Sujanaranjani
           
  సారస్వతం  గగనతలము-30  
 

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు

 

నమ్మకం గౌరవం సర్దుబాటుతనం

కాకరకాయ కూర ఇష్టం లేదని భర్త అంటే తనకదే ఇష్టం కాబట్టి అదే వండుతానని భార్య అటుంది. అప్పుడు ఇద్దరూ ఏమి చేయాలి? ఆ కూర వదిలి మరొకటి ప్రయత్నించాలా? భర్తకు ఇష్టం లేదు కాబట్టి భార్య కూడ తన ఇష్టాన్ని చంపుకోవాలా? భార్యకు ఇష్టం కాబట్టి భర్త కూడ కాకరకాయపై మమకారాన్ని పెంచుకోవాలా?
పిల్లలని భర్త ఒకటి చదివించాలనుకుంటే భార్య మరొకటి చదివించాలనుకుంటుంది. ఆ పరిస్థితులలో ఏమి చేయాలి?
భర్త భార్య ఇద్దరూ ఉద్యోగస్థులే. కాబట్టి వారిరువురూ స్వతంతృలమని భావిస్తారు. డబ్బు ఖర్చు పెట్టే సందర్భములో కూడ ఇరువురి స్వతంత్రభావాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది నాది ఇది నీది అనే ఈ స్వభావము పెరిగి పెద్దదయినపుడు పరిస్థితి ఏమిటి?
భర్తకు భార్యపై కోరిక అధికముగా ఉంటి భార్యకు అటువంటివి ఇష్టము కానప్పుడు వారి పరిస్థితి ఏమిటి?
తన భర్త పనికిరానివాడని భార్య అనుకున్నప్పుడు, అదేవిధముగ తన భార్య కారణముగ తన ఇష్టములు తీరవని భర్త నమ్మిననాడు ఏమవుతుంది?

ఈ ప్రశ్నలన్నీ సర్వసాధారణంగా కనిపిస్తాయి. కానీ నేడు మన చుట్టూ సంఘటనలకు కారణములవుతున్నవి ఇలాంటి సంఘటనలే.
జాతకాలు మూఢనమ్మకాలు అని అవసరార్థం వాడుకోవడం కూడ చాలా వరకు సమస్యకు కారణమే
అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు. లేక అబ్బాయి వారికి అమ్మాయివారి హోదా, అంతస్థు బాగా నచ్చాయి. లేక వారి ఉద్యోగముల సమీకరణములు వారికి నచ్చాయి. లేక మరేదైన కారణముచేత ఆ ఇద్దరి వివాహము ఇరు పక్షాలవారు జరిపించాలని అనుకున్నారనుకుందాము. ఆ పరిస్థితులలో జాతకాలు కలువకపోయినా, పొంతన కుదరలేదు అని ఎవరైనా అన్నా జాతకాలు మూఢనమ్మకాలు అని సర్వసాధారణంగా కొట్టిపారేస్తారు. ఇది సహజం. ఎందువలననగా వారికి వర్తమానంలో కుదిరిన సమీకరణాలే కనిపిస్తాయి కానీ భవిష్యత్తు కాదు.

పెల్లయినకొన్ని రోజులకే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను సాధారణంగా సంప్రదించరు. ఆ సమయంలో వారు వారి వారి నిర్ణయాలను తీసుకుంటారు. ఇలా విడాకుల కోసము దరఖాస్తు చేసుకున్నవారు, భర్త వేధిస్తున్నాడని గృహహింస కేసు పెట్టేవారు, మనమే తెలివయినవారమని సినిమాఫక్కీలో జీవితాలనే కడతేర్చేవారు నేడు మనకు నిత్యము కనిపిస్తూనే ఉన్నారు. తెల్లవారితే మనకు వార్తాపత్రికలలో కనిపించే వార్తలు ఇవే.
ఈ వార్తలు మరియు పరిస్థితులు భావితరాలను ప్రభావితము చేయవా? ఈ సమస్యకు సమాధానము లేదా? అని మనలో ప్రతిరోజూ కలిగే కొన్ని ప్రశ్నలకు ఇక్కడ ఒక పద్ధతిలో కొన్న సమాధానములు పొందుపరచడానికి ప్రయత్నము చేస్తున్నాను.

గృహస్థాశ్రమము
అన్ని ఆశ్రమములలోనూ గృహస్థాశ్రమము ముఖ్యమైనది. మరియు మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయమును ఇచ్చేది కూడ గృహస్థాశ్రమమే. ఈ ఆశ్రమమునకు చాలా బలమైన ఆధారములు దానికి ఉన్న నియమాలు, విలువలు. స్త్రియః మేధ్యాస్తు సర్వతః అని వరాహమిహిరుడు స్త్రీని ప్రశంసించాడు. అంటే స్త్రీ అన్ని కోణములలోను అన్ని విధములుగను పవిత్రమూర్తి అని అర్థము. ఆ పవిత్రమూర్తి కేవలము పురుషుని సాంగత్యము వలన దూషింపబడుతున్నది అని ఆయన తన బృహత్సంహితలో వర్ణించుకుంటూ వచ్చాడు.

భార్యా త్రివర్గకరణం శుభశీలయుక్తా అని ముహూర్తచింతామణిలో రామదైవజ్ఞుడు చెప్పాడు. త్రివర్గములంటే ధర్మ అర్ధ కామములు. ఈ మూడునూ శీలవతి అయిన భార్య వలననే కలుగునని దీని ఆశయము. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు గౌరవాన్వితులవుతారో అక్కడ దేవతలు నివసిస్తారని దీని అర్థము. ధర్మశాస్త్రాలు భార్యను సంతోషపెట్టడం భర్త కర్తవ్యమని, అతను అలా చేయలేనపుడు అతడు ధర్మమును తప్పినట్లే అని వక్కాణిస్తున్నాయి.

అంటే పురుషునికి ఏమాత్రము స్థానములేదా?

ఇది పై విషయమును చదివిన తరువాత అందరికీ కలిగే ప్రశ్నే. గృహస్థాశ్రమములో భార్యాభర్తలిరువురికి సమాన హోదా మరియ సమాన స్థానము ఇవ్వబడ్డాయన్నది అనాదినుండి చెప్పబడుతున్న సత్యము. యత్రానుకూలం దమ్పత్యోః త్రివర్గస్తత్ర వర్థతే అని ప్రాచీనవచనము. దంపతులిరువురిలో అనుకూలత పరస్పరావగాహన పరస్పరసహకారములున్నప్పుడే ధర్మార్థకామములు అనబడే త్రివర్గములు వారికి ప్రాప్తిస్తాయని చాలా స్పష్టంగా చెప్పబడింది. పైన వ్రాసిన వాక్యములలో కొంత నర్మగర్భముగా చెప్పబడిన విషయము స్త్రీ పురుషుని కారణముగానే కలుషితమవుతున్నది గానీ స్వతహాగా కొంపలు కూల్చు తలంపు వారికి రాదని అర్థము. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పూర్తిగా సమర్థించలేకపోయినప్పటికీ ప్రాచీనులకు ఇటువంటి ఊహ కలిగింది అంటే తప్పకుండ పరిశోధించవలసినదే.

పండంటికాపురానికి మూడు సూత్రాలు నమ్మకం, గౌరవం, సర్దుబాటు

భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకముండటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం మరియు సంసారసాగరాన్ని ఈదటంలోని ఒడిదుడుకులను మరియు ఒకరికొకరి తప్పులను సర్దుకోవడం సరిపెట్టుకోవడమనేవి త్రివర్గాలను సాధించే దంపతుల లక్షణములని చెప్పవచ్చును. కానీ ఇవి మనుషులలో స్వతహాగా వచ్చేవి కాదు.
మనుషుల స్వభావాలు గ్రహాధీనములు.
స్వభావాలలో మైత్రి మరియు శతృత్వములు కూడ గ్రహాధీనములే.
ఇద్దరు కలిసి జీవించగలరా లేదా అని నిర్ణయించే కొలమానమే వివాహపొంతన.
మనిషి మనిషి తమ గొప్పదనముతో కలిసి ఉందామన్న ఒక్క ఆశయము వారిని సఫలీకృతులను చేయలేదు.
గ్రహానుకూలత వారికి కలిగినపుడు మాత్రమే ఇది సంభవము.
మన అవసరాలకు గ్రహాలను పట్టించుకోవడం, మన సమయము బాగున్నప్పుడు దానిని మూఢనమ్మకమని కొట్టి పారేయడం మనని మనము మోసగించుకోవడమే అవుతుంది.
నేడు సమాజములో రోజురోజకీ పెరుగుతున్న కీచులాటలకు మన అతి తెలివితేటలే కారణము.
విజ్ఞానము వికసించిన ఈ రోజులలో మనకు సుఖమును ఇవ్వగలిగిన ప్రాచీన విజ్ఞానమునకు కూడ మనము సరియైన స్థానము కల్పించి దానిని అనుసరించిననాడు ఈ వైపరీత్యాలకు అడ్డు వేయడము సాధ్యమే.
ఇచ్చటి వాక్యములు ఎవరినీ ఉద్దేశించినవి కావు. నిశితముగ పరిశీలిస్తే మనము గంభీరముగ ఆలోచించవలసిన విషయములు మాత్రమే. నేడు ప్రాయః ప్రతీ కుటుంబము ఈ విధమైన సమస్యలతో సతమతమవుతున్నదే. ఈ సమస్యకు పరిష్కారము గ్రహాలను ఆధారముగ జేసుకుని మనుషుల స్వభావములను తెలుసుకొనడము మరియు కలిసే స్వభాముగల మనసులను కలపడమే

సశేషము......

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech