర్ష అందిచాడు, రఫీ కాదు.
ఎప్పుడు ఎలా మేమిద్దరం కలసివుండటం ప్రారంభించామో నాకు గుర్తులేదు. అమ్మ ఈ విషయంలో ఎంత కలవరపడిందీ నీకు బాగా తెలుసు. సభ్యత సంస్కృతి నాశనం చేశానని ఎంతగానో దుమ్మెత్తిపోసింది.
అనూ ఒక్క విషయం చెప్పు..
మతమేదయినా సాంప్రదాయబద్దంగా జరిగిన మా వివాహం రఫీని, నన్ను కట్టి పడెయ్యలేకపోయింది., అదీ ఒకసారి కాదు అటూ ఇటూ పద్ధతులంటూ రెండుమార్లు
కాని ఏ సామాజిక ఒత్తిడీ కట్టడీ లేకపోయినా రెండు పదుల మా అనుబంధం ఇప్పుడే కాదు ఏ జన్మకూ చెక్కు చెదరదనిపిస్తోంది.
ఇప్పటీకీ రెండు నిమిషాలు దగ్గరలేకపోతే అల్లల్లాడిపోతాడు హర్ష.
నీకు చెప్పేందుకు సిగ్గుపడను, యాభై ల్లోకి వచ్చేసినా హర్ష దరిదాపుల్లో లేకపోతే నామనసు నిండా శూన్యమే మరి.
పాతికేళ్ళ క్రితం తన్వి పుట్టాక హఠాత్తుగా వచ్చిన కాంప్లికేషన్స్ , క్యాన్సరే మోనన్న అనుమానాలు , ఆ సమయంలోనూ పిల్లల గురించో నా గురించో బెంగ పడలేదు. నాకేదైనా అయితే హర్ష ఏమవుతాడో ననే దిగులు పడ్డాను. అదృష్ట వశాత్తూ ఆరునెలల్లోనే మామూలు మనిషి నయాను. ఇప్పటికీ ఉదయం లేస్తూనే నేను కోరుకునేదేమిటో తెలుసా / సగటు భారత స్త్రీ మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని దీర్ఘ సుమంగళిగా వుండాలనో కోరుకుంటుంది , కాని నేను మాత్రం హర్ష చివరి క్షణం దాకా నేను ఆరోగ్యంగా వుండాలని ఆశిస్తున్నాను. ఇంతకూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాననుకుంటున్నావా?
నిన్ను ఒంటరిగా వదిలేసి వచ్చాననే అపరాధ భావన నన్ను కలచివేస్తోంది. మేమంతా మా జీవితాల్లో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లాపాపల్తో స్థిరపడి పోయి నిన్ను గాలికి వదిలేసాననే దిగులు నన్ను ..నన్ను సుడిగాలిలా నిలువునా కుదిపేస్తోంది.
హఠాత్తుగా నాన్నగారుపోవడం , అమ్మ భారం నీ మీద మోపి తప్పించుకున్నామా అనిపిస్తోంది.
పెళ్ళి మాటెత్త గానే నీ విముఖత ప్రదర్శన అలుసుగా తీసుకుని నిన్ను ఒంటరిని చేసామేమోనని కలతగావుంది.
పరిహారంగా నీకోసం పెళ్ళి సంబందాలు చూస్తున్నాను. సిగ్గుపడకుండా నీ ఇష్టాయిష్టాలు ప్రయారిటీలు రాయి. ఇప్పటికే నా దృష్టిలో అయిదారుగురు ఉన్నారు. వారితో చర్చించేలోగా ముందుగా నీకు చెప్పటం న్యాయం అనిపించింది.
తిరుగు టపాలో జవాబుకు ఎదురుచూస్తుంటాను
ప్రేమతో
అపరంజి
అప్రయత్నంగానే నా పెదవుల మీదకు చిరునవ్వు చల్లగాలిలా పాకి వచ్చింది.
అక్క అమ్మలా ఆలోచిస్తోంది, ఇహ అమ్మలేని దిగులు నాకెందుకూ?
అపరంజి ఎదురుగావుంటే గట్టిగా హృదయానికి హత్తుకుని ఓ ముద్దు ఇవ్వాలనిపించింది. టీ కప్పు పక్కన పెట్టి వసుధ ఉత్తరం విప్పాను.
చక్కటి ముత్యాల్లాంటి వసుధ హాండ్ రైటింగ్ చూడగానే ఒక్కసారి తను కళ్ళల్లో మెదిలింది.
వసుధ పెద్దక్క పినమామగారి కూతురు. నా కన్న ఆర్నెల్లు పెద్దో చిన్నో ..
పెళ్ళిళ్ళు పేరంటాలు బంధువుల సంబరాల్ళో తరచు కలుసుకునే వాళ్ళం.. అది నామ మాత్ర పరిచయమే.. ఇద్దరం కలిసి సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్నప్పుడు మరింత దగ్గరయాం.

అనూ,
చూసావుగా ఎంత తీరికలేకుండా వున్నానో, అసలు నువ్వొచ్చినప్పుడు నా కార్యక్రమాలు వాయిదా వేసుకుని నీతో సరదాగా గడపాలని ఆశపడ్డాను. కాని సరిగ్గా నువ్వొచ్చిన సమయంలోనే యమ బిజీగా మారిపోయి అసలు నిన్ను పరామర్శించే సమయం కూడా లేకుండా పోయింది.
అందుకే ఇలా మనసంతా విప్పి నీముందు పరుస్తున్నాను.
మనం పీజీ చదివే రోజుల్లో నువ్వు చూసిన వసుధ వేరు, ఇప్పటి వసుధ వేరు. అప్పట్లో నాతో పరిచయం వున్న వాళ్ళందరికీ నేనో గర్విష్టిననీ నాకు ఎల్లలు లేని అహంకారమనీ మాత్రమే తెలుసు.
నా జీవితంలో చీకటి కోణాల గురించి ఎవ్వరికీ తెలీదు. నీతోనూ అప్పుడో ఇప్పుడో అహంకారి గానే మాట్లాడి వుంటాను.
అయినా అప్పటికీ ఇప్పటికీ నాకు కాస్త దగ్గరగా వచ్చిన నేస్తానివి నువ్వొక్కదానవే.
నీతో మనసు విప్పి నా భారం పంచుకోవాలనే ఈ రాత ప్రయత్నం .
మాలతి వదినకు కూడా మాగురించి పెద్దగా తెలీదు. పిన మామగారి కూతుర్ననే తెలుసు. .. అంతకు మించి వివరాలు బయటకు రాలేదు... రానివ్వలేదు..
అసలు సంగతి చెప్పనా..
మా నాన్నకింకా ముప్పై ఆరేళ్ళు నిండకముందే నలుగురు పిల్లల్ను ఆయనకు భారంగా వదిలి , కవలలకు జన్మనిచ్చి కన్నుమూసింది నా కన్నతల్లి.
ఓ పక్క ఇంటినిండా పిల్లలు మరో పక్క ఇల్లాలి మహాభినిష్క్రమణ ... ఎంత ఉద్యోగంలో వున్నా ఆడదిక్కు లేని ఇల్లు ...ఎవరైనా ఎంతవరకు సాయపడగలరు? అందుకే నెల తిరక్కుండా మాకు అమ్మను ప్రసాదించే వంకన మరో పెళ్ళి చేసుకున్నాడు నాన్న.
అప్పటికి నాకు పధ్నాలుగేళ్ళు. అమ్మను చూసిన కళ్ళతో ఆవిడను చూసేందుకు, నాన్న పక్కన ఆమెను ఊహించు కుందుకే వెలపరంగా వుండేది.
అమ్మ అపరంజి బొమ్మ పసిమి ఛాయ, మోకాళ్ళు దాటిన జడ , దివినుండి దిగి వచ్చిన అప్సరసలానేవుండేది. గొంతు విప్పితే సరిగమలు ఆమె నాలుక మీద నాట్య మాడేవి.
కాని , ఆవిడ అదే అమ్మ కాని అమ్మ జానికమ్మ ఊబకాయం పాతికేళ్లకే నలభై దాటి నట్టుండేది. చామనఛాయ ..బొంగురుగొంతు
కాదంటే ఎవరెదురుగానైనా తియ్యగా మాట్లాడటం వెనకాల అపరకాళిలా మారటం ఆవిడ ఒక్కదానకే సాధ్యం.
ఇంట అడుగు పెట్టిన తొలి రోజునే ఆవిడ విశ్వరూపం మాకు అర్ధమయింది.
నాన్నగారినీ మా పిల్లలందరినీ సమావేశపరచి
ఈ పిల్లలను ఈ ఇంటిని నా స్వంతంగా భావిస్తాను. కాదంటే ఒకటే షరతు. వాళ్ళంతా నన్ను అమ్మా అనే పిలవాలి నేను సవతి తల్లిననే మాట ఎక్కడా పొక్కరాదు. అందుకే ట్రాన్స్ ఫర్ చేయించుకోండి దూరంగా వెళ్ళి పోదాం, పిల్ల లెవరూ నే గీసిన గీత దాటరాదు. నలుగురు పిల్లలనూ చూస్తాను . కాని నాకూ నా స్వంత సంతానం ఒకరుండాలి.
నాన్న ఇంట్లో వున్నంత సేపూ ప్రపంచంలో ఇంత ప్రేమ మరొకరు ఇవ్వరేమో నన్నట్టు అమ్మలూ బంగారూ , చిన్నారీ అనే పిలిచే ఆవిడ ఆయన ఆఫీస్ కెళుతూనే తన క్రౌర్యాన్నంతా మాపై గుమ్మరించేది.
ఇంటి పనంతా చేసి చదువుకోవాలి.
ఆడపిల్లలు , రేప్పొద్దున అత్తారింటికి వెళ్ళాక రేప్పొద్దున పనీ పాటలు రాకుండాఎలా ? ఇలా ఎలా పెంచిందమ్మా తల్లి అని అంతా నన్ననరూ ? అందుకే పని నేర్పుతున్నా.. నాన్నకు అడక్కుండానే సంజాయిషీ ఇచ్చేది.
ఇలాంటి అమ్మ దొరకడం మీఅదృష్టం , ఎన్ని జన్మలెత్తినా ఆవిడ ఋణం తీర్చుకోలేరు. ఇది నాన్న ఉవాచ .
అయినా గడపదాటి ఒక్కమాటా బయటకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అణచిపట్టుకున్నా నా అసహనం, కోపం ఎవరు మాట్లాడించినా ఉప్పొంగి బయటపడేది.
ఇలా చదువు పూర్తయీ కాకముందే అమ్మ నాపెళ్ళి కుదిర్చింది.
ఆవిడ దూరపు బంధువు.
అబ్బాయికి ముప్పై దాటాయి.
ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం. ఎమ్ ఏ చదివాడని చెప్పారు. నా ఇష్టాయిష్టాలు ఎవరూ అడగలేదు. అయినా అమ్మ నా మొహం చూసి గ్రహించింದಿలా వుంది. నన్ను ఏకాంతంగా దొరక బుచ్చుకుని ఉతికిపారేసింది.
నీ అమ్మ కనిపారేసి దానిదార్న అది ఛస్తే నేను మీకు నౌకరులా దొరికానా? ఇంత కంటె మంచి సంబందాలు తేవడం మా వల్లకాదు ఇంకో పదేళ్ళకు పెళ్ళి చేసుకున్నా ఇదే స్థాయి... నువ్వేమైనా ఒక్కగానొక్క పిల్లవా? మీ అందరిపెళ్ళిళ్ళూ అవాలి... నాకూతురి దగ్గరకు వచ్చేసరికి చిప్పా చింకీ కూడా మిగలవు.......
తలవంచుకు సర్దుకుపోవడం తప్ప మాకు మరోదారి మిగల్లేదు. గుడ్డిలో మెల్లగా అప్పటికే నాకు ఉద్యోగం వచ్చేసూచనలు కనిపించాయి. అందులో జర్నలిజం లోకి వెళ్ళే అమ్మాయిలు ఆ రోజుల్లో తక్కువేమో...కాని అమ్మ చాలా తెలివిగా పెళ్ళి కొడుకుతో ముందే ఒప్పందం కుదుర్చుకుంది.. ఎప్పుడు ఉద్యోగం చేసినా నా జీతంలో ఆవిడకు ప్రతినెలా సగం ఇచ్చితీరాలి.
పెళ్ళి జరిగిపోయింది.
తరువాత తెలిసింది అతను చదివినది హైస్కూల్ చదువు కూడా కాదు.. మరో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఎప్పటీకీ ఆ ఇంటికి నా సంపాదనే ఆధారం. దానికి ఆశపడే పెళ్ళికి , అమ్మ షరతులకు ఒప్పుకున్నారు.
ఈ మాట అమ్మను అడిగితే, అవును. అయితే ఏంటటా? ఇప్పుడు ఒదిలేస్తావా? నీ చెల్లెళ్ళకే పెళ్ళిళ్ళు కావు .నీ అమ్మ ఎలాగూ చచ్చింది నీ అయ్యను కూడా పోగొట్టు కుంటావు. నీ ఇష్టం అంటూ బెదిరించింది.
అనూ ఎలా బతికాను ఎలా నెట్టుకువచ్చాను అనేది నాకే తెలుసు . ఇవన్నీ తెలీనివాళ్ళు నన్ను పలురకాల అనుకుంటారు. ఏం చెప్పను? మొత్తానికి అందరి పెళ్ళీళ్ళు అయినా అమ్మ చేసిన పాపం ఆవిడవెంటే వుంది. కూతురి పెళ్ళి కాకుండానే ఆవిడరోజులు తీరిపోయాయి. ఇప్పుడింకా దాని పెళ్ళి కావాలి. అమ్మెలాగున్నా దానికి మేమెవ్వరం అన్యాయం చెయ్యం మాలో అదీ ఒకత్తి.
తవ్వుకోవాలే గాని ఇంటింటి కో కధ. బోర్ కొట్టానా... ఈ సారి ఎప్పుడయినా తీరిగ్గా కలుద్దాం.
వుండనా మరి
నీ వసు.

రెండు ఉత్తరాలు చదివి మనసు వేడెక్కింది.
ఇహ మిగిలినది ప్రకాశ్ ఉత్తరం. అది చేతిలోకి తీసుకుంటేనే ఓ రకమైన ఆత్మీయత , అనురాగం అనుకోకుండానే మనసు పులకరిస్తుంది.
నాకు తెలుసు నాహద్దులు , సరిహద్దులు...అయినా ............
ఉత్తరం విప్పకుండానే ఒకసారి మా పరిచయపు గతంలోకి వెళ్ళిపోయాను.
**********

ఇంకా స్కూల్ లో చదువుకునే వయసే.
ఎంత వద్దనుకున్నా ఆకర్షణ అనేది వయసులో ఓ సహజ సిద్దమైన ప్రక్రియ అవుతుంది కాబోలు.
ఇంట్లో అమ్మ నాన్న అక్కలు అంతా నాకన్నా పెద్దవారే ....ఎవరితో మనసు విప్పి మాట్లాడగలను? అప్పుడే ప్రకాశ్ తో పరిచయం. నాకంటే ఒకటి రెండేళ్ళు సీనియర్. అవసరమైన పుస్తకాలు తెచ్చివ్వడం అప్పుడో ఇప్పుడో నోట్స్ రాసివ్వడం చాలా మామ్మూలు పరిచయమే ............
అదే నెమ్మదిగా పెరిగి ... మనసువిప్పిమాట్లాడుకునే స్థాయికి చేరింది.
ప్రకాశ్ కి మా గురించి అంతా తెలుసు పెద్దగా నోరువిప్పి చెప్పాలిసినది ఏదీ లేదు...
అలాగే నాకూ ప్రకాశ్ గురించి తెలుసనే అనుకున్నాను. కాని బి. ఏ రెండో ఏడాది పూర్తయే సమయంలో కాని తెలిసిరాలేదు నాకతనిగురించి ఏమీ తెలియదని.
అప్పటికే అతని డిగ్రీ పూర్తయి ఏదో ఉద్యోగంలో చేరాడు..
ఓ రోజు మధ్యాహ్నం కాలేజ్ నించి బయటకు వచ్చేసరికి గేట్ పక్కన నిలబడి ఉన్నాడు ప్రకాశ్.
అనూ.... నీతో కొంచం మాట్లాడాలి ... కాస్సేపు టైమ్ స్పేర్ చెయ్యగలవా...?
నేనదేమీ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు...
రేపు ఇంగ్లీష్ నోట్స్ సబ్మిట్ చెయ్యాలి ... చాలా రోజులనించీ రాయనే లేదు...
అది నేను రాసి పెడతాలే ... అర్ధింపుగా అడిగాడు.
సరే ! ఓ పదినిమిషాలు..
అసలు కాలేజీనే ఊరికి కాస్త వారగా వుండేది. మరికాస్త ముందుకు వెడితే ఓ పక్క పచ్చని పరిసరాల మధ్య ఆంజనేయుడి గుడి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కూచుని మాట్లాడు కోడం మాకు అలవాటే ...
ఎప్పటిలానే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వారగా ఉన్న మెట్లమీద కూచున్నాం.
అనూ ... అంటూ ఆగిఫోయాడు .
చెప్పు ప్రకాశ్!
నీకు తెలుసుగా ... అమ్మ లేదని... నాన్న ... తమ్ముళ్ళు .... చెల్లెళ్ళు ...నాన్న పెళ్ళి చేసుకోమని బలవంత పెడుతున్నారు.
సహజమేగా.. ఇంట్లో ఇల్లాలు ఉన్న తీరు వేరు...
ఇన్నాళ్ళూ పెద్దక్క తన సంసారంతో పాటు మా మంచి చెడులు కూడా చూసేది.. అక్కకూతుర్ని చేసుకోమని....
కొత్త వార్త... మీ అక్క కూతురి గురించి ఎప్పుడూ చెప్పలేదు...
వేళా కోళం కాదు అనూ ... నాకూ గిరిజకూ పదేళ్ళు తేడా ...తనింకా ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది.
అసలు సంగతి అది కాదు అనూ ...
అక్కకు పన్నెండేళ్ళు, నాకు ఆరేళ్ళూ ఉన్నప్పుడే మా ఇంట్లో నాయనమ్మ బలవంతం వల్ల మా ఇద్దరిపెళ్ళిళ్ళూ చేశారు. అప్పుడు అమ్మకు సీరియస్ గావుండి ఇహ లాభం లేదనుకుని అమ్మ వుండగానే పెళ్ళిళ్ళు జరిగితే అమ్మకు నిశ్చింత అని చేసారు.
బావ చెల్లెలినే చేసారు. అప్పుడు ఆ పిల్లకు మూడేళ్ళు. అక్క పెరిగి పెద్దయాక కాపరానికి వెళ్ళింది అయిదారేళ్ళలో ...కాని బావ చెల్లి అదే నా భార్య అంతకు ముందే మశూచి వచ్చి మరణించింది.
ఇప్పుడు అక్క కూతురిని చేసుకోమని ...

............
మాట్లాడవేం అనూ.......
ఏం మాట్లాడను..... సినిమా కధలావుంది... నిజమే చదువు పూర్తై ఉద్యోగంలో వున్నావు ఎవరైనా అదే అంటారు........
నీ సలహా అడిగానా ?"
మరేం అడిగావు?
నేను ఏం అడుగుతాననేది నీకు తెలీదా ......అక్ష్యరాలా చెబితే గాని తెలుసుకోలేవని నేననుకోను...
నిజమే అతని ఉద్దేశ్యం నాకు అర్ధమవుతూనే వుంది. కాని నా మనసే దేనికీ సిధ్ధంగా లేదు.
కాస్సేపు నిశ్శబ్దంగా కూర్చున్నాక ఉన్నమాట ఫ్రాంక్ గా చెప్పాను.
నిజం చెప్పనా ప్రకాశ్, ఇంకా నేను పెళ్ళి గురించి ఆలోచించలేదు.. ఇప్పట్లో ఆలోచించే ప్రసక్తి కూడా లేదు.. నీ ఉద్దేశ్యం నాకర్ధమయింది కాని ప్రకాశ్ ఈ విషయం ఇక్కడే వదిలేసి మంచి మితృల్లాగే వుందాం.
జరగని విషయాలు చర్చించుకుని మనం శతృవుల్లా మారవద్దు.జీవితంలో ఏదైనా పొందగలమేమో గాని మంచి స్నేహితులను పొందటం చాలా కష్టం.
అక్కడితో సంభాషణ తుంచేసి లేచి నిల్చున్నాను.
నిశ్శబ్దంగా ఇంటిదారి పట్టాం.
దారిపొడుగునా ప్రకాశ్ ఒక్కమాటా మాట్లాడలేదు.
చివరికి ఇంటి వరకూ వచ్చాక ఊరుకోలేక అడిగాను
బాధ పెట్టానా ప్రకాశ్ ?
అబ్బే.. ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు.
నెలరోజుల తరువాత గాని మళ్ళీ కనిపించలేదు. కనిపించినా మళ్ళీ పెళ్ళి మాట ఎత్తలేదు..ఎప్పటిలానే .....ఏమీ జరగనట్టుగానే ........మంచి మితృలుగానే ...........
నా ప్రతి సమస్యకూ అతని ఓదార్పు .........ప్రతి సంశయానికీ అతని సలహా .........
నిజంగా ఇంట్లో కూడా ఎవరికీ నేనెప్పుడూ అంత దగ్గరవలేదేమో ............ ఈ లోగా ఇంట్లోనూ కలలో కూడా వూహించని మార్పులు ..........
అపరంజి పెళ్ళి .......................అడపా దడపా అక్కల విజిట్ ..
అప్పుడో ఇప్పుడో అమ్మా నాన్నా బాధపడే వారు.......ముఖ్యంగా నా పెళ్ళి గురించి
ఎన్ని సంబందాలు చూసారో ....
అనాలోచితంగానే ప్రతివారినీ ప్రకాశ్ తో పోల్చుకునేది మనసు. అతనిలా కోపం తెచ్చుకోకుండా వుండగలరా .... చిన్న మాటకే ఎగిరిపడే మనస్తత్వాలు చూశాను. ప్రకాశ్ లా నా బరువు బాధ్యతలు పంచుకోగలరా?
నువ్వొక్కదానవే కాదుగా కూతురివి....మిగతా వారంతా లేరా ? పెళ్ళికి ముందే ఈ వరస అయితే పెళ్ళయాక ఎలాగ ?
అప్పటికే నా జర్నలిజం పూర్తై లోకల్ మ్యాగజైన్ లో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను...
పది పన్నెండు వేలు జీతం వాటితో పాటు కధలు , అనువాదాలు ఆర్ధిక పరంగా లోటు లేదనే చెప్పాలి.
ఉద్యోగం చేసే అమ్మాయే కావాలనే వాళ్ళు కొందరయితే ఉద్యోగం చెయ్యడానికి వీల్లేదని శాసించే వారు కొందరు..
ఏమిటీ ఆంక్షలు ..... అసలు పెళ్ళిళ్ళకు అర్ధం ఏమిటి ?
రెండు కుటుంబాల సస్నేహ సంబందమా లేక హోదాల సమతూకమా? ఆంక్షలతో అనురాగం వెల్లి విరవడం సాధ్యమా?
లేదా ...
కేవలం శారీరిక సుఖాల కోసం ఒకరినొకరు మభ్య పెట్టుకుంటూ ప్రతి క్షణం కుటుంబం పేరిట ఒకరినొకరు మోస పుచ్చుకోవడమా? ఇవన్నీ నిర్లజ్జగా ప్రకాశ్ తో చర్చించే దానను. అతనొక పురుషుడని కాని అతని తో ఇవన్నీ మాట్లాడవచ్చా లేదా అనే సంశయం కాని నాకు కలిగేది కాదు.
ఓ పక్క అమ్మ నాతో రోజూ పోరే .... నాన్న నిర్ణయాన్ని నాకే వదిలేశాడు.
ఓ రోజు తీరిగ్గా ఆలోచించుకుంటే ప్రకాశ్ ను మించి నన్ను అర్ధం చేసుకునే వారు ఎవరు దొరుకుతారనిపించింది. ఎప్పుడో సంవత్సరాల క్రితం అతని ప్రతిపాదన గుర్తుకు వచ్చింది. అనుకున్నదే తడవుగా అతని ఆఫీస్ కి ఫోన్ చేసాను. అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇన్ని ఫెసిలిటీస్ ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ మాట్లాడుకునే అవకాశాలూ లేవు.
ప్రకాశ్ ! సాయంత్రం గుడికి వెళ్దాం వస్తావా? నేను వెళ్ళిపోనా, నువ్వు ఇక్కడికి వస్తావా?
అనూ , ఆఫీస్ లో చాలా బిజీ గా వున్నాను . నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.
ఇవే మేం మాట్లాడుకున్న మాటలు.
అయితే ప్రకాష్ ఫోన్ చెయ్యలేదు గాని ఆరింటి కల్లా ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. తీరిగ్గా పని చూసుకుంటున్న నేను అతన్ని చూసాక హడావిడిగా సర్దుకుని బయల్దేరాను.
ఈ మధ్య ప్రకాష్ బండి కొనడంతో మా ఇద్దరికీ నడిచే అలవాటు తప్పి పోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా అతని బండి మీదే.
ఎప్పటిలా దైవ దర్శనం చేసుకుని గుడి ప్రాంగణంలో్ తోటలో సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాం.
మనసయితే అతన్ని అంగీకరించింది కాని ఆ మాట ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
ఏమైనా చెప్పాలా అనూ?
ఏముంది మామూలే గా? అమ్మా నాన్నా ఒకటే పోరు... కాని ప్రకాశ్ నాదారి నేను చూసుకుంటే వాళ్ళు ఒక్కళ్ళయిపోరా ? సరిగ్గా ఎవరైనా చూడాల్సిన సమయంలో ఇలా నిస్సహాయంగా ఎలా ఒదిలెయ్యను?
వాస్తవంగా అలోచించాలి అనూ ... నువ్వనుకున్నట్టే , అటు వైపు వాళ్ళూ ఈ పిల్లేమిటి పెళ్ళికిముందే మమ్మల్ని ఆంక్షల్లో పెడుతోంది అనుకోరూ .....పెళ్ళయాక అన్నీ అవే సర్దుకుంటాయి...
నువ్వు సర్దుకుంటావా?
తలెత్తి నావంక చూసిన చూపులో అతని విస్మయమే చెబుతోంది నా మనసు అతనికి అర్ధమయిందని. ఈ వైపు ఆశ...ఆ వైపున ఆశ్చర్యం.
ఇక్కడ ఆదుర్దా ...మరి అక్కడో........
చటుక్కున లేచి మరోసారి ఆలయంలోకి వెళ్ళాడు. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను..
ఎందుకో తొలిసారి ఆ మందిరానికి వచ్చిన సంఘటన గుర్తుకు వచ్చింది.
మామూలుగా గుడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటుంటే పూజారి శఠగోపం తెచ్చి ఆశీర్వదించారు.
దీర్ఘ్ సుమంగళీభవ ..
పూజారిగారూ ..మేమిద్దరం స్నేహితులం మాత్రమే .......
ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో తప్పక ఫలిస్తుందమ్మా నా ఆశీర్వాదం
ఆ రోజున అతని అమాయకత్వానికి నవ్వుకున్నాను.
కాని ఇప్పుడు మనసులో ఎంత ఆశ... అతని వాక్కు ఫలిస్తే ఎంత బాగుండును.
నా ఆలోచనల్లో నేనుండగానే ప్రకాశ్ ముందుకు కదిలి గేట్ వైపు వెళ్తూ పిలిచాడు.
వెళ్దాం రా ..అనూ .
తెల్లబోయాను. ఏమిటితని ఉద్దెశ్యం..అడిగినదానికి జవాబు చెప్పకుండా ...
ఉక్రోష పడ్డాను.
ఉద్దేశ్యం ఏమిటి ప్రకాశ్?
తినబోతూ రుచెందుకు .. పద....
ఎక్కడికి అని అడక్కుండా బండెక్కాను...
పావుగంట తరువాత గల్లీలన్నీ తిరిగి ఓ చిన్న ఇంటిముందు ఆగింది వాహనం.
బండి పార్క్ చేసి,రా అనూ అంటూ లోనికి నడిచాడు.
గిరిజా అనసూయ గారు వచ్చారు ..మంచినీళ్ళు పట్టుకురా !
నా మనసు బ్లాంక్ గా తయారయింది . ఎక్కడ వున్నానో ఏం జరుగుతోందో తెలియడం లేదు.
లోపలి నించి ఎవరో మామూలు చదువు సంధ్యల్లేని పల్లెటూరి పిల్ల దర్శనమిస్తుందనుకున్నా ...
చక్కగా ఒద్దికగావున్న గిరిజ రెండు గాజుగ్లాసులతో ట్రే లో నీళ్ళు పట్టుకు వచ్చింది.
గిరిజా .. ఈవిడే అనసూయ
అప్రయత్నంగానే పరిచయాలయాయి.
నిమ్మరసం తెస్తాను మామయ్యా గిరిజ మళ్ళీ లోపలకు వెళ్ళింది.
ఇంతలో ఇద్దరు అమ్మాయిలు పుస్తకాల బాగులతో గున గునా నడుస్తూ వచ్చారు్. దాదాపు తొమ్మిది పదేళ్ళుంటాయి
డాడీ తొందరగా వచ్చేసారా ? అంటూ అతన్ని అల్లుకు పోయారు..
ఎవరొచ్చారో చూశారా ... అనసూయ ఆంటీ
ఇద్దరూ చేతులు జోడించి మరీ నమస్కరించారు.
అనూ ... వీళ్ళిద్దరూ నా సుపుత్రికలు ...ట్విన్స్ ... అనుజ ...అనుష..
ఇద్దరూ దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. అన్య మనస్కంగానే వారితో మాట్లాడుతున్నా...
ఇంతలో గిరిజ తెచ్చిన నిమ్మరసం తాగి మరిక వెళ్తానని లేచాను.
ప్రకాశ్ మీద కోపంగా వుంది ఇలా సడన్ గా నన్ను తీసుకు వచ్చి ఇరకాటాన పెట్టడం.
రండి .. ఇల్లు చూద్దురు గాని ... లోపల అతని తండ్రి అనారోగ్యంతో మంచం పట్టి ...
మరో గదిలో చదువుకుంటున్న చెల్లి ..
దింపిరా మామయ్యా ..
వద్దని వారించినా వినకుండా బండి తీసాడు. మధ్యలో పబ్లిక్ గార్డెన్ దగ్గరున్న గుడి పక్కన ఓ వారగా ఆపి
అనూ ..ఇంత నిశ్శబ్దంగావున్నావేం? ఒక్కమాటైనా మాట్లాడకుండా ....
నువ్విచ్చిన షాక్ తట్టుకోవాలిగా ...
అనూ , ఒక్క పదినిమిషాలు లోపలకు వెళ్దాం రా.. నా సమాధానం ఆశించకుండానే ముందుకు నడిచాడు. ఎంట్రెన్స్ లో నే ఓ పక్కగా సిమెంట్ బెంచీమీద కూచున్నాము.
అనూ , ఇది షాక్ కాదు , నీకు గుర్తుందా? నేను పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు మా ఇంటి పరిస్థితి కూడా చెప్పాను. అమ్మ లేకపోవడం, మందగిస్తున్న నాన్న ఆరోగ్యం, రెండు కుటుంబాల పరిశ్రమతో సతమవుతున్న అక్క, ఇంకా ఎదగవలసిన తమ్ముళ్ళు చెల్లాయిలు ...........ఇంత బరువైన బాధ్యతల్లో కూరుకు పోయినా ఏ ధైర్యంతో నేను ఆ ప్రస్తావన నీ దగ్గర తేగలిగానో ఇప్పటికీ అర్ధం కాదు. అసలు సంగతి ఈ విషయం మనం చర్చించినప్పుడు నువ్వు బి.ఏ రెండో సంవత్సరంలో వున్నావు. నువ్వు ఉద్యోగంలో చేరే పదేళ్ళవుతోంది. ఎవరైనా జవాబు కోసం ఎదురు చూడాలంటే ఒకటి రెండేళ్ళు ఏమో కాని ఇలా ఒక జీవిత కాలం అని అప్పట్లో తెలీదు నాకు..
అతని పెదవులపై నవ్వు నన్ను మరింత కుపితురాలిని చేసింది.
చటుక్కున లేచి నిల్చుని బై అంటూ బయటకు వచ్చేసాను. వెనకాల ప్రకాశ్ పిలుస్తున్నా వినిపించు కోలేదు.
ఇంటికి వెళ్ళినా తేరుకోలేక పోయాను. అనవసరంగా విసుక్కోవడం , చీటికీ మాటికీ చిరాకు పడటం నా స్వభావానికి విరుద్దంగా ప్రవర్తించాను.
ఒక దశలో అమ్మా నాన్నలను కూడా మనసులోనే నిందించాను. పిల్లల పెంపకాలు చూడలేని వాళ్లు ఆ వయసులో పిల్లలనెందుకు కనాలని తిట్టుకున్నాను. మూడు రోజుల పాటు ఆఫీస్ కి కూడా వెళ్ళలేదు. ఇంట్లోంచి బయటకే కదల్లేదు.. అమ్మ నాన్న ఎన్ని సార్లు అడీగినా పని బోర్ కొడుతోందనీ కాస్త రెస్ట్ కావాలనీ చెప్పి తప్పించుకున్నాను.
నాలుగైదు రోజులపాటు ఇలా నేను నేనుగా కాక మరో మనిషిలా ప్రవర్తించాక , కాస్త కాస్త తేరుకున్నాక సోమవారం మళ్ళీ ఆఫీస్ కి బయలు దేరటం అమ్మకు కొంత ఊరటగా అనిపించిందని ఆవిడ మొహమే చెప్పింది. పశ్చాత్తాప పడ్డాను. ఈ వయసులో వాళ్ళ గురించి ఆలోచించాల్సినదిపోయి వాళ్ళను దూషించే పాటిదేనా నాసంస్కారం అని నొచ్చుకున్నాను.
ఆఫీస్ లో నాటేబుల్ మీద నాకోసం ఎదురుచూస్తూంది ఆ కవర్.
అది ప్రకాశ్ చేతిరాత. ఎంత సుపరిచితమైనది. చిన్నప్పటినుండీ నానోట్ బుక్స్ లో వున్నది అతని రాతేగా... కాని అతనితో జీవితం నా తలరాతలో లేదు... నా ఆలోచనకు ఉలిక్కిపడ్డాను.
ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని ఉత్తరం విప్పాను.

ప్రియమైన అనూ,
అలిగావా ? పిచ్చిపిల్లా !
ఇలా ఎందుకు పిలిచానా అని అనుకుంటున్నావా? ఎన్నాళ్ళుగానో నువ్వు నా ప్రియమైన అనూ వే. కాదంటే ఎదురుగా అనే ధైర్యం చెయ్యలేకపోయాను. ఇహ ఇప్పుడు ఆధైర్యం నువ్వే ఇచ్చావు.
చిన్నప్పుడు జ్ఞాపకం కూడా లేని రోజుల్లో ఎలా పరిచయమయామో గాని నాకు ఊహ తెలిసాక ఒక్కసారీ మనం మాటా మాటా అనుకున్నది కాని దెబ్బలాడుకున్నది గాని లేదు. అలాగని మన పరిచయాల గీతలు దాటి ఎప్పుడూ సన్నిహితులమైనదీ లేదు.
చిన్నప్పటినుండీ నాది శ్రమ జీవనమే...... దిగువ మధ్యతరగతి కావడంతో అది తప్పదు. ఏదో నాలుగు అక్షరమ్ముక్కలు వంటపట్టాయి గనక చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకోగలిగాను. అది నాఅదృష్టం కాదు ...నామీద ఆధారపడిన వాళ్ళది.
ఇంట్లో పెళ్ళి మాట ఎత్తేసరికి నువ్వే గుర్తుకు వచ్చావు. అక్కతో నా మనసు విప్పి చెప్పుకోలేను_ అడుగుతున్నది తన కూతురిని చేసుకోమని... ఎవరి నైనా రాయభారం పంపేందుకు నాకు చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేరు. తమ్ముడు చెల్లాయిలు చిన్నవాళ్ళు .
నాన్నకు ఇలాంటివి తెలియవు. అయినా మొండి ధైర్యం. నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో ఎవరూ కాదనరనే నమ్మకం.
కాని నాకు నీ దగ్గరే చుక్కెదురైంది. ఈ నాలుగైదు రోజులు నువ్వెంత తల్లడిల్లి పోయావో నేనూ అంతకుమించి పరితపించిపోయాను. జీవితం శూన్యమనుకున్నాను. నువ్వు కాకపోయాక ఎవరైతే నేమిలే అనుకున్నాను. కాని నిదానంగా ఆవేశం తగ్గాక ఆలోచిస్తే అర్ధమయింది. ఇది దేవదాసు సినిమా కాదు.
పారూ పారూ .. అనుకుంటూ తప్ప తాగి తుప్పల చుట్టూ తిరిగేందుకు. అంతేకాదు. నా జీవితం నాఒక్కడిదీ కాదు. ఏదో ఆశించినది లభ్యం కాలేదని దాన్ని అంతం చేసుకుందుకో లేదా.. బాధ్యతలు గాలి కొదిలేసి వాగుల వెంటా వంకల వెంటా తిరిగేందుకో... నన్ను నేను ఓదార్చుకున్నాను. ఆశపడ్డవన్నీ మనకు లభించి తీరాలని రూలేమీ లేదుగా... జీవితంలో ఎన్నో లేవు ..ముఖ్యంగా అమ్మే లేదు అయినా జీవితం ఆగిపోలేదుగా... అయినా నువ్వు పక్కన లేనంత మాత్రాన మన స్నేహం ఆగిపోదుగా ,... అలాంటప్పుడు నేను ఎందుకు పెద్దగా వర్రీ అయిపోయి నిన్ను క్షోభ పెట్టాలి...మన స్నేహం నడిచినంత వరకు ఇదివరలానే సజావుగా సాగిపోతుంది... ఈ నిర్ణయానికి వచ్చాక మనసు తేలికపడింది.
నన్ను నేను అనునయించుకున్నాను. గిరిజకూ చెప్పాను. మన అమలిన స్నేహం గురించి. ఇది వరలో ఎలా ఉండేదో ఇకపైనా అలాగే ఉంటుందనీ పెళ్ళయాక అనుమానాలు, ఏడ్పులు గోల నాకు నచ్చవనీ. గిరిజ చదువుకున్నది తక్కువే అయినా నా అంచనాలకు మించి సంస్కారాన్ని పెంచుకుంది. అందుకే మామధ్య పొరపొచ్చాలు లేవు ఇకపైన రావు.
ఇహ నా వ్యక్తి గత విషయాలు నువ్వెప్పుడూ అడిగిందీ లేదు , నేను చెప్పిందీ లేదు. గుర్తు తెచ్చుకో. అయినా మా ఇంట్లో ఏ శుభకార్యమైనా అతి సాధారణంగా ఇంటి మనుషులకే పరిమితం చేసుకున్నాము. లేని ఫోని ఆడంబరాలకు పోయి నెత్తిన గుడ్డవేసుకో దలచుకోలేదు. ఇప్పటికీ చూశావుగా అతి మామూలు జీవితాలు మావి.
మొదటి నించీ నీ మాటల్లో సాన్నిహిత్యం , మెత్తదనం, ఒక రకమైన అడ్జస్ట్మెంట్ నాలో ఆశలు పెంచాయి. నీ కళ్ళల్లో నాపట్ల వ్యక్త మయే భావం తప్పుగా అంచనా వేసుకుని తొందర పడ్డానా అని అనుకున్నాను.
కాని పిచ్చిపిల్లా! నీ మనసును నువ్వే తెలుసుకోలేకపోయావు. మరీ ఇంత అమాయకత్వమా? మరీ ఇంత ట్యూబ్ లైట్ అయితే ఇలాగే వుంటుంది మరి. నీ నిర్ణయం ఒక జీవిత కాలం లేటు. ఇక్కడ ఒక మాట గుర్తు చెయ్యనా... నిన్ను పెళ్ళి మాట అడిగి పన్నెండేళ్ళయింది.. ... నావయసు నలభైల్లో పడింది... నువ్వూ దరిదాపుల్లోకి వచ్చావు.
మొత్తానికి నేను దురదృష్టవంతుడిని. కాని అందులోనే నిన్ను పోగొట్టుకోని అదృష్టం నాది. జన్మ జన్మలకూ మనం స్నేహితులమే ...
నీ భావోద్వేగాన్ని అర్ధం చేసుకోగలను... అది కాస్త ఉపశమించాక మాట్లాడుకుందాం.
మరి సెలవా
ఎప్పటికీ
నీ అననా ?

ఉత్తరం చదివాక చిత్రంగానే మనసు శాంతించింది. అయితే
ఇది జరిగి కూడా ఐదారేళ్ళు దాటిపోయింది. ఈ మధ్య కాలంలో నాన్నగారి నిష్క్రమణ, అమ్మ అనారోగ్యంతో ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే వుంటూ రాసుకోవడం, మధ్య మధ్యన ఎన్ని సంబందాలు వచ్చినా అవుననడానికి మనస్కరించకపోవడం ఏళ్ళకేళ్ళు దొర్లిపోయాయి.
స్నేహం ఎప్పటిలాగే వున్నా, ప్రకాశ్ ఎక్కడో ఇల్లు కట్టుకోవడం, దూరాభారం కావడాన తరచు కలుసుకోలేకపోవడం, వీలుపడనప్పుడు ఏ ఏడాదికో మనసు విప్పి ఉత్తరం రాయడం అతనికి మామూలే.
ఆలోచనల నించి బయటపడి అతని ఉత్తరం చేతిలోకి తీసుకున్నాను. విప్పక ముందే మనసును ఆత్మీయంగా తడిమిన అనుభూతి. మనిషి పక్కనే వున్న భావన.
ఉత్తరం విప్పుతూనే అనిపించింది , అక్షరాలు ఇదివరకులా పొందికగా లేవని.
ఏదో హడావిడిలో రాసినట్టు ...

ప్రియమైన అనూ,
పలకరించి చాలా రోజులైంది కదూ ! విన్నాను..అమ్మ అంతిమ యాత్ర గురించి ...నీ ఒంటరి తనం గురించి...
అసలు ఎన్ని సార్లో వచ్చి పలకరిద్దామనుకున్నాను, కాని మనసుకు ధైర్యం చాలటం లేదు.
ఎలావున్నావు అనూ ...
జీవితంలో ఎవరువున్నా లేకపోయినా తనవారంటూ ఒకరు లేకపోవడం ఎంత పెద్ద శిక్ష!
నీతో డైరెక్ట్ గా చెప్పక పోయినా, ఎందరికో నీ గురించి చెప్పి పెళ్ళి చూపులకు వప్పించి పంపాను , అమ్మా , నాన్నగారు ఉన్నప్పుడు కూడా .. కాని నువ్వే తిరస్కరించావు..
నువ్వు అలా తిరస్కరిస్తూ పోయే కొద్దీ నాలో గిల్టీ ఫీలింగ్ పెరుగుతూ వచ్చింది. ఒక రకంగా నీ ఈ స్థితి కి నేనే కారణమేమో నన్న అపరాధ భావన....
నేను పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా వుండి నిన్ను అశాంతి పాలు చేశానే అని వేదన....
ఇహ నా మొహం నీకు ఎలా చూపను అనూ .....
ఎందుకో ఈ మధ్యన జీవితంలో అలసిపోయిన ఫీలింగ్ కలుగుతోంది... ఎవరితో పంచుకోను నా ఈ నైరాశ్యాన్ని.
అక్క ఎప్పుడో దాటి పోయింది. నాన్నగారు ఆ దిగులుతోనే మంచం పట్టి మరికొన్నాళ్ళకే లోకాన్ని వదిలేశారు.
తమ్ముళ్ళూ , చెల్లెళ్ళు వారినో దరికి చేర్చడంతో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇమిడి పోయారు.. తీరిక దొరికితే్ చుట్టం చూపుగా వచ్చివెళతారు.
ఎంత వద్దనుకున్నా ఈ మాట నీకు చెప్పకుండా ఆగలేను అనూ!
నా దురదృష్టమే నా పిల్లలకూ వచ్చింది.....
ఏడాది క్రితం వారం రోజులపాటు జ్వరం, నీరసంతో గిరిజ బాధ పడుతుంటే ఏదో మామూలు విషయమే నని అనుకున్నాను గాని అది నా దుష్ట జాతకమనీ నా గిరిజను బ్లడ్ కాన్సర్ రూపంలో హరిస్తుందనీ అసలు అనుకోలేదు.
సరిగ్గా వారం అంతే .. ప్లేట్ లెట్ లు తగ్గిపోయి కాన్సర్ అని తీర్మానించే సరికే గిరిజకు కాలం చెల్లిపోయింది.
అనుష , అనుజ ఇంటర్ పూర్తి చేసి ప్రొఫెషనల్ కోర్స్ ఎంట్రెన్స్ లకు తయారవుతున్నారు. ఈ సమయం లో ఇది మా మీద పిడుగు పాటే...
ఏమిటో ఆగలేక నీతో పంచుకుని నిన్నూ బాధ పెడుతున్నానా? ఏం చెయ్యను? నా బాధ ఎవరికి చెప్పుకోను...
ఎన్నో రాయాలని చాలా రోజులు పెట్టుకున్నా నీ ఉత్తరం ... కాని ఏమీ రాయలేకపోతున్నా ......... అందుకే మిగతా ఖాళీ పేపర్లలో నా భావాలు నింపుకో .. ఉండనా మరి
నీ .............
నిశ్చేష్టురాలనై నిలుచుండి పోయాను.

*********
హయ్
తలెత్తింది అనసూయ. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లో ట్రాన్స్లేషన్స్ డిపార్ మెంట్ లో సెమినార్ ఒకటివుంటే వచ్చింది అనసూయ. ఉదయం రెజిస్ట్రేషన్ , టీ బిస్కట్స్ తో ప్రారంభించి , లంచ్ కి ముందు రెండు లెక్చర్లు , లంచ్ తరువాత మరో రెంటితో నాలుగున్నరకు ముగిసింది. అనయమనస్కంగా లైబ్రరీలోకి వెళ్ళి గంటకు పైగా పుస్తకాలు తిరగేసి బయటకు వచ్చింది. పలకరింపు విని తలెత్తింది. ఎదురెండ కళ్ళమీద పడుతుండటంతో చటుక్కున ఎడుటి మనిషి ఆనవాలు తెలియలేదు.
హాయ్ పలకరిస్తూ కుడి చేయ్యి ఎండకడ్డం పెట్టుకుని మరీ చూసింది.
పచ్చని పసిమి ఛాయ, కుదురుగా కనిపిస్తున్న మీసాలు ,చూపు ఆపైకి సారిస్తే నవ్వుతున్నట్టుండే కళ్ళు ........ఎక్కడో చూసినట్టుందికాని ఎవరనేది గుర్తుకు రావడం లేదు.
గుర్తు పట్టలేదు కదూ ... చిరునవ్వుతో పెదవులు విప్పారి కుడి బుగ్గమీద సొట్ట...
అవును .... అలా సొట్టపడేది అర్జున్ ఒక్కడికే ...కాని అర్జున్ ఇంతలా ఎలా మారిపోయాడు. గాలి వీస్తే ఎగిరిపోయేలా , రివటలా అనిపించేవాడు... ఇప్పుడు ఎత్తుకు తగ్గ పొడుగు, కాస్తా చిరు బొజ్జ ...
అవును గుర్తుకు వచ్చింది ఎన్నో మ్యాగజైన్ల మీద అతని ఫొటో చూసింది. మాడల్ గా. రేమండ్స్ సూట్ లకు, రేబాన్ కళ్ళద్దాలకు ఒకటేమిటి ఎన్నో ....కాని అతనే అర్జున్ అని అనుకోలేకపోయింది..
అర్జున్ కదూ ... మొహమాటంగా అడిగింది.
అమ్మయ్య మొత్తానికి గుర్తు పట్టావు... ఎన్నేళ్ళకు దాదాపు ఇరవై ఏళ్ళుకావస్తోంది కదూ ....
అవును ..ఇరవై ఏళ్ళు . సాలోచనగా అంది.
గుర్తుందా అనసూయా ...ఆ రోజుల్లో నిన్ను ఎలా ఏడిపించానో కదూ ... తల్చుకుంటే సిగ్గేస్తుంది , నవ్వొస్తుంది కూడా .....
పద, బయటకే కదా అని అడగక్కర్లేదనుకుంటా ... ఈ దారి బయటకే గనక ......... ఏంచేస్తున్నావు...
ఏముంది తోచినప్పుడు రాసుకోడం..........అదో ఇదో అనువదించటం ...
ఊ ఇక్కడే వున్నావా? పిల్లలా .
ఊ ... అమ్మా నేను ఉండేవారం . అమ్మ నెల్లాళ్ళక్రితమే వెళ్ళిపోయింది ...
అయితే ఒక్కదానవేనా.........
ఆ ప్రశ్న కొంత ఇబ్బందిగా అనిపించినా, ఓ పక్క స్పష్టంగా తెలుస్తున్నా మళ్ళి అడగాలా అని మనసులోనే చిరాకు పడి మాట మారుస్తూ,
నీ సంగతి చెప్పు అడిగింది.
ఆమె అయిష్టాన్ని గమనించినట్టుగా తలూపి... కారు డోర్ తెరుస్తూ,
కమాన్ , డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం..
అనసూయ ఒక్కక్షణం ఆగి తటపటాయించి ,
లేదు అర్జున్ , పొద్దుననగా వచ్చాను.............
ఆమెను మధ్యలోనే ఆపేస్తూ ....
అవును కదూ, అర్జంటుగా ఇంటికెళ్ళి అక్కడ జనాలకి సంజాయిషీ ఇచ్చుకోవాలి , పిల్లలకు వండి పెట్టాలి...........
సీరియస్ గా అంటూన్న అతన్ని చూసి నవ్వేస్తూ
కారెక్కుతూ అయితే పద
కారు స్టార్ట్ అయి గేట్ దాటాక .
నువ్వేం మారలేదు అర్జున్ అంది.
ఎందుకు మారలేదు... ఇదిగో ఈ గుండ్రటి మొహం , ఇలా పైకి వెళ్ళుకొస్తున్న పొట్ట ,....
అబ్బ, అదికాదు నేనన్నది
మరింకేది?
ఇదిగో ఇదే ఎదుటి వాళ్ళను ఉడికిస్తూ అల్లరిగా మాట్లాడటం...
స్వభావం ఎలా మారుతుంది అనూ ... ఒకవేళ నువ్వు పెళ్ళి చేసుకుని, అమ్మవు అయివుంటే , మీ ఆయనకు భయపడైనా హుందాగా వుండేవాడిని కాని నువ్వేమో పాత అనసూయ గానే ఉన్నప్పుడు నేనెందుకు కొత్త ముసుగేసుకోవాలి?
సరేలే నీ గురించి చెప్పు....
స్కూల్లో చదివే రోజుల్లొ అర్జున్ అంటే అమ్మాయిలకు ఒక విధమైన హీరో వర్షిప్ వుండేది.
తెల్లగావుండే వాడు, అందంగా అనిపించేవాడు.. కాస్త డబ్బున్నా వాళ్ళ పిల్లడు కావడంతో అన్ని సౌకర్యాలతో వున్న అతనంటే చాలామందే ఇష్టపడే వారు. అనసూయ మాత్రం అతని పట్ల పెద్దగా ఆకర్షింప బడలేదు.
అయితే ఏంటి ? గొప్పా? రంగేమైనా సంపాదించుకున్నాడా , పుట్టుకతో వచ్చిందానికి అంత అహంకారమా? అని తీసిపారేసింది.
ఇహ చదువు మాటకొస్తే ఆమాత్రం చదువు నేనూ చదువుతున్నాగా ? అని ఈసడించేది.
ఓ రోజు స్కూల్ అయ్యాక దారి కాసి మరీ ఆమెతో తగువు పెట్టుకున్నాడు.
ఏంటే , నీకేదో తలపొగరు బాగా ఎక్కిందటా , నాగురించి ఏదేదో వాగుతున్నావటా ... అంటూ మీద మీదకు వచ్చాడు.
అప్పుడనటమేమిటి , ఇప్పుడే అంటా ...ఎంత పొగరు లేకపోతే ఏంటే గీంటే అని మర్యాద లేకుండా పోట్లాడతావు? అదేకద నేనన్నది రంగేమైనా సంపాదించు కున్నదా గర్వపడటానికి, నీ పాటి చదువు నేనూ చదువుతున్నాలే ... వెనక్కి పోలేదు అనసూయ ...
మానాన్న గెజిటెడ్ ఆఫీసర్ ...
బోడి అదేం గొప్పా .. అనసూయ మాట పూర్తి కాక ముందే పెఢీ మని లాగి ఒక్కటి చ్చి ఆ పిల్ల తేరుకునే లోగానే ముందుకు వెళ్ళిపోయాడు.
నివ్వెరపడి నిల్చుండిపోయిన అనసూయ ఇంటికి వెళ్లలేదు.. గిరుక్కున వెనక్కుతిరిగి స్కూల్ కి వెళ్ళి అప్పుడే వెళ్ళడానికి సర్దుకుంటున్న ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేసింది.
ఇపుడు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా, రేపు చూద్దాం
ఇంటికి వెళ్ళే హడావిడిలో జవాబిచ్చాడాయన.
నో, ఇంటికి వెడితే ఫోన్ చేసి పిలిపించండి . అంతే కాని ఈ అవమానంతో నేనిక్కడి నుండి కదలను ... ఈ విషయం తేలే వరకు ఏం జరిగినా కదిలేది లేదు. తెగించి చెప్పింది అనసూయ.
ఇహ లాభం లేదని గ్రహించాక , మళ్ళీ కుర్చీలో కూలబడి అర్జంటుగా ఫోన్ లు చేసి నిందితుణ్ణి అతని తలిదండ్రులను సాక్షులుగా వెంటవున్న వారిని పిలిచి అన్ని విచారణలు జరిపి తప్పుఒప్పుకున్న అర్జున్ తో క్షమార్పణ రాయించి ఇచ్చేసరికి రాత్రి ఎనిమిది దాటింది.
ఆవిషయం గుర్తుకు వచ్చి,
వామ్మో! నీతో జాగర్తగానే మాట్లాడాలి. ఏది మాట్లాడితే ఆ రోజులా రోడ్డు మీద పంచాయతీ పెట్టేస్తావేమోనని భయంగావుంది... భయం నటిస్తూ ....
గుర్తుందా ఆరోజు నాతో ఏడు చెరువుల నీళ్ళు తాగించి క్షమార్పణలు రాయించుకున్న సంగతి .....
చాల్లే వేళాకోళం
తినబోతూ రుచెందుకు అనూ ... ఎలాగు ఇంటికి వస్తున్నావుగా చూద్దువుగాని....
ఇంటికా?
ఏం ఇంట్లో నిన్ను ఒక్కదాన్నీ బంధించి , ఏం చేస్తానో నని బెంగగా వుందా...
వేళాకోళం కాదు అర్జున్ , ఉదయం నించి అలసిపోయివున్నాను ...ఇప్పుడీ మొహంతో ....
నువ్వేం పెళ్ళి చూపులకు వస్తున్నావా ? సినిమా షూటింగ్ కా .. ఓకె. ఫ్రెష్ అప్ అవుతానంటే ఎక్కడైనా రెస్టారెంట్ కి వెళ్దాం ..
నీ మొండితనం మాత్రం అలాగే వుంది... మీ ఆవిడ ఎలా వేగుతోందో కాని ...
వేగుతోందని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పందే .........
అయోమయంగా అతనివంక చూసింది.
ఆమె ఎదురు చూసినట్టు అతనేం చెప్పలేదు. అరగంట ప్రయాణించాక బంగళా లాంటి ఇంటి ముందు ఆగారు.
బెరుకు బెరుగ్గా అతని వెంట లోనికి నడిచింది.
ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఎందుకిలా అర్ధంతరంగా ఇలా తీసుకు వచ్చాడు. మనసులోనే తిట్టుకుంది.
పెద్ద విశాలమైన హాల్లోకి అడుగు పెడుతూనే
అమ్మా, అమ్మా ... అంటూ గట్టిగా అరిచాడు.
అమ్మా , చూడు ఎవరొచ్చారో తొందరగా రా ... చిన్న పిల్లాడి తంతులా వుంది అతని ప్రవర్తన.
’అబ్బబ్బ! ఇద్దరు పిల్లలున్నా ఇంకా చిన్నతనం పోనేలేదు .. హడావిడిగా బయటకు వచ్చింది అతని తల్లి .
చూడు ఎవరనేది గుర్తు పట్టగలవా?
ఈ అమ్మాయి... ఈ అమ్మాయి ... అనసూయ కదూ ..
బాగానే గుర్తు పట్టావు... ఎప్పుడూ అనుకుంటావుగా , నీకో సర్ప్రైజ్ ఇద్దామని కనిపించగానే తీసుకు వచ్చాను ... పిల్లలు పైన ఉన్నారా...
అంటూ అతను ముందుకు కదిలాడు . రామ్మా , రా ...నిన్ను చూసినది ఒక్కసారే కాని నీ ఆత్మాభిమానం నాకు ఎంతో నచ్చింది.. చెయ్యిపట్టుకుని తీసుకు వెళ్ళి పక్కన కూర్చో బెట్టుకుంటూ
అమ్మా నాన్నా అంతా బాగున్నారా ? క్షేమ సమాచారాలు అడిగిందావిడ.
నెల్లాళ్ళ క్రితం తల్లి మరణం, అక్కల వివరాలు , తను చేసే పని కొత్తగా మళ్ళి ఉద్యోగ ప్రయత్నాల గురించి చెప్పింది.
అయ్యో , మాతల్లే , ఒక్కదానవూ ఇన్ని బాధలు పడ్డావా? ఏంచేస్తాం చెప్పు ...
పనిమనిషిలా వుంది జ్యూస్ తెచ్చి ఇచ్చింది.
ఇద్దరూ తెలిసిన వాళ్ళందరి గురించీ ముచ్చటించటంలో మునిగి పోయారు. ఈ లోగా అర్జున్ పైనించి పిల్లలతో కిందకు దిగాడు.
పది పన్నెండేళ్ళ అబ్బాయి, ఆరేడేళ్ళ అమ్మాయి..
ముందు మొహ మాట పడ్డా భోజనం చెయ్యక తప్పలేదు.
అప్పటికే రాత్రి పదవుతోంది.
ఇంతరాత్రి ఇంటికి ఏం వెళతావు గాని వుండిపోరాదూ ...
లేదాంటీ , వెళ్ళాలి.. మళ్ళీ వస్తానుగా ...
అర్జున్ , దింపేసిరా ... అతను పిల్లలను అడిగాడు ’వస్తారా..’ అని.
వద్దులేరా ...మళ్ళి పొద్దునే లేచి స్కూళ్ళకు వెళ్ళాలిగా... అని ఆవిడ వారించటంతో ఇద్దరే బయల్దేరారు.
ఊ ... చూసావుగా ... నాకుటుంబం ... అర్ధం చేసుకున్నావనుకుంటాను..."
ఇంతకూ మీ శ్రీమతి గారిని పరిచయం చెయ్యనే లేదు..
శ్రీమతా? అమ్మ ఏమీ చెప్పలేదా ? మరంత సేపు ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు
ఏముంది చిన్నప్పటి సంగతులు...
"........."
కాస్సేపు నిశ్శబ్దంగా వున్నాక మొదలెట్టాడు.
అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా కౌసల్యను పెళ్ళిచేసుకున్నాను...
కౌసల్య అంటే ........
సందేహించింది..
ఔను, సినిమానటి కౌసల్యనే...
చాలా గొప్ప నటి ......
ఔను. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా...
అర్జున్ !
ఆశ్చర్యమెందుకు అనూ ! మంచి ఫామ్ లో వున్నప్పుడు నన్ను వెంటతిప్పుకుని పెళ్ళికి సుముఖుడిని చేసుకుంది... ఎన్నో ప్రామిస్ లు చేసింది ... చేస్తున్న సినిమాలు పూర్తవ గానే సినిమా ఫీల్డ్ వదిలేస్తానంది. అయితే ఆ సినిమాలే ఐదారేళ్ళు నడిచాయి, ఈ లోగా ఇద్దరు పిల్లలు. పాప చిన్నప్పుడు సరిగ్గా నెల రోజులైనా నిండని పిల్లని వదిలి షూటింగ్ లకు వెళ్ళడం నాకు నచ్చలేదు... అదేమంటే నాకు అభిజాత్యమనీ మేల్ చావినిస్టిక్ ఈగో అనీ , నాతో కలిసి ఉండటం కంటె విడిపోవడం ఉత్తమమనీ వెళ్ళిపోయింది. నేనూ కోపం లో పట్టించుకోలేదు ...అప్పుడే నాన్న అనారోగ్యంతో హఠాత్తుగా పరమపదించారు..
కనీసం పలకరించటానికి కూడా రాలేదు. నేనే వెళ్ళి బతిమాలాను. బంధువుల్లో చులకన చెయ్యవద్దని వేడుకున్నాను . ఉహు ! లాభం లేకపోయింది. అంతే పదేళ్ళు కావస్తోంది....
నిజంగానే నువ్వు ఆమె తో అనాగరికంగా ప్రవర్తించావేమో .......
చిన్నప్పుడు గర్వంతో అలావున్నమాట వాస్తవమే కాని తరువాత మళ్ళీ ఎప్పుడూ ఎవరితోనూ అంత అనాగరికంగా ప్రవర్తించలేదు అనూ .......
ఏం చెప్పాలో తెలీక నిశ్శబ్దంగా వుండిపోయింది.
ఈ లోగా ఇల్లు వచ్చేసింది.
లోపలకు వస్తావా ? కారుదిగుతూ నామకహా అడిగింది.
వద్దులే ... చాలా రాత్రయి పోయింది బాగుండదు ... మళ్ళీ ఎప్పుడో వస్తాను అతను కారు రివర్స్ చేసుకుంటుంటే అక్కడే నిల్చుంది .
ఇంతకూ నీ ఫోన్ నంబర్ చెప్పనే లేదు
చెప్పింది అనసూయ.
సెల్?
లేదన్నట్టుగా పెదవివిరిచింది.
ఓకె దెన్ బై అతను కారు స్పీడ్ పెంచుకుని వెళ్ళిపోయాడు.
తలుపు తీసి లోనికి వచ్చాక జరిగినవి తిరగదోడుకుంటే చిత్రంగా తోచింది అనసూయకు. ప్రపంచం ఇంత చిన్నదా, ఎక్కడోక్కడ, ఎప్పుడోప్పుడు మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూనే వుంటామా అనిపించింది.
ఉదయం నించీ తిరిగిన అలసట తెలుస్తూనేవుంది.
స్నానం చేసేందుకు కూడా ఓపిక లేకపోయింది.
నైటీ కూడా మార్చుకునే ఓపికలేక విప్పిన చీర తాడు మీదకు విసిరేసి, చమటతొ తడిసిముద్దయిన బ్లౌజ్ వాషీంగ్ కిట్లో వేసి అలాగే మంచం మీదకు ఒరిగింది.
ఏం చెయ్యాలని అనిపించక లైటార్పి కళ్ళుమూసుకుంది.

౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮

ఆటో సందు మలుపుతిరుగుతూనే ఇంటిముందు ఆగివున్న పడవలాంటి కారును గుర్తు పట్టేసింది అనసూయ. మధ్యాహ్నం మూడున్నరకు రేడియో రికార్డింగ్ వుందని వెళ్ళి వస్తూ వస్తూ కూరలూ నారలూ కావలసిన వస్తువులు రిలయన్స్ ఫ్రెష్ లో తీరిగ్గా ఎంచుకుని ఏడింటికి ఇల్లు చేరింది.
అది అర్జున్ కారు. కాస్త చిరాకు పడుతూనే వీడొహడు నాకు పీడలా తగిలాడు , అనుకుంటూనే రిక్షా దిగే సరికి గేట్ తీసేవుంది. ఎదురుగా మెట్లమీద అతనొక్కడే కాదు అతని ఇద్దరు పిల్లలూ అరుణ్ , అవిష కూడా ఎదురు చూస్తున్నారు.
అయ్యో! ఎంత సేపయింది వచ్చి? వస్తున్నామని ఫోన్ చెయ్యక పోయావా? గబగబా బాగ్స్ ఇంట్లోకి తేబోతుంటే అతనితో బాటు పిల్లలూ చెరోటీ అందుకున్నారు.
ఆంటీ , మేం తెస్తాం లే
అయ్యో మీకెందుకు శ్రమ? అనసూయ నొచ్చుకున్నా వినలేదు.
అమ్మ చుట్టాల ఇంట్లో పెళ్ళికి వెళ్ళింది. పిల్లలకు స్కూల్ పోతుంది పోమన్నారు. ఎలాగూ రేపు ఆదివారం కదా అని ఇక్కడికి తీసుకు వస్తే ఏదీ నువ్వుంటేగా ఇదిగో వస్తావు అదిగొ వస్తావని చూస్తే రెండు గంటలు గడిచిపోయాయి....
తాళం తీసాక ఆమె వెంటే లోనికి వస్తూ అన్నాడు.
ఫోన్ చెయ్యడానికి నువ్వు ఇంట్లో వుంటేగా ... చేసి చేసి ఎత్తకపోతే ఫోన్ పాడైందేమోననుకున్నా ...
రేడియో స్టేషన్ లో రికార్డింగ్ వుంటే నూ ,, పనేం లేదుకదా అని...కూర్చోండి ..ఏదైనా తాగడానికి తెస్తాను ...
అలసిపోయింది మేం కాదు నువ్వు ... ముందు నువ్వుసేద దీరాలి .." చనువుగా ఆమె చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టాడు.
పిల్లలిద్దరినీ చదువుల గురించీ , వాళ్ళా హాబీలగురించీ అడిగి తెలుసుకుంది. అనసూయ రాస్తుందని తెలిసి . అరుణ్ థ్రిల్ అయిపోయాడు .
ఆంటీ రాయకముందు ఎలా ఫీలవుతారు ? రాసాక ఏమనిపిస్తుంది చెప్పరూ అంటూ పక్కన చేరాడు.
అవిష కూడా అన్న పక్కనే ఒదిగి కూచుని అనసూయను ఆసక్తిగా చూస్తోంది.
చాలా సేపటి తరువాత కాని అనసూయకు పిల్లలకు తినడానికో తాగడానికో ఏం ఇవ్వలేదన్నవిషయం గుర్తుకు రాలేదు.

హడావిడిగా లోపలకు వెళ్ళబోతున్న అనసూయను ఆపి
ఇప్పుడేం చేస్తావులే ... మనందరం కలిసి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాం అరున్ ప్రపోజ్ చేసాడు.
అబ్బే ఎంతసేపు ఒక్క అరగంట... టీ వీ ఆన్ చేస్తాను ...చూస్తూండండి.. అర్జున్ ఈ లోగా నీకో కప్ టీ ..
ఎందుకు శ్రమ అనూ ...
నీకు నా వంట మీద నమ్మకం లేనట్టుంది. బాగానే వండుతాలే ... అంటూ లోపలకు వెళ్ళింది అనసూయ .
రైస్ కుక్కర్ ఆన్ చేసి, ఓ పక్కన దోసకాయ పప్పు , మరో స్టౌ మీద టీ నీళ్ళూ పడేసి అవి మరిగేలోగా బంగాళా దుంపలు పీల్ చేద్దామని పీలర్ వెతుకుతుంటే వంటింటీ గుమ్మం నిండుగా నిల్చుని ఉన్నాడు అర్జున్ .
ఇదిగో ఒక్క నిమిషం .. టీ రెడీ ..
టీ కోసంకాదు ...ఇలా ఒక్కదానవూ నానా హైరానా పడి వండాలనే వొద్దంట.. సరే ఆ బంగాళా దుంపలు ఇలాగివ్వు. నువ్వు టీ చేసె లోగా నేను పీల్ చేసి కోస్తాను ...
నువ్వా...
ఏం నాకు రాదనుకున్నావా ? అమ్మకు నేనొక్కడినే కావడంతో అమ్మ నాకు అన్ని పనులూ నేర్పింది..
ఇలా ఫోటో తీసుకుని ద ఫేమస్ మాడల్ ఇలా అని చూపిస్తే బాగుంటుంది కదూ ...
ఏం మాడల్స్ అన్నం తినరా ...
తనే అనసూయ చేతిలో పీలర్ , దుంపలు తీసుకుని వంటింటి గడపమీద కూర్చున్నాడు.
స్టౌ ముందు నించుని టీ చేస్తున్నా అనసూయలో ఇది అని చెప్పలేని ఫీలింగ్. చాలా చిన్నప్పుడు తండ్రి ఇలా తల్లికి సాయపడటం ఆమెకు గుర్తొచ్చింది.
టీ వడగట్టి ఇచ్చే లోగా అర్జున్ బంగాళా దుంపలు చక్కగా వేపుడుకు తగ్గట్టు చాపింగ్ బోర్డ్ చాకుతో కోసిపెట్టాడు.
అతనక్కడే కూర్చుని టీ తాగుతుంటే ,
ముందు రూం లోకి వెళ్ళరాదూ , నేను అరగంటలో వంటముగించి వస్తాగా .. మొహమాటంగా అంది.
ఏం, నేనిక్కడుంటే నీకేం ఇబ్బంది... నీ పని నువ్వు కానీ , నేనేం డిస్టర్బ్ చెయ్యనులే ...
మొండీ గట్టిగానే గొణుక్కుని వంట ముగించింది.
ఇంట్లో మొదటి సారిగా నలుగురూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనాలు చెయ్యడం ఎంతో సరదాగా టైం తెలియకూండా గడిచిపోవడం అనసూయకు ఓ పక్క ఆనందంగా మరో పక్క ఆశ్చర్యంగావుంది.
తరువాత కూడా టీవీలో ఏదో కార్టూన్ ఫిల్మ్ చూస్తూ పిల్లలు కదలకపోవడంతో
అర్జున్ గుర్తు చేశాడు అన్నట్టు చిన్నప్పుడు చెస్ బాగా ఆడే దానవు కదా .. అసలు నీతో పోటీ పడాలనే చెస్ నేర్చుకున్నాను పట్టుదలగా కాని ధైర్యం చెయ్యలేకపోయాను.. చెస్ బోర్డ్ వుంటే తేరాదూ ..
చాలా ఏళ్ళతరువాత చెస్ బోర్డ్ బయటకు వచ్చింది. పోటాను పోటీలుగా సాగిన గేం ముగిసేందుకు గంటన్నరపై మాటే పట్టింది .
ఇద్దరూ టీవీ చూస్తున్న పిల్లలసంగతే మర్చిపోయారు..
పిల్లలిద్దరూ సోపాలోనే ఒరిగి నిద్రపోయారు..టీవీ చూస్తూ
అరెరె ...
మరి వస్తాం అనూ ... లేచి కూతుర్ని భుజాన వేసుకోబోయాడు..
ఒక్క క్షణం మాత్రం తటపటాయించి , నిద్రలో వున్నారు , ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం ? . పొద్దున వెళ్దురు గాని .. పిల్లలను నాగదిలో పడుకోబెట్టు .. అంటూ తన బెడ్ రూం లోకి వెళ్ళి పడక సరిచేసింది.
అర్జున్ కూడా కాస్త తటపటాయించి ఆమె సూచన కాదనలేకపోయాడు..
పిల్లలిద్దరినీ పడుకోబెట్టి వచ్చింది.
బీరువా తెరిచి ఎప్పుడో ఏ అక్కో వదిలేసి వెళ్ళిన పైజమా ఒకటి అతనికి తెచ్చిచ్చింది. కాని అదలా సోఫా మీదే పడుంది.
సింగిల్ సోపాలో వెనక్కు వాలి కళ్ళుమూసుకుని ,
చాలా ఏళ్ళతరువాత పిల్లలూ నేనూ ఎంతో సంతోషంగా గడిపిన సాయంత్రం ఇది అనూ , ఎలా కృతజ్ఞతలు చెప్పను?
అర్జున్ , ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా , నీక్కొంచం పౌరుషం ఎక్కువ ఆవిడ అలా వున్నప్పుడు కొంచం పిల్లల కోసమైనా తగ్గివుండొచ్చుగా ...
లేదు అనూ, చాలా సార్లు ప్రయత్నించాను...ఉహు , కనీసం పిల్లల కోసమైనా రాజీ పడదామనే అనుకున్నాను... ఆవిడో చిత్రమైన మనిషి. పిల్లలకన్నా కూడా తన కెరియర్ ముఖ్యమనుకుంటుంది...
ప్రేమతో సాధించలేనిది ఏముంటుంది అర్జున్ , నువ్వు కొంచం కోపం తగ్గించుకుంటే కాస్త సౌమ్యంగా , ఆప్యాయంగా మాట్లాడితే కాదనగల వారెవరు? మార్చలేనప్పుడు నువ్వు కోపగించుకుని ఏం లాభం ? నిజమే తను కోపంగానే ఉండొచ్చు ...నువ్వెప్పుడైనా పిల్లలను ఆవిడ దగ్గరకు పంపావా ... పిల్లల పట్ల ప్రేమ లేని ఏ తల్లీ ఉండదు, పైకి ఎంత కఠినంగా కనిపించినా ........."
నీకు తెలీదు అనూ .....................
పోనీ ఇప్పటికైనా మించి పోయింది ఏం లేదు , నీ ప్రయత్నం నువ్వు చెయ్యొచ్చు.......
సరే నీ నోటి మాటవల్లనైనా అలా జరిగితే సంతోషించేది నేనే.............
కాస్సేపాగి్,
అనూ ... చిన్నప్పటినుండీ ఒకరకమైన ఈగో తో నీతో పోటీ పడ్డా నువ్వంటే తెలియని ఇష్టం కూడా ఒకటుండేది. మళ్ళీ నువ్వు కనిపించాక అది వెయ్యింతలుగా పెరిగింది. పోనీ నన్ను పెళ్ళి చేసుకుంటావా చెప్పు తనకు విడాకులిచ్చేస్తాను.......
ఏం చెప్పాలో అర్ధం కాలేదు అనసూయకు..
లేదు అర్జున్, ఇలాంటి పిచ్చి ఆలోచనలు చెయ్యకు పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా వుంది , మరోసారి ప్రయత్నించు ,’ ఇహ అతని వైపు చూడలేక
సరే అదిగో ఆ రూమ్ లో పడుకో ..ఇప్పటికే చాలా పొద్దు పోయింది గుడ్ నైట్ " అంటూ తన బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది.

*********

మరో ఆర్నెల్ల తరువాత హఠాత్తుగా మిట్ట మధ్యాహ్నం వచ్చాడు అర్జున్ .
ఈ ఆర్నెల్లలో పిల్లలు అప్పుడప్పుడు వచ్చి ఒకటిరెండు రోజులు వుండిపోవడం అనసూయకు బాగా దగ్గరవడం జరిగింది.
అనూ , ఇహ ఓపిక పట్టడం నా వల్ల కాదు ... నా సహనం అంతరించిపోయింది. ఎంతగా రాజీ పడదామని చూస్తుంటే తన మొండి తనం అంతగా ఎక్కువవుతోంది. నేనిలా ఏకాకిగా బతకలేను ..నీ నీడలో నన్ను వుండి పోనివ్వు అనూ కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నవాడు గ్లాస్ పక్కన పెట్టి అనసూయ పక్కన కూర్చుని ఆమె చేతిని తనచేతుల్లోకి తీసుకున్నాడు.
అర్జున్ , ఏం మాట్లాడుతున్నావు?
నిజమే అనూ , ఎందుకు , ఎందుకు నేనే ఈ ఆవేదనకు బలి కావాలి? అమ్మకూ ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుంటోంది. ఒక రోజు లేస్తే రెండు రోజులు -పడకేస్తోంది. పిల్లలూ బిక్కు బిక్కుమంటూ ............

పిల్లలక్కూడా నువ్వంటే ఇష్టమే ... అమ్మకు ముందునించీ నీ పట్ల అభిమానమే ........ఈ పెళ్ళి వల్ల అందరం సుఖంగా వుండగలం
ఏదో నీ మీద జాలి వల్లో పెళ్ళి కాలేదనో అడగటం లేదు... నువ్వంటే ఎన్నేళ్ళనుంచో వున్న ఇష్టం వల్లే అడుగుతున్నాను ..ప్లీజ్ అనూ ...........
అర్జున్, ఒక్కమాట సూటిగా చెప్పనివ్వు ............ఈ ఉండి పోవడాలూ ఇలాంటి అక్రమ సంబంధాలు నాకు అవసరం లేదు... .. ఆగు నన్నడ్డు పెట్టకు ... ఎవరు అభ్యంతరపెట్టినా లేకున్నా ఎవరికి తెలిసినా తెలియకున్నా అక్రమమనేది అక్రమమే ........... ముందు నీ విడాకులు వచ్చివుంటే ...........
నువ్వు ఒప్పుకుంటే వెంటనే విడాకులు ఏర్పాటు చేసుకుంటాను......
ఒక రకమైన జుగుప్స లాంటిది కదలాడింది అనసూయ మొహం మీద.
అంటే విడకులు తీసుకున్నాక ప్రయత్నించొచ్చుగా....
రెంటికి చెడ్డ రేవడీ కాకుండా .......ఉలిక్కి పడింది.
ముందు ఇతన్ని ఇక్కడినుండి ఎలా పంపించివెయ్యాలి.............
అర్జున్ , ఏం అనుకోనంటే తెలుగు యూనివర్సిటీ లో మీటింగ్ ఒకటి వుంది నాలుగింటికి నన్ను దింపి వెళ్తావా............ ఇదిగో పదినిమిషాల్లో రెడీ అయి వస్తాను ...
వెళ్ళి తీరాలా ?
అవును , ఏదో ఆధునిక కవిత్వం గురించి మాట్లాడాలి .....కాస్త ముందు వెళ్ళి లైబ్రరీ లో రెఫరెన్స్ బుక్స్ చూస్దుకుందామని.......
హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకునే సమయంలో ఇలా బయటకు వెళ్ళడం ఆమెకూ విసుగ్గానేవుంది. అలాగని ఇలాంటి మూడ్ లో వచ్చాడంటే కదలడు మరి........................
ఆరోజు తరువాత మరో ఆర్నెల్ల వరకూ కనిపించనేలేదు.
ఒక రకంగా కాస్త ఇష్టమనిపించినా మళ్ళీ తీరిగ్గా ఆలోచించుకుంటే అతన్ని జీవితాంతం భరించటం కష్టమనిపించింది. ఆరోజు సాయంత్రం బుక్ ఎక్జిబిషన్ లో కొత్త నవలలు తిరగేస్తుంటే వినిపించిదతని స్వరం.
హలో అనూ ..ఎలాగున్నారు ?
ఫైన్. ఒక్కరే వచ్చారా ?
ఉహు .. అంత అదృష్టం కూడానా.... పిల్లలూ ...
పిల్లలు వచ్చారా ? ఎక్కడా ?..
సారీ అనూ! పిల్లలు కాని నేను కాని నీతో మాట్లాడరాదు .... ఎన్ని సార్లు అనుకున్నానో కనీసం జరిగినది నీకు చెప్పటం నాధర్మమని...
............. నిర్లిప్తంగా చూసింది అనసూయ.
నీ దగ్గరనుండి వెడూతూనే చెన్నై వెళ్ళాను ... సరాసరి తన దగ్గరకే వెళ్ళాను .............నా ఆవేశంలో నీ గురించి నువ్వు నన్ను పెళ్ళి చేసుకుందుకు సిద్ధంగా వున్నావని, విడాకుల కోసం వచ్చానని ... మరింక తన కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదని చెప్పాక .... చాలా సంగతులు డ్రమాటిక్ గా జరిగాయి ... అందులో ప్రముఖమైనవి -నీతో ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదన్నది ఒకటి. నేను కాని పిల్లలు కాని నీ ఊసెత్తరాదు... తన స్థానం వదులుకుందుకు ఆమె సిద్ధంగా లేదు... నాతో ఉంటూనే మంచి చిత్రాలని పిస్తే నటించడానికి ఒప్పుకోవాలి.. .. అదిగో ఆవైపున ఉన్నారు... లోపలకు రాగానే నిన్ను గమనించి అవకాశం దొరగ్గానే ఇలా వచ్చాను ... సారీ అనూ ... మళ్ళీ ఎప్పుడో ఇలాగే కలుద్దాం. ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చెప్పదలుచుకున్నది చెప్పేసి సుడిగాలిలా మాయమైపోయాడు.
అనసూయకు నవ్వొచ్చింది.
ఇది వరలో భార్యలను అనుమానించేవారు ఇది కొత్త డెవెలప్ మెంట్...
మరింక పుస్తకాలు చూసే ఆసక్తి లేక తీరిగ్గా బయటకు నడిచింది.

***********************

అక్కలంతా అప్పుడో ఇప్పుడొ పలకరిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒకో తరహా.
ఒకే తలిదండ్రులకు పుట్టి ఒకే ఇంట్లో పెరిగిన మనస్థత్వాల్లో ఎంత వైవిధ్యమో. అదృష్టాల్లోనూ అంతేనేమో!
ఈ మధ్యన ఎందుకో ఎంత తప్పించుకుందామన్నా వేదాంతధోరణి వచ్చిపడుతోంది.
ఎవరినీ చెయి చాచి అడగటం ఇష్టం అనిపించక సగం ఇల్లు అద్దెకు కూడా ఇచ్చేసింది. వచ్చే ఆదాయంలో సరిపెట్టుకోడం పెద్ద కష్టమేమీ కాదు. కాని , పాత ఇల్లు కావడంతో మాటి మాటికీ వచ్చేరిపేర్లు డ్రైనేజ్ రిపార్ చేశాక ఎక్కడో పైపుల్లో లీకేజి, అది అయిందంటే కరెంట్ లైన్లలో సమస్య... పాత ఇల్లు గనక తప్పవన్నారు. ప్రతినెలా ఆఖర్చులే అంచనాలను మించిపోతున్నాయి. పులి మీద పుట్రలా బోర్ వట్టిపోయింది. మళ్ళి బోర్ వేయించాల్సిందే... తప్పదు... నీళ్ళు లేకుండా ఎలాఉండాలి ? ఈ విషయం అక్కలకు చెప్పకుండా అయ్యేది కాదు....
మెయిల్ రాద్దామని కంప్యూటర్ ముందు కూచున్నా ఎందుకో చాలా సేపు రాయలనిపించలేదు అనసూయకు. వారి వారి ఖర్చులు వారికుంటాయి, ఇప్పుడిక్కడ రిపేర్లకోసం వారిని అడగటం...
ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
ఇది వరలో ఏ సమస్య వచ్చినా ...
చటుక్కున ప్రకాశ్ గుర్తుకు వచ్చాడు. అవును ఎప్పుడే సమస్య వచ్చినా ప్రకాశ్ మీద వదిలేసేది.. ఈ మధ్య కాలంలో ఇంత తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నదే లేదు. చటుక్కున లేచి ఎప్పుడో ప్రకాశ్ నించి వచ్చిన ఉత్తరం వెతికి తీసింది. మరో సారి దాన్ని పూర్తిగా చదివాక అంత కష్టం లో ఉన్న మనిషికి కనీస సానుభూతి అయినా తెలపాలని అనుకోనందుకు సిగ్గనిపించింది. అతనిల్లు తెలుసు , ఎందుకు వెళ్ళి మాట్లాడించాలని అనిపించలేదో ఆమెకే అర్ధం కాలేదు.
అనుకున్నదే తడవుగా లేచి జుట్టు సవరించుకుంది. చీర వంక ఒకసారి చూసి బాగుందిలే చాలనుకున్నా మళ్ళి తృప్తి అనిపించక చేతిలో బాగ్ సోఫా మీదుంచి అలమారు తెరిచింది.. అదిని ఇదని పదినిమిషాలు ఆలోచించి నాలుగు చీరలు మంచం మీద వేసి చివరకో చీర ఎంచుకుంది.
కట్టుకోబోతూ ఆగి మొహం జిడ్డుగా కనబడుతోంది అనుకుంటూ వెళ్ళి మొహం కడుక్కుంది. చివరకు ఇంటి నుండి బయట పడేసరికి గంట దాటింది.
సగం దూరం బస్ లో వెళ్ళి ఆపైన ఆటో మాట్లాడుకుని అతనింటికి చేరే సరికి అయిదున్నర దాటింది.
తడబడుతూనే డొర్ బెల్ కొట్టింది.
ఇంట్లో పిల్లలిద్దరే ఉన్నట్టున్నారు, తలుపుతీస్తూనే లోనికి ఆహ్వానించారు.
లోపలకు తీసుకెళ్ళి కుర్చీచూపారు. ఇద్దరూ చదువుకుంటున్నట్టున్నారు.
ఎవరినో గుర్తు పట్టారా? కాస్త అనుమానంగా అడిగింది అద్దాలు సరిచేసుకుంటూ..
అయ్యో ఆంటీ గుర్తుపట్టకపోవడమేమిటి..మీరు అనసూయ ఆంటీ కదా! డాడీ వాకింగ్ కి వెళ్ళారు వచ్చేవేళవుతోంది... ఎలావున్నారు?
బాగానే ఉన్నా...మీరెలా వున్నారు? ...అడిగాక నాలుక్కరచుకుని గుక్కతిప్పుకుని, నీపేరు అనుషకదా? అడిగింది అనసూయ.
ఉహు, నాపేరు అనుజ ... అక్క అనుష...
మరోమాటకు అవకాశం ఇవ్వకుండా గబ్గబా అడిగేసింది,
ఎంట్రెన్స్ కు ప్రిపేరవుతున్నారా?
అవునాంటీ , ఐఐటీ ఎంట్రెన్స్ కు... ఈ లోగా ఎప్పుడు లోనికి వెళ్ళిందో అనుష ఓ ప్లేట్ లో జంతికలు కాఫి కప్పుతో వచ్చింది.
అబ్బే ఇవన్నీ ఎందుకమ్మా ... అన్నానే గాని తీసుకోకుండావుండలేకపోయాను.
టి తాగుతుంటే వచ్చాడు ప్రకాష్.
ఆమెను చూస్తూనే అతని మొహం ఆనందంతో విరిసి విప్పారింది.
ఎవరూ? అనసూయేనా? బొత్తిగా నల్లపూసైపోయావు? ఇప్పుడైనా కలేమోనని అనుమానంగా వుంది...
చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుని వచ్చి అతను మరోకుర్చీలో కూర్చునే లోగ అనుష అతనికీ టీ పట్టుకొచ్చింది.
ఆంటి ఏం అనుకోనంటే మేం లోపలకు వెళ్ళి చదువుకోమా? అనుజ అడిగిన తీరు ఎంతగానో నచ్చింది అనసూయకు.
వాళ్ళవైపు మెచ్చుకోలుగా చూస్తూ మీ చదువు డిస్టర్బ్ చేశానా ? అయ్యో అడగాలా వెళ్ళి చదువుకోండి
తండ్రికి కళ్ళతోనే చెప్పి లోనికివెళ్ళరిద్దరూ.
ఊ ..చెప్పు ఎలాగున్నావ్? ఏమిటో జీవితంలో ఒడిదుడుకులు ఐన వాళ్ళను పోగొట్టుకోడం తప్పదేమో..
నిట్టూర్చాడు.
ఏముంది , ఎప్పటిలాగే .... ఇదివరలో అమ్మ వుండేది , ఇప్పుడావిడలేదు...
.................

కాస్సేపాగి ఇలా ఒక్కదానవూ ఉండే బదులు ఎవరిదగ్గరికైనా వెళ్ళిపోతే బాగుండేది అనూ... సాలోచనగా అన్నాడు.
రెండు క్షణాలు నిశ్శబ్దంగావుండి , ఒక్కసారి తీరం తాకే తుఫాను అలలా విరుచుకు పడింది అనసూయ.
ఎక్కడికి వెళ్ళి ఉండను ప్రకాష్ ? ఎవరింటికి వెళ్ళి వాళ్ళల్లో బలవంతంగా ఇమిడిపోను? ఎవరిల్లు వాళ్ళది, రమ్మనేందెఉకే వెనకముందాడే పరిస్థితుల్లో ఎవరి వెంట పడిపోను....
ఎంత తీవ్రస్థాయిలో పలికిందంటే నేమైందోనని అమ్మాయిలిద్దరూ తొంగి చూశారు.
కాస్సేపాగి ఆవేశం తగ్గాక ఐ యామ్ సారీ ప్రకాష్... అస్పష్టంగా గొణిగింది.
పద ఇంటి వరకూ దిగబెట్టి వస్తాను అంటూ లోపలకు వెళ్ళి కూతుళ్ళకు చెప్పాడు తలుపేసుకోండి ఆంటీని దింపి వస్తాను...
ఇద్దరూ బయటి వరకూ వచ్చి సెలవుతీసుకుంటూ మళ్ళి రండి ఆంటీ అనికూడా ఆహ్వానించారు.
ఎందుకు ప్రకాష్ నేను ఆటోలో వెళ్ళిపోతానులే ....
కాదు అనూ ... మనం గుడికి వెళ్దాం కాస్సేపు అక్కడ కూచుని మాట్లాడుకుందాం
జనం పెద్దగా లేరు.. మెట్లమీద కూచుంటూ చెప్పు అనూ అనునయంగా అడిగాడు.
ఏం చెప్పను?
నీ మనసులో తొలుస్తున్న సమస్య ఏమిటో ... చిన్నప్పటినుండి చూస్తున్నాను నువ్విలాంటి మూడ్ లో ఎందుకుంటావో గ్రహించలేనా?
ప్రకాష్ .. చిన్నప్పటినుండీ నన్ను చూశావు కాని నాగురించి నీకు తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. పెద్ద కుటుంబంలో చివరిగా పుట్టడం ఎంత నరకమో అనుభవించిన వారికే తెలుస్తుంది...........
మధ్యలోనే వారిస్తూ అనునయంగా ఆమె చేతిని తన రెండు చేతుల మధ్య సున్నితంగా నొక్కి,
మన చేతిలో లేనివాటి గురించి మనం మదనపడటం అనవసరం అన్నాడు.
లేదు ప్రకాష్ , ఈ రోజు నా మనసులోని బాధ ఎవరితోనో ఒకరితో పంచుకోకపోతే అగ్నిపర్వతంలా ఒక్కసారి విస్ఫోటిస్తుంది., అంటూండగానే అనసూయ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
హతాశుడైనట్టుగా చూశాడు ప్రకాశ్.......
అంతలోనే తేరుకుని
ఏమిటిది అనూ మరీ పాపాయిలా .... కళ్ళుతుడుచుకో ..... ఎవరైనా చూస్తే బాగోదు.
జేబులోంచి ఖర్చీఫ్ తీసి అందిస్తూ మా అనూ ఏనా ఇంత బేలగా మారిపోయింది... నవ్వుతూ మాటమళ్ళించడానికి చూశాడు.
మాట తప్పించకు ప్రకాశ్ ...ఈ రోజు నన్ను మాట్లాడనీ ..
లే ఇంటికి వెళ్దాం ...మీ ఇంటికే ... నేనూ వస్తున్నాను... అక్కడ ఎంత సమయం మాట్లాడుకున్నా ఇబ్బంది ఉండదు...
కాస్సేపాగి ఇంకా ఆలోచిస్తున్న అనసూయను చూస్తూ లే మరి అంటూ చెయ్యందించాడు.

************************************************

ఇంటికి వచ్చేలోగా కాస్త తేరుకుంది అనసూయ.
కూర్చో ప్రకాశ్ , కాఫీ తెస్తాను.... ఈ రోజు ఇక్కడే డిన్నర్....
వద్దు అనూ...
అదేం , భయంగా వుందా? బాగానే వంట చేస్తాలే... పిల్లలకు చెప్పు ఎదురు చూడవద్దని అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
ఫ్రెష్ గా డికాషన్ తీసి పాలు కాస్తూ ఎందుకో తలెత్తి చూసింది. వంటింటి గుమ్మం లో నిల్చుని అనసూయనే చూస్తున్నాడు ప్రకాష్.
టివీ చూస్తూండు క్షణంలో వస్తాను .
తొందరేం లేదు, ఇలా కూడా మాట్లాడుకోవచ్చుగా ... అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ ఒకటి లాక్కుని గుమ్మంలో వేసుకున్నాడు.
చపాతీలు చెయ్యనా ? అన్నం వండనా?
ఏదైనా ఇబ్బంది లేదు
ఏమనుకుందో అన్నం వండటానికో నిర్ణయించుకుని ఫ్రిజ్ లోంచి కూరలు తీసి బెండకాయలు ఎంచుకుండి. ఓ మామిడి కాయ కూడా వుండటంతో పప్పు చెయ్యడానికి నిర్ణయించుకుంది.
పీలర్ వెతికి తీసుకోబోతుండగా లేచి వచ్చాడు ప్రకాశ్.
ఇలా ఇవ్వు, నేను పీల్ చేసి ఇస్తాను, ఈ లోగా నువ్వు మరేదైనా చూడు అంటూ ఆమె వారిస్తున్నా చేతిలోని పీలర్ అందుకున్నాదు.
అనసూయ బియ్యం కడిగి ఎలెక్ట్రిక్ కుకర్ ఆన్ చేసే లోగా , మామిడి కాయ పీల్ చేసి సన్నటి ముక్కలు చేసి పట్టాడు.. ఆమె పప్పు , ఆముక్కలు కుక్కర్లో వేసే లోగా బెండకాయలు , ఉల్లిపాయలు తరిగి పెట్టాడు. పదినిమిషాల్లో ఏర్పాట్లు పూర్తవడంతో స్టౌ సిమ్ లో పెట్టి హాల్లోకి వచ్చారిద్దరూ.
గిరిజ అదృష్ట వంతురాలు
కాదు అనూ తనున్నప్పుడు నేనెప్పుడు ఇక్కడ చెంబక్కడపెట్టలేదు... తను వెళ్ళిపోయాకే .... పిల్లలతో పాటు పనుల్లో పాలు పంచుకోడం ...
బాధగా వుందా ప్రకాష్?
మొదట్లో ఒకరకమైన దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయాను.... జీవచ్చవాన్ననుకున్నాను... కాని ఆలోచిస్తే షేక్స్పియర్ అన్నట్టు ఈ ప్రపంచమొక నాతకాల వేదిక. ఎవరిపాత్ర ముగియగానే వాళ్ళు కనుమరుగైపోతారు... ఎవరిపాత్ర వారు కడదాకా పోషించక తప్పదు...
మొదటి నుండీ కాస్త తాత్వికత ఎక్కువే అతనికి. ఇప్పుడది మరింత పెరిగినట్టనిపించింది.
ఇద్దరూ కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కూర్చున్నారు.
చాలా సేపటికి తల తిప్పి అతని వంక చూస్తూ ,
ప్రకాష్ ఈ మధ్య కొన్నాళ్ళుగా మరీ ఒంటరిగా ఫీలవుతున్నాను. ఇది వరలో ఎన్ని సమస్యలున్నా ఏదేమైనా వెనక్కుతగ్గకుండా చూసుకునే దానను, కాని ఇప్పుడు మాత్రం ఎందుకో భీరువునైపోతున్నాను.
అంటూ ఆగింది.
చెప్పు అనూ నా దగ్గర సందేహ పడవలసిన అవసరం లేదు. పిచ్చిపిల్లా ఎన్నాళ్ళుగా ఇలా మదన పడుతున్నావు. మనసు విప్పి చెప్పుకోగలిగేది మంచి మిత్రుల వద్దేకదా?
అందుకేగా ఏదేమైనా మనసులో ఉన్నదంతా నీకు బదిలీ చేసి తేలికపడదామని...
లేచి వచ్చి సోఫాలో అతని పక్కన కూర్చుంది.
గుర్తుందా ,,,స్కూల్లో ఉన్న రోజుల్లో ఇలాగే కూర్చుని కంబైండ్ గా పుస్తకాలు చదివేవాళ్ళం
అవును , బాగా గుర్తుంది...అప్పుడు కూడా మనమెప్పుడూ దెబ్బలాడు కోలేదు
అసలు రాజీ పడటం అనేది పుట్టుకతోనే వచ్చింది ప్రకాష్, కడగొట్టుదానికీ , ఎదురు చూడని సమయంలో పుట్టడ నేది.... అసలు పుట్టుకే ఎవరికీ ఆనందం కలిగించలేదనుకుంటా ... అమ్మా పెద్ద ఆరోగ్యంగా లేని సమయం ఎదురు చూడని పిడుగులా నా జననం. అదే తొసారి బిడ్డైతే ఎన్ని సరదాలు , ఎన్నెన్ని సంబరాలు...
పుడుతూనే కేర్ మన్నా, పిడికిళ్ళు బిగించినా విప్పినా ప్రతి చర్యా వెయ్యికళ్ళతో ఆస్వాదిస్తారు. కాని చివరివాళ్ళ విషయంలో ఆ ఆసక్తి ఎక్కడినుంది వస్తుంది. అది బిడ్డ తప్పు కాదుగా చివరిగా పుట్టడం..
అక్కలంతా నా కన్నా చాలా పెద్ద వాళ్ళు. ఇంచుమించు వాళ్ళ పిల్లలు అటో ఇటో నా వయసు వారు. కాని అలాగని నన్ను వాళ్ళ పిల్లల్లా అనుకోరుగా ...
పిల్లలందరికీ వాడిన బట్టలు తప్ప నాకంటూ కొత్తగా కొన్నవి చాలా తక్కువ. అమ్మే చెప్తూండేది, పెద్దక్క పుట్టినప్పుడు నాన్నగారు అచ్చుమహా రాజులా మెడలోని బంగారు గొలుసు తీసి డాక్టరమ్మకు ఇచ్చేశారని. ఇహ అక్క కోసమైతే కొనని బొమ్మలు నగలు లేవని చెప్పేది.
అసలు అమ్మ అనారోగ్యం వల్ల సరిగా పాలు కూడా ఇవ్వలేక పుట్టినప్పటినుండే నల్లగా ఉండేదాన్నట. నా పెరుగుదల అంతా అపరంజి నేతృత్వంలోనే జరిగేది. అపరంజి చిన్నప్పుడేం సుఖపడిందో కాని ఊహ వచ్చినప్పటినుండి అన్ని బాధ్యతలతో సతమత మైనది మేమిద్దరమే....
ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయినా, భేషజాలకు పోయి అప్పులు చేసి చివరకు చేతులెత్తేసి మంచం పట్టారు.
అక్కలు మధ్య మధ్యలో వచ్చి వెళ్ళినా వాళ్ళకు పరిస్థితులేమీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
చివరకు అపరంజి నేను పగ్గాలు చేతుల్లోకి తీసుకునే వరకూ అలాగే నెట్టుకొచ్చాము. ఆగింది అనసూయ.
ఇవన్నీ నాకు తెలీనివా అనూ?
తెలియవని కాదు ప్రకాష్, అయినా.... ఆ రోజుల్లో అక్క కూడా అదే ఆలోచించింది. లేని పోని ఆడంబరాలకు పోయి పెళ్ళిపేరుతో చేసే అప్పులకు ఎవరు బాధ్యత వహించాలో ఊహించలేకపోయింది... అందువల్లే తనదైన నిర్ణయానికి తలఒగ్గింది కాని తలకు మించిన సమస్యలననుభవించింది. కంటి చివరల్లో ఎంత నిగ్రహించుకుందామన్నా నీటి తరక మెరిసింది.
ఎందుకు అనూ ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడటం ... అనునయంగా ఆమె చెయ్యి నొక్కి వదిలాడు.
లేదు ప్రకాష్ ... నా పెదవులు దాటి ఈ భావాలు బయటకు రావడం ఇదే మొదటిసారి, చివరిసారికూడా ... లేదంటే న మనసు అగ్నిపర్వతంలా ఎప్పుడో విస్ఫోటిస్తుంది. నన్ను చెప్పనీ .........
నిజానికి ఆ రోజున నువ్వు గుడిలో అడిగావు చూడు అప్పుడు నేను చెప్పిన సమాధానం గుర్తుందా? నేనే చెప్తాను విను
నిజం చెప్పనా ప్రకాశ్, ఇంకా నేను పెళ్ళి గురించి ఆలోచించలేదు.. ఇప్పట్లో ఆలోచించే ప్రసక్తి కూడా లేదు.. నీ ఉద్దేశ్యం నాకర్ధమయింది కాని ప్రకాశ్ ఈ విషయం ఇక్కడే వదిలేసి మంచి మితృల్లాగే వుందాం. జరగని విషయాలు చర్చించుకుని మనం శతృవుల్లా మారవద్దు.జీవితంలో ఏదైనా పొందగలమేమో గాని మంచి స్నేహితులను పొందటం చాలా కష్టం"
ఈ మాటలు ఆ రోజున నీకు మరోలా ధ్వనించి ఉండవచ్చు , కాని ఇప్పుడు మా పరిస్థితుల ఫోకస్ లో ఆ సమాధానాన్ని మరోసారి ఆలోచించు.
పెళ్ళి గురించి ఆశపడినా ఆలోచిమ్చే ప్రసక్తి లేకపోయింది. కారణం అమ్మా నాన్నలనేం చెయ్యాలి. అప్పుల భారాన్ని ఎవరికి బదిలీ చెయ్యాలి?
జరగని విషయాలు అన్నది కూడా అందుకే ... ఒక్క సారి ఆలోచించు ప్రకాష్ కోరుకున్నదే ఎదురౌతున్నా అందుకోలేని అసహాయత ఎన్ని రోజులు నలిగిపోయానో...
అయినా నా ప్రతి సమస్యకూ నీ ఓదార్పు .........ప్రతి సంశయానికీ నీ సలహా .........
నిజంగా ఇంట్లో కూడా ఎవరికీ నేనెప్పుడూ అంత దగ్గరవలేదేమో ............ ఈ లోగా ఇంట్లోనూ కలలో కూడా వూహించని మార్పులు ..........
తరువాత జరిగినవన్నీ నీకు తెలుసు...
అయితే ప్రతి పెళ్లి సంబంధాన్నీ కాదనుకున్నది ఒకటి నిన్ను తప్ప మరొకరిని అంగీకరించలేక, రెండోది అమ్మ నాన్న ఏమవాలి...
చివరకు అమ్మ కు కాలంతీరి పోయి వెళ్ళిపోయే సరికి పెళ్ళి వయసు దాటిపోయింది, నిజమే , కాని అయినవాళ్ళ ప్రవర్తనతో విసిగిపోయాను..
అందరి అమ్మాయిల్లాగే నాకూ కలలుంటాయి. ఉండేవి వయసులో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో నాకంటూ స్వర్గమైనా, నరకమైనా ఓ ఇల్లూ, నా వాళ్ళు ఉండాలనీ...
కానీ అపరంజి అలా వేరే మతం వాడిని పెళ్ళి చేసుకున్నాక చాలా రోజులు అమ్మా నాన్నా ఆ విషాదంలోనే మునిగిపోయారు. ఇంకో కూతురు ఉందని కాని, దానికి పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత ఉందని కాని వారికి స్పురించనే లేదు.

అక్కలు మాత్రం.......... అపరంజి తన సమస్యల్లో కూరుకు పోయింది, కాని మిగతా వారు ఒక్కరైనా , ఒక్కరంటే ఒక్కరైనా అమ్మా నాన్నలసంగతి పట్టించుకున్నారా? ఏం పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళకు ఏ బాధ్యతలూ లేవు కాని పెళ్ళి కాని వారికేనా అన్ని అనుబంధాలూ?
అమ్మ పోయాక మాత్రం ఎవరిదారిన వారు తమ తోవ చూసుకున్నారే కాని మాతో వచ్చెయ్యి అని ఒక్కరైనా అనలేకపోయారు.
నీకు గుర్తుండేవుంటుంది, మధ్యలో ఒకసారి నేను నిన్నడిగిన విషయం .... కాని అప్పటికే సమయం మించిపోయింది. అవును మరి , నీ బాధ్యతలు నీకున్నాయిగా ...
అపరాధిలా చూశాడు ప్రకాష్.
ఇంతకీ అసలు కధంతా తరువాతదే...
కధలొక్కటె చెబుతావా? కాస్త అన్నం కూడా పెడతావా?
అయ్యో మర్చేపోయాను ... నా గోలతో విసిగిస్తున్నానా? ముందు భోజనం పూర్తి చేద్దాం... అంటూ లేచి దాని ఏర్పాటుకు లోనికి నడిచింది అనసూయ.
చిన్న టీ టేబుల్ మీద వంట లన్నీ అమర్చిప్లేట్లు తీసుకు వచ్చేసరికి ప్రకాష్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
జాగ్రత్త అమ్మలూ ... తలుపులు సరిగ్గా వేసుకోండి, సరే
అప్పుడు కాని గుర్తు రాలేదు అనసూయకు ఇంట్లో పిల్లలిద్దరినే వదిలి వచ్చాడని.
ప్రకాష్, రా త్వరగా తినేసి వెళ్ళిపోదువుగాని , ఇంట్లో పిల్లలు ఒక్కళ్ళు ఉన్నారు కదూ
ప్లాట్ అందిస్తూ అంది.
ఫర్వాలేదు అనూ .... ఈ మధ్య వాళ్ళకు బాగానే అలవాటయింది. అందుకే చెప్పా ఆలస్యంగా వస్తానని...
ఎంత సేపూ నా గురించి ఆలోచించుకున్నానే గాని .. మధ్యలోనే ఆమెను ఆపేస్తూ
పరనింద ఎంత పాపమో, ఆత్మనిందా అంతే పాపం ... ముందు ప్రశాంతంగా తిను. కనీసం తినేదాన్ని మనసారా ఆస్వాదించాలి...
టీవీ లో వార్తలు చూస్తూ భోజనం ముగించారు.
మిగిలిన వన్నీ సర్దేసి ఫ్రిజ్ లో పెట్టి వచ్చింది అనసూయ.
ఆకలిమీద తెలియలేదు చాలానే తినేశాను... పద రోడ్డు చివరి వరకూ అలా నడిచి వద్దాం... అంటూ లేచాడు.
చాలా సేపు నిశ్శబ్దంగా నడిచారిద్దరూ .
చెప్పు అనూ ...
ఏం చెప్పను? ఆ అమ్మ పోయాక ...జీవితం గురించికదూ ... ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది అనసూయ.

*****************
అక్కలంతా వెళ్ళిపోయి మూడురోజులవుతోంది. ఒంటరిగా ఉన్నా ఏం పని చెయ్యాలని అనిపించలేదు అనసూయకు. ఎక్కడి వస్తువులక్కడే ఉన్నాయి. అంతా ఉన్నప్పుడు తెచ్చి పాకెట్లనుండే వాడుకున్న సరుకులు వంటింట్లో అలా పాకెట్ల లోనే పడి ఉన్నాయి. వాటిని డబ్బాల్ళో నింపుకో వాలని కూడా అనిపించడం లేదు.
బెడ్ రూము లల్లో వదిలేసి వెల్లిన బట్టలు... మరో వైపు తల్లి తాలూకు వస్తువులు...
ఇల్లు పిచ్చెక్కించేలా వుంది.
అంతకు ముందు తల్లి ఆలనా పాలనతో పెద్ద విసుగనిపించక పోయినా ఇప్పుడి ఒంటరితనం శాపంలా అనిపిస్తోందిఏ ఏడింటికో నిద్రలోకి జారుకున్నది మెళుకువ వచ్చేసరికి రాత్రి పదకొండున్నర దాటింది. లేచి వంటింట్లోకి వెళ్ళింది అనసూయ, ఆకలిగా అనిపిస్తోంది.
మధ్యాహ్నమూ పెద్దగా ఏం వండుకోలేదు. పాలూ బ్రెడ్ తో సరిపెట్టుకుంది.
నోరంతా చచ్చిపోయినట్టుగా వుంది, కాస్త కారం కారంగా తింటే తప్ప లాభం లేదు.
అందరూ జ్వరం వస్తే బ్రెడ్ పాలు తింటారు తను మాత్రం ...
నవ్వొచ్చింది అనసూయకు. అవును ఎప్పుడు జ్వరం వచ్చినా వేడి వేడి అన్నంలో ఆవకాయ , కాస్త నూనె తో కలుపుకు తినడం ఆ కారానికి ఒగురుస్తూ పెరుగన్నం తిని మాత్రలు వేసుకుని పడుకోడం...
ఇప్పుడూ అలాగే జ్వరం వచ్చినట్టుగానే వుంది.. ఓ చిన్న గ్లాసుడు బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టుకుంది.
అదృష్టం బాగానే వుంది ఫ్రిజ్ లో పాలపాకెట్లు, పెరుగు ఉన్నాయి.
ముందు పాలు కాచి బ్రూతో కాఫీ కలుపుకుని వంటిల్లు సర్దడం ఆరంభించింది.
షెల్ఫ్ లు తుడుచుకుని అఖ్కర్లేనివి పారేసి డబ్బాలన్నీ తడి గుడ్దతో తుడిచి పెట్టుకుందుకే రాత్రి పన్నెందు దాటిపోయింది.
వంటిల్లంతా మరోసారి తుడిచి ఆవురావురుమంటూ పళ్ళెంలో అన్నం ఎర్రటి ఆవకాయ వేసుకుంది.
నాలుగు ముద్దలు తినేసరికి ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది.
అంతలోనే ఫోన్... పెద్దక్క...
ఏం చేస్తున్నావు నిద్రలో ఉన్నావా? మళ్ళి ఏదైనా ఉద్యోగంలో చేరకపోయావా, అటు వ్యాపకమూ ఉంటుంది ఇటు నాలుగు డబ్బులూ వస్తాయి...
అక్క అడిగిన దానికి అనసూయ అన్యమనస్కంగా జవాబులిస్తూ ఏం తింటూన్నాననే ధ్యాసే మరచిపోయి వట్టి అన్నం తిన్నాక గాని తెలిసి రాలేదు. సరేలే నిద్రలో ఉన్నట్టున్నావు, మా పినమామగారి వేలు విడిచిన చెల్లెలి ఆడబడుచు అక్కడే ఉంటారు ... నీ ఫోన్ నంబర్ ఇచ్చాను... మరి ఉండనా? అంటూ పెట్టేసింది.
మనసంతా చేదెక్కినట్టైంది.
కనీసం ఒక్కసారైనా ఎలా ఉన్నావు ? వండుకున్నావా తిన్నావా అని అడగనైనా లేదు...
లేచి చెయ్యి కడిగేసుకుని మనసు మరల్చుకుందుకు నవలనో దాన్ని చేతుల్లోకి తీసుకుంది.
తెల్లారి పెద్దక్క చుట్టం ఫోన్ చేశాక గాని అసలు విషయం అర్ధం కాలేదు.
అమ్మాయ్ నేను మీ అక్కకి వరసకు వదిననవుతాను... ఒక్కదానవే ఉంటున్నావటగా ? ఏం బెంగెట్టుకోకు మేమంతా ఉన్నాంగా ... ఒకరికొకరం
రెపే నాలుగ్గుడ్డలు సర్దుకుని వచ్చెయ్యి ఓ నెల రోజులిక్కడ ఉందువుగాని. కష్టం లో సుఖంలో ఒకరికొకరం..
అన్నట్టు నా కూతురు పురిటికి వచ్చింది. నీకూ మనసు మళ్ళినట్టు ఉంటుంది నాకూ కాస్త చేతి సాయం... పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టెసింది.
మనసు ఉడికిపోయింది.:
ఎలా కనిపిస్తున్నాను? అంటూ మనసులోనే గింజుకుంది.
తొలి సారి అలా అనిపించినా ఆ అనుభవం చాలా సార్లే ఎదురైంది, ఎల్లాగూ ఖాళీ గానే ఉన్నావు కదా , మా అమ్మాయితో వెళ్ళిరా అంటూ పెళ్ళికి పిలిచి వాడుకోవాలని చూశేవారు,
ఉద్యోగం , మంచం పట్టిన అత్తగారితో సతమత మవుతున్నాను సాయం వస్తావా ? అని అడిగే వాళ్ళూ...
ఒక్కరు వుంటే మాత్రం ఇంత లోకువా? అనుకుంది.

*****************

పులి మీద పుట్రలా ఇంటి సమస్యలు ప్రకాష్ ...
బోర్ వట్టిపోయింది, మరో బోర్ డీప్ గా వేయిస్తే తప్ప లాభం లేదు, సున్నాలు వేసి ఏళ్ళు దాటి పోయాయి ... ఎక్కడ చూసినా లీకేజి ప్రతి నెలా రిపేర్లే అంచనాలకు మించిపోతున్నాయి .వచ్చే అద్దె వాటికే చాలటం లేదు..
ఆలోచించాలే గాని ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరక్కపోదు అనూ ... అయినా పాత ఇంట్లో ఒక్కదానవూ ఉండటం పెద్ద సేఫ్ కాదు... అలాగని అక్కలను అడగమనీ అనను ... ఎవరూ పట్టించుకునే వారు సాయం చేసేవారు పెద్దగా లేరు గనక ఏ బిల్డర్కో ఇస్తే వాడే అపార్ట్మెంట్లు కట్టి మీకూ ఇస్తాడు.... సమస్యా తీరిపోతుంది. లే ఇప్పటికే చాలా ఆలస్యమైంది... ఇంటికి వచ్చేసరికి పన్నెండైంది.
ఇంత రాత్రి ఏం వెళ్తావు....... తటపటయిస్తూ ఉదయం వెళ్ళొచ్చుగా ....
నీ సందిగ్ధం అర్ధ మైంది అనూ ... నేనలా అపార్ధం చేసుకునే వాణ్ణే కాదు... సరే పొద్దున్నే వెడతాలే...
ఇద్దరూ చాల సేపు కూర్చుని టీవీ లో పాతపాటలు చూశారు. అలానే సోఫాలో ఒరిగి నిద్రలోకి జారిపోయింది అనసూయ.

************************

పాత ఇల్లు ఉన్నంత వరకూ అది మనందరిదీ అవుతుంది మాకు వచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాని ఒకసారి అపార్ట్మెంట్స్ కి ఇచ్చాక అది నీదవుతుంది. అయినా బిల్డర్ సగం సగం వంతున ఇస్తాడు కాబట్టి, నువ్వు ఉద్యోగం చెయ్యట్లేదు గనక మరో ఫ్లాట్ కావాలంటే తీసుకో గాని న్యాయ ప్రకారం అమ్మ ఆస్థిలో మాకూ వాటా కావాలి ఒక్క అపరంజి మినహా మిగతా అందరూ ఇంచుమించు అదే అభిప్రాయం వెలిబుచ్చారు. నవ్వుకుంది అనసూయ.
ఈ సంగతి ప్రకాష్ ముందే చెప్పాడు... అవును అందరూ వాటా అడక్కపోతే చూడు అని అననే అన్నాడు. కట్టడం పూర్తయే వరకూ తన ఇంట్లోనే ఉండమనీ ఆహ్వానించాడు.
ఇంట్లో పాత సామాను మీద వ్యామోహం వదులుకుని పనికి రానివన్నీ వదిలించుకుంది.
నాలుగు రోజుల్లో ఇల్లు అప్పగించాలి.. ప్రకాష్ ఇంటికే వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అవసరానికి ఆదుకునే మిత్రులను బాధపెట్టకూడదు మరి.
డోర్ బెల్ శబ్దాని తుళ్ళిపడి తలుపు తీసింది.
ఎదురుగా అనుష, అనుజ.
రండి రండి...
ఆంటీ మా ఇద్దరికీ చెన్నై లో సీట్ వచ్చింది అంటూ స్వీట్ అందించారు.
చాలా సంతోషం అమ్మలూ ...
ఇద్దరూ ఉలిక్కిపడి ఒక్కసారే నవ్వేశారు..
అచ్చు డాడీ కూడా ఇలాగే అన్నారు ఆంటీ
కష్ట పడ్డారు సాధించారు ... ఎప్పుడు వెళ్ళాలి ?
వచ్చేవారం ఆంటీ ... ఇప్పుడు మేమిద్దరం వచ్చింది....
ఈ శుభవార్త చెప్పడానికేగా
ఉహు ... దీనితో పాటు మిమిమ్ములనో కోరిక కోరాలని... రేపో ఎల్లుండో మీరు అక్కడికి మారతారని తెలుసు కాని ఆంటీ .... ఇప్పుడు మేం చదువుకు వెళ్తున్నా మనసంతా ఇక్కడ డాడీ మీదే ఉంటుంది... ఇక్కడితో అయిపోదుగా రేప్పొద్దున్న మా ఉద్యోగాలు ... మా ఇళ్ళు మా వాకిళ్ళు అందుకే ఇద్దరం కలిసి ప్రాక్టికల్ గా ఆలోచించాం ...డాడీని ఒంటరిగా ఊహించుకోలేం.
ఆగింది అనుజ
సందేహమెందుకు? అడగండి..
ఆంటీ ఒక గెస్ట్ గా కాక ఇంటి మనిషిగా రమ్మని అడుగుతున్నాం... బలవంతం చెయ్యలేం... డాడికి మీ మీద ఉన్న అభిప్రాయం మాకు తెలుసు. అందుకే ఇద్దరూ బయటపెట్టాలేని భావాన్ని మేం మాటల్లో కోరుతున్నాం ... ఇలా వచ్చామని డాడీకి తెలియదు... మీరు ఒప్పుకుంటే ... నిర్ణయం మాత్రం మీదే ఆంటీ...
సాలోచనగా ఇద్దరివంకా చూసింది అనసూయ.

***********************************
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech