Sujanaranjani
           
  సారస్వతం  
   

హాలుని గాథ - లోలుని బాథ

 

- రచన : వి.యల్.యస్. భీమశంకరం    

   
 

ఉ. ఆమని యేగుదెంచె తొలి యౌవన మన్మథ రాగ హేలుడై
ప్రేమకుమారు డొక్కరుడు ప్రీతిగ హాలుని గాథలన్ మదిన్
గోముగ జ్ఞప్తి చేసుకుని, గోప్యముగా నెఱజాణ కోసమై
గ్రామము చేరి బాట కిరుప్రక్కల చూచుచు నేగుచుండగన్.

కం. తనవంటి అందగాడిల
కనిపించడనుచు తలంచి కలకంఠులు చూ
చిన తన ఒడిలో వ్రాలుదు
రనుచు కలలు కనుచు నదటున పోవన్.

తే. గీ. పల్లె పడచు లమాయక ప్రతిమ లగుట,
పట్నవాసపు యువకులు వారి చేరి
వలల లోనను పడవేయ సులభమనుచు,
అమితమౌ ఆశ నున్నట్టి సమయమందు.తే. గీ. బాట ప్రక్కను పెద్ద భవంతి లోన
వీధి వాకిలి కొక్కింత వాలి నిలిచి
కంతు కాంతను హసియించు గరిత యొకతె
వగలు పోవుచు నతనితో పలికె నిటులు.

ఉ. “ చక్కనివాడ! ఎక్కడకు చయ్యన పోవుచునుంటి వీవు! నే
నొక్కతె నున్నదాన - మగడూరికి పోయెను - రేపుగాని వా
డిక్కడ రా”డనంగ విని ఎంతయొ సంతసమంది బాలుడున్,
మక్కువ చెంత చేరె - కుసుమధ్వజు డార్చుచు నేయ బాణముల్.

కం. వచ్చిన వానిని సుందరి
అచ్చికములు పల్కుచు తగు ననునయములతో
హెచ్చగ వానికి తృష్ణలు
తచ్చన గొనిపోయి వీథి తలుపులు మూసెన్.

తే. గీ. మంచి మాటల తోడను మత్తు గొల్పి,
పెరడు లోనికి గొనిపోయి ప్రేతిమీర
చెంత నొక బిందె నీరున్న చెంబు చూపి,
ఇంపు రాణింప వానితో నిట్టులనియె.

తే. గీ. పాలు పిదుకంగ రాలేదు పాలెగాపు,
ఆకలికి తట్టుకోలేక అటమటించి,
ఆవుదూడ అంబా యని ఆర్చుచుండె
బిందెగొని పోయి పాలను పితుకుమయ్య.

తే. గీ. నేను గూడను ఉదయాన నిద్ర లేచి,
కాఫి త్రాగక పోయిన కదలలేను -
మధురమౌ యూహలొచ్చి మాయమగును
అంగజుం డావహింప బోడంత దనుక.

ఉ. అనవిని ఆత డించుక నిరాశను చెందియు కాఫి త్రాగినన్
తన ప్రియురా లనంగ నిశితాస్త్ర పరంపర తాకి వేగమే
తనపయి ప్రేమ చూపునని తల్చుచు పాలను పిండు పద్ధతుల్
తన కెటు చేతకావను యదార్థము విస్మరించుచున్.

తే. గీ. మెల్లమెల్లగ కదలుచు నుల్లమదర,
ఆత డేగుచు బిందెతో నావు కడకు,
పొదుగు చెంతను కూర్చుండి మోహరించి,
రెండు పితుకుల నెటులనో పిండ బూనె.

తే. గీ. ఇంతలోన దూడను విప్పె ఇందువదన,
తమిని పర్వెత్తె నా పెయ్య తల్లి దరికి,
చెంత చేరంగ నెంతయో సంతసించి,
దూడ దిక్కు తిరిగె నావు దురుసు గాను.

తే. గీ. పదిలముగ వంగి గోమాత పొదుగు చెంత
కూర్చునున్నట్టి పట్నంపు కుర్రవాడు
తలరి లేవబోవగ ఆవు తలను విసిరె,
కొమ్ము మోమున నాటి రక్తమ్ము జిమ్మ.

తే. గీ. భీతి నార్చెను బాలుడు -బెదిరి గోవు
కొమ్ముతోడను పొడిచెను దిమ్మ తిరిగి
క్రింద పడిపోవ నాతడు బెందలోన,
మరల కాళ్ళతో నూకుచు మట్టె నపుడు.

తే. గీ. పరుగు పరుగున నా తన్వి దరికి వచ్చి,
మోమునందున లేచిన బొప్పి వాని,
కాళ్ళు చేతుల నల్లల్ల గాయమైన
చిన్న వానిని చేయిచ్చి చేరదీసి,

తే. గీ. ఇంటిలోనికి గొనిపోయి వెంటవెంట,
అంగవస్త్రము తోడ గాయములు తుడిచి,
పౌడరును పూసి కొంత ఫస్టైడు చేసి,
వీధి గుమ్మము దాకను వెంట నంపి.

తే. గీ. “నేస్తమా వినుమిచట చౌరస్త కడను
వైద్యుడొక్కరుడు కలడు వాని కలిసి,
ఆతడిచ్చు మందులను గాయముల పూసి
బిళ్ళలను మ్రింగి నీవింటి కెళ్ళు మింక.

తే. గీ. అతిథి వీవౌట కాఫి మర్యాద కివ్వ
న్యాయమగు గాని ఇది సమయంబు గాదు
తత్ క్షణమె పోయి నే కాఫి త్రాగ వలయు
తాళలేనింక పాంథుడా! వేళ మించె.

తే. గీ. ఇంటిలోన నిన్నటి పాలు కొన్ని మిగుల
పెట్టితిని గ్లాసులో పోసి ఫ్రిజ్జులోన
నాకు పాత పాలతొ కాఫి నచ్చదైన,
తప్పదింక నేడిట్టిదే త్రాగవలయు.

తే. గీ. నిన్న పితికిన పాలతో నేడు కాఫి
త్రాగలేకనె వీథిలో తలుపు వద్ద
నిలిచి నిన్ను రమ్మంచు నే పిలిచినాను.

తే. గీ. తెలివిలేని వాని వలె నీ తీరు తోచె,
పట్నమందున నివసించు వాడ వనుచు
చెక్కు చెదరని నీ క్రాపు చెప్పె నాకు,
ముక్కుపచ్చలారని మోము ముందె తెలిపె
పల్లెపడుచుల వలలలో పడుదువనుచు.

తే. గీ. నిన్ను చూచిన నవ్వుగా నున్నదయ్య -
పాలు పితుగంగరాక తంటాలు పడుచు,
పొదుగు ముట్టంగ గోవెట్టు లొదిగి యుండు
చేపుటకు మున్ను తన్నదే చేయి పెట్ట.
తే. గీ. సకల విద్యల నేర్చిన జాణ వీవు,
పట్నమందున వసియించు పండితుడవు,
యౌవనంబున నున్నట్టి అంగజుడవు,
పాలు పితుక నేర ననుచు పలుక వేల?

తే. గీ. చెలియ ఇటుల తన్నీసడించిననుగాని
పడతి యుల్ల మెరుగని ఆ పల్లవుండు
జాలిగొలిపెడు కళ్ళతో వ్రాలి తమిని,
నామె నీక్షించె నమితమౌ ప్రేమతోడ.

తే. గీ. ఆశ వదలని యా పట్నవాసు చూచి
కలికి పరిహసించంగ పక పక నవ్వె,
చెలసి వలలుని చేబడ్డ సింహబలుని
నాతి సైరంధ్రి హెళనన్ నవ్వినటుల

తే. గీ. ఆమె నవ్వును చూడంగ నతని మోము
కందగడ్డ యట్లెర్రగా కందిపోయె
వనితపై మున్ను తనకున్న వాంఛ వీగి
డంబు చెడి చూచె నా ‘డాంజువాను’.

తే. గీ. చిరిగిపోయిన బట్టలు సిగ్గునింప
గాయములతోడ మంటెత్తి కాయమెల్ల
పడుచు, లేచుచు, కుంటుచు పడతి మోము
వాసి తొఱగంగ చూచెనా ‘కేసినోవ’.

తే. గీ. అతని నీ రీతి గాంచి ఆ అతివ యనియె,
"ఇంత జరిగిన కాని నీకేమి బుద్ధి
రాక పోయె నేమందు - నీ రాక వలన
కాలము గడిచె - మోదంబు కలిగె నాకు.

తే. గీ. రెండు వేలేండ్ల క్రిందటి ప్రేమ కథల
చదివి ఆ చమత్కృతులకు సంతసించ
వలెను గాని వాటిని నేడు పట్టు విడక
తలచి మోసపోరాదు రా! తమ్ముకుఱ్ఱ!

ఉ. కాలము మారె పూర్తిగను కామకలాప విలాస భూషలే
స్త్రీలను మాట మానుడిక - శేముషి గల్గిన గొప్ప శక్తియై
ఏలుచునున్నవారు భువి, ఏ మగవానికి తీసిపోక, కా
ర్యాలను నిర్వహించుటను, ఆతత విద్యల ధైర్య సంపదన్.

క0. కళ్ళకు కట్టిన మాంద్యము
భళ్ళున వీడగ యువకుడు పరితాపముతో
త్రెళ్ళి తలచె నెరజాణలు
పల్లెత లీనాడు పట్నవాసుల కంటెన్.

క0. నక్కను తొక్కితి నని నే
మక్కువతో తలచితి మును మా పల్లెక్కే
తొక్కించె నావు చేతను
మక్కెలు విరుగంగ నాకు మత్తు దిగంగా!

వివరణ: హాలుడు రమారమి 1వ శతాబ్దంలో ఆంధ్రదేశమేలిన శాతవాహన చక్రవర్తి. ఆయన “గాథా సప్తశతి”ని విరచించాడు. దీనిలోని ఒక గాథలో ప్రస్తుత ఖండికలోని 5వ పద్యంలో పిలిచిన విధంగానే ఒక యువతి బాటసారిని పిలుస్తుంది. ఇలాంటి భావంగల శ్లోకం కాళిదాస ప్రణీతమనబడే “వసంతరాగం”లోకూడా వుంది.

*డాంజువాను, కేసినోవా అనేవారు కొన్నివందల యేళ్ళ క్రితం దక్షిణ యూరోపాకు చెందిన స్త్రీలోలురు. మొదటివాడు కల్పిత పాత్ర అని, రెండవవాడు నిజమైన వ్యక్తియని ప్రతీతి. 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech